టీడీపీలో చల్లారని టికెట్ మంటలు
చంద్రబాబు బుజ్జగించినా ససేమిరా అంటూ పోటీకి సిద్దం
తనకి తప్ప ఎవరికీ సీటిచ్చినా ఓడిస్తానంటున్న బోడె ప్రసాద్
త్రిశంకు స్వర్గంలో కళా వెంకట్రావు, గంటా, బండారు
అమలాపురంలో జనసేన నాయకుడు ఆత్మహత్యాయత్నం
సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్: టీడీపీ టికెట్ల మంటలు ఇప్పట్లో చల్లారేలా లేవు. టికెట్లు రాని టీడీపీ సీనియర్లు రగిలిపోతున్నారు. చంద్రబాబుపై తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. పొత్తులు, సామాజిక సమీకరణాల పేరుతో తమ గొంతు కోశారని మండిపడుతున్నారు. పలు నియోజకవర్గాల్లో ఆందోళనలు, నిరసనలతో హోరెత్తిస్తున్నారు. చంద్రబాబు తన వద్దకు పిలిపించుకుని బుజ్జగించినా వారు వినడంలేదు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివరామరాజు ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఆయనకు సర్దిచెప్పేందుకు టీడీపీ ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. కృష్ణా జిల్లా పెడన సీటును ఇవ్వకపోవడంతో ఆగ్రహంతో ఉన్న మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్ తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. ఉత్తరాంధ్రలో కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తిలు సీటు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
పెందుర్తి సీటును జనసేనకు కేటాయించడాన్ని తప్పుపడుతూ బండారు సత్యనారాయణమూర్తి ఎవరికీ అందుబాటులోకి లేకుండాపోయారు. ఎచ్చెర్ల సీటును కళా వెంకట్రావుకు ఇవ్వడానికి అంగీకరించకపోవడంతో ఆయన భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది. గంటా శ్రీనివాసరావు అడుగుతున్న సీటును ఇవ్వకపోవడంతో ఆయన ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. కళా వెంకట్రావు, గంటాను విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని చంద్రబాబు చెప్పగా.. ఆ సీటు ఆశిస్తున్న కిమిడి నాగార్జున అసంతృప్తితో రగిలిపోతున్నారు.
మైలవరం, పెనమలూరులో తేలని పంచాయితీ
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పెనమలూరు, మైలవరం సీట్లు కాకరేపుతున్నాయి. పెనమలూరు సీటు ఇవ్వడంలేదని చెప్పడంతో మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు ప్రచారం కూడా ప్రారంభించారు. ఆ సీటు దేవినేనికి ఇస్తారని ప్రచారం జరుగుతుండడంతో ఆయన మండిపడుతున్నారు.
మైలవరం వసంత కృష్ణప్రసాద్‌కి ఇస్తానని చెప్పినా ఖరారు చేయకపోవడం, దేవినేని, వసంత మధ్య పోటీ పెట్టడంతో అక్కడ గందరగోళం నెలకొంది. అనంతపురం జిల్లా ధర్మవరం సీటును బీజేపీకి ఇవ్వడాన్ని పరిటాల శ్రీరామ్ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వరదాపురం సూరికి తన సీటు ఇవ్వడాన్ని శ్రీరామ్ తప్పుపడుతున్నారు.
టీడీపీ, జనసేన మధ్య తేలని పంచాయితీ
అమలాపురం నియోజకవర్గంలో టీడీపీ–జనసేన మధ్య వివాదం రోడ్డున పడింది. టికెట్ జనసేనకే ఇవ్వాలని ఆ పార్టీ నియోజకవర్గ నాయకులు రెండు రోజులుగా అమలాపురంలో ఆందోళన చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థిగా అయితాబత్తుల ఆనందరావు, మాజీ ఎంపీ బుచ్చి మహేశ్వరరావు కుమార్తె పాము సత్యశ్రీ పేరుపై అభిప్రాయ సేకరణ చేపట్టారు.
మరోవైపు సీటు తమకే ఇవ్వాలంటూ జనసేన నేతలు, కార్యకర్తలు అమలాపురంలో రోడ్డెక్కారు. అమలాపురం గడియారం స్తంభం సెంటర్‌లో జరిగిన ధర్నాలో పార్టీ అల్లవరం మండల అధ్యక్షుడు బాలయోగిఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్యహత్యాయత్నానికి పాల్పడ్డారు. అప్రమత్తమైన తోటి నాయకులు, కార్యకర్తలు బాలయోగిని అడ్డుకున్నారు.
రాజోలులో రోడ్డెక్కిన జనసేన
బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో జనసేన పార్టీ శనివారం రోడ్డెక్కింది. పార్టీ టికెట్ దేవ వరప్రసాద్‌కు ఇస్తారనే ప్రచారంతో ఆందోళన నిర్వహించారు. స్థానికుడు కాని వరప్రసాద్‌కు టికెట్టు ఇస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. బొంతు రాజేశ్వరరావుకే టికెట్టు ఇవ్వాలని నినాదాలు చేశారు. పార్టీ నాయకులు మలికిపురం కూడలి వరకూ ర్యాలీ నిర్వహించారు.
బండారుకు టికెట్ ఇవ్వాల్సిందే..
పెందుర్తి టికెట్‌ను టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి కేటాయించాలని పార్టీ కార్యకర్తలు శనివారం వెన్నలపాలెంలో నిరసన చేపట్టారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద బండారుకు అనుకూలంగా నినాదాలు చేశారు.
గౌరవం లేని చోట ఉండను
గౌరవం లేనిచోటు ఉండకూడదని నిర్ణయించుకున్నానని, అవమానాల మీద అవమానాలు భరించలేనని సూళ్లూరుపేట టీడీపీ నేత వేనాటి రామచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో లోకేశ్ జోక్యం పెరిగాక తన సొంత సామాజికవర్గాన్ని పెంచుకునేందుకు తమను అవమానాలకు గురి చేస్తున్నారని అన్నారు. శనివారం సూళ్లూరుపేట టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ 42 ఏళ్లుగా టీడీపీకి సేవచేశామన్నారు. టీడీపీలో కులపిచ్చి పెరగడం వల్ల ఇమడలేని పరిస్థితుల్లో పార్టీని వీడుతున్నట్లు చెప్పారు.
గుమ్మనూరుకు టికెట్ ఇస్తే సహించేది లేదు: జితేంద్రగౌడ్
ఎక్కడి నుంచో వచ్చి నియోజకవర్గంలో పెత్తనం చెలాయిస్తామంటే సహించబోమని, మాజీ మంత్రి గుమ్మనూరుకు టికెట్ ఇస్తే ఊరుకునేది లేదని అనంతపురం జిల్లా గుంతకల్లు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్.జితేంద్రగౌడ్ హెచ్చరించారు. శనివారం గుంతకల్లులో మాట్లాడుతూ.. ఈ ఐదేళ్లు టీడీపీ కోసం కష్టపడ్డామని, ఇందుకు గుర్తింపుగా గుంతకల్లు అసెంబ్లీ టికెట్ ఇస్తారన్న ఆశాభావంతో ఉన్నానన్నారు.
చేనేతలకు అన్యాయం: నిమ్మల
చేనేతలకు సీట్ల కేటాయింపులో చంద్రబాబు అన్యాయం చేశారని మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం శ్రీసత్యసాయి జిల్లా గోరంట్లలో
హిందూపురం పార్లమెంట్ పరిధిలోని పలు మండలాలకు చెందిన టీడీపీ ముఖ్య నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. నిమ్మలకు టికెట్ నిరాకరించడాన్ని నాయకులు తప్పుబట్టారు. టికెట్ ఇవ్వని పక్షంలో పార్టీకి రాజీనామా చేసి.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment