కుదిరితే ఓ కప్పు కాఫీ... వీలైతే విడాకులు! | Some highlights ... and if possible to divorce a cup of coffee! | Sakshi
Sakshi News home page

కుదిరితే ఓ కప్పు కాఫీ... వీలైతే విడాకులు!

Published Tue, Aug 16 2016 10:53 PM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM

కుదిరితే ఓ కప్పు కాఫీ...   వీలైతే విడాకులు!

కుదిరితే ఓ కప్పు కాఫీ... వీలైతే విడాకులు!

రిటర్న్ టికెట్
లీగల్ స్టోరీస్


 కుదిరితే ఓ కప్పు కాఫీ. వీలైతే విడాకులు! ఇంతేనా?  నేటి ప్రేమలు ఓ వింతేనా?  పెళ్లిళ్లు ఓ తంతేనా?  ఇందుకేనా.. ఈ ప్రేమ ఊసులు,  పెళ్లి బాసలు! కప్పు కాఫీ కుదరకపోయినా నో ప్రాబ్లెమ్.  ఓ ఇంటి కప్పు కిందికి చేరాక,  చెరో దిక్కూ అయితే...  మూడుముళ్లకు, ఏడడుగులకు, సప్తపదులకు అర్థం ఏమిటి? డైవోర్స్ దాకా వెళ్లి, చివరి నిముషంలో రిటర్న్ టికెట్ తీసుకున్న ‘స్వేచ్ఛ’కు (పేరు మార్చాం) ఇప్పుడు... అర్థంతో పాటు,  పెళ్లి పరమార్థమూ తెలిసొచ్చింది!

 
ఫ్యామిలీ కోర్టు కారిడార్! జనాలతో కిటకిటలాడుతోంది. దానిని ఆనుకొని ఉన్న గది అంతకన్నా కిక్కిరిసి ఉంది. జంటలు, పిల్లలతో వచ్చిన ఫ్యామిలీలతో! ఆ హడావిడి చూసి  ‘బాబోయ్.. ఇంతమంది విడాకులకొచ్చారా? ఇన్ని కేసులా?’ అని బెదిరిపోతూ, కూర్చోడానికి బెంచీ మీద కాసింత చోటును వెదుక్కుంది స్వేచ్ఛ. అప్పటికే ఆమెలో ఏదో తెలియని దిగులు. కూర్చోడానికైతే కూర్చుంది కాని ఆమె మనసంతా సాత్విక్ చుట్టే తిరుగుతోంది.


నాలుగేళ్ల కిందట... ఓ రోజు
ఆఫీసు క్యాంటీన్‌లో కాఫీ తాగుతుంటే వచ్చాడు... రెండు చేతులు వెన క్కు పెట్టుకొని. ‘కుదిరితే కప్పు కాఫీ...?’ అంది తను నవ్వుతూ. ‘ఊ’ అన్నట్టు తల ఊపుతూ వెనకాల చేతుల్లో దాచుకున్న రెడ్ రోజ్‌ను ఆమెకందించాడు.. ‘నాతో పెళ్లి కుదురుతుందా?’ అంటూ!


ఆ సర్‌ప్రైజ్‌కి ఉక్కిరిబిక్కిరైన తను ‘ఊ.. కుదురుతుంది’ అని చెప్పింది. పెళ్లయింది. ‘స్వేచ్ఛా.. స్వేచ్ఛా...’ ఆ పిలుపుకి ఉలిక్కిపడి వర్తమానంలోకి వచ్చింది ఆమె. తన ప్రశాంతత చెదిరిన భావన. అన్యమనస్కంగానే లేచి జడ్జి ముందుకు వచ్చి నిలబడింది. అప్పటికే సాత్విక్ ఉన్నాడు అక్కడ. తనను చూశాడు. ఆ చూపులో ఏదో అర్థం! పట్టే ప్రయత్నం చేస్తోంది ఆమె.  ‘మూడింటికి పిలుస్తాం.. అప్పటిదాకా ఇక్కడే ఉండండి’ ఆర్డర్ వేశారు జడ్జి.  తలలూపి మళ్లీ ఎవరి స్థానాల్లోకి వాళ్లు వెళ్లి కూర్చున్నారు స్వేచ్ఛ, సాత్విక్! ఒక్కో కేసూ విచారణకు పిలుస్తున్నారు జడ్జి.

 
ఇంటి ఖర్చులకు డబ్బులివ్వని భర్త!
30 ఏళ్ల ఓ మహిళ అయిదేళ్లలోపున్న ఇద్దరు పిల్లలతో హాజరైంది. ‘నా భర్త నన్ను, పిల్లల్ని పట్టించుకోవట్లేదండి. వచ్చిన జీతం వచ్చినట్టుగా తాగడానికే ఖర్చుపెడ్తున్నాడు. ఇలాగైతే మేం పస్తులతో చావాల్సిందే! ఇంటి ఖర్చుల కోసం డబ్బులిప్పించండి సార్.. ’ అంటూ కళ్లల్లో నీళ్లు పెట్టుకుంది. అమ్మ గొంతులో బాధ విన్న పిల్లలిద్దరూ అమ్మను కరుచుకుపోయారు. జాలేసింది స్వేచ్ఛకు. ఈ పసివాళ్లేం తప్పు చేశారని? తనకు పిల్లలుంటే.. వాళ్లూ .. ఇలాగే...? ఛ.. సాత్విక్‌కి తాగుడు అలవాటు లేదు. తననెప్పుడూ పల్లెత్తు మాట అనలేదు. డబ్బుకి ఏరోజూ లోటు చేయలేదు. తమకు పిల్లలుంటే కళ్లల్లో పెట్టుకొని చూసుకునేవాడు. ఇంకో కేసు పిలవడంతో స్వేచ్ఛ ఆలోచనకు బ్రేక్ పడింది.

  

చీటికి మాటికి గొడవ పడే భర్త!
తలకు కట్టుతో ఓ అమ్మాయి వచ్చింది. ‘పెళ్లయి మూడేళ్లయింది. యేడాదిన్నర బాగానే ఉన్నాడు. తర్వాత నుంచే గొడవలు మొదలయ్యాయి. చీటికి మాటికి విసుక్కుంటాడు. చిన్న కారణాలకే పెద్దగా గొడవ చేస్తాడు. కూర బాలేకపోయినా.. ఆయనకు లుంగీ కనపడకపోయినా బూతులు తిడ్తాడు. ఈమధ్య ఇంకో అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు. నిలదీస్తే కొట్టాడు. చంపుతాడేమోనని భయమేస్తోంది. నాకు విడాకులిప్పించండి’ అంటూ మొరపెట్టుకుంది.  ‘పాపం.. సాత్విక్ వంట విషయంలో తననెప్పుడూ తప్పు పట్టలేదు. ఉప్పు ఎక్కువైనా.. కారం తక్కువైనా సర్దుకున్నాడు. ఎంతసేపూ నా సౌకర్యం గురించి ఆలోచించాడే తప్ప తన గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. మరి ఇక్కడిదాకా ఎందుకు వచ్చింది?  ‘నెక్స్ట్..’ జడ్జిగారి ఈ మాట అంతర్మథనంలో ఉన్న స్వేచ్ఛను  అంతరాయపర్చింది.

 
అనుమానంతో వేధించే భర్త!
‘నేను డెల్‌లో జాబ్ చేస్తాను. ఉద్యోగం ఉందనే నన్ను పెళ్లి చేసుకున్నాడు ఆయన. జీతమంతా తనే తీసుకుంటాడు. నా ఖర్చు లెక్కపెట్టి మరీ డబ్బులిస్తాడు. నేను ఎవరితోనూ మాట్లాడకూడదు. ఫోన్, మెయిల్స్ చెక్ చేసి.. వాడెవడు.. వీడెవడు.. వాడెందుకు కాల్ చేశాడు.. వాడికి నీతో ఏం పని? మెయిల్ ఎందుకు పెట్టాడు అంటూ అస్తమానం వేధిస్తున్నాడు. నేను ఆయనతో ఉండలేను. నాకు డైవోర్స్ కావాలి. ప్లీజ్ గ్రాంట్ మీ సర్’ అంటూ ఏడ్చేసింది ఆ ఉద్యోగిని.

 
మళ్లీ సాత్విక్ చుట్టూ తిరగసాగింది ఆమె మనసు. ఖర్చు పెరుగుతుందని తెలిసి కూడా పెళ్లవగానే ఉద్యోగం మానేస్తానంది. మారు మాట్లాడకుండా ‘సరే’ అన్నాడు. కారు, ఫ్లాట్ లోన్లు భారమైనా భరించాడు. తనకు ఏ కష్టం కలగకూడదని పగలూ రాత్రి ఆఫీస్‌కే అంకితమయ్యాడు. తన మేల్ క్లాస్‌మేట్స్‌తో ఫోన్లో ఎంతసేపు మాట్లాడినా ఏరోజూ ఆ కాన్వర్జేషన్ ఏంటీ అని అనుమానపడలేదు. ఫోన్ చెక్ చేయడమనే అమర్యాద లేదు. అసలు ఇన్‌సల్ట్ చేయడమనే నైజం కాదు సాత్విక్‌ది. చాలా సాఫ్ట్! మరెందుకు తను విడాకుల దాకా వచ్చింది. అమ్మ మాట వినా? అమ్మ ఏమంది? ‘ఇల్లు, కారు, డబ్బు, నగలు అన్నీ ఇచ్చాడు సరే.. మరి టైమ్ ఇస్తున్నాడా?’ అంది. ‘నీతో గడపలేనంత బిజీ ఏంటీ? మీ ఆయన లైఫ్‌లో ఇంకా ఎవరైనా..’ అంటూ ఆగిపోయింది. అర్థం చేసుకోవాల్సింది పోయి అనుమానపడ్డాను. సాత్విక్‌ను అవమానించాను. మాటా మాటా పెరిగింది. అండర్‌స్టాండింగ్ ప్లేస్‌లోకి ఇగో వచ్చింది. పరిస్థితిని విడాకుల దాకా తెచ్చింది. సాత్విక్ కూడా ఇటు వైపు నుంచి ఆలోచించలేదు. ఇంతమంది సమస్యల ముందు తనదసలు సమస్యే కాదు. అమ్మ చెప్పినదాన్ని తనే అతిగా తీసుకుంది. సాత్విక్‌తో తనకు విడాకులు వద్దు. కలిసే ఉండాలి..’ అని ఆమె అనుకుంటూ ఉండగానే బంట్రోతు పిలిచిన పిలుపు వినపడింది... ‘సాత్విక్.. సాత్విక్’ అని!

