ఆదోని బీజేపీ అభ్యర్థిగా పార్థసారథి
నిర్వేదంలో మీనాక్షినాయుడు.. ఇండిపెండెంట్‌గా పోటీ చేసే యోచన!
సాక్షి ప్రతినిధి కర్నూలు: ఆదోని అసెంబ్లీ సీటుపై టీడీపీ, బీజేపీ బేరసారాలు ఫలించలేదు. రూ.3 కోట్లు ఇస్తే ఆదోని సీటు వదులుకుంటామని బీజేపీ చేసిన ప్రతిపాదనకు టీడీపీ నేతలు అంగీకరించకపోవడంతో తప్పని పరిస్థితుల్లో ఆదోని నుంచి బీజేపీనే పోటీ చేయాల్సిన అనివార్య పరిస్థితి తలెత్తింది. దీంతో ఆ పార్టీ పార్థసారథిని అభ్యర్థిగా ప్రకటించింది. వాస్తవానికి 15 రోజుల ముందే ఆదోని స్థానం బీజేపీ ఖాతాలోకి చేరిందనే విషయం మీనాక్షినాయుడుకు తెలుసు. దీంతో ఆయన అనుచరులు టీడీపీ ఫ్లెక్సీలు తొలగించారు.
ఈ క్రమంలో బీజేపీకీ అభ్యర్థి దొరకకపోవడంతో ఆ పార్టీ నేతలు మీనాక్షి నాయుడు మేనల్లుడు మారుతి నాయుడుకు ఫోన్ చేసి రూ.3 కోట్లు ఇస్తే ఆదోని సీటు వదులుకుని, ఆలూరు కావాలనే ప్రతిపాదనను పార్టీ అధిష్టానం ముందు ఉంచుతామని ఆఫర్ ఇచ్చారు. అయితే అంత డబ్బులు ఇవ్వలేమని మీనాక్షినాయుడు చెప్పడంతో బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది.
మీనాక్షినాయుడు రాజకీయ భవితవ్యం ఎటు?
కర్నూలు జిల్లా రాజకీయాల్లో మీనాక్షినాయుడు సీనియర్ నాయకుడు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్నారు. ఆదోని నుంచి మూడు దఫాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994, 1999, 2009లో వైఎస్సార్ ప్రభంజనంలోనూ ఆదోనిలో ఆయన విజయం సాధించారు. 1999లో కోట్ల సూర్యప్రకాశ్రెడ్డిపైనా గెలుపొందారు. టీడీపీ మినహా ఇతర పార్టీల్లోకి వెళ్లాలనే ఆలోచన కూడా చేయలేదు. టీడీపీని అంటిపెట్టుకుని ఆదోనిలో పార్టీ ఉన్నతికి తోడ్పడ్డారు.
చివరిసారిగా ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని లేదా తన తనయుడిని బరిలో నిలపాలని ఆయన అభిలషించారు. అలాంటి వ్యక్తిని కాదని పోటీ చేసేందుకు శక్తి లేక రూ.3 కోట్లకు సీటు వదలుకునేందుకు సిద్ధమైన పార్టీకి టీడీపీ అసెంబ్లీ సీటు ఇవ్వడాన్ని మీనాక్షినాయుడు జీర్ణించుకోలేకపోతున్నారని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఆయనకు టీడీపీ గౌరవం ఇవ్వలేనప్పుడు ఆయన పార్టీలో ఎందుకు కొనసాగాలనే చర్చ కూడా నడుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment