సై జీరో! | Size Zero movie review | Sakshi
Sakshi News home page

సై జీరో!

Published Fri, Nov 27 2015 10:55 PM | Last Updated on Sun, Sep 3 2017 1:07 PM

సై జీరో!

సై జీరో!

కొత్త   సినిమా గురూ!
 
చిత్రం: ‘సైజ్ జీరో’
తారాగణం: అనుష్క, ఆర్య, సోనాల్ చౌహాన్
రచన: కనిక కోవెలమూడి
సంగీతం: కీరవాణి
కెమేరా: నీరవ్ షా
ఆర్ట్: ఆనంద్ సాయి
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సందీప్ గుణ్ణం;
నిర్మాత: పరమ్ వి. పొట్లూరి, కెవిన్ అన్నే
దర్శకత్వం: ప్రకాశ్ కోవెలమూడి.

 
సైజ్ జీరో... నాజూకైన నడుము... ఇవాళ తరచూ వినిపిస్తున్న మాట. అవును. సౌందర్య సాధనాలు, ఉత్పత్తులు, బరువు తగ్గడం అనేవి ప్రత్యేక పరిశ్రమలుగా, వేల కోట్ల రూపాయల వ్యాపారంగా మారినప్పుడు సహజమైన శరీరాకృతీ సహించరానిదే అవుతుంది. సమాజం మొత్తానికీ జెన్నీఫర్ లోపెజ్ లాంటి నాజూకు నడుములే కంపల్సరీ కండిషనింగ్ టెంప్లేట్‌లవుతాయి. అందాల పోటీలు మన ఇంటి దాకా దిగుమతి అయిందీ, మన అమ్మాయిల తల మీద అందాల రాణి కిరీటాలను ఎక్కించిందీ అందుకే! ఈ ఆలోచనల నేపథ్యంలో ‘సైజ్ జీరో’ పిచ్చిని ఆలంబనగా చేసుకొని ప్రకాశ్ కోవెలమూడి తీసిన సినిమా - ‘సైజ్ జీరో’ (సన్నజాజి నడుము అనేది ఉపశీర్షిక).సౌందర్య అలియాస్ స్వీటీ (అనుష్క) కథ ఇది. బరువు తూచే మిషన్, దానిలో నుంచి వచ్చే కార్డు వెనుక ఉండే భవిష్యత్ వాణితో చిన్నప్పటి నుంచి ఆమెకు విడదీయరాని అనుబంధం.

చిన్నతనంలోనే నాన్న (రావు రమేశ్)ను పోగొట్టుకుంటుంది. అమ్మ రాజేశ్వరి (ఊర్వశి), తాత (గొల్లపూడి మారుతిరావు)... ‘సాఫ్ట్‌వేర్’ అంటూ లోదుస్తుల వ్యాపారం చేసే తమ్ముడు యాహూ (భరత్) - హీరోయిన్ కుటుంబ సభ్యులు. హీరోయిన్ ‘సైజ్’ చూసి, వచ్చిన పెళ్ళి సంబంధాలన్నీ తప్పిపోతుంటాయి. ఎన్నారై డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ అభి (తమిళ హీరో ఆర్య) సంబంధం తప్పిపోయినా, వాళ్ళ మధ్య స్నేహం కొనసాగుతుంది. హీరోయిన్ అతణ్ణి మనసులో ఇష్టపడుతుంటుంది. ‘క్లీన్ ఇండియా’ డాక్యుమెంటరీ తీస్తున్న హీరో అదే టైమ్‌లో బ్రిటన్ నుంచి వచ్చిన మెరుపు తీగ లాంటి ఎన్జీఓ పిల్ల సిమ్రన్ (సోనాలీ చౌహాన్)కు క్రమంగా దగ్గరవుతుంటాడు. హీరోయిన్ గుండె బద్దలవుతుంది. అది ఫస్టాఫ్.

సత్యానంద్ (ప్రకాశ్‌రాజ్) నడుపుతున్న సైజ్ జీరో ప్రోగ్రామ్‌లో హీరోయిన్ చేరుతుంది. అందాల పోటీలకు వెళ్ళాలనుకుంటున్న హీరోయిన్ ఫ్రెండ్ కూడా అదే ప్రోగ్రామ్ చేస్తూ, ఒంట్లో కొవ్వు తగ్గించేందుకు అక్కడ వాడుతున్న అనారోగ్యకరమైన పద్ధతుల కారణంగా ఆస్పత్రి పాలవుతుంది. అక్కడ నుంచి హీరోయిన్ ఆ మోసకారి వెయిట్ రిడక్షన్ ప్రోగామ్ మీద పోరాటం మొదలుపెడుతుంది. దానికి, హీరో సాయం కూడా తీసుకుంటుంది. వాళ్ళు ‘పి.వి.పి. స్పోర్ట్స్’ శేఖర్ (అడివి శేష్) సాయంతో ఏం చేశారు? సిమ్రన్‌కూ, హీరోయిన్‌కూ మధ్య ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా సాగిన ప్రేమ చివరకు ఏమైందన్నది సినిమా రెండు గంటల పది నిమిషాల నిడివే ఉన్న ఈ సినిమాకు బలం - కొంత ప్యాడింగ్‌లు పెట్టుకున్నా, స్వయంగా బరువు పెరిగి మరీ అనుష్క చేసిన ‘బిగ్‌సైజ్’ సాహసం. ఆమె నటన చాలా ఈజ్‌తో సాగింది. ఆ తరువాత మనసుకు హత్తుకునేవి తల్లి పాత్ర, తాత పాత్ర. హీరోగా ఆర్య తమిళ వెర్షన్‌కూ పనికొచ్చే ఛాయిస్. హీరోయిన్ తమ్ముడు కామిక్ రిలీఫ్.

నిర్మాణ విలువలు పుష్కలంగా ఉన్న ఈ సినిమాలో కెమేరా (నీరవ్ షా) వర్క్ బాగుంది. ‘‘ఇన్నాళ్ళూ నేను నీ కూతుర్ని అనుకున్నా. కానీ, కష్టాన్నని ఇప్పుడే అర్థమైంది’’ (తల్లితో హీరోయిన్) లాంటి కొన్ని డైలాగులు (రచయిత కిరణ్) బాగున్నాయి. నిజానికి లావాటి వ్యక్తులు, వాళ్ళ ప్రేమ, పెళ్ళి కష్టాలు  కొత్తేమీ కాదు. కమలహాసన్ ‘సతీ లీలావతి’, ఇ.వి.వి ‘కితకితలు’, ‘లడ్డూబాబు’, హిందీ హిట్ ‘దమ్ లగాకే హైసా’ లాంటివన్నీ ఆ అంశాన్ని ఒక్కో రకంగా చూపెట్టినవే. ఇప్పుడీ ‘సైజ్ జీరో’ కొనసాగింపు. ‘క్లీన్ ఇండియా’ అంటూ ‘టాయిలెట్ క్లీన్ చెయ్... డాక్టర్‌ను దూరం చెయ్’ నినాదంతో ‘స్వచ్ఛభారత్’ ప్రోగ్రామ్‌కు ఫస్టాఫ్ మంచి పబ్లిసిటీ. హీరోయిన్ సమస్యకు పరిష్కారం చూపాల్సిన సెకండాఫ్ మరో టర్న్ తీసుకుంది. ‘గెట్ ఫిట్... డోన్ట్ క్విట్’ అంటూ ‘పి.వి.పి. స్పోర్ట్స్’ ఇనీషియేటివ్‌కూ, ఫిట్‌నెస్ అవసరానికీ పెద్ద పీట వేసింది. హీరోయిన్‌తో తన తల్లి పెంపకం గురించి ఊర్వశి చెప్పే సీన్లు లాంటివి సెంటిమెంటల్ ఫీల్ తెచ్చాయి. కథలో పోరాటం పెరిగి, ప్రేమ, హీరోయిన్  తాలూకు మానసిక సంఘర్షణ తగ్గడం చిక్కే.  
 
మొత్తం మీద అందమంటే మానసికమైనది కూడా అనీ, ‘సంతోషంతో ఉండే అమ్మాయిలే అసలైన అందమైన అమ్మాయిలు’ అనీ గుర్తుచేస్తుందీ ‘సైజ్ జీరో’. హాల్లో నుంచి బయటకొస్తుంటే ఎవరో అన్నట్లు, ఇది ‘బొద్దు’మనసుతో చూడాల్సిన వెయిట్ లెస్ ఎంటర్‌టైనర్!
 
 
సంగీత దర్శకుడు కీరవాణి ఈ సినిమా టైటిల్‌సాంగ్ సాకీ పాడుతూ, జోస్యుడిలా కనపడతారు.
ఈ సినిమా కోసం అనుష్క ఏకంగా 17 కిలోల పైగా బరువు పెరిగారు.
తెలుగుతో పాటు తమిళంలోనూ తీసిన ఈ సినిమా ‘ఇంజి ఇడుప్పళగి’గా అక్కడ రిలీజైంది.
నాగార్జున, తమన్నా సహా 7 మంది తారలు ఒక చోట గెస్ట్‌లుగా మెరుస్తారు.
ఆర్యకు యువహీరో నందు తెలుగుడబ్బింగ్ చెప్పారు.

- రెంటాల జయదేవ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement