చట్టానికి కళ్లుంటాయి | ‘cruelty by husband or relatives of husband’ and includes section 498-A | Sakshi
Sakshi News home page

చట్టానికి కళ్లుంటాయి

Published Tue, Sep 6 2016 11:17 PM | Last Updated on Fri, May 25 2018 12:54 PM

చట్టానికి కళ్లుంటాయి - Sakshi

చట్టానికి కళ్లుంటాయి

లీగల్  స్టోరీస్
 
ఆయుధానికి దయ ఉండదు. అణ్వస్త్రానికి కరుణ ఉండదు. అవి... తమ పని తాము చేసుకుపోతాయంతే! ఉండాల్సిందల్లా వాటిని వాడుతున్న వారికి విచక్షణ. కావాల్సిందల్లా ఆ పర్యవసానాలపై అవగాహన. 498-ఏ... దుర్మార్గపు భర్తలు, ధూర్తులైన మొగుళ్ల పాలిటి ఓ అణ్వస్త్రంలాంటిదే... ఓ ఆయుధం లాంటిదే. చేతిలో ఉందని అస్త్రాన్ని, ఆయుధాన్ని వేస్ట్ చేయవద్దు. అస్త్రాన్ని... దివ్యస్త్రం అని కూడా అంటారు. న్యాయదేవత పర్యవేక్షణలోని చట్టాల్లో ఓ దివ్యత్వం ఉంది. అస్త్రం లాంటి చట్టాన్ని అనవసరంగా ఉపయోగిస్తే... చట్టం కళ్లు మూసుకునే ఉండదనీ, దివ్య చక్షువులతో సత్యాలను వీక్షిస్తుందని... కోర్టు వివేచనతో వ్యవహరిస్తుందని చాటి చెప్పడానికే ఈ కథనం.
 
తండ్రి స్నేహితుడు విద్యాధరరావుతో కలిసి పోలీస్ స్టేషన్‌లో వెయిట్ చేస్తున్నాడు చంద్ర. ఇన్‌స్పెక్టర్ కోసం! గంట అయింది.. అప్పుడు వచ్చాడు ఇన్‌స్పెక్టర్. ఆయన్ని చూసి చంద్ర, విద్యాధరరావు చటుక్కున లేచి నిలబడ్డారు. కనీసం వాళ్ల వంక చూడనైనా చూడకుండా తన సీట్ దగ్గరకు వెళ్లిపోయాడు. కానిస్టేబుల్స్‌తో ఏవో కేసులకు సంబంధించినవి మాట్లాడుతూ, ఆరా తీస్తూ, ఫోన్లలో వ్యక్తిగత విషయాలు మాట్లాడుకుంటూ  కాలక్షేపం చేస్తున్నాడు ఆ ఇన్‌స్పెక్టర్. ఈలోపు రెండు మూడుసార్లు కానిస్టేబుల్‌తో చంద్ర తాము ఇన్‌స్పెక్టర్‌ను కలవాలనుకున్నట్టు చెప్పించాడు. వినీ విననట్టు ఊరుకున్నాడు ఇన్‌స్పెక్టర్.

ఈలోపే జ్వాల, ఆమె పేరెంట్స్, జ్వాల మేనమామా స్టేషన్‌కి వచ్చారు. రావడం రావడంతోనే వరండాలో ఉన్న చంద్రవాళ్లను చూసిన జ్వాల మేనమామ..  ‘‘కట్నం కోసం మా అమ్మాయిని సతాయిస్తారా? తిండి పెట్టకుండా మాడుస్తారా? నీ చెల్లెలికి అస్తమానం నీతో ముచ్చట్లేంటి? మీ అమ్మకేం పనిలేదా... పొద్దాక కోడలిని పట్టుచీరలు కట్టుకొమ్మని, నగలేసుకుని తిరగమని పోరడం తప్ప? నీ తండ్రేంటి? ముసలాడు మాట్లాడాల్సిన మాటలా అవి? కొడుకుతో ఎలా ఉండాలో కోడలికి సలహాలిస్తాడా? నీ చెల్లికి ఇచ్చుకొమ్మను. భలే దొరికారు మా ప్రాణాలకు పర్వర్టెడ్ ఫెలోస్. ఆగండి మీ పని చెప్తా.. మీ అంతు చూస్తా!’’ అంటూ కుడిచేతి చూపుడువేలు చూపిస్తూ ఆవేశంతో, కోపంతో ఊగిపోయాడు. ఆ మాటలు విన్న చంద్రకూ కోపం నషాళానికి అంటింది. పిడికిలి బిగుసుకుంది. దవడలు అదిరాయి. అంతే.. ఆవేశంతో ఏదో అనబోయాడాడు. పక్కనే ఉన్న విద్యాధరరావు.. చంద్ర భుజం నొక్కి ఆపాడు.

 మరో గంట గడిచాక.. అప్పుడు.. బయట వెయిట్ చేస్తున్న చంద్రవాళ్లను లోపలికి పిలిపించాడు ఇన్‌స్పెక్టర్. కళ్లతోనే కూర్చోండి అన్నట్లు సైగ చేసి  కుర్చీలో వెనక్కి వాలాడు. ‘‘ఏంటి విషయం?’’ చెవిలో ఇయర్ బడ్ తిప్పుకుంటూ కళ్లు సగం మూసి అడిగాడు చంద్ర వాళ్లను.  ‘‘నా పేరు చంద్ర. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నా. మా ఇంటికి కాల్ చేసి నన్ను, మా పేరెంట్స్‌ని, మా చెల్లిని స్టేషన్‌కి రమ్మన్నారట సర్ మీరు’’ చెప్పాడు చంద్ర వినయంగానే. ‘‘ఓ.. జ్వాల అనే అమ్మాయి మొగుడువే కదా నువ్వు’’ అని చంద్రను ఉద్దేశించి అంటూ, ‘‘బయట జ్వాలా అనే వాళ్లున్నారేమో చూడు.. ఉంటే పిలువ్’’ అని అంతే నిర్లక్ష్యంగా కానిస్టేబుల్‌కి చెప్పాడు ఇన్‌స్పెక్టర్.

జ్వాలా వాళ్లూ వచ్చారు. చంద్రకు విషయం మొత్తం అర్థమైంది. ‘ఓహో.. 498 ఏ పెట్టారన్నమాట’అనుకున్నాడు మనసులో! జ్వాలా తరపు  వాదనను, చంద్ర  ప్రతివాదనను విన్నాడు ఇన్‌స్పెక్టర్. అంతా విన్నాక అమ్మాయికే పెళ్లి ఇష్టంలేదనే కన్‌క్లూజన్ కనిపించింది, వినిపించింది, అర్థమైంది ఇన్‌స్పెక్టర్‌కి.  ‘రేపు.. మీ ఇద్దరికీ కౌన్సిలింగ్ ఉంది... ఉదయం పదకొండు గంటలకల్లా రండి’ అని చెప్పాడు ఇన్‌స్పెక్టర్.


ఏం కష్టం ఇది?
కొడుకు కోసం ఎదురుచూస్తూ గుమ్మంలోనే కూర్చుని ఉన్నారు చంద్ర తల్లిదండ్రులు. వాళ్లను చూడగానే ప్రాణం ఉసూరుమంది చంద్రకి. ‘‘ఏరా.. ఏమైంది?’’ ఆత్రంగా అడిగారు ఇద్దరూ ఒకేసారి. ‘‘ఏం లేదులే ’’ అంటూ అమ్మానాన్నలను డైనింగ్ హాల్లోకి తీసుకొచ్చాడు చంద్ర. వాళ్లను కూర్చోబెడుతూ.. ‘‘రాజీవీ..’’ అంటూ చెల్లెల్ని పిలిచాడు. ‘‘ఆ.. వస్తున్నా’’ అంటూ వచ్చిందామె.  ‘‘నాన్నకు టాబ్లెట్ వేశావా?’’ అడిగాడు. ‘‘వేశానన్నయ్యా.. అమ్మే ఏం తినలేదు’’ అంది రాజీవి. వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ అక్కడినుంచి బాల్కనీలోకి వెళ్లిపోయాడు చంద్ర. మూడు నెలల కిందట జరిగినవన్నీ ఒకటొకటిగా గుర్తొస్తున్నాయి అతనికి!
   
