
రుద్రమదేవికి ఇళయరాజ సంగీత సొబగులు
వెండితెర అద్భుత దృశ్యకావ్యం రుద్రమదేవికి సంగీత జ్ఞాని ఇళయరాజ పాశ్చాత్య సంగీత కళాకారులతో సంగీత సొబగులు అద్దుతున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కుతున్న చారిత్రక కథా చిత్రం రుద్రమదేవి. ప్రముఖ నటులు అల్లుఅర్జున్, రాణా, కృష్ణంరాజు వంటి వారు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో టైటిల్ పాత్రలో నటిస్తున్న అనుష్క చుట్టూనే తిరిగే కథా చిత్రం రుద్రమదేవి.
ఈ చిత్రంలో ఆమె వీర సాహస కృత్యాలు, కత్తిసాము, గుర్రపు స్వారి వంటి విన్యాసాలు చూడవచ్చు. వీరనారి రుద్రమదేవి పాత్రలో అనుష్క విజృంభించారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. దీనికి 3డీ ఫార్మెట్ అదనపు ఆకర్షణగా నిలుస్తుంది. వందకోట్ల భారీ బడ్జెట్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి ఇళయరాజ హాలీవుడ్ సంగీత కళాకారులతో సంగీతాన్ని అందిస్తున్నారు.
చిత్రంలోని పాటలన్నీ ఆధునిక బాణిలో ఉంటాయంటున్నారు చిత్ర యూనిట్ వర్గాలు. చిత్రంలో అనుష్కతో పాటు నిత్యామీనన్, క్యాథరిన్ ట్రెసా అందాలొలికించనున్నారు. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తమిళంలో శ్రీ తేనాండాళ్ ఫిలింస్ సంస్థ ఏప్రిల్‌లో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.