ఊపిరై... | today World Marriage Day | Sakshi
Sakshi News home page

ఊపిరై...

Published Sun, Feb 8 2015 12:11 AM | Last Updated on Tue, Oct 2 2018 3:43 PM

ఊపిరై... - Sakshi

ఊపిరై...

నేడు ప్రపంచ వివాహ దినోత్సవం
 ప్రేమ అనే తాడుకి అనురాగమనే పసుపు పూసి... నమ్మకం, భరోసా అనే సూత్రాలను జతచేసి కట్టేదే తాళి. అది రెండు మనసులను పెనవేస్తుంది. రెండు జీవితాలను ముడి పెడుతుంది. పెళ్లి అన్న రెండక్షరాల సాక్షిగా... జన్మజన్మలకూ తెగిపోని బలమైన బంధాన్ని ఏర్పరుస్తుంది. కష్టాలను కలసికట్టుగా అధిగమించడం నేర్పుతుంది. సమస్యల్లో సైతం ఒకరి చెంత ఒకరు నిలిచేలా చేస్తుంది. ఈ మాటలన్నీ అక్షర సత్యాలనడానికి సాక్ష్యం... సినీ రచయిత తోట ప్రసాద్, గీతల కాపురం. ప్రపంచంలోని ప్రతి విషయం గురించీ అనర్గళంగా మాట్లాడేంత జ్ఞానం ఉన్న వ్యక్తి ప్రసాద్. ప్రపంచమంటే తన భర్తే అనుకునే అతి సాధారణ ఇల్లాలు గీత. వీరి ఇరవై ఆరేళ్ల ఆదర్శ దాంపత్యం గురించి ఈ ‘ప్రపంచ వివాహ దినోత్సవం’ రోజున చెప్పుకుని తీరాలి.
 
 ...::: సమీర నేలపూడి
 హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రి. ఐసీయూకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని ఉంది ఒకావిడ. ముఖం నిండా దిగులు ముసురుకుని ఉంది. కళ్ల నిండా భయం కమ్ము కుని ఉంది. ఐసీయూలోంచి బయటకు వచ్చిన డాక్టర్‌ని చూస్తూనే లేచి నిలబడింది. కంగారుగా వెళ్లి ‘మావారు ఎలా ఉన్నారు’ అని అడిగింది. ‘హోప్స్ లేవమ్మా’ అనేసి డాక్టర్ వెళ్లిపోతుంటే నిశ్చేష్టురాలయ్యింది. ఎలా స్పందించాలో తెలియక, తాను విన్నది నిజమో కాదో అర్థం కాక కొయ్యబారిపోయింది. ఏ భార్యకైనా అంతటి కఠోర నిజాన్ని తట్టుకోవడం ఎలా సాధ్యపడుతుంది? కానీ గీత తట్టుకున్నారు. మృత్యు ఒడికి చేరువైన భర్తను కష్టపడి బతికించు కున్నారు. నాటి సంగతులు అడిగితే గీత కళ్లనుంచి అశ్రువులు జలజలా రాలిపడ్డాయి. ప్రతి కన్నీటి బొట్టు లోనూ భర్త మీద ప్రేమ కనిపించింది. ఆ ప్రేమే తనకు మళ్లీ ఊపిరి పోసిందంటారు ప్రసాద్. తమ సహచర్యం, ఇన్నేళ్లూ కలిసి సాగించిన జీవనయానం గురించిన విషయాలను నెమరు వేసుకున్నారు ఆ దంపతులిద్దరూ.
 
 సాహిత్యమే కలిపింది
 ‘143’ చిత్రానికి కథా సహకారాన్ని అందించిన తోట ప్రసాద్... ‘కంత్రి’, ‘బిల్లా’, ‘శక్తి’, ‘రామయ్యా వస్తావయ్యా’ తదితర సినిమాలకు స్క్రిప్ట్ అసోసియేట్‌గా పని చేశారు. ‘కుర్రాడు’, ‘వరుడు’, ‘ఆరెంజ్’, ‘పంచాక్షరి’ వంటి చలనచిత్రాలకు మాటలు అందించారు. ప్రస్తుతం ‘రుద్రమదేవి’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ చిత్రాలకు పని చేస్తోన్న ప్రసాద్‌కి... రచన అనే కళ పుట్టుకతోనే అబ్బింది. ఎదిగేకొద్దీ ఆ కళను తన తోనే అట్టిపెట్టుకున్నారు. ఇంటర్మీడియెట్‌కి వచ్చేసరికి ‘విపంచి’ పేరుతో ఆయన చేసే రచనలు అచ్చవడం మొదలయ్యింది. అప్పుడు ఆయనకు తెలియదు... తనలో ఉన్న ఆ కళ, తన జీవితానికే కళ తెస్తుందని!
 
