Legal Stories
-
కోడలు పిల్లా... జాగ్రత్త!
లీగల్ స్టోరీస్ అత్త లేని కోడలు ఉత్తమురాలు. కోడలు లేని అత్త గుణవంతురాలు.. అని ఓ కవి సెలవిచ్చారు. ఇక ఇవేమీ కుదరవు! అత్తమామల్ని సరిగా చూసుకోకపోతే భర్త తన భార్యపై కోర్టుకు వెళ్లొచ్చు. విడాకులు కోరవచ్చు. ఉమ్మడి కుటుంబాలు వర్ధిల్లాలని అత్తమామలు కొడుకు, కోడళ్లతో కలిసి ఉండాలని పిల్లలకు పెద్దల అండదండలు ఉండాలని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఓ సందేశం ఉంది. చట్టం మంచే చేస్తుంది. అయితే ఈ చట్టాన్ని ఒక కోడలే కాకుండా.. అత్తమామలు, భర్త అర్థం చేసుకుంటే ఉమ్మడి కుటుంబాలు విడిపోకుండా ఉంటాయి. ‘మా నాన్నకు బాలేదని మా అమ్మ నీకు ఫోన్ చేసిన విషయం నాకెందుకు చెప్పలేదు’ కోపంతో అన్నాడు శ్రీకర్. ‘మర్చిపోయాను’ నిర్లక్ష్యంగా సమాధానం అరుణ దగ్గర్నుంచి.‘మర్చిపోయావా? అదేం సమాధానం? నీకసలు బుద్ధుందా? మా నాన్నకేమన్నా అయుంటే?’ శ్రీకర్ కోపం ఆవేశంగా మారింది. ‘ఏం కాలేదు కదా.. ఎందుకంత గొంతు చించుకుంటారు?’ ‘నువ్వసలు మనిషివేనా?’ అంటూ పెరిగిన ఆవేశంతో భార్య మీదికి చేయి లేపాడు శ్రీకర్. ‘కొడ్తారా? కొట్టండి.. మీ అమ్మానాన్నల కోసం పెళ్లాన్ని కొట్టే స్థాయికి వచ్చారు? కొట్టండి.. అరే.. వయసు మళ్లిన మనిషి.. అందుట్లోనూ బీపీ, షుగర్.. సుస్తీతో కళ్లు తిరిగి పడిపోయారు.. దానికి మీ అమ్మగారు.. అనుభవం ఉన్న పెద్దమనిషి.. కంగారు పడి మీ సెల్‌కి ఫోన్ చేశారు.. నైట్ షిఫ్ట్ చేసి అలసి అప్పుడే నిద్రపోయిన మిమ్మల్నెందుకు డిస్టర్బ్ చేయడమని.. ‘ఇప్పుడే పడుకున్నారు నేను చెప్తాలెండి లేచాక’ అన్నా.. పని హడావిడిలో పడి మరిచిపోయి చెప్పలేదు. నేను చెప్పలేదు సరే... కాల్ మీ ఫోన్‌కే వచ్చింది కదా.. ఆన్సర్ చేసినట్టుంది కదా.. అది చెక్ చేసుకొని అమ్మ నుంచి ఫోన్ ఎందుకు వచ్చిందో అని మీరెందుకు వాకబు చేసుకోలేదు. చిన్నదానికి రాద్ధాంతం చేసి కోడలు మంచిది కాదు అని నిరూపించాలని ఆ పెద్దావిడ.. ఆవిడకు వత్తాసు మీరు... కొట్టండి’ అంటూ కళ్ల నీళ్లొత్తుకొంది అరుణ. ‘మా అమ్మ ఫోన్ చేసిన విషయం నాకు చెప్పక పోగా మా అమ్మనే మాటలంటున్నావా? పైగా నువ్వెందుకు చూసుకోలేదంటూ తప్పంతా నా మీదకు తోస్తూ నంగనాచిలా ఏడుస్తావా? నిన్నుకొట్టడం కాదు.. నీలాంటి దాన్ని ఇన్నాళ్లు భరించినందుకు నన్ను నేను కొట్టుకోవాలి.. ఛీ.. ’ అంటూ బెడ్రూమ్లోకి వెళ్లిపోయాడు శ్రీకర్. ‘అవును.. ఛీ నే.. మీ నాన్నకు బాలేదన్న విషయం చెప్పలేదని అన్నేసి మాటలంటున్నారు? నాకు లేరా తల్లిదండ్రులు? నా వాళ్ల గురించి మీరెప్పుడైనా ఆలోచించారా? మా అమ్మకు బాలేదని మావాళ్లు ఫోన్ చేస్తే నన్ను పంపించారా చూడ్డానికి? మీకో న్యాయం.. నాకో న్యాయమా? అవున్లే ఎంతయినా మగాళ్లు... మొగుళ్లు! మీ వాళ్లను మా నెత్తిమీద పెట్టుకొని మోయాలి.. మావాళ్లను మాత్రం పాతాళానికి తొక్కుతారు. మమ్మల్ని గయ్యాళులుగా చూపిస్తారు.. ’ అంటూ బెడ్రూమ్లో ఉన్న భర్తకు వినిపించేలా అరిచింది అరుణ. ‘నిజంగా గయ్యాళివే.. నరకం చూపిస్తున్నావ్’ అని సణుక్కుంటూ బయటకు వెళ్లిపోయాడు శ్రీకర్. పేదింటి పిల్ల అని... మర్యాదస్తుల కుటుంబం అని... అరుణ వాళ్లది పేద కుటుంబం. డిగ్రీ వరకు చదువుకుంది. ఎవరో బంధువుల ద్వారా ఆ సంబంధం వచ్చింది. పెళ్లి చూపుల్లో వాళ్ల మర్యాద, ఆ నెమ్మదితనం చూసి ముచ్చట పడ్డారు శ్రీకర్ తల్లిదండ్రులు. ఒక్కగానొక్క కొడుకు. చక్కటి ఉద్యోగం. ఉన్నంతలో బాగానే ఉన్నారు. దేనికీ కొదవ లేదు. కట్నకానుకల కన్నా మర్యాదే ముఖ్యమనుకున్నారు. అదీగాక.. వంక పెట్టడానికి వీల్లేకుండా ఉంది అమ్మాయి. మొదటి చూపులోనే శ్రీకర్ సహా ఇంటిల్లిపాదికీ నచ్చింది. పెళ్లికి ఓకే చెప్పేశారు. మూడు నెలల్లోనే... పెళ్లాయ్యాక మూడు నెలల వరకు అంతా సవ్యంగానే సాగింది. శ్రీకర్ త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ కొన్నాడు. వాళ్ల అమ్మానాన్నల కోసం పూజ గది, వాళ్ల గది ప్రత్యేకంగా డిజైన్ చేయించాడు. అక్కడ మొదలైంది అరుణ గొడవ. అత్తామామలతో కలిసి ఉండడం ఆమెకు సుతరామూ ఇష్టం లేదు. ‘తర్వాత ఎలాగూ వాళ్లను చూసుకోక తప్పదు. ఇప్పటి నుంచే మనతో ఎందుకు వాళ్లు?’ అన్నది. ‘ఎందుకు ఏంటి? వాళ్లు నా తల్లిదండ్రులు.. ఇప్పుడైనా ఎప్పుడైనా నాతో కాక ఎవరితో ఉంటారు?’ అన్నాడు కాజువల్‌గానే. ‘కొత్తగా పెళ్లయిన వాళ్లం కదా.. కొన్నాళ్లు మనిద్దరమే ఉందాం...’ గోముగా అడిగింది. ‘మనిద్దరికీ వాళ్లేం అడ్డుకాదు. వాళ్లకూ తెలుసు... మనం న్యూలీ మ్యారీడ్ కపుల్’ అని.. అంతే గారంగా ఆన్సర్ చేశాడు శ్రీకర్. సహనం నశించింది అరుణలో. ‘మీ నాన్న మంచి హోదాలో రిటైర్డ్ అయ్యారు. పెద్దమొత్తంలోనే పెన్షన్ తీసుకుంటున్నాడు. అంతగా కావాలనుకుంటే మీరూ నెలనెలా ఇంత డబ్బివ్వండి.. అంతేకాని వాళ్లు మాత్రం మనతో ఉండొద్దు కొత్తింట్లో ’ అసహనం, చిరాకుతో స్పష్టం చేసింది. అవాక్కయ్యాడు శ్రీకర్. అన్నం మాని అలిగింది. ఆ అలకను, కోపాన్ని అత్తమామలూ గ్రహించేలా చేసింది. పెద్దవాళ్లు అర్థం చేసుకున్నారు కొడుకు ఇబ్బందిని. ఒకరోజు... ‘ఒరేయ్.. మేం మా పాతింటికే వెళ్లిపోతాంరా.. ఇక్కడంతా కొత్తకొత్తగా... బెరుకు బెరుకుగా ఉంది. అక్కడయితే ఏళ్ల తరబడి ఉన్నవాళ్లం కదా.. కాలక్షేపం బాగా అవుతుంది. వద్దనొద్దు నాన్నా.. ’ అని కొడుకు ముందరి కాళ్లకు బంధం వేసి పాతింటికి వెళ్లిపోయారు శ్రీకర్ తల్లిదండ్రులు. వారానికి ఒక్కరోజు తల్లిదండ్రులను కలవడానికి వెళ్లేవాడు. ఆ ఒక్కసారి వెళ్లడమూ అరుణకు ఇష్టం ఉండేది కాదు. అప్పుడప్పుడు డబ్బు సర్దుతున్నా నచ్చేది కాదు. అరుణ అలకలు, అరుపులు, కోపానికి భయపడి పండుగలు, పబ్బాలు, నోములు, వ్రతాలు దేనికీ వెళ్లవాడు కాదు తల్లిదండ్రుల దగ్గరకు. చివరకు వాళ్లు ఎంతో పెద్ద కష్టం వస్తేకాని కొడుకుకు చెప్పేవారు కాదు. చివరకు తమకు కొడుకు పుట్టినా ఆ శుభవార్తను చెప్పనివ్వలేదు అరుణ! దూరపు బంధువుల ద్వారా తెలుసుకున్నారు వాళ్లు. కొడుకు ఫస్ట్ బర్త్‌డేకి భార్యకు తెలియకుండా అమ్మానాన్నను పిలిచాడు. ఆ ఫంక్షన్లోనే పెద్ద గొడవ చేసి వాళ్లను అవమానించి పంపించేసింది. భార్య, తల్లిదండ్రుల బంధాన్ని బ్యాలెన్స్ చేయలేక మనశ్శాంతిని కోల్పోయి బతకలేక అరుణకు తలవంచాడు శ్రీకర్. తల్లిదండ్రులకు మొత్తానికే దూరమయ్యాడు. తర్వాత కొన్నాళ్లకు... శ్రీకర్ వాళ్ల నాన్నగారు బీపీ, షుగర్ ఎక్కువై ఆసుపత్రి పాలైతే భయపడి వాళ్లమ్మ ఫోన్ చేసింది. అదే ప్రస్తుతం శ్రీకర్‌కు, అరుణకు మధ్య చిచ్చు రగిలించింది. నిజంగానే తన తండ్రికి ఏమన్నా అయివుంటే? ఊళ్లోనే చెట్టంత కొడుకు ఉండీ తండ్రిని కాపాడుకోలేని అసమర్థుడిగా మిగిలిపోయేవాడు. తనను ఈ స్థాయికి తేవడానికి అమ్మానాన్న ఎంత కష్టపడ్డారో కళ్లముందు కదిలింది. కళ్లలో నీళ్లను తెప్పించింది. తన క్షేమం, సుఖం కోసం వాళ్ల జీవితాన్నే అర్పించిన తల్లిదండ్రులను భార్య కోసం.. వదులుకున్నాడు. క్షమించరాని నేరం. ఇక అమ్మానాన్నలను అలా ఒంటరిగా వదిలేయకూడదు. ఆరునూరైనా.. అరుణ తనను వదిలేసినా సరే అమ్మానాన్నతోనే కలిసిఉండాలి అని నిశ్చయానికి వచ్చాడు శ్రీకర్. తిరిగి రాకపోతే అక్కర్లేదు... ‘రేపు అమ్మానాన్న ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడే మనతోనే ఉంటారు ఎప్పటికీ’ అన్నాడు స్థిరమైన స్వరంతో శ్రీకర్. ‘అయితే నేనుండను. బాబును తీసుకొని మా అమ్మావాళ్లింటికి వెళ్లిపోతాను’ అంతే స్థిరంగా బదులు ఇచ్చింది అరుణ. ‘బాబును తీసుకొనా? ఆ హక్కు నీకు లేదు’ అన్నాడు. ఆ మాటతో పెద్ద యుద్ధమే అయింది. నిజంగానే అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది అరుణ. బతిమాలి భార్యను ఇంటికి తెచ్చుకోవాలనుకోలేదు శ్రీకర్. తనే గ్రహించి రావాలి అని ఆశించాడు. నాలుగు నెలలయినా జరగలేదు. లాయర్ సలహా తీసుకున్నాడు శ్రీకర్. రెస్టిట్యూషన్ ఆఫ్ కన్ జుగల్ రైట్స్‌కి వేసుకున్నాడు. తనను అత్తామామా చాలా హింసిస్తున్నారని ఆ ఇంట్లో వాళ్లుంటే కాపురానికి వెళ్లనని చెప్పింది తెగేసింది అరుణ. కాని అత్తామామ ఆమెను ఇబ్బంది పెడ్తున్నట్టుగా సాక్ష్యాధారాలు లేకపోగా అరుణ వల్లే వాళ్లు ఇబ్బంది పడ్తున్నట్టుగా రుజువైంది. ఆ వయసులో ఆ పెద్దవాళ్లు అనాథల్లా ఎలా బతుకుతారు? వాళ్లకు కొడుకు అండ కావాలని, కొడుకు భార్యగా కోడలు వాళ్ల బాధ్యతను తీసుకోవాలని అరుణకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా ససేమీరా అంది అరుణ. భార్య ప్రవర్తనతో విసిగిపోయిన శ్రీకర్ విడాకులు కోరాడు. ఇంకో మాట లేకుండా కోర్ట్ విడాకులు మంజూరు చేసింది. తాజాగా సుప్రీంకోర్టు తీర్పు! ఉమ్మడి కుటుంబ వ్యవస్థను ప్రోత్సహించేందుకు ఇటీవల సుప్రీం కోర్టు ఓ తీర్పునిచ్చింది. 1955 హిందూ వివాహ చట్టం, సెక్షన్ 13 .. విడాకుల కోసం చెప్తున్న అనేక కారణాలలో మానసిక హింస ఒకటి. జంటలో ఎవరైనా ఒకరు మిగిలిన వారిని మానసిక వేధింపులకు గురిచేస్తే విడాకులు తీసుకోవచ్చు. అందులో భాగంగానే అత్తామామల నుంచి భర్తను వేరుచేయాలని చూసినా, ఆ కారణంతో భర్తను హింసిస్తున్నా .. ఆ భర్త ఆ భార్యకు విడాకులు ఇవ్వచ్చొని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ‘తల్లిదండ్రులను చూసుకోవడం కొడుకు బాధ్యత. అందుకు భార్య అడ్డుపడుతుంటే ఆమెకు విడాకులు ఇవ్వచ్చు. విడికాపురం పెట్టాలని భర్తను వేధింపులకు గురిచేయడం మన సంస్కృతికి విరుద్ధం’అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఇ. పార్వతి, అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ parvathiadvocate2015@gmail.com -
సైజ్ జీరో వాల్యూ
భార్య మీద గౌరవం లేకపోవడం అనే విషయాన్ని మగాళ్లే కాదు, సమాజమూ తేలిగ్గా తీసిపడేస్తుంది. యువరాణిలా పెంచుకున్న బంగారాన్ని ఒక అయ్య చేతిలో పెట్టేటప్పుడు ఎన్ని భయాలో! ఎన్ని దిగుళ్లో!! ఎన్ని బాధలో!!! కష్టపడినా, నష్టపడినా... ‘సర్దుకుపోవాలి, కాపురం చెయ్యాలి, విడిపోవద్దు’ అని అమ్మాయికి చెప్పి పంపిస్తూ ఉంటాం! కానీ ఈ కేసులో జరిగిన అన్యాయం ఏ తల్లీ తండ్రీ భరించలేనిది. కూతురు అంతకన్నా భరించలేనిది. భర్త ‘చచ్చు’బండ అని తెలిసింది!! ఇక ఆమె జీవితం చట్టుబండలేనా? కానేకాదనీ, అలాంటి భర్తను భరించనవసరం లేదని... హిందూ వివాహ చట్టం భరోసా ఇస్తోంది. ‘మనోజ్... టూ కేజేస్ తగ్గాను’ కాస్త బెరుకు, ఇంకాస్త భయంతో చెప్పింది పౌర్ణమి. ‘వాట్? టెన్ డేస్‌లో ఓన్లీ టూ కేజెస్? ఒహ్.. కమాన్ పూరీ.. తిండి తగ్గించు.. వర్కవుట్స్ పెంచు ప్లీజ్’ ఎంతో చిరాకు, స్ట్రెస్‌తో చెప్పాడు మనోజ్. ‘మనో...’ అంటూ పౌర్ణమి ఏదో చెప్పబోతుంటేనే ఫోన్ డిస్కనెక్ట్ అయింది. పౌర్ణమి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆమె పక్కనే ఉన్న పౌర్ణమి మేనత్తకు విషయం అర్థమైంది. పౌర్ణమి భుజమ్మీద చేయి వేసి సున్నితంగా నొక్కింది బాధపడకు అన్నట్టుగా. ఆ చిన్న సాంత్వనకే బోరుమంది పౌర్ణమి.. ‘పది రోజుల్లో రెండు కేజీలు తగ్గడమంటే మాటలా అత్తా.. ఇంకా డైట్ కంట్రోల్ చెయ్.. వర్కవుట్స్ పెంచు అంటాడు.. అక్కడ డైటీషియన్, జిమ్ ట్రైనర్ ఏమో అసలు నువ్వు వెయిటే లేవు.. హైట్‌కి తగ్గట్టుగా కరెక్ట్‌గా ఉన్నావ్.. డైటింగ్ ఆపేయ్.. హెల్త్ ఇష్యూస్ వస్తాయ్ అంటున్నారు. ఈయనేమో... ఇలా.. ఏంటత్తా ఇది? అసలు నాకు పెళ్లెందుకు చేశారు?’ అంటూ మేనత్త భుజమ్మీద తల వాల్చి వెక్కిళ్లు పెట్టింది ఏడుపుతో. పౌర్ణమి తల నిమురుతూ సాలోచనలో పడింది ఆమె మేనత్త. రెండు నెలలు గడిచాయి లండన్ నుంచి హైదరాబాద్ వచ్చాడు మనోజ్. ఆ క్షణం కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూసిన పౌర్ణమి ఆనందానికి హద్దులేదు. సిగ్గు, బిడియం, సంతోషం అన్నీ కలిసి ఆమెను ఒక్క చోట కుదురుగా నిలువనీయట్లేదు. మనోజ్ మాత్రం ఏ భావం కనపడనీయకుండా.. ఒకరకంగా చెప్పాలంటే ఆమెను పట్టించుకోనట్టే ప్రవర్తించాడు. భర్త తీరు ఆ భార్యకు వింతగా అనిపించినా.. ఆయన తన కళ్లముందుండడంతో పెద్దగా ఆలోచించలేదు. ఆ రాత్రి... గదిలో... ‘చాలా సన్నగా అయ్యానన్నావ్? ఎవ్రీడే ఫోన్ చేస్తూ తగ్గిన నీ వెయిట్ గురించి చెప్తుంటే ఎంత సన్నబడిందో అనుకొని ఆశగా వచ్చాను. ఏదీ.. ఇదేనా ఆ ఫిగర్? ప్చ్.. లాభం లేదు...’ అంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు మనోజ్... గది మధ్యలో పౌర్ణమిని నిలబెట్టి ఆమె చుట్టూ తిరుగుతూ నఖశిఖ పర్యంతం పరిశీలిస్తూ! ‘లావుగా ఉంటే అందుకు పనికిరారు..’అని అమె చెవి దగ్గర స్ట్రెస్ చేస్తూ చెప్పాడు. రెండు చేతులతో చెవులను మూసుకుంటూ నీళ్లు నిండిన కళ్లను రెప్పలతో గట్టిగా మూసేసుకుంది పౌర్ణమి. ఆ ఒక్కరోజే కాదు అలాంటి అవమానాలు ప్రతి రాత్రి సర్వసాధారణమయ్యాయి పౌర్ణమికి. అలా నెలలు గడిచాయి. తిండీతిప్పలు లేక ఒకరోజు స్పృహ తప్పి పడిపోయింది కూడా. అయినా ఆమె శరీరం గురించి హేళన ఆపలేదు భర్త. రాత్రి అవుతోందంటేనే.. ఆ గదిలోకి వెళ్లాలంటేనే వణికిపోతోంది పౌర్ణమి. తన పరిస్థితి మేనత్తకూ చెప్పింది. ఒకరోజు రాత్రి... ఎప్పటిలాగే గది మధ్యలో భార్యను అర్ధనగ్నంగా నిలబెట్టాడు మనోజ్. ‘స్లిమ్‌గా తయారవడం నీవల్ల కావడంలేదు.. సంసారానికి పనికొచ్చేలా లేవ్ .. ఏం చేస్తాం నా కర్మ...’ అంటూ ఇంకా ఏవో అనబోతుంటే .. ‘ఏం పిచ్చిపిచ్చిగా ఉందా? లావుగా ఉన్న అమ్మాయిలతో కాపురం చేస్తున్న భర్తలు ఎంతమంది లేరు? అసలు సంసారానికి పనికి రానిది నువ్వా? నేనా? లోపం నీలో ఉందా? నాలో ఉందా?’ అంటూ ఎదురు తిరిగింది పౌర్ణమి. ఆ దాడిని ఊహించలేని మనోజ్ బిక్కచచ్చిపోయాడు. పౌర్ణమి జీవితంలోకి ఎలా వచ్చాడు? ‘పెద్దలు కుదిర్చిన సంబంధమే. పౌర్ణమి మా అన్నయ్య వాళ్లకు ఒక్కానొక్క కూతురు. అరచేతుల మీద పెంచుకున్నారు. ఏంబీఏ చదివింది. అమెరికాలో ఉద్యోగం వస్తే పెళ్ళయ్యాక ఎలాగూ తమను విడిచి వెళ్తుంది.. ఈ కొన్ని రోజులైనా తమతో ఉండనీ అని అమెరికా పంపలేదు అన్నయ్య, వదిన. మా అన్నయ్య బిజినెస్ ఫ్రెండ్ ద్వారా మనోజ్ వాళ్ల సంబంధం వచ్చింది. అబ్బాయీ ఎంబీఏ చదివాడు. లండన్‌లో ఉద్యోగం. అన్నిరకాలుగా మాకు సరిపోయిన సంబంధం అని ఒప్పుకున్నాం. అబ్బాయి లండన్‌లో ఉన్నప్పుడే అతని తల్లిదండ్రులు వచ్చి పౌర్ణమిని చూసి వెళ్లారు. వాళ్లకు అమ్మాయి నచ్చింది అని చెప్పాక అమ్మాయి, అబ్బాయి స్కైప్‌లో మాట్లాడుకున్నారు. తన ఫోటోలు కూడా పంపింది. అతనూ పంపాడు. పది రోజులకు లండన్ నుండి వచ్చాడు. మరో పదిహేను రోజుల్లో పెళ్లయింది. పెళ్లి షాపింగ్ అంతా కూడా అమ్మాయి, అబ్బాయి కలిసే చేశారు. మరి అప్పుడు తెలీలేదా మా అమ్మాయి లావుగా ఉందని’ అంటూ తనకు తెలిసిన లాయర్‌తో ఫోన్లో మాట్లాడింది పౌర్ణమి మేనత్త. ‘పౌర్ణమిని తీసుకొని వస్తాను మీ దగ్గరకి’ అని చెప్పి ఫోన్ పెట్టేసింది. సెకండ్ నైట్ కూడా అంతే! ‘ఫస్ట్ నైటే మొదలుపెట్టాడు.. ‘‘నేనేమో టాల్ అండ్ ఫిట్.. నువ్వేమో షార్ట్ అండ్ స్టౌట్.. నీ పొట్ట చూడు ఎంత ఫ్యాటీ ఉందో? పెళ్లికి ముందు మోడర్న్ డ్రెసెస్‌లో కనిపించలేదు.. పెళ్లిలో పట్టుచీరలో అలా కనపడుతున్నావనుకున్నా.. కానీ నిజంగా నువ్వు చాలా లావు... మోస్ట్ అన్‌సూటబుల్ ఫర్.. దట్ యాక్ట్... ’’ అంటూ నన్ను ఇన్సల్ట్ చేశాడు. నాకు ముచ్చెమటలు పెట్టాయి. ‘ఐయామ్ టయర్డ్.. ’అని ఆ రాత్రి నిద్రపోయాడు. సెకండ్ నైట్ కూడా అంతే.. అవే మాటలు.. అదే హ్యుమిలియేషన్.. ఇంకా ఘోరంగా..’ అంటూ చెప్పలేక రెండు చేతుల్లో మొహం దాచుకొని ఏడ్వసాగింది పౌర్ణమి. ఆమెకు రెండువైపులా కూర్చున్న ఆమె తల్లి, మేనత్త... పౌర్ణమిని అనునయించసాగారు. వెంటనే తేరుకున్న పౌర్ణమి.. ‘ఆరోజు నన్ను అన్‌డ్రెస్ చేయించి.. సిట్ బిఫోర్ మి .. వాంట్ టు అబ్జర్వ్ యు అంటూ నన్ను తన ముందు కూర్చోబెట్టుకొని పిచ్చిపిచ్చిగా వర్ణిస్తూ ‘యు హావ్ టు గో ఫర్ ఒబెసిటీ ట్రీట్మెంట్.. అదర్వైజ్ ఇట్ విల్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ’ అని సలహా ఇచ్చి గుర్రుపెట్టి నిద్రపోయాడు. అతను ఇండియాలో ఉన్న పది రోజులూ ఇదే తంతు. పదకొండో రోజు లండన్‌కి వెళ్లిపోయాడు.. నన్ను వెయిట్ తగ్గించుకోమని, తగ్గించుకున్నాక వచ్చి తీసుకెళ్తానని చెప్పి! జీరో సైజ్ క్రేజ్ ఉందేమో.. అనుకున్నా.. అందుకే వెయిట్ రిడక్షన్ కోసం క్లినిక్‌లో చేరా. డాక్టర్, డైటీషియన్, ఈవెన్ జిమ్ ట్రైనర్ కూడా వారించింది. అయినా మనోజ్ కోసం అవేమీ పట్టించుకోలేదు. కానీ మొన్న లండన్ నుంచి వచ్చాకా అదే బిహేవియర్. అప్పుడు నాకు డౌట్ వచ్చింది’ అని లాయర్‌తో చెప్పింది పౌర్ణమి. అంతా విన్న లాయర్ ‘నల్ అండ్ వాయిడ్’ కింద పౌర్ణమి సమస్యను ఫైల్ చేశారు. - సరస్వతి రమ ‘నల్ అండ్ వాయిడ్’ అంటే ? హిందూ వివాహ చట్టం సెక్షన్ : 12(1) (ఎ) ప్రకారం దంపతుల్లో ఎవరికైనా నపుంసకత్వం (ఇంపొటెన్స్) ఉండి, దానివల్ల దాంపత్య జీవితంలోని ఉద్దేశం నెరవేరనప్పుడు ఆ వివాహాన్ని చెల్లని వివాహంగా ప్రకటించమని కోరవచ్చు. అంటే అలాంటి పెళ్లిని కోర్టు ద్వారా రద్దు చేసుకోవచ్చు. అయితే పెళ్లయినప్పటి నుంచి పిటిషన్ ఫైల్ చేసేవరకు ఇంపొటెన్స్ ఉందని రుజువు చేయాల్సిన బాధ్యత పిటిషనర్లపై ఉంటుంది. కోర్టు ఆదేశాల ప్రకారం ప్రతివాదిని వైద్యపరీక్షలకు పంపుతారు. ఇంపొటెన్స్ శారీరకమైనదా లేక మానసికమైనదా అని నిర్థారణ అయ్యాక కోర్టు ఆ వివాహాన్ని రద్దు చేస్తుంది. పౌర్ణమి వాళ్ల విషయంలో ప్రతివాది మనోజ్ తాను ఇంపొటెంట్నని ఒప్పుకోలేదు. కోర్టువారు వైద్యపరీక్షల కోసం మనోజ్‌ను సంబంధిత డాక్టర్ దగ్గరకు పంపారు. ఆ రిపోర్ట్‌ల ఆధారంగానే పౌర్ణమి, మనోజ్‌ల వివాహం రద్దయింది. ఇ. పార్వతి అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ parvathiadvocate2015@gmail.com -
హింసను... చండాడే చట్టం!
లీగల్ స్టోరీస్ భర్త అనే ట్యాగ్ ధరించి ఒక మగాడు నోరు పారేసుకుంటాడు... చేయిచేసుకుంటుంటాడు. మద్యం మైకంలో మాటిమాటికీ లేచే నోరూ, ఎత్తే చెయ్యితో హింసిస్తుంటాడు. మనశ్శాంతి దూరం చేస్తుంటాడు. ఇల్లంటే నరకానికి కేరాఫ్ అనిపిస్తుంటాడు. హింసిస్తూ ఇలా ఇంట్లో నరకం చూపెట్టే అలాంటి మగాళ్ల యాతనల నుంచి మహిళలను రక్షించే చట్టం ఇది! హింసించే చేతులను చండాడే చట్టమిది! ‘ఏయ్.. బయటికి రావే!’ అమర్యాద, ఆధిపత్యం కలగలిసిన చిరపరిచితమైన ఆ గొంతు విని ఉలిక్కిపడింది శాంత. క్లాస్‌లో సీరియస్‌గా పాఠం చెబుతున్న ఆమె ఏకాగ్రతను భంగం చేసిన ఆ కంఠం ఎవరిదో కాదు తన భర్తదే. చక్కగా పాఠం వింటున్న పిల్లలనూ డిస్టర్బ్ చేసింది ఆ కర్కశ స్వరం. తరగతి వైపు రానీయకుండా ప్యూన్ అడ్డుకుంటున్నా తోసుకొని లోపలికి రావడానికి ప్రయత్నిస్తూ కనిపించాడు భర్త. పుస్తకం బల్ల మీద పెట్టేసి గబగబ బయటకు నడిచింది. అప్పటికే వరండాలోకి పరిగెత్తుకొస్తున్నారు ప్రిన్సిపల్, ఇతరటీచర్లు. పరువుపోయిన ఫీలింగ్‌తో ‘ప్రిన్సిపల్ దగ్గర పర్మిషన్ తీసుకొని వస్తాను.. బయటకు వెళ్లి మాట్లాడుకుందాం’ అంది భర్తతో. ప్యూన్ చేతులను గట్టిగా విదిలించి చెదరిన షర్ట్‌ను సరిచేసుకుంటూ ‘ఎవతే నీ ప్రిన్సిపల్.. నీలాంటి తిరుగుబోతును ఇంకా రానిస్తుందంటే అదెలాంటిదో అర్థమవుతోంది’ అన్నాడు. ఆ వెనకాలే వస్తున్న ప్రిన్సిపల్‌కి ఈ మాటలు ఎక్కడ వినపడతాయో అని బెదురుతూ ‘సరే.. ముందు మీరు బయటకు వెళ్లండి మీ వెనకాలే నేనొస్తా’ అంది. ‘ఎందుకు వెళ్లాలే బయటకు? ఇక్కడే అందరి ముందు నీ బండారం బయటపెడ్తా.. ఈ పిల్లలకు తెలియాలివాళ్ల టీచర్ ఎలాంటిదో.. మీ కొలీగ్స్‌కి కూడా తెలియాలి. అప్పుడు గానీ నిన్ను తన్ని తగలెయ్యరు’అంటూ విషయాన్ని సాగదీయచూశాడు శాంత భర్త. ఈలోపు ప్రిన్సిపల్ ‘శాంతగారు.. ఏంటీ న్యూసెన్స్.. ఏమైంది?’ ప్రశ్నించింది శాంతను. ‘సారీ.. మేడం.. చిన్న పర్సనల్ప్రాబ్లం.. ఆయన మావారు’ అంటూ వివరణ, క్షమాపణ, వాళ్లాయన పరిచయమూ ఇచ్చింది శాంత. ‘ప్రాబ్లం చిన్నదైనా, పెద్దదైనా పర్సనల్ ఇష్యూస్ స్కూల్ కాంపౌండ్‌లో కాదు... ఇంట్లో లేదా బయట తేల్చుకోంది’ అంటూ కఠినంగా చెప్పి అక్కడి నుంచి కదిలింది ప్రిన్సిపల్! తలకొట్టేసినంత పనైంది శాంతకు. అవమాన భారంతో తల వంచి ముందుకు నడవసాగింది. తన లక్ష్యం నెరవేరిందన్న విజయగర్వంతో తల పెకైగరేసి భార్యను దాటేసి వేగంగా అడుగులు వేశాడు ఆమె భర్త. నేపథ్యం శాంత టీచర్. నాగరాజుదీ ప్రభుత్వ ఉద్యోగమే. రెండేళ్ల కిందట... తెలిసిన వ్యక్తుల ద్వారా కుదిరిందీ సంబంధం. ‘అబ్బాయి మంచివాడు, అంతకన్నా మంచి ఉద్యోగం, నా అన్నవాళ్లెవరూ లేరు. భార్యను ప్రేమగా చూసుకుంటాడు’ అన్న తల్లిదండ్రుల మాటలను నమ్మి నాగరాజుతో పెళ్లికి ఓకే అంది. మత్తు మనిషి.. పెళ్లయిన కొత్తలో ప్రపంచాన్ని మరిపించాడు నాగరాజు. రెండు నెలలలకు గానీ అర్థం కాలేదు శాంతకు నాగరాజు మామూలు మనిషి కాదు మత్తు మనిషి, పచ్చితాగుబోతు అని. తాగి ఇంటికి రావడం, నోటికొచ్చినట్టు మాట్లాడ్డం.. శాంతను అనుమానించడం, కనిపించిన వాళ్లతో సంబంధాలు అంటగట్టడం ఆయన డే షెడ్యూల్లో భాగమయ్యాయి. అదే కంటిన్యూ అయింది. ఒకరోజు.. తప్పతాగి ఇంటికొచ్చాడు. ‘తలుపు తీయడం లేట్ ఎందుకు అయింది?’ ఊగిపోతూ అడిగాడు డోర్ తెరిచిన శాంతను. ‘నిద్రపట్టింది.. వినిపించలేదు’ భర్త నోట్లోంచి వచ్చిన మందు వాసన నుంచి తల తిప్పుకుంటూ చెప్పింది శాంత. ‘అంతేనా.. లోపల ఎవడితోనైనా..’ తూలుతున్న శరీరాన్ని ద్వారం సహాయంతో లోపలికి ఈడ్చుకెళుతూ అన్నాడు నాగరాజు! కళ్లల్లో ఉబికి వచ్చిన నీటిని జారనీయకుండా జాగ్రత్తపడుతూ తలుపేసి డైనింగ్ హాల్లోకి వెళ్లి టేబుల్ మీద భర్తకోసం భోజనం సర్దసాగింది. ‘మొగుడంటే లెక్కలేదే.. మాట్లాడుతుంటే నీ పాటికి నువ్వు వెళ్లిపోతున్నావ్? పిచ్చోడినా నేను? చెప్పు లోపల ఎవరున్నారో?’ ‘ఎవరెందుకు ఉంటారు?’ సహనం నశించిన శాంత అరిచింది. ‘మళ్లీ గొంతు కూడానా? అసలు నిన్ను కాదే.. నీ అమ్మాబాబులను అనాలి.. బిడ్డను తిరుగుబోతును చేసినందుకు! అసలు నువ్ ఉద్యోగానికే పోతున్నావా..ఇంకెక్కిడికన్నానా? ఏయ్ రేపటి నుంచి గడప దాటావో చూడు’ తర్జని చూపిస్తూ బెదిరించాడు. ‘నన్ను ఉద్యోగం మానేయమనడానికి మీరెవరు? మా అమ్మానాన్న ప్రసక్తి తెస్తే ఊరుకోను. బెదిరించడం మీకే కాదు.. నాకూ వచ్చు’అంది కదలకుండా తీవ్రమైన స్వరంతో శాంత. ‘అవునా.. ఏదీ బెదిరించు’ అంటూ శాంత పైపైకి వెళ్లాడు. అక్కడి నుంచి తప్పించుకోవడానికి చూసింది శాంత. రెచ్చిపోయిన నాగరాజు ఆమెను తోశాడు. జుట్టు పట్టి పైకి లాగి చెంపల మీద కొట్టాడు. ఆమెను బరబరా ఈడుస్తూ తలుపు తీసి బయటకు గెంటేశాడు. ఈ హఠాత్పరిణామానికి నివ్వెరపోయింది శాంత. ఎంత తలుపు కొట్టినా తీయలేదు. చేసేది లేక .. తన ఇంటి గొడవ తల్లిదండ్రులతో చెప్పి వాళ్లను ఇబ్బంది పెట్టబుద్ధికాక ఆ రాత్రి తలదాచుకోవడానికి స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. తెల్లవారే వర్కింగ్ విమెన్ హాస్టల్లో చేరింది. అయిదు రోజులు గడిచాయి.. ఆరోరోజు ఇదిగో ఇలా.. స్కూల్‌కి వచ్చాడు నాగరాజు. స్కూల్ బయట.. ‘చెప్పండి.. స్కూల్‌కి ఎందుకు వచ్చారు?’ అడిగింది భర్తను. ‘ఎందుకు రావద్దు .. నువ్వెవడితో పడితే వాడితో తిరిగితే ఊరుకుంటాననుకున్నావా? నడువ్ ఇంటికి’ అంటూ ఆమె చేయిలాగబోయాడు. పక్కకు తప్పుకుంది శాంత. మనిషిలోంచి పశువు ఇంకా పోలేదు అనుకుంది. రోడ్డు మీద సీన్ క్రియేట్ చేసేట్టున్నాడని గ్రహించి ఆటోను పిలిచి తన హాస్టల్ అడ్రస్ చెప్పి పోనివ్వమంది. అది విన్నాడు నాగరాజు. ఆమె చేరుకునేలోపే హాస్టల్ గేట్ దగ్గర ప్రత్యక్షమై రోడ్డు మీద క్రియేట్ చేయబోయిన సీన్ అక్కడ క్రియేట్ చేశాడు. షాక్ అయింది శాంత. తన క్యారెక్టర్ గురించి అసహ్యంగా మాట్లాడుతున్నాడు. తనను చూసి కొట్టడానికి వచ్చాడు. వణికిపోయింది. తనను పరువుగా బతకనిచ్చేలా లేడనుకుంది శాంత. నానా యాగి చేసి వెళ్లిపోయాడు. తన సమస్యను ఎలా పరిష్కరించుకోవాలనే రాత్రంతా ఆలోచించింది శాంత. డీవీ యాక్ట్ లాయర్ని కలిసింది. డొమెస్టిక్ వయొలెన్స్ యాక్ట్ కింద కేసు వేసింది శాంత. కోర్ట్ కూడా చాలా త్వరగా స్పందించింది. సెక్షన్ 18 ప్రకారం రక్షణ ఉత్తర్వులను పాస్ చేసింది. ఆ ఉత్తర్వుల కాపీ ఒకటి తీసుకెళ్లి సంబంధిత పోలీసులకు ఇచ్చింది శాంత. ఇంకో కాపీ తను పనిచేస్తున్న స్కూల్ ప్రిన్సిపల్‌కి, మరొకటి హాస్టల్ మేనేజర్‌కి ఇచ్చింది. ఇప్పుడు భర్త డిస్టర్బెన్స్, ఆ హింస, న్యూసెన్స్ లేకుండా హాయిగా ఉద్యోగం చేసుకుంటూ బతుకుతోంది. - సరస్వతి రమ డొమెస్టిక్ వయొలెన్స్ యాక్ట్ అంటే... - ఇ. పార్వతి అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ parvathiadvocate2015@gmail.com హింసలేని కుటుంబాల్లో మహిళలు ఆనందంగా బతకాలని రాజ్యాంగంలో మహిళా హక్కులకు సంబంధించి హామీ ఉంది. పెళ్లికాని, పెళ్లయిన స్త్రీలు, పెళ్లి లాంటి బంధంలో ఉన్న స్త్రీలకు ‘గృహహింస’నుంచి రక్షణ కల్పించేందుకు ఏర్పాటు చేసిన చట్టమే ‘డొమెస్టిక్ వయొలెన్స్ యాక్ట్ 2005 (గృహహింస నుంచి మహిళలకు రక్షణచట్టం)’. మహిళల మీద జరిగే అనేక హింసారూపాలను గుర్తించిన ఏకైక చట్టమిది. శారీరక, మానసిక, ఆర్థిక, లైంగిక హింసలనుంచి స్త్రీలకు రక్షణ కల్పించి తగిన ఉపశమనాలను, పరిష్కారాలను ఇస్తుంది. అవి... సెక్షన్ 18 .. రక్షణ ఉత్తర్వులు.. హింసను ఆపాలని, హింసించే పనులు చేయరాదని, మహిళ పనిచేసే చోటుకు వెళ్లరాదని, దారికాచి, ఆమె నివసించే ప్రదేశానికి వెళ్లి వేధించరాదని ఇచ్చే ఉత్తర్వులే రక్షణ ఉత్తర్వులు.. ప్రొటెక్షన్ ఆర్డర్స్. సెక్షన్ 19... మహిళను ఇంటినుంచి గెంటేయకుండా అంటే వెళ్లగొట్టకుండా ఇచ్చే ఉత్తర్వులు. వీటినే రెసిడెన్షియల్ ఆర్డర్స్ లేక నివాస ఉత్తర్వులు అంటారు. సెక్షన్ 20... జీవనభృతికి సంబంధించిన ఉత్తర్వులు.. అంటే మెయిన్టెనెన్స్ ఆర్డర్స్. సెక్షన్ 21... మైనర్ పిల్లల ఆధీనపు ఉత్తర్వులు అంటే కస్టడీ ఆర్డర్స్. సెక్షన్ 22... నష్టపరిహారపు ఉత్తర్వులు.. మానసికంగా వేధించినందుకు, హింసించినందుకు పొందే కాంపెన్సేషన్ ఆర్డర్స్. గృహహింస చట్టం సివిల్ చట్టం. జిల్లా మహిళాశిశు సంక్షేమశాఖ వారిని సంప్రదించి అక్కడే ఫిర్యాదు నమోదు చేయించుకోవాలి. ‘ప్రొటెక్షన్ ఆర్డర్స్’ కేసు నమోదు చేయడంలో సహాయపడి... కోర్ట్‌కు పంపి విచారణ ప్రారంభమయ్యేలా చేస్తారు. కోర్ట్ ఇచ్చిన ఉత్తర్వుల్లో దేన్నయినా ప్రతివాదులు ఉల్లంఘిస్తే అప్పుడు క్రిమినల్ చర్యలు తీసుకునే వీలుంటుంది. జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు. -
చట్టానికి కళ్లుంటాయి
లీగల్ స్టోరీస్ ఆయుధానికి దయ ఉండదు. అణ్వస్త్రానికి కరుణ ఉండదు. అవి... తమ పని తాము చేసుకుపోతాయంతే! ఉండాల్సిందల్లా వాటిని వాడుతున్న వారికి విచక్షణ. కావాల్సిందల్లా ఆ పర్యవసానాలపై అవగాహన. 498-ఏ... దుర్మార్గపు భర్తలు, ధూర్తులైన మొగుళ్ల పాలిటి ఓ అణ్వస్త్రంలాంటిదే... ఓ ఆయుధం లాంటిదే. చేతిలో ఉందని అస్త్రాన్ని, ఆయుధాన్ని వేస్ట్ చేయవద్దు. అస్త్రాన్ని... దివ్యస్త్రం అని కూడా అంటారు. న్యాయదేవత పర్యవేక్షణలోని చట్టాల్లో ఓ దివ్యత్వం ఉంది. అస్త్రం లాంటి చట్టాన్ని అనవసరంగా ఉపయోగిస్తే... చట్టం కళ్లు మూసుకునే ఉండదనీ, దివ్య చక్షువులతో సత్యాలను వీక్షిస్తుందని... కోర్టు వివేచనతో వ్యవహరిస్తుందని చాటి చెప్పడానికే ఈ కథనం. తండ్రి స్నేహితుడు విద్యాధరరావుతో కలిసి పోలీస్ స్టేషన్లో వెయిట్ చేస్తున్నాడు చంద్ర. ఇన్స్పెక్టర్ కోసం! గంట అయింది.. అప్పుడు వచ్చాడు ఇన్స్పెక్టర్. ఆయన్ని చూసి చంద్ర, విద్యాధరరావు చటుక్కున లేచి నిలబడ్డారు. కనీసం వాళ్ల వంక చూడనైనా చూడకుండా తన సీట్ దగ్గరకు వెళ్లిపోయాడు. కానిస్టేబుల్స్‌తో ఏవో కేసులకు సంబంధించినవి మాట్లాడుతూ, ఆరా తీస్తూ, ఫోన్లలో వ్యక్తిగత విషయాలు మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు ఆ ఇన్స్పెక్టర్. ఈలోపు రెండు మూడుసార్లు కానిస్టేబుల్‌తో చంద్ర తాము ఇన్స్పెక్టర్ను కలవాలనుకున్నట్టు చెప్పించాడు. వినీ విననట్టు ఊరుకున్నాడు ఇన్స్పెక్టర్. ఈలోపే జ్వాల, ఆమె పేరెంట్స్, జ్వాల మేనమామా స్టేషన్‌కి వచ్చారు. రావడం రావడంతోనే వరండాలో ఉన్న చంద్రవాళ్లను చూసిన జ్వాల మేనమామ.. ‘‘కట్నం కోసం మా అమ్మాయిని సతాయిస్తారా? తిండి పెట్టకుండా మాడుస్తారా? నీ చెల్లెలికి అస్తమానం నీతో ముచ్చట్లేంటి? మీ అమ్మకేం పనిలేదా... పొద్దాక కోడలిని పట్టుచీరలు కట్టుకొమ్మని, నగలేసుకుని తిరగమని పోరడం తప్ప? నీ తండ్రేంటి? ముసలాడు మాట్లాడాల్సిన మాటలా అవి? కొడుకుతో ఎలా ఉండాలో కోడలికి సలహాలిస్తాడా? నీ చెల్లికి ఇచ్చుకొమ్మను. భలే దొరికారు మా ప్రాణాలకు పర్వర్టెడ్ ఫెలోస్. ఆగండి మీ పని చెప్తా.. మీ అంతు చూస్తా!’’ అంటూ కుడిచేతి చూపుడువేలు చూపిస్తూ ఆవేశంతో, కోపంతో ఊగిపోయాడు. ఆ మాటలు విన్న చంద్రకూ కోపం నషాళానికి అంటింది. పిడికిలి బిగుసుకుంది. దవడలు అదిరాయి. అంతే.. ఆవేశంతో ఏదో అనబోయాడాడు. పక్కనే ఉన్న విద్యాధరరావు.. చంద్ర భుజం నొక్కి ఆపాడు. మరో గంట గడిచాక.. అప్పుడు.. బయట వెయిట్ చేస్తున్న చంద్రవాళ్లను లోపలికి పిలిపించాడు ఇన్స్పెక్టర్. కళ్లతోనే కూర్చోండి అన్నట్లు సైగ చేసి కుర్చీలో వెనక్కి వాలాడు. ‘‘ఏంటి విషయం?’’ చెవిలో ఇయర్ బడ్ తిప్పుకుంటూ కళ్లు సగం మూసి అడిగాడు చంద్ర వాళ్లను. ‘‘నా పేరు చంద్ర. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నా. మా ఇంటికి కాల్ చేసి నన్ను, మా పేరెంట్స్‌ని, మా చెల్లిని స్టేషన్‌కి రమ్మన్నారట సర్ మీరు’’ చెప్పాడు చంద్ర వినయంగానే. ‘‘ఓ.. జ్వాల అనే అమ్మాయి మొగుడువే కదా నువ్వు’’ అని చంద్రను ఉద్దేశించి అంటూ, ‘‘బయట జ్వాలా అనే వాళ్లున్నారేమో చూడు.. ఉంటే పిలువ్’’ అని అంతే నిర్లక్ష్యంగా కానిస్టేబుల్‌కి చెప్పాడు ఇన్స్పెక్టర్. జ్వాలా వాళ్లూ వచ్చారు. చంద్రకు విషయం మొత్తం అర్థమైంది. ‘ఓహో.. 498 ఏ పెట్టారన్నమాట’అనుకున్నాడు మనసులో! జ్వాలా తరపు వాదనను, చంద్ర ప్రతివాదనను విన్నాడు ఇన్స్పెక్టర్. అంతా విన్నాక అమ్మాయికే పెళ్లి ఇష్టంలేదనే కన్‌క్లూజన్ కనిపించింది, వినిపించింది, అర్థమైంది ఇన్స్పెక్టర్కి. ‘రేపు.. మీ ఇద్దరికీ కౌన్సిలింగ్ ఉంది... ఉదయం పదకొండు గంటలకల్లా రండి’ అని చెప్పాడు ఇన్స్పెక్టర్. ఏం కష్టం ఇది? కొడుకు కోసం ఎదురుచూస్తూ గుమ్మంలోనే కూర్చుని ఉన్నారు చంద్ర తల్లిదండ్రులు. వాళ్లను చూడగానే ప్రాణం ఉసూరుమంది చంద్రకి. ‘‘ఏరా.. ఏమైంది?’’ ఆత్రంగా అడిగారు ఇద్దరూ ఒకేసారి. ‘‘ఏం లేదులే ’’ అంటూ అమ్మానాన్నలను డైనింగ్ హాల్లోకి తీసుకొచ్చాడు చంద్ర. వాళ్లను కూర్చోబెడుతూ.. ‘‘రాజీవీ..’’ అంటూ చెల్లెల్ని పిలిచాడు. ‘‘ఆ.. వస్తున్నా’’ అంటూ వచ్చిందామె. ‘‘నాన్నకు టాబ్లెట్ వేశావా?’’ అడిగాడు. ‘‘వేశానన్నయ్యా.. అమ్మే ఏం తినలేదు’’ అంది రాజీవి. వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ అక్కడినుంచి బాల్కనీలోకి వెళ్లిపోయాడు చంద్ర. మూడు నెలల కిందట జరిగినవన్నీ ఒకటొకటిగా గుర్తొస్తున్నాయి అతనికి! అపరిచితురాలేం కాదు జ్వాల.. తన తల్లి వైపు దూరపు బంధువుల అమ్మాయి. పోలీస్‌స్టేషన్‌లో పెద్దపెద్దగా అరిచిన జ్వాల మేనమామే ఆ సంబంధం తీసుకొచ్చాడు. రాజీవి పెళ్లయ్యాకే తాను చేసుకుందామనుకున్నాడు. కాని ఒప్పుకునే వరకు వాళ్లు వదల్లేదు. జ్వాలకేం తక్కువ. చక్కగా ఉంటుంది. బాగా చదువుకుంది. ఊ అనేసెయ్’’ అంటూ అమ్మా ఒప్పించింది. రాజీవికి, దుబాయ్‌లో ఉన్న అక్కకూ జ్వాల బాగా నచ్చింది. మొత్తానికి పెళ్లికి ఓకే అనేశాడు. కట్నం గురించిన మాటే రాలేదు. వాళ్లే ‘అదిస్తున్నాం, ఇదిస్తున్నాం’ అంటూ లాంఛనాలు ఇచ్చారు. జ్వాలకు గోల్డ్ పెట్టుకున్నారు. ఘనంగా పెళ్లి చేశారు. అక్కావాళ్లకు కుదరక పెళ్లికి రాలేదు. కానీ ఫోన్లో ఆడపిల్ల మనసు బాధపెట్టొద్దని జ్వాల గురించి ఎంత పాజిటివ్‌గా చెప్పింది! ఫస్ట్‌నైట్ ఇంట్లోనే ఏర్పాటు చేస్తే.. ‘‘మీరూ మీ చాదస్తాలు ఇక ఆపండి’ అంటూ తనే అక్కడి నుంచి ఇక్కడ ఓ స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేసింది. అమ్మయితే తనకు తన అత్తగారిచ్చిన నగలన్నిటినీ కోడలికి పెట్టి చూసుకుని మహాలక్ష్మిలా ఉందని మురిసిపోయింది. ‘‘ఒరేయ్.. నువ్వూ, అమ్మాయి ఎటన్నా వెళ్లండిరా.. మళ్లీ రోటీన్లో పడిపోతే వెళ్లలేరు’’ అని నాన్న కూడా తన వెంటపడ్డాడు. అలాంటి నాన్న మీద జ్వాల వాళ్ల మేనమామ ఎలా నోరు పారేసుకున్నాడు? పదహారు రోజుల పండగ పెళ్లయి ముచ్చటగా మూడునెలలు అంతే. తను నాతో కలిసి ఉన్నది పదిహేను రోజులే. అసలు ఇంకా ఒకరికొకరు అర్థమే కాలేదు. అర్థం చేసుకునే ప్రయత్నం జ్వాలా చేయలేదు.. తనకూ చాన్స్ ఇవ్వలేదు. పెళ్లయినప్పటి నుంచీ ముభావంగానే ఉంది. తను ఎంత కల్పించుకొని మాట్లాడినా కట్టే, కొట్టే, తెచ్చే అన్నట్లే సమాధానమిచ్చింది తప్ప మనసు విప్పి మాట్లాడలేదు. ఫస్ట్‌నైట్ కూడా జరగలేదు. పదహారు రోజుల పండగకు వెళ్లి.. మళ్లీ రాలేదు. మూడు నెలల తర్వాత ఇదిగో ఇలా.. పోలీస్ కంప్లయింట్.. 498ఏ కేస్‌తో స్టేషన్లో కలిసింది. తను, తన తల్ల్లీతండ్రి, తన కుటుంబ సభ్యులు అందరం కలిసి ఆమెను కొట్టి, బట్టల బ్యాగ్‌తో బయటకు గెంటేశామని అభియోగం మోపింది. ఇదేమని అడగడానికి వచ్చిన జ్వాల అమ్మానాన్నల్నీ, బంధువులనూ నానా తిట్లు తిట్టామని అపవాదు. అసలు ఆరోజు తను ఊళ్లోనే లేడు. ఒక ఇంటర్వ్యూ కోసం బెంగళూరు వెళ్లాడు. పోలీస్‌లు ఫోన్ చేసి రాష్‌గా మాట్లాడుతున్నారని, పోలీస్ స్టేషన్‌కు రమ్మంటున్నారని చెల్లెలు ఫోన్ చేస్తే వెంటనే బయలుదేరాడు. మర్నాడు ఇన్స్పెక్టర్ చెప్పిన టైమ్‌కి ఇద్దరూ స్టేషన్‌కి చేరుకున్నారు. అంతకుముందే జ్వాలతో మాట్లాడ్డానికి చాలా ప్రయత్నించాడు చంద్ర. తను మాట్లాడలేదు. ఆమె వైపు వాళ్లు. 50 లక్షలు ఇస్తే కేస్ విత్‌డ్రా చేసుకుంటామని బేరం బెట్టారు. లేకుంటే చిప్పకూడే అని భయపెట్టారు. ఆ రోజుకి కౌన్సిలింగ్ వాయిదా వేసి రెండు రోజుల తర్వాత రమ్మన్నారు. అప్పుడూ అదే ధోరణి. చంద్ర, వాళ్లవైపు వాళ్లను అరెస్ట్ చేయకుంటే ప్రైవేట్ కంప్లయింట్ వేసుకుంటామని పోలీసుల మీద ఒత్తిడి పెట్టారు. కాళ్లా వేళ్లాపడితే 25 లక్షలకు దిగారు సీనియర్ సిటిజన్స్ అనే కన్సర్న్తో చంద్ర తల్లిదండ్రులకు బెయిల్ ఇచ్చారు. నెలరోజుల్లో అతని చెల్లి పెళ్లి ఉండడంతో రాజీవికీ బెయిల్ దొరికింది. చంద్రను రిమాండ్ చేశారు. కొడుకును రిమాండ్‌కు పంపడంతో బేజారెత్తాడు చంద్ర తండ్రి. ‘‘50 లక్షలు ఇచ్చుకోలేను. ఇల్లు, నగలు అన్నీ తాకట్టు పెట్టి.. కొంత అప్పు తెచ్చి 25 లక్షలు మాత్రం ఇచ్చుకుంటాను నా కొడుకును వదలండి’’ అంటూ కాళ్లావెళ్లా పడ్డాడు చంద్ర తండ్రి. కూతురు పెళ్లి ఉంది.. తమ పరువు బజారుకీడ్చొద్దని బతిమాలుకున్నాడు. అయినా లాభం లేకపోయింది. మైల్డ్‌గా హార్ట్ఎటాక్ వచ్చింది ఆయనకు. హై బీపీతో చంద్ర తల్లీ మంచాన పడింది. తీవ్రమైన ప్రయత్నాలతో చంద్రకు బెయిల్ దొరికింది. పెళ్లి ఇష్టం లేకే.. ఫోర్ నైంటీ ఎయిట్! దాదాపు రెండేళ్లు కేస్ నడిచింది. చంద్ర బెంగుళూరు వెళ్లిన నాటి ఫ్లయిట్ టిక్కెట్లు, అక్కడ తీసుకున్న హోటల్ రూమ్ బిల్, హాజరైన ఇంటర్వ్యూ, రాత పరీక్ష వివరాలు, హాల్‌టికెట్ అన్నిటినీ కోర్టు ముందుంచాడు చంద్ర తరపు లాయర్. అంతేకాదు.. అసలు అమ్మాయి, అబ్బాయి ఎన్నాళ్లు కలిసి ఉన్నారు? ఎక్కడో ఉన్న అక్క ప్రభావం వీళ్ల సంసారం మీద ఎంత ఉంది? నిజంగానే అమ్మాయి పై చేయిచేసుకున్నారా? అమ్మాయి వాళ్లు పెళ్లప్పుడు 30 లక్షలు కట్నంగా ఇచ్చామని చెప్పారు. నిజంగా ఇచ్చారా? ఇచ్చినట్టు తగిన సాక్ష్యాధారలున్నాయా... వంటి విషయాలన్నిటినీ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అన్నీ అబద్ధమనే తేలాయి. కేసు నిలవలేదు. చంద్ర నిర్దోషిగా తేలాడు. మరి జ్వాల ఎందుకు అబద్ధం చెప్పింది? తనకు చంద్రతో పెళ్లి ఇష్టం లేక. ఆ విషయాన్ని పెళ్లికి ముందే చెప్పి ఉంటే హుందాగా తప్పుకునేవాడిని కదా.. నా కుటుంబాన్ని ఇంత బజారుకీడ్చాలా? ఇంత అవమానం చెయాలా? మా అక్కా, చెల్లి కూడా తనలాంటి ఆడపిల్లలే కదా.. మా అమ్మా తన తల్లిలాంటిదే కదా.. అని బాధపడ్డాడు చంద్ర. సెక్షన్ 498ఏ ఏం చెప్తోంది? భర్త, అత్తమామలు, ఆడపడుచుల గుండెల్లో దడపుట్టించే సెక్షన్ 498ఏ. భర్త గాని, ఆయన కుటుంబ సభ్యులుగానీ భార్యను క్రూరంగా హింసిస్తే, క్రూరంగా ప్రవర్తిస్తే అది 498ఏ ప్రకారం నేరమవుతుంది. నేరం రుజువైతే మూడేళ్లు శిక్ష పడుతుంది. క్రూర ప్రవర్తన అంటే.. వివాహిత మహిళ ఆమెకై ఆమె ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితులు కల్పించడం,ఆమెకు తీవ్రమైన గాయాలు కలిగేలాగా లేక ఆమె ప్రాణానికి, అవయవాలకు లేక ఆరోగ్యానికి భంగం వాటిల్లేలా బుద్ధిపూర్వక ప్రవర్తన. (అది శారీరకమైనది కావచ్చు లేక మానసికమైనది కావచ్చు). ఆస్తిని కాని, విలువైన వస్తువులను కాని తెమ్మని వేధించడం, తేకపోతే ఆమెను, ఆమె బంధువులను వేధించినా, అదనపు కట్నం కోసం మాటలతో, చేతలతో హింసించినా... అది క్రూరప్రవర్తనే అవుతుంది. సెక్షన్ 324 డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961 ప్రకారం.. కట్నం ఇవ్వడం, తీసుకోవడం, ప్రోత్సహించడం కూడా నేరడమే. వధువు లేక వరుడి తల్లిదండ్రుల నుంచి గాని, వారి సంరక్షకుల నుంచి గాని ప్రత్యక్షంగా, పరోక్షంగా కట్నం డిమాండ్ చేస్తే అదీ నేరమే. ఈ నేరాలకు గరిష్టంగా అయిదేళ్లు, కనిష్టంగా ఆరునెలల నుంచి రెండేళ్ల వరకు శిక్ష, జరిమానా ఉంటాయి. 498ఏను ఒక రక్షణ కవచంలా ఉపయోగించుకోవాల్సిన మహిళలు దాన్ని ఓ ఆయుధంగా వాడుకుంటున్నారని సుప్రీంకోర్టు అనే సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేసింది. తగిన సాక్ష్యాధారాలు లేకుండా భర్తను, అత్తామామను, ఆడపడుచులను అరెస్ట్‌లు చేయరాదని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లో కొన్ని సవరణలు కూడా జరిగాయి. అలాగు కొందరు మహిళలు తీవ్రమైన ఆవేశానికి, ఫ్రస్ట్రేషన్‌కి లోనై కేసులు వేస్తున్నారని తద్వారా వివాహబంధాలు దెబ్బతింటున్నాయని భావించి కేస్ వేయగానే కౌన్సిలింగ్ నిర్వహించి సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇ. పార్వతి, అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ parvathiadvocate2015@gmail.com - సరస్వతి రమ -
కుదిరితే ఓ కప్పు కాఫీ... వీలైతే విడాకులు!
రిటర్న్ టికెట్ లీగల్ స్టోరీస్ కుదిరితే ఓ కప్పు కాఫీ. వీలైతే విడాకులు! ఇంతేనా? నేటి ప్రేమలు ఓ వింతేనా? పెళ్లిళ్లు ఓ తంతేనా? ఇందుకేనా.. ఈ ప్రేమ ఊసులు, పెళ్లి బాసలు! కప్పు కాఫీ కుదరకపోయినా నో ప్రాబ్లెమ్. ఓ ఇంటి కప్పు కిందికి చేరాక, చెరో దిక్కూ అయితే... మూడుముళ్లకు, ఏడడుగులకు, సప్తపదులకు అర్థం ఏమిటి? డైవోర్స్ దాకా వెళ్లి, చివరి నిముషంలో రిటర్న్ టికెట్ తీసుకున్న ‘స్వేచ్ఛ’కు (పేరు మార్చాం) ఇప్పుడు... అర్థంతో పాటు, పెళ్లి పరమార్థమూ తెలిసొచ్చింది! ఫ్యామిలీ కోర్టు కారిడార్! జనాలతో కిటకిటలాడుతోంది. దానిని ఆనుకొని ఉన్న గది అంతకన్నా కిక్కిరిసి ఉంది. జంటలు, పిల్లలతో వచ్చిన ఫ్యామిలీలతో! ఆ హడావిడి చూసి ‘బాబోయ్.. ఇంతమంది విడాకులకొచ్చారా? ఇన్ని కేసులా?’ అని బెదిరిపోతూ, కూర్చోడానికి బెంచీ మీద కాసింత చోటును వెదుక్కుంది స్వేచ్ఛ. అప్పటికే ఆమెలో ఏదో తెలియని దిగులు. కూర్చోడానికైతే కూర్చుంది కాని ఆమె మనసంతా సాత్విక్ చుట్టే తిరుగుతోంది. నాలుగేళ్ల కిందట... ఓ రోజు ఆఫీసు క్యాంటీన్లో కాఫీ తాగుతుంటే వచ్చాడు... రెండు చేతులు వెన క్కు పెట్టుకొని. ‘కుదిరితే కప్పు కాఫీ...?’ అంది తను నవ్వుతూ. ‘ఊ’ అన్నట్టు తల ఊపుతూ వెనకాల చేతుల్లో దాచుకున్న రెడ్ రోజ్‌ను ఆమెకందించాడు.. ‘నాతో పెళ్లి కుదురుతుందా?’ అంటూ! ఆ సర్‌ప్రైజ్‌కి ఉక్కిరిబిక్కిరైన తను ‘ఊ.. కుదురుతుంది’ అని చెప్పింది. పెళ్లయింది. ‘స్వేచ్ఛా.. స్వేచ్ఛా...’ ఆ పిలుపుకి ఉలిక్కిపడి వర్తమానంలోకి వచ్చింది ఆమె. తన ప్రశాంతత చెదిరిన భావన. అన్యమనస్కంగానే లేచి జడ్జి ముందుకు వచ్చి నిలబడింది. అప్పటికే సాత్విక్ ఉన్నాడు అక్కడ. తనను చూశాడు. ఆ చూపులో ఏదో అర్థం! పట్టే ప్రయత్నం చేస్తోంది ఆమె. ‘మూడింటికి పిలుస్తాం.. అప్పటిదాకా ఇక్కడే ఉండండి’ ఆర్డర్ వేశారు జడ్జి. తలలూపి మళ్లీ ఎవరి స్థానాల్లోకి వాళ్లు వెళ్లి కూర్చున్నారు స్వేచ్ఛ, సాత్విక్! ఒక్కో కేసూ విచారణకు పిలుస్తున్నారు జడ్జి. ఇంటి ఖర్చులకు డబ్బులివ్వని భర్త! 30 ఏళ్ల ఓ మహిళ అయిదేళ్లలోపున్న ఇద్దరు పిల్లలతో హాజరైంది. ‘నా భర్త నన్ను, పిల్లల్ని పట్టించుకోవట్లేదండి. వచ్చిన జీతం వచ్చినట్టుగా తాగడానికే ఖర్చుపెడ్తున్నాడు. ఇలాగైతే మేం పస్తులతో చావాల్సిందే! ఇంటి ఖర్చుల కోసం డబ్బులిప్పించండి సార్.. ’ అంటూ కళ్లల్లో నీళ్లు పెట్టుకుంది. అమ్మ గొంతులో బాధ విన్న పిల్లలిద్దరూ అమ్మను కరుచుకుపోయారు. జాలేసింది స్వేచ్ఛకు. ఈ పసివాళ్లేం తప్పు చేశారని? తనకు పిల్లలుంటే.. వాళ్లూ .. ఇలాగే...? ఛ.. సాత్విక్‌కి తాగుడు అలవాటు లేదు. తననెప్పుడూ పల్లెత్తు మాట అనలేదు. డబ్బుకి ఏరోజూ లోటు చేయలేదు. తమకు పిల్లలుంటే కళ్లల్లో పెట్టుకొని చూసుకునేవాడు. ఇంకో కేసు పిలవడంతో స్వేచ్ఛ ఆలోచనకు బ్రేక్ పడింది. చీటికి మాటికి గొడవ పడే భర్త! తలకు కట్టుతో ఓ అమ్మాయి వచ్చింది. ‘పెళ్లయి మూడేళ్లయింది. యేడాదిన్నర బాగానే ఉన్నాడు. తర్వాత నుంచే గొడవలు మొదలయ్యాయి. చీటికి మాటికి విసుక్కుంటాడు. చిన్న కారణాలకే పెద్దగా గొడవ చేస్తాడు. కూర బాలేకపోయినా.. ఆయనకు లుంగీ కనపడకపోయినా బూతులు తిడ్తాడు. ఈమధ్య ఇంకో అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు. నిలదీస్తే కొట్టాడు. చంపుతాడేమోనని భయమేస్తోంది. నాకు విడాకులిప్పించండి’ అంటూ మొరపెట్టుకుంది. ‘పాపం.. సాత్విక్ వంట విషయంలో తననెప్పుడూ తప్పు పట్టలేదు. ఉప్పు ఎక్కువైనా.. కారం తక్కువైనా సర్దుకున్నాడు. ఎంతసేపూ నా సౌకర్యం గురించి ఆలోచించాడే తప్ప తన గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. మరి ఇక్కడిదాకా ఎందుకు వచ్చింది? ‘నెక్స్ట్..’ జడ్జిగారి ఈ మాట అంతర్మథనంలో ఉన్న స్వేచ్ఛను అంతరాయపర్చింది. అనుమానంతో వేధించే భర్త! ‘నేను డెల్లో జాబ్ చేస్తాను. ఉద్యోగం ఉందనే నన్ను పెళ్లి చేసుకున్నాడు ఆయన. జీతమంతా తనే తీసుకుంటాడు. నా ఖర్చు లెక్కపెట్టి మరీ డబ్బులిస్తాడు. నేను ఎవరితోనూ మాట్లాడకూడదు. ఫోన్, మెయిల్స్ చెక్ చేసి.. వాడెవడు.. వీడెవడు.. వాడెందుకు కాల్ చేశాడు.. వాడికి నీతో ఏం పని? మెయిల్ ఎందుకు పెట్టాడు అంటూ అస్తమానం వేధిస్తున్నాడు. నేను ఆయనతో ఉండలేను. నాకు డైవోర్స్ కావాలి. ప్లీజ్ గ్రాంట్ మీ సర్’ అంటూ ఏడ్చేసింది ఆ ఉద్యోగిని. మళ్లీ సాత్విక్ చుట్టూ తిరగసాగింది ఆమె మనసు. ఖర్చు పెరుగుతుందని తెలిసి కూడా పెళ్లవగానే ఉద్యోగం మానేస్తానంది. మారు మాట్లాడకుండా ‘సరే’ అన్నాడు. కారు, ఫ్లాట్ లోన్లు భారమైనా భరించాడు. తనకు ఏ కష్టం కలగకూడదని పగలూ రాత్రి ఆఫీస్‌కే అంకితమయ్యాడు. తన మేల్ క్లాస్‌మేట్స్‌తో ఫోన్లో ఎంతసేపు మాట్లాడినా ఏరోజూ ఆ కాన్వర్జేషన్ ఏంటీ అని అనుమానపడలేదు. ఫోన్ చెక్ చేయడమనే అమర్యాద లేదు. అసలు ఇన్సల్ట్ చేయడమనే నైజం కాదు సాత్విక్‌ది. చాలా సాఫ్ట్! మరెందుకు తను విడాకుల దాకా వచ్చింది. అమ్మ మాట వినా? అమ్మ ఏమంది? ‘ఇల్లు, కారు, డబ్బు, నగలు అన్నీ ఇచ్చాడు సరే.. మరి టైమ్ ఇస్తున్నాడా?’ అంది. ‘నీతో గడపలేనంత బిజీ ఏంటీ? మీ ఆయన లైఫ్‌లో ఇంకా ఎవరైనా..’ అంటూ ఆగిపోయింది. అర్థం చేసుకోవాల్సింది పోయి అనుమానపడ్డాను. సాత్విక్‌ను అవమానించాను. మాటా మాటా పెరిగింది. అండర్స్టాండింగ్ ప్లేస్‌లోకి ఇగో వచ్చింది. పరిస్థితిని విడాకుల దాకా తెచ్చింది. సాత్విక్ కూడా ఇటు వైపు నుంచి ఆలోచించలేదు. ఇంతమంది సమస్యల ముందు తనదసలు సమస్యే కాదు. అమ్మ చెప్పినదాన్ని తనే అతిగా తీసుకుంది. సాత్విక్‌తో తనకు విడాకులు వద్దు. కలిసే ఉండాలి..’ అని ఆమె అనుకుంటూ ఉండగానే బంట్రోతు పిలిచిన పిలుపు వినపడింది... ‘సాత్విక్.. సాత్విక్’ అని! ‘కుదిరితే కప్పు కాఫీ...’ అప్పటికే సాత్విక్ జడ్జి దగ్గరకు వెళ్లడానికి తనను దాటుతున్నాడు. అతని కళ్లల్లోకి చూసింది. సాత్విక్ కూడా చూశాడు. కళ్ల నిండా నీళ్లు.. గుండె నిండా దుఃఖంతో ‘కుదిరితే కప్పు కాఫీ.. ’ అని అడిగింది సాత్విక్ని. అతని కళ్లల్లోనూ నీళ్లు.. ‘ఊ.. నాతో కలిసి ఉంటావా?’ అదే ఆప్యాయత నిండిన స్వరం కోరింది ఆమెను. ఎట్ ది ఎండ్... కోర్టు సీన్లోంచి హనీమూన్ ట్రిప్‌కి బయలుదేరింది ఆ జంట. విడాకులు వద్దనుకొని రికన్సిలియేషన్ ద్వారా మళ్లీ ఒక్కటైంది. - సరస్వతి రమ రికన్సిలియేషన్ అంటే? ఫ్యామిలీ కోర్టుల్లో భార్యభర్తలు విడాకులు, పిల్లల కస్టడీ, మెయిటెనెన్స్ మొదలైనవాటి కోసం కేసు వేసినప్పుడు... మొదటి వాయిదాకు హాజరైన భార్యాభర్తల్ని న్యాయమూర్తి తన ఛాంబర్లోకి పిలిపిస్తారు. వారితో ప్రత్యేకంగా మాట్లాడి.. వాళ్ల సమస్యలను వింటారు. విడిపోతే వచ్చే నష్టాలేమిటో, కలిసి ఉంటే కలిగే లాభాలేంటో వివరిస్తారు. అపార్థాలు, అపోహలుంటే ఇద్దరినీ స్వేచ్ఛగా మాట్లాడుకోమంటారు. ఆ మాటల ద్వారా వాళ్ల మధ్య ఉన్న అపోహలు, అపార్థాలు తొలగించే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ వాళ్ల సంసారంలో ఆ ఇరువురి తల్లిదండ్రుల జోక్యం ఉందని భావిస్తే, ఉందని తేలితే కొంతకాలం తల్లిదండ్రులకు దూరంగా ఉండమని చెప్తారు. సాధ్యమైనంత వరకు ఆ వివాహబంధం నిలిపే ప్రయత్నమే చేస్తారు. దీన్నే రికన్సిలియేషన్ అంటారు. అంటే కేసును కొనసాగించడానికి ముందు.. కలిపి ఉంచడానికి చేసే సామరస్య ప్రయత్నమన్నమాట. స్వేచ్ఛ, సాత్విక్‌ల సంసారంలో స్వేచ్ఛ తల్లిదండ్రుల జోక్యం వల్లే విడాకులు దాకా వచ్చింది తప్ప వాళ్ల మధ్య ఎలాంటి స్పర్థలు లేవు. కౌన్సిలింగ్ కంటే ముందే స్వేచ్ఛ తన తప్పుని గ్రహించింది. కౌన్సిలింగ్ ద్వారా సాత్విక్ కూడా గ్రహించాడు... ఉద్యోగ బాధ్యతల్లో పడి భార్యకు టైమ్ కేటాయించకపోవడం పొరపాటేనని. అందుకే రికన్సిలియేషన్తో వాళ్ల కథ సుఖాంతమైంది. ఇ.పార్వతి అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ parvathiadvocate2015@gmail.com -
పెళ్లి దానం
లీగల్ స్టోరీస్ కన్యాదానం విన్నాం! ఒక తండ్రి తన కూతుర్ని అల్లుడికి దానం చేయడమే కన్యాదానం! అదే ఒక భర్త తన భార్యను ఆమె సంతోషం కోసం దానం చేస్తే..? ఇది ఒక విచిత్రమైన కథ! ఇది పెళ్లి దానం!! ఈ కథలో మనం ఊహించలేనంత ఔన్నత్యం ఉంది.. అంతుపట్టని త్యాగం ఉంది! బంధించే ప్రేమ ఉంది.. స్వేచ్ఛనిచ్చే పెళ్లి ఉంది. బంధంలోని బాధ ఉంది.. దానంలోని ఆనందం ఉంది! మానవ సంబంధాల్లో ఉండాల్సిన అందం ఉంది! విడాకులకు చప్పట్లు కొట్టిన గొప్ప చట్టం ఉంది! ఈ కొత్త శీర్షిక (లీగల్ స్టోరీస్)కు మీరూ ఆహ్వానితులే! ‘క్రిస్.. నాన్నకు హార్ట్ ఎటాక్ వచ్చిందట.. అర్జంట్‌గా ఇండియా వెళ్లాలి.. టికెట్స్ బుక్ చేయవా ప్లీజ్’ దాదాపు ఏడుస్తున్నట్టుగానే చెప్పేసింది ఫోన్లో అలేఖ్య. ‘ఒకే.. ఒకే... కూల్! మీ నాన్నకి ఏం కాదు అంతా బాగానే ఉంటుంది’ ఆమె ఆందోళనను తగ్గించే ప్రయత్నం చేశాడు క్రిస్. ‘లేదు.. నాకు చాలా భయంగా ఉంది’ ఏడ్చేసింది అలేఖ్య. ‘నువ్వు ముందు ఇంటికి వచ్చేయ్’. ఆఫీస్‌లో ఒక్కతే ఏడుస్తూ ఇంకా దిగులు పెంచేసుకుంటుందేమోనని కంగారు పడ్డాడు క్రిస్. కాని ఆయన మనసులో అలేఖ్య వాళ్లింటి నుంచి వచ్చిన ఫోన్ కాల్ పట్ల ఏదో సందేహం. బహుశా అది అబద్ధం కావచ్చేమోనని! ‘అలేఖ్యా.. డోంట్ వర్రీ.. ఏమీ కాదు.. మీ నాన్న ఆరోగ్యంగా ఉంటారు. ప్లీజ్ నువ్వలా ఏడ్వకు.. నువ్ ఏడిస్తే తట్టుకోలేను’ డెట్రాయిట్ ఎయిర్‌పోర్ట్‌లో అలేఖ్యను ఇండియాకు సాగనంపుతూ ధైర్యం చెప్తున్నాడు క్రిస్. ‘నాకెందుకో భయంగా ఉంది క్రిస్..’ దిగులుగా అంది అలేఖ్య. ‘ఏం కాదు.. నేను చెప్తున్నాగా.. వెళ్లు.. వెళ్లి గుడ్ న్యూస్‌తో తిరిగా.. ఆశగా ఎదురుచూస్తుంటాను నీకోసం’నుదుటి మీద ముద్దుపెట్టుకుంటూ చెప్పాడు క్రిస్. బేలగా క్రిస్‌ను చూస్తూ డిపార్చర్స్ వింగ్‌లోకి వెళ్లిపోయింది అలేఖ్య. ప్రేమకు గుండెపోటు ‘అన్యాయం ఏంటే అన్యాయం. పెద్ద చదువులు చదివిస్తే మంచి ఉద్యోగంతో లైఫ్‌లో సెటిల్ అవుతావని నిన్ను అమెరికా పంపిస్తే మా నమ్మకాన్ని మట్టిగలిపి అక్కడ నువ్ వెలగపెడుతున్న నిర్వాకం మాకు నువ్ చేసిన అన్యాయం కాదా? పిచ్చి వేషాలు ఆపి నోర్మూసుకొని మేం చూసిన సంబంధానికి ఓకే చెప్పు’ కటువుగా చెప్పేసింది అలేఖ్య తల్లి. ‘అమ్మా.. నా వల్ల కాదమ్మా,..’ ఏడుస్తోంది అలేఖ్య. అప్పుడే ఆ గదిలోకి వచ్చిన అలేఖ్య వాళ్ల బాబాయ్‌ను చూసి ‘బాబాయ్.. నాన్నకు హార్ట్ ఎటాక్ అని అబద్ధం చెప్పి నన్ను ఇండియా రప్పించారు.. నన్నిలా ఎందుకు మోసం చేశారు?’ నిలదీసింది. ‘అలా చెప్పకపోతే నువ్ రావు కదా..’ నింపాదిగా అన్నాడు ఆయన. బిత్తర పోయింది అలేఖ్య. పాజిటివ్ రిజల్ట్ కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంటాం అనే బెదిరింపు, బ్లాక్మెయిల్ల మధ్య బెంగుళూరులోని ఐబీఎమ్‌లో పనిచేస్తున్న ఓ సాఫ్ట్వేర్ కుర్రాడి సంబంధానికి తలవంచక తప్పలేదు అలేఖ్యకు. పెళ్లి ముహూర్తం ఖాయం చేశారు. పదిహేను రోజులే ఉంది ఆ ముహూర్తానికి. హడావిడిగా పనులు అవుతున్నాయి. అలేఖ్యను ఒంటరిగా ఎవరూ వదలడం లేదు. ఆ అమ్మాయికి నీరసంగా ఉంటోంది. తిండి సహించట్లేదు. ఏం తిన్నా వాంతి చేసుకుంటోంది. ఫ్యామిలీ డాక్టర్‌కి ఫోన్ చేసి అడిగింది అలేఖ్య తల్లి కూతురి అనారోగ్యం గురించి. పెళ్లి గురించి టెన్షన్ వల్ల కొంతమందికి అలాగే ఉంటుంది.. మరేం పర్లేదు అని ఏవో టాబ్లెట్స్ పేర్లు చెప్పింది ఆ డాక్టర్. కాని అది కాదు అసలు నిజం మరొకటని అలేఖ్యకు అర్థమవుతోంది. ఎలాగైనా ఒకసారి డాక్టర్ దగ్గరకు వెళ్లాలి. రెండో రోజు నుంచి ఇంట్లో వాళ్లతో బాగా ఉండడం మొదలుపెట్టింది. ఫ్యామిలీ డాక్టర్ ఇచ్చిన ట్యాబ్లెట్లు పడట్లేదు.. వేరే డాక్టర్ దగ్గరకు వెళ్తాను.. కజిన్‌ను తోడిచ్చి పంపమని చాలా నమ్మకంగా అడిగింది అమ్మను. కూతురు మారిపోయింది.. అనుకున్న అమ్మ తన తోడికోడలు కూతురినిచ్చి హాస్పిటల్‌కి పంపింది కూతురు దగ్గరున్న తీసుకొని! ‘పాజిటివ్...’ డాక్టర్ చేసిన టెస్ట్ రిజల్ట్! అలేఖ్య ఆనందానికి అంతులేదు. ‘గుడ్ న్యూస్‌తో రమ్మన్నావు కదా క్రిస్. తప్పకుండా ఈ గుడ్‌న్యూస్‌తో నీ దగ్గరకు వస్తా. ఎలాగైనా వస్తా’ మనసులో కృతనిశ్చయానికి వచ్చేసింది. దేవుడిలాంటి మొగుడు అలేఖ్య తల్లిదండ్రులు అనుకున్నట్టు అంగరంగ వైభవంగా కూతురు పెళ్లి చేశారు. అత్తారింటికి సాగనంపారు. అందమైన, చదువుకున్న కోడలికి అత్తింట్లో బ్రహ్మరథం పట్టారు. రిసెప్షన్, మొక్కులు తీర్చుకోవడం కోసం పుణ్యక్షేత్రాలు తిరగడం వంటి కార్యక్రమాలతో వారం రోజులు గడిచిపోయాయి. పెళ్లయిన పదో రోజు ఫస్ట్ నైట్‌కి ముహూర్తం నిర్ణయించారు. ఆ రోజున... గదిలో.. ‘మన పెళ్లి కుదిరినప్పటి నుంచి మీకో విషయం చెబ్దామనుకుంటున్నాను.. కాని వీలుకాలేదు. ఉహూ.. వీలు కానివ్వలేదు మా పెద్దవాళ్లు’ నిర్భయంగా అన్నది అలేఖ్య. పెళ్లికొడుకు కనుబొమలు ముడిపడ్డాయి. ‘ఏంటది?’ లోపలి భావం బయటకు కనపడనివ్వకుండా అడిగాడు. ‘నేను ఎమ్మెస్ చేయడానికి యూఎస్ వెళ్లినప్పుడు అక్కడ నా క్లాస్మెట్తో ప్రేమలో పడ్డాను. చదువైపోయాక మా పెద్దవాళ్లకు చెప్పాను. ఒప్పుకోలేదు. మంచి ఉద్యోగాలు దొరికాక ఇద్దరం లివిన్ రిలేషన్లో ఉండడం మొదలుపెట్టాం. కొంచెం టైమ్ గడిస్తే పెద్దవాళ్లు ఒప్పుకుంటారు, ఒప్పిస్తామన్న దీమాతో. కాని ఒప్పుకోలేదు. మా నాన్నకు హార్ట్ ఎటాక్ అని నన్ను బ్లాక్మెయిల్ చేసి ఇండియాకు రప్పించి బలవంతంగా మీతో పెళ్లి చేశారు. బట్ ఐ లవ్ క్రిస్. నౌ అయామ్ ప్రెగ్నెంట్’ తొణక్కుండా, బెణక్కుండా చెప్పింది అలేఖ్య. పెళ్లి కొడుకును హతాశుణ్ణి చేశాయి ఆ మాటలు. ఆ రాత్రంతా మౌనం, కోపం, ఆవేశం, ఆలోచన, ఓ నిర్ణయంతో సాగిపోయింది! తెల్లవారే ఇద్దరూ రెడీ అయి ఇంటి నుంచి బయటపడ్డారు. ఇంట్లో వాళ్లంతా కొత్తపెళ్లి జంట ప్రేమ విహారానికి బయలుదేరిందని ముసిముసి నవ్వులు, గుసగుసలు! ఆ జంట బయటకు వెళాక, ఎవరికి వారు విడిపోయారు. అలేఖ్య లాయర్ దగ్గరకు వెళ్లింది. ప్రశాంత్ (పెళ్లి కొడుకు) ఫ్రెండ్ దగ్గరకు వెళ్లాడు. లాయర్ దగ్గర తన పరిస్థితి వివరించి విడాకులు కావాలని దరఖాస్తు చేసుకుంది. నెల రోజులకు ప్రశాంత్‌కి నోటీసు అందింది. ఇద్దరూ కోర్టుకి హాజరయ్యారు. తమ మధ్య వైవాహిక సంబంధం ఏదీ లేనందున ఈ వివాహాన్ని రద్దు చేయాల్సిందిగా కోర్టు ముందు కోరింది అలేఖ్య. దానికి ప్రశాంత్ కూడా ఒప్పుకున్నాడు. దాంతో ఇద్దరికీ విడాకులు మంజూరయ్యాయి. - సరస్వతి రమ అంత త్వరగా ఎలా? సెక్షన్ 12, హిందూయాక్ట్ ప్రకారం అనల్మెంట్ డైవోర్స్ అంటారు దీన్ని. దీని ప్రకారం భార్య, భర్త మధ్య వైవాహిక సంబంధం ఏదీ లేకపోతే వెంటనే అంటే పెళ్లయిన యేడాదిలోపే విడాకులు మంజూరు అవుతాయి. అలేఖ్య పరువు బయటపెట్టకుండా, తన మనసుని అర్థం చేసుకొని, ఆమె గౌరవానికి భంగం కలగనివ్వకూడదని కోర్టులో ఆమె దరఖాస్తుకు సమ్మతి తెలిపాడు. ఒకవేళ తన దగ్గర నిజాన్ని దాచి పెళ్లి చేసుకొని తనను మోసం చేసిందని సమ్మతి తెలకపోతే.. అప్పుడు కోర్టే జోక్యం చేసుకొని అతనిని కౌన్సిలింగ్ చేసి విడాకులకు సమ్మతించేలా చేస్తుంది, చేయవచ్చు! కారణం.. అమ్మాయికి అది బలవంతపు పెళ్లి, ఆ పెళ్లిలో ఆమె ఉండదలుచుకోలేదు, పైగా ఆ పెళ్లి వల్ల ఆమె భర్తతో ఎలాంటి సంబంధంలో లేదు కాబట్టి! అయితే అలేఖ్య వాళ్ల కేసులో ఆమె అత్తగారి తరపువారు అమ్మాయి మోసం చేసిందని అల్లరిపెట్ట ప్రయత్నించారు కాని ప్రశాంత్ వాళ్లను ఆపి విషయం వివరించడంతో వివాదం సద్దుమణిగింది. అలేఖ్య అమెరికా వెళ్లిపోయింది. ఇందులో భరణం, ఆస్తి వంటి విషయాల ఊసు ఉండదు. ఒకవేళ భార్య లేదా భర్త చెప్పిన దాన్ని అంటే తమకు ఎలాంటి వైవాహిక సంబంధం లేదన్న నిజాన్ని అవతలి పార్టీ ఒప్పుకోకపోతే, అది అబద్ధమని వాదిస్తే అప్పుడు మెడికల్ ఎగ్జామినేషన్స్‌కి వెళ్లే అవకాశం ఉంటుంది. - ఇ. పార్వతి, అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్