Gift deed
-
Gift Deed: ముందే పకడ్బందీగా రాసుకోవాలి
నాకు, నా భార్యకి కలిపి కొంత ఆస్తి ఉండేది. వయసు అయిపోతుంది అని మా ఇద్దరి పిల్లలకి సమానంగా పంచుతూ గిఫ్ట్ డీడ్ చేశాము. అందులో ప్రస్తుతం మేము ఉంటున్న ఇల్లు కూడా వుంది. గిఫ్ట్ ఇచ్చి నాలుగు సంవత్సరాలు అవుతుంది. మా పిల్లల మధ్య వచ్చిన మనస్పర్థల వల్ల మమ్మల్ని పట్టించుకోవడం లేదు. పరస్పరం తగాదా పడుతున్నారు. మాకు ఇదంతా చాల ఇబ్బందిగా మారింది. మేము ఇచ్చిన గిఫ్టు తిరిగి తీసుకోవాలి అనుకుంటున్నాము. పరిష్కారం తెలుపగలరు.– నరసింహ శర్మ, గుంటూరుట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ (ఆస్తి బదిలీ చట్టం) ప్రకారం ఒకసారి ఆస్తిని బదిలీ చేసిన తర్వాత, అది గిఫ్ట్ (బహుమతి) అయినప్పటికీ, సాధారణ పరిస్థితులలో రీవోకేషన్ (రద్దు చేయటం) సాధ్యపడదు. ఒకవేళ మీరు గిఫ్ట్‌గా ఇస్తున్న ఆస్తిని ఏదైనా కారణంచేత భవిష్యత్తులో తిరిగి తీసుకోవాలి అని మీరు అనుకుంటే, అలాంటి నిబంధనని, ఎలాంటి పరిస్థితులలో తిరిగి తీసుకోవచ్చు అన్న అంశాలను గిఫ్ట్ డీడ్ లో పొందుపరచవలసి ఉంటుంది. అలా రద్దు చేసుకోవచ్చు అని మీరు పేర్కొన్న సందర్భం ఎదురైతే, రద్దునకు తగు చర్యలు చట్టపరంగా తీసుకోవచ్చు. మీరు సీనియర్ సిటిజన్ అని అర్థం అవుతోంది. అందుకే మీకు అదనంగా తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం కింద కూడా కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. మీ పిల్లలు మిమ్మల్ని పట్టించుకోవడం లేదు కనుక, మీరు చేసిన గిఫ్ట్ రిజిస్ట్రేషన్ పత్రంలో సదరు ‘గిఫ్టు తల్లిదండ్రులు, వయో వృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం నిబంధనలకు లోబడి ఉంటుంది’ అనే అర్థం వచ్చేట్టు రాసుకుని వుంటే గనుక, మీరు ఇచ్చిన గిఫ్టును సులభంగా రద్దు చేసుకోవచ్చు లేదా ఉపసంహరించవచ్చు అంటే తిరిగి వెనక్కి తీసుకోవచ్చు. అలా కాకపోయినా తిరిగి తీసుకునే అవకాశం ఉందా లేదా అనే విషయం, కేవలం మీ పత్రాలు చూసిన తర్వాత మాత్రమే చెప్పగలం.తల్లిదండ్రులు – వయోవృద్ధులు తమ పిల్లలకి, కుటుంబ సభ్యులకు, మరే ఇతర వారసులకు లేదా మీరు ఆస్తి గిఫ్టు గా ఇవ్వాలి అనుకునే ఎవరికైనా సరే, గిఫ్టు డీడ్ (బహుమాన పత్రం/ఒప్పందం) లో కనీసం పైన పేర్కొన్న చట్టానికి ఆ గిఫ్టు లోబడి ఉంటుంది అని రాసుకోవటం ఉత్తమం. మీ వారసులు ఏదో చేస్తారు అని కాదు కానీ, మీ ప్రయోజనార్థం ఈ సూచన ఇస్తున్నాను.– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. -
ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ నేత దేవినేని ఉమా హైడ్రామా
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి వన్ సెంటర్లో టీడీపీ నేతలు హైడ్రామా సృష్టించారు. దేవినేని ఉమా కార్యకర్తలతో కలిసి డ్రామా పాలిటిక్స్ నడిపారు. ప్రస్తుతం టీడీపీ ఆఫీస్ ఉన్న స్థలాన్ని చిన్నాకు అతని తల్లి శేషారత్నం గిఫ్ట్ డీడ్‌గా ఇచ్చింది. అయితే కుమారుడు తల్లిని పట్టించుకోవడంతో ఇప్పుడు కలెక్టర్ ద్వారా శేషారత్నం గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ స్థలంలో ఉన్న టీడీపీ ఆఫీస్‌ను ఖాళీ చేయాలని కోరింది. అయితే ఖాళీ చేసేదిలేదంటూ దేవినేని ఉమా ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చదవండి: (ఏ ముహూర్తాన పార్టీ లేదు.. బొక్కా లేదు అన్నాడో కానీ.. నిజంగానే..!) -
పొరుగింట్లో అల్లాను చూసింది
హజ్ చేయడాన్ని ముస్లింలు జీవిత పరమావధిగా భావిస్తారు. వృద్ధాప్యంలో ఇందుకోసం కలలు కనే పెద్దలు లక్షల్లో ఉంటారు. కేరళకు చెందిన జాస్మిన్‌కు 28 సెంట్ల భూమి (1350 గజాలు) ఉంది. దాన్ని అమ్మి భర్తతో హజ్‌కు వెళ్లాలని ఏర్పాట్లు చేసుకుంటోంది. కాని ఆ సమయంలో ఆమె దృష్టి పొరుగింటిపై పడింది. ఆ ఇంట్లో ఉంటున్న నిరుపేదలు సొంతిల్లు లేక అవస్థ పడుతూ కనిపించారు. పొరుగువారికి సాయం చేయమనే కదా అల్లా కూడా చెప్పాడు అని హజ్‌ను మానుకుంది. తన స్థలం మొత్తాన్ని కేరళ ప్రభుత్వం చేపట్టిన నిరుపేదల గృహపథకానికి ఇచ్చేసింది. కొందరు పొరుగువారిలో దేవుణ్ణి చూస్తారు. మానవత్వమే దైవత్వం అని చాటి చెబుతారు. బాల సాహిత్యంలో ఈ కథ కనిపిస్తుంది. అరేబియాలోని ఒక ఊళ్లో చాలా పేద కుటుంబం ఉంటుంది. ఆ ఇంట్లోని ఇద్దరు చిన్నారి ఆడపిల్లలకు ఆ వేళ చాలా ఆకలిగా ఉంటుంది. తల్లికి ఏం వండి పెట్టాలో తెలియదు. ఇంట్లో ఒక్క నూక గింజ కూడా లేదు. పని వెతుక్కుంటూ దేశం మీదకు వెళ్లిన తండ్రి ఏమయ్యాడో ఏమో. ఆకలికి తాళలేని ఆ పిల్లలు ఏం చేయాలో తోచక వీధిగుండా నడుచుకుంటూ వెళుతుంటే ఒక పిట్ట చచ్చిపడి ఉంటుంది. ఇస్లాంలో చనిపోయిన దానిని తినడం ‘హరాం’ (నిషిద్ధం). కాని విపరీతమైన ఆకలితో ఉన్న ఆ పిల్లలు ఆ చనిపోయిన పిట్టను ఇంటికి తీసుకొస్తే తల్లి చూసి ‘అయ్యో... బంగారు తల్లులూ మీకెంత ఖర్మ పట్టింది’ అని వేరే గత్యంతరం లేక ఆ పిట్టనే శుభ్రం చేసి, పొయ్యి రాజేసి, సట్టిలో ఉప్పుగల్లు వేసి ఉడికించడం మొదలెడుతుంది. ఆశ్చర్యం... సట్టిలో నుంచి ఎలాంటి సువాసన రేగుతుందంటే చుట్టుపక్కల వాళ్లందరికీ ‘ఆహా.. ఎవరు ఏం వండుతున్నారు... ఇంత మంచి వాసన వస్తోంది’ అనిపించింది. ఈ పేదవాళ్ల ఇంటి పక్కనే ఉన్న షావుకారు భార్యకు కూడా అలాగే అనిపించి, కూతురిని పిలిచి ‘పొరుగింట్లో ఏదో ఒండుతున్నారు. అదేమిటో కనుక్కునిరా’ అని పంపిస్తుంది. షావుకారు కూతురు పొరుగింటికి వచ్చి ‘ఏం వండుతున్నారు... ఇంత మంచి వాసన వస్తోంది’ అనడిగితే ‘చచ్చిన పిట్టను వండుకుని తింటున్నాం’ అని చెప్పడానికి నామోషీ వేసిన ఆ తల్లి ‘మీకు హరాం (తినకూడనిది)... మాకు హలాల్ (తినదగ్గది) వండుతున్నాం’ అంటుంది. వెనక్కు వచ్చిన షావుకారు కూతురు అదే మాట తల్లితో అంటే ఆమెకు కోపం వస్తుంది. ‘అరె... వారు తినదగ్గది మేము తినకూడనిది ఏముంటుంది’ అని భర్తకు కబురు పెట్టిస్తుంది. భర్త రాగానే పొరుగింటి అవమానాన్ని చెప్పి ‘వారేదో తినదగ్గది తింటున్నారట... మనం దానిని తినకూడదట... ఏంటది’ అని కోపం పోతుంది. భర్త ఆలోచనాపరుడు. పొరుగింటికి వెళ్లి ఆరా తీస్తే ఆ పేదతల్లి ‘అయ్యా... మీరు షావుకార్లు. చచ్చినవాటిని తినకూడదు. హరాం. మేము పేదవాళ్లం. ఆకలికి తాళలేక అలాంటివి తినొచ్చు. హలాల్. అందుకనే అలా చెప్పాను’ అని కన్నీరు కారుస్తుంది. ఆ సమయానికి ఆ షావుకారు హజ్‌కు వెళ్లడానికి సిద్ధం అవుతూ ఉంటాడు. అతడు తన హజ్ డబ్బు మొత్తాన్ని ఆ పేదరాలికి ఇచ్చి హజ్ మానుకుంటాడు. కాని ఆ సంవత్సరం హజ్‌కు వెళ్లిన ఇరుగుపొరుగు వారికి కాబా చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న ఆ షావుకారు కనిపించి ఆశ్చర్యం వేస్తుంది. అంటే వెళ్లిన పుణ్యం దక్కిందని అర్థం. అదీ కథ. కేరళలో అచ్చు ఇలాగే జరిగింది. అక్కడి పత్థానంతిట్ట జిల్లాలోని అరన్మలలో 48 ఏళ్ల జాస్మిన్‌కు ఎప్పటి నుంచో హజ్‌కు వెళ్లాలని కోరిక. భర్త హనీఫా (57) కు కూడా అదే కల. అయితే ఆ కల నెరవేర్చుకోవడానికి కావలసినంత డబ్బు లేదు. జాస్మిన్‌కు తండ్రి నుంచి సంక్రమించిన 28 సెంట్ల భూమి అదే ఊళ్లో ఉంది. దానిని అమ్మి ఆ డబ్బుతో హజ్‌కు వెళ్లాలని భార్యాభర్తలు నిశ్చయించుకున్నారు. ఈలోపు కోవిడ్ వచ్చింది. చాలామంది కష్టాలు పడ్డారు. జాస్మిన్ ఇరుగుపొరుగున అద్దె ఇళ్లల్లో నివసించే మధ్యతరగతి వారు అద్దె చెల్లించలేని ఆర్థిక కష్టాలకు వెళ్లారు. తినడానికి ఉన్నా లేకపోయినా నీడ ఉంటే అదో పెద్ద ధైర్యం అని వారి మాటలు జాస్మిన్ను తాకాయి. అదే సమయంలో కేరళలో ‘లైఫ్ మిషన్’ పేరుతో పేదలకు ఇళ్లు కట్టి ఇచ్చే పథకం మొదలైంది. ఈ పథకం కోసం ప్రభుత్వం ప్రజలను కూడా స్థలాలు ఇమ్మని కోరింది. జాస్మిన్ భర్తతో చర్చించి ‘పేదల ఇళ్ల కోసం మన స్థలం ఇస్తే అల్లా కూడా సంతోషపడతాడు’ అని చెప్పి, హజ్ యాత్ర మానుకుని, ఆ స్థలాన్ని ప్రభుత్వ పరం చేసింది. మొన్నటి ఆదివారం కేరళ ఆరోగ్యశాఖా మంత్రి వీణా జార్జి స్వయంగా జాస్మిన్ ఇంటికి వచ్చి ఆమెను అభినందించింది. జాస్మిన్, హనీఫా చూపిన ఔదార్యానికి ప్రశంసలు లభిస్తున్నాయి. అన్నట్టు హజ్‌కు వెళ్లాలని వెళ్లలేకపోయిన వృద్ధ జంట కథతో 2011లో మలయాళంలో తీసిన ‘అడమింటె మకన్ అబు’ సినిమా ప్రశంసలు అందుకుంది. అందులో ముఖ్యపాత్రలో నటించిన సలీం కుమార్‌కు జాతీయ అవార్డు దక్కింది. మన తెలుగు జరీనా వహాబ్ది మరో ముఖ్యపాత్ర. కేరళలో ఇప్పుడు ఈ సినిమాను కూడా గుర్తు చేసుకుంటున్నారు. -
గోల్డ్ ఈటీఎఫ్, సావనీర్ గోల్డ్ బాండ్ ఏది బెటర్?
ఒక మ్యూచువల్ ఫండ్ పథకంలో నాకు పెట్టబడులు ఉన్నాయి. వీటిని ఎవరికైనా బహుమతిగా ఇవ్వొచ్చా? – శ్రీలలిత మ్యూచువల్ ఫండ్స్ పథకంలోని యూనిట్లు ఒకరికి బదిలీ చేయడం కానీ, బహుమతిగా ఇవ్వడం కానీ కుదరదు. ఇన్వెస్టర్ తన పేరిట ఉన్న యూనిట్లు వేరొకరికి బదిలీ చేయడం అన్నది కేవలం.. ఇన్వెస్టర్ మరణించిన సందర్భాల్లోనే చోటు చేసుకుంటుంది. అటువంటి సందర్భంలో నామినీ క్లెయిమ్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు ఇన్వెస్టర్ మరణ ధ్రువీకరణ పత్రం, కేవైసీ డాక్యుమెంట్లను సమర్పించాలి. అన్నింటినీ పరిశీలించిన తర్వాత మ్యూచువల్ ఫండ్ యూనిట్లను నామినీ పేరుమీదకు అప్పుడు బదలాయిస్తారు. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను పిల్లలకు బహుమతిగా ఇవ్వాలని అనుకుంటే నేరుగా వారి పేరుతో ఇన్వెస్ట్ చేయడం ఒక్కటే మార్గం. పిల్లల వయసు 18 ఏళ్లలోపు ఉన్నా ఇది సాధ్యపడుతుంది. అటువంటప్పుడు పిల్లలు మేజర్ అయ్యే వరకు తల్లిదండ్రులే సంబంధింత పెట్టుబడులపై సంరక్షకులుగా నిర్ణయాధికారం కలిగి ఉంటారు. పిల్లల పుట్టిన తేదీ సర్టిఫికెట్‌తోపాటు, గార్డియన్ కేవైసీ వివరాలను మ్యూచువల్ ఫండ్ సంస్థ అడుగుతుంది. పిల్లల పేరిట (మైనర్లు) ఉన్న మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను విక్రయించగా వచ్చిన ఆదాయం.. తల్లిదండ్రుల ఆదాయానికి కలిపి చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ పిల్లల వయసు 18 ఏళ్లు నిండిన తర్వాత పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే అది వారి వ్యక్తిగత ఆదాయం కిందకే వస్తుంది. మీ పేరిట ఉన్న మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులను పిల్లలకు బహుమతిగా ఇవ్వాలనుకుంటే, పిల్లల వయసు 18 ఏళ్లు నిండి ఉంటే అందుకు మార్గం లేదు. మీ పేరిట ఉన్న పెట్టుబడులను విక్రయించేసి, వచ్చిన మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాకు బదిలీ చేయాలి. ఆ తర్వాత వారి పేరిట కొనుగోలు చేసుకోవాలని సూచించడమే మార్గం. మూడో వ్యక్తి (థర్డ్ పార్టీ) నుంచి పెట్టుబడిని ఫండ్స్ సంస్థలు ఆమోదించవు. మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లు కొనుగోలు చేస్తున్న వ్యక్తి స్వయంగా ఆ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. కనుక బహుమతిగా ఇవ్వాలనుకునే వారికి నగదు బదిలీ చేసి, కొనుగోలు చేసుకోవాలని సూచించడమే మార్గం. గోల్డ్ ఈటీఎఫ్‌లతో సావరీన్ గోల్డ్ బాండ్లను పోల్చి చూడడం ఎలా? ఎస్‌జీబీలు మెరుగైన ఆప్షనేనా? - జోసెఫ్ బంగారంలో ఇన్వెస్ట్ చేయాలని భావించే వారికి ఈటీఎఫ్‌లతో పోలిస్తే సావరీన్ గోల్డ్ బాండ్లు (ఎస్‌జీబీలు) మెరుగైన ఆప్షన్ అవుతాయి. ఎస్‌జీబీలో ఇన్వెస్ట్ చేస్తే వార్షికంగా 2.5 శాతం వడ్డీ లభిస్తుంది. బంగారం ధరల్లో వృద్ధికి ఇది అదనపు ప్రయోజనం. కానీ, గోల్డ్ ఈటీఎఫ్‌లు అలా కాదు. మార్కెట్ ధరల పరంగా వచ్చిన లాభం ఒక్కటే ప్రయోజనం. ఎస్‌జీబీల్లో వడ్డీని అదనపు ప్రయోజనం కింద చూడాలి. ఎస్‌బీజీలను కొనుగోలు చేయడం వల్ల ఎటువంటి వ్యయాలు, నిర్వహణ చార్జీల్లేవు. గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ఎక్స్పెన్స్ రేషియో పేరిట ఒక శాతం కోల్పోవాల్సి వస్తుంది. పన్నుల పరంగా చూసినా ఎస్‌జీబీలు మెరుగైనవి. ఎస్‌జీబీల్లో బంగారం ధరల వృద్ధి రూపంలో వచ్చే లాభంపై పన్ను లేదు. 8 ఏళ్ల కాల వ్యవధి పూర్తయ్యే వరకు ఉంచుకుంటేనే ఈ ప్రయోజనం. ఎస్‌జీబీలో పెట్టుబడిపై ఏటా స్వీకరించే 2.5 శాతం వడ్డీ ఆదాయం మాత్రం పన్ను వర్తించే ఆదాయం పరిధిలోకి వస్తుంది. ఇన్వెస్టర్ల ఆదాయం పన్ను పరిధిలో ఉంటేనే ఎస్‌జీబీల లాభంపై పన్ను పడుతుంది. గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో లాభం మూలధన లాభాల పన్ను పరిధిలోకి వస్తుంది. అది కూడా ఈక్విటీయేతర మూలధన లాభాల పన్ను అమలవుతుందని గుర్తుంచుకోవాలి. ఒక్కలిక్విడిటీ విషయంలోనే ఎస్‌జీబీలు ఈటీఎఫ్‌ల కంటే దిగువన ఉంటాయి. ఎస్జీబీలను ఐదేళ్ల తర్వాత నుంచి ఆర్బీఐకి స్వాధీనం చేసి పెట్టుబడిని పొందొచ్చు. ఐదేళ్లలోపు అయితే స్టాక్ ఎక్సేంజ్‌ల్లో విక్రయించుకోవాలి. ఇక్కడ లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. గోల్డ్ ఈటీఎఫ్‌లు అలా కాదు. వాటికి లిక్విడిటీ తగినంత ఉంటుంది. కనుక గడువులోపు విక్రయించుకోవాల్సిన అవసరం లేని వారికి ఎస్‌జీబీలు మెరుగైనవి. - ధీరేంద్ర కుమార్ (సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్) చదవండి: కష్టపడినా.. ఆదాయం పెరగడం లేదా? అయితే.. -
మరణించిన టీచర్ పేరుతో రూ.33 లక్షలు డ్రా... కొడుక్కి విషయం తెలియడంతో..
సాక్షి, హైదాబాద్: ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలి మరణానంతరం ఆమె పేరుతో నకిలీ గిఫ్ట్ డీడ్ సృష్టించిన ఇద్దరు వ్యక్తులు ఆమెతో పాటు ఆమె భర్త బ్యాంకు ఖాతాల్లోని రూ.33.5 లక్షలు కాజేశారు. దీనిపై ఆమె కుమారుడి ఫిర్యాదు మేరకు మలక్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.తదుపరి దర్యాప్తు నిమిత్తం నగర నేర పరిశోధన విభాగానికి (సీసీఎస్) బదిలీ చేయడంతో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. యాకత్‌పుర ప్రాంతానికి చెందిన మహ్మద్ అక్తర్ హుస్సేన్ ఆరోగ్య శాఖ పరిధిలోని స్టేట్ హెల్త్ ట్రాన్స్‌ఫోర్ట్ ఆర్గనైజేషన్‌లో సర్వీస్ ఇంజినీర్‌గా పని చేశారు. 2003లో రిటైర్ అయిన ఆయన 2015 అక్టోబర్‌లో చనిపోయారు. అక్తర్ భార్య నూర్జహాన్ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. 2020 జూన్ 2న ఆమె కన్నుమూశారు. గజ్వేల్ జిల్లా నుంచి వచ్చి ఆసిఫ్‌నగర్ ప్రాంతంలో నివసిస్తున్న అన్నదమ్ములు మహ్మద్ సమియుద్దీన్, ఫసియుద్దీన్‌లు నూర్జహాన్ పేరుతో నకిలీ గిఫ్ట్ డీడ్ రూపొందించారు. వీటిని రెండు బ్యాంకుల్లో సమర్పించి నూర్జహాన్ ఖాతాలకు సంబంధించిన ఏటీఎం కార్డులు పొందారు. ఓ బ్యాంకుల్లో ఉన్న నూర్జహాన్ ఖాతా నుంచి రూ.3.5 లక్షలు, మరో బ్యాంకులో ఉన్న అక్తర్ ఖాతా నుంచి రూ.30 లక్షలు దఫదఫాలుగా డ్రా చేసుకుని స్వాహా చేశారు. విషయం తెలుసుకున్న నూర్జహాన్ కుమారుడు జకీర్ హుస్సేన్ మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. తన తల్లి ఏ సందర్భంలోనూ ఎవరికీ హిబా ఇవ్వలేదని, ఆ పేరుతో నిందితులు తప్పుడు పత్రాలు సృష్టించారని జకీర్ ఆరోపించారు. ఈ మేరకు నమోదైన కేసును మలక్‌పేట పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం సీసీఎస్‌కు బదిలీ చేశారు. దీంతో దీన్ని రీ–రిజిస్టర్ చేసుకున్న సీసీఎస్ ఏసీపీ ఎం.శ్రీనివాస్ రావు దర్యాప్తు ప్రారంభించారు. -
‘మహా’ గిఫ్ట్..
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) అనుమతినిచ్చిన లేఅవుట్లలో ‘గిఫ్ట్ డీడ్’ కింద వచ్చిన భూమిని ఈ నెలాఖరు నాటికి వేలం వేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ప్లానింగ్ విభాగం, ఎస్టేట్ విభాగ అధికారులు కలిసి ఆయా లేఅవుట్లను జియో ట్యాగింగ్ చేస్తున్నారు. ఇప్పటికే 39 లేఅవుట్లలోని ప్లాట్లు, భూమికి జియో ట్యాగింగ్ పూర్తి చేశారు. మరో మూడు రోజుల్లో మిగతా ప్లాట్లకు ట్యాగింగ్ పూర్తి చేసి నెలాఖరు నాటికి ఈ–వేలం నోటిఫికేషన్ విడుదల చేసే దిశగా సన్నాహలు చేస్తున్నారు. కబ్జాలకు చెక్.. కాసుల వర్షం ప్రభుత్వం నుంచి అధికారిక అనుమతి రావడంతో గతంలో హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన లేఅవుట్లలోని ప్లాట్లు, ఉప్పల్ భగాయత్ ప్లాట్లు తొలుత వేలం వేయాలని భావించారు. కబ్జా కోరల్లో చిక్కుకుని ఖాళీగా ఉంటున్న గిఫ్ట్ డీడ్ భూములు విక్రయిస్తే ఇటు సంస్థకు ఆదాయం సమకూరడంతో పాటు సంరక్షించే ఒత్తిడి తగ్గుతుందని యోచించారు. కొన్నిచోట్ల కొంత మంది స్థలం అక్రమించిన సందర్భాలుండడంతో గిఫ్ట్‌డీడ్ భూములను అమ్మాలని నిర్ణయించారు. తదనుగుణంగా ఆయా లేఅవుట్లలోని ప్లాట్లు, భూములకు జియో ట్యాగింగ్ పనులను వేగిరం చేశారు. కొన్ని ప్రాంతాల్లోని మూడెకరాల భూములను ఏకంగా విల్లాలు నిర్మించే అవకాశముండటంతో వారికే ఎక్కువ ధరకు విక్రయించాలన్న ఆలోచన కూడా చేస్తున్నారు. ‘ప్రభుత్వ జీఓ 33 నంబర్ ప్రకారం హెచ్ఎండీఏ అనుమతిచ్చిన లేఅవుట్లో మూడు శాతం, గేటెడ్ కమ్యూనిటీ, గ్రూప్ హౌసింగ్‌లోనైతే మూడు నుంచి ఐదు శాతం భూమిని హెచ్ఎండీఏకు గిఫ్ట్‌డీడ్ చేస్తారు. పార్కులు, రోడ్డు, మౌలిక వసతులతో సంబంధం లేకుండా ఈ భూమిని హెచ్ఎండీఏ పేరున యజమాని రిజిస్టర్ చేస్తారు. ఈ భూమిని అమ్ముకునే అధికారం హెచ్ఎండీఏకు ఉంది. గతంలో భూములకు తక్కువ రేటు ఉండటంతో చాలా మంది భూములను గిఫ్ట్ డీడ్ చేసేందుకు సుముఖత చూపారు. ఇప్పుడు ఆ భూములే హెచ్ఎండీఏకు భారీ ఆదాయం సమకూర్చబోతున్నాయ’ని ప్లానింగ్ విభాగ అధికారులు తెలిపారు. వీటితో పాటు ఉప్పల్ భగాయత్, హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన లేఅవుట్లలోని ప్లాట్లు విక్రయిస్తే రూ.వెయ్యి కోట్ట వరకు హెచ్ఎండీఏకు ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఔటర్ నిర్వాసితులకు గిఫ్ట్‌డీడ్ భూములు.. ఔటర్ రింగ్ రోడ్డు కోసం భూములిచ్చిన వందలాది మంది రైతులకు భూమికి భూమిని హెచ్ఎండీఏ అధికారులు కేటాయించారు. కాగా, 27 మంది రైతులకు భూములిస్తామంటే ఎక్కడ కూడా అందుబాటులో లేకుండాపోయాయి. దీంతో ఆయా రైతులకు దాదాపు 27 వేల గజాలను శ్రీనగర్‌లోని లే అవుట్లలో ఉన్న గిఫ్ట్‌డీడ్ భూములను కేటాయించాలని అధికారులు నిర్ణయించారు. -
గిఫ్ట్ డీడ్‌పై తగ్గిన స్టాంపు డ్యూటీ
5 శాతం నుంచి 4 శాతానికి తగ్గింపు సాక్షి, హైదరాబాద్: రక్త సంబంధీకులు కాని వారి మధ్య జరిగే గిఫ్ట్ డీడ్ (దాన విక్రయం) లావాదేవీలపై వసూలు చేస్తున్న స్టాంపు డ్యూ టీని 5 శాతం నుంచి 4 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు సీఎం కిరణ్ బుధవారం ఆమోదం తెలిపారు. సాధారణ లావాదేవీలపై ప్రస్తుతం 4 శాతం స్టాంపు డ్యూటీ వసూలు చేస్తుండటం తెలిసిందే. గిఫ్ట్ డీడ్ లావాదేవీలపై 5 శాతం హేతుబద్ధం కాదంటూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ తగ్గింపు ప్రతిపాదన చేసింది. రక్త సంబంధీకుల మధ్య జరిగే గిఫ్ట్ డీడ్ లావాదేవీల మీద ప్రస్తుతం 3 శాతం స్టాంపు డ్యూటీ ఉన్న విషయం తెలిసిందే. మార్పిడి దస్తావేజులపై కూడా స్టాంపు డ్యూటీని 5 నుంచి 4 శాతానికి తగ్గించారు. సెటిల్మెంట్ డీడ్‌పై 6 శాతం నుంచి 4 శాతానికి తగ్గించారు.