మాంగల్యం తంతునానేనా.. మమ జీవన హేతునా.. కంఠే బద్నామి శుభగే త్వం జీవ శరదం శతం.. ఈ మంత్రాన్ని అందరూ వందలసార్లు విని ఉంటారు. ఈ మంత్రం వింటూనే వరుడు వధువు మెడలో తాళి కడతాడు. ఈ మాంగల్య ధారణతో మనం తోడూనీడగా వందేళ్లు కలిసి ఉందాం.. అని క్లుప్తంగా దీని అర్థం. వేలాది జంటలు ఈ మంత్రాన్ని అర్థం చేసుకుని బతుకులను పండించుకుంటూ ఉంటే.. కొందరు మాత్రం అపార్థాలకు, అనుమానాలకు పోయి నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
సర్దుకుపోతూ కాలాన్ని మధురం చేసుకోవాల్సిన వారు.. అనవసర గొడవలకు పోయి కుటుంబాలకు చేదు మిగుల్చుతున్నారు. సిక్కోలులోనూ ఈ పెడ ధోరణి ప్రబలుతోంది. చాలాజంటలు కోర్టు మెట్లెక్కుతున్నాయి. అయితే ఇలాంటి గొడవలను పరిష్కరించే వేదికలూ ఉన్నాయి. నేడు ప్రపంచ వివాహ దినోత్సవం.
మూడు ముళ్ల బంధం చాలా మందికి పల్లేరు ముళ్ల చందంలా మారుతోంది. సినిమాల ప్రభావం, పెరుగుతున్న పాశ్చాత్య ధోరణి, మనుషులను అర్థం చేసుకునే తత్వం తగ్గడంతో కాపురాలు కూలిపోతున్నాయి. సిక్కోలు జిల్లా కూడా ఇందుకు మినహాయింపు కాదు. కుల, మతాలకు అతీతంగా చాలా యువ జంటలు అనుమానం అనే కార్చిచ్చుకు బలైపోతున్నాయి. ఒక తరం ముందు వరకు కష్టనష్టాలను కలిసి పంచుకున్న దంపతులు.. తరం మారే సరికి సర్దుకుపోయే తత్వాన్ని మర్చిపోయి మనుషులను దూరం చేసుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలకు కూడా పెద్ద గొడవలకు పోయి దాంపత్యాన్ని బుగ్గిపాలు చేసుకుంటున్నారు.
మనస్పర్థలతో...
పెద్దగా ఆస్తులు, చెప్పుకోదగ్గ ఆదాయ వనరులు, సమాజంలో హోదా, సౌకర్యాలు, సౌఖ్యాలు లేని రోజుల్లో భార్యాభర్తలు హాయిగా అరమరికలు లేకుండా బతికేశారు. కానీ చదువు, ఉద్యోగం, స్థాయి, హోదా అనేవి వచ్చాక ఆలోచనల్లోనూ మార్పు కనిపిస్తోంది. సరదాగా సాగాల్సిన కాపురాల్లో చిన్న చిన్న మనస్పర్థలు, అనుమానాలు కలతలు సృష్టిస్తున్నాయి.
జీవితాంతం తోడూనీడగా కలిసి నడవాల్సిన ఆలుమగలు మధ్య విభేదాలు వేరే కుంపటికి దారి తీస్తున్నా యి. లేనిపోని అనుమానాలతో దంపతులు ఠాణా మెట్లెక్కుతుండటంతో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నప్పటికీ చాలా మంది తీరు మారడం లేదు. కానీ కొందరు మాత్రం అర్థం చేసుకుని వివాహ బందాన్ని బలోపేతం చేసుకుంటున్నారు.
ఇవి కాకుండా.. భార్యభర్తల విభేదాలతో కొన్ని సందర్భాల్లో పోలీసులు, పెద్దల వద్దకు వెళితే ఎక్కడ తమ పరువు పోతుందోనని..ఎవరికీ చెప్పుకోలేక లోలోన మదనపడుతూ క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు అనేకం ఉన్నాయి.
గ్రామ స్థాయిలో పరిష్కారం
దాంపత్యంలో సమస్యలు వస్తే ఒకప్పుడు పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లాల్సి వచ్చేది. కానీ నేడు సచివాలయాల్లో మహిళా పోలీసు వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ఈ సదుపాయాన్ని చాలా మంది వినియోగించుకుంటున్నారు. పోలీస్ స్టేషన్‌లో కూడా ప్రత్యేకంగా ‘హెల్ప్ డెస్క్’ను ఏర్పాటు చేసి ఇలాంటి సమస్యలను డీఎస్పీలతో పాటు ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ, ఎస్‌ఐలే కౌన్సిలింగ్ ఇస్తూ దంపతుల మధ్య సయోధ్య కుదుర్చుతున్నారు.
ఒక్కటి చేసేందుకే ప్రయత్నం
ఘర్షణతో తగువుపడి వచ్చే దంపతులను ఒక్కటి చేసేందుకు ప్రయత్నం చేస్తుంటాం. ఘర్షణ పడి వచ్చే దంపతులపై వెంటనే కేసులు నమోదు చేయకుండా ముందుగా కౌన్సిలింగ్ చేస్తున్నాం. అయినా వినకపోతే కేసులు నమోదు చేస్తు న్నాం. న్యాయవాదులు, పోలీసులతో ఏర్పడిన కమి టీ ద్వారా కౌన్సిలింగ్ ఇప్పిస్తుంటాం. ప్రస్తుతం గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా నియమించిన మహిళా పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి సమస్యను పరిష్కరిస్తున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ లో ‘హెల్ప్ డెస్క్’ను ఏర్పాటు చేశాం. – ఎస్.వాసుదేవ్, డీఎస్పీ, దిశా పోలీస్ స్టేషన్, శ్రీకాకుళం.
రాజీ అవసరం
ఆలు మగల మధ్య నమ్మ కం ఎంత బలంగా ఉంటే కాపురం అంత సంతోషంగా ఉంటుంది. ఎంత బల హీనపడితే అంత నరకం అవుతుంది. నమ్మకం ఉన్నచోట అభద్రత ఉండదు, అనుమానాలు ఉండవు, హింస ఉండదు, రహస్యాలు ఉండవు. వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఆత్మవంచనలు ఉండవు. సంసారంలో దంపతులిద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావచ్చు. ఒకరిని ఒకరు అర్థం చేసుకొని కొన్ని విషయాల్లో రాజీ పడటం చాలా ఉత్తమమైన మార్గం. న్యాయ వ్యవస్థలో మేము సైతం జంటను ఒక్కటిగా చేసేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తాం. ఆవేశంలో విడిపోయిన జంటలు సైతం కొన్నేళ్ల తరువాత ఒక్కటైన సంఘటనలు కోకొల్లలు.
– దూగాన చిరంజీవులు, రిటైర్డ్ అడిషనల్ చీఫ్ జడ్జి, సోంపేట
మనసు విప్పి మాట్లాడుకోవాలి
ముందుగా దంపతుల మధ్య సఖ్యత ఉండాలి. అభిప్రాయాలు నిర్మోహమాటంగా వెల్లడించుకోవాలి. ప్రశాంతంగా వ్యవహరించుకోవాలి. ఆరోపణలు, అభియోగ ధోరణి ఉండకూడదు. భాగస్వాముల్లో ఏకపక్ష నిర్ణయాలు, ప్రయత్నాలు ఆశించినంత ఫలితాలు ఇవ్వవు. కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు. అప్పుడే వివాహానికి సరైన అర్థం.
– పిరియా విజయ జెడ్పీ చైర్ పర్సన్, శ్రీకాకుళం
Comments
Please login to add a commentAdd a comment