నటనకు అవకాశం ఉంటే చాలు..
పాత్రకు తగ్గట్టు అభినయించడమే కాదు, అందుకు తగ్గట్టుగా తనను మలచుకోవడానికి శ్రమించే నటి అనుష్క.అందుకే అగ్రనాయకిగా రాణిస్తున్నారని చెప్పవచ్చు.ఆదిలో అందాలారబోతకే ప్రాధాన్యం ఇచ్చిన ఈ యోగా సుందరి ఆ తరవాత నటనకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించారు. అరుంధతి చిత్రంలో తన నట విశ్వరూపాన్ని చూపించారనే చెప్పాలి. ఆ తరువాత రుద్రమదేవి, బాహుబలి వంటి చిత్రాల్లో పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశారు. ప్రస్తుతం బాహుబలి– 2లో మరోసారి బ్యూటీ నట విజృంభణను చూడబోతున్నాం. అదే విధంగా మధ్యలో ఇంజి ఇడుప్పళగి(తెలుగులో జీరోసైజ్) చిత్ర పాత్ర కోసం సుమారు 90 కిలోల బరువును పెంచుకుని నటించారు.
అంత సాహసం మరో నటి చేస్తుందని చెప్పలేం.అదే విధంగా నటిగా మంచి ఇమేజ్‌ను సంపాదించుకున్న అనుష్క వేదం చిత్రంలో వేశ్యగా నటించారు. ఆ సమయంలో ఆ పాత్రను పోషించవద్దని, ఇమేజ్ బాధిస్తుందని చాలా మంది భయపెట్టారట.అయినా పాత్ర మీద నమ్మకంతో ధైర్యంగా నటించారు. ఆ పాత్ర తన ఇమేజ్‌ను ఏమాత్రం డ్యామేజ్ చేయలేదని ఇటీవల చెన్నైకి వచ్చిన అనుష్క పేర్కొన్నారు. అదే విధంగా పాత్ర మంచిదా? చెడ్డదా? అన్నది తనకు ముఖ్యం కాదని, నటనకు అవకాశం ఉందా?అన్నదే తాను చూస్తానని అనుష్క అన్నారు. ప్రస్తుతం భాగమతి అనే మరో స్త్రీ ప్రధాన ఇతి వృత్తంతో కూడిన చిత్రంలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ కోసం ఒక మెగా అవకాశం ఎదురు చూస్తోందనే ప్రచారం జోరుగా సాగుతోంది.అన్నట్టు ఆ మధ్య బొద్దుగా మారిన ఈ చక్కనమ్మ బొమ్మాళి మళ్లీ చిక్కి అందాలను మెరుగేసుకున్నారు.