పెళ్లి దానం | special story to marriage | Sakshi
Sakshi News home page

పెళ్లి దానం

Published Tue, Aug 2 2016 11:12 PM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM

పెళ్లి దానం

పెళ్లి దానం

లీగల్ స్టోరీస్

 

కన్యాదానం విన్నాం!
ఒక తండ్రి తన కూతుర్ని అల్లుడికి దానం చేయడమే కన్యాదానం!
అదే ఒక భర్త తన భార్యను ఆమె సంతోషం కోసం దానం చేస్తే..?
ఇది ఒక విచిత్రమైన కథ! ఇది పెళ్లి దానం!!
ఈ కథలో మనం ఊహించలేనంత ఔన్నత్యం ఉంది..
అంతుపట్టని త్యాగం ఉంది!
బంధించే ప్రేమ ఉంది.. స్వేచ్ఛనిచ్చే పెళ్లి ఉంది.
బంధంలోని బాధ ఉంది.. దానంలోని ఆనందం ఉంది!
మానవ సంబంధాల్లో ఉండాల్సిన అందం ఉంది!
విడాకులకు చప్పట్లు కొట్టిన గొప్ప చట్టం ఉంది!
ఈ కొత్త శీర్షిక (లీగల్ స్టోరీస్)కు మీరూ ఆహ్వానితులే!

 

‘క్రిస్.. నాన్నకు హార్ట్ ఎటాక్ వచ్చిందట.. అర్జంట్‌గా ఇండియా వెళ్లాలి.. టికెట్స్ బుక్ చేయవా ప్లీజ్’ దాదాపు ఏడుస్తున్నట్టుగానే చెప్పేసింది ఫోన్‌లో అలేఖ్య.  ‘ఒకే.. ఒకే... కూల్! మీ నాన్నకి ఏం కాదు అంతా బాగానే ఉంటుంది’ ఆమె ఆందోళనను తగ్గించే ప్రయత్నం చేశాడు క్రిస్.  ‘లేదు.. నాకు చాలా భయంగా ఉంది’ ఏడ్చేసింది అలేఖ్య. ‘నువ్వు ముందు ఇంటికి వచ్చేయ్’. ఆఫీస్‌లో ఒక్కతే ఏడుస్తూ ఇంకా దిగులు పెంచేసుకుంటుందేమోనని కంగారు పడ్డాడు క్రిస్. కాని ఆయన మనసులో అలేఖ్య వాళ్లింటి నుంచి వచ్చిన ఫోన్ కాల్ పట్ల ఏదో సందేహం. బహుశా అది అబద్ధం కావచ్చేమోనని!


‘అలేఖ్యా.. డోంట్ వర్రీ.. ఏమీ కాదు.. మీ నాన్న ఆరోగ్యంగా ఉంటారు. ప్లీజ్ నువ్వలా ఏడ్వకు.. నువ్ ఏడిస్తే తట్టుకోలేను’ డెట్రాయిట్ ఎయిర్‌పోర్ట్‌లో అలేఖ్యను ఇండియాకు సాగనంపుతూ ధైర్యం చెప్తున్నాడు క్రిస్. ‘నాకెందుకో భయంగా ఉంది క్రిస్..’ దిగులుగా అంది అలేఖ్య. ‘ఏం కాదు.. నేను చెప్తున్నాగా.. వెళ్లు.. వెళ్లి గుడ్ న్యూస్‌తో తిరిగా.. ఆశగా ఎదురుచూస్తుంటాను నీకోసం’నుదుటి మీద ముద్దుపెట్టుకుంటూ చెప్పాడు క్రిస్.  బేలగా క్రిస్‌ను చూస్తూ డిపార్చర్స్ వింగ్‌లోకి వెళ్లిపోయింది అలేఖ్య.

 

ప్రేమకు గుండెపోటు
‘అన్యాయం ఏంటే అన్యాయం. పెద్ద చదువులు చదివిస్తే మంచి ఉద్యోగంతో లైఫ్‌లో సెటిల్ అవుతావని నిన్ను అమెరికా పంపిస్తే మా నమ్మకాన్ని మట్టిగలిపి అక్కడ నువ్ వెలగపెడుతున్న నిర్వాకం మాకు నువ్ చేసిన అన్యాయం కాదా? పిచ్చి వేషాలు ఆపి నోర్మూసుకొని మేం చూసిన సంబంధానికి ఓకే చెప్పు’ కటువుగా చెప్పేసింది అలేఖ్య తల్లి.


‘అమ్మా.. నా వల్ల కాదమ్మా,..’ ఏడుస్తోంది అలేఖ్య. అప్పుడే ఆ గదిలోకి వచ్చిన అలేఖ్య వాళ్ల బాబాయ్‌ను చూసి ‘బాబాయ్.. నాన్నకు హార్ట్ ఎటాక్ అని అబద్ధం చెప్పి నన్ను ఇండియా రప్పించారు.. నన్నిలా ఎందుకు మోసం చేశారు?’ నిలదీసింది.  ‘అలా చెప్పకపోతే నువ్ రావు కదా..’ నింపాదిగా అన్నాడు ఆయన. బిత్తర పోయింది అలేఖ్య.

 

పాజిటివ్ రిజల్ట్
కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంటాం అనే బెదిరింపు, బ్లాక్‌మెయిల్‌ల మధ్య బెంగుళూరులోని ఐబీఎమ్‌లో పనిచేస్తున్న ఓ సాఫ్ట్‌వేర్ కుర్రాడి సంబంధానికి తలవంచక తప్పలేదు అలేఖ్యకు. పెళ్లి ముహూర్తం ఖాయం చేశారు. పదిహేను రోజులే ఉంది ఆ ముహూర్తానికి. హడావిడిగా పనులు అవుతున్నాయి. అలేఖ్యను ఒంటరిగా ఎవరూ వదలడం లేదు. ఆ అమ్మాయికి నీరసంగా ఉంటోంది. తిండి సహించట్లేదు. ఏం తిన్నా వాంతి చేసుకుంటోంది. ఫ్యామిలీ డాక్టర్‌కి ఫోన్ చేసి అడిగింది అలేఖ్య తల్లి కూతురి అనారోగ్యం గురించి. పెళ్లి గురించి టెన్షన్ వల్ల కొంతమందికి అలాగే ఉంటుంది.. మరేం పర్లేదు అని ఏవో టాబ్లెట్స్ పేర్లు చెప్పింది ఆ డాక్టర్. కాని అది కాదు అసలు నిజం మరొకటని అలేఖ్యకు అర్థమవుతోంది. ఎలాగైనా ఒకసారి డాక్టర్ దగ్గరకు వెళ్లాలి. రెండో రోజు నుంచి ఇంట్లో వాళ్లతో బాగా ఉండడం మొదలుపెట్టింది. ఫ్యామిలీ డాక్టర్ ఇచ్చిన ట్యాబ్లెట్లు పడట్లేదు.. వేరే డాక్టర్ దగ్గరకు వెళ్తాను.. కజిన్‌ను తోడిచ్చి పంపమని చాలా నమ్మకంగా అడిగింది అమ్మను. కూతురు మారిపోయింది.. అనుకున్న అమ్మ తన తోడికోడలు కూతురినిచ్చి హాస్పిటల్‌కి పంపింది కూతురు దగ్గరున్న తీసుకొని!


‘పాజిటివ్...’ డాక్టర్ చేసిన టెస్ట్ రిజల్ట్! అలేఖ్య ఆనందానికి అంతులేదు. ‘గుడ్ న్యూస్‌తో రమ్మన్నావు కదా క్రిస్. తప్పకుండా ఈ గుడ్‌న్యూస్‌తో నీ దగ్గరకు వస్తా. ఎలాగైనా వస్తా’ మనసులో కృతనిశ్చయానికి వచ్చేసింది.

 
దేవుడిలాంటి మొగుడు

అలేఖ్య తల్లిదండ్రులు అనుకున్నట్టు అంగరంగ వైభవంగా కూతురు పెళ్లి చేశారు. అత్తారింటికి సాగనంపారు. అందమైన, చదువుకున్న కోడలికి అత్తింట్లో బ్రహ్మరథం పట్టారు. రిసెప్షన్, మొక్కులు తీర్చుకోవడం కోసం పుణ్యక్షేత్రాలు తిరగడం వంటి కార్యక్రమాలతో వారం రోజులు గడిచిపోయాయి. పెళ్లయిన పదో రోజు ఫస్ట్ నైట్‌కి ముహూర్తం నిర్ణయించారు.

 

ఆ రోజున... గదిలో..
‘మన పెళ్లి కుదిరినప్పటి నుంచి మీకో విషయం చెబ్దామనుకుంటున్నాను.. కాని వీలుకాలేదు. ఉహూ.. వీలు కానివ్వలేదు మా పెద్దవాళ్లు’ నిర్భయంగా అన్నది అలేఖ్య. పెళ్లికొడుకు కనుబొమలు ముడిపడ్డాయి. ‘ఏంటది?’ లోపలి భావం బయటకు కనపడనివ్వకుండా అడిగాడు.  ‘నేను ఎమ్మెస్ చేయడానికి యూఎస్ వెళ్లినప్పుడు అక్కడ నా క్లాస్‌మెట్‌తో ప్రేమలో పడ్డాను. చదువైపోయాక మా పెద్దవాళ్లకు చెప్పాను. ఒప్పుకోలేదు. మంచి ఉద్యోగాలు దొరికాక ఇద్దరం లివిన్ రిలేషన్‌లో ఉండడం మొదలుపెట్టాం. కొంచెం టైమ్ గడిస్తే పెద్దవాళ్లు ఒప్పుకుంటారు, ఒప్పిస్తామన్న దీమాతో. కాని ఒప్పుకోలేదు. మా నాన్నకు హార్ట్ ఎటాక్ అని నన్ను బ్లాక్‌మెయిల్ చేసి ఇండియాకు రప్పించి బలవంతంగా మీతో పెళ్లి చేశారు. బట్ ఐ లవ్ క్రిస్. నౌ అయామ్ ప్రెగ్నెంట్’ తొణక్కుండా, బెణక్కుండా చెప్పింది అలేఖ్య.  పెళ్లి కొడుకును హతాశుణ్ణి చేశాయి ఆ మాటలు.


ఆ రాత్రంతా మౌనం, కోపం, ఆవేశం, ఆలోచన, ఓ నిర్ణయంతో సాగిపోయింది! తెల్లవారే ఇద్దరూ రెడీ అయి ఇంటి నుంచి బయటపడ్డారు. ఇంట్లో వాళ్లంతా కొత్తపెళ్లి జంట ప్రేమ విహారానికి బయలుదేరిందని ముసిముసి నవ్వులు, గుసగుసలు!  ఆ జంట బయటకు వెళాక, ఎవరికి వారు విడిపోయారు. అలేఖ్య లాయర్ దగ్గరకు వెళ్లింది. ప్రశాంత్ (పెళ్లి కొడుకు) ఫ్రెండ్ దగ్గరకు వెళ్లాడు. లాయర్ దగ్గర తన పరిస్థితి వివరించి విడాకులు కావాలని దరఖాస్తు చేసుకుంది. నెల రోజులకు ప్రశాంత్‌కి నోటీసు అందింది. ఇద్దరూ కోర్టుకి హాజరయ్యారు. తమ మధ్య వైవాహిక సంబంధం ఏదీ లేనందున ఈ వివాహాన్ని రద్దు చేయాల్సిందిగా కోర్టు ముందు కోరింది అలేఖ్య. దానికి ప్రశాంత్ కూడా ఒప్పుకున్నాడు. దాంతో ఇద్దరికీ విడాకులు మంజూరయ్యాయి.
- సరస్వతి రమ

 

అంత త్వరగా ఎలా?
సెక్షన్ 12, హిందూయాక్ట్ ప్రకారం అనల్‌మెంట్ డైవోర్స్ అంటారు దీన్ని. దీని ప్రకారం భార్య, భర్త మధ్య వైవాహిక సంబంధం ఏదీ లేకపోతే వెంటనే అంటే పెళ్లయిన యేడాదిలోపే విడాకులు మంజూరు అవుతాయి. అలేఖ్య పరువు బయటపెట్టకుండా, తన మనసుని అర్థం చేసుకొని, ఆమె గౌరవానికి భంగం కలగనివ్వకూడదని కోర్టులో ఆమె దరఖాస్తుకు సమ్మతి తెలిపాడు. ఒకవేళ తన దగ్గర నిజాన్ని దాచి పెళ్లి చేసుకొని తనను మోసం చేసిందని సమ్మతి తెలకపోతే.. అప్పుడు కోర్టే జోక్యం చేసుకొని అతనిని కౌన్సిలింగ్ చేసి విడాకులకు సమ్మతించేలా చేస్తుంది, చేయవచ్చు! కారణం.. అమ్మాయికి అది బలవంతపు పెళ్లి, ఆ పెళ్లిలో ఆమె ఉండదలుచుకోలేదు, పైగా ఆ పెళ్లి వల్ల ఆమె భర్తతో ఎలాంటి సంబంధంలో లేదు కాబట్టి! అయితే అలేఖ్య వాళ్ల కేసులో ఆమె అత్తగారి తరపువారు అమ్మాయి మోసం చేసిందని అల్లరిపెట్ట ప్రయత్నించారు కాని ప్రశాంత్ వాళ్లను ఆపి విషయం వివరించడంతో వివాదం సద్దుమణిగింది. అలేఖ్య అమెరికా వెళ్లిపోయింది. ఇందులో భరణం, ఆస్తి వంటి విషయాల ఊసు ఉండదు. ఒకవేళ భార్య లేదా భర్త చెప్పిన దాన్ని అంటే తమకు ఎలాంటి వైవాహిక సంబంధం లేదన్న నిజాన్ని అవతలి పార్టీ ఒప్పుకోకపోతే, అది అబద్ధమని వాదిస్తే అప్పుడు మెడికల్ ఎగ్జామినేషన్స్‌కి వెళ్లే అవకాశం ఉంటుంది.
- ఇ. పార్వతి, అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement