50 శాతం మించొద్దు | Telangana Govt Petition Dismissed In Supreme Court On BC Reservations | Sakshi
Sakshi News home page

50 శాతం మించొద్దు.. బీసీ కోటాపై రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురు

Oct 17 2025 1:02 AM | Updated on Oct 17 2025 1:02 AM

Telangana Govt Petition Dismissed In Supreme Court On BC Reservations

తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు.. 42% బీసీ కోటాపై రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురు

జీవో 9పై హైకోర్టు విధించిన స్టే ఎత్తివేతకు నిరాకరణ..  రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ కొట్టివేత

షెడ్యూల్డ్‌ ఏరియాల్లోనే కోటా పెంపు మినహాయింపులు ఉన్నాయన్న సుప్రీం

రిజర్వేషన్లను నిర్ణయించుకునే పూర్తి అధికారం తమకుందన్న సర్కారు 

డెడికేటెడ్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకే పెంచామని వెల్లడి.. గవర్నర్, రాష్ట్రపతి వద్ద బిల్లులు పెండింగ్‌లో ఉండటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వాదన

బిల్లును కాకుండా దాని ఆధారంగా జారీ చేసిన జీవోను సవాల్‌ చేయడం సరికాదని వెల్లడి 

జనరల్‌ ఏరియాల్లో 50% పరిమితిని దాటడానికి వీల్లేదన్న ప్రతివాదులు 

ప్రభుత్వ వాదనతో విభేదించిన సర్వోన్నత న్యాయస్థానం 

ఈ తీర్పుతో ప్రస్తుతమున్న రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు

సాక్షి, న్యూఢిల్లీ: బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ జారీ చేసిన జీవో 9పై హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్‌ చేస్తూ దాఖలుచేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. గురువారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ సందీప్‌ మెహతాతో కూడిన ధర్మాసనం ప్రభుత్వ వాదనలతో ఏకీభవించలేదు. రిజర్వేషన్ల పెంపునకు మినహాయింపులు కేవలం షెడ్యూల్డ్‌ ఏరియాల్లోనే ఉన్నాయని గుర్తుచేస్తూ, 50 శాతం పరిమితిని మించరాదని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. 

ప్రభుత్వం వాదన ఇదీ..  
తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ, రిజర్వేషన్లను నిర్ణయించుకునే పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. అత్యంత శాస్త్రీయంగా, దేశంలో ఎక్కడా లేనివిధంగా కుల సర్వే నిర్వహించామని తెలిపారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన ‘ట్రిపుల్‌ టెస్ట్‌’నిబంధనలకు అను గుణంగా, డెడికేటెడ్‌ కమిషన్‌ను ఏర్పాటు చేసి, ఇంటింటికీ తిరిగి సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై సమగ్రంగా, శాస్త్రీయంగా సర్వే జరిపామని తెలిపారు. 

94 వేల ఎన్యూమరేషన్‌ బ్లాక్‌లలో లక్షలాది మంది సమాచారాన్ని సేకరించి, బీసీ జనాభా డేటా ఆధారంగానే కమిషన్‌ సిఫార్సుల మేరకు రిజర్వేషన్లు పెంచామని వివరించారు. ఈ సందర్భంగా ఇందిరా సహానీ కేసులో తీర్పును సింఘ్వీ ఉటంకించారు. డేటా బేస్‌ ఆధారంగా, అసాధారణ పరిస్థితుల్లో రిజర్వేషన్లు 50% మించి పెంచుకునే సౌలభ్యం ఉందని 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసిందని గుర్తుచేశారు. వికాస్‌ కృష్ణారావ్‌ గవాలి కేసు తీర్పు కూడా ఇదే విషయాన్ని బలపరుస్తోందన్నారు. 

అంతేగాక ఈ వ్యవహారంలో రాజకీయ ఏకాభిప్రాయం సాధ్యమైందని చెప్పారు. అసెంబ్లీలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపాయని, అయితే గవర్నర్, రాష్ట్రపతి వద్ద బిల్లులు పెండింగ్‌లో ఉండటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వివరించారు. బిల్లును సవాల్‌ చేయకుండా, దాని ఆధారంగా జారీ చేసిన జీవోను సవాల్‌ చేయడం సరికాదని సింఘ్వీ వాదించారు. ఇంతటి విస్తృత కసరత్తు తర్వాత, ఎలాంటి సహేతుక కారణాలు చూపకుండా హైకోర్టు స్టే విధించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. 

కోటా 50% పరిమితి దాటరాదు: ప్రతివాదుల వాదన 
ప్రతివాది మాధవరెడ్డి తరఫు సీనియర్‌ న్యాయవాది గోపాల్‌ శంకరనారాయణ ప్రభుత్వ వాదనలను తీవ్రంగా వ్యతిరేకించారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో స్పష్టం చేసిందన్నారు. కృష్ణమూర్తి కేసు తీర్పును ఉటంకిస్తూ ‘షెడ్యూల్డ్‌ ఏరియాలు, గిరిజన ప్రాంతాల్లో మాత్రమే 50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచుకోవడానికి అనుమతి ఉంది. జనరల్‌ ఏరియాల్లో ఈ పరిమితిని దాటడానికి వీల్లేదు. తెలంగాణలో అలాంటి షెడ్యూల్‌ ఏరియాలు లేవు. 

కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు ఇదే తీర్పును వెల్లడించింది’అని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ట్రిపుల్‌ టెస్ట్‌లో కూడా మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదనేది ఒక కీలకమైన షరతు అని, దాన్ని ప్రభుత్వం ఉల్లంఘించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాల ఉదంతాలను ప్రస్తావిస్తూ.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల్లో కూడా రిజర్వేషన్ల పెంపును సుప్రీంకోర్టు తిరస్కరించి, 50 శాతం పరిమితికి లోబడే ఎన్నికలకు వెళ్లాలని ఆదేశించిందని గుర్తుచేశారు. 

ధర్మాసనం కీలక వ్యాఖ్యలు 
ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం, రాష్ట్ర ప్రభుత్వ వాదనలతో విభేదించింది. ‘ఎస్టీ ప్రాంతాల్లోనే రిజర్వేషన్ల పెంపునకు మినహాయింపులు ఉన్నాయి కదా?’అని పేర్కొంది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను, ముఖ్యంగా కృష్ణమూర్తి కేసులో స్థానిక సంస్థల రిజర్వేషన్లపై నిర్దేశించిన 50 శాతం పరిమితిని ధర్మాసనం పునరుద్ఘాటించింది. 

ఈ అంశం హైకోర్టులో విచారణ దశలో ఉన్నందున హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణాలు కనబడటం లేదంటూ తెలంగాణ ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే తమ ఆదేశాలతో సంబంధం లేకుండా కేసు మెరిట్స్‌ ఆధారంగా తదుపరి విచారణను కొనసాగించాలని హైకోర్టుకు సూచించింది. ఈ తీర్పుతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రస్తుతమున్న రిజర్వేషన్ల విధానం ప్రకారమే జరగనున్నాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement