ఊతమై... | World Marriage Day | Sakshi
Sakshi News home page

ఊతమై...

Published Sun, Feb 8 2015 12:23 AM | Last Updated on Sat, Sep 2 2017 8:57 PM

ఊతమై...

ఊతమై...

జీవితాంతం తోడూనీడగా ఉండేందుకు అతడు ఆమెతో ఏడడుగులు నడిచాడు. అయితే జీవితాంతం వేధించే ఆరోగ్య సమస్య అతడిని మంచం పట్టేలా చేసింది. కోరి కట్టుకున్న భర్త, చేజారి పోవడానికి సిద్ధంగా ఉన్న తమ కలల సౌధం.. రెంటినీ కాపాడుకోవడానికి ఆమె నేటికీ విశ్వప్రయత్నం చేస్తూనే ఉంది. ‘వరల్డ్ మేరేజ్ డే’ సందర్భంగా ఆ ఆలూమగల అనురాగబంధంపై ఫ్యామిలీస్పెషల్ రిపోర్ట్. :  నిర్మలారెడ్డి
 
 మృదుల, పార్థసారథి పన్నెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఇద్దరిదీ ఒకే ఊరు. ఇద్దరికీ ఇంటర్మీడియెట్  నుంచే పరిచయం. డిగ్రీలో ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారితే ఇరువైపు పెద్దలు కాదన్నారు. ఇంట్లో నుంచి వచ్చేసి, పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్‌లో కాపురం పెట్టారు.  చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూనే డిగ్రీ పూర్తి చేశాడు పార్థసారథి. మృదుల చేత బి.టెక్, ఎమ్‌టెక్ పూర్తి చేయించాడు. ఇద్దరూ కలిసి సంపాదిస్తేనే నిలదొక్కుకోగలం అనే ఆలోచనతో మృదుల ఓ ప్రైవేట్ కాలేజీలో ఉద్యోగంలో చేరింది.  నాలుగేళ్లు గడిచాయి. కొడుకు పుట్టాడు. పైసా పైసా కూడబెట్టి బ్యాంక్‌లో లోను తీసుకుని ఇల్లు కొనుక్కున్నారు. ఆనందంగా గృహప్రవేశం చేశారు.
 
 ఊహించని విషాదం
 అయితే ఈ దంపతుల జీవితంలోకి ఊహించని విషాదం ప్రవేశించింది. అకస్మాత్తుగా పార్థ సారథి కాళ్లు చచ్చుబడిపోయాయి. డాక్టర్లు గులియన్ బ్యారే సిండ్రోమ్ అన్నారు. వైద్యానికి లక్షల్లో ఖర్చు అవుతుంది అన్నారు. ఎప్పటికి నయమవుతుందో తెలియదన్నారు. మనిషి కోమాలోకి కూడా వెళ్లిపోవచ్చని అన్నారు. అదే సమయంలో ఉన్నదంతా ఊడ్చి కొనుక్కున్న ఇల్లు వాయిదా కట్టక బకాయి పడి ఉంది. కట్టుకున్న భర్తను, కొనుక్కున్న ఇంటిని, కన్న బిడ్డను.. ఎలా కాచుకోవాలో మృదులకు అర్థం కాలేదు.
 
 అన్నీ తానై నడిపించింది
 అందినచోటల్లా తెచ్చిన అప్పులు, ఆదుకున్న ఆప్తులు.. అంతా పది లక్షల వరకు ఖర్చయింది. అయినా ఫలితమేమీ కనిపించలేదు. ‘ఇంటికి తీసుకెళ్లడమే మేలు’ అన్నారు డాక్టర్లు. భర్త ఉద్యోగం చేసే స్థితిలో లేడు. అతన్ని చూసుకోవడానికి తనూ ఉద్యోగం మానేసే పరిస్థితి. చేస్తున్న ఉద్యోగానికి సెలవు పెట్టి, బ్యాంక్ వాళ్లను కలిసి తన పరిస్థితిని వివరించి, జప్తులో ఉన్న ఇంటికి గడువు కోరింది మృదుల. ఆపన్న హస్తం అందించే స్వచ్ఛంద సంస్థలను కలిసి తన పరిస్థితిని వివరించింది. మరోవైపు తనకు ఏమౌతుందో అని మంచంలోనే ఆందోళన పడుతున్న భర్తకు వెన్నుదన్నుగా నిలుస్తూ ‘ఇంకెంత కొన్ని రోజుల్లోనే లేచి జాబ్‌కి వెళతారు చూడండి..’ అంటూ  రోజూ ధైర్యం చెబుతూ వచ్చింది. ఫిజియోథెరపీ చేయించింది సంవత్సరం పాటు పూర్తిగా మంచానికే పరిమితమైన పార్థసారధి మెల్లగా కూర్చోవడం, తర్వాత ఒక్కో అడుగు వేయడం.. మొదలుపెట్టాడు.
 
 ఆ అద్భుతమైన క్షణాలను గుర్తు చేసుకుంటూ- ‘‘మా సాత్విక్ (కుమారుడు) మొదటిసారి నడిచినప్పుడు కూడా నేను అంత ఆనందం పొందలేదు. రోజూ ఫిజియోథెరపీ చేస్తూ, తన ప్రయత్నంతో ఇప్పుడు కర్ర పట్టుకొని నడిచే స్థాయికి వచ్చాడు. పార్థులో ఆ కాస్త మార్పు వచ్చాక కాస్త ఊపిరి పీల్చుకున్నాను. మరో అసిస్టెంట్ సాయం తీసుకున్నాను. కాలేజీకి వెళ్లడం, అయిపోగానే ఉరుకులు పరుగుల మీద ఇల్లు చేరడం.. ఐదేళ్లు గా నాకు అలవాటై పోయింది. ‘నా కోసం చాలా కష్టపడుతున్నావురా!’ అంటుంటాడు పార్థు. ‘నాకే ఇలా అయితే..’ అంటాను. నవ్వుతూ చూస్తాడు’’ అంటూ భర్తను కాపాడుకున్న విధం, ఇల్లు చేజారకుండా చేసిన ప్రయత్నాలు, కొడుకు చదువు, తన పై భర్తకు ఉన్న ప్రేమానురాగాల గురించి వివరించింది మృదుల. ‘‘నా ఇంటి దేవత. నా కోసమే తను పుట్టింది. ఇంకా ఎన్నాళ్లు ఇలాగే కష్టపెడతానో..’ అంటూ అర్ధాంగి చేతిని తన చేతుల్లోకి తీసుకున్నారు పార్థసారథి. కష్టాలెన్ని వచ్చినా తమ బంధాన్ని కాపాడుకోవడానికి తపస్సు చేసే మృదుల లాంటివారిని చూసినప్పుడు వివాహబంధమంత బలమైనది ఇంకోటి ఉండదని అనిపిస్తుంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement