భర్త మీద కూడా నిర్భయ కేసు పెట్టవచ్చు! | Husband on the case can also be Nirbhaya! | Sakshi
Sakshi News home page

భర్త మీద కూడా నిర్భయ కేసు పెట్టవచ్చు!

Published Mon, May 16 2016 5:00 AM | Last Updated on Mon, Sep 4 2017 12:10 AM

భర్త మీద కూడా నిర్భయ కేసు పెట్టవచ్చు!

భర్త మీద కూడా నిర్భయ కేసు పెట్టవచ్చు!

లీగల్ కౌన్సెలింగ్
మా పెళ్లయ్యి సంవత్సరం దాటింది. మాది పెద్దలు కుదిర్చిన సంబంధమే. నా భర్తకు నాపై చాలా అనుమానం. ప్రతిరోజూ నా సెల్‌ఫోన్ చెక్ చేస్తాడు. నేను ఎవరికి కాల్ చేశానో వారందరికీ రీ కాల్ చేస్తాడు. వారెవరో, నాకెలా పరిచయమో కనుక్కుంటాడు. ఇక వాళ్లు మగవాళ్లయితే వారితో అక్రమ సంబంధం అంటగట్టి నన్ను విపరీతంగా తిడతాడు. ఆడవాళ్లయితే వారి క్యారక్టర్ మంచిది కాదని, మాట్లాడవద్దని కట్టడి చేస్తాడు. ఎప్పుడు తీశాడో తెలీదు కానీ, నేను దుస్తులు మార్చుకునేటప్పుడు, స్నానం చేసేటప్పుడు వీడియోలు తీసి, వాటిని నెట్‌లో పెడతానని బెదిరిస్తున్నాడు.

ఇక నన్ను సెక్స్‌పరంగా కూడా విపరీతంగా హింసిస్తున్నాడు. అన్నట్టు ఈ దుర్మార్గుడికి మా వాళ్లు కట్నకానుకల కింద 20 లక్షల దాకా ముట్టచెప్పారు. నేను ఇంజినీరింగ్‌లో గోల్డ్ మెడలిస్ట్‌నయినా, ఉద్యోగం చెయ్యనివ్వట్లేదు. ఈ శాడిస్ట్ భర్తతో కాపురం చేయలేక నాలుగు నెలల క్రితం పుట్టింటికి వచ్చాను. నాపై యాసిడ్ పోస్తానని బెదిరిస్తున్నాడు. నేను ఏం చేయాలి?
 - అరుణ, జహీరాబాద్

 
మీరు బాగా చదువుకున్నవారయి ఉండీ ఇంత అమాయకంగా ఉంటే ఎలా? మొదట మీరు   వీడియోల గురించి, నెట్‌లో పెడతాననే బెదిరింపుల గురించి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి. వారు వెంటనే చర్య తీసుకుంటారు. తర్వాత, మీ కాళ్లమీద మీరు నిలబడేందుకు వీలుగా ఏదయినా ఉద్యోగం చూసుకోండి. ఇక రెండవ విషయం మహిళా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి 498 ఎ కేస్ వేయండి. ఫిర్యాదును వివరంగానూ చాలా జాగ్రత్తగానూ రాయండి. ఇంకా ఓపిక ఉంటే (ఉండాలి కూడా) డొమెస్టిక్ వయొలెన్స్ కేస్ వేసి, రక్షణ ఉత్తర్వులు పొందండి. ముందు ఈ కేసులన్నీ నంబర్ అయి, నోటీసులు వెళ్తే దెబ్బకు దెయ్యం వదులుతుంది. నిర్భయ చట్టం కింద కూడా బుక్ అయ్యే అవకాశం ఉంది. మీ వారికి మీ వాళ్లు కట్నంగా ఇచ్చిన డబ్బులు కూడా వెనక్కి వస్తాయి. ఇందుకు మీ తలిదండ్రుల సహకారం చాలా అవసరం.
 
నా వివాహమై ఐదేళ్లయింది. నాకు ఒక బాబు. పెళ్లినాటికి మా వారు దుబాయిలో ఉద్యోగం చేస్తున్నారు. పెళ్లి కాగానే నన్ను అక్కడికి తీసుకెళ్లారు. నేను కన్సీవ్ అయ్యాను. డెలివరీకి ఇండియా వచ్చాను. బాబుకు 6 నెలలు రాగానే ఆయన వచ్చి చూసి వెళ్లారు. వాడికి ఏడాది నిండగానే వచ్చి మమ్మల్ని దుబాయికి తీసుకెళతానన్నారు. అంతా సజావుగా ఉందని అనుకునేలోగా మా వారు తీవ్ర అనారోగ్యంతో మరణించారు. అతను చేసేది చాలా చిన్న ఉద్యోగం కావడం వల్ల మాకు పెద్దగా ఆర్థిక సాయం ఏమీ అందలేదు. అయితే మా అత్తమామలు బాగా ఉన్నవాళ్లు. స్థిరచరాస్తులు చాలా ఉన్నాయి. మా వారి మరణం తర్వాత నన్నూ, బాబునూ ఆదరించకపోగా, బయటికి గెంటి వేశారు. నేను పెద్దగా చదువుకోలేదు. పైగా బాబు చిన్నవాడు. ఇప్పట్లో ఏ పనీ చేయగలిగే పరిస్థితులు లేవు. మా వారికి రావలసిన ఆస్తిలో నాకూ, బాబుకూ వాటా వస్తుందా?
 - మానస, రాజమండ్రి

 
తప్పకుండా వస్తుంది. చనిపోయిన మీ వారికి తండ్రి ఆస్తిలో చట్టప్రకారం ఎంత ఆస్తి రావాలోఅంత వాటా మీకు వస్తుంది. ఒక వితంతువైన కోడలికి మెయింటెనెన్స్ ఇవ్వవలసిన బాధ్యత చట్టప్రకారం మీ మామగారిదే. మీకు, బాబుకు మెయింటెనెన్స్ వస్తుంది. మీరు జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీని సంప్రదించి ప్రీ లిటిగేషన్ కేస్ (పిఎల్‌సీ) వేయండి. దీనికి ఖర్చులేం ఉండవు. మీ మామగారిని పిలిపించి (నోటీసుల ద్వారా) మీ విషయం సెటిల్ చేస్తారు. వినకుంటే కేసును కోర్టుకు పంపుతారు.
 
మేడమ్, ఇటీవలే నేను ఎంబిఏ పూర్తి చేశాను. అయితే నేను ఫస్ట్ ఇయర్‌లో ఉండగా నా క్లాస్‌మేట్ రాఘవను ప్రేమించాను. అతనూ నన్ను ఇష్టపడ్డాడు. మా కులాలు వేరు కావడం వల్ల పెద్దలు అంగీకరించరని తెలుసు. అందుకని మేము రహస్యంగా వివాహం చేసుకోవాలనుకున్నాము. కొందరు మిత్రుల సమక్షంలో దండలు మార్చుకున్నాము. సంప్రదాయబద్ధంగా మంగళసూత్రం కూడా కట్టాడు. స్నేహితులంతా దాన్ని వీడియో కూడా తీశారు.

మా పేరెంట్స్‌కు ఈ విషయాన్ని చెప్పకుండా దాచాము. ఎవరి హాస్టల్‌లో వాళ్లం ఉంటూ, అప్పుడప్పుడు కలుసుకునేవాళ్లం. ఒక రూమ్ అద్దెకు తీసుకుని అందులో గడిపేవాళ్లం. ఓనర్స్ కూడా పక్కనే ఉండేవాళ్లు. ఇలా సంవత్సరం గడిచింది. మా చదువులైపోయాయి. మధ్యలో కన్సీవ్ అవడం, తనే దగ్గరుండి అబార్షన్ చేయించడం జరిగింది. తనకు మంచి ఉద్యోగం దొరికింది. అయితే అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది. నాకూ మొన్ననే ఉద్యోగం వచ్చింది. ఇపుడు నా భర్త వేరే పెళ్లి చేసుకోబోతున్నాడు. మా వివాహం గురించి పెద్దలకు తెలియదు. ఈ పరిస్థితుల్లో నేను ఏం చేయాలి? సలహా ఇవ్వగలరు.
 - రాగిణి, హైదరాబాద్

 
మీరు చేసింది తప్పు. అంతేకాకుండా మోసపోయారు కూడా. ఎవరినైనా ఈరోజుల్లో ఇలాంటి పెళ్ళిళ్లు చేసుకుంటారా? ఒకవేళ అంత అవసరమైతే రిజిస్టర్ పెళ్లి ఉండనే ఉంది కదాఐ. కాకుంటే మీరు అతని భార్య అనే ఆధారాలు మీ వద్ద చాలు ఉన్నాయి. ఫొటోలు, వీడియోలూ, స్నేహితుల సాక్ష్యాలు పనికి వస్తాయి. మీ ఓనర్స్ కూడా మీరు ఆ రూమ్‌కి ఒక సంవత్సరం పాటు వస్తూ, వెళుతూ ఉన్నారని చెబుతారు. హాస్పిటల్‌లో కూడా మీవారు సంతకం చేసే ఉంటారు కదా! ఇక మీవారు వివాహాన్ని నిరాకరించలేరు. కాదనలేరు.

మీరు వెంటనే మీ తలిదండ్రులను సంప్రదించి ఈ విషయాలు వివరించండి. మీ మిత్రులను, పేరెంట్స్‌ను తోడు తీసుకుని వెళ్లండి. వారు అర్థం చేసుకుని ఆశీర్వదిస్తే మంచిది. లేదంటే క్రిమినల్ కేసు పెట్టొచ్చు. చీటింగ్, నమ్మకద్రోహం, బైగమీ మొదలైన కేసులు పెట్టవచ్చు. రెండో వివాహం చేసుకోకుండా కోర్టునుండి ఇంజన్‌క్షన్ ఆర్డర్ తెచ్చుకోవచ్చు. ఏది ఏమైనా ఇలాంటి రహస్యపు పెళ్లిళ్లు అనేక అనర్థాలకు దారితీస్తాయి.
 - ఇ.పార్వతి
అడ్వొకేట్ అండ్  ఫ్యామిలీ కౌన్సెలర్

parvathiadvocate2015@gmail.com

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement