అలా అయితే.. 2011 వరల్డ్‌కప్‌ పీడకలగా మిగిలేదేమో! ఇప్పుడు: కోహ్లి | Virat Kohli Desperate To See India Lift 2023 ODI World Cup - Sakshi
Sakshi News home page

WC 2023: అలా అయితే.. 2011 వరల్డ్‌కప్‌ పీడకలగా మిగిలేదేమో! ఇప్పుడు: విరాట్‌ కోహ్లి

Published Tue, Aug 29 2023 10:14 AM | Last Updated on Tue, Oct 3 2023 7:00 PM

Didnt Understand Magnitude Of Winning ODI WC: Kohli Desperate To Win - Sakshi

2011 వరల్డ్‌కప్‌ సమయంలో నాటి కెప్టెన్‌ ధోనితో కోహ్లి (PC: BCCI)

Virat Kohli Recalled India’s 2011 World Cup Win: ‘‘నా కెరీర్‌లో హైలైట్‌ అంటే వరల్డ్‌కప్‌-2011 ట్రోఫీ గెలవడమే! అప్పుడు నాకు 23 ఏళ్లు. బహుశా.. ఆనాడు ప్రపంచకప్‌ టోర్నీకి ఉన్న పరిమితి గురించి పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాననుకుంటా. కానీ ఇప్పుడు.. 34 ఏళ్ల వయసులో.. ఇప్పటికే ఎన్నో వరల్డ్‌కప్‌లు ఆడి.. 

ఒక్క ఈవెంట్‌లోనూ గెలవలేకపోయిన తర్వాత.. ఇప్పుడు నాకు అన్నీ అర్థమవుతున్నాయి. 2011లో జట్టులో ఉన్న నాటి సీనియర్ల భావోద్వేగాలను పూర్తిగా అర్థం చేసుకోగలుగుతున్నా. అందరి కంటే ముఖ్యంగా సచిన్‌ టెండుల్కర్‌.. 

ఆయనకు అదే ఆఖరి ప్రపంచకప్‌. అప్పటికే ఎన్నో వరల్డ్‌కప్‌ టోర్నీల్లో ఆడి ఉన్నారు. అయితే.. ఎట్టకేలకు అది కూడా ముంబైలో.. సొంతగడ్డపై ట్రోఫీ గెలవడం ఆయనకు మరింత ప్రత్యేకంగా మారింది. కలలు నిజం కావడం అంటే ఇదేనేమో!’’ అని టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఉద్వేగానికి లోనయ్యాడు.

అలా అయితే అదో పీడకలగా మిగిలేదేమో!
2011 తర్వాత తన కెరీర్‌లో ఒక్క ఐసీసీ వన్డే విజయం కూడా లేకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశాడు. మెగా ఈవెంట్లలో ఆటగాళ్లపై ఒత్తిడి ఉండటం సహజమన్న కోహ్లి.. ‘‘సీనియర్లపై ఎంత ఒత్తిడి ఉన్నా వాళ్లు దానిని అధిగమించిన తీరును దగ్గరగా చూశాను.

దేవుడి దయ వల్ల అప్పట్లో సోషల్‌ మీడియా ఇంతగా విస్తృతి చెందలేదు. లేదంటే.. నాకైతే అదో పీడకలగా మిగిలేదేమో! ఏదేమైనా అప్పుడు కూడా ఎక్కడ చూసినా.. ఎయిర్‌పోర్టులు, స్టేడియం.. ఇలా ఎక్కడైనా సరే.. ఒకటే మాట.. మనం కప్పు గెలవాలి.

నాడు విలువైన ఇన్నింగ్స్‌ ఆడి
ప్రపంచకప్‌ విజయం తర్వాత ఆ రాత్రి నిజంగా ఓ అద్భుతంగా మిగిలిపోయింది’’ అని నాటి సంగతులు గుర్తు చేసుకున్నాడు. కాగా ధోని సారథ్యంలోని భారత జట్టు 2011లో ప్రపంచకప్‌ ట్రోఫీని ముద్దాడిన విషయం తెలిసిందే. నాడు కోహ్లి మొత్తంగా 9 మ్యాచ్‌లు ఆడి 282 పరుగులు సాధించాడు. 

ముంబైలోని వాంఖడేలో శ్రీలంకతో జరిగిన ఫైనల్లో 35 పరుగులతో విలువైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇదిలా ఉంటే.. పుష్కర కాలం తర్వాత మళ్లీ భారత్‌ వన్డే వరల్డ్‌కప్‌నకు ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే.

కోహ్లి.. కెప్టెన్‌గా ఒక్క ట్రోఫీ గెలవలేదు..
అయితే, నాడు జట్టులో జూనియర్‌గా ఉన్న కోహ్లి.. తదనంతరం రన్‌మెషీన్‌గా ఎదిగి.. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి టీమిండియాను ముందుకు నడిపించాడు. కానీ సారథిగా ఒక్క ఐసీసీ విజయం కూడా అందుకోలేకపోయాడు. ఈసారి రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో స్వదేశంలో జరుగనున్న ఈవెంట్‌లో బ్యాటర్‌గా కింగ్‌ ఏ మేరకు రాణిస్తాడో చూడాలి! కాగా అక్టోబరు 5 నుంచి వన్డే ప్రపంచకప్‌-2023 ఆరంభం కానుంది.

చదవండి: Rohit Vs Kohli: సచిన్‌ అరుదైన రికార్డుపై కన్నేసిన రోహిత్‌, కోహ్లి.. ఈసారి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement