ఈ చిత్రానికి మేమందరం రాళ్లెత్తిన కూలీలం : గుణశేఖర్
‘‘చిన్నతనం నుంచి కాకతీయ రాజుల చరిత్రపై ఆసక్తి చూపించేవాణ్ణి. ‘రుద్రమదేవి’ చిత్ర నిర్మాణం నా లక్ష్యం. అది నెరవేరినందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమా నా ఒక్కడి ప్రతిభే కాదు. మొత్తం టీమ్ అంతా కష్టపడ్డాం. ‘రుద్రమదేవి’ అనే సినిమాకి రాళ్లెత్తిన కూలీలం మేం. తెలుగు ప్రజలందరూ ఈ చిత్రానికి భారీ విజయం చేకూర్చాలని కోరుకుంటున్నాను’’ అని గుణశేఖర్ అన్నారు. గుణ టీమ్ వర్క్స్ పతాకంపై శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో స్వీయదర్శకత్వంలో గుణశేఖర్ రూపొందించిన చిత్రం ‘రుద్రమదేవి’. టైటిల్ రోల్‌లో అనుష్క నటించిన ఈ చిత్రంలో గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్, చాళుక్య వీరభద్రునిగా రానా నటించారు.
మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా స్వరపరచిన ఈ చిత్రం పాటలను వరంగల్‌లో ఆవిష్కరించారు. ఈ వేడుకలో ముఖ్య అతిధిగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ - ‘‘కాకతీయుల చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పడం గర్వంగా ఉంది. గుణశేఖర్ చారిత్రక నేపథ్యం గల సినిమాలు మరిన్ని తీయాలి. నాటి రుద్రమదేవి ఎలా ఉండేవారో తెలియదు కానీ, అలనాటి రుద్రమదేవిగా అనుష్క భువి నుంచి దివికి దిగి వచ్చినట్లుగా ఉన్నారు’’ అని చెప్పారు.
ఈ చిత్రం ఓ మంచి ప్రయత్నమనీ, ఘనవిజయం సాధించాలనీ వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళిధర్‌రావు ఆకాంక్షించారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ - ‘‘నాకు ఆడవాళ్లంటే అభిమానం. అందుకే ఈ చిత్రం చేశా. ఈ చిత్రానికి అనుష్కే హీరో. ఆమె చేయకపోతే ఈ సినిమా లేదు. కొంతమంది ధనార్జనే ధ్యేయంగా సినిమాలు తీస్తారు. కానీ, గుణశేఖర్ ఎంతో మమకారంగా తీస్తారు. ఆయన కోసమే ఈ సినిమా ఆడాలి. తెలుగు సినిమా ఘనతను ప్రపంచానికి చాటే ఇలాంటి చిత్రంలో నటించినందుకు ఆనందంగా ఉంది. ఇక, చరిత్ర గురించి చెప్పాలి. చిరంజీవిగారు ఎండనకా వాననకా కష్టపడితే, ఆ నీడలో పైకొచ్చినవాళ్లం.
అందుకే, నా మటుకు నాకు ఆయన తర్వాతే ఎవరైనా’’ అంటూ ‘నేనూ ఆడా ఉంటా.. ఈడా ఉంటా.. తెలుగు భాష లెక్క’ అని ‘రుద్రమదేవి’లోని డైలాగ్ చెప్పి, ప్రేక్షకులను అలరించారు. కాకతీయులకే కీర్తి తీసుకొచ్చిన రాణి రుద్రమదేవి పాత్రలో నటించడం తన అదృష్టంగా భావిస్తున్నానని అనుష్క అన్నారు. ఇంకా ఈ వేడుకలో సిరివెన్నెల సీతారామశాస్త్రి, కృష్ణంరాజు, పరుచూరి గోపాలకృష్ణ, ‘దిల్’ రాజు, హంసానందిని తదితరులు పాల్గొన్నారు. నిత్యామీనన్, కేథరిన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్, ఆర్ట్: తోట తరణి, కెమెరా: అజయ్ విన్సెంట్, సహనిర్మాతలు: నీలిమ, యుక్తా ముఖి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రామ్‌గోపాల్.
- సాక్షి ప్రతినిధి, వరంగల్