సాక్షి, నంద్యాల: డోన్ టీడీపీలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. నాయకులు వర్గాలుగా విడిపోయి పరస్పరం విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఎవరికి వారు తాము సూచించిన వారికే టికెట్ ఇవ్వాలని, లేని పక్షంలో అభ్యర్థిని ఓడిస్తామని పార్టీ అధినేత చంద్రబాబుకే స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ కంచుకోటగా ఉన్న డోన్ నియోజకవర్గంలో తమ పార్టీ ఉనికిని చాటుకునేందుకు టీడీపీ నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
నియోజకవర్గంలో కేఈ కృష్ణమూర్తి కుటుంబానికి కొంత పట్టు ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి కృష్ణమూర్తి సోదరుడు ప్రతాప్ పోటీ చేసి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చేతిలో ఓడిపోయారు. అప్పటినుంచి ఆయన పార్టీకి అంటీముట్టనట్లు వ్యవహరిస్తుండటంతో ఇన్‌చార్జిగా తప్పించి కేఈ ప్రభాకర్‌ను అధిష్టానం నియమించింది. కొంతకాలం తర్వాత ప్రభాకర్‌ను కూడా తప్పించి కేఈ వర్గానికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ధర్మవరం సుబ్బారెడ్డిని ఇన్‌చార్జిగా నియమించింది. ఆయన నియామకాన్ని కేఈ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అతడికి టికెట్ ఇస్తే సహకరించే ప్రసక్తే లేదని తేల్చి చెబుతోంది.
బీసీ ప్రోద్బలంతోనే గ్రూపు రాజకీయాలు
నంద్యాల జిల్లా టీడీపీకి బీసీ జనార్దన్‌రెడ్డి పెద్ద దిక్కుగా మారారు. ఆర్థికంగా బలంగా ఉండడంతో మిగిలిన నాయకులు బీసీ నిర్ణయాలకు అడ్డు చెప్పడానికి సాహసించడం లేదు. తమకు చెప్పకుండా నియోజకవర్గ ఇన్‌చార్జిగా సుబ్బారెడ్డిని ప్రకటించడం వెనక బీసీ జనార్దన్‌రెడ్డి ప్రమేయం ఉన్నట్లు కేఈ, కోట్ల వర్గాలు బాహాటంగానే విమర్శిస్తున్నాయి. బీసీ ప్రోద్బలంతోనే సుబ్బారెడ్డి గ్రూపు రాజకీయాలకు తెరతీశారని మండిపడుతున్నాయి.
నువ్వొస్తే మర్యాదగా ఉండదు
గత ఆదివారం పత్తికొండలో జరిగిన ‘రా.. కదిలిరా’ సభకు బీసీ జనార్దన్‌రెడ్డి, ధర్మవరం సుబ్బారెడ్డికి మినహా మిగిలిన నంద్యాల జిల్లా నాయకులకు ఆహ్వానం అందింది. ఒకవేళ ఆహ్వానం లేకున్నా సభకు వస్తే మర్యాద దక్కదని పత్తికొండ టీడీపీ ఇన్‌చార్జి కేఈ శ్యాంబాబు హెచ్చరించారు. దీంతో చేసేదిలేక ఇద్దరు నేతలు సభకు హాజరుకాలేదు. సభ ముగిశాక చంద్రబాబు అక్కడే సమీక్ష సమావేశం నిర్వహించారు. అసంతృప్తితో ఉన్న నాయకులను పిలిచి మాట్లాడారు. కానీ, డోన్ పంచాయితీని మాత్రం ఆయన పట్టించుకోలేదు. ఇన్‌చార్జిగా ఉన్న సుబ్బారెడ్డికి సహకరించాలని అటు కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డికి కానీ ఇటు కేఈ కుటుంబానికి కానీ చంద్రబాబు సూచించకపోవడంతో ఈ అంశంపై నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ సాగుతోంది.
కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి ఇస్తేనే సహకరిస్తాం
డోన్ టికెట్ కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి ఇస్తేనే తాము సహకరిస్తామని కేఈ కుటుంబం చంద్రబాబుకు స్పష్టం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన ఈ నాలుగున్నరేళ్లలో డోన్ నియోజకవర్గ రూపురేఖలు మారిపోయాయి. దాదాపు రూ.2,500 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో డోన్ బరిలో టీడీపీ తరఫున ఎవరు పోటీ చేసినా ఓటమి ఖాయమనే నిర్ణయానికి ఆ పార్టీ నాయకులు వచ్చారు. ఎమ్మిగనూరు నుంచి తనకు అవకాశం ఇవ్వాలని కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కోరినా చంద్రబాబు సానుకూలంగా స్పందించకపోవడంతో అసంతృప్తితో ఉన్నారు. అయినప్పటికీ చేసేదేమీ లేక ఓడిపోయే డోన్ నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది.
మూడేళ్లుగా భారీ ఖర్చు
నియోజకవర్గ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మూడేళ్లుగా టీడీపీ కార్యక్రమాలను ధర్మవరం సుబ్బారెడ్డి చేపడుతూ వస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే రూ.నాలుగు కోట్ల వరకు ఖర్చు చేసినట్లు ఆయన తన అనుచరుల వద్దే ప్రస్తావిస్తున్నారు. చంద్రబాబు, లోకేశ్ ఇద్దరూ తనకే టికెట్ ఇస్తామని చెప్పడంతోనే తాను ఖర్చు చేశానని, ఇప్పుడు టికెట్ విషయంలో మీన మీషాలు లెక్కిస్తుండడంతో ఏంచేయాలో అర్థం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేయడం సుబ్బారెడ్డి వంతైంది. మరోవైపు చంద్రబాబు ఖాతాలో మరో వికెట్ పడిపోయిందని ఆ పార్టీ కార్యకర్తలే చర్చించుకోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment