పెరిగిన టాలీవుడ్ స్థాయి
తెలుగు సినిమా రంగం (టాలీవుడ్) స్థాయి పెరిగిపోయింది. ఇది అన్ని అంశాలకు వర్తిస్తుంది. అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానమే కాకుండా భారీ బడ్జెట్తో కూడా చిత్రాలు నిర్మించడానికి నిర్మాతలు పోటీ పడుతున్నారు. దర్శకులు అత్యంత ఆధునిక పద్దతులు అనుసరించడమే కాకుండా, కధనంలో కూడా తమ సత్తా చాటుతున్నారు. దర్శకులు, నిర్మాతలతోపాటు హీరోలు, హీరోయిన్లు కూడా అందుకు తగిన విధంగా కష్టపడుతున్నారు. కావలసినంత సమయం కేటాయిస్తున్నారు. కథ, కథనంలో కొత్తదనం కోసం అన్నివిధాల శ్రమిస్తున్నారు. ఇటీవల జరుగుతున్న తెలుగు సినిమా నిర్మాణాలే ఇందుకు నిదర్శనం.
టాలీవుడ్‌లో ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాల గురించే చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఒక్క పక్క దర్శకుడు రాజమౌళి భారతీయ సినిమా చరిత్రనే తిరగరాసే విధంగా అత్యంత అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో 'బాహూబలి'ని చెక్కుతుంటే, మరోపక్క మరో ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ‘రుద్రమదేవి’ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్నారు. ఈ రెండు చిత్రాలు దర్శకత్వమే ప్రధానంగా భారీబడ్జెట్తో రూపొందిస్తున్నారు. దర్శకులు ఇద్దరూ ఈ సినిమాల కోసం కొత్తకొత్త ప్రయోగాలు చేస్తున్నారు. నూతన ఆవిష్కరణలతో ఈ చిత్రాలను మన ముందుకు తీసుకురానున్నారు. తమ ప్రతిభచాటే యత్నంలో వీరిద్దరూ నిమగ్నమై ఉన్నారు. ఈ రెండూ మల్టీస్టారర్ చిత్రాలే. ఈ రెంటిలో అగ్ర కథానాయిక అనుష్క, హీరో రాణా ప్రధాన పాత్రలలో నటించడం విశేషం. హీరోలకు ధీటుగా అనుష్క నటిస్తున్నట్లు సమాచారం. ఇలా ఈ రెండు చిత్రయూనిట్ సభ్యులు బిజి బిజిగా ఉంటే, మరో మెగా హీరో కూడా ఓ చారిత్రక చిత్రంలో నటించడానికి సిద్ధమయ్యారు.
కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాణి రుద్రమదేవి సాహసాల ఆధారంగా గుణా టీమ్ వర్స్క్ పతాకంపై రాగిణీ గుణ సమర్పణలో దీనిని నిర్మిస్తున్నారు. దేశంలోనే తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డి చిత్రంగా డైనమిక్ దర్శకుడు గుణశేఖర్ ‘రుద్రమదేవి’ రూపొందిస్తున్నారు. గుణశేఖర్ అంటే సెట్టింగ్స్ గురించి చెప్పేపనేముంది. ఈ విషయంలో ఆయన ప్రతిభ అందరికీ తెలిసిందే. తెలుగు చిత్రసీమ గర్వించదగిన తోట తరణి దీనికి కళా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం యుద్ధ సన్నివేశాలను గుణశేఖర్ అద్బుతంగా చిత్రీకరించినట్లు తెలుస్తోంది.
ఈ చారిత్రక చిత్రంలో గోన్నగన్నారెడ్డి అనే కీలక పాత్రను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్నాడు. బన్నీకి ఈ పాత్ర ఎంతగానో నచ్చడంతో ఓకె చెప్పాడట. ప్రముఖ హీరోలు అతిధి పాత్రైనా ఇటువంటి కీలక పాత్రలలో నటించడం శుభపరిణామమే. గోన్నగన్నారెడ్డి పాత్ర ఎవరు చేసినా గొప్పగా ఉంటుందని భావిస్తున్నారు. రాబిన్ హూడ్ తరహా పాత్ర అని గుణశేఖర్ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఈ పాత్ర ప్రాధాన్యత రీత్యా ప్రముఖ హీరోల కోసమే గుణశేఖర్ ప్రయత్నించినట్లు తెలిసింది. అయితే చివరకు ఇది బన్నీని వరించింది. ఈ చిత్రంలో మరో ముఖ్య విశేషం ఉన్నట్లు తెలుస్తోంది. వయ్యారి భామ అనుష్కను హరివీరభయంకర యుద్ధవిద్యలలో ఆరితేరిన వీరనారిగా చూపుతూనే మరో పక్క ఆమె అందాలను గుణశేఖర్ అద్భుతంగా చూపించనున్నారు.
s.nagarjuna@sakshi.com