E. Parvati
-
హింసను... చండాడే చట్టం!
లీగల్ స్టోరీస్ భర్త అనే ట్యాగ్ ధరించి ఒక మగాడు నోరు పారేసుకుంటాడు... చేయిచేసుకుంటుంటాడు. మద్యం మైకంలో మాటిమాటికీ లేచే నోరూ, ఎత్తే చెయ్యితో హింసిస్తుంటాడు. మనశ్శాంతి దూరం చేస్తుంటాడు. ఇల్లంటే నరకానికి కేరాఫ్ అనిపిస్తుంటాడు. హింసిస్తూ ఇలా ఇంట్లో నరకం చూపెట్టే అలాంటి మగాళ్ల యాతనల నుంచి మహిళలను రక్షించే చట్టం ఇది! హింసించే చేతులను చండాడే చట్టమిది! ‘ఏయ్.. బయటికి రావే!’ అమర్యాద, ఆధిపత్యం కలగలిసిన చిరపరిచితమైన ఆ గొంతు విని ఉలిక్కిపడింది శాంత. క్లాస్‌లో సీరియస్‌గా పాఠం చెబుతున్న ఆమె ఏకాగ్రతను భంగం చేసిన ఆ కంఠం ఎవరిదో కాదు తన భర్తదే. చక్కగా పాఠం వింటున్న పిల్లలనూ డిస్టర్బ్ చేసింది ఆ కర్కశ స్వరం. తరగతి వైపు రానీయకుండా ప్యూన్ అడ్డుకుంటున్నా తోసుకొని లోపలికి రావడానికి ప్రయత్నిస్తూ కనిపించాడు భర్త. పుస్తకం బల్ల మీద పెట్టేసి గబగబ బయటకు నడిచింది. అప్పటికే వరండాలోకి పరిగెత్తుకొస్తున్నారు ప్రిన్సిపల్, ఇతరటీచర్లు. పరువుపోయిన ఫీలింగ్‌తో ‘ప్రిన్సిపల్ దగ్గర పర్మిషన్ తీసుకొని వస్తాను.. బయటకు వెళ్లి మాట్లాడుకుందాం’ అంది భర్తతో. ప్యూన్ చేతులను గట్టిగా విదిలించి చెదరిన షర్ట్‌ను సరిచేసుకుంటూ ‘ఎవతే నీ ప్రిన్సిపల్.. నీలాంటి తిరుగుబోతును ఇంకా రానిస్తుందంటే అదెలాంటిదో అర్థమవుతోంది’ అన్నాడు. ఆ వెనకాలే వస్తున్న ప్రిన్సిపల్‌కి ఈ మాటలు ఎక్కడ వినపడతాయో అని బెదురుతూ ‘సరే.. ముందు మీరు బయటకు వెళ్లండి మీ వెనకాలే నేనొస్తా’ అంది. ‘ఎందుకు వెళ్లాలే బయటకు? ఇక్కడే అందరి ముందు నీ బండారం బయటపెడ్తా.. ఈ పిల్లలకు తెలియాలివాళ్ల టీచర్ ఎలాంటిదో.. మీ కొలీగ్స్‌కి కూడా తెలియాలి. అప్పుడు గానీ నిన్ను తన్ని తగలెయ్యరు’అంటూ విషయాన్ని సాగదీయచూశాడు శాంత భర్త. ఈలోపు ప్రిన్సిపల్ ‘శాంతగారు.. ఏంటీ న్యూసెన్స్.. ఏమైంది?’ ప్రశ్నించింది శాంతను. ‘సారీ.. మేడం.. చిన్న పర్సనల్ప్రాబ్లం.. ఆయన మావారు’ అంటూ వివరణ, క్షమాపణ, వాళ్లాయన పరిచయమూ ఇచ్చింది శాంత. ‘ప్రాబ్లం చిన్నదైనా, పెద్దదైనా పర్సనల్ ఇష్యూస్ స్కూల్ కాంపౌండ్‌లో కాదు... ఇంట్లో లేదా బయట తేల్చుకోంది’ అంటూ కఠినంగా చెప్పి అక్కడి నుంచి కదిలింది ప్రిన్సిపల్! తలకొట్టేసినంత పనైంది శాంతకు. అవమాన భారంతో తల వంచి ముందుకు నడవసాగింది. తన లక్ష్యం నెరవేరిందన్న విజయగర్వంతో తల పెకైగరేసి భార్యను దాటేసి వేగంగా అడుగులు వేశాడు ఆమె భర్త. నేపథ్యం శాంత టీచర్. నాగరాజుదీ ప్రభుత్వ ఉద్యోగమే. రెండేళ్ల కిందట... తెలిసిన వ్యక్తుల ద్వారా కుదిరిందీ సంబంధం. ‘అబ్బాయి మంచివాడు, అంతకన్నా మంచి ఉద్యోగం, నా అన్నవాళ్లెవరూ లేరు. భార్యను ప్రేమగా చూసుకుంటాడు’ అన్న తల్లిదండ్రుల మాటలను నమ్మి నాగరాజుతో పెళ్లికి ఓకే అంది. మత్తు మనిషి.. పెళ్లయిన కొత్తలో ప్రపంచాన్ని మరిపించాడు నాగరాజు. రెండు నెలలలకు గానీ అర్థం కాలేదు శాంతకు నాగరాజు మామూలు మనిషి కాదు మత్తు మనిషి, పచ్చితాగుబోతు అని. తాగి ఇంటికి రావడం, నోటికొచ్చినట్టు మాట్లాడ్డం.. శాంతను అనుమానించడం, కనిపించిన వాళ్లతో సంబంధాలు అంటగట్టడం ఆయన డే షెడ్యూల్లో భాగమయ్యాయి. అదే కంటిన్యూ అయింది. ఒకరోజు.. తప్పతాగి ఇంటికొచ్చాడు. ‘తలుపు తీయడం లేట్ ఎందుకు అయింది?’ ఊగిపోతూ అడిగాడు డోర్ తెరిచిన శాంతను. ‘నిద్రపట్టింది.. వినిపించలేదు’ భర్త నోట్లోంచి వచ్చిన మందు వాసన నుంచి తల తిప్పుకుంటూ చెప్పింది శాంత. ‘అంతేనా.. లోపల ఎవడితోనైనా..’ తూలుతున్న శరీరాన్ని ద్వారం సహాయంతో లోపలికి ఈడ్చుకెళుతూ అన్నాడు నాగరాజు! కళ్లల్లో ఉబికి వచ్చిన నీటిని జారనీయకుండా జాగ్రత్తపడుతూ తలుపేసి డైనింగ్ హాల్లోకి వెళ్లి టేబుల్ మీద భర్తకోసం భోజనం సర్దసాగింది. ‘మొగుడంటే లెక్కలేదే.. మాట్లాడుతుంటే నీ పాటికి నువ్వు వెళ్లిపోతున్నావ్? పిచ్చోడినా నేను? చెప్పు లోపల ఎవరున్నారో?’ ‘ఎవరెందుకు ఉంటారు?’ సహనం నశించిన శాంత అరిచింది. ‘మళ్లీ గొంతు కూడానా? అసలు నిన్ను కాదే.. నీ అమ్మాబాబులను అనాలి.. బిడ్డను తిరుగుబోతును చేసినందుకు! అసలు నువ్ ఉద్యోగానికే పోతున్నావా..ఇంకెక్కిడికన్నానా? ఏయ్ రేపటి నుంచి గడప దాటావో చూడు’ తర్జని చూపిస్తూ బెదిరించాడు. ‘నన్ను ఉద్యోగం మానేయమనడానికి మీరెవరు? మా అమ్మానాన్న ప్రసక్తి తెస్తే ఊరుకోను. బెదిరించడం మీకే కాదు.. నాకూ వచ్చు’అంది కదలకుండా తీవ్రమైన స్వరంతో శాంత. ‘అవునా.. ఏదీ బెదిరించు’ అంటూ శాంత పైపైకి వెళ్లాడు. అక్కడి నుంచి తప్పించుకోవడానికి చూసింది శాంత. రెచ్చిపోయిన నాగరాజు ఆమెను తోశాడు. జుట్టు పట్టి పైకి లాగి చెంపల మీద కొట్టాడు. ఆమెను బరబరా ఈడుస్తూ తలుపు తీసి బయటకు గెంటేశాడు. ఈ హఠాత్పరిణామానికి నివ్వెరపోయింది శాంత. ఎంత తలుపు కొట్టినా తీయలేదు. చేసేది లేక .. తన ఇంటి గొడవ తల్లిదండ్రులతో చెప్పి వాళ్లను ఇబ్బంది పెట్టబుద్ధికాక ఆ రాత్రి తలదాచుకోవడానికి స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. తెల్లవారే వర్కింగ్ విమెన్ హాస్టల్లో చేరింది. అయిదు రోజులు గడిచాయి.. ఆరోరోజు ఇదిగో ఇలా.. స్కూల్‌కి వచ్చాడు నాగరాజు. స్కూల్ బయట.. ‘చెప్పండి.. స్కూల్‌కి ఎందుకు వచ్చారు?’ అడిగింది భర్తను. ‘ఎందుకు రావద్దు .. నువ్వెవడితో పడితే వాడితో తిరిగితే ఊరుకుంటాననుకున్నావా? నడువ్ ఇంటికి’ అంటూ ఆమె చేయిలాగబోయాడు. పక్కకు తప్పుకుంది శాంత. మనిషిలోంచి పశువు ఇంకా పోలేదు అనుకుంది. రోడ్డు మీద సీన్ క్రియేట్ చేసేట్టున్నాడని గ్రహించి ఆటోను పిలిచి తన హాస్టల్ అడ్రస్ చెప్పి పోనివ్వమంది. అది విన్నాడు నాగరాజు. ఆమె చేరుకునేలోపే హాస్టల్ గేట్ దగ్గర ప్రత్యక్షమై రోడ్డు మీద క్రియేట్ చేయబోయిన సీన్ అక్కడ క్రియేట్ చేశాడు. షాక్ అయింది శాంత. తన క్యారెక్టర్ గురించి అసహ్యంగా మాట్లాడుతున్నాడు. తనను చూసి కొట్టడానికి వచ్చాడు. వణికిపోయింది. తనను పరువుగా బతకనిచ్చేలా లేడనుకుంది శాంత. నానా యాగి చేసి వెళ్లిపోయాడు. తన సమస్యను ఎలా పరిష్కరించుకోవాలనే రాత్రంతా ఆలోచించింది శాంత. డీవీ యాక్ట్ లాయర్ని కలిసింది. డొమెస్టిక్ వయొలెన్స్ యాక్ట్ కింద కేసు వేసింది శాంత. కోర్ట్ కూడా చాలా త్వరగా స్పందించింది. సెక్షన్ 18 ప్రకారం రక్షణ ఉత్తర్వులను పాస్ చేసింది. ఆ ఉత్తర్వుల కాపీ ఒకటి తీసుకెళ్లి సంబంధిత పోలీసులకు ఇచ్చింది శాంత. ఇంకో కాపీ తను పనిచేస్తున్న స్కూల్ ప్రిన్సిపల్‌కి, మరొకటి హాస్టల్ మేనేజర్‌కి ఇచ్చింది. ఇప్పుడు భర్త డిస్టర్బెన్స్, ఆ హింస, న్యూసెన్స్ లేకుండా హాయిగా ఉద్యోగం చేసుకుంటూ బతుకుతోంది. - సరస్వతి రమ డొమెస్టిక్ వయొలెన్స్ యాక్ట్ అంటే... - ఇ. పార్వతి అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ parvathiadvocate2015@gmail.com హింసలేని కుటుంబాల్లో మహిళలు ఆనందంగా బతకాలని రాజ్యాంగంలో మహిళా హక్కులకు సంబంధించి హామీ ఉంది. పెళ్లికాని, పెళ్లయిన స్త్రీలు, పెళ్లి లాంటి బంధంలో ఉన్న స్త్రీలకు ‘గృహహింస’నుంచి రక్షణ కల్పించేందుకు ఏర్పాటు చేసిన చట్టమే ‘డొమెస్టిక్ వయొలెన్స్ యాక్ట్ 2005 (గృహహింస నుంచి మహిళలకు రక్షణచట్టం)’. మహిళల మీద జరిగే అనేక హింసారూపాలను గుర్తించిన ఏకైక చట్టమిది. శారీరక, మానసిక, ఆర్థిక, లైంగిక హింసలనుంచి స్త్రీలకు రక్షణ కల్పించి తగిన ఉపశమనాలను, పరిష్కారాలను ఇస్తుంది. అవి... సెక్షన్ 18 .. రక్షణ ఉత్తర్వులు.. హింసను ఆపాలని, హింసించే పనులు చేయరాదని, మహిళ పనిచేసే చోటుకు వెళ్లరాదని, దారికాచి, ఆమె నివసించే ప్రదేశానికి వెళ్లి వేధించరాదని ఇచ్చే ఉత్తర్వులే రక్షణ ఉత్తర్వులు.. ప్రొటెక్షన్ ఆర్డర్స్. సెక్షన్ 19... మహిళను ఇంటినుంచి గెంటేయకుండా అంటే వెళ్లగొట్టకుండా ఇచ్చే ఉత్తర్వులు. వీటినే రెసిడెన్షియల్ ఆర్డర్స్ లేక నివాస ఉత్తర్వులు అంటారు. సెక్షన్ 20... జీవనభృతికి సంబంధించిన ఉత్తర్వులు.. అంటే మెయిన్టెనెన్స్ ఆర్డర్స్. సెక్షన్ 21... మైనర్ పిల్లల ఆధీనపు ఉత్తర్వులు అంటే కస్టడీ ఆర్డర్స్. సెక్షన్ 22... నష్టపరిహారపు ఉత్తర్వులు.. మానసికంగా వేధించినందుకు, హింసించినందుకు పొందే కాంపెన్సేషన్ ఆర్డర్స్. గృహహింస చట్టం సివిల్ చట్టం. జిల్లా మహిళాశిశు సంక్షేమశాఖ వారిని సంప్రదించి అక్కడే ఫిర్యాదు నమోదు చేయించుకోవాలి. ‘ప్రొటెక్షన్ ఆర్డర్స్’ కేసు నమోదు చేయడంలో సహాయపడి... కోర్ట్‌కు పంపి విచారణ ప్రారంభమయ్యేలా చేస్తారు. కోర్ట్ ఇచ్చిన ఉత్తర్వుల్లో దేన్నయినా ప్రతివాదులు ఉల్లంఘిస్తే అప్పుడు క్రిమినల్ చర్యలు తీసుకునే వీలుంటుంది. జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు. -
భర్త మీద కూడా నిర్భయ కేసు పెట్టవచ్చు!
లీగల్ కౌన్సెలింగ్ మా పెళ్లయ్యి సంవత్సరం దాటింది. మాది పెద్దలు కుదిర్చిన సంబంధమే. నా భర్తకు నాపై చాలా అనుమానం. ప్రతిరోజూ నా సెల్‌ఫోన్ చెక్ చేస్తాడు. నేను ఎవరికి కాల్ చేశానో వారందరికీ రీ కాల్ చేస్తాడు. వారెవరో, నాకెలా పరిచయమో కనుక్కుంటాడు. ఇక వాళ్లు మగవాళ్లయితే వారితో అక్రమ సంబంధం అంటగట్టి నన్ను విపరీతంగా తిడతాడు. ఆడవాళ్లయితే వారి క్యారక్టర్ మంచిది కాదని, మాట్లాడవద్దని కట్టడి చేస్తాడు. ఎప్పుడు తీశాడో తెలీదు కానీ, నేను దుస్తులు మార్చుకునేటప్పుడు, స్నానం చేసేటప్పుడు వీడియోలు తీసి, వాటిని నెట్లో పెడతానని బెదిరిస్తున్నాడు. ఇక నన్ను సెక్స్‌పరంగా కూడా విపరీతంగా హింసిస్తున్నాడు. అన్నట్టు ఈ దుర్మార్గుడికి మా వాళ్లు కట్నకానుకల కింద 20 లక్షల దాకా ముట్టచెప్పారు. నేను ఇంజినీరింగ్‌లో గోల్డ్ మెడలిస్ట్నయినా, ఉద్యోగం చెయ్యనివ్వట్లేదు. ఈ శాడిస్ట్ భర్తతో కాపురం చేయలేక నాలుగు నెలల క్రితం పుట్టింటికి వచ్చాను. నాపై యాసిడ్ పోస్తానని బెదిరిస్తున్నాడు. నేను ఏం చేయాలి? - అరుణ, జహీరాబాద్ మీరు బాగా చదువుకున్నవారయి ఉండీ ఇంత అమాయకంగా ఉంటే ఎలా? మొదట మీరు వీడియోల గురించి, నెట్లో పెడతాననే బెదిరింపుల గురించి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి. వారు వెంటనే చర్య తీసుకుంటారు. తర్వాత, మీ కాళ్లమీద మీరు నిలబడేందుకు వీలుగా ఏదయినా ఉద్యోగం చూసుకోండి. ఇక రెండవ విషయం మహిళా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి 498 ఎ కేస్ వేయండి. ఫిర్యాదును వివరంగానూ చాలా జాగ్రత్తగానూ రాయండి. ఇంకా ఓపిక ఉంటే (ఉండాలి కూడా) డొమెస్టిక్ వయొలెన్స్ కేస్ వేసి, రక్షణ ఉత్తర్వులు పొందండి. ముందు ఈ కేసులన్నీ నంబర్ అయి, నోటీసులు వెళ్తే దెబ్బకు దెయ్యం వదులుతుంది. నిర్భయ చట్టం కింద కూడా బుక్ అయ్యే అవకాశం ఉంది. మీ వారికి మీ వాళ్లు కట్నంగా ఇచ్చిన డబ్బులు కూడా వెనక్కి వస్తాయి. ఇందుకు మీ తలిదండ్రుల సహకారం చాలా అవసరం. నా వివాహమై ఐదేళ్లయింది. నాకు ఒక బాబు. పెళ్లినాటికి మా వారు దుబాయిలో ఉద్యోగం చేస్తున్నారు. పెళ్లి కాగానే నన్ను అక్కడికి తీసుకెళ్లారు. నేను కన్సీవ్ అయ్యాను. డెలివరీకి ఇండియా వచ్చాను. బాబుకు 6 నెలలు రాగానే ఆయన వచ్చి చూసి వెళ్లారు. వాడికి ఏడాది నిండగానే వచ్చి మమ్మల్ని దుబాయికి తీసుకెళతానన్నారు. అంతా సజావుగా ఉందని అనుకునేలోగా మా వారు తీవ్ర అనారోగ్యంతో మరణించారు. అతను చేసేది చాలా చిన్న ఉద్యోగం కావడం వల్ల మాకు పెద్దగా ఆర్థిక సాయం ఏమీ అందలేదు. అయితే మా అత్తమామలు బాగా ఉన్నవాళ్లు. స్థిరచరాస్తులు చాలా ఉన్నాయి. మా వారి మరణం తర్వాత నన్నూ, బాబునూ ఆదరించకపోగా, బయటికి గెంటి వేశారు. నేను పెద్దగా చదువుకోలేదు. పైగా బాబు చిన్నవాడు. ఇప్పట్లో ఏ పనీ చేయగలిగే పరిస్థితులు లేవు. మా వారికి రావలసిన ఆస్తిలో నాకూ, బాబుకూ వాటా వస్తుందా? - మానస, రాజమండ్రి తప్పకుండా వస్తుంది. చనిపోయిన మీ వారికి తండ్రి ఆస్తిలో చట్టప్రకారం ఎంత ఆస్తి రావాలోఅంత వాటా మీకు వస్తుంది. ఒక వితంతువైన కోడలికి మెయింటెనెన్స్ ఇవ్వవలసిన బాధ్యత చట్టప్రకారం మీ మామగారిదే. మీకు, బాబుకు మెయింటెనెన్స్ వస్తుంది. మీరు జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీని సంప్రదించి ప్రీ లిటిగేషన్ కేస్ (పిఎల్సీ) వేయండి. దీనికి ఖర్చులేం ఉండవు. మీ మామగారిని పిలిపించి (నోటీసుల ద్వారా) మీ విషయం సెటిల్ చేస్తారు. వినకుంటే కేసును కోర్టుకు పంపుతారు. మేడమ్, ఇటీవలే నేను ఎంబిఏ పూర్తి చేశాను. అయితే నేను ఫస్ట్ ఇయర్లో ఉండగా నా క్లాస్మేట్ రాఘవను ప్రేమించాను. అతనూ నన్ను ఇష్టపడ్డాడు. మా కులాలు వేరు కావడం వల్ల పెద్దలు అంగీకరించరని తెలుసు. అందుకని మేము రహస్యంగా వివాహం చేసుకోవాలనుకున్నాము. కొందరు మిత్రుల సమక్షంలో దండలు మార్చుకున్నాము. సంప్రదాయబద్ధంగా మంగళసూత్రం కూడా కట్టాడు. స్నేహితులంతా దాన్ని వీడియో కూడా తీశారు. మా పేరెంట్స్‌కు ఈ విషయాన్ని చెప్పకుండా దాచాము. ఎవరి హాస్టల్లో వాళ్లం ఉంటూ, అప్పుడప్పుడు కలుసుకునేవాళ్లం. ఒక రూమ్ అద్దెకు తీసుకుని అందులో గడిపేవాళ్లం. ఓనర్స్ కూడా పక్కనే ఉండేవాళ్లు. ఇలా సంవత్సరం గడిచింది. మా చదువులైపోయాయి. మధ్యలో కన్సీవ్ అవడం, తనే దగ్గరుండి అబార్షన్ చేయించడం జరిగింది. తనకు మంచి ఉద్యోగం దొరికింది. అయితే అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది. నాకూ మొన్ననే ఉద్యోగం వచ్చింది. ఇపుడు నా భర్త వేరే పెళ్లి చేసుకోబోతున్నాడు. మా వివాహం గురించి పెద్దలకు తెలియదు. ఈ పరిస్థితుల్లో నేను ఏం చేయాలి? సలహా ఇవ్వగలరు. - రాగిణి, హైదరాబాద్ మీరు చేసింది తప్పు. అంతేకాకుండా మోసపోయారు కూడా. ఎవరినైనా ఈరోజుల్లో ఇలాంటి పెళ్ళిళ్లు చేసుకుంటారా? ఒకవేళ అంత అవసరమైతే రిజిస్టర్ పెళ్లి ఉండనే ఉంది కదాఐ. కాకుంటే మీరు అతని భార్య అనే ఆధారాలు మీ వద్ద చాలు ఉన్నాయి. ఫొటోలు, వీడియోలూ, స్నేహితుల సాక్ష్యాలు పనికి వస్తాయి. మీ ఓనర్స్ కూడా మీరు ఆ రూమ్‌కి ఒక సంవత్సరం పాటు వస్తూ, వెళుతూ ఉన్నారని చెబుతారు. హాస్పిటల్లో కూడా మీవారు సంతకం చేసే ఉంటారు కదా! ఇక మీవారు వివాహాన్ని నిరాకరించలేరు. కాదనలేరు. మీరు వెంటనే మీ తలిదండ్రులను సంప్రదించి ఈ విషయాలు వివరించండి. మీ మిత్రులను, పేరెంట్స్‌ను తోడు తీసుకుని వెళ్లండి. వారు అర్థం చేసుకుని ఆశీర్వదిస్తే మంచిది. లేదంటే క్రిమినల్ కేసు పెట్టొచ్చు. చీటింగ్, నమ్మకద్రోహం, బైగమీ మొదలైన కేసులు పెట్టవచ్చు. రెండో వివాహం చేసుకోకుండా కోర్టునుండి ఇంజన్క్షన్ ఆర్డర్ తెచ్చుకోవచ్చు. ఏది ఏమైనా ఇలాంటి రహస్యపు పెళ్లిళ్లు అనేక అనర్థాలకు దారితీస్తాయి. - ఇ.పార్వతి అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ parvathiadvocate2015@gmail.com -
భర్తలూ బీ కేర్‌ఫుల్!
మహిళలు నిర్ణయం తీసుకుంటే పరిస్థితి తారుమారే.. ‘పడమర’లో ఆడవాళ్లు మొగుళ్లను తూర్పార పడుతున్నారు. ‘తూర్పు’లో పెళ్లాలు పెళ్లిమరలో పడి పిండి పిండి అవుతున్నా సహనంతో ఉంటున్నారు. ఇక మగాళ్లు జాగ్రత్త పడటం అవసరం. తెగే దాకా లాగితే తెగుద్ది. పాశ్చాత్య దేశాల్లో ఆల్రెడీ పెళ్లిళ్లకి ఇన్సూరెన్స్ అమ్ముతున్నారు. ఇక్కడ ఆ వెసులుబాటూ లేదు. పడమరలో పెళ్లికి ముందే విడాకుల అగ్రిమెంట్లు అవుతున్నాయి. మనకి ఆ చాన్సూ లేదు. అందుకే- భార్యల మీద రెచ్చిపోవడం మాని ఈక్వల్ పార్ట్నర్గా చూసుకుంటే జీవితం తారుమారు కాదు. పాశ్చాత్య దేశాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లోనే కాదు, విడాకుల్లోనూ చాలా ముందుకు వెళ్లాయి. వరకట్న వేధింపులు, అత్తవారింట్లోని ఆరళ్లు వంటి పెద్ద పెద్ద బెడదలేమీ లేకున్నా, టీకప్పులో తుపాను వంటి చిన్న చిన్న కారణాలకే అక్కడ చాలా పెళ్లిళ్లు పెటాకులవుతున్నాయి. ఏ జంట కాపురం ఎన్నాళ్లు నిలుస్తుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. జీవితమే కాదు, పడమటి దేశాల్లో దాంపత్యాలూ బుద్బుద ప్రాయాలే! అందుకే ఆ దేశాల్లో విడాకుల బీమా పథకాలు పుట్టుకొచ్చాయి. పాశ్చాత్య దేశాల నుంచి మనం అన్నింటినీ అంది పుచ్చుకుంటున్నాం. విడాకులు కూడా గ్లోబల్ లాంచ్ అవుతుందా? అక్కడి ఫ్యాషన్లు, సాంకేతిక పరిజ్ఞానం మన దేశానికి చేరాలంటే ఒకప్పుడు దశాబ్దాల వ్యవధి పట్టేది. ఇప్పుడలా కాదు, ప్రపంచీకరణ నేపథ్యంలో అక్కడివన్నీ మనకు వెనువెంటనే అందుబాటులోకి వస్తున్నాయి. విడాకులు మినహా పాశ్చాత్య సంస్కృతిని అన్నింటా అనుకరించే జనాభా ఇక్కడ గణనీయంగా పెరుగుతోంది. బ్రదర్... బాధ్యత అవసరం! యూరోప్, అమెరికాలతో పోలిస్తే మన దేశంలో విడాకుల సంఖ్య ఇప్పటికీ నామమాత్రమే! పడమటి గాలి ఉధృతంగా సోకుతున్నా, మన దేశంలో కాపురాలు కుప్పకూలిపోవడం లేదు. ఇందుకు ముఖ్య కారణం భారతీయ మహిళల సహనశీలతే! తాగి తన్నే భర్తలను సైతం జీవితాంతం భరించగల సహనం వారి సొంతం. శారీరక, మానసిక వేధింపులను, అనుమానాలను, అవమానాలను పంటి బిగువున భరించే మహిళలే లేకుంటే, మన దేశం కూడా విడాకుల విషయంలో పాశ్చాత్య దేశాలతో పోటీపడేది. మగాళ్లు ఈ సంగతిని గ్రహించి, కుటుంబం పట్ల కాస్త బాధ్యతతో మెలిగితే, మన దేశంలో విడాకుల బీమా అవసరం ఏర్పడే పరిస్థితులు తలెత్తవు. మన దగ్గర సీరియస్ కారణాలే! చదువు, ఆర్థిక స్వావలంబనతో వచ్చిన చేతన, గ్లోబలైజేషన్ సంస్కృతి ఇక్కడా విడాకులను ప్రస్తావిస్తు న్నాయి. టీ కప్పులో తుఫాన్లకు సర్దుకుంటున్నా ఆత్మగౌరవాన్ని చంపుకొనే త్యాగాలు అనవసరం అను కుంటోంది నేటి మహిళ. పిల్లలు, కుటుంబం గురించి ఆలోచన ఉన్నా తన సహనానికి పరీక్ష పెట్టే స్థితి నుంచి బయటపడాలనుకుంటోంది. వరకట్న వేధింపులు, వైవాహికేతర సంబంధాలు, అనుమానం, హెచ్ఐవీ ఉందన్న విషయాన్ని దాచిపెట్టి పెళ్లిచేసుకు న్నాడనే ధర్మాగ్రహం, ఇంపొటెన్సీ వంటి సీరియస్ రీజన్స్‌తోనే విడాకుల కోసం వెళ్తున్నారు. అయినా ఈ రేటు 1.1 శాతమే. పాశ్చాత్య దేశాలతో పోల్చుకుంటే అది అసలు పరిగణనలోకే రాదు. అంటే ఇప్పటికీ మన ఆడపడు చులు ఓపికమంతులే! అందుకే విడాకులు మన సమా జాన్ని అంతగా కలవరపెట్టట్లేదు. విదేశాల్లో ఉన్నట్టు మన దగ్గర ప్రీ మ్యారిటల్ కౌన్సెలింగ్ సెంటర్స్ లేకపో యినా ఔన్నత్యా న్ని నేర్పే కుటుంబ వ్యవస్థ బ్రహ్మాం డంగా దాని పాత్రను పోషిస్తోంది. అయినా విడాకుల సంఖ్య పెరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత ఇప్పుడు భర్తదే. ఇప్పటిదాకా భార్య మీదున్న కుటుంబ పరువు బరువును తన భుజమ్మీదకి మార్చుకోవా ల్సిందే. చిన్న రాజీ.. జీవిత భాగస్వామిలో పెద్ద మార్పును తెస్తుంది. కొంచెం సహనం.. సహచరి ముందు పరిణతి గల వ్యక్తిగా నిలబెడుతుంది! ఈ పాఠాన్ని పాటిస్తే ఆవేశం చప్పున చల్లారుతుంది. పరిస్థితి చక్కబడుతుంది. అన్యోన్యత చిక్కనవుతుంది! ఉఫ్ అంటే ఉప్ఫే... పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ తన చిన్ననాటి స్నేహితుడు జేసన్ అలెగ్జాండర్ని పెళ్లాడిన రెండు రోజులకే విడాకులు తీసుకుంది. రిసెప్షన్ పార్టీలో అతడు పేల్చిన ఓ జోక్ మీద ఆమె సీరియస్ అవడమే కారణం. ఆస్కార్ విజేతైన నటుడు ఎర్నెస్ట్ బోర్గ్నైన్ను పెళ్లాడిన హాలీవుడ్ నటి ఎథేల్ మెర్మన్ హనీమూన్ ముగియగానే ‘నా కన్నా నీకు ఫాన్ ఫాలోయింగ్ ఎక్కువుంది. భరించలేకపోతున్నా’ అని విడాకులిచ్చేసింది. జెన్నిఫర్ లోపేజ్, క్రిస్ జుడ్ పెళ్లి పెటాకులయ్యే ముందే ఫటాకులయ్యింది. నా జూడ్ని అందరూ ఇష్టపడుతున్నారని భరించలేక జెన్నిఫర్ విడాకులు తీసుకుంది. ఇప్పుడిలాంటి విడాకులు పాశ్చాత్య సమాజంలో ఎంతలా పెరిగిపోయాయంటే పిల్లలు హైస్కూల్ చదువు ముగించేనాటికి సగం మంది అమ్మానాన్నలు వేరుకుంపటి రాజేసుకుంటున్నారట. ప్రభావం పిల్లల మీద.. దీనివల్ల పిల్లల మీద చాలా దుష్ర్పభావం ఉంటోందని అక్కడి మానసిక విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి బంధంలో అట్టే కాలం నిలువకుండా పదేపదే విడాకులకు వెళ్లటంతో పిల్లలు విపరీతమైన అభద్రతకు లోనవుతున్నారు. అది వాళ్లలో నేరప్రవృత్తిని పెంచుతోంది. అక్కడ పెరిగిన గన్ కల్చర్, డ్రగ్స్, పదిహేనేళ్లకే సెక్సువల్ రిలేషన్స్‌లోకి వెళ్లడం, తర్వాత వాళ్ల పేర్లూ డైవోర్స్ లిస్ట్‌లో ఉండడం నిదర్శనాలుగా చూపిస్తున్నారు. మొగుళ్లు ఏం చేయాలి? కుటుంబంలో భార్య స్థానాన్ని గుర్తించాలి. ఆమె వ్యక్తిత్వాన్ని గౌరవించాలి ఇంటి పనుల్లో బాధ్యతలను పంచుకోవాలి. తన అవసరాలను చెప్పుకునే స్వేచ్ఛను భార్యకు ఇవ్వాలి. భార్యకు రిక్రియేషన్ కల్పించాలి. చదువు, కెరీర్లో ఆమె ఉన్నతికి తోడ్పడాలి. పిల్లలు తల్లిని గౌరవించేలా చూసే బాధ్యత తండ్రిదే. భార్య అనుకూల లక్షణాలను ఎంతలా ప్రేమిస్తారో ప్రతికూలతను (లావయ్యావనో, సన్నబడ్డావనో, జుట్టు ఊడిపోతోందనో కామెంట్లు చేయకుండా) అంతే ఇదిగా ప్రేమించాలి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ భార్య మాటకు విలువివ్వాలి - ప్రజ్ఞారశ్మి, సైకాలజిస్ట్ మొగుడూ పెళ్లాంలా కాకపోతే తల్లీతండ్రిగా... విడాకులు కోరే వాళ్లలో ఐటీ రంగంలో ఉన్న యువదంపతులే ఎక్కువ. చిన్న పిల్లలున్న జంటల విడాకుల విషయంలో పిల్లల పంపకం బాధాకరం. భార్య మీదున్న ద్వేషాన్నంతా పిల్లలకు నేర్పిస్తాడు తండ్రి. కలిసి ఉండలేని పరిస్థితిల్లో విడిపోవడం తప్పుకాదు. భార్యాభర్తలుగా విడిపోండి. కానీ తల్లిదండ్రులుగా ఒకరినొకరు గౌరవించుకోండి. ఒకరిమీద ఒకరు ద్వేషాన్ని నూరిపోసి ఆ పసి మనసులను గాయ పరచొద్దు. భవిష్యత్తులో పిల్లల జీవితంలో కూడా ఇదే సమస్య పునరావృతం కావచ్చు. - ఇ. పార్వతి, ఫ్యామిలీ కౌన్సెలర్, అడ్వకేట్ పెళ్లికి ముందే విడాకుల అగ్రిమెంట్ పెళ్లి ఫెయిల్యూర్‌గా మిగిలితే అని ముందే కీడెంచి తర్వాత మేలు కోసం చేసుకునే వివాహ పూర్వ ఒప్పందం నప్షియల్ అగ్రిమెంట్. పాశ్చాత్య దేశాల్లో ఇది సర్వసాధారణం. విడాకులైన తర్వాత ఆ ఒప్పందంలో రాసుకున్న ప్రకారం భర్త, భార్య ఇచ్చిపుచ్చుకుంటారు. యూరప్ బ్రేకింగ్ రికార్డ్స్! విడాకులు తీసుకోవడంలో మొదటి స్థానంలో యూరప్ ఉంటే రెండో స్థానంలో అమెరికా నిలుస్తోంది. యూరప్‌లో 71 శాతం విడాకుల రేటుతో బెల్జియం, 67 శాతంతొ హంగేరీ, 61 శాతంతో స్పెయిన్, 55 శాతంలో ఫ్రా న్స్, 53 శాతంతో అమెరికా ఆఖరి స్థానంలో ఆ అపఖ్యాతిని మోస్తున్నాయి.