meenakshi naidu
-
బీజేపీ Vs టీడీపీ.. ఆదోనిలో రచ్చ రచ్చ
సాక్షి, కర్నూలు జిల్లా: ఆదోనిలో బీజేపీ ఎమ్మెల్యే, టీడీపీ మాజీ ఎమ్మెల్యే మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారధిపై మీనాక్షి నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు.‘‘ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తరువాత ఒకలా బీజెపి ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు. ఎమ్మెల్యే పార్థసారధి వైఖరి సరైంది కాదు. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి కూటమి ఎమ్మెల్యే అని మరచి పోతున్నాడు. ఎమ్మెల్యే పార్థసారథి వాస్తవాలు చెప్పాలి. ఏది పడితే అది చెబితే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ప్రభుత్వ కార్యక్రమాలకు నన్ను పిలువకుండా దూరం పెట్టారు. టీడీపీ వారికి ఏ పనులు చేయడం లేదు. ఇలాగే కొనసాగితే మున్ముందు ఇబ్బందులు పడాల్సి వస్తుందంటూ బీజేపీ ఎమ్మెల్యేకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు వార్నింగ్ ఇచ్చారు.టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడికి ఎమ్మెల్యే పార్థసారధి తిరిగి కౌంటర్ ఇస్తూ.. తాను చెప్పిందే వినాలి అన్నట్లు మీనాక్షి నాయుడు వ్యవహరిస్తున్నారని.. బీజేపీలో, జనసేనలో ఏ వర్గాలు లేవు. కాని టీడీపీలో ఐదు వర్గాలు ఉన్నాయి. పది శాతం తన గురించి ఆలోచిస్తే 90 శాతం బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తల గురించే ఆలోచిస్తాను. సమస్య అంతా మీనాక్షినాయుడుతోనే’’ అంటూ వ్యాఖ్యానించారు. ‘‘కూటమి కార్యకర్తలు, నాయకులు నిరుత్సాహంగా ఉన్నారు. కార్యక్రమాలకు నేను పిలుస్తున్నా వాళ్లే రావడం లేదని పార్థసారధి అన్నారు. -
మీనాక్షినాయుడు చెవిలో ‘పువ్వు’ !
సాక్షి ప్రతినిధి కర్నూలు: ఆదోని అసెంబ్లీ సీటుపై టీడీపీ, బీజేపీ బేరసారాలు ఫలించలేదు. రూ.3 కోట్లు ఇస్తే ఆదోని సీటు వదులుకుంటామని బీజేపీ చేసిన ప్రతిపాదనకు టీడీపీ నేతలు అంగీకరించకపోవడంతో తప్పని పరిస్థితుల్లో ఆదోని నుంచి బీజేపీనే పోటీ చేయాల్సిన అనివార్య పరిస్థితి తలెత్తింది. దీంతో ఆ పార్టీ పార్థసారథిని అభ్యర్థిగా ప్రకటించింది. వాస్తవానికి 15 రోజుల ముందే ఆదోని స్థానం బీజేపీ ఖాతాలోకి చేరిందనే విషయం మీనాక్షినాయుడుకు తెలుసు. దీంతో ఆయన అనుచరులు టీడీపీ ఫ్లెక్సీలు తొలగించారు. ఈ క్రమంలో బీజేపీకీ అభ్యర్థి దొరకకపోవడంతో ఆ పార్టీ నేతలు మీనాక్షి నాయుడు మేనల్లుడు మారుతి నాయుడుకు ఫోన్ చేసి రూ.3 కోట్లు ఇస్తే ఆదోని సీటు వదులుకుని, ఆలూరు కావాలనే ప్రతిపాదనను పార్టీ అధిష్టానం ముందు ఉంచుతామని ఆఫర్ ఇచ్చారు. అయితే అంత డబ్బులు ఇవ్వలేమని మీనాక్షినాయుడు చెప్పడంతో బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. మీనాక్షినాయుడు రాజకీయ భవితవ్యం ఎటు? కర్నూలు జిల్లా రాజకీయాల్లో మీనాక్షినాయుడు సీనియర్ నాయకుడు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్నారు. ఆదోని నుంచి మూడు దఫాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994, 1999, 2009లో వైఎస్సార్ ప్రభంజనంలోనూ ఆదోనిలో ఆయన విజయం సాధించారు. 1999లో కోట్ల సూర్యప్రకాశ్రెడ్డిపైనా గెలుపొందారు. టీడీపీ మినహా ఇతర పార్టీల్లోకి వెళ్లాలనే ఆలోచన కూడా చేయలేదు. టీడీపీని అంటిపెట్టుకుని ఆదోనిలో పార్టీ ఉన్నతికి తోడ్పడ్డారు. చివరిసారిగా ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని లేదా తన తనయుడిని బరిలో నిలపాలని ఆయన అభిలషించారు. అలాంటి వ్యక్తిని కాదని పోటీ చేసేందుకు శక్తి లేక రూ.3 కోట్లకు సీటు వదలుకునేందుకు సిద్ధమైన పార్టీకి టీడీపీ అసెంబ్లీ సీటు ఇవ్వడాన్ని మీనాక్షినాయుడు జీర్ణించుకోలేకపోతున్నారని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఆయనకు టీడీపీ గౌరవం ఇవ్వలేనప్పుడు ఆయన పార్టీలో ఎందుకు కొనసాగాలనే చర్చ కూడా నడుస్తోంది. -
ఎన్నికలు సమీపిస్తున్న వేళ మళ్లీ తెరపైకి..!
కొందరు నాయకులు వర్షా కాలంలో వచ్చే కప్పల్లా ఉంటారు. వర్షం పడిన వెంటనే కుప్పలుగా కప్పలు వస్తారు. బెకబెకమంటారు. అలాగే ప్రతిపక్షంలోని కొందరు నేతలు ఎన్నికలు వస్తున్నాయనగానే మేము వచ్చేశాం అంటారు. మీటింగ్‌లతో హల్ హల్ చేస్తుంటారు. ఓడిపోగానే మాయమైపోయి...ఎన్నికలు రాగానే ప్రత్యక్షమయ్యే వీరిని చూసి ప్రజల్లో ఉండే నాయకులకు మండుకొస్తుంది. ఇప్పుడు కర్నూల్ జిల్లాలో ఓ టీడీపీ నేత అలాగే ప్రత్యక్షం కావడంతో అక్కడి పార్టీ నేతలు ఖంగు తిన్నారు. ఇన్నాళ్ళు ఏమయ్యారంటూ నిలదీస్తున్నారు. ఇంతకీ ఆ నేత ఎవరు? ఆ నియోజకవర్గం ఏది? కర్నూలు జిల్లాలో ఆదోని రాజకీయాలే వేరులే అన్నట్లుగా సాగుతున్నాయి. 2014, 2019 ఎన్నికలలో వరుసగా రెండుసార్లు ఈ నియోజక వర్గం నుంచి వైఎస్సార్ సీపీ తరఫున ఎల్లారెడ్డి సాయిప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు . అంతకు ముందు టీడీపీ నేత మీనాక్షి నాయుడు కూడా రెండు సార్లు ఆదోని ఎమ్మెల్యేగా పనిచేశారు. టీడీపీ తరపున బరిలోకి దిగిన మీనాక్షినాయుడిని మూడుసార్లు ఓడించారు సాయిప్రసాద్ రెడ్డి. 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన తరువాత రాజకీయాల్లో మీనాక్షినాయుడి ఉనికి లేకుండా పోయింది. నియోజక వర్గంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు . క్యాడర్ కూడా మిన్నుకుండిపోయారు . ఎవరి దారి వారిదన్నట్లుగా కార్యకర్తలు చెల్లా చెదురయ్యారు. కుల మత ప్రాంత రాజకీయాలకు అతీతంగా వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను అందిస్తుండడంతో టీడీపీకి చెందిన చాలా మంది వైఎస్సార్సీపీలో చేరిపోయారు. దాంతో ఆదోని నియోజక వర్గంలో ఎల్లో పార్టీ జాడలు దాదాపు లేకుండా పోయాయి. ఎన్నికలలు సమీపిస్తున్న వేళ మళ్లీ తెరపైకి వచ్చాడు మీనాక్షి నాయుడు. ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ప్రెస్ మీట్లతో హడావుడి చేస్తున్నారు. ప్రజా సమస్యలు పట్టని నేతగా పేరు పొందిన ఆయన ...ఈ సారి టికెట్ కోసం హల్ చల్ చేయడంపై సొంతపార్టీ నేతలే కస్సుబస్సుమంటున్నారు . ఇన్నాళ్లు నియోజక వర్గంవైపు కన్నెత్తిచూడని మీనాక్షినాయుడు .. ఇప్పుడొచ్చి టికెట్ కోసం గంతులేయడమేంటని ఈసడించుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో మీనాక్షికి టికెట్ ఇస్తే సహకరించేది లేదని,నేరుగా చంద్రబాబుకే తెగేసి చెబుతున్నారట. నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా మీనాక్షినాయుడికి వ్యతిరేకంగా వ్యవహరించిన గుడిసెల కృష్ణమ్మ , మైనార్టీ నేత సౌదీ రవూఫ్ నారాలోకేష్ తో సపరేటుగా మంతనాలు చేస్తున్నట్టు సమాచారం. దాంతోటీడీపీ నేతలు రెండువర్గాలుగా చీలిపోయి తెరవెనుక పావులు కదుపుతున్నారు . మీనాక్షినాయుడికి చెక్ పెట్టడానికి బీసీ , మైనార్టీ నేతలు గట్టిగనే ఉన్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే కమ్మ సామాజిక వర్గానికి చెందిన మీనాక్షి నాయుడికి టీడీపీ అధిష్టానం టికెట్ కేటాయిస్తుందా ? లేదా బిసిల వైపు చంద్రబాబు మెగ్గుచూపుతారా ?అన్న అంశం తేలాల్సి వుంది. -
ఆదోని పై పట్టెవరిది !
సాక్షి, అమరావతి : పూర్వం దక్షిణాది ధాన్యం మార్కెట్‌గా వెలుగొంది.. ఇప్పుడు దుస్తులు, బంగారం మార్కెట్‌కు కేంద్రంగా విరాజిల్లుతున్న ఆదోనికి ఘనమైన చారిత్రక నేపథ్యమే ఉంది. రెండో ముంబైగా వినుతికెక్కిన ఈ ప్రాంతం 16వ శతాబ్దములో యాదవుల పాలనలో ఉండేది. అప్పుట్లో దీనిపేరు యాదవగిరి. ముస్లింల పాలనలో ఆదవోని అయ్యింది. కాలక్రమంలో ఆదోనిగా రూపాంతరం చెందింది. బ్రిటిష్ పాలనలో మద్రాసు ప్రెసిడెన్సీలోని బళ్లారి జిల్లాలో భాగంగా ఉండేది. 1952లో ఏర్పడిన ఆదోని నియోజకవర్గానికి ఇప్పటివరకు 14సార్లు ఎన్నికలు జరగ్గా.. ఆరుసార్లు కాంగ్రెస్, నాలుగుసార్లు టీడీపీ, ఒకసారి స్వతంత్ర, ఒకసారి ప్రజా సోషలిస్ట్ పార్టీ, ఒకసారి వైఎస్సార్ సీపీ గెలుపొందాయి. ఈ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే వై.సాయి ప్రసాద్‌రెడ్డి (వైఎస్సార్ సీపీ), కొంకా మీనాక్షినాయుడు (టీడీపీ) తలపడుతున్నారు. ఇక్కడి ఓటర్లు వైవిధ్యమైన తీర్పునిస్తూ ప్రతి ఎన్నికలోనూ ఆసక్తి గొలుపుతూ ఉంటారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానితో సంబంధం లేకుండా.. తమకు నచ్చిన, ఎప్పుడూ అండగా, అందుబాటులో ఉండే అభ్యర్థికే ఓట్లు వేసి ఎమ్మెల్యే గిరీని కట్టబెడుతుంటారు. ఈ ఎన్నికలలో జనసేన, బీజేపీ అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నప్పటికీ వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఎల్లారెడ్డిగారి సాయి ప్రసాద్‌రెడ్డి, టీడీపీ అభ్యర్థి కొంకా మీనాక్షినాయుడు మధ్యే ప్రధాన పోటీ ఉంది. టీడీపీ అభ్యర్థి కొంకా మీనాక్షినాయుడు గతంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించలేదనే విమర్శలు ఉన్నాయి. నాలుగు కాలాలపాటు ప్రజలకు గుర్తుండిపోయే ఒక్క పనీ చేయలేదనే అసంతృప్తి ప్రజల్లో ఉంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఎల్లారెడ్డిగారి సాయిప్రసాద్‌రెడ్డి హయాంలో పలు శాశ్వత పథకాలు ఆవిష్కారమయ్యాయి. ఎప్పుడూ ప్రజల మధ్య ఉంటూ సమస్యల పరిష్కారానికి ఆయన కృషి చేశారనే విశ్వాసం ఓటర్లలో ఉంది. దీంతో ఈసారి ఎన్నికలో సాయిప్రసాద్‌రెడ్డి విజయం నల్లేరుమీద నడకే అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. సైకిల్‌కు ఎదురు గాలి.. టీడీపీ అభ్యర్థి మీనాక్షినాయుడుతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టణంలో టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పరిశ్రమల ఏర్పాటుతో ఆదోనికి పూర్వ వైభవాన్ని తెస్తామని చెప్పారు. పట్టణంతోపాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని చెప్పారు. ఏ ఒక్కటీ పరిష్కారం కాలేదు. మండగిరి నీటి పథకాల నిర్మాణం నత్తను తలపిస్తోంది. రాష్ట్రంలో అత్యంత పురాతనమైన మున్సిపాల్టీల్లో ఒకటైన ఆదోనిలో ఆక్రమణలతో రోడ్లు కుంచించుకుపోయాయి. రోజు, రోజుకు జఠిలమవుతున్న ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు నిత్య నరకం చూస్తున్నారు. రోడ్లు విస్తరణ చేపడతామని, వైఎస్ఆర్ హయాంలో మంజూరు అయి, మూడింట ఒకవంతు మిగిలిపోయిన బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని కూడా ముఖ్యమంత్రితోపాటు టీడీపీ అభ్యర్థి కూడా ప్రజలకు మాట ఇచ్చారు. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. తుంగభద్ర దిగువ కాలువ ద్వారా 8 గ్రామాలకు మాత్రం సాగునీటి సదుపాయం ఉంది. మిగిలిన 32 గ్రామాల రైతులు వర్షాధారంగా పంటలు సాగు చేస్తున్నారు. కాలువను విస్తరించి తమ గ్రామాలకు కూడా సాగునీటి సదుపాయం కల్పించాలనే డిమాండ్ ఉంది. ఆ దిశగా ప్రతిపాదనలు ఏవీ లేవు. ప్రభుత్వ వైఫల్యాలు, నెరవేరని హామీలతో టీడీపీకి నియోజకవర్గంలో ఎదురు గాలి వీస్తోంది. ఎన్నో పథకాలు.. వైఎస్సార్ సీపీ అభ్యర్థి సాయిప్రసాద్‌రెడ్డి పలు శాశ్వత పథకాలు తెచ్చారు. ఆదోని పట్టణంలో రూ.32 కోట్లతో తాగునీటి పథకం మంజూరు చేయించారు. కుప్పగల్లు వద్ద రూ.8 కోట్లతో రెండు నీటి పథకాలు, తుంగభద్ర దిగువ కాలువ ఆధునికీకరణ, పట్టణానికి బైపాస్ రోడ్డు, విక్టోరియా పేట, ఇస్వి ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు ఉన్నాయి. మున్సిపాల్టీలో 23 మంది కౌన్సిలర్లు, రూరల్‌లో 28 మంది తాజా మాజీ సర్పంచ్‌లు, 18 మంది ఎంపీటీసీలతో పాటు పార్టీకి పటిష్టమైన కేడర్ ఉంది. ఇటీవల నియోజకవర్గంలో పర్యటించిన పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు పలు వరాలు ప్రకటించారు. దీంతో నియోజకవర్గంలో ఫ్యాన్ గాలి జోరుగా వీస్తున్నట్టు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. -
మీనాక్షి సమేత
భూ కబ్జాలు.. సెటిల్మెంట్లు.. మట్కా నిర్వాహకులతో మామూళ్లు.. పేకాటలో వాటాలు.. కల్తీ లిక్కర్ వ్యాపారంలో పర్సెంటేజీలు.. గుట్కా దందాలో వసూళ్లు.. అక్రమార్జనకు ఏదీ అడ్డు కాదని అన్నింటిలో భాగస్వామ్యం అవుతూ అందినకాడికి దోచుకుంటున్నారు ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు బ్రదర్స్. సెకండ్ ముంబాయిగా ఖ్యాతి పొందిన ప్రాంతం ఆదోని. జిల్లా సరిహద్దులో పారిశ్రామిక కేంద్రంగా.. వ్యాపార పట్టణంగా విరాజిల్లింది. ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు తిరోగమనంలో పయనిస్తూ చీకటి సామ్రాజ్యానికి కేరాఫ్ అడ్రెస్‌గా మారుతోంది. ఇదంతా అధికార పార్టీ అన్నదమ్ముల పుణ్యమేనని చెప్పక తప్పుదు. కుటుంబ స‘మేత’ంగా దోపిడీకి పాల్పడుతూ అసాంఘిక శక్తుల అడ్డాగా మార్చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, కర్నూలు : జిల్లాలో వెనుకబడిన ప్రాంతమైన ఆదోని నియోజకవర్గం అధికారపార్టీకి చెందిన ఇన్చార్జ్ మీనాక్షినాయుడి వ్యవహారంతో మరింత వెనుకబాటు ప్రాంతంగా మారిపోతోంది. అన్న ‘అధికారం’తో తమ్ముడు ఉమాపతి పెత్తనం సాగిస్తున్నారు. నియోజకవర్గంలో కొత్త ప్రాజెక్టును కూడా తెచ్చేందుకు కృషి చేయని మీనాక్షినాయుడు అధికారం మాత్రం అన్ని రంగాల్లో చెలాయిస్తున్నారు. మూతపడిన పత్తి మిల్లులు, ఆయిల్ మిల్లులను తెరిపించేందుకు ఏ మాత్రమూ కృషి చేయని నేతలు...మట్కా, పేకాటకు మాత్రం కేంద్రంగా మార్చేశారు. వివాదాలు ఉన్న భూములను తక్కువ ధరకే కొనుగోలు చేయడం...అధిక ధరకు విక్రయిస్తూ రియల్ ఎస్టేట్ కింగ్‌గా మారుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత... అవినీతికి అంతేలేకుండా పోయింది. ఇందుగలదు..అందులేదు అన్న చందంగా అవినీతి వ్యవహారం మారిపోయింది. విద్యుత్‌శాఖలో ఆపరేటర్ల పోస్టులకు కూడా రూ. లక్షల్లో మాముళ్లు వసూలు చేస్తున్నారు. ఈ కోవలోనే ఆదోని నియోజకవర్గంలో ఎక్కడ కొత్త సబ్‌స్టేషన్ ఏర్పాటైతే... అక్కడ నలుగురిని నియమించేం దుకు రూ.2 లక్షలు మొదలుకుని రూ.5 లక్షల వరకూ వసూలు చేశారు. ఇక ఆదోని ఆసుపత్రిలో వివిధ విభాగాల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల నియామకాల్లో అధికార తెలుగుదేశం పార్టీ నేతలు భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. మునిసిపాలిటీలో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలోనూ ఒక్కో పోస్టు రేటు కట్టి దోచుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి కూడా పోస్టుల కోసం పైసలు వసూలు చేయడాన్ని ఆ వర్గాలు మండిపడుతున్నాయి. అంతేకాకుండా వ్యవసాయ మార్కెట్లో కొత్తగా షాపుల నిర్మాణం జరిగింది. ఈ షాపుల కేటాయింపులోనూ భారీగా తెలుగు తమ్ముళ్లు కాస్తా వసూళ్లకు తెగబడ్డారు. షాపునకు రూ. 2 లక్షల చొప్పున వారికి ముట్టచెప్పిన వ్యాపారులకే షాపులు కేటాయించారన్న ఆరోపణలు వచ్చాయి. నీరు.. చెట్టులో పర్సెంటేజీల పర్వం ఆదోని నియోజకవర్గంలో మొత్తం రూ.20 కోట్ల వరకూ నీరు–చెట్టు కింద పనులు చేపట్టారు. నియోజకవర్గంలో ఎక్కడెక్కడో ఉన్న చెరువులను వెలికితీసి మరీ పనులకు ప్రతిపాదించారు. ఇందులో ఎక్కడా పూడికతీత సరిగా చేయలేదు. ఇక చెక్‌డ్యాంల నిర్మాణం పేరుతో కేవలం లోపల ఇసుక బస్తాలతో నింపి మరీ చెక్‌డ్యాంల నిర్మాణాన్ని చేపట్టారు. ఈ పనులన్నీ పార్టీలోని నేతలు, కార్యకర్తలకు అప్పగించారు. అయినప్పటికీ వీరంతా కూడా అధికారపార్టీ ముఖ్యనేతలకు కమీషన్లు సమర్పించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విధంగా ఏకంగా 30 శాతం మేర కమీషన్ దండుకున్నారనే విమర్శలు ఉన్నాయి. తద్వారా కేవలం నీరు–చెట్టు పనుల ద్వారా రూ.6 కోట్ల మేర ఆర్జించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక పాత చెక్‌డ్యాంల మరమ్మతును కేవలం పైపైన సిమెంట్ పైపూతతో సరిపుచ్చారు. వంకలు, చెరువుల్లో నిర్ధిష్ట ప్రమాణాల మేరకు పూడిక తీయకుండా బిల్లులు చేయించుకున్నారు. ఇక పనులు చేసిన వారు కూడా రూ.4 కోట్ల మేర ఆర్జించుకున్నారు. తద్వారా కేవలం సగం మొత్తానికి కూడా నీరు–చెట్టు పనులు జరగని దుస్థితి నెలకొని ఉంది. చీకటి వ్యాపారాలకు అండ.. జిల్లాలో పేకాట, మట్కాకు ఆదోని నియోజకవర్గం కేంద్రంగా మారింది. కర్నూలులో ఉన్న మట్కాడాన్ తర్వాత.... ఆదోనిలో ఏకంగా మట్కాడాన్లు ఉన్నారు. వీరికి పూర్తిగా అధికారపార్టీ అండదండలు ఉన్నాయి. దీంతో వీరిని అరెస్టు చేసే ధైర్యం అధికారులు చేయడం లేదు. కొద్దిరోజుల క్రితం కేవలం నామమాత్రంగా అరెస్టు చూపించి... తిరిగి వదిలేశారన్న విమర్శలు ఉన్నాయి. మరోవైపు ఈ మట్కా నిర్వాహకులకు ప్రతీ నెలా మాముళ్ల రూపంలో అధికారపార్టీ ముఖ్యనేతలకు మాముళ్లు అందిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆదోని పట్టణంలో పేకాట వ్యవహారం కూడా జోరుగా సాగుతోంది. పేకాట నిర్వాహకుల నుంచి కూడా భారీగా నెలవారీ మాముళ్లు కాస్తా అధికారపార్టీ ముఖ్యనేతలకు అందుతున్నాయి. ఫలితంగా పేకాటను కూడా అరికట్టేందుకు అధికారులు ముందుకురావడం లేదన్న విమర్శలు ఉన్నాయి. నాటుసారా వ్యవహారం కూడా ఇక్కడ జోరుగా సాగుతోంది. నాటుసారా కాసే వారికి కూడా వీరి అండదండలు పుష్కలంగా ఉన్నాయి. కర్ణాటకకు సరిహద్దులో ఉన్న నియోజకవర్గం కావడంతో కల్తీ లిక్కరు వ్యవహారం మరింత జోరుగా సాగుతోంది. ఈ కల్తీ లిక్కరు వ్యాపారంలో అధికారపార్టీ నేతలకు కూడా హస్తం ఉంటోంది. ఈ నేపథ్యంలో కర్నాటక నుంచి భారీగా కల్తీ లిక్కరు తెచ్చి... ఇక్కడ విక్రయిస్తున్నారు. అయినప్పటికీ ఎక్సైజ్ అధికారులు మిన్నకుండిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. మట్కా, పేకాట, నాటుసారా, కల్తీ లిక్కరు వ్యాపారస్తుల నుంచే ఆదోనిలోని అధికారపార్టీ నేతలకు నెలకు ఏకంగా రూ.20 లక్షల వరకూ అందుతోందని తెలుస్తోంది. అంటే ఏడాదికి ఏకంగా రూ.2.4 కోట్ల మేర వీరికి ఆదాయం వస్తోంది. దీనికితోడుగా గుట్కా వ్యాపారదందా కూడా జోరుగానే సాగుతోంది. తమ్ముళ్ల రియల్ దందా ఆదోని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్గా ఉన్న మీనాక్షి నాయుడు అండతో తమ్ముళ్లు భూకబ్జాలతో రెచ్చిపోతున్నారు. నియోజకవర్గంలో ఎక్కడపడితే అక్కడ కబ్జాలు చేసేస్తున్నారు. ప్రధానంగా వివాదాలు ఉన్న భూములను తక్కువ ధరకే తీసుకుంటున్నారు. ఒకవేళ వివాదాలు లేకపోతే వివాదాలు సృష్టించి మరీ భూములను తక్కువ ధరకే తమకు ఇచ్చేలా చేసుకుంటున్నారు. ప్రధానంగా మీనాక్షినాయుడు సోదరుడు ఉమాపతి ఆధ్వర్యంలోనే దందా నడుస్తోంది. ఆదోని మండలంలోని బైచిగేరి గ్రామ పరిధిలో సర్వేనం.92లో 20ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని విశాఖ పట్టణానికి చెందిన వెల్ఫేర్బిల్డర్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కొనుగోలుచేసి ప్లాట్లు వేసింది. ఆ భూమిని 2013లో ఉమాపతి బినామీ పేరిట రూ.92లక్షలకు కొనుగోలు చేశారు. అయితే ప్లాట్లు కాకుండా వ్యవసాయ భూమిగా చూపించడంతో రిజిస్ట్రేషన్ శాఖకు దాదాపు రూ.12 లక్షలు స్టాంప్ డ్యూటీ గండి పడింది. రిజిస్ట్రేషన్ శాఖ ఆడిట్ అధికారులు అక్రమాలను గుర్తించి నోటీసు జారీ చేశారు. ప్రస్తుతం విచారణలో ఉంది. పట్టణానికి చెందిన కొడాలి రాజు, మరి కొంత మంది కొన్నేళ్ల క్రితం 70 సెంట్ల భూమి ఎమ్మిగనూరు – ఆస్పరి బైపాస్ రోడ్డులో కొన్నారు. భూమి విలువ రూ.కోట్లలో ఉంది. భాగస్వాముల మధ్య వివాదం ఉంది. వివాదాన్ని ఉమాపతి తనకు అనుకూలంగా మలుచుకున్నట్లు తెలుస్తోంది. వివాదాన్ని మరింత జటిలం చేసి అతి తక్కువ ధరకే ఆయన బినామీ పేరిట సొతం చేసుకున్నాడు. ట్టణ శివారులోని సాదాపురం గ్రామ పంచాయతీ పరిధిలో సర్వేనం.352లో 6.74 ఎకరాల భూమి పట్టణంలో నివాసమున్న సమీప బంధువు హమీద్, హబీద్ పేరిట ఉంది. ఇందులో హమీద్పేరిట 2 ఎకరాలు కాగా, హబీద్పేరిట 4.50 ఎకరాలు ఉంది. ఇరువురు కలిసి 277 ప్లాట్లు ఏర్పాటు చేసి ఇతరులకు అమ్మారు. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చాక 5 ఎకరాలకు పైగా భూమిని టీడీపీ నాయకుడు ఉమాపతి ముగ్గురు ఎస్సీల పేరిట కబ్జా చేశారు. అడంగల్‌లో రికార్డులు మార్పించారు. భూ యజమానులు, ప్లాట్లు కొన్నవారు న్యాయం చేయమని అడిగితే ఎస్సీ కేసుల పేరుతో భయపెడుతున్నారు. దీంతో భూ యజమానులతో పాటు ప్లాట్లు కొన్నవారు కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఎస్.కొండాపురం గ్రామ పరిధిలో ఆరు ఎకరాల సీలింగ్ భూమి ఉంది. అధికారంలోకి రాగానే ఆ భూమిని పట్టణానికి చెందిన ఓ టీడీపీ కార్యకర్త ఇంట్లో మహిళల పేరిట పంపిణీ చేశారు. అయితే ఆ మహిళలు వ్యయవసాయ దారులు కాదు. సీలింగ్ ల్యాండ్ పంపిణీకి పాటించాల్సిన నిబంధనలు ఏవీ పాటించలేదు. గుట్టు చప్పుడు కాకుండా ఆ భూమిని సొంతం చేసుకున్నారు. దీని వెనుక టీడీపీ నాయకుడు ఉమాపతి హస్తం ఉన్నట్లు విమర్శలు ఉన్నాయి. ఆ భూమి పక్కనే ఉమాపతి సమీప బంధువు బలరామ చౌదరికి చెందిన క్రస్సింగ్ యూనిట్ ఉంది. టీడీపీ కార్యకర్తల పేరిట భూమి సొంతమై నాలుగేళ్లు అవుతున్నా అందులో ఇంతవరకు ఏ పంట సాగు చేయలేదు. అవినీతికి అధిపతి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలచేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేల కంటే కూడా తమ పార్టీకి చెందిన ఇన్‌చార్జ్‌లకే పెత్తనం కట్టబెట్టింది. ఆదోని నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ప్రజల మద్దతుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున సాయిప్రసాద్ రెడ్డి గెలుపొందారు. అయితే, నియోజకవర్గంలో మాత్రం పెత్తనమంతా అధికార పార్టీకి చెందిన నేతల చేతుల్లోనే ఉంచారు. ఇక్కడ ఇన్చార్జ్గా ఉన్న మీనాక్షి నాయుడు చేతిలో అధికారం ఉంది. అయితే, పెత్తనం మాత్రం అంతా ఆయన సోదరుడు ఉమాపతిదే సాగుతోంది. అధికారుల పోస్టింగ్స్ నుంచి వివిధ కాంట్రాక్టు పనుల వరకూ అంతా ఆయనే చేతి నుంచే నడుస్తోంది. అంతేకాకుండా నియోజకవర్గంలోని వివాదాలు ఉన్న భూములను తక్కువ ధరకే కొంటున్నారు. ఈ విధంగా తక్కువ ధరకే కొన్న భూములను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. తద్వారా రియల్ ఎస్టేట్ కింగ్‌గా మారుతున్నారు. అంతేకాకుండా అధికారులతోనేకాకుండా వివిధ వర్గాల ప్రజలతో కూడా సోదరుడి వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదమవుతోంది. వ్యాపారంలో ‘ఐపీ’ పాట ఆదోని నియోజకవర్గంలో పత్తి మిల్లులు అధికం. అంతేకాకుండా ఆదోని వ్యవసాయ మార్కెట్‌కు పత్తి పంట జిల్లా నుంచి భారీగా వస్తుంది. ఇక్కడ పత్తి వ్యాపారులు కూడా అధికమే. పత్తి మిల్లు వ్యాపారంలో ఉన్న మీనాక్షినాయుడు కుమారుడు కొందరి వ్యాపారుల ఉనంచి భారీగా పత్తిని కొనుగోలు చేశారు. ఆ తర్వాత వారికి బిల్లులు మాత్రం చెల్లించలేదు. దీంతో కొందరు బాధితులు ఏకంగా కేసు పెట్టే వరకూ వెళ్లారు. అయితే, అధికారం అండతో కేసులు నమోదుకాకుండా చేసుకున్నారు. అంతేకాకుండా బాధితుల్లో కేవలం కొద్ది మందికి మాత్రమే అప్పులు చెల్లించారు. ఇంకా అనేక మందికి కోట్లలో మొత్తం చెల్లించాల్సి ఉంది. అయినప్పటికీ వీరంతా ధైర్యంగా అడిగేందుకు సాహసించడం లేదు. ఎక్కడ అధికారం అండతో తమను ఇబ్బందులపాలు చేస్తారని ఆందోళన చెందుతున్నారు. పేదల కడుపుకొడుతున్నారు టీడీపీ నాయకులు అక్రమార్జన కోసం పేదల కడుపు కొడుతున్నారు. సాదాపురం గ్రామ పరిధిలోని సర్వే నం. 352లో దాదాపు 5 ఎకరాలకు పైగా భూమిని కబ్జా చేశారు. ఆ భూమిలో భూ యజమానులు ప్లాట్లువేసి పేదలకు అమ్మారు. కూలీనాలీ చేసుకుతినే వారు, కార్మికులు, చిరుద్యోగులు ప్లాట్లు కొన్నవారిలో ఉన్నారు. తాము కొన్నామని, న్యాయం చేయాలని అడిగితే ఎస్సీ కేసుల పేరిట బెదిరిస్తున్నారు. దౌర్జన్యం ఎక్కువ కాలం నడవదు. బాధితులు చేపట్టిన న్యాయ పోరాటానికి వైఎస్ఆర్సీపీ అండగా నిలుస్తుంది. మా పార్టీ అధికారంలోకి రాగానే పేదలకు న్యాయం చేస్తాం. – సాయిప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్యే సమగ్ర విచారణ జరిపించాలి పట్టణంలో అధికార పార్టీ నాయకులు పెద్ద ఎత్తున భూ కబ్జాలకు పాల్పడ్డారు. వారి కబ్జాలో పేదలకు తీవ్ర అన్యాయం జరిగింది. ముఖ్యంగా 352లో భూ యజమానులు హమీద్, హబీద్ ప్లాట్లు వేసి పేదలకు కంతుల ప్రకారం అమ్ముకున్నారు. మొత్తం భూమిలో 4 ఎకరాలు టీడీపీ నాయకులు కబ్జా చేయడంతో ఆ భూమిలో ప్లాట్లు కొన్నవారికి అన్యాయం జరిగింది. బాధితులతో కలిసి న్యాయం చేయాలని ఆందోళన చేస్తే ఎస్సీ కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్సీ దృష్టికి కూడా తీసుకెళ్లాను. ఉన్నత స్థాయి అధికారులతో విచారణ చేయిస్తే టీడీపీ నాయకుల కబ్జా భాగోతం వెలుగులోకి వస్తుంది – నూర్ అహ్మద్, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ -
సాయిప్రసాద్‌రెడ్డి హయాంలో అభివృద్ధి...మీనాక్షినాయుడు హయాంలో అధోగతి
ఆదోని, న్యూస్‌లైన్ : ఒక సువర్ణయుగం తర్వాత ఐదేళ్లపాటు అభివృద్ధి కుంటుపడింది. కొత్త పథకాలు లేవు.. ఉన్న పథకాలు సక్రమంగా అమలుకావు.. గ్రామాలు, పట్టణాల్లో సీసీ రోడ్లు, కాలువలు లేక వీధులన్నీ మురుగుకుంటలుగా మారా యి.. అర్హులైన వారు వందలసార్లు వినతులు ఇచ్చినా పింఛన్లు మంజూరు కాలేదు.. సమస్యలను పరిష్కరించి ప్రజా సంక్షేమానికి కృషి చేయాల్సిన ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వంపై సాకులు చెబుతూ చేతులు దులుపుకున్నాడు.. ఎమ్మెల్యేనే ప ట్టించుకోకపోవడంతో ప్రభుత్వమూ నియోజకవర్గ అభివృద్ధిని మరించింది.. ఇలాంటి దుస్థితి నెలకొన్నది ఆంధ్రా ముంబాయిగా పేరు గాంచిన ఆదోని నియోజకవర్గంలో.. అందుకే ప్రజలు ఈ సారిఎన్నికల్లో తమ సమస్యలను పరిష్కరించే నాయకుడి వెంట నడిచేందుకు సిద్ధమవుతున్నారు. 2004 నుంచి 2009 వరకు ఆదోని ఎమ్మెల్యేగా ఉన్న సాయిప్రసాద్‌రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించారు. నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని ఒప్పించి భారీ మొత్తంలో నిధులు విడుదల చేయించారు. దాదాపు రూ.120 కోట్లకుపైగా నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఆ సమయంలో జరిగిన అభివృద్ధి పనుల్లో ముఖ్యమైనవి - ఆదోని పట్టణంలో బైపాస్ రోడ్డుకు రూ.11 కోట్లు మంజూరు. దాదాపు 80 శాతం పనులు పూర్తి అయ్యాయి. - బళదూరు - ఆదోని మధ్య కాజ్‌వేను దాదాపు రూ.2.11 కోటత్లో పూర్తి చేశారు. ఇప్పడు వరద వచ్చినా రాకపోకలకు ఎలాంటి ఇబ్బందీ లేదు. - పెద్దహరివాణంలో రూ.26 లక్షలతో చేపట్టిన అదనపు ఎస్ఎస్ ట్యాంకు నిర్మా ణం వల్ల వేసవిలో నీటి ఎద్దడి తీరింది. - కుప్పగల్లు ప్రధాన కేంద్రంగా రూ.4.5 కోట్లతో తాగు నీటి పథకం నిర్మాణం చేపట్టారు. దీంతో కుప్పగల్లు, పాండవగల్లు, గణేకల్లు, బల్లేకల్లు, జాలిమంచి గ్రామాలకు రక్షిత మం చినీరు అందుబాటులోకి వచ్చాయి. - నాగ నాథనహళ్లి ప్రధాన కేంద్రంగా 12 గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చేం దుకు అవసరమైన తాగు నీటి పథకం నిర్మాణానికి రూ.14 కోట్లు మంజూరు అయ్యాయి. దీనివల్ల ఆదోని నియోజకవర్గంలోని నాగనాథనహళ్లి, ఢణాపురం, చాగి గ్రామాల ప్రజల దాహార్తి తీరింది. -జి.హొసళ్లి-బదినేహాలు గ్రామాల మధ్య రూ.1.3 కోట్లతో రోడ్డు నిర్మాణం చేపట్టడంతో కౌతాళం మండలంలోని కుంటనహాళు, ఉప్పరహాళు, బాపురంతో పాటు హచ్చొళ్లి మీదుగా కర్ణాటక వెళ్లే ప్రయాణికులకు దాదాపు 20 కి.మీ. ప్రయాణభారం భారం తగ్గింది. - దాదాపు రెండు దశాబ్దాలుగా క్రీడాకారులు, క్రీడల ప్రేమికుల కోరికను తీర్చేందుకు పట్టణంలో రూ.32 లక్షలతో మినీ స్టేడియం నిర్మించారు. - పట్టణంలోని దాదాపు రూ.50 లక్షలతో పార్క్ నిర్మాణం చేపట్టారు. - 2004 వరకు ఒక్కరికి పింఛన్ మంజూరు కావాలంటే అప్పటి వరకు లబ్ధిదారుల్లో ఎవరో ఒకరు చనిపోవా ల్సి వచ్చేది. కానీ వైఎస్ఆర్ వచ్చిన త ర్వాత నియోజకవర్గంలో 16 వేల మం ది వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లు మంజూరు చేశారు. సాయిప్రసాద్‌రెడ్డి తర్వాత 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికైన టీడీపీకి చెందిన మీనాక్షినాయుడు ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశారు. తాను ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేనని, ప్రభుత్వం సహకరించడం లేదనే సాకు చూపుతూ అభివృద్ధిని విస్మరించారు. దీంతో ప్రజా సంక్షేమం స్తంభించిపోయింది. మండగిరి గ్రామ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు రూ.6 కోట్లు మాత్రం మంజూరు అయ్యాయి. ఆ నిధులకు సంబంధించి టెండరు ప్రక్రియ మాత్రమే పూర్తయ్యింది. రూరల్ మండలంలోని చిన్నగోనేహాళు వంకపై బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే ప్రకటించారు. కానీ ఇంత వరకు పనులు మాత్రం ప్రారంభానికి నోచుకోవడం లేదు. ఉద్యోగుల జీత భత్యాలు ప్రభుత్వమే భరిస్తున్నందున ప్రజలు చెల్లిస్తున్న వివిధ రకాల పన్నులు మునిసిపల్ ఖజానాలో జమఅయ్యాయి. ఆ నిధులతోనే కొన్ని అభివృద్ధి పనులు చేపట్టారు. మీనాక్షినాయుడు పాలనాకాలంలో అనర్హులనే సాకుతో వందలాది మంది పింఛన్లు రద్దు అయ్యాయి. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు వాటిని పునరుద్ధరించాలని వేడుకుంటున్నా ఫలితం కనిపించలేదు. మంచి ప్రభుత్వం, స్థానికంగా సమర్థుడైన నాయకుడు లేకపోవడం వల్లే తమ పరిస్థితి ఇలా అయ్యిందంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి సార్వత్రిక ఎన్నికల్లో మంచి వ్యక్తిని ఎన్నుకోడానికి సిద్ధమవుతున్నారు.