
అపజయాలను మరిచిపోను
జీవితంలో ఎదురైన అపజయాలను ఎప్పటికీ మరచిపోను అంటున్నారు నటి అనుష్క. చిత్రపరిశ్రమలో అనుష్క పేరు వినడం మొదలై దశకం దాటింది. ఈ యోగా టీచర్ నట జీవితం పదేళ్లు పూర్తి చేసుకుంది. అనుష్కను ఆదిలో అపజయాలే పలకరించాయి.అసలు ఈ ఫీల్డ్‌లోనే వద్దు తిరిగెళ్లిపోదాం అనే నిర్ణయాన్ని తీసుకున్నారట. అయితే ఆమెకు ఇక్కడే భవిష్యత్ ఉండడం వల్లో లేక సినీ ప్రేక్షకుల అదృష్టమో విధి అనుష్కను నటిగా నిలబెట్టింది. ఈ బ్యూటీ యోగా టీచర్‌గానే మిగిలిపోతే అరుంధతి, బాహుబలి, రుద్రమదేవి లాంటి చారిత్రక చిత్రాలు రావడానికి ఆస్కారం ఉండేది కాదేమో. ఇవాళ చారిత్రక కథా చిత్రం అంటే ముందుగా గుర్తుకు వచ్చే నటి అనుష్కనే అనడం సబబే.
గ్లామర్ పాత్రలకు సరిరారు నాకెవ్వరూ అన్నంతగా అలరించిన అనుష్క ఈ స్థాయికి అంత సులభంగా చేరుకోలేదు.తన పదేళ్ల సినీ జీవిత పయనాన్ని ఎలా విశ్లేషించుకున్నారన్నది క్లుప్తంగా అనుష్క మాటల్లోనే చూద్దాం. ‘2005లో నటిగా నా పయనం మొదలైంది. అయితే నాకంటూ ఒక స్థాయిని సంపాదించుకోవడానికి సుమారు ఐదేళ్లు పట్టింది. 2009లో నటించిన అరుంధతి నా సినీ జీవితంలో మైలు రాయిగా నిలిచిపోయింది. అంతకు ముందు చాలా అపజయాలను ఎదుర్కొన్నాను. సాధారణంగా విజయాలకు పొంగిపోవడం, అపజయాలకు కుంగిపోవడం చేస్తుంటాం. అయితే అది సరైన పని కాదు.
జయాపజయాలను సమంగా స్వీకరించే పరిపక్వతను పెంపొందించుకోవాలి. విజయాలు గౌరవాన్ని, అపజయాలు అనుభవాలను పెంచుతాయి. అపజయాలే విజయానికి మార్గం అవుతాయి. పరాజయాలతో నేను చాలా నేర్చుకున్నాను. నా జీవితంలో ఎదురైన అపజయాలను ఎప్పటికీ మర్చిపోను. ఎందుకంటే అవి మళ్లీ పొరపాట్లు చేయకుండా హెచ్చరిస్తుంటాయని అంటున్నారు అనుష్క’ పలు సాహసోపేత విన్యాసాలు చేసిన చారిత్రక కథా చిత్రం రుద్రమదేవి విడుదల కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ తరం నటీమణులెవ్వరూ నటించడానికి సాహసం చేయలేని ఇంజిఇడుప్పళగి చిత్రంలోనూ నటిస్తున్నా రు. ఈ చిత్రం కోసం అనుష్క 20 కే జీల వరకూ బరువు పెరిగిన విషయం విదితమే.