టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలవడంతో భారత్ ఖాతాలో ఐదో ఐసీసీ ట్రోఫీ చేరింది. ఈ మెగా టోర్నీ ముగిసి వారం రోజులు దాటినా ఆ గెలుపు తాలుకా సంబరాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో రోహిత్ సేనకు బీసీసీఐ అందించిన రూ. 125 కోట్ల భారీ నజరానా ప్రత్యేకంగా హైలైట్‌గా నిలిచింది. ఇందుకు సంబంధించిన పంపకాల గురించి కూడా నెట్టింట చర్చ జరుగుతోంది. ఆటగాళ్లకు రూ. 5 కోట్ల మేర అందించడం అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ క్రమంలో 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్‌కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ టైటిల్స్ సాధించిన ధోని సేనకు బోర్డు ఎంత క్యాష్ రివార్డు ప్రకటించింది? ఎవరెవరికి ఎంత మొత్తం దక్కిందన్న అంశంపై ఆరా తీస్తున్నారు నెటిజన్లు. మరి ఆ వివరాలు చూద్దామా?
పొట్టి కప్ మొదటగా మనకే
2007లో టీమిండియా తొలిసారి పొట్టి వరల్డ్‌కప్ గెలిచింది. ధోని సారథ్యంలో తొట్ట తొలి టీ20 ప్రపంచకప్‌ను భారత్ కైవసం చేసుకుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఓడించి ట్రోఫీని ముద్దాడింది. నాడు జట్టు మొత్తానికి కలిపి బీసీసీఐ 12 కోట్ల రూపాయల రివార్డు ప్రకటించింది.
సొంత గడ్డపై వన్డే ప్రపంచకప్
ఇక సొంతగడ్డపై 2011లో ధోని సేన మరోసారి మ్యాజిక్ చేసింది. ప్రఖ్యాత వాంఖడే మైదానంలో జరిగిన ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసి.. వన్డే వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకుంది. ఆనాడు భారత క్రికెట్ నియంత్రణ మండలి తొలుత.. జట్టులోని ఒక్కో ఆటగాడికి రూ. కోటి మేర క్యాష్ రివార్డు అందిస్తామని తెలిపింది.
అయితే, అనంతరం దీనిని రూ. 2 కోట్లకు పెంచింది. అదే విధంగా.. సహాయక సిబ్బందికి రూ. 50 లక్షలు, సెలక్టర్లకు రూ. 25 లక్షల చొప్పున క్యాష్ రివార్డు అందించింది.
చాంపియన్స్ ట్రోఫీ విజేతలకు ఎంతంటే?
2013లో చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులోని ఆటగాళ్లకు బీసీసీఐ రూ. కోటి చొప్పున నజరానా అందించింది. అదే విధంగా సహాయక సిబ్బందికి రూ. 30 లక్షల మేర కానుకగా ఇచ్చింది.
మరి మొట్టమొదటి వరల్డ్‌కప్ గెలిచిన కపిల్స్ డెవిల్స్‌కు ఎంత?
1983లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కపిల్ దేవ్ సేన ఏకంగా వన్డే వరల్డ్‌కప్ గెలిచి చరిత్ర సృష్టించింది. అయితే, అప్పటికే క్రికెట్‌కు పెద్దగా ఆదరణ లేకపోవడం.. బీసీసీఐ వద్ద కూడా తగినన్ని నిధులు లేక సంబరాలు కూడా సాదాసీదాగా జరిగాయి.
నాడు ఒక్కో ఆటగాడికి కేవలం పాతికవేలు మాత్రమే బీసీసీఐ రివార్డుగా ఇచ్చినట్లు సమాచారం. అయితే, ప్రముఖ గాయని లతా మంగేష్కర్ తన మ్యూజిక్ కన్సర్ట్ ద్వారా నిధులు సమీకరించడంతో ఈ మొత్తాన్ని లక్ష రూపాయలకు పెంచినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
2007 టీ20 వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టు
మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), యువరాజ్ సింగ్ (వైస్ కెప్టెన్), అజిత్ అగార్కర్, పీయూష్ చావ్లా, గౌతం గంభీర్, హర్భజన్ సింగ్, జోగిందర్ శర్మ, దినేశ్ కార్తీక్, యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, ఆర్పీ సింగ్, ఎస్. శ్రీశాంత్, రాబిన్ ఉతప్ప.
2011 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టు
మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, మునాఫ్ పటేల్, విరాట్ కోహ్లి, సురేశ్ రైనా, శ్రీశాంత్, ఆశిష్ నెహ్రా, రవిచంద్రన్ అశ్విన్, పీయూష్ చావ్లా, యూసుఫ్ పఠాన్.
2013 చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టు:
మహేంద్ర సింగ్ ధోనీ(కెప్టెన్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శిఖర్ ధావన్, దినేశ్ కార్తీక్(వికెట్ కీపర్), విరాట్ కోహ్లి, భువనేశ్వర్ కుమార్, వినయ్ కుమార్, అమిత్ మిశ్రా, ఇర్ఫాన్ పఠాన్, సురేశ్ రైనా, ఇషాంత్ శర్మ, రోహిత్ శర్మ, మురళీ విజయ్, ఉమేశ్ యాదవ్.
1983 వరల్డ్‌కప్ గెలిచిన టీమిండియా
కపిల్ దేవ్(కెప్టెన్), మొహిందర్ అమర్‌నాథ్(వైస్ కెప్టెన్), కీర్తి ఆజాద్, రోజర్ బిన్నీ, సునిల్ గావస్కర్, సయ్యద్ కిర్మాణీ(వికెట్ కీపర్), మదన్ లాల్, సందీప్ పాటిల్, బల్విందర్ సంధు, యశ్‌పాల్ శర్మ, రవి శాస్త్రి, క్రిష్ణమాచారి శ్రీకాంత్, సునిల్ వాల్సన్, దిలిప్ వెంగ్‌సర్కార్.
Comments
Please login to add a commentAdd a comment