మహిళలు నిర్ణయం తీసుకుంటే పరిస్థితి తారుమారే..
‘పడమర’లో ఆడవాళ్లు మొగుళ్లను తూర్పార పడుతున్నారు. ‘తూర్పు’లో పెళ్లాలు పెళ్లిమరలో పడి పిండి పిండి అవుతున్నా సహనంతో ఉంటున్నారు. ఇక మగాళ్లు జాగ్రత్త పడటం అవసరం. తెగే దాకా లాగితే తెగుద్ది. పాశ్చాత్య దేశాల్లో ఆల్రెడీ పెళ్లిళ్లకి ఇన్సూరెన్స్ అమ్ముతున్నారు. ఇక్కడ ఆ వెసులుబాటూ లేదు. పడమరలో పెళ్లికి ముందే విడాకుల అగ్రిమెంట్లు అవుతున్నాయి. మనకి ఆ చాన్సూ లేదు. అందుకే- భార్యల మీద రెచ్చిపోవడం మాని ఈక్వల్ పార్ట్‌నర్‌గా చూసుకుంటే జీవితం తారుమారు కాదు.
పాశ్చాత్య దేశాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లోనే కాదు, విడాకుల్లోనూ చాలా ముందుకు వెళ్లాయి. వరకట్న వేధింపులు, అత్తవారింట్లోని ఆరళ్లు వంటి పెద్ద పెద్ద బెడదలేమీ లేకున్నా, టీకప్పులో తుపాను వంటి చిన్న చిన్న కారణాలకే అక్కడ చాలా పెళ్లిళ్లు పెటాకులవుతున్నాయి. ఏ జంట కాపురం ఎన్నాళ్లు నిలుస్తుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. జీవితమే కాదు, పడమటి దేశాల్లో దాంపత్యాలూ బుద్బుద ప్రాయాలే! అందుకే ఆ దేశాల్లో విడాకుల బీమా పథకాలు పుట్టుకొచ్చాయి. పాశ్చాత్య దేశాల నుంచి మనం అన్నింటినీ అంది పుచ్చుకుంటున్నాం.
విడాకులు కూడా గ్లోబల్ లాంచ్ అవుతుందా?
అక్కడి ఫ్యాషన్లు, సాంకేతిక పరిజ్ఞానం మన దేశానికి చేరాలంటే ఒకప్పుడు దశాబ్దాల వ్యవధి పట్టేది. ఇప్పుడలా కాదు, ప్రపంచీకరణ నేపథ్యంలో అక్కడివన్నీ మనకు వెనువెంటనే అందుబాటులోకి వస్తున్నాయి. విడాకులు మినహా పాశ్చాత్య సంస్కృతిని అన్నింటా అనుకరించే జనాభా ఇక్కడ గణనీయంగా పెరుగుతోంది.
బ్రదర్... బాధ్యత అవసరం!
యూరోప్, అమెరికాలతో పోలిస్తే మన దేశంలో విడాకుల సంఖ్య ఇప్పటికీ నామమాత్రమే! పడమటి గాలి ఉధృతంగా సోకుతున్నా, మన దేశంలో కాపురాలు కుప్పకూలిపోవడం లేదు. ఇందుకు ముఖ్య కారణం భారతీయ మహిళల సహనశీలతే! తాగి తన్నే భర్తలను సైతం జీవితాంతం భరించగల సహనం వారి సొంతం. శారీరక, మానసిక వేధింపులను, అనుమానాలను, అవమానాలను పంటి బిగువున భరించే మహిళలే లేకుంటే, మన దేశం కూడా విడాకుల విషయంలో పాశ్చాత్య దేశాలతో పోటీపడేది. మగాళ్లు ఈ సంగతిని గ్రహించి, కుటుంబం పట్ల కాస్త బాధ్యతతో మెలిగితే, మన దేశంలో విడాకుల బీమా అవసరం ఏర్పడే పరిస్థితులు తలెత్తవు.
మన దగ్గర సీరియస్ కారణాలే!
చదువు, ఆర్థిక స్వావలంబనతో వచ్చిన చేతన, గ్లోబలైజేషన్ సంస్కృతి ఇక్కడా విడాకులను ప్రస్తావిస్తు న్నాయి. టీ కప్పులో తుఫాన్లకు సర్దుకుంటున్నా ఆత్మగౌరవాన్ని చంపుకొనే త్యాగాలు అనవసరం అను కుంటోంది నేటి మహిళ. పిల్లలు, కుటుంబం గురించి ఆలోచన ఉన్నా తన సహనానికి పరీక్ష పెట్టే స్థితి నుంచి బయటపడాలనుకుంటోంది. వరకట్న వేధింపులు, వైవాహికేతర సంబంధాలు, అనుమానం, హెచ్‌ఐవీ ఉందన్న విషయాన్ని దాచిపెట్టి పెళ్లిచేసుకు న్నాడనే ధర్మాగ్రహం, ఇంపొటెన్సీ వంటి సీరియస్ రీజన్స్‌తోనే విడాకుల కోసం వెళ్తున్నారు. అయినా ఈ రేటు 1.1 శాతమే.
పాశ్చాత్య దేశాలతో పోల్చుకుంటే అది అసలు పరిగణనలోకే రాదు. అంటే ఇప్పటికీ మన ఆడపడు చులు ఓపికమంతులే! అందుకే విడాకులు మన సమా జాన్ని అంతగా కలవరపెట్టట్లేదు. విదేశాల్లో ఉన్నట్టు మన దగ్గర ప్రీ మ్యారిటల్ కౌన్సెలింగ్ సెంటర్స్ లేకపో యినా ఔన్నత్యా న్ని నేర్పే కుటుంబ వ్యవస్థ బ్రహ్మాం డంగా దాని పాత్రను పోషిస్తోంది. అయినా విడాకుల సంఖ్య పెరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత ఇప్పుడు భర్తదే. ఇప్పటిదాకా భార్య మీదున్న కుటుంబ పరువు బరువును తన భుజమ్మీదకి మార్చుకోవా ల్సిందే. చిన్న రాజీ.. జీవిత భాగస్వామిలో పెద్ద మార్పును తెస్తుంది. కొంచెం సహనం.. సహచరి ముందు పరిణతి గల వ్యక్తిగా నిలబెడుతుంది! ఈ పాఠాన్ని పాటిస్తే ఆవేశం చప్పున చల్లారుతుంది. పరిస్థితి చక్కబడుతుంది. అన్యోన్యత చిక్కనవుతుంది!
ఉఫ్ అంటే ఉప్ఫే...
పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ తన చిన్ననాటి స్నేహితుడు జేసన్ అలెగ్జాండర్‌ని పెళ్లాడిన రెండు రోజులకే విడాకులు తీసుకుంది. రిసెప్షన్ పార్టీలో అతడు పేల్చిన ఓ జోక్ మీద ఆమె సీరియస్ అవడమే కారణం.
ఆస్కార్ విజేతైన నటుడు ఎర్నెస్ట్ బోర్గ్‌నైన్‌ను పెళ్లాడిన హాలీవుడ్ నటి ఎథేల్ మెర్‌మన్ హనీమూన్ ముగియగానే ‘నా కన్నా నీకు ఫాన్ ఫాలోయింగ్ ఎక్కువుంది. భరించలేకపోతున్నా’ అని విడాకులిచ్చేసింది.
జెన్నిఫర్ లోపేజ్, క్రిస్ జుడ్ పెళ్లి పెటాకులయ్యే ముందే ఫటాకులయ్యింది. నా జూడ్‌ని అందరూ ఇష్టపడుతున్నారని భరించలేక జెన్నిఫర్ విడాకులు తీసుకుంది.
ఇప్పుడిలాంటి విడాకులు పాశ్చాత్య సమాజంలో ఎంతలా పెరిగిపోయాయంటే పిల్లలు హైస్కూల్ చదువు ముగించేనాటికి సగం మంది అమ్మానాన్నలు వేరుకుంపటి రాజేసుకుంటున్నారట.
ప్రభావం పిల్లల మీద..
దీనివల్ల పిల్లల మీద చాలా దుష్ర్పభావం ఉంటోందని అక్కడి మానసిక విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి బంధంలో అట్టే కాలం నిలువకుండా పదేపదే విడాకులకు వెళ్లటంతో పిల్లలు విపరీతమైన అభద్రతకు లోనవుతున్నారు. అది వాళ్లలో నేరప్రవృత్తిని పెంచుతోంది. అక్కడ పెరిగిన గన్ కల్చర్, డ్రగ్స్, పదిహేనేళ్లకే సెక్సువల్ రిలేషన్స్‌లోకి వెళ్లడం, తర్వాత వాళ్ల పేర్లూ డైవోర్స్ లిస్ట్‌లో ఉండడం నిదర్శనాలుగా చూపిస్తున్నారు.
మొగుళ్లు ఏం చేయాలి?
కుటుంబంలో భార్య స్థానాన్ని గుర్తించాలి. ఆమె వ్యక్తిత్వాన్ని గౌరవించాలి ఇంటి పనుల్లో బాధ్యతలను పంచుకోవాలి. తన అవసరాలను చెప్పుకునే స్వేచ్ఛను భార్యకు ఇవ్వాలి. భార్యకు రిక్రియేషన్ కల్పించాలి. చదువు, కెరీర్‌లో ఆమె ఉన్నతికి తోడ్పడాలి. పిల్లలు తల్లిని గౌరవించేలా చూసే బాధ్యత తండ్రిదే. భార్య అనుకూల లక్షణాలను ఎంతలా ప్రేమిస్తారో ప్రతికూలతను (లావయ్యావనో, సన్నబడ్డావనో, జుట్టు ఊడిపోతోందనో కామెంట్లు చేయకుండా) అంతే ఇదిగా ప్రేమించాలి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ భార్య మాటకు విలువివ్వాలి
- ప్రజ్ఞారశ్మి, సైకాలజిస్ట్
మొగుడూ పెళ్లాంలా కాకపోతే తల్లీతండ్రిగా...
విడాకులు కోరే వాళ్లలో ఐటీ రంగంలో ఉన్న యువదంపతులే ఎక్కువ. చిన్న పిల్లలున్న జంటల విడాకుల విషయంలో పిల్లల పంపకం బాధాకరం. భార్య మీదున్న ద్వేషాన్నంతా పిల్లలకు నేర్పిస్తాడు తండ్రి. కలిసి ఉండలేని పరిస్థితిల్లో విడిపోవడం తప్పుకాదు. భార్యాభర్తలుగా విడిపోండి. కానీ తల్లిదండ్రులుగా ఒకరినొకరు గౌరవించుకోండి. ఒకరిమీద ఒకరు ద్వేషాన్ని నూరిపోసి ఆ పసి మనసులను గాయ పరచొద్దు. భవిష్యత్తులో పిల్లల జీవితంలో కూడా ఇదే సమస్య పునరావృతం కావచ్చు.
- ఇ. పార్వతి, ఫ్యామిలీ కౌన్సెలర్, అడ్వకేట్
పెళ్లికి ముందే విడాకుల అగ్రిమెంట్
పెళ్లి ఫెయిల్యూర్‌గా మిగిలితే అని ముందే కీడెంచి తర్వాత మేలు కోసం చేసుకునే వివాహ పూర్వ ఒప్పందం నప్షియల్ అగ్రిమెంట్. పాశ్చాత్య దేశాల్లో ఇది సర్వసాధారణం. విడాకులైన తర్వాత ఆ ఒప్పందంలో రాసుకున్న ప్రకారం భర్త, భార్య ఇచ్చిపుచ్చుకుంటారు.
యూరప్ బ్రేకింగ్ రికార్డ్స్!
విడాకులు తీసుకోవడంలో మొదటి స్థానంలో యూరప్ ఉంటే రెండో స్థానంలో అమెరికా నిలుస్తోంది. యూరప్‌లో 71 శాతం విడాకుల రేటుతో బెల్జియం, 67 శాతంతొ హంగేరీ, 61 శాతంతో స్పెయిన్, 55 శాతంలో ఫ్రా న్స్, 53 శాతంతో అమెరికా ఆఖరి స్థానంలో ఆ అపఖ్యాతిని మోస్తున్నాయి.
భర్తలూ బీ కేర్‌ఫుల్!
Published Fri, Jun 5 2015 12:22 AM | Last Updated on Sun, Sep 3 2017 3:13 AM
Advertisement
Advertisement