భార్య పెట్టిన వేధింపులు భరించలేక అతుల్ సుభాష్ అనే బెంగళూరు టెక్కీ బలవనర్మణానికి పాల్పడడం.. నెట్టింట తీవ్ర చర్చకు దారి తీసింది. తాను రాసిన సూసైడ్ నోట్ దేశ సర్వోన్నత న్యాయస్థానానికి చేరాలన్నది అతని కోరిక. అయితే ఈ ఘటన జరిగి 48 గంటలు గడవకముందే.. వైవాహిక చట్టాల దుర్వినియోగంపై సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
న్యూఢిల్లీ: వ్యక్తిగత పగలతో భర్త, అతని కుటుంబంపై ఓ మహిళ ‘‘వరకట్న వ్యతిరేక చట్టం’’ ప్రయోగించడాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. ఇది అవసరంగా భర్తలను వేధించడం కిందకే వస్తుందని, ఇలాంటి కేసుల విషయంలో ఇకపై తీవ్రంగా స్పందించాల్సి వస్తుందని హెచ్చరించింది.
‘‘498ఏ సెక్షన్(వరకట్న వ్యతిరేక చట్టం).. గృహ హింస, వరకట్న వేధింపుల నుంచి మహిళలకు రక్షణ కల్పించడానికే. కానీ, ఈ మధ్యకాలంలో మార్పు కనిపిస్తోంది. చాలామంది మహిళలు తమ గొంతెమ్మ కోర్కెలు నెరవేర్చుకోవడానికి దీనొక్క ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారు. ఇలాంటి ధోరణిని ఎంతమాత్రం సహించబోం’’ అని జస్టిస్ బీవీ నాగరత్న, ఎన్ కోటీశ్వర్ సింగ్‌ల ధర్మాసనం పేర్కొంది.
ఇదీ చదవండి: పేజీల కొద్దీ సూసైడ్ నోట్.. కదిలించిన ఓ భర్త గాథ
తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి తన భార్య నుంచి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. అయితే ఆ తర్వాత ఆ భార్య.. భర్త, అతని కుటుంబం తనను వేధిస్తోందంటూ 498ఏ కింద వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఆ భర్త హైకోర్టును ఆశ్రయించినా.. ఊరట దక్కలేదు. దీంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. అయితే తమ పరిశీలనలో ఈ విషయం గుర్తించిన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
‘‘ఇక్కడ వ్యక్తిగత కక్షతో భర్తపై ఆమె చట్టాన్ని ఆయుధంగా ప్రయోగించాలనుకుంది. ఈ కేసులో భర్తపై నిరాధార ఆరోపణలు చేసిందామె. భర్తను, అతని కుటుంబాన్ని వేధించాలనే ఆమె ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి కేసుల్లో విచారణ సజావుగా జరగాలి. లేకుంటే.. చట్టప్రక్రియల దుర్వినియోగం జరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో తెలంగాణ హైకోర్టు విఫలమైంది. ఈ కేసును కొట్టివేయకపోవడం ఆ ఉన్నత న్యాయస్థానం చేసిన తీవ్ర తప్పిదం.’’ అని ద్విసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే..
అలాగని.. అన్ని కేసులపై తాము ఈ వ్యాఖ్య చేయడం లేదని, ఇలాంటి వైవాహిక చట్టాల్ని దుర్వినియోగం చేయడంపై మా ఆందోళన’’ అని న్యాయమూర్తులిద్దరూ స్పష్టం చేశారు.
ఐపీసీ సెక్షన్ 498ఏ.. జులై 1వ తేదీ నుంచి కాలం చెల్లింది. ఆ స్థానంలో భారతీయ న్యాయ సంహిత(BNS) సెక్షన్ 86 అందుబాటులోకి వచ్చింది. ఈ సెక్షన్ ప్రకారం గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. ఘటన జరిగిన మూడేళ్లలోపు ఎప్పుడైనా ఫిర్యాదు నమోదు చేయొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment