
మృదుల జడేజా (PC: Mrudula Jadeja Instagram)
Who Is Mrudula Jadeja: దేశంలో అత్యధికంగా ఆర్జిస్తున్న ఆటగాళ్ల జాబితాలో క్రికెటర్లే ముందు వరుసలో ఉంటారు. అందులోనూ టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ మొదలు మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ సంపాదన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఈ నలుగురు బ్యాటర్లు వెయ్యి కోట్లకు పైగా విలువ చేసే ఆస్తులతో సంపన్న క్రికెటర్లుగా ప్రసిద్ధికెక్కారు. ఆటలో అద్భుతంగా రాణించి.. తద్వారా వచ్చిన కీర్తిప్రతిష్టలతో తమ ఇమేజ్‌ను క్యాష్ చేసుకుంటూ ఆర్థికంగా మరింత పరిపుష్టి చెందుతున్నారు.
(PC: Mrudula Jadeja Instagram)
రెండు చేతులా సంపాదన
అటు క్రికెట్ ద్వారా.. ఇటు వివిధ ప్రఖ్యాత బ్రాండ్లకు ప్రచారకర్తలుగా పనిచేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇక వీరు నివసించే ఇళ్ల విలువ కూడా వారి స్థాయికి తగ్గట్లే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
(PC: Mrudula Jadeja Instagram)
ముంబైలో ఖరీదైన కలల సౌధం
‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండ్కులర్ ఆర్థిక రాజధాని ముంబైలో తన కలల సౌధాన్ని నిర్మించుకున్నాడు. బాంద్రాలో ఉన్న ఈ ఇంటి విలువ సుమారు 80 కోట్ల రూపాయలకు పైమాటే!
(PC: Mrudula Jadeja Instagram)
రాంచిలో ధోని ఫామ్‌హౌజ్
ఇక టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన మహేంద్ర సింగ్ ధోని స్వస్థలం రాంచిలో తన ఫామ్‌హౌజ్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ విలాసవంతమైన భవనం విలువ రూ. 6 కోట్లు ఉంటుందని అంచనా!
(PC: Mrudula Jadeja Instagram)
రోహిత్ నివాసం విలువ 30 కోట్లు
ఇదిలా ఉంటే.. ప్రస్తుత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ముంబైలో విలాసవంతమైన భవనంలో నివసిస్తున్నాడు. 53 అంతస్తుల బిల్డింగ్‌లో 29వ ఫ్లోర్‌లో రోహిత్ ఉంటున్న నివాసం విలువ సుమారు రూ. 30 కోట్లు ఉంటుందని తెలుస్తోంది.
(PC: Mrudula Jadeja Instagram)
గురుగ్రామ్‌లో క్రికెట్ ఐకాన్ కోహ్లి లావిష్ హోం
అదే విధంగా.. ఆధునిక క్రికెట్ తరానికి ఐకాన్ అయిన విరాట్ కోహ్లి, తన భార్య, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మతో కలిసి ఖరీదైన ఇంటిలో నివాసం ఉంటున్నాడు. గురుగ్రామ్‌లో ఉన్న ఈ లావిష్ బిల్డింగ్ విలువ రూ. 80 కోట్లు ఉన్నట్లు సమాచారం.
(PC: Mrudula Jadeja Instagram)
ప్యాలెస్‌లో నివసిస్తున్న భారత క్రికెటర్ ఎవరంటే?
అయితే, ఈ నలుగురు రిచెస్ట్ క్రికెటర్ల కంటే ఖరీదైన భవనంలో నివసిస్తున్న భారత క్రికెటర్ మరొకరు ఉన్నారు. ఆమె పేరు మృదుల జడేజా. పేరు చూసి టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బంధువు అనుకునేరు?!
కుటుంబంతో మృదుల (PC: Instagram)
కానే కాదు.. మృదుల జడేజా ఓ ‘యువరాణి’!! గుజరాత్‌లోని రాజవంశానికి చెందిన అమ్మాయి. ఆమె తండ్రిపేరు మంధాతసిన్హ్ జడేజా. మృదులకు ఓ సోదరుడు కూడా ఉన్నాడు. తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి ఆమె చారిత్రాత్మక రంజిత్ విలాస్ ప్యాలెస్‌లో నివాసం ఉంటున్నారు.
(PC: Mrudula Jadeja Instagram)
6 ఎకరాల్లో.. 150కి పైగా గదులతో ఆ ప్యాలెస్
రాజ్‌కోట్‌లో సుమారు 225 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఎస్టేట్‌లో.. ఆరు ఎకరాల స్థలంలో ఈ భవనం ఉంది. మృదుల కుటుంబానికి చెందిన ప్యాలెస్‌లో 150కి పైగా గదులు ఉన్నాయి. అంతేకాదు.. వారి గ్యారేజ్‌లో ఎన్నో విలాసవంతమైన వింటేజీ కార్లు కూడా కొలువు దీరి ఉన్నాయి.
మిగతా రాజకుటుంబాలు తమ నివాసాలను హెరిటేజ్ హోటళ్లుగా మలుస్తున్న తరుణంలో రంజిత్ విలాస్ ప్యాలెస్‌ను మాత్రం తమ పూర్వీకుల రాజసానికి గుర్తుగా అలాగే ప్రైవేట్ ప్రాపర్టీగా ఉంచేశారు. ఇక తమ రాజభవానికి సంబంధించిన ఫొటోలను మృదుల జడేజా అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంటారు.
(PC: Mrudula Jadeja Instagram)
సౌరాష్ట్ర జట్టు సారథి
మృదుల జడేజా ఆల్‌రౌండర్. దేశవాళీ క్రికెట్‌లో సౌరాష్ట్ర మహిళా జట్టుకు ఆమె సారథ్యం వహించారు. తన కెరీర్‌లో పరిమిత ఓవర్ల క్రికెట్లో 46(వన్డే), టీ20 ఫార్మాట్లో 36, ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఒక మ్యాచ్ ఆడారు.
కుడిచేతి వాటం గల బ్యాటర్ అయిన 32 ఏళ్ల మృదుల.. రైటార్మ్ మీడియం పేసర్ కూడా!! గతంలో.. పురుష, మహిళా క్రికెటర్ల వేతనాలకు మధ్య వ్యత్యాసాలపై గళమెత్తిన వాళ్లలో మృదుల కూడా ఒకరు. కాగా మృదుల జడేజా కేవలం క్రికెటర్ మాత్రమే కాదు.. గోల్ఫ్ పట్ల కూడా ఆమెకు మంచి అవగాహన ఉంది!!