హింసను... చండాడే చట్టం! | domestic violence act | Sakshi
Sakshi News home page

హింసను... చండాడే చట్టం!

Published Tue, Sep 13 2016 11:15 PM | Last Updated on Fri, Aug 17 2018 7:48 PM

హింసను... చండాడే చట్టం! - Sakshi

హింసను... చండాడే చట్టం!

లీగల్ స్టోరీస్
భర్త అనే ట్యాగ్ ధరించి ఒక మగాడు నోరు పారేసుకుంటాడు... చేయిచేసుకుంటుంటాడు. మద్యం మైకంలో మాటిమాటికీ లేచే నోరూ, ఎత్తే చెయ్యితో హింసిస్తుంటాడు. మనశ్శాంతి దూరం చేస్తుంటాడు. ఇల్లంటే నరకానికి కేరాఫ్ అనిపిస్తుంటాడు. హింసిస్తూ ఇలా ఇంట్లో నరకం చూపెట్టే అలాంటి మగాళ్ల యాతనల నుంచి మహిళలను రక్షించే చట్టం ఇది! హింసించే చేతులను చండాడే చట్టమిది!
 
‘ఏయ్.. బయటికి రావే!’ అమర్యాద, ఆధిపత్యం కలగలిసిన చిరపరిచితమైన ఆ గొంతు విని ఉలిక్కిపడింది శాంత. క్లాస్‌లో సీరియస్‌గా పాఠం చెబుతున్న ఆమె ఏకాగ్రతను భంగం చేసిన ఆ కంఠం ఎవరిదో కాదు తన భర్తదే. చక్కగా పాఠం వింటున్న పిల్లలనూ డిస్టర్బ్ చేసింది ఆ కర్కశ స్వరం. తరగతి వైపు రానీయకుండా ప్యూన్ అడ్డుకుంటున్నా తోసుకొని లోపలికి రావడానికి ప్రయత్నిస్తూ  కనిపించాడు భర్త. పుస్తకం బల్ల మీద పెట్టేసి గబగబ బయటకు నడిచింది.
 
అప్పటికే వరండాలోకి పరిగెత్తుకొస్తున్నారు ప్రిన్సిపల్, ఇతరటీచర్లు. పరువుపోయిన ఫీలింగ్‌తో ‘ప్రిన్సిపల్ దగ్గర పర్మిషన్ తీసుకొని వస్తాను.. బయటకు వెళ్లి మాట్లాడుకుందాం’ అంది భర్తతో. ప్యూన్ చేతులను గట్టిగా విదిలించి చెదరిన షర్ట్‌ను సరిచేసుకుంటూ ‘ఎవతే నీ ప్రిన్సిపల్.. నీలాంటి తిరుగుబోతును ఇంకా రానిస్తుందంటే అదెలాంటిదో అర్థమవుతోంది’ అన్నాడు.  ఆ వెనకాలే వస్తున్న ప్రిన్సిపల్‌కి ఈ మాటలు ఎక్కడ వినపడతాయో అని బెదురుతూ ‘సరే.. ముందు మీరు బయటకు వెళ్లండి మీ వెనకాలే నేనొస్తా’ అంది.
 
‘ఎందుకు వెళ్లాలే బయటకు? ఇక్కడే అందరి ముందు నీ బండారం బయటపెడ్తా.. ఈ పిల్లలకు తెలియాలివాళ్ల టీచర్  ఎలాంటిదో.. మీ కొలీగ్స్‌కి కూడా తెలియాలి. అప్పుడు గానీ నిన్ను తన్ని తగలెయ్యరు’అంటూ విషయాన్ని సాగదీయచూశాడు శాంత భర్త.  ఈలోపు ప్రిన్సిపల్ ‘శాంతగారు.. ఏంటీ న్యూసెన్స్.. ఏమైంది?’ ప్రశ్నించింది శాంతను. ‘సారీ.. మేడం.. చిన్న పర్సనల్‌ప్రాబ్లం.. ఆయన మావారు’ అంటూ వివరణ, క్షమాపణ, వాళ్లాయన పరిచయమూ ఇచ్చింది శాంత.
 
‘ప్రాబ్లం చిన్నదైనా, పెద్దదైనా పర్సనల్ ఇష్యూస్ స్కూల్ కాంపౌండ్‌లో కాదు... ఇంట్లో లేదా బయట తేల్చుకోంది’ అంటూ కఠినంగా చెప్పి అక్కడి నుంచి కదిలింది ప్రిన్సిపల్! తలకొట్టేసినంత పనైంది శాంతకు. అవమాన భారంతో తల వంచి ముందుకు నడవసాగింది. తన లక్ష్యం నెరవేరిందన్న విజయగర్వంతో తల పెకైగరేసి భార్యను దాటేసి వేగంగా అడుగులు వేశాడు ఆమె భర్త.
 
నేపథ్యం
 శాంత టీచర్. నాగరాజుదీ ప్రభుత్వ ఉద్యోగమే. రెండేళ్ల కిందట... తెలిసిన వ్యక్తుల ద్వారా కుదిరిందీ సంబంధం. ‘అబ్బాయి మంచివాడు, అంతకన్నా మంచి ఉద్యోగం, నా అన్నవాళ్లెవరూ లేరు. భార్యను ప్రేమగా చూసుకుంటాడు’ అన్న తల్లిదండ్రుల మాటలను నమ్మి నాగరాజుతో పెళ్లికి ఓకే అంది.
 
మత్తు మనిషి..
పెళ్లయిన కొత్తలో ప్రపంచాన్ని మరిపించాడు నాగరాజు.  రెండు నెలలలకు గానీ అర్థం కాలేదు శాంతకు నాగరాజు మామూలు మనిషి కాదు మత్తు మనిషి, పచ్చితాగుబోతు అని. తాగి ఇంటికి రావడం, నోటికొచ్చినట్టు మాట్లాడ్డం.. శాంతను అనుమానించడం, కనిపించిన వాళ్లతో సంబంధాలు అంటగట్టడం ఆయన డే షెడ్యూల్‌లో భాగమయ్యాయి. అదే కంటిన్యూ అయింది.
 
ఒకరోజు..
 తప్పతాగి ఇంటికొచ్చాడు. ‘తలుపు తీయడం లేట్ ఎందుకు అయింది?’ ఊగిపోతూ అడిగాడు డోర్ తెరిచిన శాంతను.
 ‘నిద్రపట్టింది.. వినిపించలేదు’ భర్త నోట్లోంచి వచ్చిన మందు వాసన నుంచి తల తిప్పుకుంటూ చెప్పింది శాంత.
 ‘అంతేనా.. లోపల ఎవడితోనైనా..’ తూలుతున్న శరీరాన్ని ద్వారం సహాయంతో లోపలికి ఈడ్చుకెళుతూ అన్నాడు నాగరాజు!
 
కళ్లల్లో ఉబికి వచ్చిన నీటిని జారనీయకుండా జాగ్రత్తపడుతూ తలుపేసి డైనింగ్ హాల్లోకి వెళ్లి టేబుల్ మీద భర్తకోసం భోజనం సర్దసాగింది.
 ‘మొగుడంటే లెక్కలేదే.. మాట్లాడుతుంటే నీ పాటికి నువ్వు వెళ్లిపోతున్నావ్? పిచ్చోడినా నేను? చెప్పు లోపల ఎవరున్నారో?’
 ‘ఎవరెందుకు ఉంటారు?’ సహనం నశించిన శాంత అరిచింది.
 ‘మళ్లీ గొంతు కూడానా? అసలు నిన్ను కాదే.. నీ అమ్మాబాబులను అనాలి.. బిడ్డను తిరుగుబోతును చేసినందుకు! అసలు నువ్ ఉద్యోగానికే పోతున్నావా..ఇంకెక్కిడికన్నానా? ఏయ్ రేపటి నుంచి గడప దాటావో  చూడు’ తర్జని చూపిస్తూ బెదిరించాడు.
 ‘నన్ను ఉద్యోగం మానేయమనడానికి మీరెవరు?  మా అమ్మానాన్న ప్రసక్తి తెస్తే ఊరుకోను. బెదిరించడం మీకే కాదు.. నాకూ వచ్చు’అంది కదలకుండా తీవ్రమైన స్వరంతో శాంత.
 
‘అవునా.. ఏదీ బెదిరించు’ అంటూ శాంత పైపైకి వెళ్లాడు.
 అక్కడి నుంచి తప్పించుకోవడానికి  చూసింది శాంత. రెచ్చిపోయిన నాగరాజు ఆమెను తోశాడు. జుట్టు పట్టి పైకి లాగి చెంపల మీద కొట్టాడు. ఆమెను బరబరా ఈడుస్తూ తలుపు తీసి బయటకు గెంటేశాడు. ఈ హఠాత్పరిణామానికి నివ్వెరపోయింది శాంత. ఎంత తలుపు కొట్టినా తీయలేదు. చేసేది లేక .. తన ఇంటి గొడవ తల్లిదండ్రులతో చెప్పి వాళ్లను ఇబ్బంది పెట్టబుద్ధికాక ఆ రాత్రి తలదాచుకోవడానికి స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. తెల్లవారే వర్కింగ్ విమెన్ హాస్టల్లో చేరింది.
 అయిదు రోజులు గడిచాయి.. ఆరోరోజు ఇదిగో ఇలా.. స్కూల్‌కి వచ్చాడు నాగరాజు.
 
స్కూల్ బయట..
 ‘చెప్పండి.. స్కూల్‌కి ఎందుకు వచ్చారు?’ అడిగింది భర్తను.
 ‘ఎందుకు రావద్దు .. నువ్వెవడితో పడితే వాడితో తిరిగితే ఊరుకుంటాననుకున్నావా? నడువ్ ఇంటికి’ అంటూ ఆమె చేయిలాగబోయాడు. పక్కకు తప్పుకుంది శాంత.  మనిషిలోంచి పశువు ఇంకా పోలేదు అనుకుంది. రోడ్డు మీద సీన్ క్రియేట్ చేసేట్టున్నాడని గ్రహించి ఆటోను పిలిచి తన హాస్టల్ అడ్రస్ చెప్పి పోనివ్వమంది. అది విన్నాడు నాగరాజు.

ఆమె చేరుకునేలోపే హాస్టల్ గేట్ దగ్గర ప్రత్యక్షమై రోడ్డు మీద క్రియేట్ చేయబోయిన సీన్ అక్కడ క్రియేట్ చేశాడు. షాక్ అయింది శాంత. తన క్యారెక్టర్ గురించి అసహ్యంగా మాట్లాడుతున్నాడు. తనను చూసి కొట్టడానికి వచ్చాడు. వణికిపోయింది. తనను పరువుగా బతకనిచ్చేలా లేడనుకుంది శాంత. నానా యాగి చేసి వెళ్లిపోయాడు. తన సమస్యను ఎలా పరిష్కరించుకోవాలనే రాత్రంతా ఆలోచించింది శాంత.
 
డీవీ యాక్ట్
లాయర్‌ని కలిసింది. డొమెస్టిక్ వయొలెన్స్ యాక్ట్ కింద కేసు వేసింది శాంత. కోర్ట్ కూడా చాలా త్వరగా స్పందించింది. సెక్షన్ 18 ప్రకారం రక్షణ ఉత్తర్వులను పాస్ చేసింది. ఆ ఉత్తర్వుల కాపీ ఒకటి తీసుకెళ్లి సంబంధిత పోలీసులకు ఇచ్చింది శాంత. ఇంకో కాపీ తను పనిచేస్తున్న స్కూల్ ప్రిన్సిపల్‌కి, మరొకటి హాస్టల్ మేనేజర్‌కి ఇచ్చింది. ఇప్పుడు భర్త డిస్టర్బెన్స్, ఆ హింస, న్యూసెన్స్ లేకుండా హాయిగా ఉద్యోగం చేసుకుంటూ బతుకుతోంది.
- సరస్వతి రమ
 
డొమెస్టిక్ వయొలెన్స్ యాక్ట్ అంటే...
- ఇ. పార్వతి
అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్

parvathiadvocate2015@gmail.com
 

హింసలేని కుటుంబాల్లో మహిళలు ఆనందంగా బతకాలని రాజ్యాంగంలో మహిళా హక్కులకు సంబంధించి హామీ ఉంది. పెళ్లికాని, పెళ్లయిన స్త్రీలు, పెళ్లి లాంటి బంధంలో ఉన్న స్త్రీలకు ‘గృహహింస’నుంచి రక్షణ కల్పించేందుకు ఏర్పాటు చేసిన చట్టమే ‘డొమెస్టిక్ వయొలెన్స్ యాక్ట్ 2005 (గృహహింస నుంచి మహిళలకు రక్షణచట్టం)’. మహిళల మీద జరిగే అనేక హింసారూపాలను గుర్తించిన ఏకైక చట్టమిది. శారీరక, మానసిక, ఆర్థిక, లైంగిక హింసలనుంచి స్త్రీలకు రక్షణ కల్పించి తగిన ఉపశమనాలను, పరిష్కారాలను ఇస్తుంది.
 
అవి...
సెక్షన్ 18 ..
రక్షణ ఉత్తర్వులు.. హింసను ఆపాలని, హింసించే పనులు చేయరాదని, మహిళ పనిచేసే చోటుకు వెళ్లరాదని, దారికాచి, ఆమె నివసించే ప్రదేశానికి వెళ్లి వేధించరాదని ఇచ్చే ఉత్తర్వులే రక్షణ ఉత్తర్వులు.. ప్రొటెక్షన్ ఆర్డర్స్.

సెక్షన్ 19... మహిళను ఇంటినుంచి గెంటేయకుండా అంటే వెళ్లగొట్టకుండా ఇచ్చే ఉత్తర్వులు. వీటినే రెసిడెన్షియల్ ఆర్డర్స్ లేక నివాస ఉత్తర్వులు అంటారు.

సెక్షన్ 20... జీవనభృతికి సంబంధించిన ఉత్తర్వులు.. అంటే మెయిన్‌టెనెన్స్ ఆర్డర్స్.

సెక్షన్ 21... మైనర్ పిల్లల ఆధీనపు ఉత్తర్వులు అంటే కస్టడీ ఆర్డర్స్.

సెక్షన్ 22... నష్టపరిహారపు ఉత్తర్వులు.. మానసికంగా వేధించినందుకు, హింసించినందుకు పొందే కాంపెన్‌సేషన్ ఆర్డర్స్. గృహహింస చట్టం సివిల్ చట్టం. జిల్లా మహిళాశిశు సంక్షేమశాఖ వారిని సంప్రదించి అక్కడే ఫిర్యాదు నమోదు చేయించుకోవాలి.

‘ప్రొటెక్షన్ ఆర్డర్స్’ కేసు నమోదు చేయడంలో సహాయపడి... కోర్ట్‌కు పంపి విచారణ ప్రారంభమయ్యేలా చేస్తారు. కోర్ట్ ఇచ్చిన ఉత్తర్వుల్లో దేన్నయినా ప్రతివాదులు ఉల్లంఘిస్తే అప్పుడు క్రిమినల్ చర్యలు తీసుకునే వీలుంటుంది. జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement