World Marriage Day
-
World Marriage Day: మనసే జతగా.. మమతే లతగా..
పెళ్లి, లగ్గం, వివాహం, కల్యాణం.. పేరేదైనా ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యే ఆడ, మగ కుటుంబ వ్యవస్థకు పునాదులవుతారు. మూడు ముళ్ల బంధంలో ఒదిగి ముచ్చటగా కాపు రం చేసి సమాజంలో ఓ భాగమవుతారు. బాధ్యతలను గుర్తుచేసి కుటుంబంలో తమ పాత్ర ఏమిటో తెలియజేసే వివాహ వ్యవస్థకు మన సమాజంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. మూడుముళ్ల బంధంతో ఒక్కటై బాధ్యతలు, బాంధవ్యాలు, కర్తవ్యాలను మనకు జ్ఞప్తికి తెచ్చే వివాహం ప్రతిఒక్కరి జీవితంలో కీలకమైన ఘట్టమే. స్త్రీ, పురుషులు ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టి, 'మాంగల్యం తంతునానేనా' అనే పురోహితుడి మంత్రోచ్ఛరణతో ఒక్కటయ్యే గొప్పదైన మన భారతీయ వివాహ వ్యవస్థ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది. వివాహం భార్య, భర్తలను విడదీయలేని బంధంగా ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవనం సాగిస్తే వందేళ్ల జీవితాన్ని సుఖసంతోషాలతో గడిపేయొచ్చు. మనస్పర్థలు, కోపతాపాలు, అనుమానాలు రేకెత్తకుండా చూసుకోవాలి. కోపతామాలతో నేనే గొప్ప అంటే నేనే గొప్ప అనే అహంకారం, చిన్న చిన్న కారణాలతో కాళ్లాపారణి ఆరకముందే విడాకులు తీసుకుంటున్న ఘటనలు నేటి సమాజంలో చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి పరిణామాలు లేని స్వచ్ఛమైన ఆదర్శ దాంపత్యం సాగిపోవాలంటే ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమానురాగాలు పెంపొందించుకోవాలి. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో జంటలు ఆదర్శనీయ జీవనం గడుపుతూ నేటి యువతకు స్ఫూర్తిదాతలుగా నిలుస్తున్నారు. ఇవి చదవండి: 'మిలియనీర్లుగా బిచ్చగాళ్లు'..జస్ట్ 45 రోజుల్లో ఏకంగా రూ. 2.5 లక్షలు..! -
World Marriage Day: అపార్థాలు, అనుమానాలతో నిండు జీవితాలు నాశనం!
మాంగల్యం తంతునానేనా.. మమ జీవన హేతునా.. కంఠే బద్నామి శుభగే త్వం జీవ శరదం శతం.. ఈ మంత్రాన్ని అందరూ వందలసార్లు విని ఉంటారు. ఈ మంత్రం వింటూనే వరుడు వధువు మెడలో తాళి కడతాడు. ఈ మాంగల్య ధారణతో మనం తోడూనీడగా వందేళ్లు కలిసి ఉందాం.. అని క్లుప్తంగా దీని అర్థం. వేలాది జంటలు ఈ మంత్రాన్ని అర్థం చేసుకుని బతుకులను పండించుకుంటూ ఉంటే.. కొందరు మాత్రం అపార్థాలకు, అనుమానాలకు పోయి నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. సర్దుకుపోతూ కాలాన్ని మధురం చేసుకోవాల్సిన వారు.. అనవసర గొడవలకు పోయి కుటుంబాలకు చేదు మిగుల్చుతున్నారు. సిక్కోలులోనూ ఈ పెడ ధోరణి ప్రబలుతోంది. చాలాజంటలు కోర్టు మెట్లెక్కుతున్నాయి. అయితే ఇలాంటి గొడవలను పరిష్కరించే వేదికలూ ఉన్నాయి. నేడు ప్రపంచ వివాహ దినోత్సవం. మూడు ముళ్ల బంధం చాలా మందికి పల్లేరు ముళ్ల చందంలా మారుతోంది. సినిమాల ప్రభావం, పెరుగుతున్న పాశ్చాత్య ధోరణి, మనుషులను అర్థం చేసుకునే తత్వం తగ్గడంతో కాపురాలు కూలిపోతున్నాయి. సిక్కోలు జిల్లా కూడా ఇందుకు మినహాయింపు కాదు. కుల, మతాలకు అతీతంగా చాలా యువ జంటలు అనుమానం అనే కార్చిచ్చుకు బలైపోతున్నాయి. ఒక తరం ముందు వరకు కష్టనష్టాలను కలిసి పంచుకున్న దంపతులు.. తరం మారే సరికి సర్దుకుపోయే తత్వాన్ని మర్చిపోయి మనుషులను దూరం చేసుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలకు కూడా పెద్ద గొడవలకు పోయి దాంపత్యాన్ని బుగ్గిపాలు చేసుకుంటున్నారు. మనస్పర్థలతో... పెద్దగా ఆస్తులు, చెప్పుకోదగ్గ ఆదాయ వనరులు, సమాజంలో హోదా, సౌకర్యాలు, సౌఖ్యాలు లేని రోజుల్లో భార్యాభర్తలు హాయిగా అరమరికలు లేకుండా బతికేశారు. కానీ చదువు, ఉద్యోగం, స్థాయి, హోదా అనేవి వచ్చాక ఆలోచనల్లోనూ మార్పు కనిపిస్తోంది. సరదాగా సాగాల్సిన కాపురాల్లో చిన్న చిన్న మనస్పర్థలు, అనుమానాలు కలతలు సృష్టిస్తున్నాయి. జీవితాంతం తోడూనీడగా కలిసి నడవాల్సిన ఆలుమగలు మధ్య విభేదాలు వేరే కుంపటికి దారి తీస్తున్నా యి. లేనిపోని అనుమానాలతో దంపతులు ఠాణా మెట్లెక్కుతుండటంతో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నప్పటికీ చాలా మంది తీరు మారడం లేదు. కానీ కొందరు మాత్రం అర్థం చేసుకుని వివాహ బందాన్ని బలోపేతం చేసుకుంటున్నారు. ఇవి కాకుండా.. భార్యభర్తల విభేదాలతో కొన్ని సందర్భాల్లో పోలీసులు, పెద్దల వద్దకు వెళితే ఎక్కడ తమ పరువు పోతుందోనని..ఎవరికీ చెప్పుకోలేక లోలోన మదనపడుతూ క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు అనేకం ఉన్నాయి. గ్రామ స్థాయిలో పరిష్కారం దాంపత్యంలో సమస్యలు వస్తే ఒకప్పుడు పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లాల్సి వచ్చేది. కానీ నేడు సచివాలయాల్లో మహిళా పోలీసు వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ఈ సదుపాయాన్ని చాలా మంది వినియోగించుకుంటున్నారు. పోలీస్ స్టేషన్లో కూడా ప్రత్యేకంగా ‘హెల్ప్ డెస్క్’ను ఏర్పాటు చేసి ఇలాంటి సమస్యలను డీఎస్పీలతో పాటు ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ, ఎస్ఐలే కౌన్సిలింగ్ ఇస్తూ దంపతుల మధ్య సయోధ్య కుదుర్చుతున్నారు. ఒక్కటి చేసేందుకే ప్రయత్నం ఘర్షణతో తగువుపడి వచ్చే దంపతులను ఒక్కటి చేసేందుకు ప్రయత్నం చేస్తుంటాం. ఘర్షణ పడి వచ్చే దంపతులపై వెంటనే కేసులు నమోదు చేయకుండా ముందుగా కౌన్సిలింగ్ చేస్తున్నాం. అయినా వినకపోతే కేసులు నమోదు చేస్తు న్నాం. న్యాయవాదులు, పోలీసులతో ఏర్పడిన కమి టీ ద్వారా కౌన్సిలింగ్ ఇప్పిస్తుంటాం. ప్రస్తుతం గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా నియమించిన మహిళా పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి సమస్యను పరిష్కరిస్తున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ లో ‘హెల్ప్ డెస్క్’ను ఏర్పాటు చేశాం. – ఎస్.వాసుదేవ్, డీఎస్పీ, దిశా పోలీస్ స్టేషన్, శ్రీకాకుళం. రాజీ అవసరం ఆలు మగల మధ్య నమ్మ కం ఎంత బలంగా ఉంటే కాపురం అంత సంతోషంగా ఉంటుంది. ఎంత బల హీనపడితే అంత నరకం అవుతుంది. నమ్మకం ఉన్నచోట అభద్రత ఉండదు, అనుమానాలు ఉండవు, హింస ఉండదు, రహస్యాలు ఉండవు. వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఆత్మవంచనలు ఉండవు. సంసారంలో దంపతులిద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావచ్చు. ఒకరిని ఒకరు అర్థం చేసుకొని కొన్ని విషయాల్లో రాజీ పడటం చాలా ఉత్తమమైన మార్గం. న్యాయ వ్యవస్థలో మేము సైతం జంటను ఒక్కటిగా చేసేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తాం. ఆవేశంలో విడిపోయిన జంటలు సైతం కొన్నేళ్ల తరువాత ఒక్కటైన సంఘటనలు కోకొల్లలు. – దూగాన చిరంజీవులు, రిటైర్డ్ అడిషనల్ చీఫ్ జడ్జి, సోంపేట మనసు విప్పి మాట్లాడుకోవాలి ముందుగా దంపతుల మధ్య సఖ్యత ఉండాలి. అభిప్రాయాలు నిర్మోహమాటంగా వెల్లడించుకోవాలి. ప్రశాంతంగా వ్యవహరించుకోవాలి. ఆరోపణలు, అభియోగ ధోరణి ఉండకూడదు. భాగస్వాముల్లో ఏకపక్ష నిర్ణయాలు, ప్రయత్నాలు ఆశించినంత ఫలితాలు ఇవ్వవు. కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు. అప్పుడే వివాహానికి సరైన అర్థం. – పిరియా విజయ జెడ్పీ చైర్ పర్సన్, శ్రీకాకుళం -
ఊతమై...
జీవితాంతం తోడూనీడగా ఉండేందుకు అతడు ఆమెతో ఏడడుగులు నడిచాడు. అయితే జీవితాంతం వేధించే ఆరోగ్య సమస్య అతడిని మంచం పట్టేలా చేసింది. కోరి కట్టుకున్న భర్త, చేజారి పోవడానికి సిద్ధంగా ఉన్న తమ కలల సౌధం.. రెంటినీ కాపాడుకోవడానికి ఆమె నేటికీ విశ్వప్రయత్నం చేస్తూనే ఉంది. ‘వరల్డ్ మేరేజ్ డే’ సందర్భంగా ఆ ఆలూమగల అనురాగబంధంపై ఫ్యామిలీస్పెషల్ రిపోర్ట్. : నిర్మలారెడ్డి మృదుల, పార్థసారథి పన్నెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఇద్దరిదీ ఒకే ఊరు. ఇద్దరికీ ఇంటర్మీడియెట్ నుంచే పరిచయం. డిగ్రీలో ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారితే ఇరువైపు పెద్దలు కాదన్నారు. ఇంట్లో నుంచి వచ్చేసి, పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్‌లో కాపురం పెట్టారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూనే డిగ్రీ పూర్తి చేశాడు పార్థసారథి. మృదుల చేత బి.టెక్, ఎమ్‌టెక్ పూర్తి చేయించాడు. ఇద్దరూ కలిసి సంపాదిస్తేనే నిలదొక్కుకోగలం అనే ఆలోచనతో మృదుల ఓ ప్రైవేట్ కాలేజీలో ఉద్యోగంలో చేరింది. నాలుగేళ్లు గడిచాయి. కొడుకు పుట్టాడు. పైసా పైసా కూడబెట్టి బ్యాంక్‌లో లోను తీసుకుని ఇల్లు కొనుక్కున్నారు. ఆనందంగా గృహప్రవేశం చేశారు. ఊహించని విషాదం అయితే ఈ దంపతుల జీవితంలోకి ఊహించని విషాదం ప్రవేశించింది. అకస్మాత్తుగా పార్థ సారథి కాళ్లు చచ్చుబడిపోయాయి. డాక్టర్లు గులియన్ బ్యారే సిండ్రోమ్ అన్నారు. వైద్యానికి లక్షల్లో ఖర్చు అవుతుంది అన్నారు. ఎప్పటికి నయమవుతుందో తెలియదన్నారు. మనిషి కోమాలోకి కూడా వెళ్లిపోవచ్చని అన్నారు. అదే సమయంలో ఉన్నదంతా ఊడ్చి కొనుక్కున్న ఇల్లు వాయిదా కట్టక బకాయి పడి ఉంది. కట్టుకున్న భర్తను, కొనుక్కున్న ఇంటిని, కన్న బిడ్డను.. ఎలా కాచుకోవాలో మృదులకు అర్థం కాలేదు. అన్నీ తానై నడిపించింది అందినచోటల్లా తెచ్చిన అప్పులు, ఆదుకున్న ఆప్తులు.. అంతా పది లక్షల వరకు ఖర్చయింది. అయినా ఫలితమేమీ కనిపించలేదు. ‘ఇంటికి తీసుకెళ్లడమే మేలు’ అన్నారు డాక్టర్లు. భర్త ఉద్యోగం చేసే స్థితిలో లేడు. అతన్ని చూసుకోవడానికి తనూ ఉద్యోగం మానేసే పరిస్థితి. చేస్తున్న ఉద్యోగానికి సెలవు పెట్టి, బ్యాంక్ వాళ్లను కలిసి తన పరిస్థితిని వివరించి, జప్తులో ఉన్న ఇంటికి గడువు కోరింది మృదుల. ఆపన్న హస్తం అందించే స్వచ్ఛంద సంస్థలను కలిసి తన పరిస్థితిని వివరించింది. మరోవైపు తనకు ఏమౌతుందో అని మంచంలోనే ఆందోళన పడుతున్న భర్తకు వెన్నుదన్నుగా నిలుస్తూ ‘ఇంకెంత కొన్ని రోజుల్లోనే లేచి జాబ్‌కి వెళతారు చూడండి..’ అంటూ రోజూ ధైర్యం చెబుతూ వచ్చింది. ఫిజియోథెరపీ చేయించింది సంవత్సరం పాటు పూర్తిగా మంచానికే పరిమితమైన పార్థసారధి మెల్లగా కూర్చోవడం, తర్వాత ఒక్కో అడుగు వేయడం.. మొదలుపెట్టాడు. ఆ అద్భుతమైన క్షణాలను గుర్తు చేసుకుంటూ- ‘‘మా సాత్విక్ (కుమారుడు) మొదటిసారి నడిచినప్పుడు కూడా నేను అంత ఆనందం పొందలేదు. రోజూ ఫిజియోథెరపీ చేస్తూ, తన ప్రయత్నంతో ఇప్పుడు కర్ర పట్టుకొని నడిచే స్థాయికి వచ్చాడు. పార్థులో ఆ కాస్త మార్పు వచ్చాక కాస్త ఊపిరి పీల్చుకున్నాను. మరో అసిస్టెంట్ సాయం తీసుకున్నాను. కాలేజీకి వెళ్లడం, అయిపోగానే ఉరుకులు పరుగుల మీద ఇల్లు చేరడం.. ఐదేళ్లు గా నాకు అలవాటై పోయింది. ‘నా కోసం చాలా కష్టపడుతున్నావురా!’ అంటుంటాడు పార్థు. ‘నాకే ఇలా అయితే..’ అంటాను. నవ్వుతూ చూస్తాడు’’ అంటూ భర్తను కాపాడుకున్న విధం, ఇల్లు చేజారకుండా చేసిన ప్రయత్నాలు, కొడుకు చదువు, తన పై భర్తకు ఉన్న ప్రేమానురాగాల గురించి వివరించింది మృదుల. ‘‘నా ఇంటి దేవత. నా కోసమే తను పుట్టింది. ఇంకా ఎన్నాళ్లు ఇలాగే కష్టపెడతానో..’ అంటూ అర్ధాంగి చేతిని తన చేతుల్లోకి తీసుకున్నారు పార్థసారథి. కష్టాలెన్ని వచ్చినా తమ బంధాన్ని కాపాడుకోవడానికి తపస్సు చేసే మృదుల లాంటివారిని చూసినప్పుడు వివాహబంధమంత బలమైనది ఇంకోటి ఉండదని అనిపిస్తుంది. -
ఊపిరై...
నేడు ప్రపంచ వివాహ దినోత్సవం ప్రేమ అనే తాడుకి అనురాగమనే పసుపు పూసి... నమ్మకం, భరోసా అనే సూత్రాలను జతచేసి కట్టేదే తాళి. అది రెండు మనసులను పెనవేస్తుంది. రెండు జీవితాలను ముడి పెడుతుంది. పెళ్లి అన్న రెండక్షరాల సాక్షిగా... జన్మజన్మలకూ తెగిపోని బలమైన బంధాన్ని ఏర్పరుస్తుంది. కష్టాలను కలసికట్టుగా అధిగమించడం నేర్పుతుంది. సమస్యల్లో సైతం ఒకరి చెంత ఒకరు నిలిచేలా చేస్తుంది. ఈ మాటలన్నీ అక్షర సత్యాలనడానికి సాక్ష్యం... సినీ రచయిత తోట ప్రసాద్, గీతల కాపురం. ప్రపంచంలోని ప్రతి విషయం గురించీ అనర్గళంగా మాట్లాడేంత జ్ఞానం ఉన్న వ్యక్తి ప్రసాద్. ప్రపంచమంటే తన భర్తే అనుకునే అతి సాధారణ ఇల్లాలు గీత. వీరి ఇరవై ఆరేళ్ల ఆదర్శ దాంపత్యం గురించి ఈ ‘ప్రపంచ వివాహ దినోత్సవం’ రోజున చెప్పుకుని తీరాలి. ...::: సమీర నేలపూడి హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రి. ఐసీయూకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని ఉంది ఒకావిడ. ముఖం నిండా దిగులు ముసురుకుని ఉంది. కళ్ల నిండా భయం కమ్ము కుని ఉంది. ఐసీయూలోంచి బయటకు వచ్చిన డాక్టర్ని చూస్తూనే లేచి నిలబడింది. కంగారుగా వెళ్లి ‘మావారు ఎలా ఉన్నారు’ అని అడిగింది. ‘హోప్స్ లేవమ్మా’ అనేసి డాక్టర్ వెళ్లిపోతుంటే నిశ్చేష్టురాలయ్యింది. ఎలా స్పందించాలో తెలియక, తాను విన్నది నిజమో కాదో అర్థం కాక కొయ్యబారిపోయింది. ఏ భార్యకైనా అంతటి కఠోర నిజాన్ని తట్టుకోవడం ఎలా సాధ్యపడుతుంది? కానీ గీత తట్టుకున్నారు. మృత్యు ఒడికి చేరువైన భర్తను కష్టపడి బతికించు కున్నారు. నాటి సంగతులు అడిగితే గీత కళ్లనుంచి అశ్రువులు జలజలా రాలిపడ్డాయి. ప్రతి కన్నీటి బొట్టు లోనూ భర్త మీద ప్రేమ కనిపించింది. ఆ ప్రేమే తనకు మళ్లీ ఊపిరి పోసిందంటారు ప్రసాద్. తమ సహచర్యం, ఇన్నేళ్లూ కలిసి సాగించిన జీవనయానం గురించిన విషయాలను నెమరు వేసుకున్నారు ఆ దంపతులిద్దరూ. సాహిత్యమే కలిపింది ‘143’ చిత్రానికి కథా సహకారాన్ని అందించిన తోట ప్రసాద్... ‘కంత్రి’, ‘బిల్లా’, ‘శక్తి’, ‘రామయ్యా వస్తావయ్యా’ తదితర సినిమాలకు స్క్రిప్ట్ అసోసియేట్‌గా పని చేశారు. ‘కుర్రాడు’, ‘వరుడు’, ‘ఆరెంజ్’, ‘పంచాక్షరి’ వంటి చలనచిత్రాలకు మాటలు అందించారు. ప్రస్తుతం ‘రుద్రమదేవి’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ చిత్రాలకు పని చేస్తోన్న ప్రసాద్‌కి... రచన అనే కళ పుట్టుకతోనే అబ్బింది. ఎదిగేకొద్దీ ఆ కళను తన తోనే అట్టిపెట్టుకున్నారు. ఇంటర్మీడియెట్‌కి వచ్చేసరికి ‘విపంచి’ పేరుతో ఆయన చేసే రచనలు అచ్చవడం మొదలయ్యింది. అప్పుడు ఆయనకు తెలియదు... తనలో ఉన్న ఆ కళ, తన జీవితానికే కళ తెస్తుందని! సాహిత్యాన్ని ప్రేమించే గీతని ప్రసాద్ రచనలు ఆకర్షించాయి. అందుకే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి తాడేపల్లిగూడెం వెళ్లారు ఆయన్ని కలవడానికి. నాటి పరి చయంతో స్నేహితుల య్యారు. ఆయన తన ఆలోచనలు పంచుకునేవారు. ఆమె తన అభిప్రాయాలు వెల్లడించేవారు. మౌనంగా, డిగ్నిఫైడ్‌గా ఉండే ప్రసాద్‌ని గీత ఇష్ట పడ్డారు. కేరింగ్‌గా, కూల్‌గా ఉండే గీత మీద ప్రసాద్ మనసుపడ్డారు. అంతలో ప్రసాద్ రచనలు చదివిన దర్శకుడు ‘విజయ’ బాపినీడు చిరంజీవితో తాను చేయబోయే సినిమాకి స్క్రిప్టు వర్కు చేయ డానికి మద్రాస్ ఆహ్వా నించారు. ప్రసాద్ వెళ్లారు. కానీ ఎక్కడో భయం. సినిమాల్లోకి వెళ్లిపోతే తనకు గీతను ఇవ్వడానికి ఆమె తల్లిదండ్రులు అంగీకరించరేమోనన్న సంశయం. దాంతో సినిమాలు వద్దనుకుని విజయవాడ వెళ్లి జర్నలిస్టుగా చేరారు. తర్వాత పెద్దల అనుమతితో తన ప్రియసఖిని వివాహమాడారు. ‘గీత... నా అదృష్టరేఖ’ ప్రసాద్‌కి పిల్లలంటే ప్రాణం. ఆయనకు శ్రావ్యను కానుకగా ఇచ్చారు గీత. అయితే ఆమెకు బీపీ, డయా బెటిస్ రావడంతో మరో బిడ్డను కనే ప్రయత్నం చేయ వద్దని హెచ్చరించారు వైద్యులు. కానీ మరో బిడ్డ ఉంటే బాగుండన్న ఆశ ప్రసాద్ మనసులో బలంగా ఉండేది. తోబుట్టువులు లేకుండా తాను ఒంటరిగా ఉన్నట్టుగా తన కూతురు ఉండ కూడదనుకునే వారు. అది తెలుసు కున్న గీత మరో బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధపడ్డారు. ప్రాణానికి ప్రమాదమని డాక్టర్లు హెచ్చరించినా... తన భర్త మనసులోని చిరు ఆశను తీర్చడం కోసం ఎంత రిస్క్ అయినా తీసుకోవాలనుకున్నారు. మనోజ్ఞను ఆయన చేతుల్లో పెట్టారు. ప్రేమ ఎంతటి త్యాగానికైనా సిద్ధపడు తుందన్న మాటను నిజం చేసి చూపించారు. అందుకే ప్రసాద్ అంటారు తన జీవితంలో తనకు దొరికిన అతి పెద్ద అదృష్టం గీత అని! ప్రేమ గెలిచిన క్షణం రామ్‌చరణ్ హీరోగా నటించిన ‘ఆరెంజ్’ సినిమాకి పని చేస్తున్నప్పుడు ఓరోజు... ప్రసాద్ కాళ్లు నీరు పట్టి ఉండటం గమనించారు గీత. ఏమైంది అని అడిగితే పట్టించుకోలేదు ప్రసాద్. పట్టుబట్టి ఆయనను హాస్పిటల్‌కు తీసుకెళ్లిన గీతకు ఊహించని షాక్ తగిలింది. ప్రసాద్ రెండు కిడ్నీలూ పాడైపోయాయని, ఒకట్రెండు రోజుల కంటే ఎక్కువ బతకరని చెప్పేశారు డాక్టర్లు. ఒక్కసారిగా అంతా శూన్యమైపోయినట్టనిపించింది గీతకి. ధైర్యం చెప్పడానికి, సహాయ పడటానికి పెద్దలెవరూ లేరు. పిల్లలిద్దరూ చిన్నవాళ్లు. దాంతో ఒంటరి పోరాటం మొదలు పెట్టారు. భర్తను బతికించు కోవాలని తపించారు. ఆయనకు కిడ్నీ ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు. బీపీ, షుగర్ ఉండటం వల్ల వీలు కాదని డాక్టర్లు అనడంతో తెలిసినవాళ్ళ నుంచి మూత్ర పిండదానం కోసం ఎంతో శ్రమపడ్డారు. ఉన్నదంతా ఖర్చుపెట్టి చికిత్స చేయించారు. రెండేళ్ల పాటు రేయింబ వళ్లూ నిద్రాహారాలు మాని సేవలు చేశారు. చివరికి ఆమె ప్రేమ గెల్చింది. మృత్యువు ఓడిపోయింది. అవన్నీ గుర్తుచేస్తే ప్రసాద్ కళ్లు చెమరుస్తాయి. ‘‘నన్ను బతికించుకోవడానికి దొరికిన ఏ అవకాశాన్నీ వదులుకోకూడదని ఆరాటపడేది తను. తమిళనాడులోని రాయవెల్లూరు దగ్గర ఏదో ఊళ్లో యునానీ మందు ఇస్తారు, బాగా పని చేస్తుందని ఎవరో చెబితే, ఒక్కతే అక్కడికి వెళ్లిపోయి మందు తీసుకొచ్చేసింది. కిడ్నీ ఇవ్వడానికీ సిద్ధపడిపోయింది. డయాలసిస్ చేయించి ఇంటికి తీసుకు రాగానే ఒక్కోసారి ఆయాసం వచ్చేసేది. దాంతో నన్ను తీసుకుని మళ్లీ హాస్పిటల్‌కి పరుగెత్తేది. కూకట్‌పల్లిలోని మా ఇంటి నుంచి జూబ్లీహిల్స్‌లోని అపొలో ఆస్పత్రికి నన్ను తిప్పుతూనే ఉండేది. బ్యాంక్ బ్యాలెన్సులు అయిపోయాయి. నగలన్నీ అమ్మేసింది. చివరకు ఆపరేషన్‌కు కాదు కదా, డయాలసిస్ చేయడానికి మూడు వేలు కూడా లేని పరిస్థితి వచ్చేసింది. అయినా ఎలాగోలా నన్ను బతికించుకోవాలని ఆరాటపడింది. అదృష్టంకొద్దీ సినీ పరిశ్రమలోని వారంతా కలసి మమ్మల్ని ఆదుకున్నారు. లేదంటే ఇంకా ఎంత కష్టమైనా పడేది. ఏం చేసయినా నన్ను బతికించుకునేది. తన ప్రేమ గురించి తెలుసు కనుకనే నేనిక బతకనని తెలియగానే నా కళ్ల ముందు తనే మెదిలింది. తనకు నేను తప్ప మరేమీ తెలియదు. తన కోసమైనా నన్ను బతికించమని దేవుడిని వేడుకున్నాను’’ అంటారు చెమ్మగిల్లిన కళ్లతో. ఒకప్పుడు యముడితో పోరాడి సతీ సావిత్రి తన భర్త ప్రాణాలు కాపాడుకుంది. ఇప్పుడు గీత చేసింది కూడా అంతకంటే తక్కువేమీ కాదు. దుఃఖాన్ని దిగమింగుకుని, బాధను గుండెల్లోనే అణచుకుని గుంభనంగా, గంభీరంగా తన పని తాను చేసుకుపోయారు. కంటికి రెప్పలా కాపాడుకుంటూ భర్తను మెల్లమెల్లగా మృత్యు వాకిటి నుంచి వెనక్కి తెచ్చుకున్నారు. అందుకే ‘తను నాకు భార్య కాదు, అమ్మ’ అంటారు ప్రసాద్. భార్య తల్లిలా మారినప్పుడు, భర్త బిడ్డలాగా ఆమె అనురాగంలో ఒదిగిపోయి నప్పుడు... ఆ దాంపత్యం ఆదర్శ దాంపత్యం అవుతుంది. వివాహ బంధానికి విలువ మరింత పెరుగుతుంది. అందుకు ఒక సాక్ష్యం... ఈ ఇద్దరు! భార్యాభర్తల మధ్య ఇష్టం ఉండాలి. భాగస్వామిని మనస్ఫూర్తిగా ఇష్టపడినప్పుడు, తనకు సంబంధించిన ప్రతి విషయాన్నీ ఇష్టపడగలుగుతాం. నేను ఇంట్లో ఏమీ పట్టించుకోను. ఇంటికి సంబంధించి ఏ విషయమూ తెలియదు నాకసలు. కానీ తను నన్ను విసుక్కోదు. ‘ఎందుకు పట్టించుకోవు’ అని అడగదు. ఎందుకంటే తనకి నేనంటే ఇష్టం. అందుకే నేను ఎలా ఉన్నా ఆమెకు కోపం రాదు. అలా ఇష్టాన్ని పెంచుకోకపోవడం వల్లే ఇప్పుడు చాలామంది జంటల మధ్య మనఃస్పర్థలు వస్తున్నాయి. చిన్న చిన్న విషయాలకే ఒకరినొకరు నిందించుకుని విడాకుల వరకూ వెళ్లిపోతున్నారు. ఒక్కసారి మీ భార్యని/భర్తని నిష్కల్మషంగా ఇష్టపడి చూడండి. తనని వదిలిపెట్టాలన్న ఆలోచన మీ మనసులోకి రానే రాదు. - తోట ప్రసాద్, సినీ రచయిత