భూ కబ్జాలు.. సెటిల్‌మెంట్లు.. మట్కా నిర్వాహకులతో మామూళ్లు.. పేకాటలో వాటాలు.. కల్తీ లిక్కర్ వ్యాపారంలో పర్సెంటేజీలు.. గుట్కా దందాలో వసూళ్లు.. అక్రమార్జనకు ఏదీ అడ్డు కాదని అన్నింటిలో భాగస్వామ్యం అవుతూ అందినకాడికి దోచుకుంటున్నారు ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు బ్రదర్స్. సెకండ్ ముంబాయిగా ఖ్యాతి పొందిన ప్రాంతం ఆదోని. జిల్లా సరిహద్దులో పారిశ్రామిక కేంద్రంగా.. వ్యాపార పట్టణంగా విరాజిల్లింది. ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు తిరోగమనంలో పయనిస్తూ చీకటి సామ్రాజ్యానికి కేరాఫ్ అడ్రెస్‌గా మారుతోంది. ఇదంతా అధికార పార్టీ అన్నదమ్ముల పుణ్యమేనని చెప్పక తప్పుదు. కుటుంబ స‘మేత’ంగా దోపిడీకి పాల్పడుతూ అసాంఘిక శక్తుల అడ్డాగా మార్చేస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, కర్నూలు : జిల్లాలో వెనుకబడిన ప్రాంతమైన ఆదోని నియోజకవర్గం అధికారపార్టీకి చెందిన ఇన్‌చార్జ్ మీనాక్షినాయుడి వ్యవహారంతో మరింత వెనుకబాటు ప్రాంతంగా మారిపోతోంది. అన్న ‘అధికారం’తో తమ్ముడు ఉమాపతి పెత్తనం సాగిస్తున్నారు. నియోజకవర్గంలో కొత్త ప్రాజెక్టును కూడా తెచ్చేందుకు కృషి చేయని మీనాక్షినాయుడు అధికారం మాత్రం అన్ని రంగాల్లో చెలాయిస్తున్నారు. మూతపడిన పత్తి మిల్లులు, ఆయిల్ మిల్లులను తెరిపించేందుకు ఏ మాత్రమూ కృషి చేయని నేతలు...మట్కా, పేకాటకు మాత్రం కేంద్రంగా మార్చేశారు. వివాదాలు ఉన్న భూములను తక్కువ ధరకే కొనుగోలు చేయడం...అధిక ధరకు విక్రయిస్తూ రియల్ ఎస్టేట్ కింగ్‌గా మారుతున్నారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత... అవినీతికి అంతేలేకుండా పోయింది. ఇందుగలదు..అందులేదు అన్న చందంగా అవినీతి వ్యవహారం మారిపోయింది. విద్యుత్‌శాఖలో ఆపరేటర్ల పోస్టులకు కూడా రూ. లక్షల్లో మాముళ్లు వసూలు చేస్తున్నారు. ఈ కోవలోనే ఆదోని నియోజకవర్గంలో ఎక్కడ కొత్త సబ్‌స్టేషన్ ఏర్పాటైతే... అక్కడ నలుగురిని నియమించేం దుకు రూ.2 లక్షలు మొదలుకుని రూ.5 లక్షల వరకూ వసూలు చేశారు. ఇక ఆదోని ఆసుపత్రిలో వివిధ విభాగాల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల నియామకాల్లో అధికార తెలుగుదేశం పార్టీ నేతలు భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. మునిసిపాలిటీలో బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీలోనూ ఒక్కో పోస్టు రేటు కట్టి దోచుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి కూడా పోస్టుల కోసం పైసలు వసూలు చేయడాన్ని ఆ వర్గాలు మండిపడుతున్నాయి. అంతేకాకుండా వ్యవసాయ మార్కెట్‌లో కొత్తగా షాపుల నిర్మాణం జరిగింది. ఈ షాపుల కేటాయింపులోనూ భారీగా తెలుగు తమ్ముళ్లు కాస్తా వసూళ్లకు తెగబడ్డారు. షాపునకు రూ. 2 లక్షల చొప్పున వారికి ముట్టచెప్పిన వ్యాపారులకే షాపులు కేటాయించారన్న ఆరోపణలు వచ్చాయి.
నీరు.. చెట్టులో పర్సెంటేజీల పర్వం
ఆదోని నియోజకవర్గంలో మొత్తం రూ.20 కోట్ల వరకూ నీరు–చెట్టు కింద పనులు చేపట్టారు. నియోజకవర్గంలో ఎక్కడెక్కడో ఉన్న చెరువులను వెలికితీసి మరీ పనులకు ప్రతిపాదించారు. ఇందులో ఎక్కడా పూడికతీత సరిగా చేయలేదు. ఇక చెక్‌డ్యాంల నిర్మాణం పేరుతో కేవలం లోపల ఇసుక బస్తాలతో నింపి మరీ చెక్‌డ్యాంల నిర్మాణాన్ని చేపట్టారు. ఈ పనులన్నీ పార్టీలోని నేతలు, కార్యకర్తలకు అప్పగించారు. అయినప్పటికీ వీరంతా కూడా అధికారపార్టీ ముఖ్యనేతలకు కమీషన్లు సమర్పించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విధంగా ఏకంగా 30 శాతం మేర కమీషన్ దండుకున్నారనే విమర్శలు ఉన్నాయి. తద్వారా కేవలం నీరు–చెట్టు పనుల ద్వారా రూ.6 కోట్ల మేర ఆర్జించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక పాత చెక్‌డ్యాంల మరమ్మతును కేవలం పైపైన సిమెంట్ పైపూతతో సరిపుచ్చారు. వంకలు, చెరువుల్లో నిర్ధిష్ట ప్రమాణాల మేరకు పూడిక తీయకుండా బిల్లులు చేయించుకున్నారు. ఇక పనులు చేసిన వారు కూడా రూ.4 కోట్ల మేర ఆర్జించుకున్నారు. తద్వారా కేవలం సగం మొత్తానికి కూడా నీరు–చెట్టు పనులు జరగని దుస్థితి నెలకొని ఉంది.
చీకటి వ్యాపారాలకు అండ..
జిల్లాలో పేకాట, మట్కాకు ఆదోని నియోజకవర్గం కేంద్రంగా మారింది. కర్నూలులో ఉన్న మట్కాడాన్ తర్వాత.... ఆదోనిలో ఏకంగా మట్కాడాన్‌లు ఉన్నారు. వీరికి పూర్తిగా అధికారపార్టీ అండదండలు ఉన్నాయి. దీంతో వీరిని అరెస్టు చేసే ధైర్యం అధికారులు చేయడం లేదు. కొద్దిరోజుల క్రితం కేవలం నామమాత్రంగా అరెస్టు చూపించి... తిరిగి వదిలేశారన్న విమర్శలు ఉన్నాయి. మరోవైపు ఈ మట్కా నిర్వాహకులకు ప్రతీ నెలా మాముళ్ల రూపంలో అధికారపార్టీ ముఖ్యనేతలకు మాముళ్లు అందిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.
- ఆదోని పట్టణంలో పేకాట వ్యవహారం కూడా జోరుగా సాగుతోంది. పేకాట నిర్వాహకుల నుంచి కూడా భారీగా నెలవారీ మాముళ్లు కాస్తా అధికారపార్టీ ముఖ్యనేతలకు అందుతున్నాయి. ఫలితంగా పేకాటను కూడా అరికట్టేందుకు అధికారులు ముందుకురావడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
- నాటుసారా వ్యవహారం కూడా ఇక్కడ జోరుగా సాగుతోంది. నాటుసారా కాసే వారికి కూడా వీరి అండదండలు పుష్కలంగా ఉన్నాయి.
- కర్ణాటకకు సరిహద్దులో ఉన్న నియోజకవర్గం కావడంతో కల్తీ లిక్కరు వ్యవహారం మరింత జోరుగా సాగుతోంది. ఈ కల్తీ లిక్కరు వ్యాపారంలో అధికారపార్టీ నేతలకు కూడా హస్తం ఉంటోంది. ఈ నేపథ్యంలో కర్నాటక నుంచి భారీగా కల్తీ లిక్కరు తెచ్చి... ఇక్కడ విక్రయిస్తున్నారు. అయినప్పటికీ ఎక్సైజ్ అధికారులు మిన్నకుండిపోవాల్సిన పరిస్థితి నెలకొంది.
- మట్కా, పేకాట, నాటుసారా, కల్తీ లిక్కరు వ్యాపారస్తుల నుంచే ఆదోనిలోని అధికారపార్టీ నేతలకు నెలకు ఏకంగా రూ.20 లక్షల వరకూ అందుతోందని తెలుస్తోంది. అంటే ఏడాదికి ఏకంగా రూ.2.4 కోట్ల మేర వీరికి ఆదాయం వస్తోంది. దీనికితోడుగా గుట్కా వ్యాపారదందా కూడా జోరుగానే సాగుతోంది.
తమ్ముళ్ల రియల్ దందా
ఆదోని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్‌గా ఉన్న మీనాక్షి నాయుడు అండతో తమ్ముళ్లు భూకబ్జాలతో రెచ్చిపోతున్నారు. నియోజకవర్గంలో ఎక్కడపడితే అక్కడ కబ్జాలు చేసేస్తున్నారు. ప్రధానంగా వివాదాలు ఉన్న భూములను తక్కువ ధరకే తీసుకుంటున్నారు. ఒకవేళ వివాదాలు లేకపోతే వివాదాలు సృష్టించి మరీ భూములను తక్కువ ధరకే తమకు ఇచ్చేలా చేసుకుంటున్నారు. ప్రధానంగా మీనాక్షినాయుడు సోదరుడు ఉమాపతి ఆధ్వర్యంలోనే దందా నడుస్తోంది.
- ఆదోని మండలంలోని బైచిగేరి గ్రామ పరిధిలో సర్వేనం.92లో 20ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని విశాఖ పట్టణానికి చెందిన వెల్ఫేర్‌బిల్డర్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కొనుగోలుచేసి ప్లాట్లు వేసింది. ఆ భూమిని 2013లో ఉమాపతి బినామీ పేరిట రూ.92లక్షలకు కొనుగోలు చేశారు. అయితే ప్లాట్లు కాకుండా వ్యవసాయ భూమిగా చూపించడంతో రిజిస్ట్రేషన్ శాఖకు దాదాపు రూ.12 లక్షలు స్టాంప్ డ్యూటీ గండి పడింది. రిజిస్ట్రేషన్ శాఖ ఆడిట్ అధికారులు అక్రమాలను గుర్తించి నోటీసు జారీ చేశారు. ప్రస్తుతం విచారణలో ఉంది.
- పట్టణానికి చెందిన కొడాలి రాజు, మరి కొంత మంది కొన్నేళ్ల క్రితం 70 సెంట్ల భూమి ఎమ్మిగనూరు – ఆస్పరి బైపాస్ రోడ్డులో కొన్నారు. భూమి విలువ రూ.కోట్లలో ఉంది. భాగస్వాముల మధ్య వివాదం ఉంది. వివాదాన్ని ఉమాపతి తనకు అనుకూలంగా మలుచుకున్నట్లు తెలుస్తోంది. వివాదాన్ని మరింత జటిలం చేసి అతి తక్కువ ధరకే ఆయన బినామీ పేరిట సొతం చేసుకున్నాడు.
- ట్టణ శివారులోని సాదాపురం గ్రామ పంచాయతీ పరిధిలో సర్వేనం.352లో 6.74 ఎకరాల భూమి పట్టణంలో నివాసమున్న సమీప బంధువు హమీద్, హబీద్ పేరిట ఉంది. ఇందులో హమీద్‌పేరిట 2 ఎకరాలు కాగా, హబీద్‌పేరిట 4.50 ఎకరాలు ఉంది. ఇరువురు కలిసి 277 ప్లాట్లు ఏర్పాటు చేసి ఇతరులకు అమ్మారు. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చాక 5 ఎకరాలకు పైగా భూమిని టీడీపీ నాయకుడు ఉమాపతి ముగ్గురు ఎస్సీల పేరిట కబ్జా చేశారు. అడంగల్‌లో రికార్డులు మార్పించారు. భూ యజమానులు, ప్లాట్లు కొన్నవారు న్యాయం చేయమని అడిగితే ఎస్సీ కేసుల పేరుతో భయపెడుతున్నారు. దీంతో భూ యజమానులతో పాటు ప్లాట్లు కొన్నవారు కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం కోర్టులో విచారణ కొనసాగుతోంది.
ఎస్.కొండాపురం గ్రామ పరిధిలో ఆరు ఎకరాల సీలింగ్ భూమి ఉంది. అధికారంలోకి రాగానే ఆ భూమిని పట్టణానికి చెందిన ఓ టీడీపీ కార్యకర్త ఇంట్లో మహిళల పేరిట పంపిణీ చేశారు. అయితే ఆ మహిళలు వ్యయవసాయ దారులు కాదు. సీలింగ్ ల్యాండ్ పంపిణీకి పాటించాల్సిన నిబంధనలు ఏవీ పాటించలేదు. గుట్టు చప్పుడు కాకుండా ఆ భూమిని సొంతం చేసుకున్నారు. దీని వెనుక టీడీపీ నాయకుడు ఉమాపతి హస్తం ఉన్నట్లు విమర్శలు ఉన్నాయి. ఆ భూమి పక్కనే ఉమాపతి సమీప బంధువు బలరామ చౌదరికి చెందిన క్రస్సింగ్ యూనిట్ ఉంది. టీడీపీ కార్యకర్తల పేరిట భూమి సొంతమై నాలుగేళ్లు అవుతున్నా అందులో ఇంతవరకు ఏ పంట సాగు చేయలేదు.
అవినీతికి అధిపతి
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలచేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేల కంటే కూడా తమ పార్టీకి చెందిన ఇన్‌చార్జ్‌లకే పెత్తనం కట్టబెట్టింది. ఆదోని నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ప్రజల మద్దతుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున సాయిప్రసాద్ రెడ్డి గెలుపొందారు. అయితే, నియోజకవర్గంలో మాత్రం పెత్తనమంతా అధికార పార్టీకి చెందిన నేతల చేతుల్లోనే ఉంచారు. ఇక్కడ ఇన్‌చార్జ్‌గా ఉన్న మీనాక్షి నాయుడు చేతిలో అధికారం ఉంది. అయితే, పెత్తనం మాత్రం అంతా ఆయన సోదరుడు ఉమాపతిదే సాగుతోంది. అధికారుల పోస్టింగ్స్ నుంచి వివిధ కాంట్రాక్టు పనుల వరకూ అంతా ఆయనే చేతి నుంచే నడుస్తోంది. అంతేకాకుండా నియోజకవర్గంలోని వివాదాలు ఉన్న భూములను తక్కువ ధరకే కొంటున్నారు. ఈ విధంగా తక్కువ ధరకే కొన్న భూములను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. తద్వారా రియల్ ఎస్టేట్ కింగ్‌గా మారుతున్నారు. అంతేకాకుండా అధికారులతోనేకాకుండా వివిధ వర్గాల ప్రజలతో కూడా సోదరుడి వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదమవుతోంది.
వ్యాపారంలో ‘ఐపీ’ పాట
ఆదోని నియోజకవర్గంలో పత్తి మిల్లులు అధికం. అంతేకాకుండా ఆదోని వ్యవసాయ మార్కెట్‌కు పత్తి పంట జిల్లా నుంచి భారీగా వస్తుంది. ఇక్కడ పత్తి వ్యాపారులు కూడా అధికమే. పత్తి మిల్లు వ్యాపారంలో ఉన్న మీనాక్షినాయుడు కుమారుడు కొందరి వ్యాపారుల ఉనంచి భారీగా పత్తిని కొనుగోలు చేశారు. ఆ తర్వాత వారికి బిల్లులు మాత్రం చెల్లించలేదు. దీంతో కొందరు బాధితులు ఏకంగా కేసు పెట్టే వరకూ వెళ్లారు. అయితే, అధికారం అండతో కేసులు నమోదుకాకుండా చేసుకున్నారు. అంతేకాకుండా బాధితుల్లో కేవలం కొద్ది మందికి మాత్రమే అప్పులు చెల్లించారు. ఇంకా అనేక మందికి కోట్లలో మొత్తం చెల్లించాల్సి ఉంది. అయినప్పటికీ వీరంతా ధైర్యంగా అడిగేందుకు సాహసించడం లేదు. ఎక్కడ అధికారం అండతో తమను ఇబ్బందులపాలు చేస్తారని ఆందోళన చెందుతున్నారు.
పేదల కడుపుకొడుతున్నారు
టీడీపీ నాయకులు అక్రమార్జన కోసం పేదల కడుపు కొడుతున్నారు. సాదాపురం గ్రామ పరిధిలోని సర్వే నం. 352లో దాదాపు 5 ఎకరాలకు పైగా భూమిని కబ్జా చేశారు. ఆ భూమిలో భూ యజమానులు ప్లాట్లువేసి పేదలకు అమ్మారు. కూలీనాలీ చేసుకుతినే వారు, కార్మికులు, చిరుద్యోగులు ప్లాట్లు కొన్నవారిలో ఉన్నారు. తాము కొన్నామని, న్యాయం చేయాలని అడిగితే ఎస్సీ కేసుల పేరిట బెదిరిస్తున్నారు. దౌర్జన్యం ఎక్కువ కాలం నడవదు. బాధితులు చేపట్టిన న్యాయ పోరాటానికి వైఎస్‌ఆర్‌సీపీ అండగా నిలుస్తుంది. మా పార్టీ అధికారంలోకి రాగానే పేదలకు న్యాయం చేస్తాం. – సాయిప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్యే
సమగ్ర విచారణ జరిపించాలి
పట్టణంలో అధికార పార్టీ నాయకులు పెద్ద ఎత్తున భూ కబ్జాలకు పాల్పడ్డారు. వారి కబ్జాలో పేదలకు తీవ్ర అన్యాయం జరిగింది. ముఖ్యంగా 352లో భూ యజమానులు హమీద్, హబీద్ ప్లాట్లు వేసి పేదలకు కంతుల ప్రకారం అమ్ముకున్నారు. మొత్తం భూమిలో 4 ఎకరాలు టీడీపీ నాయకులు కబ్జా చేయడంతో ఆ భూమిలో ప్లాట్లు కొన్నవారికి అన్యాయం జరిగింది. బాధితులతో కలిసి న్యాయం చేయాలని ఆందోళన చేస్తే ఎస్సీ కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్సీ దృష్టికి కూడా తీసుకెళ్లాను. ఉన్నత స్థాయి అధికారులతో విచారణ చేయిస్తే టీడీపీ నాయకుల కబ్జా భాగోతం వెలుగులోకి వస్తుంది – నూర్ అహ్మద్, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్
Comments
Please login to add a commentAdd a comment