mrudula
-
సచిన్, కోహ్లి కాదు! అత్యంత ఖరీదైన భవనంలో నివసిస్తున్న భారత క్రికెటర్?
Who Is Mrudula Jadeja: దేశంలో అత్యధికంగా ఆర్జిస్తున్న ఆటగాళ్ల జాబితాలో క్రికెటర్లే ముందు వరుసలో ఉంటారు. అందులోనూ టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ మొదలు మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ సంపాదన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నలుగురు బ్యాటర్లు వెయ్యి కోట్లకు పైగా విలువ చేసే ఆస్తులతో సంపన్న క్రికెటర్లుగా ప్రసిద్ధికెక్కారు. ఆటలో అద్భుతంగా రాణించి.. తద్వారా వచ్చిన కీర్తిప్రతిష్టలతో తమ ఇమేజ్ను క్యాష్ చేసుకుంటూ ఆర్థికంగా మరింత పరిపుష్టి చెందుతున్నారు. (PC: Mrudula Jadeja Instagram) రెండు చేతులా సంపాదన అటు క్రికెట్ ద్వారా.. ఇటు వివిధ ప్రఖ్యాత బ్రాండ్లకు ప్రచారకర్తలుగా పనిచేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇక వీరు నివసించే ఇళ్ల విలువ కూడా వారి స్థాయికి తగ్గట్లే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. (PC: Mrudula Jadeja Instagram) ముంబైలో ఖరీదైన కలల సౌధం ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండ్కులర్ ఆర్థిక రాజధాని ముంబైలో తన కలల సౌధాన్ని నిర్మించుకున్నాడు. బాంద్రాలో ఉన్న ఈ ఇంటి విలువ సుమారు 80 కోట్ల రూపాయలకు పైమాటే! (PC: Mrudula Jadeja Instagram) రాంచిలో ధోని ఫామ్‌హౌజ్ ఇక టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన మహేంద్ర సింగ్ ధోని స్వస్థలం రాంచిలో తన ఫామ్‌హౌజ్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ విలాసవంతమైన భవనం విలువ రూ. 6 కోట్లు ఉంటుందని అంచనా! (PC: Mrudula Jadeja Instagram) రోహిత్ నివాసం విలువ 30 కోట్లు ఇదిలా ఉంటే.. ప్రస్తుత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ముంబైలో విలాసవంతమైన భవనంలో నివసిస్తున్నాడు. 53 అంతస్తుల బిల్డింగ్‌లో 29వ ఫ్లోర్లో రోహిత్ ఉంటున్న నివాసం విలువ సుమారు రూ. 30 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. (PC: Mrudula Jadeja Instagram) గురుగ్రామ్‌లో క్రికెట్ ఐకాన్ కోహ్లి లావిష్ హోం అదే విధంగా.. ఆధునిక క్రికెట్ తరానికి ఐకాన్ అయిన విరాట్ కోహ్లి, తన భార్య, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మతో కలిసి ఖరీదైన ఇంటిలో నివాసం ఉంటున్నాడు. గురుగ్రామ్‌లో ఉన్న ఈ లావిష్ బిల్డింగ్ విలువ రూ. 80 కోట్లు ఉన్నట్లు సమాచారం. (PC: Mrudula Jadeja Instagram) ప్యాలెస్‌లో నివసిస్తున్న భారత క్రికెటర్ ఎవరంటే? అయితే, ఈ నలుగురు రిచెస్ట్ క్రికెటర్ల కంటే ఖరీదైన భవనంలో నివసిస్తున్న భారత క్రికెటర్ మరొకరు ఉన్నారు. ఆమె పేరు మృదుల జడేజా. పేరు చూసి టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బంధువు అనుకునేరు?! కుటుంబంతో మృదుల (PC: Instagram) కానే కాదు.. మృదుల జడేజా ఓ ‘యువరాణి’!! గుజరాత్‌లోని రాజవంశానికి చెందిన అమ్మాయి. ఆమె తండ్రిపేరు మంధాతసిన్హ్ జడేజా. మృదులకు ఓ సోదరుడు కూడా ఉన్నాడు. తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి ఆమె చారిత్రాత్మక రంజిత్ విలాస్ ప్యాలెస్‌లో నివాసం ఉంటున్నారు. (PC: Mrudula Jadeja Instagram) 6 ఎకరాల్లో.. 150కి పైగా గదులతో ఆ ప్యాలెస్ రాజ్‌కోట్‌లో సుమారు 225 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఎస్టేట్‌లో.. ఆరు ఎకరాల స్థలంలో ఈ భవనం ఉంది. మృదుల కుటుంబానికి చెందిన ప్యాలెస్‌లో 150కి పైగా గదులు ఉన్నాయి. అంతేకాదు.. వారి గ్యారేజ్‌లో ఎన్నో విలాసవంతమైన వింటేజీ కార్లు కూడా కొలువు దీరి ఉన్నాయి. మిగతా రాజకుటుంబాలు తమ నివాసాలను హెరిటేజ్ హోటళ్లుగా మలుస్తున్న తరుణంలో రంజిత్ విలాస్ ప్యాలెస్‌ను మాత్రం తమ పూర్వీకుల రాజసానికి గుర్తుగా అలాగే ప్రైవేట్ ప్రాపర్టీగా ఉంచేశారు. ఇక తమ రాజభవానికి సంబంధించిన ఫొటోలను మృదుల జడేజా అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంటారు. (PC: Mrudula Jadeja Instagram) సౌరాష్ట్ర జట్టు సారథి మృదుల జడేజా ఆల్‌రౌండర్. దేశవాళీ క్రికెట్లో సౌరాష్ట్ర మహిళా జట్టుకు ఆమె సారథ్యం వహించారు. తన కెరీర్లో పరిమిత ఓవర్ల క్రికెట్లో 46(వన్డే), టీ20 ఫార్మాట్లో 36, ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఒక మ్యాచ్ ఆడారు. కుడిచేతి వాటం గల బ్యాటర్ అయిన 32 ఏళ్ల మృదుల.. రైటార్మ్ మీడియం పేసర్ కూడా!! గతంలో.. పురుష, మహిళా క్రికెటర్ల వేతనాలకు మధ్య వ్యత్యాసాలపై గళమెత్తిన వాళ్లలో మృదుల కూడా ఒకరు. కాగా మృదుల జడేజా కేవలం క్రికెటర్ మాత్రమే కాదు.. గోల్ఫ్ పట్ల కూడా ఆమెకు మంచి అవగాహన ఉంది!! View this post on Instagram A post shared by Mridulakumari Jadeja (@mridulajadeja) View this post on Instagram A post shared by Mridulakumari Jadeja (@mridulajadeja) -
అందుకే నటీనటులంతా చాలా అదృష్టవంతులు: నటి
ఒక్క చాన్స్.. ఒకే ఒక్క చాన్స్ అని అడిగిన ఆమెకు, ఒకేసారి వెండితెర, వెబ్‌తెర, బుల్లి తెరల్లో తెరంగేట్రం చేసే అవకాశం లభించింది. వెబ్‌స్టార్‌గా ఎదిగింది. ఇంతకీ ఆమె ఎవరో కాదు.. లా చదివిన యాక్టర్.. మృదులా మహాజన్.. ♦ చండీగఢ్‌లో పుట్టి,పెరిగిన మృదుల.. పంజాబ్ యూనివర్సిటీలో ఎల్ఎల్బీ చేసింది. ♦ చిన్నప్పటి నుంచి నటన అంటే ఇష్టం. ఆ ఆసక్తితోనే కాలేజీ రోజుల్లో నాటకాలు వేయడం మొదలుపెట్టింది. థియేటర్ ఆర్టిస్ట్‌గా మారింది. ♦ సినిమాల్లో నటించాలనే తన కలను నెరవేర్చుకోవడం కోసం చాలా కష్టపడింది. ఎన్నో ఆడిషన్స్‌కు వెళ్లింది. ♦ 2018లో అవకాశాలన్నీ ఆమె ఇంటి ముందు క్యూ కట్టాయి. ఒకేసారి ఒక సినిమా, ఒక సీరియల్, ఒక ఆల్బమ్ సాంగ్‌లో నటించే చాన్స్ వచ్చింది. ♦ ‘పీటీసీ ఏక్ కహానీ: ఆజాద్’ పంజాబీ సినిమాతో వెండితెరను, ‘అన్‌టోల్డ్ లవ్’ సీరియల్‌తో బుల్లితెరను, ‘సహన్ దీ చార్ఖీ’ ఆల్బమ్‌తో వెబ్తెరను ఒకే ఏడాదిలో కవర్ చేసింది. ♦ ఇన్ని లెరలనూ కవర్ చేస్తే.. ఒక్కచోటైనా క్లిక్ కాదా? అయింది కాబట్టే.. బాలీవుడ్లో మెరిసింది. ♦ 2019లో విడుదలైన ‘ట్యాంక్ క్లీనర్’ సినిమాతో బాలీవుడ్లో తన సత్తా చాటింది. ప్రస్తుతం ‘గందీ బాత్’ సీజన్– 4 సిరీస్‌తో అలరిస్తోంది. అద్దె చెల్లించకుండా ఇంకొకరి జీవితంలో జీవించడమే నటన అంటే. అందుకే, నటీనటులందరూ చాలా అదృష్టవంతులు. – మృదులా మహాజన్ -
ఊతమై...
జీవితాంతం తోడూనీడగా ఉండేందుకు అతడు ఆమెతో ఏడడుగులు నడిచాడు. అయితే జీవితాంతం వేధించే ఆరోగ్య సమస్య అతడిని మంచం పట్టేలా చేసింది. కోరి కట్టుకున్న భర్త, చేజారి పోవడానికి సిద్ధంగా ఉన్న తమ కలల సౌధం.. రెంటినీ కాపాడుకోవడానికి ఆమె నేటికీ విశ్వప్రయత్నం చేస్తూనే ఉంది. ‘వరల్డ్ మేరేజ్ డే’ సందర్భంగా ఆ ఆలూమగల అనురాగబంధంపై ఫ్యామిలీస్పెషల్ రిపోర్ట్. : నిర్మలారెడ్డి మృదుల, పార్థసారథి పన్నెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఇద్దరిదీ ఒకే ఊరు. ఇద్దరికీ ఇంటర్మీడియెట్ నుంచే పరిచయం. డిగ్రీలో ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారితే ఇరువైపు పెద్దలు కాదన్నారు. ఇంట్లో నుంచి వచ్చేసి, పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్‌లో కాపురం పెట్టారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూనే డిగ్రీ పూర్తి చేశాడు పార్థసారథి. మృదుల చేత బి.టెక్, ఎమ్‌టెక్ పూర్తి చేయించాడు. ఇద్దరూ కలిసి సంపాదిస్తేనే నిలదొక్కుకోగలం అనే ఆలోచనతో మృదుల ఓ ప్రైవేట్ కాలేజీలో ఉద్యోగంలో చేరింది. నాలుగేళ్లు గడిచాయి. కొడుకు పుట్టాడు. పైసా పైసా కూడబెట్టి బ్యాంక్‌లో లోను తీసుకుని ఇల్లు కొనుక్కున్నారు. ఆనందంగా గృహప్రవేశం చేశారు. ఊహించని విషాదం అయితే ఈ దంపతుల జీవితంలోకి ఊహించని విషాదం ప్రవేశించింది. అకస్మాత్తుగా పార్థ సారథి కాళ్లు చచ్చుబడిపోయాయి. డాక్టర్లు గులియన్ బ్యారే సిండ్రోమ్ అన్నారు. వైద్యానికి లక్షల్లో ఖర్చు అవుతుంది అన్నారు. ఎప్పటికి నయమవుతుందో తెలియదన్నారు. మనిషి కోమాలోకి కూడా వెళ్లిపోవచ్చని అన్నారు. అదే సమయంలో ఉన్నదంతా ఊడ్చి కొనుక్కున్న ఇల్లు వాయిదా కట్టక బకాయి పడి ఉంది. కట్టుకున్న భర్తను, కొనుక్కున్న ఇంటిని, కన్న బిడ్డను.. ఎలా కాచుకోవాలో మృదులకు అర్థం కాలేదు. అన్నీ తానై నడిపించింది అందినచోటల్లా తెచ్చిన అప్పులు, ఆదుకున్న ఆప్తులు.. అంతా పది లక్షల వరకు ఖర్చయింది. అయినా ఫలితమేమీ కనిపించలేదు. ‘ఇంటికి తీసుకెళ్లడమే మేలు’ అన్నారు డాక్టర్లు. భర్త ఉద్యోగం చేసే స్థితిలో లేడు. అతన్ని చూసుకోవడానికి తనూ ఉద్యోగం మానేసే పరిస్థితి. చేస్తున్న ఉద్యోగానికి సెలవు పెట్టి, బ్యాంక్ వాళ్లను కలిసి తన పరిస్థితిని వివరించి, జప్తులో ఉన్న ఇంటికి గడువు కోరింది మృదుల. ఆపన్న హస్తం అందించే స్వచ్ఛంద సంస్థలను కలిసి తన పరిస్థితిని వివరించింది. మరోవైపు తనకు ఏమౌతుందో అని మంచంలోనే ఆందోళన పడుతున్న భర్తకు వెన్నుదన్నుగా నిలుస్తూ ‘ఇంకెంత కొన్ని రోజుల్లోనే లేచి జాబ్‌కి వెళతారు చూడండి..’ అంటూ రోజూ ధైర్యం చెబుతూ వచ్చింది. ఫిజియోథెరపీ చేయించింది సంవత్సరం పాటు పూర్తిగా మంచానికే పరిమితమైన పార్థసారధి మెల్లగా కూర్చోవడం, తర్వాత ఒక్కో అడుగు వేయడం.. మొదలుపెట్టాడు. ఆ అద్భుతమైన క్షణాలను గుర్తు చేసుకుంటూ- ‘‘మా సాత్విక్ (కుమారుడు) మొదటిసారి నడిచినప్పుడు కూడా నేను అంత ఆనందం పొందలేదు. రోజూ ఫిజియోథెరపీ చేస్తూ, తన ప్రయత్నంతో ఇప్పుడు కర్ర పట్టుకొని నడిచే స్థాయికి వచ్చాడు. పార్థులో ఆ కాస్త మార్పు వచ్చాక కాస్త ఊపిరి పీల్చుకున్నాను. మరో అసిస్టెంట్ సాయం తీసుకున్నాను. కాలేజీకి వెళ్లడం, అయిపోగానే ఉరుకులు పరుగుల మీద ఇల్లు చేరడం.. ఐదేళ్లు గా నాకు అలవాటై పోయింది. ‘నా కోసం చాలా కష్టపడుతున్నావురా!’ అంటుంటాడు పార్థు. ‘నాకే ఇలా అయితే..’ అంటాను. నవ్వుతూ చూస్తాడు’’ అంటూ భర్తను కాపాడుకున్న విధం, ఇల్లు చేజారకుండా చేసిన ప్రయత్నాలు, కొడుకు చదువు, తన పై భర్తకు ఉన్న ప్రేమానురాగాల గురించి వివరించింది మృదుల. ‘‘నా ఇంటి దేవత. నా కోసమే తను పుట్టింది. ఇంకా ఎన్నాళ్లు ఇలాగే కష్టపెడతానో..’ అంటూ అర్ధాంగి చేతిని తన చేతుల్లోకి తీసుకున్నారు పార్థసారథి. కష్టాలెన్ని వచ్చినా తమ బంధాన్ని కాపాడుకోవడానికి తపస్సు చేసే మృదుల లాంటివారిని చూసినప్పుడు వివాహబంధమంత బలమైనది ఇంకోటి ఉండదని అనిపిస్తుంది. -
పల్లె ప్రగతికి పట్టుగొమ్మ తిమ్మాపూర్
జగదేవ్‌పూర్: రాష్ర్టంలో పల్లె ప్రగతి పథకం ద్వారా పల్లెలో సకల సమస్యలు తీరనున్నట్లు, పల్లె ప్రగతికి మూడు జిల్లాలు ఎంపిక చేయడం జరిగిందని తెలంగాణ సెర్ఫ్ మానవాభివృద్ధి విభాగం డెరైక్టర్ మృదుల పేర్కొన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా మెదక్ జిల్లాలో జగదేవ్‌పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామం ఎంపిక కావడంతో శనివారం ఆమె గ్రామాన్ని సందర్శించారు. ముందుగా ఆమె గ్రామంలోని మహిళ సంఘాల సభ్యులతో, అంగన్వాడి, పౌష్టిక ఆహార కేంద్రాల నిర్వాహకులు, గ్రామ సర్పం చ్తో సమావేశమయ్యారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను ఆడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి ముఖ్య ఉద్దేశం పల్లెలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలన్నదే లక్ష్యమన్నారు. రాష్ట్రంలో ఆదిలాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఒక గ్రామాన్ని పెలైట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి వంద శాతం అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే జిల్లా తిమ్మాపూర్ గ్రామాన్ని ఎంపిక చేశారని చెప్పారు. గ్రామంలో సకల సమస్యలను తెలుసుకొని వాటిని ప రిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. మాతాశిశు మరణాలు తగ్గించడం, గర్భిణులకు పౌష్టిక ఆహారం అందించడం జరుగుతుందన్నారు. వంద శాతం మరుగుదొడ్లు నిర్మించుకునేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మురికి కాల్వలు నిర్మాణం, పారిశుద్ధ్య నిర్వహణ, కలుషితం లేని తాగునీరు అందించడం, అంతర్గత రోడ్లను సీసీ రోడ్లుగా మార్చడం లాంటి మౌలిక సదుపాయాలను కల్పించడమే పల్లె ప్రగతి లక్ష్యమన్నారు. మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు వాడకంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. అలాగే టాటా కంపెనీ ఆధ్వర్యంలో త్వరలో మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 45 రోజుల్లో తిమ్మాపూర్ గ్రామంలో మార్పు వస్తుందన్నారు. రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. గ్రామంలో 3 సీఆర్పీలను నియమించి మరుగుదొడ్ల వాడకంపై రోజువారి సర్వేను చేపడతామని తెలిపారు. జీవనోపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. అనంతరం గ్రామంలో పర్యటిస్తూ కలపతో కట్టుకున్న పాతకాలం ఇళ్లు, చెట్ల పెంపకం స్థలాన్ని అక్కడ నీటి వసతిని పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రమా, యంగ్ ప్రొఫెషనల్ శివా, హెచ్.డి ప్రేరణ, మండల ఎపిఎం యాదగిరి, క్లస్టర్ ఎపిఎం దుర్గయ్య, సిసి స్వామి, గ్రామ మహిళ సంఘం అధ్యక్షులు లక్ష్మి, విఓఎ నందిని, హెచ్ఎ పూజరాణి, టీఆర్ఎస్ నాయకులు సుమన్ తదితరులు పాల్గొన్నారు. -
అందరికీ అమ్మలు...ఆ అక్కచెల్లెళ్లు!