 సాహిత్యాన్ని ప్రేమించే గీతని ప్రసాద్ రచనలు ఆకర్షించాయి. అందుకే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి తాడేపల్లిగూడెం వెళ్లారు ఆయన్ని కలవడానికి. నాటి పరి చయంతో స్నేహితుల య్యారు. ఆయన తన ఆలోచనలు పంచుకునేవారు. ఆమె తన అభిప్రాయాలు వెల్లడించేవారు. మౌనంగా, డిగ్నిఫైడ్‌గా ఉండే ప్రసాద్‌ని గీత ఇష్ట పడ్డారు. కేరింగ్‌గా, కూల్‌గా ఉండే గీత మీద ప్రసాద్ మనసుపడ్డారు. అంతలో ప్రసాద్ రచనలు చదివిన దర్శకుడు ‘విజయ’ బాపినీడు చిరంజీవితో తాను చేయబోయే సినిమాకి స్క్రిప్టు వర్కు చేయ డానికి మద్రాస్ ఆహ్వా నించారు. ప్రసాద్ వెళ్లారు. కానీ ఎక్కడో భయం. సినిమాల్లోకి వెళ్లిపోతే తనకు గీతను ఇవ్వడానికి ఆమె తల్లిదండ్రులు అంగీకరించరేమోనన్న సంశయం. దాంతో సినిమాలు వద్దనుకుని విజయవాడ వెళ్లి జర్నలిస్టుగా చేరారు. తర్వాత పెద్దల అనుమతితో తన ప్రియసఖిని వివాహమాడారు.
 
 ‘గీత... నా అదృష్టరేఖ’
 ప్రసాద్‌కి పిల్లలంటే ప్రాణం. ఆయనకు శ్రావ్యను కానుకగా ఇచ్చారు గీత. అయితే ఆమెకు బీపీ, డయా బెటిస్ రావడంతో మరో బిడ్డను కనే ప్రయత్నం చేయ వద్దని హెచ్చరించారు వైద్యులు. కానీ మరో బిడ్డ ఉంటే బాగుండన్న ఆశ ప్రసాద్ మనసులో బలంగా ఉండేది. తోబుట్టువులు లేకుండా తాను ఒంటరిగా ఉన్నట్టుగా తన కూతురు ఉండ కూడదనుకునే వారు. అది తెలుసు కున్న గీత మరో బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధపడ్డారు. ప్రాణానికి ప్రమాదమని డాక్టర్లు హెచ్చరించినా... తన భర్త మనసులోని చిరు ఆశను తీర్చడం కోసం ఎంత రిస్క్ అయినా తీసుకోవాలనుకున్నారు. మనోజ్ఞను ఆయన చేతుల్లో పెట్టారు. ప్రేమ ఎంతటి త్యాగానికైనా సిద్ధపడు తుందన్న మాటను నిజం చేసి చూపించారు. అందుకే ప్రసాద్ అంటారు తన జీవితంలో తనకు దొరికిన అతి పెద్ద అదృష్టం గీత అని!
 
 ప్రేమ గెలిచిన క్షణం
 రామ్‌చరణ్ హీరోగా నటించిన ‘ఆరెంజ్’ సినిమాకి పని చేస్తున్నప్పుడు ఓరోజు... ప్రసాద్ కాళ్లు నీరు పట్టి ఉండటం గమనించారు గీత. ఏమైంది అని అడిగితే పట్టించుకోలేదు ప్రసాద్. పట్టుబట్టి ఆయనను హాస్పిటల్‌కు తీసుకెళ్లిన గీతకు ఊహించని షాక్ తగిలింది. ప్రసాద్ రెండు కిడ్నీలూ పాడైపోయాయని, ఒకట్రెండు రోజుల కంటే ఎక్కువ బతకరని చెప్పేశారు డాక్టర్లు. ఒక్కసారిగా అంతా శూన్యమైపోయినట్టనిపించింది గీతకి. ధైర్యం చెప్పడానికి, సహాయ పడటానికి పెద్దలెవరూ లేరు. పిల్లలిద్దరూ చిన్నవాళ్లు. దాంతో ఒంటరి పోరాటం మొదలు పెట్టారు. భర్తను బతికించు కోవాలని తపించారు. ఆయనకు కిడ్నీ ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు. బీపీ, షుగర్ ఉండటం వల్ల వీలు కాదని డాక్టర్లు అనడంతో తెలిసినవాళ్ళ నుంచి మూత్ర పిండదానం కోసం ఎంతో శ్రమపడ్డారు. ఉన్నదంతా ఖర్చుపెట్టి చికిత్స చేయించారు.
 
 రెండేళ్ల పాటు రేయింబ వళ్లూ నిద్రాహారాలు మాని సేవలు చేశారు. చివరికి ఆమె ప్రేమ గెల్చింది. మృత్యువు ఓడిపోయింది. అవన్నీ గుర్తుచేస్తే ప్రసాద్ కళ్లు చెమరుస్తాయి. ‘‘నన్ను బతికించుకోవడానికి దొరికిన ఏ అవకాశాన్నీ వదులుకోకూడదని ఆరాటపడేది తను. తమిళనాడులోని రాయవెల్లూరు దగ్గర ఏదో ఊళ్లో యునానీ మందు ఇస్తారు, బాగా పని చేస్తుందని ఎవరో చెబితే, ఒక్కతే అక్కడికి వెళ్లిపోయి మందు తీసుకొచ్చేసింది. కిడ్నీ ఇవ్వడానికీ సిద్ధపడిపోయింది. డయాలసిస్ చేయించి ఇంటికి తీసుకు రాగానే ఒక్కోసారి ఆయాసం వచ్చేసేది. దాంతో నన్ను తీసుకుని మళ్లీ హాస్పిటల్‌కి పరుగెత్తేది. కూకట్‌పల్లిలోని మా ఇంటి నుంచి జూబ్లీహిల్స్‌లోని అపొలో ఆస్పత్రికి నన్ను తిప్పుతూనే ఉండేది. బ్యాంక్ బ్యాలెన్సులు అయిపోయాయి. నగలన్నీ అమ్మేసింది. చివరకు ఆపరేషన్‌కు కాదు కదా, డయాలసిస్ చేయడానికి మూడు వేలు కూడా లేని పరిస్థితి వచ్చేసింది. అయినా ఎలాగోలా నన్ను బతికించుకోవాలని ఆరాటపడింది. అదృష్టంకొద్దీ సినీ పరిశ్రమలోని వారంతా కలసి మమ్మల్ని ఆదుకున్నారు.
 
 లేదంటే ఇంకా ఎంత కష్టమైనా పడేది. ఏం చేసయినా నన్ను బతికించుకునేది. తన ప్రేమ గురించి తెలుసు కనుకనే నేనిక బతకనని తెలియగానే నా కళ్ల ముందు తనే మెదిలింది. తనకు నేను తప్ప మరేమీ తెలియదు. తన కోసమైనా నన్ను బతికించమని దేవుడిని వేడుకున్నాను’’ అంటారు చెమ్మగిల్లిన కళ్లతో.  ఒకప్పుడు యముడితో పోరాడి సతీ సావిత్రి తన భర్త ప్రాణాలు కాపాడుకుంది. ఇప్పుడు గీత చేసింది కూడా అంతకంటే తక్కువేమీ కాదు. దుఃఖాన్ని దిగమింగుకుని, బాధను గుండెల్లోనే అణచుకుని గుంభనంగా, గంభీరంగా తన పని తాను చేసుకుపోయారు. కంటికి రెప్పలా కాపాడుకుంటూ భర్తను మెల్లమెల్లగా మృత్యు వాకిటి నుంచి వెనక్కి తెచ్చుకున్నారు. అందుకే ‘తను నాకు భార్య కాదు, అమ్మ’ అంటారు ప్రసాద్. భార్య తల్లిలా మారినప్పుడు, భర్త బిడ్డలాగా ఆమె అనురాగంలో ఒదిగిపోయి నప్పుడు... ఆ దాంపత్యం ఆదర్శ దాంపత్యం అవుతుంది. వివాహ బంధానికి విలువ మరింత పెరుగుతుంది. అందుకు ఒక సాక్ష్యం... ఈ ఇద్దరు!
 
 భార్యాభర్తల మధ్య ఇష్టం ఉండాలి. భాగస్వామిని మనస్ఫూర్తిగా ఇష్టపడినప్పుడు, తనకు సంబంధించిన ప్రతి విషయాన్నీ ఇష్టపడగలుగుతాం. నేను ఇంట్లో ఏమీ పట్టించుకోను. ఇంటికి సంబంధించి ఏ విషయమూ తెలియదు నాకసలు. కానీ తను నన్ను విసుక్కోదు. ‘ఎందుకు పట్టించుకోవు’ అని అడగదు. ఎందుకంటే తనకి నేనంటే ఇష్టం. అందుకే నేను ఎలా ఉన్నా ఆమెకు కోపం రాదు. అలా ఇష్టాన్ని పెంచుకోకపోవడం వల్లే ఇప్పుడు చాలామంది జంటల మధ్య మనఃస్పర్థలు వస్తున్నాయి. చిన్న చిన్న విషయాలకే ఒకరినొకరు నిందించుకుని విడాకుల వరకూ వెళ్లిపోతున్నారు. ఒక్కసారి మీ భార్యని/భర్తని నిష్కల్మషంగా ఇష్టపడి చూడండి. తనని వదిలిపెట్టాలన్న ఆలోచన మీ మనసులోకి రానే రాదు.
 - తోట ప్రసాద్,
 సినీ రచయిత


 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement