size zero
-
నాకేం బరువుగా లేదే!
హీరోయిన్ అంటే సైజ్ జీరో అయ్యుండాలి. సన్నజాజి కొమ్మలా ఉండాలి అని కొందరు అభిప్రాయపడుతుంటారు. కానీ ఆ అభిప్రాయంతో నేనసలు ఏకీభవించను అంటున్నారు నిత్యా మీనన్. ఈ మధ్య బరువు బాగా పెరిగారు అని ఎవరో ఆమెను అడిగారు. అంతే... నాకేం అంత బరువుగా అనిపించడం లేదే అని చురుక అంటించారు. ఈ విషయమై నిత్యా మీనన్ మాట్లాడుతూ – ‘‘నా బరువు గురించి నేను మాట్లాడినా మాట్లాడకపోయినా సోషల్ మీడియాలో మాట్లాడేవాళ్లు మాట్లాడుతూనే ఉంటారు. నా బరువు గురించి నేనసలు కేర్ చేయను. నాకు ఏ ఇబ్బందీ లేనప్పుడు మీకెందుకు బరువుగా అనిపిస్తోంది? తగ్గాలంటే కొన్ని నెలల పని. పెద్ద విషయం కాదు. పాత తరం హీరోయిన్లు అందరూ బొద్దుగానే ఉండేవారు. అలాగని దర్శక–నిర్మాతలు వాళ్లతో సినిమాలు తీయడం మానేశారా? వాళ్లకంత పాపులారిటీ వచ్చిందంటే అది కేవలం వాళ్ల యాక్టింగ్ స్కిల్ వల్ల కానీ సైజ్ జీరో వల్ల కాదు. ఒకవేళ ఏదైనా చిత్రంలో సైజ్ జీరో పాత్రలో నన్ను చూపించాలనుకుంటే నా దగ్గ రకు రాకండి (దర్శక–నిర్మాతలను ఉద్దేశించి)’’ అని పేర్కొన్నారు. -
‘సైజ్ జీరో’ దర్శకుడి ‘మెంటల్ హై క్యా’
తెలుగులో అనగనగా ఒక ధీరుడు, సైజ్ జీరో సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రకాష్ కోవెలమూడి. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వారసుడిగా వెండితెరకు పరిచయం అయిన ప్రకాష్ కమర్షియల్ సక్సెస్ లు సాధించలేకపోయినా.. విభిన్న చిత్రాలతో తన మార్క్ చూపిస్తున్నాడు. గతంలో మార్నింగ్‌రాగా అనే జాతీయ స్థాయి చిత్రంతో ఆకట్టుకున్న ప్రకాష్ ప్రస్తుతం ఓ బాలీవుడ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. విలక్షణ నటుడు రాజ్ కుమార్ రావ్, స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ కీలక పాత్రల్లో మెంటల్ హై క్యా.? అనే సినిమాను రూపొందిస్తున్నాడు. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమాను బాలాజీ మోషన్ పిక్చర్స్, కర్మ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్రయూనిట్ విడుదల చేశారు. ఆసక్తికరంగా ఉన్న ఈ పోస్టర్స్ ఇప్పుడు సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. -
పంచ్ పడిందా?
‘సైజ్ జీరో’తో అనుష్కకు పంచ్ పడింది! అవును... ‘సైజ్ జీరో’నే! ఆమెను కుదురుగా కూర్చోనివ్వలేదు... సరిగా నిలబడనివ్వలేదు. అందరి నోళ్లలో నానేలా చేసింది! ‘సైజ్ జీరో’ కోసం అనుష్క బరువు పెరగడం ఓ వార్త అయితే... తర్వాత ఆమె ఏం చేసినా... ఎన్ని చేసినా... బరువు తగ్గడం లేదనే అంశంపై బోల్డన్ని పుకార్లు. ఏకంగా ‘బాహుబలి–2’లో గ్రాఫిక్స్ ద్వారా ఆమెను సన్నగా చూపించారని కామెంట్ చేశారు కొందరు! ఇప్పుడు అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘భాగమతి’ విడుదలకు సిద్ధమవుతున్న టైమ్‌లో మళ్లీ అటువంటి కామెంట్లు వస్తున్నాయి. ఈ వార్తలు అటు తిరిగి... ఇటు తిరిగి... అనుష్క చెవిన పడ్డట్టున్నాయి. అటువంటి పుకార్లకు చెక్ పెట్టాలనుకున్నారో... ఏమో ... ఫేస్బుక్లో స్లిమ్ముగా ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. అంతటితో ఆగలేదు. ఫొటోతో పాటు ‘‘మాయలు, మంత్రాలతో కల సాకారం కాదు. చెమట చిందించాలి. అంకితభావంతో కల కోసం కృషి చేయాలి. బాగా కష్టపడాలి’’ అని పేర్కొన్నారు. పుకార్లకు చెక్ పెట్టడానికి ఈ పంచ్ వేశారంటున్నారు సినిమా జనాలు. పంచ్‌కు పంచ్ అన్నమాట. -
అందంగా చూపేందుకు ఐదు కోట్లు
సినిమాలో అందం ఒక భాగం. ముఖ్యంగా హీరోయిన్ పాత్రల్లో అభినయానికి ఎంత స్కోప్ ఉన్నా అందం ఉండేలా జాగ్రత్తపడుతుంటారు దర్శక నిర్మాతలు. ఇక అగ్ర కథానాయకి అనుష్క విషయానికి వస్తే మందం ఆమెకు ఒక శాపంగా మారిందనే అనాలి. ఇంజి ఇడుప్పళగి(తెలుగులో జీరో సైజ్) చిత్రాన్ని ఏ ముహూర్తాన అంగీకరించిందో గానీ, ఆ చిత్ర ఎఫెక్ట్ ఈ బ్యూటీని వెంటాడుతూనే ఉంది. ఆ చిత్రంలోని పాత్ర కోసం బరువెక్కిన అనుష్క ఆ తరువాత తగ్గడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తున్నారట. బాహుబలి చిత్రంలో అనుష్క లావుగా కనిపించినా ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే అందులో హీరోకి తల్లిగా కనిపిస్తారు కాబట్టి. బాహుబలి–2కి వచ్చే సరికి అనుష్క బరువు గ్రాఫిక్స్ ద్వారా తగ్గించడానికి దర్శకుడు రాజమౌళి కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఆ చిత్రం తరువాత అనుష్క నటిస్తున్న చిత్రం భాగమతి. ఈ చిత్రానికి ఆ అమ్మడి బరువు భారంగా మారిందన్నది తాజా సమాచారం. అనుష్క ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం చాలా కాలంగా నిర్మాణంలో ఉంది. ఎట్టకేలకు వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయడానికి చిత్ర దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. అయితే భాగమతి చిత్రంలో అ నుష్క బరువును తగ్గించి అందంగా చూపించడానికి రూ.5 కోట్ల వరకూ గ్రాఫిక్స్ కోసం ఖర్చు చేస్తున్నారట. ఈ గ్రాఫిక్స్ పని ముంబైలో ముమ్మరంగా జరుగుతోందని సమాచారం. అనుష్కకు పారితోషికం అదనంగా అందంగా చూపించడానికో రూ.5 కోట్లు కలిసి నిర్మాతకు తడిసిమోపెడు అవుతోందని చిత్ర వర్గాలు అంటున్నట్లు మీడియాలో ప్రచారం హోరెత్తుతోంది. -
స్లిమ్‌గా స్వీటీ!
తమిళసినిమా: చేతిలో సొమ్ముంటే కొండపైన కోతి కూడా దిగివస్తుందనే నానుడి ఉంది. అలాంటిది నటి అనుష్కలాంటి టాప్ కథానాయికకు జిమ్ ఒక లెక్కా. ఏమిటీ అసందర్భ మాటలంటారా? నటనలో వైవిధ్యం కోసం తారలు ఆయా పాత్రలకు జీవం పోయడానికి సాధ్యమైనంత వరకూ కృషి చేస్తుంటారు. హీరోలైతే బరువు తగ్గడానికి, పెరగడానికి, సిక్స్ ప్యాక్ బాడీకి తయారవ్వడానికి శ్రమిస్తారు. హీరోయిన్లు మాత్రం అంతలా సాహసం చేయలేరు. ముఖ్యంగా బరువు పెరగడానికి సమ్మతించరు. ఎందుకంటే అందం వారికి చాలా ముఖ్యం. అలాంటిది నటి అనుష్క ఇంజిఇడప్పళగి(సైజ్ జీరో) చిత్రం కోసం మ్యాగ్జిమమ్ బరువు పెరిగి నటించారు. ఆ తరువాత తను బరువు తగ్గడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. అనుష్క బరువు బాహుబలి 2 చిత్రానికి కూడా చాలా భారమైంది. ఆ చిత్రం తరువాత వచ్చిన కొన్ని అవకాశాలను అనుష్క తిరష్కరించిందట. కారణం తాను మళ్లీ మునుపటి అనుష్కలా అందంగా తయారైన తరువాత కొత్త చిత్రాలను అంగీకరిస్తానని చెప్పి బరువు తగ్గడానికి శారీరక కసరత్తులు చేయడం మొదలెట్టారు. అందుకు ఇంట్లోనే అధునాతనమైన జిమ్‌తో పాటు, ఒక శిక్షకుడిని నియమించుకున్నారు. రోజుకు 8 గంటల పాటు జిమ్‌లోనే గడుపుతూ శారీరక శ్రమతో పూర్వ అందాలతో చాలా స్లిమ్‌గా తయారయ్యారట. అంతకు ముందు తనతో చిత్రాలు చేయడానికి ముందుకు వచ్చిన నిర్మాతల్లో ఒకరిని ఇటీవల ఇంటికి రప్పించుకుని కథ చెప్పమని, ఆ కథ నచ్చడంతో నటించడానికి పచ్చజెండా ఊపారట. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాల టాక్. సో చిన్న విరామం తరువాత అనుష్క విజృంబణను చూడవచ్చునన్నమాట. అనుష్క ప్రస్తుతం నటిస్తున్న టాలీవుడ్ చిత్రం భాగమతి నిర్మాణాంతక కార్యక్రమాల్లో బిజీగా ఉందని సమాచారం. -
బరువు తగ్గకపోవడానికి కారణం ఇదా?
ఒక్కోసారి లేనిపోని వందంతులతో అసలు విషయాలు మరుగున పడిపోతుంటాయి. సంబంధిత వ్యక్తులు చెబితే గానీ నిజాలు నిగ్గుతేలవు. నటి అనుష్కది ఇదే పరిస్థితి. ఈ తరం నటీమణుల్లో కథానాయకి ప్రాధాన్యత ఉన్న కథా చిత్రాల్లో నటించి మెప్పించిన నటి అనుష్క అని చెప్పవచ్చు. అరుంధతి చిత్రం ఆ తరహా చిత్రాలకు దారి చూపింది. కాగా అనుష్క అలా నటించిన మరో హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రం ఇంజిఇడుప్పళగి తెలుగులో జీరోసైజ్ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం కోసం అనుష్క తన బరువును 80 కిలోలకు పైగా పెంచుకుని నటించి త్యాగం చేసిందనే చెప్పాలి. అంత కష్టపడి నటించినా ఫలితం దక్కలేదు. ఆ చిత్రం నిరాశనే మిగిల్చింది. అంతే కాదు తదుపరి నటించాల్సిన బాహుబలి చిత్రంపై అనుష్క బరువు ఎఫెక్ట్ పడింది. అయినా ఈ యోగా సుందరి బరువు తగ్గడానికి శాయశక్తులా ప్రయత్నించి కాస్త తగ్గారట. అయితే పూర్తి నాజూగ్గా మారలేకపోయారు. దీనికి కారణం ఇంజిఇడుప్పళగి చిత్రం అనే ప్రచారం జరిగింది. అంతే కాదు బాహుబలి–2లో అనుష్కను అందంగా చూపడానికి ఆ చిత్ర దర్శకుడు అధికంగా వీఎఫ్ఎక్స్ లాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవలసి వచ్చిందనే ప్రచారం జరిగింది. ఆ విషయం అలా ఉంచితే అనుష్క బరువు తగ్గలేకపోవడానికి అసలు నిజం వేరే ఉందట. దీని గురించి అనుష్క పెదవి విప్పారు. ఆమె తెలుపుతూ తనకు బరువు పెరగడం, తగ్గడం పెద్ద సమస్య కాదన్నారు. ఇంతకు ముందు కూడా ఇలా చాలా సార్లు జరిగిందని చెప్పారు. అదే విధంగా బాహుబలి–2 చిత్రం కోసం చాలా వరకు బరువు తగ్గానని, అయితే సింగం–3 చిత్ర షూటింగ్ సమయంలో అనుకోకుండా విపత్తుకు గురవడంతో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడి బరువు తగ్గడానికి యోగా, కసరత్తులు చేయలేకపోయానన్నారు. ప్రస్తుతం మళ్లీ శారీరక వ్యాయామం లాంటి కసరత్తులు చేస్తున్నానని, త్వరలోనే తనను స్లిమ్‌గా చూస్తారని అనుష్క పేర్కొన్నారు. -
సైజ్ జీరో వాల్యూ
భార్య మీద గౌరవం లేకపోవడం అనే విషయాన్ని మగాళ్లే కాదు, సమాజమూ తేలిగ్గా తీసిపడేస్తుంది. యువరాణిలా పెంచుకున్న బంగారాన్ని ఒక అయ్య చేతిలో పెట్టేటప్పుడు ఎన్ని భయాలో! ఎన్ని దిగుళ్లో!! ఎన్ని బాధలో!!! కష్టపడినా, నష్టపడినా... ‘సర్దుకుపోవాలి, కాపురం చెయ్యాలి, విడిపోవద్దు’ అని అమ్మాయికి చెప్పి పంపిస్తూ ఉంటాం! కానీ ఈ కేసులో జరిగిన అన్యాయం ఏ తల్లీ తండ్రీ భరించలేనిది. కూతురు అంతకన్నా భరించలేనిది. భర్త ‘చచ్చు’బండ అని తెలిసింది!! ఇక ఆమె జీవితం చట్టుబండలేనా? కానేకాదనీ, అలాంటి భర్తను భరించనవసరం లేదని... హిందూ వివాహ చట్టం భరోసా ఇస్తోంది. ‘మనోజ్... టూ కేజేస్ తగ్గాను’ కాస్త బెరుకు, ఇంకాస్త భయంతో చెప్పింది పౌర్ణమి. ‘వాట్? టెన్ డేస్‌లో ఓన్లీ టూ కేజెస్? ఒహ్.. కమాన్ పూరీ.. తిండి తగ్గించు.. వర్కవుట్స్ పెంచు ప్లీజ్’ ఎంతో చిరాకు, స్ట్రెస్‌తో చెప్పాడు మనోజ్. ‘మనో...’ అంటూ పౌర్ణమి ఏదో చెప్పబోతుంటేనే ఫోన్ డిస్కనెక్ట్ అయింది. పౌర్ణమి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆమె పక్కనే ఉన్న పౌర్ణమి మేనత్తకు విషయం అర్థమైంది. పౌర్ణమి భుజమ్మీద చేయి వేసి సున్నితంగా నొక్కింది బాధపడకు అన్నట్టుగా. ఆ చిన్న సాంత్వనకే బోరుమంది పౌర్ణమి.. ‘పది రోజుల్లో రెండు కేజీలు తగ్గడమంటే మాటలా అత్తా.. ఇంకా డైట్ కంట్రోల్ చెయ్.. వర్కవుట్స్ పెంచు అంటాడు.. అక్కడ డైటీషియన్, జిమ్ ట్రైనర్ ఏమో అసలు నువ్వు వెయిటే లేవు.. హైట్‌కి తగ్గట్టుగా కరెక్ట్‌గా ఉన్నావ్.. డైటింగ్ ఆపేయ్.. హెల్త్ ఇష్యూస్ వస్తాయ్ అంటున్నారు. ఈయనేమో... ఇలా.. ఏంటత్తా ఇది? అసలు నాకు పెళ్లెందుకు చేశారు?’ అంటూ మేనత్త భుజమ్మీద తల వాల్చి వెక్కిళ్లు పెట్టింది ఏడుపుతో. పౌర్ణమి తల నిమురుతూ సాలోచనలో పడింది ఆమె మేనత్త. రెండు నెలలు గడిచాయి లండన్ నుంచి హైదరాబాద్ వచ్చాడు మనోజ్. ఆ క్షణం కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూసిన పౌర్ణమి ఆనందానికి హద్దులేదు. సిగ్గు, బిడియం, సంతోషం అన్నీ కలిసి ఆమెను ఒక్క చోట కుదురుగా నిలువనీయట్లేదు. మనోజ్ మాత్రం ఏ భావం కనపడనీయకుండా.. ఒకరకంగా చెప్పాలంటే ఆమెను పట్టించుకోనట్టే ప్రవర్తించాడు. భర్త తీరు ఆ భార్యకు వింతగా అనిపించినా.. ఆయన తన కళ్లముందుండడంతో పెద్దగా ఆలోచించలేదు. ఆ రాత్రి... గదిలో... ‘చాలా సన్నగా అయ్యానన్నావ్? ఎవ్రీడే ఫోన్ చేస్తూ తగ్గిన నీ వెయిట్ గురించి చెప్తుంటే ఎంత సన్నబడిందో అనుకొని ఆశగా వచ్చాను. ఏదీ.. ఇదేనా ఆ ఫిగర్? ప్చ్.. లాభం లేదు...’ అంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు మనోజ్... గది మధ్యలో పౌర్ణమిని నిలబెట్టి ఆమె చుట్టూ తిరుగుతూ నఖశిఖ పర్యంతం పరిశీలిస్తూ! ‘లావుగా ఉంటే అందుకు పనికిరారు..’అని అమె చెవి దగ్గర స్ట్రెస్ చేస్తూ చెప్పాడు. రెండు చేతులతో చెవులను మూసుకుంటూ నీళ్లు నిండిన కళ్లను రెప్పలతో గట్టిగా మూసేసుకుంది పౌర్ణమి. ఆ ఒక్కరోజే కాదు అలాంటి అవమానాలు ప్రతి రాత్రి సర్వసాధారణమయ్యాయి పౌర్ణమికి. అలా నెలలు గడిచాయి. తిండీతిప్పలు లేక ఒకరోజు స్పృహ తప్పి పడిపోయింది కూడా. అయినా ఆమె శరీరం గురించి హేళన ఆపలేదు భర్త. రాత్రి అవుతోందంటేనే.. ఆ గదిలోకి వెళ్లాలంటేనే వణికిపోతోంది పౌర్ణమి. తన పరిస్థితి మేనత్తకూ చెప్పింది. ఒకరోజు రాత్రి... ఎప్పటిలాగే గది మధ్యలో భార్యను అర్ధనగ్నంగా నిలబెట్టాడు మనోజ్. ‘స్లిమ్‌గా తయారవడం నీవల్ల కావడంలేదు.. సంసారానికి పనికొచ్చేలా లేవ్ .. ఏం చేస్తాం నా కర్మ...’ అంటూ ఇంకా ఏవో అనబోతుంటే .. ‘ఏం పిచ్చిపిచ్చిగా ఉందా? లావుగా ఉన్న అమ్మాయిలతో కాపురం చేస్తున్న భర్తలు ఎంతమంది లేరు? అసలు సంసారానికి పనికి రానిది నువ్వా? నేనా? లోపం నీలో ఉందా? నాలో ఉందా?’ అంటూ ఎదురు తిరిగింది పౌర్ణమి. ఆ దాడిని ఊహించలేని మనోజ్ బిక్కచచ్చిపోయాడు. పౌర్ణమి జీవితంలోకి ఎలా వచ్చాడు? ‘పెద్దలు కుదిర్చిన సంబంధమే. పౌర్ణమి మా అన్నయ్య వాళ్లకు ఒక్కానొక్క కూతురు. అరచేతుల మీద పెంచుకున్నారు. ఏంబీఏ చదివింది. అమెరికాలో ఉద్యోగం వస్తే పెళ్ళయ్యాక ఎలాగూ తమను విడిచి వెళ్తుంది.. ఈ కొన్ని రోజులైనా తమతో ఉండనీ అని అమెరికా పంపలేదు అన్నయ్య, వదిన. మా అన్నయ్య బిజినెస్ ఫ్రెండ్ ద్వారా మనోజ్ వాళ్ల సంబంధం వచ్చింది. అబ్బాయీ ఎంబీఏ చదివాడు. లండన్‌లో ఉద్యోగం. అన్నిరకాలుగా మాకు సరిపోయిన సంబంధం అని ఒప్పుకున్నాం. అబ్బాయి లండన్‌లో ఉన్నప్పుడే అతని తల్లిదండ్రులు వచ్చి పౌర్ణమిని చూసి వెళ్లారు. వాళ్లకు అమ్మాయి నచ్చింది అని చెప్పాక అమ్మాయి, అబ్బాయి స్కైప్‌లో మాట్లాడుకున్నారు. తన ఫోటోలు కూడా పంపింది. అతనూ పంపాడు. పది రోజులకు లండన్ నుండి వచ్చాడు. మరో పదిహేను రోజుల్లో పెళ్లయింది. పెళ్లి షాపింగ్ అంతా కూడా అమ్మాయి, అబ్బాయి కలిసే చేశారు. మరి అప్పుడు తెలీలేదా మా అమ్మాయి లావుగా ఉందని’ అంటూ తనకు తెలిసిన లాయర్‌తో ఫోన్లో మాట్లాడింది పౌర్ణమి మేనత్త. ‘పౌర్ణమిని తీసుకొని వస్తాను మీ దగ్గరకి’ అని చెప్పి ఫోన్ పెట్టేసింది. సెకండ్ నైట్ కూడా అంతే! ‘ఫస్ట్ నైటే మొదలుపెట్టాడు.. ‘‘నేనేమో టాల్ అండ్ ఫిట్.. నువ్వేమో షార్ట్ అండ్ స్టౌట్.. నీ పొట్ట చూడు ఎంత ఫ్యాటీ ఉందో? పెళ్లికి ముందు మోడర్న్ డ్రెసెస్‌లో కనిపించలేదు.. పెళ్లిలో పట్టుచీరలో అలా కనపడుతున్నావనుకున్నా.. కానీ నిజంగా నువ్వు చాలా లావు... మోస్ట్ అన్‌సూటబుల్ ఫర్.. దట్ యాక్ట్... ’’ అంటూ నన్ను ఇన్సల్ట్ చేశాడు. నాకు ముచ్చెమటలు పెట్టాయి. ‘ఐయామ్ టయర్డ్.. ’అని ఆ రాత్రి నిద్రపోయాడు. సెకండ్ నైట్ కూడా అంతే.. అవే మాటలు.. అదే హ్యుమిలియేషన్.. ఇంకా ఘోరంగా..’ అంటూ చెప్పలేక రెండు చేతుల్లో మొహం దాచుకొని ఏడ్వసాగింది పౌర్ణమి. ఆమెకు రెండువైపులా కూర్చున్న ఆమె తల్లి, మేనత్త... పౌర్ణమిని అనునయించసాగారు. వెంటనే తేరుకున్న పౌర్ణమి.. ‘ఆరోజు నన్ను అన్‌డ్రెస్ చేయించి.. సిట్ బిఫోర్ మి .. వాంట్ టు అబ్జర్వ్ యు అంటూ నన్ను తన ముందు కూర్చోబెట్టుకొని పిచ్చిపిచ్చిగా వర్ణిస్తూ ‘యు హావ్ టు గో ఫర్ ఒబెసిటీ ట్రీట్మెంట్.. అదర్వైజ్ ఇట్ విల్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ’ అని సలహా ఇచ్చి గుర్రుపెట్టి నిద్రపోయాడు. అతను ఇండియాలో ఉన్న పది రోజులూ ఇదే తంతు. పదకొండో రోజు లండన్‌కి వెళ్లిపోయాడు.. నన్ను వెయిట్ తగ్గించుకోమని, తగ్గించుకున్నాక వచ్చి తీసుకెళ్తానని చెప్పి! జీరో సైజ్ క్రేజ్ ఉందేమో.. అనుకున్నా.. అందుకే వెయిట్ రిడక్షన్ కోసం క్లినిక్‌లో చేరా. డాక్టర్, డైటీషియన్, ఈవెన్ జిమ్ ట్రైనర్ కూడా వారించింది. అయినా మనోజ్ కోసం అవేమీ పట్టించుకోలేదు. కానీ మొన్న లండన్ నుంచి వచ్చాకా అదే బిహేవియర్. అప్పుడు నాకు డౌట్ వచ్చింది’ అని లాయర్‌తో చెప్పింది పౌర్ణమి. అంతా విన్న లాయర్ ‘నల్ అండ్ వాయిడ్’ కింద పౌర్ణమి సమస్యను ఫైల్ చేశారు. - సరస్వతి రమ ‘నల్ అండ్ వాయిడ్’ అంటే ? హిందూ వివాహ చట్టం సెక్షన్ : 12(1) (ఎ) ప్రకారం దంపతుల్లో ఎవరికైనా నపుంసకత్వం (ఇంపొటెన్స్) ఉండి, దానివల్ల దాంపత్య జీవితంలోని ఉద్దేశం నెరవేరనప్పుడు ఆ వివాహాన్ని చెల్లని వివాహంగా ప్రకటించమని కోరవచ్చు. అంటే అలాంటి పెళ్లిని కోర్టు ద్వారా రద్దు చేసుకోవచ్చు. అయితే పెళ్లయినప్పటి నుంచి పిటిషన్ ఫైల్ చేసేవరకు ఇంపొటెన్స్ ఉందని రుజువు చేయాల్సిన బాధ్యత పిటిషనర్లపై ఉంటుంది. కోర్టు ఆదేశాల ప్రకారం ప్రతివాదిని వైద్యపరీక్షలకు పంపుతారు. ఇంపొటెన్స్ శారీరకమైనదా లేక మానసికమైనదా అని నిర్థారణ అయ్యాక కోర్టు ఆ వివాహాన్ని రద్దు చేస్తుంది. పౌర్ణమి వాళ్ల విషయంలో ప్రతివాది మనోజ్ తాను ఇంపొటెంట్నని ఒప్పుకోలేదు. కోర్టువారు వైద్యపరీక్షల కోసం మనోజ్‌ను సంబంధిత డాక్టర్ దగ్గరకు పంపారు. ఆ రిపోర్ట్‌ల ఆధారంగానే పౌర్ణమి, మనోజ్‌ల వివాహం రద్దయింది. ఇ. పార్వతి అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ parvathiadvocate2015@gmail.com -
పెళ్లయితే ఇక అంతేనా?!
ఇంటర్వ్యూ హీరోయిన్లంతా జీరో సైజు మెయింటెయిన్ చేస్తుంటే... తను మాత్రం బొద్దుగా ఉంటానంటుంది. అందరూ మోడ్రన్ దుస్తుల్లో మెరిసిపోతుంటే... తను మాత్రం చీరకట్టుతోనే కనిపిస్తానంటుంది. అందరూ గ్లామరస్ పాత్రలు చేస్తుంటే తను మాత్రం మహిళ పవర్‌ని, ప్రాధాన్యతని చూపించే పాత్రలు చేస్తుంది. అందరిలా ఉండదు విద్యాబాలన్. అందరిలా మాట్లాడదు కూడా. అందుకే తన ఇంటర్వ్యూ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. చదవి చూడండి... పెళ్లి తర్వాత హీరోయిన్ల కెరీర్ దెబ్బ తింటుందంటారు. నిజమేనా? పెళ్లి కారణంగా కెరీర్ దెబ్బ తింటుం దని నేననుకోను. కావాలని నటనకు దూర మవ్వాలే తప్ప నీకు పెళ్లయ్యింది అంటూ ఎవరూ బయటకు నెట్టేయరు. మన అవసరం ఇండస్ట్రీకి ఉన్నంతకాలం మనం అందులో ఉంటాం. అయితే ఒకటి. ఒక అమ్మాయి ఎంత సక్సెస్ అయినాగానీ, పెళ్లవ్వగానే ఆమెని ఓ మగాడికి భార్యగానే చూస్తారు. మావారిని కొందరు ఫంక్షన్లకు పిలుస్తూ, విద్యని తీసుకురా అంటారు. వాళ్లు నాకు తెలిసినవాళ్లే. మరి అలా ఎందుకు చేస్తారా అనిపిస్తుంది. పెళ్లైపోతే అంతేనా? ఆడపిల్లలకి ఇండివిడ్యువాలిటీ ఉండదా?! ఇండస్ట్రీలో మేల్ డామి నేషన్ గురించి ఏమంటారు? అసలు మనం ఉన్న సమాజమంత టిలో మగాడిదే పై చేయి. సినీ రంగం లోనూ అంతే. కానీ హీరోయిన్ లేకుండా సీరియళ్లు, సినిమాలు ఉంటాయా? ఎక్కడైనా ఆమె అవసరమే. కాబట్టి మహిళను కాదని పక్కన పెట్టేయడానికి వీల్లేదు. ఆ అవసరాన్నే మనం ఉపయో గించుకోవాలి. మగాళ్లతో సమానంగా కష్టపడి, వీలైతే వాళ్లకంటే కాస్త ఎక్కువే ఔట్పుట్ ఇవ్వడానికి ప్రయత్నం చెయ్యాలి. నేనెప్పుడూ అదే చేస్తుంటాను. ధైర్యంగా, సవాళ్లను ఎదుర్కొనే సమర్థు రాలిగా మీ పాత్రలు కనిపిస్తుంటాయి. నిజ జీవితంలో మీరలా ఉంటారా? హండ్రెడ్ పర్సెంట్. నా పాత్రలు నా వ్యక్తిత్వానికి చాలా దగ్గరగా ఉంటాయి. చిన్నతనం నుంచీ నేను డైనమిక్. నాకు ధైర్యం, ఆత్మవిశ్వాసం, సవాళ్లను ఎదుర్కొనగలిగే తెగువ... ఇవన్నీ కాస్త ఎక్కువే. అందువల్లేనేమో నేను అలాంటి పాత్రలనే ఎంచుకుంటూ ఉంటాను. స్త్రీ స్వేచ్ఛ గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మీ అభిప్రాయం ఏమిటి? స్వేచ్ఛ అందరికీ ఉండాలి. మహిళలు ఇలాగే ఉండాలి అని ఎందుకు నిర్ణయించేస్తారు! వాళ్లూ వాళ్లకు నచ్చినట్టు ఉండాలి. నచ్చింది తినాలి, నచ్చినవి ధరించాలి. మగాడు నిక్కర్లు వేసుకుని తిరిగితే ఎవరూ పట్టించు కోరు. అదే అమ్మాయిలు కాస్త పొట్టి బట్టలు వేస్తే చీప్‌గా చూసేస్తారా? ఏదైనా జరిగితే తన డ్రెస్సింగ్ వల్లే అనేస్తారా? ఈ దృష్టికోణం మారాలి. ఆడవాళ్ల వ్యక్తిత్వాన్ని వాళ్ల దుస్తుల్ని బట్టి అంచనా వేయడం మానెయ్యాలి. ఇంత ఆధునిక భావాలు ఉన్న మీరు మోడ్రన్‌గా ఎందుకు కనిపించరు? ఎందుకు కనిపించను! నేనూ గౌన్లు వేసుకుంటాను. లో నెక్ వేస్తాను. కానీ నాకు చీర అన్నిటికంటే ఇష్టం. అందుకే పెద్దదానిలా కనిపిస్తాను అని కొందరన్నా కూడా చీరనే ధరిస్తాను. అలాగే ఎవరికి నచ్చినవి వాళ్లు వేసుకుంటారు. దాని గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. మహిళలపై జరిగే అకృత్యాలు విన్నప్పుడు ఏమనిపిస్తుంది? కేవలం ఆడపిల్లగా పుట్టినందుకే సమస్యలు ఎదుర్కోవాల్సి రావడం నిజంగా అన్యాయం. అయితే ఇప్పు డిప్పుడే అన్యాయాలను ఎదుర్కోగలిగే ధైర్యం వస్తోంది ఆడపిల్లలకి. పూర్తిగా సాధికారత రాకపోయినా రోజుకొక ఆడపిల్లయినా గడప దాటి వచ్చి తనకంటూ ఓ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటోందని కచ్చితంగా చెప్పగలను. కానీ ఆడపిల్లలు కూడా కొన్ని పొరపాట్లు చేసి కష్టాల్లో పడుతున్నారు కదా? అవును. ముఖ్యంగా సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ ద్వారా లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. అలాంటి వాటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అయితే కావాలని ఎవరూ నష్టపోరు. తెలియక ఇబ్బందుల్లో చిక్కుకుంటారు. అది కూడా మనం గమనించాలి. సమాజంలో ఎలాంటి మార్పులు వస్తే ఆడపిల్లల జీవితాలు బాగుంటాయి? అబ్బాయిలకీ, అమ్మాయిలకీ సమాన అవకాశాలు ఉండాలి. కొన్ని రంగాలకి మహిళలు పనికిరారు, అవి పురుషులకే అని నిర్ధారించేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అంతరిక్షంలోకే వెళ్లగలిగిన మహిళ ఎక్కడి కైనా వెళ్లగలను. ఏదైనా సాధించగలదు. ఆడపిల్ల అయినంత మాత్రాన తన శక్తి సామర్థ్యాలను తక్కువ అంచనా వేయ కూడదు. అలాగే తన అభిప్రాయాలను వెలిబుచ్చే అవకాశం, తన కెరీర్‌ని జీవితాన్ని తనకు నచ్చినట్టుగా మలచుకునే స్వేచ్ఛ ఇవ్వాలి. -
సై జీరో!
కొత్త సినిమా గురూ! చిత్రం: ‘సైజ్ జీరో’ తారాగణం: అనుష్క, ఆర్య, సోనాల్ చౌహాన్ రచన: కనిక కోవెలమూడి సంగీతం: కీరవాణి కెమేరా: నీరవ్ షా ఆర్ట్: ఆనంద్ సాయి ఎడిటింగ్: ప్రవీణ్ పూడి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సందీప్ గుణ్ణం; నిర్మాత: పరమ్ వి. పొట్లూరి, కెవిన్ అన్నే దర్శకత్వం: ప్రకాశ్ కోవెలమూడి. సైజ్ జీరో... నాజూకైన నడుము... ఇవాళ తరచూ వినిపిస్తున్న మాట. అవును. సౌందర్య సాధనాలు, ఉత్పత్తులు, బరువు తగ్గడం అనేవి ప్రత్యేక పరిశ్రమలుగా, వేల కోట్ల రూపాయల వ్యాపారంగా మారినప్పుడు సహజమైన శరీరాకృతీ సహించరానిదే అవుతుంది. సమాజం మొత్తానికీ జెన్నీఫర్ లోపెజ్ లాంటి నాజూకు నడుములే కంపల్సరీ కండిషనింగ్ టెంప్లేట్లవుతాయి. అందాల పోటీలు మన ఇంటి దాకా దిగుమతి అయిందీ, మన అమ్మాయిల తల మీద అందాల రాణి కిరీటాలను ఎక్కించిందీ అందుకే! ఈ ఆలోచనల నేపథ్యంలో ‘సైజ్ జీరో’ పిచ్చిని ఆలంబనగా చేసుకొని ప్రకాశ్ కోవెలమూడి తీసిన సినిమా - ‘సైజ్ జీరో’ (సన్నజాజి నడుము అనేది ఉపశీర్షిక).సౌందర్య అలియాస్ స్వీటీ (అనుష్క) కథ ఇది. బరువు తూచే మిషన్, దానిలో నుంచి వచ్చే కార్డు వెనుక ఉండే భవిష్యత్ వాణితో చిన్నప్పటి నుంచి ఆమెకు విడదీయరాని అనుబంధం. చిన్నతనంలోనే నాన్న (రావు రమేశ్)ను పోగొట్టుకుంటుంది. అమ్మ రాజేశ్వరి (ఊర్వశి), తాత (గొల్లపూడి మారుతిరావు)... ‘సాఫ్ట్వేర్’ అంటూ లోదుస్తుల వ్యాపారం చేసే తమ్ముడు యాహూ (భరత్) - హీరోయిన్ కుటుంబ సభ్యులు. హీరోయిన్ ‘సైజ్’ చూసి, వచ్చిన పెళ్ళి సంబంధాలన్నీ తప్పిపోతుంటాయి. ఎన్నారై డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ అభి (తమిళ హీరో ఆర్య) సంబంధం తప్పిపోయినా, వాళ్ళ మధ్య స్నేహం కొనసాగుతుంది. హీరోయిన్ అతణ్ణి మనసులో ఇష్టపడుతుంటుంది. ‘క్లీన్ ఇండియా’ డాక్యుమెంటరీ తీస్తున్న హీరో అదే టైమ్‌లో బ్రిటన్ నుంచి వచ్చిన మెరుపు తీగ లాంటి ఎన్జీఓ పిల్ల సిమ్రన్ (సోనాలీ చౌహాన్)కు క్రమంగా దగ్గరవుతుంటాడు. హీరోయిన్ గుండె బద్దలవుతుంది. అది ఫస్టాఫ్. సత్యానంద్ (ప్రకాశ్‌రాజ్) నడుపుతున్న సైజ్ జీరో ప్రోగ్రామ్‌లో హీరోయిన్ చేరుతుంది. అందాల పోటీలకు వెళ్ళాలనుకుంటున్న హీరోయిన్ ఫ్రెండ్ కూడా అదే ప్రోగ్రామ్ చేస్తూ, ఒంట్లో కొవ్వు తగ్గించేందుకు అక్కడ వాడుతున్న అనారోగ్యకరమైన పద్ధతుల కారణంగా ఆస్పత్రి పాలవుతుంది. అక్కడ నుంచి హీరోయిన్ ఆ మోసకారి వెయిట్ రిడక్షన్ ప్రోగామ్ మీద పోరాటం మొదలుపెడుతుంది. దానికి, హీరో సాయం కూడా తీసుకుంటుంది. వాళ్ళు ‘పి.వి.పి. స్పోర్ట్స్’ శేఖర్ (అడివి శేష్) సాయంతో ఏం చేశారు? సిమ్రన్కూ, హీరోయిన్‌కూ మధ్య ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా సాగిన ప్రేమ చివరకు ఏమైందన్నది సినిమా రెండు గంటల పది నిమిషాల నిడివే ఉన్న ఈ సినిమాకు బలం - కొంత ప్యాడింగ్‌లు పెట్టుకున్నా, స్వయంగా బరువు పెరిగి మరీ అనుష్క చేసిన ‘బిగ్‌సైజ్’ సాహసం. ఆమె నటన చాలా ఈజ్‌తో సాగింది. ఆ తరువాత మనసుకు హత్తుకునేవి తల్లి పాత్ర, తాత పాత్ర. హీరోగా ఆర్య తమిళ వెర్షన్‌కూ పనికొచ్చే ఛాయిస్. హీరోయిన్ తమ్ముడు కామిక్ రిలీఫ్. నిర్మాణ విలువలు పుష్కలంగా ఉన్న ఈ సినిమాలో కెమేరా (నీరవ్ షా) వర్క్ బాగుంది. ‘‘ఇన్నాళ్ళూ నేను నీ కూతుర్ని అనుకున్నా. కానీ, కష్టాన్నని ఇప్పుడే అర్థమైంది’’ (తల్లితో హీరోయిన్) లాంటి కొన్ని డైలాగులు (రచయిత కిరణ్) బాగున్నాయి. నిజానికి లావాటి వ్యక్తులు, వాళ్ళ ప్రేమ, పెళ్ళి కష్టాలు కొత్తేమీ కాదు. కమలహాసన్ ‘సతీ లీలావతి’, ఇ.వి.వి ‘కితకితలు’, ‘లడ్డూబాబు’, హిందీ హిట్ ‘దమ్ లగాకే హైసా’ లాంటివన్నీ ఆ అంశాన్ని ఒక్కో రకంగా చూపెట్టినవే. ఇప్పుడీ ‘సైజ్ జీరో’ కొనసాగింపు. ‘క్లీన్ ఇండియా’ అంటూ ‘టాయిలెట్ క్లీన్ చెయ్... డాక్టర్‌ను దూరం చెయ్’ నినాదంతో ‘స్వచ్ఛభారత్’ ప్రోగ్రామ్‌కు ఫస్టాఫ్ మంచి పబ్లిసిటీ. హీరోయిన్ సమస్యకు పరిష్కారం చూపాల్సిన సెకండాఫ్ మరో టర్న్ తీసుకుంది. ‘గెట్ ఫిట్... డోన్ట్ క్విట్’ అంటూ ‘పి.వి.పి. స్పోర్ట్స్’ ఇనీషియేటివ్‌కూ, ఫిట్నెస్ అవసరానికీ పెద్ద పీట వేసింది. హీరోయిన్‌తో తన తల్లి పెంపకం గురించి ఊర్వశి చెప్పే సీన్లు లాంటివి సెంటిమెంటల్ ఫీల్ తెచ్చాయి. కథలో పోరాటం పెరిగి, ప్రేమ, హీరోయిన్ తాలూకు మానసిక సంఘర్షణ తగ్గడం చిక్కే. మొత్తం మీద అందమంటే మానసికమైనది కూడా అనీ, ‘సంతోషంతో ఉండే అమ్మాయిలే అసలైన అందమైన అమ్మాయిలు’ అనీ గుర్తుచేస్తుందీ ‘సైజ్ జీరో’. హాల్లో నుంచి బయటకొస్తుంటే ఎవరో అన్నట్లు, ఇది ‘బొద్దు’మనసుతో చూడాల్సిన వెయిట్ లెస్ ఎంటర్టైనర్! ► సంగీత దర్శకుడు కీరవాణి ఈ సినిమా టైటిల్సాంగ్ సాకీ పాడుతూ, జోస్యుడిలా కనపడతారు. ► ఈ సినిమా కోసం అనుష్క ఏకంగా 17 కిలోల పైగా బరువు పెరిగారు. ► తెలుగుతో పాటు తమిళంలోనూ తీసిన ఈ సినిమా ‘ఇంజి ఇడుప్పళగి’గా అక్కడ రిలీజైంది. ► నాగార్జున, తమన్నా సహా 7 మంది తారలు ఒక చోట గెస్ట్లుగా మెరుస్తారు. ► ఆర్యకు యువహీరో నందు తెలుగుడబ్బింగ్ చెప్పారు. - రెంటాల జయదేవ్ -
అనసూయతో అనుష్క ఏం చెప్పింది..?
-
ఫోన్ చేస్తే చాలు... అమ్మానాన్నా వచ్చేస్తారు!
ఈ ఏడాది అనుష్క నుంచి మూడో సినిమా రానుంది. ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ తర్వాత అనుష్క ఎంతో కష్టపడి, ఇష్టపడి చేసిన ‘సైజ్‌జీరో’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా, కెరీర్ గురించి విలేకరులతో అనుష్క పంచుకున్న కబుర్లు... * ‘సైజ్ జీరో’ కథ మీకెలా కనెక్ట్ అయింది? సన్నగా ఉన్న అమ్మాయిలను బరువు పెరగమనీ, లావుగా ఉన్న అమ్మాయిలను సన్నబడమనీ అనడం నా స్కూల్, కాలేజ్ డేస్‌లో చాలాసార్లు విన్నా. అమ్మాయిలు ఎలా ఉన్నా తప్పేనా? అనిపించేది. బాహ్య సౌందర్యం కన్నా అంతః సౌందర్యం మిన్న అనే విషయాన్ని నేను బలంగా నమ్ముతా. అందుకే, లావుగా ఉన్న అమ్మాయిగా నటించా. నేను యోగా నేర్పించేటప్పుడు కొంతమంది మంచి శరీరాకృతి లేదనో, లావుగా ఉన్నామనో.. ఇలా రకరకాల ఫీలింగ్స్‌తో ఆత్మనూన్యతాభావంతో బాధపడే వాళ్ళు. ఫిజికల్ అపియరెన్స్ ముఖ్యం కాదని సినిమా ద్వారా చెప్పే అవకాశం వచ్చింది కాబట్టి చేశా. * పర్సనల్‌గా మీరు ఏ సైజ్‌ని ఇష్టపడతారు? జీరో సైజ్‌ని అస్సలు ఇష్టపడను. నా ఎత్తుకి తగ్గ బరువు ఉండాలనుకుంటాను. ఆరోగ్యం గురించి కేర్ తీసుకుంటా. * ఇన్నాళ్లూ డైటింగ్ చేసేవారు. ఈ సినిమాలో పాత్ర కోసం ఇష్టం వచ్చినట్లు తిని ఉంటారేమో? అంతకు ముందు ఏం తిన్నాలన్నా టెన్షనే. ఒక దశలో ఫుడ్‌ని ఫుడ్‌లా చూడడం మర్చిపోతాం. నాకైతే బిస్కెట్స్, చాక్లెట్స్ని చూస్తే ఫ్యాట్స్లా, రైస్‌ని చూస్తే కార్బోహైడ్రేట్స్లా, ఫిష్‌ని చూస్తే ప్రొటీ న్లా కనిపిస్తాయి. అంతదాకా వెళ్లకుండా ఫుడ్‌ని ఫుడ్‌లా ఆస్వాదించాలి. స్వీటీ పాత్ర నాకా ఛాన్స్ ఇచ్చింది. వర్కవుట్స్ మానేశా. హాయిగా తిన్నా. కానీ ఆరోగ్యకరమైనవే లాగించా. * ప్రోస్థటిక్ మేకప్‌తో లావుగా కనిపించవచ్చుగా? కనిపించవచ్చు కానీ, సహజంగా ఉండదు. బాడీ అంతా ప్రోస్థటిక్ చేసుకుని, మొహం మాత్రం అలానే ఉంటే, శరీరం పెద్దదిగా, బాడీ చిన్నదిగా కనిపిస్తుంది. అందుకే దర్శకుడు ప్రకాశ్, రచయిత్రి కనిక కథ చెప్పినప్పుడు బరువు పెరుగుతానన్నా. ఇలాంటి క్యారెక్టర్స్ ఎప్పటికో కానీ రావు. * ఎంత బరువు పెరిగారు? ఇప్పటికెంత తగ్గారు? 17 కిలోలు పెరిగాను. ఇప్పుడు తగ్గడం మొదలెట్టా. ’బాహుబలి 2’, ‘సింగమ్’ చేయాలి కదా పది కిలోలు తగ్గా. ఇంకా ఆరేడు తగ్గాలి. * నాగార్జున ‘నేనైతే అలాంటి పాత్రలు చేయ నేమో. ఆరోగ్యంతో ఆడుకున్నట్లే’ అన్నారు. కామెంట్? అది నిజమే. హఠాత్తుగా లావైనా, ఉన్నట్టుండి సన్నబడినా అనారోగ్యమే. నేను డాక్టర్ల సలహా తీసుకుని పెరిగా. మళ్లీ డాక్టర్ల సలహాతో తగ్గుతున్నా. బరువు పెరిగి, మళ్లీ తగ్గా కాబట్టి అందరూ అలా చేయాలనుకోకూడదు. అది మంచిది కాదు. అంతెందుకు.. భవిష్యత్తులో ఇలా శరీరంతో ప్రయోగాలు చేసే పాత్రలు వస్తే నేను కూడా ఒప్పుకోనేమో. * ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌తో బాధపడేవాళ్లకి మీరిచ్చే సలహా? బాహ్య సౌందర్యంతో పని లేదు. మంచి మనసు ప్రధానం. పిల్లలు చాక్లెట్స్ కొనుక్కోవాలని ఆరాటపడేట్లు.. పెద్దవాళ్లు మార్కెట్లో దొరికే ఫేస్ క్రీమ్స్, హెయిర్ ఆయిల్స్‌కి ఎట్రాక్ట్ అయిపోతారు. కానీ, అందం గురించి అదే పనిగా ఆరాటపడిపోకూడదు. * ఫిమేల్ ఓరియంటెడ్ మూవీస్ అంటే మీరే అన్నట్లు అయిపోయింది. హ్యాపీగా ఉంది. ఎందుకంటే, ‘సూపర్’ సినిమా ఒప్పుకున్నప్పుడు నాకేమీ తెలియదు. ఫొటోలు ఎలా దిగాలో కూడా తెలిసేది కాదు. అలాంటిది ఈ స్థాయికి వచ్చానంటే నా హార్డ్ వర్క్ కారణం. * రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు ఇష్టపడతారా? వరుసగా పవర్ఫుల్ పాత్రలు చేస్తే అంతే. అందుకే, అర్జంటుగా మాస్ మసాలా మూవీ చేయాలని ‘సింగమ్ 3’ ఒప్పుకున్నాను. మాస్ సినిమాలు చేయడానికి బాగుంటాయి. వాటిని వదులుకోను. * మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో దూసుకెళ్లడంపై మీ ఫీలింగ్? మేల్ డామినేషన్ లేదు. నేను రుద్రమదేవికి కత్తి తిప్పినప్పుడు మణికట్టు, మెడ దగ్గర గాయం అయ్యింది. ఒకటీ రెండు సినిమాలకే నాకు చాలా కష్టం అనిపించింది. ఇక, హీరోలు ప్రతి సినిమాకీ ఫైట్స్ చేస్తారు. వాళ్లది మామూలు కష్టం కాదు. * హీరోయిన్లతో పాటు వాళ్ల అమ్మా, నాన్న లొకేషన్‌కి వస్తుంటారు. మీతో ఎవరూ రారు. ఎందుకని? అమ్మా, నాన్నలకు వాళ్ల పనులు వాళ్లకు ఉంటాయి. నేను హీరోయిన్ అయ్యాను కదా నాతో పాటే ఉంటూ వాళ్ల పనులను మానుకోమని చెప్పలేను. నా మీద మా అమ్మా, నాన్నలకు చాలా నమ్మకం. ‘నీకేం కావాలన్నా ఒక్క ఫోన్ కాల్ చెయ్యి. నీ ముందు వాలిపోతాం’ అంటుంటారు. అలానే చేస్తారు. అంతకన్నా ఇంకేం కావాలి? * ఇండస్ట్రీలో మీకు సపోర్ట్‌గా? నాగార్జున గారి ఫ్యామిలీ నాతో బాగుంటారు. కీరవాణి, రాజమౌళి కుటుంబసభ్యులు సపోర్టివ్‌గా ఉంటారు. హెల్ప్ కావాల్సొస్తే చాలామంది ఉన్నారు. * నటిగానే కొనసాగుతారా? భవిష్యత్తులో ఏదైనా వ్యాపారం చేస్తారా? మనీ మేనేజ్మెంట్లో నేను చాలా వీక్. పైగా నాది బిజినెస్ మైండ్ కాదు. అందుకని దేనిలోనూ పెట్టుబడి పెట్టదల్చుకోలేదు. * పెళ్లెప్పుడు చేసుకుంటారు? హీరోయిన్ అవుతాననుకోలేదు. అయ్యా. ఫిమేల్ ఓరియంటెడ్ మూవీస్ చేస్తాననుకోలేదు. చేస్తున్నా. పెళ్లి గురించి కూడా అనుకోవడం లేదు. ఎప్పుడు జరగాలని రాసి పెట్టి ఉంటే అప్పుడు జరుగుతుంది. చిన్నప్పుడు ’ఫెయిరీ టేల్స్’ ఎక్కువ చూసేదాన్ని. ఆ ప్రభావం నా మీద ఎక్కువ. ప్రపంచం, మనుషులంతా అందంగా ఉంటారనీ, జీవితం బాగుంటుందనీ నమ్మేదాన్ని. కథల్లో ఉన్న జీవితం వేరు.. నిజజీవితం వేరని తెలుసుకున్నా. వీలైనంతవరకూ కూల్‌గా ఉంటా. నా కారణంగా ఎవరూ బాధపడకూడదన్నది నా మనస్తత్వం. అందు కని కోపం తెచ్చుకోను. బాగా కోపం వస్తేనే బయటపడతా. ఉన్నది ఒక్క జీవితం కాబట్టి, నెగటివ్‌కి దూరంగా, హ్యాపీగా ఉండాలనుకుంటా. -
మాలో మాకు నచ్చేవి అవే..! - ప్రకాశ్, కనిక
ఒక కోడలి కథ మంచి లావు ఛాన్స్ కొట్టేసింది - కోడలు పిల్ల. ‘సైజ్ జీరో’ సినిమా కథ ఆమెదే. లావుగా ఉన్నా మాకు ఓకే అంటున్నారు అత్తింటివారు. ఎంత లావు సక్సెస్ కొడుతుందో చూడాలి. రాఘవేంద్రరావు కొడుకు - కోడలుతో ‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ. సాక్షి: మాకు పూనమ్ ధిల్లాన్ తెలుసు. ఇప్పుడు రాఘవేంద్రరావుగారి కోడలు కనికా ధిల్లాన్ అనేసరికి తెలుగువారు మీ పట్ల కుతూహలంగా ఉన్నారు. కనిక: ఓ... అవునా... థ్యాంక్యూ. ‘సైజ్ జీరో’ సినిమాకు కథ అందించిన రచయిత్రిగా కూడా దక్షిణాదిలో మీరిప్పుడు వార్తల్లో ఉన్నారు. కనిక: అవును... ఆ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి ఉండటం సంతోషంగా ఉంది. ఇంతకూ మీ నేపథ్యం ఏంటి? ప్రకాశ్‌కు మీరెలా పరిచయం అయ్యారు. కనిక: మాది అమృత్సర్. నాన్నది వ్యాపారం. అమ్మ ప్రిన్సిపాల్. నాకు చిన్నప్పటి నుంచి అమ్మ వల్ల కథలు అలవాటయ్యాయి. అలా రచయిత్రి కావాలనే కోరిక పుట్టింది. ముంబైలో షారూక్ ఖాన్ సంస్థలో పని చేశాను. ప్రకాశ్ ముంబైలో పని చేస్తూ కథలు రాసే వాళ్ల కోసం వెతుకుతూ నా గురించి తెలుసుకున్నారు. అలా మా పరిచయం అయ్యి, ప్రేమగా మారింది. ఐదేళ్లకు పెళ్లి చేసుకున్నాం. అక్కడే ఉన్న రాఘవేంద్రరావుతో: కనికను పెళ్లి చేసుకుంటానని మీ అబ్బాయి చెప్పగానే ఎలా అనిపించింది? రాఘవేంద్రరావు: అంతకు ముందు పెళ్లి గురించి ప్రకాశ్ అంతగా ఇంట్రస్ట్ చూపించేవాడు కాదు. అందుకని పెళ్లి చేసుకుంటానని చెప్పగానే ఆనందపడ్డాను. అయితే మా ఆవిడ ఒప్పుకోదనుకున్నాను. వెంటనే ఒప్పుకుని నన్ను ఆశ్చర్యపరిచింది. కథ, డెరైక్టర్ భార్యాభర్తల్లాంటివాళ్లు. కనిక రచయిత. ప్రకాశ్ డెరైక్టర్. కనుక మంచి జోడీ అనిపించింది. తను కూడా ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం ఉన్న అమ్మాయిలాగా మా ఇంట్లో కలిసిపోయింది. నా సిస్టర్స్, బ్రదర్స్.. వాళ్ల పిల్లలతో చాలా బాగుంటుంది. మాకు ఒకే ఒక్క కొడుకు కాబట్టి.. మా కోడలినే కూతురిలా భావిస్తున్నాం. పెళ్లయిన ఈ ఏడాది కాలంలో మీ అత్తామామలు మీకిచ్చిన భరోసా గురించి? కనిక: మా అత్తామామలు నన్ను ఓ కోడలిలా చూడలేదు. కూతురిలానే అనుకున్నారు. ఎప్పుడైనాసరే అత్తామామల నుంచి ఎంకరేజ్మెంట్ లభిస్తే ఆ కోడలు కెరీర్‌పరంగా రాణించే వీలుంటుంది. పెళ్లయిన తర్వాత కూడా నేను సక్సెస్‌ఫుల్‌గా కథలు రాసుకుంటూ, ప్రకాశ్‌తో కలిసి సినిమాలు చేయగలుగుతున్నానంటే మా అత్తామామలు ఇచ్చే ఎంకరేజ్మెంటే కారణం. మీ భార్య అత్తగారి దగ్గర ఉత్తమ కోడలనిపించుకోగలిగారా? ప్రకాశ్: (నవ్వుతూ) అమ్మ ముందు నుంచీ హౌస్ వైఫ్. గుళ్లకు ఎక్కువగా వెళుతుంది. కనిక ఎప్పుడూ ఏదో ఒకటి రాసుకుంటూ బిజీగా ఉంటుంది. ఇద్దరూ మాటా మాటా అనుకోవడం, లేనిపోని పట్టింపులు, పంతాలకు పోవడం చేయరు. కనికకు తెలుగు తెలియదు కాబట్టి మీ అమ్మగారు, తన మధ్య సంభాషణకు తావు లేకపోవడం కూడా ఓ అడ్వాంటేజ్ ఏమో? ప్రకాశ్: (నవ్వుతూ). మాటలకన్నా సైగలు ఎక్కువ. అమ్మ మాట్లాడింది అర్థం చేసుకోవడానికి గూగుల్ ట్రాన్స్‌లేటర్ సహాయం తీసుకుంటుంది. అదంతా భలే ఉంటుంది. కనిక: కానీ, తెలుగు నేర్చుకుని ఒకరోజు అత్తయ్యతో గడాగడా తెలుగులో మాట్లాడి, ఆమెను సర్ప్రైజ్ చేయాలని ఉంది. ఇక్కడి సంప్రదాయాల గురించి మీ అత్తగారు చెబుతుంటారా? కనిక: ఇక్కడి ఫంక్షన్లకు ఎలా రెడీ అవ్వాలో నాకు తెలియదు. ఎలాంటి చీరలు కట్టుకోవాలో, ఎలాంటి నగలు పెట్టుకోవాలో అత్తమ్మే చెబుతుంది. ఎలాంటి కలర్స్ సెలక్ట్ చేసుకోవాలో కూడా చెబుతుంది. మీ కోసం మీ అత్తగారు ఏమైనా వంటలు చేసి పెడుతుంటారా? కనిక: దోసలాగ పెద్దగా ఉంటుందే.. అది దోస కూడా కాదు (ప్రకాశ్: దిబ్బరొట్టె గురించి చెబుతోంది). అది చాలా బాగుంటుంది. ఉప్మా చేసి పెడుతుంది. ఒక్కోసారి మా నార్త్ ఇండియన్ డిషెస్ కూడా చేసి పెడుతుంది. ఒకవేళ నాకు ఏదైనా నచ్చకపోతే ‘ఓకే... వేరే చేసి పెడతాను’ అని చెబుతుంది. మీకు ఎవరైనా అక్కా, తమ్ముళ్లు, చెల్లెళ్లు ఉన్నారా? వాళ్లతో ప్రకాశ్ ఎలా ఉంటారు? కనిక: నాకు ఓ అక్క, తమ్ముడు ఉన్నారు. అక్క లండన్‌లో జాబ్ చేస్తోంది. తమ్ముడు ముంబైలో బ్యాంకర్. ప్రకాశ్ మా ఫ్యామిలీతో చాలా బాగుంటారు. వాళ్లు కూడా ఆయన తో అలాగే ఉంటారు. ప్రకాశ్‌తో మాట్లాడటం మొదలుపెట్టాక ఆయన ఎవరికైనా నచ్చేస్తాడు. మావాళ్లందరికీ చాలా త్వరగా దగ్గరయ్యాడు. లవ్ ప్రపోజల్ ముందు ఎవరు చేశారు? ఎలా చేశారు? ప్రకాశ్: నేనే చేశాను. సినిమాటిక్‌గా అయితే కాదు. {పకాశ్ ప్రపోజ్ చేస్తారని మీరు ముందే ఊహించారా? కనిక: ఇద్దరి మధ్య సమ్‌థింగ్ ఉందని మా ఇద్దరికీ తెలుసు. మా అమ్మానాన్నలకి ఓ విచిత్రమైన సంఘటన ద్వారా తెలిసింది. నాకు డెంగ్యూ ఫీవర్ వచ్చి, ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాను. అప్పుడు ప్రకాశ్ చాలా బాగా చూసుకున్నాడు. అప్పుడే మా అమ్మగారు ప్రకాశ్‌ని కలిసింది. ‘ఎవరీ కుర్రాడు.. ఇంత కేర్ తీసుకుంటున్నాడు. చాలా బాగున్నాడు’ అని అడిగింది. మీ నాన్నగారు ఫుల్ మాస్. మీరు క్లాస్ అనిపిస్తోంది. చిన్నప్పట్నుంచీ నాన్నగారి సినిమాలు చూస్తూ పెరిగినా ఆయన ప్రభావం మీ మీద పడలేదనుకోవచ్చా? ప్రకాశ్: బేసిక్‌గా చిన్నప్పట్నుంచీ సినిమాలు చూసినా సినిమాలంటే నాకు ఇంట్రస్ట్ లేదు. థియేటర్ (రంగస్థలం) ద్వారా సినిమాలంటే ఇష్టం ఏర్పడింది. కాలేజ్‌లో థియేటర్ చేశాను. ఆ తర్వాత అమెరికా వెళ్లి నేర్చుకున్నాను. థియేటర్ కథలు కమర్షియల్‌గా ఉండవు. నా మీద వాటి ప్రభావమే ఎక్కువగా ఉంది. ముందు ఆర్టిస్ట్‌గానే పరిచయం అయ్యారు కదా.. తర్వాత డెరైక్షన్ వైపు వెళ్లిపోయారేంటి? ప్రకాశ్: అమెరికాలో థియేటర్లో నేర్చుకున్నది యాక్టింగే. అక్కడ నేర్చుకున్న యాక్టింగ్‌కీ, ఇక్కడ సినిమాలకు చేసే యాక్టింగ్‌కీ చాలా వ్యత్యాసం ఉందనిపించింది. నేను ఏదైతే ట్రైన్ అయ్యానో అందుకు పూర్తి డిఫరెంట్‌గా ఇక్కడ చేయమన్నారు. ఓ రెండు సినిమాలు చేసిన తర్వాత ఇక్కడ చేసే తరహా యాక్టింగ్ మీద ఇంట్రస్ట్ ఏర్పడలేదు. డెరైక్షన్ మీద ముందు నుంచీ ఇంట్రస్ట్ ఉండటంతో అటువైపు వెళ్లిపోయాను. ‘అనగనగా ఓ ధీరుడు’ తర్వాత మీరు చాలా గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? ప్రకాశ్: ఆ సినిమా తర్వాత ఓ ఏడాది కొన్ని కథలు రాసుకున్నాను. ‘గాన్ ఆఫ్ హంటర్స్’ అని ఒక హిందీ టెలివిజన్ షో చేశాను. అది సూపర్ న్యాచురల్ థ్రిల్లర్. దానికి రెండేళ్లు పట్టింది. ఆ తర్వాత కమర్షియల్ బారామీటర్స్కు అతీతంగా సినిమా చేయాలనుకున్నాను. ఆ సమయంలోనే కనిక చెప్పిన కథ నచ్చింది. కథలో మానవీయ విలువలు ఉన్నాయనిపించింది. అందుకని ‘సైజ్ జీరో’ చేశాను. వంద చిత్రాలకు పైగా చేసిన మీ నాన్నగారు ఎక్కువ సినిమాలు తీయమని ఒత్తిడి చేయలేదా? మీరు నాన్నగారి మేకింగ్ స్టయిల్ని అడాప్ట్ చేసుకోవాలనుకోలేదా? ప్రకాశ్: నేను ఎలా ఉండాలి? ఏం చేయాలి? అనే విషయం మీద మా ఫ్యామిలీలో ఎప్పుడూ నిబంధనలు పెట్టలేదు. నాన్నగార్ని ఫాలో కావాలనుకోలేదు. ఆయన అన్ని సినిమాల్లోనూ ఫ్రూట్స్ లాంటి కలర్‌ఫుల్ థింగ్స్ వాడలేదు. ‘జ్యోతి’లో కానీ, ‘ఆమె కథ’లో కానీ అలాంటివి కనిపించవు. ఎందుకంటే, ఆ కథలకు అవి అవసరంలేదు. మేకింగ్ స్టయిల్ అనేది స్టోరీ జానర్‌ని బట్టే ఉంటుంది. నేను ఎన్నుకునే కథలు ఎలాంటి మేకింగ్ స్టయిల్ని డిమాండ్ చేస్తే అదే చేస్తాను. ఓకే... మళ్లీ కనికతో మాట్లాడదాం... మీ భర్త టాలెంటెడ్ అయినప్పటికీ ఇప్పటివరకూ చేసిన బొమ్మలాట, అనగనగా ఓ ధీరుడు కమర్షియల్‌గా సక్సెస్ ఇవ్వలేకపోయాయి. మీరు ఇచ్చిన కథతో ఆయన తీసిన ‘సైజ్ జీరో’ ఆ కొరతను తీస్తుందంటారా? కనిక: ప్రకాశ్ ఆల్రెడీ సక్సెస్ఫుల్. జాతీయ అవార్డు సాధించాడు. ఇక.. కమర్షియల్ సక్సెస్‌కి వస్తే.. ‘సైజ్ జీరో’ ఫన్ మూవీ, ఫ్యామిలీ ఫిల్మ్. సో.. అందరూ చూడాలని కోరుకుంటున్నాను. అంతే తప్ప ఆ సినిమా ఇంత సక్సెస్ కావాలని నేను లెక్కలేసుకోవడంలేదు. మంచి సినిమా తీశాం. అందరూ ఎంజాయ్ చేయాలన్నది నా ఆకాంక్ష. మీ మామగారి మేకింగ్ స్టయిల్‌తో ప్రకాశ్ మేకింగ్ స్టయిల్ని కంపేర్ చేస్తే మీకేమనిపిస్తుంది? కనిక: మా మామగారిది విభిన్న శైలి. ప్రకాశ్‌ది మరో శైలి. ఇద్దరి టేకింగ్‌నీ కంపేర్ చేయలేం. మా మామగారి టేకింగ్ గురించి బాలీవుడ్లో కూడా మాట్లాడుకుంటారు. అక్కడి దర్శకుల్లో చాలామంది ఆయన్ను ఆదర్శంగా తీసుకుంటారు. మామగారి ప్రభావం ప్రకాశ్ మీద అంతగా లేదు. ఎందుకంటే, ప్రకాశ్ ఎంచుకునే కథలు మామగారి కథలకు పూర్తి భిన్నంగా ఉంటాయి. కనికా.. మీరు కథలు రాస్తుంటారు కాబట్టి, ఓ స్టోరీ రైటర్‌కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? కనిక: నేను తెలుసుకున్నదేంటంటే.. ఏ కథకైనా మంచి కథావస్తువు ముఖ్యం. కథలో ఎమోషన్ ఉండాలి. వేగం ఉండాలి. ఆ కథకు తగ్గ స్క్రీన్‌ప్లే-డైలాగ్స్ ఉండాలి. నేను కథలు రాసేటప్పుడు ఆ విషయాల్నే దృష్టిలో పెట్టుకుంటాను. ఇంట్లో మామగారు ఉంటారు కాబట్టి, కథ రాసేటప్పుడు ఇంకా జాగ్రత్తపడాలి. ఎందుకంటే, తెలియకుండా ఆయన ప్రభావం పడే అవకాశం ఉంటుంది. {పకాశ్లో ఉన్న మూడు బెస్ట్ క్వాలిటీస్ చెబుతారా? కనిక: ప్రకాశ్ గురించి మా అమ్మ దగ్గర చెప్పగానే ఆవిడ కూడా ఇలానే అడిగారు (నవ్వుతూ). బేసిక్‌గా నేను క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉన్నాను కాబట్టి, తనూ ఈ ఫీల్డ్‌లో ఉండటం, స్టోరీ టెల్లింగ్‌లో తను చూపించే కొత్తదనం నాకు చాలా నచ్చాయి. ప్రకాశ్ చాలా టాలెంటెడ్. ఆ టాలెంట్‌ని ఇష్టపడ్డాను. ఎదుటి వ్యక్తుల కోసం తనను తాను మార్చుకోడు. ఎలా ఉండాలనుకుంటే అలానే ఉంటాడు. ఎవరి దగ్గరా నటించడు. ఈ రోజుల్లో ఇలాంటి లక్షణాలున్నవాళ్లు చాలా అరుదు. {పకాశ్.. కనికలో మీకు నచ్చిన లక్షణాలు? ప్రకాశ్: మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉంది. చాలా మంచి వ్యక్తి. పంతం నెగ్గించుకోవాలనుకోదు. పట్టువిడుపుగా వ్యవహరిస్తుంది. స్నేహంగా ఉంటుంది. టోటల్‌గా కూల్ పర్సన్. ఇద్దరం ఒకే ఫీల్డ్‌లో ఉంటాం కాబట్టి, చాలా విషయాల్లో ఇద్దరం కనెక్ట్ అవుతాం. ప్రొఫెషనల్లీ ఎదగడానికి మేం ఒకరికొకరం హెల్ప్ చేసుకుంటాం. మీ చేతి వంటను ప్రకాశ్‌కు రుచి చూపించారా? కనిక: వంట చేస్తాను. అది తినే ధైర్యం ఒక్క ప్రకాశ్ మాత్రమే చేస్తాడు. రెగ్యులర్‌గా కుక్ చేయను. అప్పుడప్పుడూ ప్రయోగాలు చేస్తుంటాను. ప్రకాశ్ వద్దనకుండా తింటాడు. మరి.. మీకు వంట వచ్చా? ప్రకాశ్: అంత కాదు.. అస్సలు రాదనే చెప్పాలి. కనిక: శాండ్విచెస్ చేస్తాడు (నవ్వుతూ). ఓకే.. ఈ ఏడాది జీవితం ఎలా అనిపించింది? కనిక: ముందు మీరే చెప్పండి. ప్రకాశ్: వెరీ గుడ్ అండి. కనిక వేరే సిటీ నుంచి వచ్చిన అమ్మాయి. ఇక్కడి వాతావరణానికి అలవాటు పడాలి. నేను షూటింగ్ షెడ్యూల్స్ కారణంగా ఇంట్లో లేకపోతే తాను ఒంటరిగా ఉండాల్సి వచ్చేది. బాగానే ఎడ్జస్ట్ అయింది. పైగా మంచి రచయిత కావడంతో సెట్‌కు వచ్చి మంచి డెసిషన్స్ కూడా తీసుకునేది. నాకు ఆన్ సెట్లో మంచి సపోర్ట్ ఇస్తుంది. అఫ్ సెట్.. అంటే ఇంట్లో మేం హ్యాపీ కపుల్. కనిక: ఏడాది ఎలా గడిచిపోయిందో తెలియడంలేదు. కొత్త వ్యక్తులు, కొత్త వాతావరణం, కల్చర్ అన్నీ కొత్తే. కానీ ఆయన నాకు ఇచ్చిన సపోర్ట్‌ను మర్చిపోలేను. బర్త్‌డేస్‌కి సర్ప్రైజ్ చేసుకోవడం వంటివి? ప్రకాశ్: నా 40వ పుట్టిన రోజుకి కనిక సర్ప్రైజ్తో కూడిన షాక్ ఇచ్చింది. కనిక: ఆయనకు సూపర్ హీరోస్ అంటే చాలా ఇష్టం. అందుకే పుట్టిన రోజున మంచి సర్ప్రైజ్ ఇచ్చాను. ప్రకాశ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ సూపర్ హీరో గెటప్‌లో పార్టీకి హాజరయ్యేలా చేశా. ఆయనకు నిజంగా ఆ రోజున అది స్వీట్ షాక్. మీ ఇద్దరి కాంబినేషన్లో వస్తోన్న తొలి చిత్రం ‘సైజ్ జీరో’ ఎలా ఉంటుంది? కనిక: అందరూ మంచి సినిమా తీశారని అంటారు. ఇది ఉమెన్ సెంట్రిక్ మూవీ కాదు. అందర్నీ ఆకట్టుకుంటుంది. యూత్, ఫ్యామిలీస్ అందరూ బాగా కనెక్ట్ అవుతారు. మీరింత సన్నగా ఉన్నారు. జీరో సైజ్ అని ఓ లావుగా ఉన్న అమ్మాయి గురించి రాయాలని ఎందుకనిపించింది? కనిక: నా చుట్టూ ఉన్న వాళ్లల్లో కొంతమంది జీవితం ఆధారంగా ఈ కథ రాశాను. పెళ్లి అవుతుందంటే నాలుగు నెలల ముందు నుంచి అమ్మాయిని బరువు తగ్గమంటారు. నార్త్, సౌత్ ఎక్కడైనా ఈ పద్ధతి ఒక్కటే. ముఖ్యంగా న్యూస్ పేపర్స్ తెరిస్తే స్లిమ్ సెంటర్స్ గురించే ఉంటున్నాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకుని కథ రాశాను. ఓ లావుగా ఉన్న అమ్మాయి జీవితం చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది. ఆ అమ్మాయికి కొన్ని వెయిట్ ఇష్యూస్ ఉంటాయి. ఆ అమ్మాయి వాటిని ఎలా ఫేస్ చేసింది? అనేది సినిమా. ఎమోషనల్‌గా ఉంటూ నవ్విస్తుంది. ఒకవేళ భవిష్యత్తులో కనిక ‘సైజ్ జీరో’లోలా అనుష్క అంత బరువు పెరిగితే మీరు యాక్సెప్ట్ చేస్తారా? ప్రకాశ్: చెప్పాలంటే... నేను తనను బరువు పెరగమనే చెబుతున్నాను. వినడం లేదు. కనిక: ఆయనకు నేను బరువు పెరిగితే హ్యాపీనే. -
సర్దుకు పోతున్నారు..!
ప్రస్తుత పరిస్థితుల్లో ఒక సినిమా థియేటర్లో ఉండగా మరో సినిమాను రిలీజ్ చేసి కలెక్షన్లు సాధించటం కష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన రెండు సినిమాలు ఒకే సీజన్లో రిలీజ్ చేసే పరిస్థితి అసలే కనిపించటం లేదు. చిన్న సినిమాల విషయంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అందుకే చాలామంది నిర్మాతలు బరిలో దిగి తేల్చుకుందాం అనే కన్నా, సింపుల్‌గా సర్దుకుపోందాం అంటున్నారు. ఈ డిసెంబర్లో ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్‌లతో తెరకెక్కిన మూడు సినిమాలు, ఒకేసారి రిలీజ్‌కు రెడీ అయ్యాయి. మూడు సినిమాలు ఒకేసారి థియేటర్లలోకి వస్తే థియేటర్ల సమస్యతో పాటు కలెక్షన్ల విషయంలో కూడా ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన నిర్మాతలు వారం, వారం గ్యాప్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ముందుగా పివిపి సంస్థ నిర్మిస్తున్న సైజ్ జీరో సినిమాను నవంబర్ 27న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అదే రోజు రిలీజ్‌కు రెడీ అయిన నిఖిల్, కోన వెంకట్ల 'శంకారాభరణం'ను ఒక వారం ఆలస్యంగా డిసెంబర్ 4న రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నా, వాయిదా పడుతూ వస్తున్న 'బెంగాల్ టైగర్' కూడా పోటీ పడటానికి సిద్ధంగా లేడు. అందుకే మరింత గ్యాప్ తీసుకుని, డిసెంబర్ 10న ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు సంపత్‌నంది దర్శకుడు. థియేటర్లలో క్లాష్ లేకుండా నిర్మాతలు అడ్జస్ట్ అయిపోవటం మంచి పరిణామమే అయినా, ఎంతమంది నిర్మాతలు ఈ ఫార్ములాను ఫాలో అవుతారో చూడాలి. -
'సైజ్ జీరో' ప్రచార జోరు
టాలీవుడ్ స్వీటీ అనుష్క నటించిన 'సైజ్ జీరో' సినిమా ప్రచారానికి పీవీపీ సంస్థ భారీ ఎత్తునే సన్నాహాలు చేసినట్టుంది. కాదేదీ పబ్లిసిటీకి అనర్హం అన్నట్టుగా రైలు బోగీలను తమ ప్రచారానికి వాడుకుంటున్న వైనం ఇప్పుడు పలువురిని ఆకట్టుకుంటోంది. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్‌లోని రైళ్లలో 'సైజ్ జీరో' ప్రచారానికి పీవీపీ సంస్థ రెడీ అయింది. దక్షిణ మధ్య రైల్వేకు చెందిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సహా పలు నగరాలకు వెళ్ళే రైళ్ళ లో ప్రచారానికి శ్రీకారం చుట్టింది. రైళ్ల వెలుపల, బయట.. సైజ్ జీరో సినిమాకు సంబంధించిన పోస్టర్స్, డిజైన్స్ ఉండేలా వినూత్నంగా ప్రచారం చేస్తోంది. దీనికి సంబంధించి పీవీపీ సంస్థ ...ఓ క్రియేటివ్ ఏజెన్సీతో కలిసి ఈ ట్రయిన్ పబ్లిసిటీని ప్లాన్ చేసిందట. అందులో భాగంగానే రైలు బోగీలపై ఈ సైజ్ జీరో పోస్టర్లు సందడి చేస్తున్నాయి. రోజుకు లక్షలాది మంది ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేరవేస్తున్న రైల్వేస్‌ను ప్రచారానికి ఎన్నుకోవడం మంచి ఎత్తుగడే అని చెప్పుకోవాలి. టాలీవుడ్‌తో పాటు అన్నిభాషల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'సైజ్ జీరో' సినిమా తెలుగు, తమిళ భాషల్లో నవంబర్ 27న విడుదల చేయనున్నారు. ఓపెనింగ్ లోనే భారీ వసూళ్లను రాబట్టాలని చిత్ర యూనిట్ యోచిస్తోంది. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు తనయుడు ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రకాశ్ భార్య కణిక ఈ చిత్రానికి స్క్రిప్ట్ అందించారు. తెలుగు, తమిళ భాషల్లో పీవీపీ పతాకంపై ప్రసాద్ వి. పొట్లూరి ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటించేందుకు అనుష్క ఏకంగా 20 కేజీల బరువు పెరిగిన విషయం తెలిసిందే. ఆర్య, సోనాల్ చౌహాన్ ముఖ్య పాత్రధారులు. ఈ చిత్రంలో నాగార్జున తళుక్కున మెరవనున్నారని సమాచారం. -
మరో రెండు భారీ చిత్రాల్లో స్వీటీ
ఈ ఏడాది రెండు పెద్ద సినిమాలతో మంచి విజయాలు సాధించిన అనుష్క, వచ్చే సంవత్సరం కూడా అదే జోరు చూపించాలని భావిస్తోంది. బాహుబలి, రుద్రమదేవి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించిన ఈ బ్యూటి త్వరలో 'సైజ్‌జీరో'తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇలా వరుసగా లేడి ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ స్టార్ హీరోలకు గట్టిపోటి ఇస్తోంది. ప్రస్తుతం బాహుబలి 2 తో పాటు సింగం 3 సినిమాల కోసం రెడీ అవుతున్న అనుష్క, ఆ రెండు సినిమాలు పూర్తవ్వగానే మరోసారి లేడి ఓరియంటెడ్ సినిమాల మీద దృష్టి పెట్టనుందట. ఇప్పటికే హైదరాబాద్‌ను ఏళిన కులీ కుతుబ్ షాహీల జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న భాగమతి సినిమాలో టైటిల్ రోల్లో నటించడానికి అంగీకరించింది అనుష్క. ఆ సినిమాతో పాటు దిల్ రాజు నిర్మించనున్న మరో సినిమాకు కూడా ఓకె చెప్పిందట స్వీటీ. ఇప్పటికే ఈ సినిమా స్టోరి కూడా ఫైనల్ చేసి యూనిట్ పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. ఇలా వరుసగా లేడి ఓరియంటెడ్ సినిమాలను అంగీకరిస్తూ వస్తున్న అనుష్క త్వరలోనే రెమ్యూనరేషన్ విషయంలో కూడా స్టార్ హీరోలకు పోటి ఇచ్చే చాన్స్ ఉందంటున్నారు సినీ జనాలు. -
అతి పెద్ద హీరో అనుష్క!
- రానా ‘‘ ‘సైజ్ జీరో’ కథ గురించి ‘బాహుబలి’ సెట్లో అనుష్క చెప్పారు. ఆ సమయంలో తనలో ఉద్వేగాన్ని గమనించాను. ఇన్నేళ్ల పరిచయంలో ఏ సినిమా గురించి ఆమె ఇలా చెప్పలేదు’’ అని దర్శకుడు రాజమౌళి అన్నారు. ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో పీవీపీ సినిమా పతాకంపై అనుష్క, ఆర్య, సోనాల్ చౌహాన్ ముఖ్యపాత్రల్లో పరమ్.వి.పొట్లూరి, కెవిన్ అన్నే సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘సైజ్ జీరో’. ఎమ్.ఎమ్. కీరవాణి స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఆడియో సీడీని దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఆవిష్కరించారు. ప్రకాశ్ కోవెలమూడి మాట్లాడుతూ -‘‘నా భార్య కణికకు నేను థ్యాంక్స్ చెప్పాలి. చాలా మంచి కథ ఇచ్చింది. ఆమె కథ చెప్పగానే వెంటనే సినిమా చేయాలనిపించింది. ప్రసాద్‌గారికి నేను చిన్న సినిమా చేస్తానని చెప్పాను. కానీ ఆయన పెద్ద సినిమాగా చేద్దాం, మంచి యాక్టర్స్ వస్తారని ముందే ఊహించారు. కీరవాణిగారు ‘బాహుబలి’ బిజీలో ఉన్నా, ఈ సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చారు. మేం ఈ సినిమా చేద్దామనగానే మాకు మొదట ఆర్య, అనుష్కలే గుర్తుకువచ్చారు. ఆర్య అయితే కథ వినకుండానే చేస్తానని ముందుకు వచ్చారు’’ అని అన్నారు. ‘‘అందం అనేది చూసే కళ్లను బట్టి ఉంటుంది కానీ శరీరాకృతి బట్టి ఉండదు. దాన్నే స్ఫూర్తిగా తీసుకుని ఈ కథ రాశాను’’ అని రచయిత్రి కణికా డి. కోవెలమూడి అన్నారు. అనుష్క మాట్లాడుతూ- ‘‘ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు స్వీటీ పాత్రకు బాగా కనెక్ట్ అయ్యాను. ఈ సినిమాలో ఓ మెసేజ్ ఉంటుంది. ఏ అమ్మాయీ తన సైజ్‌ను చూసుకుని ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవకూడదు. అదే తెరపై చూపించనున్నాం. కీరవాణిగారు తప్ప ఈ సినిమాకు ఎవరూ న్యాయం చేయలేరు’’ అని చెప్పారు. ఈ వేడుకలో నిర్మాతలు శ్యాంప్రసాద్‌రెడ్డి, ప్రసాద్ వి. పొట్లూరి, హీరో రానా, దర్శకులు, బి.గోపాల్, వంశీ పైడిపల్లి, గోపీచంద్ మలినేని, అలీ, సందీప్ గుణ్ణం తదితరులు పాల్గొన్నారు. -
నవ్వుల రుద్రమ్మ
అందాల తార అనుష్క నటించిన ‘సైజ్ జీరో’ మూవీ ఆడియో ఆవిష్కరణ ఆదివారం హైటెక్స్‌లోని నోవాటెల్ హోటల్లో సందడిగా జరిగింది. అనుష్క, రాఘవేంద్రరావు, రాజమౌళి, కీరవాణి, ఆర్య, సోనాల్ చౌహాన్ తదితరులు హాజరై ఆడియో సీడీని విడుదల చేశారు. -
హీరో కోసం ఒకరు, హీరోయిన్ కోసం మరొకరు
ఇటీవల కాలంలో దక్షిణాది హీరోలు ఫ్రెండ్ షిప్ కోసం కూడా చాలా సినిమాలు చేస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్లో సీనియర్ హీరో నాగార్జున ఇలా ఫ్రెండ్స్ కోసం చాలా సినిమాల్లో నటించాడు. మోహన్ బాబు, విష్ణు లాంటి హీరోలతో కలిసి నటించిన నాగ్ తాజాగా తను వెండితెరకు పరిచయం చేసిన అందాల భామ అనుష్క కోసం మరోసారి గెస్ట్ అపియరెన్స్ ఇచ్చాడు. బాహుబలి, రుద్రమదేవి లాంటి భారీ హిట్స్ తరువాత అనుష్క లీడ్ రోల్లో నటిస్తున్న మరో సినిమా సైజ్ జీరో. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తనయుడు, కెయస్ ప్రకాష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం భారీ సాహసమే చేసింది ఈ యోగా బ్యూటి. ఈ సినిమాలో లావుగా కనిపించటం కోసం చాలా బరువు పెరిగింది. ఇలా ఎంతో రిస్క్ చేసి తెరకెక్కించిన ఈ సినిమాలో ఇంకా చాలా సర్ప్రైజ్ లు ఉన్నాయంటున్నారు చిత్రయూనిట్. ఆర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ మన్మథుడు నాగార్జున ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. తన సూపర్ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన అనుష్క రిస్క్ చేసి మరి చేస్తున్న ఈ సినిమా కోసం నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నాడు. తెలుగుతో పాటు తమిళ్లో కూడా ఒకేసారి ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే తెలుగులో నాగార్జున కనిపించిన పాత్రలో తమిళ్లో మాత్రం యంగ్ హీరో జీవా కనిపించనున్నాడట. సైజ్ జీరోలో హీరోగా నటించిన ఆర్యతో ఉన్న స్నేహం కారణంగా జీవా ఈ క్యారెక్టర్ చేయడానికి అంగీకరించారు. గతంలో కూడా ఆర్య హీరోగా నటించిన 'బాస్ ఎంగిర భాస్కరన్' సినిమాలో గెస్ట్ రోల్లో నటించాడు జీవా. తాజాగా మరోసారి ఫ్రెండ్షిప్ కోసం అదేపని చేస్తున్నాడు. -
‘సైజ్ జీరో’ వర్కింగ్ స్టిల్స్
-
తగ్గాలని తాపత్రయం!
ప్రపంచంలో ఆమెకు ఇష్టమైనవి రెండే రెండు ఒకటి చాక్లెట్స్... ఇంకోటి ఐస్‌క్రీమ్స్. బరువు పెరుగుతున్నా సరే లెక్క చేయకుండా వీర లెవల్లో లాగించేసి భారీ సైజ్‌కు వచ్చేసింది. తర్వాత తన కెంతో ఇష్టమైన ప్రియుని కోసం ఇవన్నీ త్యాగం చేసి జీరో సైజ్‌కు ఎలా మారిపోయిందనే కథాంశంతో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రం ‘సైజ్ జీరో’. అనుష్క, ఆర్య, సోనాల్‌చౌహాన్ ప్రధాన పాత్రల్లో ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో పీవీపీ బ్యానర్ పతాకంపై ప్రసాద్ వి.పొట్లూరి నిర్మించిన ఈ చిత్రం పాటలను నవంబర్ 1న విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎమ్.ఎమ్.కీరవాణి, కథ-స్క్రీన్‌ప్లే: కణిక థిల్లాన్ కోవెలమూడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సందీప్ గుణ్ణం. -
27న తెరపైకి ఇంజి ఇడుప్పళగి
ఈ నెల 27న ఇంజి ఇడుప్పళగి చిత్రం విడుదల కానుంది. ఆర్య, అనుష్క జంటగా నటించిన చిత్రం ఇంజి ఇడుప్పళగి. ద్విభాషా చిత్రంగా పీవీపీ సినిమాస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తెలుగులో జీరోసైజ్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. కోవెలమూడి ప్రకాష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. నిజానికి ఈ చిత్రాన్ని అనుష్క నటించిన రుద్రమదేవికి పోటీగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఆ తరువాత ఇంజి ఇడుప్పళగి చిత్ర విడుదలను ఈ నెల 27కు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. నటి అనుష్క విభిన్నమైన పాత్రను పోషించారు. ఈ చిత్రం కోసం సుమారు 20 కిలోల బరువు పెరిగి నటించడం విశేషం. చిత్రం టీజర్ విడుదలయ్యి ఇప్పటికే మంచి స్పందన పొందింది. దీంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా మరగదమణి సంగీత బాణీలందించిన ఈ ద్విభాషా చిత్రానికి నీరవ్‌షా ఛాయాగ్రహణను అందించారు. చిత్రాన్ని ఈ నెల 27 న ప్రపంచ వ్యాప్తంగా 1500 థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించారు. -
హ్యాట్రిక్ హిట్ కోసం స్వీటీ
ఈ ఏడాది ఇప్పటికే రెండు భారీ విజయాలను నమోదు చేసిన అనుష్క. మరో ఇంట్రస్టింగ్ సినిమాను రిలీజ్‌కు రెడీ చేసింది. అనుష్క లీడ్ రోల్లో ప్రయోగాత్మకంగా తెరకెక్కిన 'సైజ్ జీరో' సినిమాను నవంబర్ 27న రిలీజ్ చేయనున్నారు. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే 'బాహుబలి', 'రుద్రమదేవి' సినిమాలతో మంచి విజయాలు సాధించిన అనుష్క 'సైజ్ జీరో'తో హ్యాట్రిక్ హిట్ సాధించాలని చూస్తోంది. ఈ సినిమా కోసం భారీగా బరువు పెరిగి, చాలా రిస్క్ చేసిన స్వీటీ, సక్సెస్ మీద అంతే కాన్ఫిడెంట్‌గా ఉంది. దసరా సీజన్లోనే సైజ్ జీరో రిలీజ్ చేయాలని భావించినా, పెద్ద సినిమాలు బరిలో ఉండటంతో వెనక్కి తగ్గారు. పివిపి సినిమా బ్యానర్‌పై పొట్లూరి వరప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అనుష్కతో పాటు ఆర్య, సోనాల్ చౌహాన్, ప్రకాష్ రాజ్, ఊర్వశి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు. ఈ సినిమాను నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా 1500 వందల థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. -
స్వీటీ... వెరైటీ పాత్రల బ్యూటీ
ఈ దీపావళి లోపల రెండు నెలల్లో ఒకటికి రెండు లేడీ ఓరియంటెడ్ సినిమాలు రానున్నాయి. కాకతీయ సామ్రాజ్యాన్ని ఏలిన ‘రుద్రమదేవి’ జీవితం చూపే తెలుగు జాతి చరిత్ర ఒకటైతే, ఆడపిల్లంటే అందంగా - నాజూగ్గా - నడుము సన్నంగా ఉండాలనే ఆధునిక తెలుగు సమాజపు అర్థం పర్థం లేని బ్యూటీ డెఫినిషన్ ‘సైజ్ జీరో’ను ప్రశ్నించే కాంటెంపరరీ కథ మరొకటి. చిత్రంగా అటు ‘రుద్రమదేవి’గా, ఇటు ‘సైజ్ జీరో’ కోసం శ్రమించాల్సి వచ్చిన అమ్మాయిగా అలరించనున్నది ఒకే హీరోయిన్! ... ‘స్వీటీ’ అనుష్క. ఇలాంటి వెరైటీ కథలు తీయడం ఒక రకంగా ఇవాళ్టి మార్కెట్ ట్రెండ్‌లో సాహసమే. ఆ సాహసానికి సిద్ధపడడం గుణశేఖర్ (‘రుద్రమదేవి’), కోవెలమూడి ప్రకాశ్ (‘సైజ్‌జీరో’) లాంటి దర్శక, నిర్మాతల తీరని సృజనాత్మక దాహానికి ప్రతీక. ఇలాంటి తీసేవాళ్ళు ఒకరిద్దరున్నా చేసేవాళ్ళెవరన్నది ప్రశ్న. కోట్ల సంపాదనతో తృప్తి పడకుండా కలకాలం చెప్పుకొనే కొన్ని సినిమాలైనా కెరీర్లో మిగిలిపోవాలని భావించడంతో అనుష్క ఆ గట్స్ తనకున్నాయని నిరూపించుకుంది. మొన్నటికి మొన్న ‘బాహుబలి... ది బిగినింగ్’లో దేవసేనగా ముసలి క్యారెక్టర్లో కనిపించి, ఇప్పుడిలా 3డీలో ‘రుద్రమదేవి’గా కత్తి పట్టుకొని, ‘సైజ్ జీరో’లో అమాయకత్వం నిండిన అందమైన భారీకాయంతో ఐస్‌క్రీమ్ పట్టుకొని అనుష్క వైవిధ్యంగా కనిపిస్తున్నారు. ఇలా మూడు వేర్వేరు తరహా పాత్రలతో ఈ ఏడాది మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ అయిన ఈ కన్నడ కస్తూరి ఈ అక్టోబర్, నవంబర్లలో ‘రుద్రమదేవి’, ‘సైజ్‌జీరో’ ఎప్పుడెప్పుడు రిలీజవుతాయా అని ఎదురుచూస్తున్నారు. పడిన కష్టానికి తగ్గ ప్రశంసలు, బాక్సాఫీస్ రిజల్ట్ రావాలని విఘ్నేశ్వరుడికి మొక్కుకుంటున్నారు. -
అనుష్క చిత్రానికి యమ క్రేజ్
నటి అనుష్క చిత్రం అనూహ్య క్రేజ్ సంపాదించుకుంది. ఆ చిత్రం ఏమిటని తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? తమిళంలో ఇంజి ఇడుప్పళగి పేరుతోనూ, తెలుగులో సైజ్ జీరో పేరుతోనూ రూపొందుతున్న ద్విభాషా చిత్రం గురించే ఈ ప్రస్థావన. ఇందులో హీరో ఆర్య ఉండగా అనుష్క చిత్రం అంటారేమిటి అన్న ప్రశ్న తలెత్తుతోందా?ఆర్య ప్రకాశ్‌రాజ్, సోనల్సుహాన్, మాస్టర్ భరత్ ఇలా చిత్రంలో చాలా మంది ప్రముఖ నటీనటులు ఉన్నారు. అయితే ఇది పూర్తిగా నటి అనుష్క చుట్టూ తిరిగే కథ. ఆమె అందం, మందం అంశాలను చర్చించే ఇతి వృత్తం. ఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదలై అనూహ్య ఆదరణను పొందిందని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. ఈ టీజర్ విడుదలైన రెండు రోజుల్లోనే యూట్యూబ్‌లో రెండు లక్షల మంది వీక్షించినట్లు చిత్ర యూనిట్ తెలిపారు.ముఖ్యంగా ముద్దుగా, బొద్దుగా ఉన్న హన్సిక రూపం, సన్నగా, అందంగా ఉన్న రూపాలు సినీ ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తున్నట్లు,ఇందులో బొద్దుగా ఉండడానికి అనుష్క సుమారు 20 కిలోల బరువు పెరగడం వంటి అంశాలు ఇంజి ఇడుప్పళగి చిత్రంపై అంచనాలను పెంచేశాయని చిత్ర వర్గాలు పేర్కొన్నారు. ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీవీపీ సినిమా సంస్థ నిర్మిస్తోంది. మరగదమణి(కీరవాణి) సంగీతబాణీలందిస్తున్న ఈ చిత్ర ఆడియోను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించారు. -
‘సైజ్ జీరో’సినిమా స్టిల్స్
-
సైజ్ జీరో టీజర్ విడుదల
-
సైజ్ జీరో టీజర్ విడుదల
టాలీవుడ్‌తో పాటు అన్నిభాషల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'సైజ్ జీరో' సినిమా టీజర్ సోమవారం సాయంత్రం విడుదలైంది. టాలీవుడ్ టాప్ హీరోయిన్ స్వీటీ అనుష్క బాగా లావుగా కనిపించే ఈ సినిమా టీజర్ యూట్యూబ్ లింకును అగ్రహీరో నాగార్జున తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. అనుష్క ఈ సినిమాలో చాలా అద్భుతంగా ఉందని, ఇది అమోఘమని ఆయన అన్నారు. ఇక ఈ టీజర్లో పక్క పక్క సీట్లలో ఒక కుక్కతో లావుగా కనిపించే అనుష్క, కూల్డ్రింకు తాగుతూ.. చిరుతిళ్లు తింటూ.. హీల్స్‌తో నడవడానికి అష్టకష్టాలు పడుతూ ఉంటే ఆ పక్కనే ఉండే ఆర్య ఆమె కష్టాలు చూసి తెగ నవ్వుతుంటాడు. అలాగే, కుర్చీలో కూర్చోబోతుంటే అది కాస్తా విరిగిపోతుంది. అంతా అయిన తర్వాత.. కాస్త సన్నబడ్డ అనుష్క.. వేయింగ్ మిషన్‌లో బరువు చూసుకుని ఆనందంతో గెంతులు వేస్తుంది. మొత్తమ్మీద టీజర్ చూస్తేనే సినిమా ఎంత ఆసక్తికరంగా ఉంటుందో అర్థమైపోతోంది. #SizeZero The incredible Anushka,Amazing!!http://t.co/lOlVyBAz00 — Nagarjuna Akkineni (@iamnagarjuna) August 31, 2015 -
సన్నజాజి నడుము
చక్కనమ్మ చిక్కినా అందమే అంటారు. కానీ అనుష్క లాంటి స్వీట్ బ్యూటీ బొద్దుగా ఉన్నా సూపర్ అని ‘సైజ్ జీరో’ (‘సన్నజాజి నడుము’ దీనికి ఉపశీర్షిక) పోస్టర్ చూసి చెప్పొచ్చు. సాధారణంగా పాత్రల కోసం కథానాయికలు సన్నబడతారు. కానీ, అనుష్క మాత్రం ‘సైజ్ జీరో’లోని పాత్ర కోసం ఏకంగా 20 కిలోల బరువు పెరిగారు. సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు తనయుడు ప్రకాశ్ కోవెలమూడి కొంత విరామం తరువాత ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రకాశ్ భార్య కణిక ఈ చిత్రానికి స్క్రిప్ట్ అందించారు. తెలుగు, తమిళ భాషల్లో పీవీపీ పతాకంపై ప్రసాద్ వి. పొట్లూరి ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది. అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసి, అక్టోబర్ 2న విడుదల చేయనున్నారు. ఆర్య, సోనాల్ చౌహాన్ ముఖ్య పాత్రధారులు. ఈ చిత్రంలో నాగార్జున తళుక్కున మెరవనున్నారని సమాచారం. -
ఆహా అనుష్క.. ఓహో త్రిష!
బాహుబలి రెండో భాగం షూటింగ్ ప్రారంభం కావడానికి ఇంకా కాస్త సమయం ఉన్నట్టుంది.. అందుకే దర్శకుడు రాజమౌళి మిగిలిన సినిమాలు ఎలా ఉన్నాయో, వాటిలో ఎవరెవరు ఎలా చేస్తున్నారో బాగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం సైజ్ జీరో సినిమాలో డీ గ్లామరస్‌గా, లావుగా కనిపిస్తున్న అనుష్కను, నాయకి సినిమాలో ఒక చేత్తో కత్తి పట్టుకున్న త్రిషను ఆయన పొగడ్తల్లో ముంచెత్తారు. ప్రస్తుతం రెండు సినిమాలు బాగా ఆసక్తికరంగా అనిపిస్తున్నాయని రాజమౌళి ట్వీట్ చేశారు. ఆ రెండు సినిమాల పోస్టర్లు చూస్తుంటేనే ఆసక్తి కలుగుతోందన్నారు. సైజ్ జీరో సినిమాలో స్వీటీ (అనుష్క) చాలా చక్కగా ఉందని చెప్పారు. ఇక నాయకి సినిమాలో త్రిష అయితే.. ముఖంలో చిరునవ్వులు చిందిస్తూ, కుడిచేత్తో కత్తి, ఎడమ చేత్తో పూజాసామగ్రి పట్టుకుని వెళ్తున్న గెటప్ కూడా చాలా బాగుందని వ్యాఖ్యానించారు. నాయకి పోస్టర్ గురించి రాజమౌళి అంతటి దర్శకుడు ట్వీట్ చేయడంతో.. ఆ చిత్ర దర్శకుడు గోవి గోవర్ధన్ ఎంతగానో మురిసిపోయారు. ఆయనకు కృతజ్ఞతలు చెప్పారు. Two films are creating lot of curiosity with posters itself. One is size zero..Sweety is so adorable… -
హీరోలకు ధీటుగా ప్రయోగాలు చేస్తున్న స్వీటి
-
అందరి నోట.. అనుష్క మాట!
-
అందరి నోట.. అనుష్క మాట!
సోషల్ మీడియాలో ఒక్కోసారి ఒక్కో టాపిక్ ట్రెండ్ అవుతుంటుంది. తాజాగా అంతా సైజ్ జీరో అనే సినిమాలో అనుష్క అవతారం గురించే మాట్లాడుతున్నారు. సైజ్ జీరో ట్రెండ్ జోరుగా నడుస్తోంది. బాహుబలి, రుద్రమదేవి సినిమాల్లో చలాకీగా నటించిన అనుష్క.. ఉన్నట్టుండి ఆర్య సరసన బోలెడంత లావుగా ఎందుకు నటిస్తోందో తెలియక కొంతమంది, ఇంత ధైర్యం ఆమె చేయడం నిజంగా చాలా గొప్పదని మరికొందరు ఈ టాపిక్ గురించే ఎక్కువగా చర్చిస్తున్నారు. సమంత లాంటి హీరోయిన్లు కూడా అనుష్క ఇలా చేయడం చాలా సాహసోపేతమని, ఆమె అద్భుతంగా ఉందని.. సైజ్ జీరో సినిమా చూసేందుకు ఉత్సుకతగా ఉన్నానని ఆమె ట్వీట్ చేసింది. ఈరోజుల్లో హీరోయిన్లు ఒకరి కంటే మరొకరు బాగా హాట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారని.. మనం చేయాల్సింది ఇంకా చాలా ఉందన్న విషయం ఇలాంటి పాత్రల వల్లే తెలుస్తుందని చెప్పింది. కెరీర్లో అత్యున్నత స్థాయిలో ఉండి కూడా అనుష్క ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలు చేయడం నిజంగా అద్భుతమని మరికొందరు అన్నారు. ఇప్పటివరకు ఇలాంటి ప్రయోగాలు చేయగల హీరోయిన్ విద్యాబాలన్ ఒక్కరే అనుకున్నామని, ఇన్నాళ్లకు అనుష్క రూపంలో మరో హీరోయిన్ దొరికిందని మరొకరు వ్యాఖ్యానించారు. పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉందని లక్ష్మీరాయ్ ట్వీట్ చేసింది. తెలుగు సినిమాలకు సంబంధించిన అనేక ఇతర సంస్థలు కూడా ఈ పోస్టర్లను రీట్వీట్ చేశాయి. In times where every heroine is trying to look hotter than the other. It's really nice to know that there s more that we can do. #SizeZero — Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) August 14, 2015 Wowwwwwww like wowww. So refreshing. Anushka aka amazing. Looking forward. #SizeZero pic.twitter.com/eLzXhFMp5r — Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) August 14, 2015 That's a very interesting poster #sizezero something new all the best jam ,anushka n @PVPCinema @arya_offl -
లడ్డూలా ఉన్నావంటూ బుగ్గలు నిమిరారు!- అనుష్క
ఒకప్పుడు బొద్దుగా బందరు లడ్డూలా ఉండే కథానాయికలంటే పడి చచ్చేవాళ్లు. ఇప్పుడేమో ‘జీరో సైజ్’ ట్రెండ్ నడుస్తోంది. వీలైనంత సన్నగా కనిపించాలని కథానాయికలు తాపత్రయపడతారు. లావుగా కనిపించాల్సి వచ్చే ఆ పాత్రలకు దాదాపు దూరంగా ఉంటారు. కానీ, అనుష్కలాంటి కొంతమంది తారలు మాత్రం పాత్ర డిమాండ్ చేస్తే, తగ్గుతారు, పెరుగుతారు. అందుకు ఓ ఉదాహరణ ‘బిల్లా’. ఆ సినిమా కోసం బరువు తగ్గిన అనుష్క తాజాగా ‘సైజ్ జీరో’ కోసం బరువు పెరిగారు. ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఆర్య, అనుష్క కాంబినేషన్లో ప్రసాద్ వి. పొట్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఒక్క పాట మినహా పూర్తయ్యింది. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్‌లో అనుష్కను చూసి ఆందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు పరిగెత్తుతున్నట్లు ఉన్న ఈ పోస్టర్ చూస్తే, మరింతగా ఆశ్చర్యపోవడం ఖాయం. వాస్తవానికి ఈ పాత్ర గురించి చెప్పగానే అనుష్క తనంతట తాను బరువు పెరగాలని నిర్ణయించుకున్నారట. ఆ విషయం గురించి అనుష్క ‘సాక్షి’తో మాట్లాడుతూ - ‘‘ఇవాళ టెక్నాలజీ ఎంత పెరిగిందో తెలిసిందే. ఏదైనా ట్రిక్ చేసి, లావుగా కనబడేలా చేయొచ్చు. కానీ, నాకది ఇష్టం లేదు. అందుకే బరువు పెరగాలని దర్శక, నిర్మాతలు నాకు నిబంధన విధించకపోయినా పెరుగుతానని నా అంతట నేనే చెప్పాను. దీనికోసం ఎక్కువ ఆహారం తీసుకున్నాను. కానీ, ఆరోగ్యకరమైనదే తీసుకున్నాను. అందరూ లడ్డూలా ఉన్నావంటూ బుగ్గలు నిమిరారు. ‘సైజ్ జీరో’ చాలా స్వీట్ స్క్రిప్ట్. మంచి మెసేజ్ ఉంది. ప్రతి అమ్మాయీ ఈ చిత్రంతో కనెక్ట్ అవుతుంది’’ అన్నారు. -
అనుష్క లావైంది
ఆహా ఓహో అనుష్క చిత్ర ప్రముఖలే కాదు, సహ నటీమణుల నోట ఇప్పుడు ఇదే మాట. ఇంతకీ ఏమిటబ్బా నటి అనుష్క చేసిన ఘన కార్యం. ఎవరికయినా ఏమైనా సాయం చేశారా? లేక పారితోషికమే తీసుకోకుండా నటిస్తున్నారా? అని ఆరా తీస్తే అవేవీ కాదని తెలిసింది. ఇంతకీ ఏమయిందీ అంటే అనుష్క లావయ్యారు.ఇదీ మ్యాటర్. ఓస్ ఇంతేనా’ అని తేలిగ్గా తీసిపారేయకండి. సాధారణంగా పాత్రలకు తగ్గట్టుగా నటులే శారీరక హెచ్చు తగ్గులకు కసరత్తులు చేస్తుంటారు. కథానాయికలు అలా చేయడం అన్నది అరుదే కాదు అసలు జరిగిన దాఖలాలు లేవు. నటి అనుష్క ఇంజి ఇడుప్పళగి అనే ద్విభాషా చిత్రంలో నటిస్తున్నారు. తెలుగులో సైజ్ జీరో పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీవీపీ సినిమా సంస్థ నిర్మిస్తోంది.ఆర్య కథానాయకుడు ప్రకాష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. అందులో అనుష్క రూపం చూసిన అభిమానులు,చిత్ర ప్రముఖులు,సహ నటీమణలూ ఆశ్చర్యం వ్యక్తం చేయడం విశేషం. అనుష్కను అందరూ ముద్దుగా స్వీటీ అని పిలుస్తుంటారు. అంత అందం ఆమెది. అలాంటి అనుష్క ఊహించనంత బొద్దుగా కనిపించడమే వారి ఆశ్చర్యానికి కారణం. ఎంత పాత్ర కోసం అయినా అంత లావైపోవడమా వావ్ అనుష్కా అంటున్నారు. లావుగా ఉండే యువతి సన్నగా తయారయ్యే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ఇంజి ఇడుప్పళగి. ఈ చిత్రం కోసం అనుష్క సుమారు 100 కేజీల బరువుకు తన శరీరాని పెంచుకున్నారని సమాచారం. అంతే కాదు మళ్ల ఇదే చిత్రంలో జీరోసైజ్‌కు మారి అందాలారబోస్తారట. తాజా సమాచారం ఏమిటంటే ఇందులో ఈత దుస్తుల్లోనూ అనుష్క అందాల్ని చూడవచ్చునట. ఏమిటీ ఇప్పుడే చిత్రాన్ని చూడాలనిపిస్తోందా? వచ్చేనెల ఆరవ తేదీన ఆడియోను విడుదల చేసి గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండున ఈ ద్విభాషా చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. -
ఈ హీరోయిన్ను గుర్తుపట్టారా?
ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ను గుర్తుపట్టారా?...చెప్పుకోండి చూద్దాం... ఆమెను ఎక్కడో చూసినట్లు ఉంది కదూ... ఎవరో కాదండి బాబూ...అందాల తార అనుష్క. బాహుబలి చిత్రంలో దేవసేనగా కనిపించిన ఆమె ఇప్పుడు 'సైజ్ జీరో' చిత్రంలో న్యూ లుక్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వం వహిస్తున్న సైజ్ జీరో (సన్నజాజి నడుము- ట్యాగ్ లైన్) సినిమా ఫస్ట్ లుక్ శుక్రవారం రిలీజ్ చేశారు. యోగాతో చెక్కిన శిల్పంలా ఉండే అనుష్క ఈ చిత్రంలో తన పాత్ర కోసం దాదాపు ఇరవై కేజీల బరువు పెరిగింది. బొద్దుగా, మొహానికి కళ్లజోడుతో అనుష్క డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తోంది. పీవీపీ సంస్థ నుంచి వస్తున్న ఈ చిత్రంలో ప్రధాన తారగణంగా అనుష్క, తమిళ నటులు ఆర్యా, భరత్, ఊర్వశి నటిస్తుండగా మరో ముఖ్య అతిథి పాత్రలో శృతిహాసన్ మెరవనుంది. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా 1500 థియేటర్స్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు. 'అనగనగా ఓ ధీరుడు' తర్వాత గ్యాప్ తీసుకున్న ప్రకాశ్ రొమాంటిక్ కామెడీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మరో విశేషం ఏంటంటే... ప్రకాశ్ సతీమణి కనికా థిల్లాన్ ఈ సినిమాకు కథ అందించడం. తెలుగు, తమిళర భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీతం ఎంఎం కీరవాణి అందిస్తున్నారు. -
’సైజ్ జోరో’ ఫస్ట్‌లుక్ రిలీజ్
-
మాకూ అవకాశం ఇవ్వండి
మా గురించి కాస్త ఆలోచించండి అంటున్నారు నటి అనుష్క. మనకున్న అతి కొద్ది మంది నటనా సత్తా ఉన్న నటీమణుల్లో అనుష్క ఒకరని నొక్కివ క్కాణించవచ్చు. ఆదిలో ఆట బొమ్మగా కొన్ని చిత్రాల్లో కనిపించినా, ఆ తరువాత తనలోని ప్రతిభను వెలికి తీసే పాత్రల్లో దుమ్మురేపారు. ఉదాహరణకు ఒక్క అరుంధతి చాలు నటిగా అనుష్క సత్తా ఏమిటో చెప్పడానికి. త్వరలో రుద్రమదేవిగా వెండితెరపై విజృంభించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రంలో పలు సాహసాలు చేసిన అనుష్క గుర్రపు స్వారీలు, కత్తిసాములు చేశారు. ఆమె వీరోచిత దృశ్యాలు త్వరలో సిల్వర్ స్క్రీన్‌పై చూడబోతున్నాం. అలాగే ద్విభాషా చిత్రం ఇంజిఇడుప్పళగి (తెలుగులో సైజ్ జీరో) చిత్రంలోని పాత్ర కోసం వంద కిలోల బరువు పెంచుకుని నటిస్తున్న నటి అనుష్క. అలాంటి నటి కొంచెం మాగురించి కూడా ఆలోచించండి అంటూ దర్శక నిర్మాతలకు విజ్ఞప్తి చేయడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? దాని వెనుక ఆమె కళాతృష్ణ ఉందని భావించాలి. లేక కొన్ని పాత్రలు నిరాశ పరచి ఉండవచ్చు. ఏది ఏమైనా ఆమె అభ్యర్థనలో అర్థం ఉంది. తమిళ,తెలుగు చిత్రాల్లో హీరోయిన్లకు ప్రాధాన్యం తక్కువేనన్నది అంగీకరించి తీరాల్సిందే. ఎప్పుడో ఒకసారి నటనకు అవకాశం ఉన్న పాత్రలు లభిస్తుంటాయి. మలయాళంలో అలా కాదు. అక్కడ కథానాయకులతోపాటు కథానాయికీలకు ప్రాధాన్యత ఉంటుంది. ఇంతకు ముందు నటి విజయశాంతి హీరోయిన్ ఓరియన్‌టెడ్ చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ఇమేజ్ను సంపాదించుకున్నారు. అలా ప్రాధాన్యం ఉన్న పాత్రల్లోనూ, యాక్షన్ కథా చిత్రాల్లోనూ నటించడానికి తనలాంటి వారు సిద్ధంగా ఉన్నారు. మా గురించి కాస్త ఆలోచించండి అంటూ అనుష్క దర్శక నిర్మాతలు విజ్ఞప్తి చేస్తున్నారట. -
ప్రేమించిన వ్యక్తినే పెళ్లాడతా..
చెన్నై: ప్రేమించిన వ్యక్తినే పెళ్లాడతానని నటి అనుష్క తెలిపింది. అనుష్క నటించిన రెండు భారీ చిత్రాలు త్వరలో విడుదల కానున్నాయి. కొన్నేళ్లుగా ఆమె వివాహం గురించిన వార్తలు చక్కర్లు కొడుతున్నా... అనుష్క మాత్రం కొత్త చిత్రాలకు వరుసగా కాల్షీట్లు ఇస్తునే ఉంది. ఇలావుండగా ఓవ్యక్తితో సన్నిహితంగా ఉంటున్నట్లు అనుష్క వీడియో చిత్రాలు ఇంటర్నెట్లో విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వివాహం గురించి అనుష్కను ప్రశ్నించగా పెళ్లి గురించి ఆలోచించే సమయం ప్రస్తుతం లేదని తెలిపింది. ఎందుకంటే తాను నటిస్తున్న భారీ చిత్రాల పనులు ఇంకా కొనసాగుతున్నాయని, వివాహం అనుకోగానే జరగదని, కాలం కలిసి రావాలని పేర్కొంది. ప్రస్తుతం అనుష్క టాలీవుడ్ దర్శకుడు కె.రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ దర్శకత్వం వహించనున్న ‘సైజ్ జీరో’ చిత్రంలో నటిస్తోంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన రుద్రమదేవి, రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి చిత్రాల్లో అనుష్క ప్రధాన పాత్రలు పోషించింది. ఆ చిత్రాలు వేసవిలో విడుదల కానున్నాయి. -
లావూసన్నం
ఫిక్సేషన్ మాధవ్ శింగరాజు మనుషులు ఎలా ఉంటే అందంగా ఉంటారు? ఏమిటీ వాక్యం! ఇందులో పౌష్టికాహార లోపమేదో ఉన్నట్లు అనిపించడం లేదూ?! నిజమే. అనిపిస్తోంది. వాక్యంలో ఉండాల్సినంత వెయిట్ లేదు. అయితే కొంచెం మార్చి చూద్దాం.. బరువు పెరుగుతుందేమో! ‘మనుషులు’ అని ఉన్నచోట ‘మహిళలు’ అని చేరిస్తే అప్పుడీ వాక్యం ఇలా ఉంటుంది: ‘మహిళలు ఎలా ఉంటే అందంగా ఉంటారు?’. వచ్చేసింది! వాక్యం బరువు పెరిగి, వాక్యానికి అందం వచ్చేసింది. అదీ ఫిమేల్ పవర్! స్త్రీ.. పక్కన ఉంటే చాలు ఎవరికైనా ఇట్టే వెయిట్ పెరిగిపోతుంది.. అది వాక్యమే అయినా, వానరమే అయినా. స్త్రీల వల్ల పెరిగే వెయిట్ సరే, స్త్రీల వెయిట్‌ను పెంచేదేమిటి? గ్లామర్ ఇండస్ట్రీలో ఉండేవారిని మాత్రం ఈ ప్రశ్న అడక్కండి. వారు జీరో సైజ్ గురించి మాట్లాడతారు. ‘వెయిట్ తగ్గడమే వెయిట్ పెరగడం’ అని వారి డెఫినిషన్. సౌందర్యభారం తప్ప ఒంటికి మరే భారమూ తగిలించుకోని వారే తీరైన అందగత్తెలని వారొక ఫీలింగ్‌ని గాల్లోకి వదిలిపెట్టారు. తిండి మానేసి, మన పిల్లలు ఆ ఫీలింగ్‌తో పొట్ట నింపేసుకుంటున్నారు. ఇష్టమైన కూరతో ఒక్క ముద్ద ఎక్కువ తిన్నా సరే, ఆ పూటకి... దే ఫీల్ ఫ్యాటీ! బరువంటే అంత భయం పెట్టేశారు ఈ ఫ్యాషన్ డిజైనర్లు, పూరి జగన్నాథ్‌లు. ‘ఫీలింగ్ ఫ్యాట్’ అనే మాటకు నిన్నమొన్నటి వరకు ఫేస్బుక్లో ఒక ఎమోటికాన్ ఉండేది. ఇప్పుడది లేదు. రౌండ్ సర్కిల్. లోపల రెండు కళ్లు. చెంపలపై అటూఇటు కందినట్లు బ్లషింగ్. నవ్వీనవ్వనట్లుండే నోరు. దాని కింద డబుల్ చిన్ గీత. ఇదీ ఆ ఎమోటికాన్. అయితే ‘‘ఫ్యాట్ అనేది ఫీలింగ్ ఎలా అవుతుంది?’’ అని కేథరీన్ వైగాఫెన్ అనే నాటక రచయిత్రి పెద్ద ఉద్యమం తేవడంతో ఫేస్బుక్ దానిని తీసేసింది. ‘‘పూరీ, ఆలుగడ్డ చేయడం పాపమా ఏంటి?’’ అని ఓ కమర్షియల్ యాడ్‌లోని పెద్దావిడ అడిగినవిధంగా, ‘‘ఫ్యాటీగా ఉండడం పాపమా ఏంటి?’’ అని ప్రపంచం ఇప్పుడు అడుగుతోంది. మంచి పరిణామమే. బక్కపలుచని ముఖచిత్రాలకు పేరుమోసిన ‘స్పోర్ట్స్ ఇలస్ట్రేటెడ్’... బొద్దుగా ఉన్న మోడల్స్‌ని మాత్రమే ఈ ఏడాది తన కవర్ పేజీలకు ఎంపిక చేసుకుంది! అతి నాజూకైన ‘పెరిల్లి’ కొత్త క్యాలెండర్ కూడా కాస్త బరువు తూగే అమ్మాయిలతోనే పరిపుష్టం అయింది! ఇక ఫ్రాన్స్ అయితే ఎండుటాకులా ఎగిరిపోయేలా ఉన్న (అల్ట్రా థిన్) మోడల్స్.. ర్యాంప్‌పై నడుస్తూ కనబడితే, వాళ్లను అలా నడిపించినవాళ్లకు డెబ్బై ఐదు వేల యూరోల ఫైన్ విధించి, ఆర్నెల్లు జైల్లో పెట్టే చట్టం ఒకటి తెచ్చింది. అంటే ఏమిటి? లావులోనే అందం ఉందనా? మరీ చిక్కితే అందం అనారోగ్యం అవుతుందనా? రెండూ కాదు. సన్నదనం మీద అంత వ్యామోహం పనికిరాదని. ఇంతకీ మహిళలు ఎలా ఉంటే అందంగా ఉంటారు? లావుగానా? సన్నగానా? లావూసన్నం కాకుండానా? ‘‘ఎలా ఉంటే వారికి సంతోషంగా అనిపిస్తుందో అదే అందం’’ అంటారు సప్న భావ్నాని. సప్న ప్రముఖ హెయిర్ స్టెయిలిస్ట్. ‘‘మీ లావూసన్నం గురించి ఎవరేం కామెంట్ చేసినా పట్టించుకోవద్దు. మీరూ ఎవరి గురించీ కామెంట్ చేయొద్దు. ఫిట్‌నెన్ మీకు సంతోషాన్నిచ్చే పనైతే ఫిట్‌గా ఉండండి. సన్నగా ఉండడం మీకు సంతోషమైతే సన్నగానే ఉండండి. లావుగా ఉన్నందువల్ల సంతోషంగా ఉంటామనుకుంటే లావుగానే ఉండండి’’ అని సప్న సూచన. ఇందులో ఆమె మగాళ్లకు మృదువుగా వేసిన మొటిక్కాయ కూడా ఉంది! ఆడవాళ్ల అందం గురించి అదే పనిగా ఆలోచించడం మాని, పనికొచ్చే పనేదైనా ఉంటే చూసుకొమ్మని! ఇన్ని మాట్లాడుతున్నాం కానీ ఎంతైనా ‘సన్నం... సన్నం’ అని మనసు పీకుతూనే ఉంటుంది. మన మైండ్లు అలా ఫిక్స్ అయిపోయాయి. అయితే ఈ సాంస్కృతిక కోమలత్వపు కలవరింత (కల్చరల్ ఫిక్సేషన్) ఆడవాళ్ల అందం గురించి కాదనీ, వారి అణకువపై మగవాళ్లకుండే పరితపన (అబ్సెషన్) మాత్రమేనని ‘ది బ్యూటీ మిత్’ రచయిత్రి నవోమీ ఉల్ఫ్ చెబుతున్నారు. బ్యూటీ మీదే కాదు, ఆడవాళ్ల ‘డూస్ అండ్ డోంట్స్’ మీద కూడా ఏళ్లుగా మనక్కొన్ని మిత్‌లు ఉండిపోయాయి. ఆ కల్పితాలను ఎగరగొట్టేందుకు ఆ మధ్య ‘ఏక్ బూరీ లడికీ’ (బ్యాడ్ గర్ల్) అని ఒక పోస్టర్ సెటైర్ నెట్లోకి వచ్చింది. చెడ్డమ్మాయిల గుణగణాలను ఆ పోస్టర్లో ఒక పట్టికలా ఇచ్చారు. బ్యాడ్ గర్ల్స్ మితి మీరి తింటారట. లేదా అసలే తిండి మానేస్తారట. రోటీలు గుండ్రంగా తయారు చేయలేరట. వెంట్రుకల్ని విరబోసుకుని వీధుల్లోకి వచ్చేస్తారట. ఇలాంటి ఓ పన్నెండు వరకు ఉన్నాయి. వాటన్నింటినీ ఒంటికి పట్టించుకోకపోతే మనక్కొంచెం ఫ్యాట్ తగ్గుతుంది. ఆడవాళ్ల అందంలోని ఫ్యాట్ కన్నా, మగవాళ్ల ఆలోచనల్లోని ఫ్యాట్ ఎక్కువ హానికరం. బాలీవుడ్ నటి సోనాక్షీ సిన్హా : ట్విట్టర్లో తన బరువుపై వచ్చిన జోకులకు ఆమధ్య సోనాక్షీ ఎంతో బాధపడ్డారు. ‘‘అస్థిపంజరం అందంగా ఉంటుందని అనుకునే మీలాంటి వారికి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు’’ అని ఆమె సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేశారు. సోనాక్షికైనా, మనకైనా సప్న భావ్నాని ఇస్తున్న సలహా ఏమిటంటే.. ఇలాంటి కామెంట్లను అస్సలు పట్టించుకోవద్దని. మీరు మీలా ఉండండని! -
బరువు పెరుగుతున్న బొమ్మాళి!
సవాల్ మీద సవాల్. ఇలా గత రెండేళ్లుగా అనుష్క సవాళ్లను సునాయాసంగా స్వీకరిస్తున్నారు. ‘బాహుబలి', ‘రుద్రమదేవి' చిత్రాల కోసం గుర్రపుస్వారీ, విలువిద్య, కత్తిసాము వంటివన్నీ నేర్చుకున్న బొమ్మాళి శారీరక భాషనూ మార్చుకున్నారు. ఇప్పుడు ఈ రెండు పాత్రలను తలదన్నే విధంగా మరో ‘బరువైన పాత్ర’ను ‘సైజ్ జీరో’ చిత్రంలో చేస్తున్నారు. ఇది ఎంత బరువైన పాత్ర అంటే.. దీని కోసం అనుష్క 20 కిలోల బరువు పెరుగుతున్నారు. అందరు కథానాయికలూ తమ బరువు తగ్గించు కుని జీరో సైజ్‌కు వెళ్తుంటే, అనుష్క మాత్రం దీనికి విరుద్ధంగా పాత్ర కోసం బరువు పెంచుకోవడం సాహసమే. లావుగా ఉన్న అమ్మాయి ఓ యువకుడితో ప్రేమలో పడే కథ ఇది. బాహ్య సౌందర్యం కంటే, అంతఃసౌందర్యం ముఖ్యమనేది ఈ చిత్ర కథాంశం. వినోదంతో పాటు మంచి సందేశం ఉన్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో కోవెలమూడి ప్రకాశ్ దర్శకత్వంలో పొట్లూరి వి. ప్రసాద్ నిర్మిస్తున్నారు. -
రెండు భాషల్లో...సైజ్ జీరో...
బొద్దుగుమ్మ అనుష్క ఏంటి?... సైజ్ జీరో ఏంటి? అనుకుంటున్నారు కదూ! అయితే ఆ వివరాలు సీనియర్ దర్శకులు కె. రాఘవేంద్రరావు తనయుడు ప్రకాశ్ కోవెలమూడినే అడగాలి. చాలా విరామం తర్వాత ప్రకాశ్ ‘సైజ్ జీరో’ పేరుతో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా డెరైక్ట్ చేస్తున్నారు. ఇందులో అనుష్క, ఆర్య ప్రధాన తారలు. శ్రుతీహాసన్ అతిథి పాత్ర ధారిణి. ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి. ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో చిత్రం ముహూర్తం జరిగింది. నిర్మాత ప్రసాద్ వి. పొట్లూరి సతీమణి ఝాన్సీ కెమెరా స్విచాన్ చేయగా, దర్శకుడు ప్రకాశ్ భార్య కణికా థిల్లాన్ క్లాప్ ఇచ్చారు. కె. రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. రొమాంటిక్ కామెడీ కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని ప్రసాద్ పొట్లూరి తెలిపారు. భరత్, ఊర్వశి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి, కెమెరా: నీరవ్‌షా, ఆర్ట్: ఆనందసాయి, కథ-స్క్రీన్‌ప్లే: కణికా థిల్లాన్ కోవెలమూడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సందీప్ గుణ్ణం. -
'సైజ్ జీరో'లో అనుష్క..!
-
అనుష్క 'సైజ్ జీరో'
వరుస చిత్రాలతో తీరికలేకుండా ఉన్న టాలీవుడ్ హీరోయిన్ అనుష్క...మరో సినిమాకు రెడీ అయిపోయింది. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వం నిర్వహిస్తున్న ఓ చిత్రంలో ఆమె హీరోయిన్గా నటించనున్నారు. పీవీపీ సంస్థ నుంచి వస్తున్న ఈ చిత్రానికి 'సైజ్ జీరో' అని పేరు పెట్టారు. ఇందులో ప్రధాన తారగణంగా అనుష్క, తమిళ నటులు ఆర్యా, భరత్, ఊర్వశి నటిస్తుండగా మరో ముఖ్య అతిథి పాత్రలో శృతిహాసన్ మెరవనుంది. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కథా రచనను ప్రకాశ్ సతీమణి కనికా థిల్లాన్ అందించారు. ఈ సినిమా ముహుర్తపు సన్నివేశాన్ని రాఘవేంద్రరావు సోమవారం దర్శకత్వం వహించగా...కెమెరా ప్రసాద్ వి పోట్లురి స్విచ్చాన్ చేశారు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనుంది. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. -
జీరో సైజ్ ఇల్లు...
రెండిళ్ల మధ్య పొడవుగా కనిపిస్తున్న ఈ డబ్బాను చూడండి. ఇది కూడా ఇల్లే. కాకపోతే జీరో సైజ్ గృహం. పోలండ్ రాజధాని వార్సాలో ఉన్న ఈ ఇంటి వెడల్పు కేవలం 48 అంగుళాలు మాత్రమే. ఇజ్రాయెల్‌కు చెందిన రచయిత, సినీ దర్శకుడు ఎట్గర్ కెరెట్ ముచ్చటపడి ఈ ఇంటిని కట్టించుకున్నారు. పోలండ్ ఆర్డ్ ఫౌండ్ సహకారంతో జాకబ్ సెజన్సీ అనే ఆర్కిటెక్ట్ ఈ వినూత్న గృహాన్ని నిర్మించారు. రెండంతస్తుల్లో నిర్మించిన ఈ ఇంట్లో సింగిల్ బెడ్ రూంతోపాటు కిచెన్, డైనింగ్ రూం, బాత్రూం వంటి అన్ని సౌకర్యాలూ ఉన్నాయి. తన ఇల్లు ఇంత సన్నగా ఉన్నా, చాలా సౌకర్యవంతంగా ఉంటుందని కెరెట్ పేర్కొన్నారు.