ఆర్జించిన ధనానికి కవచం దానమే... పదార్థాలను త్యాగం చేయడం ద్వారా నిన్ను నీవు రక్షించుకో... దానం... త్యాగం ప్రాధాన్యాలను తెలిపే ఈ సూక్తులను ఎవరు చెప్పారు? విధుల... మృదుల అనే అక్క చెల్లెళ్లు చెప్తున్నారు... నిడదవోలులోని చర్ల సుశీల వృద్ధాశ్రమం వీరి నివాసం... తండ్రి గణపతి శాస్త్రి బోధించిన గాంధీ సూక్తులు వీరికి ఆదర్శం. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు పట్టణం. పోలీస్ స్టేషన్ ఎదురుగా ఓ సాధారణమైన పాతకాలం నాటి భవనం. ఎటు చూసినా ఫలిత కేశాలతో, వెన్ను వంగిపోయి, పండుటాకులను తలపిస్తున్న వృద్ధులే కనిపిస్తున్నారు. వారిలో ఇద్దరు మహిళలు తెల్లటి నూలు దుస్తులు ధరించి గాంధీజీ ఆశయాలకు ప్రతీకల్లా, సరస్వతీ మాత రూపాల్లా ఉన్నారు. వారిద్దరూ ఆశ్రమం అంతా కలియ తిరుగుతూ బాధ్యతగా అందరినీ పలకరిస్తున్నారు. ప్రాంగణం దగ్గరకు వెళ్తే ‘చర్ల సుశీల వృద్ధాశ్రమం, శ్రీ కస్తూరిబాయి మహిళా సమాజం’ అనే బోర్డు కనిపిస్తుంది. ఆ బోర్డు మీద గణపతి శాస్త్రి, సుశీల ఫొటో ఉంది. ఆ ఫొటోలో ఉన్న దంపతుల కూతుళ్లే విధుల, మృదుల. తల్లి సుశీల పేరుతో ఆశ్రమాన్ని స్థాపించి తండ్రి ఆశయాలకు రూపమిస్తున్నారు. అభాగ్యులకు ఆశ్రయమిస్తున్నారు. అనాథలకు జీవితాన్నిస్తున్నారు. తండ్రి బాటలో సొదరీమణులు..: చర్ల గణపతి శాస్త్రి స్వాతంత్య్ర సమరయోధుడు. కళాప్రపూర్ణ, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత కూడా. జాతీయోద్యమ కాలంలో గాంధీజీ ప్రబోధాల ప్రభావంతో ఆయన ఉపాధ్యాయ వృత్తిని వదిలి, ఉద్యమంలో పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నప్పుడు గణపతి శాస్త్రిని కొవ్వూరు జైలులో పెట్టారు. జైలు నుంచి విడుదలైన తరువాత ఆయన చాగల్లులో గాంధీ ఆశయాలతో ఆశ్రమ పాఠశాల నిర్మించారు. అది బాపూ హైస్కూల్‌గా కొనసాగుతోంది. గణపతి శాస్త్రి వ్యవసాయం చేస్తూ జీవనాన్ని సాగించారు. పేద ప్రజలకు విద్య, వైద్య సేవలను అందించారు. మహిళల కోసం నిడదవోలు పట్టణంలో 1950లో కస్తూరిబా మహిళా సమాజాన్ని స్ధాపించారు. నిరక్ష్యరాస్యత నిర్మూలన, మద్యపాన నిషేధంపై ప్రచారం నిర్వహించారు. గణపతి శాస్త్రి ఏనాడూ ఎవరినీ స్తోత్రాలు వల్లించి దీవించలేదు. ‘మంచి చేయండి. మీ పిల్లలకు మంచి జరుగుతుంద’ని చెప్పేవారు. స్వాతంత్య్ర సమరయోధులకు ప్రభుత్వం ఇచ్చిన ఐదెకరాల భూమిని వినోభాబావే భూదాన ఉద్యమం నిర్వహించిన సమయంలో విరాళంగా ఇచ్చారు. ఆయన జీవితమంతా ప్రజల కోసమే పని చేసి 1996లో గుండెపోటుతో దూరమయ్యారు. గణపతి శాస్త్రి భార్య చర్ల సుశీలమ్మ అన్నదానాలు చేసేవారు. విధుల, మృదుల కుమారికి కూడా అదే సేవాగుణం అలవడింది. తండ్రి మార్గదర్శనం...: తండ్రి కోరుకున్న విధంగా మహిళా సమాజాన్ని నడిపిన ఈ అక్కాచెల్లెళ్లు ఆపన్నులకు ఆశ్రయం కూడా అక్కడే కల్పించాలనుకున్నారు. అలా 2000లో ఐదుగురితో వృద్ధాశ్రమం స్థాపించారు. వీరిలో పెద్దామె విధులకు 76 సంవత్సరాలు. ఎంఏ బిఈడీ చదివి హిందీలో డాక్టరేట్ పట్టా పొందారు. విశాఖపట్నంలోని సెయింట్ ఆన్స్ జూనియర్ కళాశాలలో హిందీ లెక్చరర్‌గా పనిచేసి రిటైరయ్యారు. గాంధేయవాది అయిన తండ్రిని గుర్తు చేసుకున్నారామె. ‘‘నా ఉద్యోగ జీవితంలో అధ్యాపకురాలుగానే కాకుండా భారత స్కాట్స్ అండ్ గైడ్స్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్‌గా పని చేశాను. దేశభక్తి, అనాథల సేవలాంటి సద్గుణాలను చిన్నతనంలో మానాన్న గారి నుంచి నేర్చుకున్నాను. ఎవరికి ఏ అవసరం వచ్చినా సహాయం చేసేవారు నాన్న. ఆయన సేవా నిరతి నాకిప్పటికీ గుర్తుంది. మా అన్నయ్య అకాల మరణం తట్టుకోలేక అమ్మ కూడా చనిపోయింది. పోయినవాళ్ళు అదృష్టవంతులు మీరు బాధపడకూడదని మా ఇద్దరికీ హితవు చెప్పారు నాన్న. అలాంటి తండ్రికి బిడ్డలుగా పుట్టడం ఎంతో అదృష్టం. ఇక మా అమ్మ...’’ అంటూ కొద్దిసేపు ఆగారామె. ‘‘అనాథలైన వృద్ధులకు సేవ చేయాలనేది అమ్మ కోరిక. ఆ ఆశయసాధన కోసమే అమ్మపేరున ఒక వృద్ధాశ్రమం నెలకొల్పాం. నాకు ప్రతి నెలా వస్తున్న పెన్షన్, దాతల సహకారంతో దీనిని నిర్వహిస్తున్నాం. కుటుంబ జీవిత చట్రంలో ఇరుక్కుపోతే వారి ఆశయాలను నిర్వహించలేమని అవివాహితులుగా ఉండిపోయాం’’ అన్నారు విధుల కుమారి. ఉన్నత విద్యావంతులు కావడంతో... ఈ సోదరీమణులిద్దరూ ఉన్నత విద్యావంతులు. విధుల చెల్లెలు మృదుల విశాఖపట్నంలోని వి.ఎం.సీ మహిళా విద్యాపీఠ్‌లో హిందీ లెక్చరర్‌గా పనిచేసి రిటైరయ్యారు. తండ్రి గణపతి శాస్త్రి ఎప్పుడూ... ‘దేశం మాకేం ఇచ్చింది అని కాకుండా దేశానికి మనం ఏం చేశాం’ అని ఆలోచించాలని ఉద్బోధించేవారని గుర్తు చేసుకున్నారామె. ‘‘సేవ, సకల జీవుల పట్ల దయతో ఉండటం, మానవసేవయే మాధవ సేవ ఇత్యాది సుగుణాలను నాన్న నేర్పించారు. భగవంతుడు దీనజనుల్లోనే ఉన్నాడు. వారికి సేవ చేస్తే దైవాన్ని సేవించినట్లేనని చెప్తుండేవారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా అక్కతో కలిసి అభాగ్యుల సేవలో కొనసాగుతున్నాను. అనాథలు, వృద్ధులకు మాకు చేతనైనంత చేస్తున్నాం. అక్క, నేను ఇద్దరం చదువుకున్న వాళ్లం కావడంతో ఇక్కడ ఆశ్రయం పొందుతున్న అనాథ పిల్లలకు చదువు చెప్తున్నాం. వారు ప్రైవేట్‌గా డిగ్రీ చదువుకుంటున్నారు. అంధులు కూడా కంప్యూటర్ నేర్చుకుని ఉపయోగిస్తున్నారు. మాకు మా వ్యక్తిగత జీవితం గురించి ఆలోచన, చింతా ఏ కోశానా లేవు ’’ అన్నారు. అందరి ఆకలి తీర్చడానికి...: చర్ల సుశీల వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వాళ్లు రెండు వందల వరకు ఉంటారు. అయితే భోజన సమయానికి వచ్చి ఆకలి తీర్చుకుని వెళ్లే వాళ్లు కూడా ఎక్కువే. వీరికే కాకుండా రోడ్ల మీద బిచ్చమెత్తుకునే వారి ఆకలీ తీరుస్తున్నారు. బస్టాండ్, రైల్వేస్టేషన్, రోడ్డు కూడళ్లలో అడుక్కునే వారికి ఉదయం 11 గంటలకు ఆశ్రమం నుంచి భోజనం తీసుకెళ్లి పెడతారు. ఈ ఆశ్రమంలో ఏటా గాంధీ జయంతి రోజున గాంధీజీకి పుష్పాంజలి, సర్వమత ప్రార్థన నిర్వహిస్తారు. దాంతోపాటు స్వాతంత్య్ర సమరయోధులు, ఉత్తమ ఉపాధ్యాయులు, గాంధేయ వాదుల వంటి విశిష్ఠ వ్యక్తులకు గాంధీజీ స్మారక పురస్కారాలిస్తారు. విద్యార్థులకు గాంధీజీ జీవితం అనే అంశం ఆధారంగా వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి బహుమతులిస్తున్నారు. డెబ్భై ఏళ్లు నిండితే మందు వేసుకోవడానికి నీళ్లందించే వారి కోసం చూస్తారు ఎవరైనా. మంచం మీద నుంచి లేవాలనిపిస్తే మనవడో, మనవరాలో ఆసరాగా ఉంటే బావుణ్ణు అనిపించే వయసది. అలాంటప్పుడు ఎవరైనా పిల్లల అండలో జీవితం కడతేరాలని కోరుకోవడం సహజం. ఆ అండలేని వారికి కొండంత అండగా నిలుస్తున్నారు ఈ అక్కాచెల్లెళ్లు. అందుకు వారికి తమ వార్ధక్యం అడ్డురావడం లేదు. వారి ఆశయమే ఆసరాగా ఉంది. - గాడి శేఖర్‌బాబు, సాక్షి, నిడదవోలు ఆత్మీయ సేవకు అందిన గుర్తింపు: 2007లో సహృదయ చారిటబుల్ సొసైటీ వారిచే ఉత్తమ సేవా అవార్డు. ఠి2010లో జిల్లా కలెక్టర్ వాణీ ప్రసాద్ చేతుల మీదగా ఉత్తమ సేవా సంస్ధ అవార్డు, ఠి 2011లో అప్పటి మంత్రి వట్టి వసంత్‌కుమార్ చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ సేవా సంస్ధ నిర్వాహక పురస్కారం. ఠి స్త్రీ శిశు సంక్షేమశాఖ నుంచి ఉత్తమ మహిళా సేవకురాలి అవార్డులు.