అపరిచితురాలేం కాదు
జ్వాల.. తన తల్లి వైపు దూరపు బంధువుల అమ్మాయి. పోలీస్‌స్టేషన్‌లో పెద్దపెద్దగా అరిచిన జ్వాల మేనమామే ఆ సంబంధం తీసుకొచ్చాడు. రాజీవి పెళ్లయ్యాకే తాను చేసుకుందామనుకున్నాడు. కాని ఒప్పుకునే వరకు వాళ్లు వదల్లేదు. జ్వాలకేం తక్కువ. చక్కగా ఉంటుంది. బాగా చదువుకుంది. ఊ అనేసెయ్’’ అంటూ అమ్మా ఒప్పించింది. రాజీవికి, దుబాయ్‌లో ఉన్న అక్కకూ జ్వాల బాగా నచ్చింది. మొత్తానికి పెళ్లికి ఓకే అనేశాడు. కట్నం గురించిన మాటే రాలేదు. వాళ్లే ‘అదిస్తున్నాం, ఇదిస్తున్నాం’ అంటూ లాంఛనాలు ఇచ్చారు. జ్వాలకు గోల్డ్ పెట్టుకున్నారు. ఘనంగా పెళ్లి చేశారు. అక్కావాళ్లకు కుదరక పెళ్లికి రాలేదు. కానీ ఫోన్లో ఆడపిల్ల మనసు బాధపెట్టొద్దని జ్వాల గురించి ఎంత పాజిటివ్‌గా చెప్పింది! ఫస్ట్‌నైట్ ఇంట్లోనే ఏర్పాటు చేస్తే.. ‘‘మీరూ మీ చాదస్తాలు ఇక ఆపండి’ అంటూ తనే అక్కడి నుంచి ఇక్కడ ఓ స్టార్ హోటల్‌లో రూమ్ బుక్ చేసింది. అమ్మయితే తనకు తన అత్తగారిచ్చిన నగలన్నిటినీ కోడలికి పెట్టి చూసుకుని మహాలక్ష్మిలా ఉందని మురిసిపోయింది. ‘‘ఒరేయ్.. నువ్వూ, అమ్మాయి ఎటన్నా వెళ్లండిరా.. మళ్లీ రోటీన్‌లో పడిపోతే వెళ్లలేరు’’ అని నాన్న కూడా తన వెంటపడ్డాడు. అలాంటి నాన్న మీద జ్వాల వాళ్ల మేనమామ ఎలా నోరు పారేసుకున్నాడు?
 
పదహారు రోజుల పండగ

పెళ్లయి ముచ్చటగా మూడునెలలు అంతే. తను నాతో కలిసి ఉన్నది పదిహేను రోజులే. అసలు ఇంకా ఒకరికొకరు అర్థమే కాలేదు. అర్థం చేసుకునే ప్రయత్నం జ్వాలా చేయలేదు.. తనకూ చాన్స్ ఇవ్వలేదు. పెళ్లయినప్పటి నుంచీ ముభావంగానే ఉంది. తను ఎంత కల్పించుకొని మాట్లాడినా కట్టే, కొట్టే, తెచ్చే అన్నట్లే సమాధానమిచ్చింది తప్ప మనసు విప్పి మాట్లాడలేదు. ఫస్ట్‌నైట్ కూడా జరగలేదు. పదహారు రోజుల పండగకు వెళ్లి.. మళ్లీ రాలేదు. మూడు నెలల తర్వాత ఇదిగో ఇలా.. పోలీస్ కంప్లయింట్.. 498ఏ కేస్‌తో స్టేషన్లో కలిసింది. తను, తన తల్ల్లీతండ్రి, తన కుటుంబ సభ్యులు అందరం కలిసి ఆమెను కొట్టి, బట్టల బ్యాగ్‌తో బయటకు గెంటేశామని అభియోగం మోపింది. ఇదేమని అడగడానికి వచ్చిన జ్వాల అమ్మానాన్నల్నీ, బంధువులనూ నానా తిట్లు తిట్టామని అపవాదు. అసలు ఆరోజు తను ఊళ్లోనే లేడు. ఒక ఇంటర్వ్యూ కోసం బెంగళూరు వెళ్లాడు. పోలీస్‌లు ఫోన్ చేసి రాష్‌గా మాట్లాడుతున్నారని, పోలీస్ స్టేషన్‌కు రమ్మంటున్నారని చెల్లెలు ఫోన్ చేస్తే వెంటనే బయలుదేరాడు.
               
మర్నాడు ఇన్‌స్పెక్టర్ చెప్పిన టైమ్‌కి ఇద్దరూ స్టేషన్‌కి చేరుకున్నారు. అంతకుముందే జ్వాలతో మాట్లాడ్డానికి చాలా ప్రయత్నించాడు చంద్ర. తను మాట్లాడలేదు. ఆమె వైపు వాళ్లు. 50 లక్షలు ఇస్తే కేస్ విత్‌డ్రా చేసుకుంటామని బేరం బెట్టారు. లేకుంటే చిప్పకూడే అని భయపెట్టారు. ఆ రోజుకి కౌన్సిలింగ్ వాయిదా వేసి రెండు రోజుల తర్వాత రమ్మన్నారు. అప్పుడూ అదే ధోరణి. చంద్ర, వాళ్లవైపు వాళ్లను అరెస్ట్ చేయకుంటే ప్రైవేట్ కంప్లయింట్ వేసుకుంటామని పోలీసుల మీద ఒత్తిడి పెట్టారు.
 
కాళ్లా వేళ్లాపడితే 25 లక్షలకు దిగారు
సీనియర్ సిటిజన్స్ అనే కన్‌సర్న్‌తో చంద్ర తల్లిదండ్రులకు బెయిల్ ఇచ్చారు. నెలరోజుల్లో అతని చెల్లి పెళ్లి ఉండడంతో రాజీవికీ బెయిల్ దొరికింది. చంద్రను రిమాండ్ చేశారు. కొడుకును రిమాండ్‌కు పంపడంతో బేజారెత్తాడు చంద్ర తండ్రి. ‘‘50 లక్షలు ఇచ్చుకోలేను. ఇల్లు, నగలు అన్నీ తాకట్టు పెట్టి.. కొంత అప్పు తెచ్చి 25 లక్షలు మాత్రం ఇచ్చుకుంటాను నా కొడుకును వదలండి’’ అంటూ కాళ్లావెళ్లా పడ్డాడు చంద్ర తండ్రి. కూతురు పెళ్లి ఉంది.. తమ పరువు బజారుకీడ్చొద్దని బతిమాలుకున్నాడు. అయినా లాభం లేకపోయింది. మైల్డ్‌గా హార్ట్‌ఎటాక్ వచ్చింది ఆయనకు. హై బీపీతో చంద్ర తల్లీ మంచాన పడింది. తీవ్రమైన ప్రయత్నాలతో చంద్రకు బెయిల్ దొరికింది.
 
పెళ్లి ఇష్టం లేకే.. ఫోర్ నైంటీ ఎయిట్!
 దాదాపు రెండేళ్లు కేస్ నడిచింది. చంద్ర బెంగుళూరు వెళ్లిన నాటి ఫ్లయిట్ టిక్కెట్లు, అక్కడ తీసుకున్న హోటల్ రూమ్ బిల్, హాజరైన ఇంటర్వ్యూ, రాత పరీక్ష వివరాలు, హాల్‌టికెట్ అన్నిటినీ కోర్టు ముందుంచాడు చంద్ర తరపు లాయర్. అంతేకాదు.. అసలు అమ్మాయి, అబ్బాయి ఎన్నాళ్లు కలిసి ఉన్నారు? ఎక్కడో ఉన్న అక్క ప్రభావం వీళ్ల సంసారం మీద ఎంత ఉంది? నిజంగానే అమ్మాయి పై చేయిచేసుకున్నారా? అమ్మాయి వాళ్లు పెళ్లప్పుడు 30 లక్షలు కట్నంగా ఇచ్చామని చెప్పారు. నిజంగా ఇచ్చారా? ఇచ్చినట్టు తగిన సాక్ష్యాధారలున్నాయా... వంటి విషయాలన్నిటినీ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అన్నీ అబద్ధమనే తేలాయి. కేసు నిలవలేదు. చంద్ర నిర్దోషిగా తేలాడు. మరి జ్వాల ఎందుకు అబద్ధం చెప్పింది? తనకు చంద్రతో పెళ్లి ఇష్టం లేక. ఆ విషయాన్ని పెళ్లికి ముందే చెప్పి ఉంటే హుందాగా తప్పుకునేవాడిని కదా.. నా కుటుంబాన్ని ఇంత బజారుకీడ్చాలా? ఇంత అవమానం చెయాలా? మా అక్కా, చెల్లి కూడా తనలాంటి ఆడపిల్లలే కదా.. మా అమ్మా తన తల్లిలాంటిదే కదా.. అని బాధపడ్డాడు చంద్ర.

 
 సెక్షన్ 498ఏ ఏం చెప్తోంది?
భర్త, అత్తమామలు, ఆడపడుచుల గుండెల్లో దడపుట్టించే సెక్షన్ 498ఏ. భర్త గాని, ఆయన కుటుంబ సభ్యులుగానీ భార్యను క్రూరంగా హింసిస్తే, క్రూరంగా ప్రవర్తిస్తే అది 498ఏ ప్రకారం నేరమవుతుంది. నేరం రుజువైతే మూడేళ్లు శిక్ష పడుతుంది. క్రూర ప్రవర్తన అంటే.. వివాహిత మహిళ ఆమెకై ఆమె ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితులు కల్పించడం,ఆమెకు తీవ్రమైన గాయాలు కలిగేలాగా లేక ఆమె ప్రాణానికి, అవయవాలకు లేక ఆరోగ్యానికి భంగం వాటిల్లేలా బుద్ధిపూర్వక ప్రవర్తన. (అది శారీరకమైనది కావచ్చు లేక మానసికమైనది కావచ్చు).
     
ఆస్తిని కాని, విలువైన వస్తువులను కాని తెమ్మని వేధించడం, తేకపోతే ఆమెను, ఆమె బంధువులను వేధించినా, అదనపు కట్నం కోసం మాటలతో, చేతలతో హింసించినా... అది క్రూరప్రవర్తనే అవుతుంది.    సెక్షన్ 324 డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961 ప్రకారం.. కట్నం ఇవ్వడం, తీసుకోవడం, ప్రోత్సహించడం కూడా నేరడమే. వధువు లేక వరుడి తల్లిదండ్రుల నుంచి గాని, వారి సంరక్షకుల నుంచి గాని ప్రత్యక్షంగా, పరోక్షంగా కట్నం డిమాండ్ చేస్తే అదీ నేరమే. ఈ నేరాలకు గరిష్టంగా అయిదేళ్లు, కనిష్టంగా ఆరునెలల నుంచి రెండేళ్ల వరకు శిక్ష, జరిమానా ఉంటాయి.

498ఏను ఒక రక్షణ కవచంలా ఉపయోగించుకోవాల్సిన మహిళలు దాన్ని ఓ ఆయుధంగా వాడుకుంటున్నారని సుప్రీంకోర్టు అనే సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేసింది. తగిన సాక్ష్యాధారాలు లేకుండా భర్తను, అత్తామామను, ఆడపడుచులను అరెస్ట్‌లు చేయరాదని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లో కొన్ని సవరణలు కూడా జరిగాయి. అలాగు కొందరు మహిళలు తీవ్రమైన ఆవేశానికి, ఫ్రస్ట్రేషన్‌కి లోనై కేసులు వేస్తున్నారని తద్వారా వివాహబంధాలు దెబ్బతింటున్నాయని భావించి కేస్ వేయగానే కౌన్సిలింగ్ నిర్వహించి సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
 
ఇ. పార్వతి, అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్
parvathiadvocate2015@gmail.com

 

 

- సరస్వతి రమ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement