
స్వీటీ... వెరైటీ పాత్రల బ్యూటీ
ఈ దీపావళి లోపల రెండు నెలల్లో ఒకటికి రెండు లేడీ ఓరియంటెడ్ సినిమాలు రానున్నాయి. కాకతీయ సామ్రాజ్యాన్ని ఏలిన ‘రుద్రమదేవి’ జీవితం చూపే తెలుగు జాతి చరిత్ర ఒకటైతే, ఆడపిల్లంటే అందంగా - నాజూగ్గా - నడుము సన్నంగా ఉండాలనే ఆధునిక తెలుగు సమాజపు అర్థం పర్థం లేని బ్యూటీ డెఫినిషన్ ‘సైజ్ జీరో’ను ప్రశ్నించే కాంటెంపరరీ కథ మరొకటి. చిత్రంగా అటు ‘రుద్రమదేవి’గా, ఇటు ‘సైజ్ జీరో’ కోసం శ్రమించాల్సి వచ్చిన అమ్మాయిగా అలరించనున్నది ఒకే హీరోయిన్! ... ‘స్వీటీ’ అనుష్క.
ఇలాంటి వెరైటీ కథలు తీయడం ఒక రకంగా ఇవాళ్టి మార్కెట్ ట్రెండ్‌లో సాహసమే. ఆ సాహసానికి సిద్ధపడడం గుణశేఖర్ (‘రుద్రమదేవి’), కోవెలమూడి ప్రకాశ్ (‘సైజ్‌జీరో’) లాంటి దర్శక, నిర్మాతల తీరని సృజనాత్మక దాహానికి ప్రతీక. ఇలాంటి తీసేవాళ్ళు ఒకరిద్దరున్నా చేసేవాళ్ళెవరన్నది ప్రశ్న. కోట్ల సంపాదనతో తృప్తి పడకుండా కలకాలం చెప్పుకొనే కొన్ని సినిమాలైనా కెరీర్‌లో మిగిలిపోవాలని భావించడంతో అనుష్క ఆ గట్స్ తనకున్నాయని నిరూపించుకుంది.
మొన్నటికి మొన్న ‘బాహుబలి... ది బిగినింగ్’లో దేవసేనగా ముసలి క్యారెక్టర్‌లో కనిపించి, ఇప్పుడిలా 3డీలో ‘రుద్రమదేవి’గా కత్తి పట్టుకొని, ‘సైజ్ జీరో’లో అమాయకత్వం నిండిన అందమైన భారీకాయంతో ఐస్‌క్రీమ్ పట్టుకొని అనుష్క వైవిధ్యంగా కనిపిస్తున్నారు. ఇలా మూడు వేర్వేరు తరహా పాత్రలతో ఈ ఏడాది మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ అయిన ఈ కన్నడ కస్తూరి ఈ అక్టోబర్, నవంబర్‌లలో ‘రుద్రమదేవి’, ‘సైజ్‌జీరో’ ఎప్పుడెప్పుడు రిలీజవుతాయా అని ఎదురుచూస్తున్నారు. పడిన కష్టానికి తగ్గ ప్రశంసలు, బాక్సాఫీస్ రిజల్ట్ రావాలని విఘ్నేశ్వరుడికి మొక్కుకుంటున్నారు.