నాకు, నా భార్యకి కలిపి కొంత ఆస్తి ఉండేది. వయసు అయిపోతుంది అని మా ఇద్దరి పిల్లలకి సమానంగా పంచుతూ గిఫ్ట్ డీడ్ చేశాము. అందులో ప్రస్తుతం మేము ఉంటున్న ఇల్లు కూడా వుంది. గిఫ్ట్ ఇచ్చి నాలుగు సంవత్సరాలు అవుతుంది. మా పిల్లల మధ్య వచ్చిన మనస్పర్థల వల్ల మమ్మల్ని పట్టించుకోవడం లేదు. పరస్పరం తగాదా పడుతున్నారు. మాకు ఇదంతా చాల ఇబ్బందిగా మారింది. మేము ఇచ్చిన గిఫ్టు తిరిగి తీసుకోవాలి అనుకుంటున్నాము. పరిష్కారం తెలుపగలరు.
– నరసింహ శర్మ, గుంటూరు
ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ (ఆస్తి బదిలీ చట్టం) ప్రకారం ఒకసారి ఆస్తిని బదిలీ చేసిన తర్వాత, అది గిఫ్ట్ (బహుమతి) అయినప్పటికీ, సాధారణ పరిస్థితులలో రీవోకేషన్ (రద్దు చేయటం) సాధ్యపడదు. ఒకవేళ మీరు గిఫ్ట్‌గా ఇస్తున్న ఆస్తిని ఏదైనా కారణంచేత భవిష్యత్తులో తిరిగి తీసుకోవాలి అని మీరు అనుకుంటే, అలాంటి నిబంధనని, ఎలాంటి పరిస్థితులలో తిరిగి తీసుకోవచ్చు అన్న అంశాలను గిఫ్ట్ డీడ్ లో పొందుపరచవలసి ఉంటుంది. అలా రద్దు చేసుకోవచ్చు అని మీరు పేర్కొన్న సందర్భం ఎదురైతే, రద్దునకు తగు చర్యలు చట్టపరంగా తీసుకోవచ్చు.
మీరు సీనియర్ సిటిజన్ అని అర్థం అవుతోంది. అందుకే మీకు అదనంగా తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం కింద కూడా కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. మీ పిల్లలు మిమ్మల్ని పట్టించుకోవడం లేదు కనుక, మీరు చేసిన గిఫ్ట్ రిజిస్ట్రేషన్ పత్రంలో సదరు ‘గిఫ్టు తల్లిదండ్రులు, వయో వృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం నిబంధనలకు లోబడి ఉంటుంది’ అనే అర్థం వచ్చేట్టు రాసుకుని వుంటే గనుక, మీరు ఇచ్చిన గిఫ్టును సులభంగా రద్దు చేసుకోవచ్చు లేదా ఉపసంహరించవచ్చు అంటే తిరిగి వెనక్కి తీసుకోవచ్చు. అలా కాకపోయినా తిరిగి తీసుకునే అవకాశం ఉందా లేదా అనే విషయం, కేవలం మీ పత్రాలు చూసిన తర్వాత మాత్రమే చెప్పగలం.
తల్లిదండ్రులు – వయోవృద్ధులు తమ పిల్లలకి, కుటుంబ సభ్యులకు, మరే ఇతర వారసులకు లేదా మీరు ఆస్తి గిఫ్టు గా ఇవ్వాలి అనుకునే ఎవరికైనా సరే, గిఫ్టు డీడ్ (బహుమాన పత్రం/ఒప్పందం) లో కనీసం పైన పేర్కొన్న చట్టానికి ఆ గిఫ్టు లోబడి ఉంటుంది అని రాసుకోవటం ఉత్తమం. మీ వారసులు ఏదో చేస్తారు అని కాదు కానీ, మీ ప్రయోజనార్థం ఈ సూచన ఇస్తున్నాను.
– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది
మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment