సైజ్ జీరో వాల్యూ
భార్య మీద గౌరవం లేకపోవడం అనే విషయాన్ని మగాళ్లే కాదు, సమాజమూ తేలిగ్గా తీసిపడేస్తుంది. యువరాణిలా పెంచుకున్న బంగారాన్ని ఒక అయ్య చేతిలో పెట్టేటప్పుడు ఎన్ని భయాలో! ఎన్ని దిగుళ్లో!! ఎన్ని బాధలో!!! కష్టపడినా, నష్టపడినా... ‘సర్దుకుపోవాలి, కాపురం చెయ్యాలి, విడిపోవద్దు’ అని అమ్మాయికి చెప్పి పంపిస్తూ ఉంటాం! కానీ ఈ కేసులో జరిగిన అన్యాయం ఏ తల్లీ తండ్రీ భరించలేనిది. కూతురు అంతకన్నా భరించలేనిది. భర్త ‘చచ్చు’బండ అని తెలిసింది!! ఇక ఆమె జీవితం చట్టుబండలేనా? కానేకాదనీ, అలాంటి భర్తను భరించనవసరం లేదని... హిందూ వివాహ చట్టం భరోసా ఇస్తోంది.
‘మనోజ్... టూ కేజేస్ తగ్గాను’ కాస్త బెరుకు, ఇంకాస్త భయంతో చెప్పింది పౌర్ణమి.
‘వాట్? టెన్ డేస్‌లో ఓన్లీ టూ కేజెస్? ఒహ్.. కమాన్ పూరీ.. తిండి తగ్గించు.. వర్కవుట్స్ పెంచు ప్లీజ్’ ఎంతో చిరాకు, స్ట్రెస్‌తో చెప్పాడు మనోజ్.
‘మనో...’ అంటూ పౌర్ణమి ఏదో చెప్పబోతుంటేనే ఫోన్ డిస్కనెక్ట్ అయింది.
పౌర్ణమి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆమె పక్కనే ఉన్న పౌర్ణమి మేనత్తకు విషయం అర్థమైంది. పౌర్ణమి భుజమ్మీద చేయి వేసి సున్నితంగా నొక్కింది బాధపడకు అన్నట్టుగా.
ఆ చిన్న సాంత్వనకే బోరుమంది పౌర్ణమి.. ‘పది రోజుల్లో రెండు కేజీలు తగ్గడమంటే మాటలా అత్తా.. ఇంకా డైట్ కంట్రోల్ చెయ్.. వర్కవుట్స్ పెంచు అంటాడు.. అక్కడ డైటీషియన్, జిమ్ ట్రైనర్ ఏమో అసలు నువ్వు వెయిటే లేవు.. హైట్‌కి తగ్గట్టుగా కరెక్ట్‌గా ఉన్నావ్.. డైటింగ్ ఆపేయ్.. హెల్త్ ఇష్యూస్ వస్తాయ్ అంటున్నారు. ఈయనేమో... ఇలా.. ఏంటత్తా ఇది? అసలు నాకు పెళ్లెందుకు చేశారు?’ అంటూ మేనత్త భుజమ్మీద తల వాల్చి వెక్కిళ్లు పెట్టింది ఏడుపుతో. పౌర్ణమి తల నిమురుతూ సాలోచనలో పడింది ఆమె మేనత్త.
రెండు నెలలు గడిచాయి
లండన్ నుంచి హైదరాబాద్ వచ్చాడు మనోజ్. ఆ క్షణం కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూసిన పౌర్ణమి ఆనందానికి హద్దులేదు. సిగ్గు, బిడియం, సంతోషం అన్నీ కలిసి ఆమెను ఒక్క చోట కుదురుగా నిలువనీయట్లేదు. మనోజ్ మాత్రం ఏ భావం కనపడనీయకుండా.. ఒకరకంగా చెప్పాలంటే ఆమెను పట్టించుకోనట్టే ప్రవర్తించాడు. భర్త తీరు ఆ భార్యకు వింతగా అనిపించినా.. ఆయన తన కళ్లముందుండడంతో పెద్దగా ఆలోచించలేదు.
ఆ రాత్రి... గదిలో...
‘చాలా సన్నగా అయ్యానన్నావ్? ఎవ్రీడే ఫోన్ చేస్తూ తగ్గిన నీ వెయిట్ గురించి చెప్తుంటే ఎంత సన్నబడిందో అనుకొని ఆశగా వచ్చాను. ఏదీ.. ఇదేనా ఆ ఫిగర్? ప్చ్.. లాభం లేదు...’ అంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు మనోజ్... గది మధ్యలో పౌర్ణమిని నిలబెట్టి ఆమె చుట్టూ తిరుగుతూ నఖశిఖ పర్యంతం పరిశీలిస్తూ! ‘లావుగా ఉంటే అందుకు పనికిరారు..’అని అమె చెవి దగ్గర స్ట్రెస్ చేస్తూ చెప్పాడు. రెండు చేతులతో చెవులను మూసుకుంటూ నీళ్లు నిండిన కళ్లను రెప్పలతో గట్టిగా మూసేసుకుంది పౌర్ణమి.
ఆ ఒక్కరోజే కాదు అలాంటి అవమానాలు ప్రతి రాత్రి సర్వసాధారణమయ్యాయి పౌర్ణమికి. అలా నెలలు గడిచాయి. తిండీతిప్పలు లేక ఒకరోజు స్పృహ తప్పి పడిపోయింది కూడా. అయినా ఆమె శరీరం గురించి హేళన ఆపలేదు భర్త. రాత్రి అవుతోందంటేనే.. ఆ గదిలోకి వెళ్లాలంటేనే వణికిపోతోంది పౌర్ణమి. తన పరిస్థితి మేనత్తకూ చెప్పింది.
ఒకరోజు రాత్రి...
ఎప్పటిలాగే గది మధ్యలో భార్యను అర్ధనగ్నంగా నిలబెట్టాడు మనోజ్. ‘స్లిమ్‌గా తయారవడం నీవల్ల కావడంలేదు.. సంసారానికి పనికొచ్చేలా లేవ్ .. ఏం చేస్తాం నా కర్మ...’ అంటూ ఇంకా ఏవో అనబోతుంటే .. ‘ఏం పిచ్చిపిచ్చిగా ఉందా? లావుగా ఉన్న అమ్మాయిలతో కాపురం చేస్తున్న భర్తలు ఎంతమంది లేరు? అసలు సంసారానికి పనికి రానిది నువ్వా? నేనా? లోపం నీలో ఉందా? నాలో ఉందా?’ అంటూ ఎదురు తిరిగింది పౌర్ణమి. ఆ దాడిని ఊహించలేని మనోజ్ బిక్కచచ్చిపోయాడు.
పౌర్ణమి జీవితంలోకి ఎలా వచ్చాడు?
‘పెద్దలు కుదిర్చిన సంబంధమే. పౌర్ణమి మా అన్నయ్య వాళ్లకు ఒక్కానొక్క కూతురు. అరచేతుల మీద పెంచుకున్నారు. ఏంబీఏ చదివింది. అమెరికాలో ఉద్యోగం వస్తే పెళ్ళయ్యాక ఎలాగూ తమను విడిచి వెళ్తుంది.. ఈ కొన్ని రోజులైనా తమతో ఉండనీ అని అమెరికా పంపలేదు అన్నయ్య, వదిన. మా అన్నయ్య బిజినెస్ ఫ్రెండ్ ద్వారా మనోజ్ వాళ్ల సంబంధం వచ్చింది. అబ్బాయీ ఎంబీఏ చదివాడు. లండన్‌లో ఉద్యోగం. అన్నిరకాలుగా మాకు సరిపోయిన సంబంధం అని ఒప్పుకున్నాం.
అబ్బాయి లండన్లో ఉన్నప్పుడే అతని తల్లిదండ్రులు వచ్చి పౌర్ణమిని చూసి వెళ్లారు. వాళ్లకు అమ్మాయి నచ్చింది అని చెప్పాక అమ్మాయి, అబ్బాయి స్కైప్‌లో మాట్లాడుకున్నారు. తన ఫోటోలు కూడా పంపింది. అతనూ పంపాడు. పది రోజులకు లండన్ నుండి వచ్చాడు. మరో పదిహేను రోజుల్లో పెళ్లయింది. పెళ్లి షాపింగ్ అంతా కూడా అమ్మాయి, అబ్బాయి కలిసే చేశారు. మరి అప్పుడు తెలీలేదా మా అమ్మాయి లావుగా ఉందని’ అంటూ తనకు తెలిసిన లాయర్‌తో ఫోన్‌లో మాట్లాడింది పౌర్ణమి మేనత్త. ‘పౌర్ణమిని తీసుకొని వస్తాను మీ దగ్గరకి’ అని చెప్పి ఫోన్ పెట్టేసింది.
సెకండ్ నైట్ కూడా అంతే!
‘ఫస్ట్ నైటే మొదలుపెట్టాడు.. ‘‘నేనేమో టాల్ అండ్ ఫిట్.. నువ్వేమో షార్ట్ అండ్ స్టౌట్.. నీ పొట్ట చూడు ఎంత ఫ్యాటీ ఉందో? పెళ్లికి ముందు మోడర్న్ డ్రెసెస్‌లో కనిపించలేదు.. పెళ్లిలో పట్టుచీరలో అలా కనపడుతున్నావనుకున్నా.. కానీ నిజంగా నువ్వు చాలా లావు... మోస్ట్ అన్‌సూటబుల్ ఫర్.. దట్ యాక్ట్... ’’ అంటూ నన్ను ఇన్‌సల్ట్ చేశాడు. నాకు ముచ్చెమటలు పెట్టాయి. ‘ఐయామ్ టయర్డ్.. ’అని ఆ రాత్రి నిద్రపోయాడు. సెకండ్ నైట్ కూడా అంతే.. అవే మాటలు.. అదే హ్యుమిలియేషన్.. ఇంకా ఘోరంగా..’ అంటూ చెప్పలేక రెండు చేతుల్లో మొహం దాచుకొని ఏడ్వసాగింది పౌర్ణమి. ఆమెకు రెండువైపులా కూర్చున్న ఆమె తల్లి, మేనత్త... పౌర్ణమిని అనునయించసాగారు.
వెంటనే తేరుకున్న పౌర్ణమి.. ‘ఆరోజు నన్ను అన్‌డ్రెస్ చేయించి.. సిట్ బిఫోర్ మి .. వాంట్ టు అబ్జర్వ్ యు అంటూ నన్ను తన ముందు కూర్చోబెట్టుకొని పిచ్చిపిచ్చిగా వర్ణిస్తూ ‘యు హావ్ టు గో ఫర్ ఒబెసిటీ ట్రీట్‌మెంట్.. అదర్‌వైజ్ ఇట్ విల్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ’ అని సలహా ఇచ్చి గుర్రుపెట్టి నిద్రపోయాడు. అతను ఇండియాలో ఉన్న పది రోజులూ ఇదే తంతు. పదకొండో రోజు లండన్‌కి వెళ్లిపోయాడు.. నన్ను వెయిట్ తగ్గించుకోమని, తగ్గించుకున్నాక వచ్చి తీసుకెళ్తానని చెప్పి! జీరో సైజ్ క్రేజ్ ఉందేమో.. అనుకున్నా.. అందుకే వెయిట్ రిడక్షన్ కోసం క్లినిక్‌లో చేరా. డాక్టర్, డైటీషియన్, ఈవెన్ జిమ్ ట్రైనర్ కూడా వారించింది. అయినా మనోజ్ కోసం అవేమీ పట్టించుకోలేదు. కానీ మొన్న లండన్ నుంచి వచ్చాకా అదే బిహేవియర్. అప్పుడు నాకు డౌట్ వచ్చింది’ అని లాయర్‌తో చెప్పింది పౌర్ణమి. అంతా విన్న లాయర్ ‘నల్ అండ్ వాయిడ్’ కింద పౌర్ణమి సమస్యను ఫైల్ చేశారు. - సరస్వతి రమ
‘నల్ అండ్ వాయిడ్’ అంటే ?
హిందూ వివాహ చట్టం సెక్షన్ : 12(1) (ఎ) ప్రకారం దంపతుల్లో ఎవరికైనా నపుంసకత్వం (ఇంపొటెన్స్) ఉండి, దానివల్ల దాంపత్య జీవితంలోని ఉద్దేశం నెరవేరనప్పుడు ఆ వివాహాన్ని చెల్లని వివాహంగా ప్రకటించమని కోరవచ్చు. అంటే అలాంటి పెళ్లిని కోర్టు ద్వారా రద్దు చేసుకోవచ్చు. అయితే పెళ్లయినప్పటి నుంచి పిటిషన్ ఫైల్ చేసేవరకు ఇంపొటెన్స్ ఉందని రుజువు చేయాల్సిన బాధ్యత పిటిషనర్లపై ఉంటుంది. కోర్టు ఆదేశాల ప్రకారం ప్రతివాదిని వైద్యపరీక్షలకు పంపుతారు.
ఇంపొటెన్స్ శారీరకమైనదా లేక మానసికమైనదా అని నిర్థారణ అయ్యాక కోర్టు ఆ వివాహాన్ని రద్దు చేస్తుంది. పౌర్ణమి వాళ్ల విషయంలో ప్రతివాది మనోజ్ తాను ఇంపొటెంట్‌నని ఒప్పుకోలేదు. కోర్టువారు వైద్యపరీక్షల కోసం మనోజ్‌ను సంబంధిత డాక్టర్ దగ్గరకు పంపారు. ఆ రిపోర్ట్‌ల ఆధారంగానే పౌర్ణమి, మనోజ్‌ల వివాహం రద్దయింది.
ఇ. పార్వతి
అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్
parvathiadvocate2015@gmail.com