
బాహుబలి-రుద్రమదేవి పెళ్లిసందడి
రావులపాలెం : బాహుబలి, రుద్రమదేవి ఈమధ్య విజయం సాధించిన తెలుగు సినిమాల పేర్లు. వీరిద్దరికీ కల్యాణం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో బుధవారం ఒక కిట్టీ పార్టీ ఈ వినూత్న వివాహతంతుకు వేదికైంది. పచ్చిపులుసు అన్నపూర్ణ తదితరులు 22 మంది మహిళలు టీన్స్‌కిట్టీ పేరుతో సంఘంగా ఏర్పడి నెలకోసారి వేర్వేరు ప్రాంతాల్లో కిట్టీ పార్టీలు నిర్వహిస్తున్నారు.
బుధవారం పచ్చిపులుసు అన్నపూర్ణ, నాగరాజు తమ నివాసంలో కిట్టీ పార్టీ ఏర్పాటు చేశారు. దీనిని వినూత్నంగా జరపాలని అనుకున్నారు. బాహుబలిని వరుడుగా, రుద్రమదేవిని వధువుగా పేర్కొంటూ శుభలేఖలు వేసి, కిట్టీ పార్టీలో వివాహవేడుక జరిపారు. వరుడు వధువుగా ఇద్దరు మహిళలు సంప్రదాయ అలంకరణతో పాల్గొనగా, రెండు బొమ్మలకు అదే వేషధారణ చేసి కల్యాణం జరిపించారు. పానకాల కావిడి, మెహందీ, ఉంగరాలు మార్చుకోవడం, మాంగల్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలను వేడుకగా నిర్వహించారు.