 

‘కుదిరితే కప్పు కాఫీ...’
అప్పటికే సాత్విక్ జడ్జి దగ్గరకు వెళ్లడానికి తనను దాటుతున్నాడు. అతని కళ్లల్లోకి చూసింది. సాత్విక్ కూడా చూశాడు. కళ్ల నిండా నీళ్లు.. గుండె నిండా దుఃఖంతో ‘కుదిరితే కప్పు కాఫీ.. ’ అని అడిగింది సాత్విక్‌ని. అతని కళ్లల్లోనూ నీళ్లు.. ‘ఊ.. నాతో కలిసి ఉంటావా?’ అదే ఆప్యాయత నిండిన స్వరం కోరింది ఆమెను. ఎట్ ది ఎండ్... కోర్టు సీన్‌లోంచి హనీమూన్ ట్రిప్‌కి బయలుదేరింది ఆ జంట. విడాకులు వద్దనుకొని రికన్సిలియేషన్ ద్వారా మళ్లీ ఒక్కటైంది.  - సరస్వతి రమ

 

రికన్సిలియేషన్ అంటే?
ఫ్యామిలీ కోర్టుల్లో భార్యభర్తలు విడాకులు, పిల్లల కస్టడీ, మెయిటెనెన్స్ మొదలైనవాటి కోసం కేసు వేసినప్పుడు... మొదటి వాయిదాకు హాజరైన భార్యాభర్తల్ని న్యాయమూర్తి తన ఛాంబర్‌లోకి పిలిపిస్తారు. వారితో ప్రత్యేకంగా మాట్లాడి.. వాళ్ల సమస్యలను వింటారు. విడిపోతే వచ్చే నష్టాలేమిటో, కలిసి ఉంటే కలిగే లాభాలేంటో వివరిస్తారు. అపార్థాలు, అపోహలుంటే ఇద్దరినీ స్వేచ్ఛగా మాట్లాడుకోమంటారు. ఆ మాటల ద్వారా వాళ్ల మధ్య ఉన్న అపోహలు, అపార్థాలు తొలగించే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ వాళ్ల సంసారంలో ఆ ఇరువురి తల్లిదండ్రుల జోక్యం ఉందని భావిస్తే, ఉందని తేలితే కొంతకాలం తల్లిదండ్రులకు దూరంగా ఉండమని చెప్తారు. సాధ్యమైనంత వరకు ఆ వివాహబంధం నిలిపే ప్రయత్నమే చేస్తారు. దీన్నే రికన్సిలియేషన్ అంటారు. అంటే కేసును కొనసాగించడానికి ముందు.. కలిపి ఉంచడానికి చేసే సామరస్య ప్రయత్నమన్నమాట. స్వేచ్ఛ, సాత్విక్‌ల సంసారంలో స్వేచ్ఛ తల్లిదండ్రుల జోక్యం వల్లే విడాకులు దాకా వచ్చింది తప్ప వాళ్ల మధ్య ఎలాంటి స్పర్థలు లేవు. కౌన్సిలింగ్ కంటే ముందే స్వేచ్ఛ తన తప్పుని గ్రహించింది. కౌన్సిలింగ్ ద్వారా సాత్విక్ కూడా గ్రహించాడు... ఉద్యోగ బాధ్యతల్లో పడి భార్యకు టైమ్ కేటాయించకపోవడం పొరపాటేనని. అందుకే రికన్సిలియేషన్‌తో వాళ్ల కథ సుఖాంతమైంది.


ఇ.పార్వతి
అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్
parvathiadvocate2015@gmail.com

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement