ఇండియాలో రిచెస్ట్ క్రికెటర్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి సంబంధించి ఒక విషయం మళ్లీ వార్తల్లో నిలిచింది. 2017లో ఎనిమిదేళ్లకు గాను రూ. 100 కోట్లకు పైగా ఒప్పందంపై సంతకం చేసిన తొలి భారత క్రికెటర్‌గా (అప్పటికి భారత కెప్టెన్) రికార్డ్ దక్కించుకున్నాడు. స్పోర్ట్స్ లైఫ్‌స్టైల్ బ్రాండ్ ప్యూమాతో రూ.110 కోట్ల ఒప్పందం చేసుకోవడం ఇపుడు మళ్లీ విశేషంగా చర్చల్లో నిలుస్తోంది. ఈ డీల్ ద్వారా ప్యూమాకు గ్లోబల్ అంబాసిడర్లు జమైకన్ స్ప్రింటర్లు ఉసేన్ బోల్ట్ , అసఫా పావెల్ , ఫుట్‌బాల్ క్రీడాకారులు థియరీ హెన్రీ , ఆలివర్ గిరౌడ్ సరసన చేరాడని క్రికెట్ ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు.
ఇటీవలి కాలంలో క్రికెట్ స్టార్‌లకు ఎండార్స్‌మెంట్ డీల్స్ ఒక రేంజ్‌లో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోని , రోహిత్ శర్మ లాంటి వాళ్లు కోట్ల విలువైన పలు ఎండార్స్‌మెంట్ ఒప్పందాలను కుదర్చుకున్నారు. వీరిలో రూ.1,000 కోట్లకు పైగా నికర విలువతో భారత ధనిక క్రికెటర్‌గా గుర్తింపు పొందిన కోహ్లికి రూ.110 కోట్ల ప్యూమా డీల్ చాలా కీలకం.
అయితే బ్రాండ్ విలువలో మాత్రం కోహ్లి మొదటి వాడు కాదు. 2001 లోనే లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ రూ. 100 కోట్ల డీల్ మార్కును సాధించాడు. అపారమైన బ్రాండ్ వాల్యూతో మెగాస్టార్లుగా మారుతున్న ట్రెండ్‌కు ఆద్యుడు సచిన్ అనే చెప్పాలి. స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ కంపెనీ వరల్డ్‌టెల్‌తో సచిన్ రూ.100 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు.
సచిన్‌ను గ్లోబల్ బ్రాండ్‌గా క్రియేట్ చేసిన ఘనత మార్కెటింగ్ నిపుణుడు మార్క్ మస్కరెన్హాస్ నేతృత్వంలోనేదే ఈ సంస్థ. ఈ డీల్ అప్పట్టో సంచలనమే కాదు, ఇది భారత క్రికెట్‌లో బ్రాండింగ్, ఎండార్స్‌మెంట్ల రూపాన్ని మార్చేసిందని క్రీడా పండితుల భావన. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పుణ్యమా అని క్రికెటర్ల బ్రాండ్ విలువ పెరుగుతూ వస్తోన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment