విడుదలకు ముందే 'బాహుబలి' రికార్డులు! | Bahubali records | Sakshi
Sakshi News home page

విడుదలకు ముందే 'బాహుబలి' రికార్డులు!

Published Mon, Jul 7 2014 6:38 PM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

అనుష్క-ప్రభాస్ - Sakshi

అనుష్క-ప్రభాస్

దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి చెక్కుతున్న తాజా శిల్పం బాహుబలి. ఈ చిత్రం విడుదలకు ముందే అనేక సంచలనాలతోపాటు  రికార్డులు సృష్టిస్తోంది. తెలుగు సినీ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో తెరకెక్కుతున్న ఈ సినిమా హక్కుల కోసం నిర్మాతలు, పంపిణీదారులు ఎగబడుతున్నారు.  ఓటమి ఎరుగని ధీరుడిగా పేరు తెచ్చుకున్న  ఈ దర్శకుడి సినిమా కోసం మొత్తం భారతీయ సినిమా ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. బాలీవుడ్‌ను మించిపోయేలా హాలీవుడ్‌ స్థాయిలో రాజమౌళి తాజా సినిమా బాహుబలి  తెరకెక్కుతోందన్న వార్తలు సినీ అభిమానులకు ఎంతగానో ఆసక్తి కలిగిస్తున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ గర్వించే స్థాయిలో ఈ సినిమా నిర్మాణం జరుగుతోంది.  దీని కోసం దాదాపు 150  కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్లు అంచనా. మర్యాద రామన్న, ఈగ లాంటి సాదా సీదా కథలను కూడా అత్యద్భుతంగా తెరకెక్కించిన రాజమౌళి  ప్రభాస్‌, రానా లాంటి ఆజానుబాహులతో  అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించే ఈసినిమా కచ్చితంగా ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యానికి లోను చేస్తుందనే అభిప్రాయం ఉంది.

భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఈ చిత్రం  పెద్ద హిట్‌  అవుతుందని పంపిణీదారులు అంచనా వేస్తున్నారు. ఆ ఉద్దేశంతో సినిమా ఏరియా హక్కుల కోసం కళ్లు చెదిరే మొత్తాన్ని వెచ్చిస్తున్నారు. దిల్ రాజు 25 కోట్ల రూపాయలతో ఈ సినిమా నైజాం ప్రాంత హక్కులు పొందినట్లు సమాచారం. ఒక ప్రాంత హక్కుల కోసం టాలీవుడ్ చరిత్రలో ఇంత పెద్ద మొత్తం చెల్లించడం ఇదే మొదటిసారి.  ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ రిస్క్‌ తీసుకోకపోతే గొప్ప సినిమాలు రావని  చెప్పారు. తెలుగు సినీ చరిత్రలో బాహుబలి గొప్ప సినిమాగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సినిమా  రాయలసీమ జిల్లాల హక్కులను 13 కోట్ల రూపాయలకు, కర్ణాటకలో పంపిణీ కోసం 9 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు టాలీవుడ్ సమాచారం. హాలీవుడ్ హంగులతో నిర్మించే  ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళం, మలయాళంతో పాటు పలు భాషల్లో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఆ ఉద్దేశంతో సినిమా డబ్బింగ్‌ సందర్భంగా భాషా సమస్యలు తలెత్తకుండా ఉండే విధంగా పదాలు ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది.

 ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై సోబు యార్లగడ్డ, కొవెలమూడి రాఘవేంద్ర రావు, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో నిర్మిస్తున్న ఈ సినిమాను 2015లో విడుదల చేస్తారు. ద్విపాత్రాభినయం చేస్తున్న  ప్రభాస్ సరసన తమన్నా నటిస్తోంది. ఇంకా ఈ జానపద చిత్రంలో  అనుష్క, రానా, సుదీప్, నాజర్, ప్రకాశ్ రాజ్  నటిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement