బాబు నమ్మించి గొంతుకోశారని డోన్ ఇన్‌చార్జి ధర్మవరం ధ్వజం
పెనుకొండలో బీకే పార్థసారథి ఇంటి వద్ద నాయకుల ఘెరావ్
అనకాపల్లి ఎంపీ టికెట్ స్థానికులకే ఇవ్వాలని ఆడారి డిమాండ్
రాజమండ్రి రూరల్ సీటు ప్రకటనపై వేచి చూస్తానన్న గోరంట్ల
డోన్/పెనుకొండ/అనకాపల్లి/రాజమహేంద్రవరం రూరల్: టికెట్ల ప్రకటనపై టీడీపీలో నిరసన సెగలు ఎగసిపడుతున్నాయి. అసంతృప్త నేతలు తిరుగుబావుటా ఎగరవేస్తున్నారు. చంద్రబాబు తీరుపై ధ్వజమెత్తుతున్నారు. చంద్రబాబు తనను నమ్మించి గొంతు కోశారని టీడీపీ నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
గత శుక్రవారం టీడీపీ డోన్ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి వర్గీయులు డోన్‌లో పోటాపోటీ బలప్రదర్శన నిర్వహించగా, సీటు దక్కని ధర్మవరం సుబ్బారెడ్డి శనివారం భవిష్యత్ కార్యచరణ పేరుతో వేలాదిమందితో ప్రదర్శన నిర్వహించారు. ఆయన మా ట్లాడుతూ మూడేళ్ల పాటు పార్టీ బలోపేతానికి కష్టపడ్డానని వివరించారు. 40 ఏళ్లుగా కోట్ల, కేఈ వర్గా లకు విధేయునిగా ఉన్నానే తప్ప వారికి ఏనాడూ వెన్నుపోటు పొడవలేదని పేర్కొన్నారు.
ఆ రెండు కుటుంబాలు పార్టీ ఇన్‌చార్జిగా ఉండేందుకు ఇష్టపడకపోవడంతోనే బాబు తనకు బాధ్యత అప్పగించారని గుర్తుచేశారు. ఇప్పుడు మూడేళ్ల తర్వాత తనతో మాట మాత్రమైనా చెప్పకుండా అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాష్రెడ్డిని ప్రకటించడం దారుణమ న్నారు. బాబు తన గొంతు కోశారని కన్నీటి పర్యంతమయ్యారు. తన రెక్కల కష్టంతో పార్టీని బతికించానని, ఇప్పుడు ఎవరో వచ్చి ఫలాలు పొందాలనుకుంటే తాను చూస్తూ ఊరుకోబోనన్నారు.
బీకే ఇంటి వద్ద ఉద్రిక్తత
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ టీడీపీ మాజీ ఎమ్మె ల్యే బీకే పార్థసారథి ఇంటి వద్ద శనివారం ఉద్రిక్తత నెలకొంది. బీకేకు టికెట్ ఇవ్వకపోవడంతో ఆగ్రహంగా ఉన్న ఆయన వర్గీయులు పార్టీపరిశీలకుడితోపాటు ఇతర నేతలను ఘెరావ్ చే శారు. పార్థసారథికి సర్దిచెప్పేందుకు శనివారం ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ పరిశీలకుడు కోవెలపూడి రవీంద్ర, మరికొందరు నాయకులు పెనుకొండలోని బీకే ఇంటికి వచ్చారు. అప్పటికే అక్కడికి చేరుకున్న బీకే మద్దతుదారులు తమ నేతకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంపీ టికెట్ ఇచ్చే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని వారు సర్దిచెప్పబోగా.. ఎంపీ టికెట్‌కు ఒప్పుకోబోమని, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి తీరాలని పట్టుబట్టారు.
రవీంద్రతోపాటు ఇతర నాయకులను చుట్టుముట్టారు. దీంతో రవీంద్ర, ఇతర నాయకులు వెనుదిరిగేందుకు యత్నించారు. అయినా వదలని బీకే వర్గీయులు వారి వెంట పడ్డారు. వాహనాలను చుట్టుముట్టి ముందుకు వెళ్లనీయకుండా ఘెరావ్ చేశారు. లోకేష్, చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రవీంద్ర, ఇతరులు అక్కడి నుంచి జారుకున్నారు.
దిలీప్‌చక్రవర్తి అభ్యర్థిత్వాన్ని అంగీకరించబోం
టీడీపీ అనకాపల్లి ఎంపీ టికెట్‌ను స్థానికులకే ఇవ్వాలని, బైరా దిలీప్ చక్రవర్తి అభ్యర్థిత్వాన్ని తాము అంగీకరించబోమని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, çసమైక్య ఉద్యమ నేత ఆడారి కిషోర్ కుమార్ స్పష్టం చేశారు. అనకాపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీ అధిష్టానం స్థానికులకే టికెట్ ఇవ్వాలి, లేకుంటే తాను తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని పేర్కొన్నారు.
చంద్రబాబు, లోకేష్ సభలకు, పాదయాత్రలకు వారు ఇక్కడికి వచ్చినప్పుడు తన సొంత డబ్బులతో మూడు బస్సులు తిప్పానని, ప్రస్తుతం జరుగుతున్న టీడీపీ సమావేశాలకూ బస్సులు తిప్పుతున్నానని చెప్పారు. ఆరు నెలల క్రితం చంద్రబాబుతో అనకాపల్లి ఎంపీ టిక్కెట్ కోసం చర్చించానని, ఈసారి టికెట్ తనకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు శొంఠ్యాన అప్పలరాజు, దాడి అప్పలనాయుడు, ఎ.నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ప్రకటించే వరకూ వేచి చూస్తా: గోరంట్ల
టీడీపీ, జనసేన కలిసి ప్రయాణం చేస్తేనే రాష్ట్రం మళ్లీ బాగు పడుతుందని ప్రజలు భావిస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. నగరంలోని తన నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
2019లో ఏం జరిగింది, ఇప్పుడు తన బలమేమిటనే విషయాలను పవన్ కళ్యాణ్ జెండా సభలో వివరించారని, పవన్ తన పార్టీని నెమ్మదిగా బలోపేతం చేసుకుందామని చెప్పారని, ముద్రగడ, జోగయ్యల గురించి తానేమీ చెప్పలేనని పేర్కొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ సీటుపై అధినేతలు ప్రకటించే వరకూ వేచి చూస్తానని చెప్పారు. చంద్రబాబు, పవన్‌లను విడదీసేందుకు కొందరు తీవ్ర ప్రయత్నాలు చేశారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment