ఘట్‌కేసర్
కీసరను రాజధానిగా చేసుకొని విష్ణుకుండినులనే రాజులు పరిపాలిం చారు. వారు తమ విద్యాసంస్థలను ఘటికలు అని పిలిచేవారు. ఘట్‌కేసర్ సమీపంలో వారు కొన్ని ఘటికలను ఏర్పాటు చేశారు. దాంతో ఘటికేశ్వరంగా పేరొచ్చింది. అదే కాలక్రమంలో ఘట్‌కేసర్‌గా రూపాంతరం చెందింది అనేది పూర్వీకుల కథనం. ఇక్కడ మరో చారిత్రక నేపథ్యం కూడా ఉంది. కీసర రామలింగేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో ఉన్న శివలింగాలను శ్రీరామ భక్తుడైన హనుమంతుడు విసిరేసినట్లు చెబుతారు. అలా విసిరేసిన శివలింగాల్లో ఒకటి వచ్చి ఈ ప్రాంతంలో పడిందంటారు. ఘటికల వద్ద ఉన్న ఈశ్వరుడు కాబట్టి ఘటకేశ్వరుడిగా పేరొచ్చిందని, రానురాను అక్కడే గ్రామం వెలియడంతో ఘటకేశ్వరంగా అనంతరం ఘట్‌కేసర్‌గా మారిందని పెద్దలు చెబుతుంటారు.
ఏదులాబాద్
ఈ ప్రాంతంలో సుమారు 48 వరకు వివిధ ఆలయాలు ఉన్నాయి. వీటిలో కుబేరాలయం, శ్రీగోదాదేవి సమేత మన్నార్ రంగనాయకస్వామి దేవాలయాలకు సుమారు 400 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. వీటిలో ఏదో ఒక దేవాలయంలో తరచూ పూజలు, ఉత్సవాలు జరుగుతుండేవి. అప్పుడు పాలించిన నైజాం నవాబులు పండుగను ‘ఈద్’ అని పిలిచేవారు. దాంతో ఈ ప్రాంతం కాస్తా ఈద్‌లాబాద్‌గా పేరుబడింది. కాలక్రమేణా ఏదులాబాద్‌గా మారింది.
ప్రతాప్‌సింగారం
ఓరుగల్లును రాజధానిగా చేసు కొని పాలించిన రాణీరుద్రమదేవి మనుమడైన ప్రతాపరుద్రుడు యేడాదికోసారి వేటకు వచ్చి కొంతకాలం ఇక్కడే గడిపేవాడట. దీంతో ఈ గ్రామానికి ప్రతాపసింగారంగా పేరొచ్చింది. ప్రతాపరుద్రుడు అశ్వాలతో కాచివానిసింగారం వద్ద దిగి నడుచుకుంటూ తన బలగాలతో వేటకు వచ్చేవాడట. తిరిగి కాచివానిసింగారం వద్ద గుర్రాలను ఎక్కి తన రాజధానికి తిరుగుపయనమయ్యేవాడట. ఈ కారణంగా అప్పట్లో కాచివాని సింగారాన్ని ఎక్కే సింగారంగా, ప్రతాప్‌సింగారంను దిగే సింగారంగా పిలిచేవారట.
ముత్వెల్లిగూడ
నైజాం పాలించిన కాలంలో కాచివానిసింగారం, ప్రతాప్‌సింగారం గ్రామాల్లోని కొన్ని వందల ఎకరాలను (జాగీర్‌లు) చూసుకోవడానికి నైజం ప్రభువు ముతవల్లీ (నిర్వాహకుడు)ని నియమించుకున్నాడు. ముతవల్లీ శిస్తు కింద పొలాల ద్వారా వచ్చిన ఫలసాయంలో కొంత భాగం నైజం నవాబుకు పంపేవాడు. ముతవల్లీ నివసించే గూడెన్ని ముతవల్లీగూడగా పిలిచేవారట. అదే కాలానుగుణంగా ముత్వెల్లిగూడగా మారింది.
అవుశాపూర్
ఈ గ్రామానికి సమీపంలో ఓ జాగీర్ ఉండేది. ఆ జాగీర్‌ను నైజాం కాలం లో జమీలా అనే దొరసాని చూసుకునేదట. ఆమెకు సంబంధించిన అశ్వాలను జాగీర్‌కు ఆరు కిలో మీటర్ల దూరంలో ఉంచేవారట. దాంతో ఈ ప్రాంతం అశ్వాల పురం తదనంతరం అశ్వాపు రంగా పేరుమారి చివరికి అవుశాపురంగా రూపాంతరం చెందింది.
కాచివాని సింగారం
ప్రతాపరుద్రుని అల్లుడైన కసురుడు కాచివాని సింగారంను పరిపాలిం చాడు. అందుకే ఆ గ్రామం కసురుని పేరుతో కాసవాని సింగారంగా.. తర్వాత రూపాం తరం చెంది కాచివాని సింగారంగా మారింది. కసురుడు మంచి వేటగాడని తన మామ ప్రతాపరుద్రునితో కలిసి వేటకు వెళ్లేవాడని చెబుతారు.
ఊరికో చరిత్ర
Published Sat, Nov 22 2014 12:08 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM
Advertisement
Advertisement