కోడలు పిల్లా... జాగ్రత్త! | sakshi special Legal Stories | Sakshi
Sakshi News home page

కోడలు పిల్లా... జాగ్రత్త!

Published Tue, Oct 18 2016 10:52 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

కోడలు పిల్లా...   జాగ్రత్త! - Sakshi

కోడలు పిల్లా... జాగ్రత్త!

లీగల్   స్టోరీస్


అత్త లేని కోడలు ఉత్తమురాలు. కోడలు లేని అత్త గుణవంతురాలు.. అని  ఓ కవి సెలవిచ్చారు.  ఇక ఇవేమీ కుదరవు!  అత్తమామల్ని సరిగా చూసుకోకపోతే  భర్త తన భార్యపై కోర్టుకు వెళ్లొచ్చు.  విడాకులు కోరవచ్చు. ఉమ్మడి కుటుంబాలు వర్ధిల్లాలని అత్తమామలు కొడుకు, కోడళ్లతో కలిసి ఉండాలని పిల్లలకు పెద్దల అండదండలు ఉండాలని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఓ సందేశం ఉంది. చట్టం మంచే చేస్తుంది. అయితే ఈ చట్టాన్ని ఒక కోడలే కాకుండా.. అత్తమామలు, భర్త అర్థం చేసుకుంటే ఉమ్మడి కుటుంబాలు విడిపోకుండా ఉంటాయి.

 

‘మా నాన్నకు బాలేదని మా అమ్మ నీకు ఫోన్ చేసిన విషయం నాకెందుకు చెప్పలేదు’ కోపంతో అన్నాడు శ్రీకర్. ‘మర్చిపోయాను’ నిర్లక్ష్యంగా సమాధానం అరుణ దగ్గర్నుంచి.‘మర్చిపోయావా? అదేం సమాధానం? నీకసలు బుద్ధుందా? మా నాన్నకేమన్నా అయుంటే?’ శ్రీకర్ కోపం ఆవేశంగా మారింది. ‘ఏం కాలేదు కదా.. ఎందుకంత గొంతు చించుకుంటారు?’ ‘నువ్వసలు మనిషివేనా?’ అంటూ పెరిగిన ఆవేశంతో భార్య మీదికి చేయి లేపాడు శ్రీకర్.

 
‘కొడ్తారా? కొట్టండి.. మీ అమ్మానాన్నల కోసం పెళ్లాన్ని కొట్టే స్థాయికి వచ్చారు? కొట్టండి.. అరే.. వయసు మళ్లిన మనిషి.. అందుట్లోనూ బీపీ, షుగర్.. సుస్తీతో కళ్లు తిరిగి పడిపోయారు.. దానికి మీ అమ్మగారు.. అనుభవం ఉన్న పెద్దమనిషి.. కంగారు పడి మీ సెల్‌కి ఫోన్ చేశారు.. నైట్ షిఫ్ట్ చేసి అలసి అప్పుడే నిద్రపోయిన మిమ్మల్నెందుకు డిస్టర్బ్ చేయడమని.. ‘ఇప్పుడే పడుకున్నారు నేను చెప్తాలెండి లేచాక’ అన్నా.. పని హడావిడిలో పడి మరిచిపోయి చెప్పలేదు. నేను చెప్పలేదు సరే... కాల్ మీ ఫోన్‌కే వచ్చింది కదా.. ఆన్సర్ చేసినట్టుంది కదా.. అది చెక్ చేసుకొని అమ్మ నుంచి ఫోన్ ఎందుకు వచ్చిందో అని మీరెందుకు వాకబు చేసుకోలేదు. చిన్నదానికి  రాద్ధాంతం చేసి కోడలు మంచిది కాదు అని నిరూపించాలని ఆ పెద్దావిడ.. ఆవిడకు వత్తాసు మీరు... కొట్టండి’ అంటూ కళ్ల నీళ్లొత్తుకొంది అరుణ.


‘మా అమ్మ ఫోన్ చేసిన విషయం నాకు చెప్పక పోగా మా అమ్మనే మాటలంటున్నావా? పైగా నువ్వెందుకు చూసుకోలేదంటూ తప్పంతా నా మీదకు తోస్తూ నంగనాచిలా ఏడుస్తావా? నిన్నుకొట్టడం కాదు.. నీలాంటి దాన్ని ఇన్నాళ్లు భరించినందుకు నన్ను నేను కొట్టుకోవాలి.. ఛీ.. ’ అంటూ బెడ్‌రూమ్‌లోకి వెళ్లిపోయాడు శ్రీకర్.


‘అవును.. ఛీ నే.. మీ నాన్నకు బాలేదన్న విషయం చెప్పలేదని అన్నేసి మాటలంటున్నారు? నాకు లేరా తల్లిదండ్రులు? నా వాళ్ల గురించి మీరెప్పుడైనా ఆలోచించారా? మా అమ్మకు బాలేదని మావాళ్లు ఫోన్ చేస్తే నన్ను పంపించారా చూడ్డానికి? మీకో న్యాయం.. నాకో న్యాయమా? అవున్లే ఎంతయినా మగాళ్లు... మొగుళ్లు! మీ వాళ్లను మా నెత్తిమీద పెట్టుకొని మోయాలి.. మావాళ్లను మాత్రం పాతాళానికి తొక్కుతారు. మమ్మల్ని గయ్యాళులుగా చూపిస్తారు.. ’ అంటూ బెడ్‌రూమ్‌లో  ఉన్న భర్తకు వినిపించేలా అరిచింది అరుణ.

 
‘నిజంగా గయ్యాళివే.. నరకం చూపిస్తున్నావ్’ అని సణుక్కుంటూ బయటకు వెళ్లిపోయాడు శ్రీకర్.  పేదింటి పిల్ల అని... మర్యాదస్తుల కుటుంబం అని... అరుణ వాళ్లది పేద కుటుంబం. డిగ్రీ వరకు చదువుకుంది. ఎవరో బంధువుల ద్వారా ఆ సంబంధం వచ్చింది. పెళ్లి చూపుల్లో వాళ్ల మర్యాద, ఆ నెమ్మదితనం చూసి ముచ్చట పడ్డారు శ్రీకర్ తల్లిదండ్రులు. ఒక్కగానొక్క కొడుకు. చక్కటి ఉద్యోగం. ఉన్నంతలో బాగానే ఉన్నారు. దేనికీ కొదవ లేదు. కట్నకానుకల కన్నా మర్యాదే ముఖ్యమనుకున్నారు. అదీగాక.. వంక పెట్టడానికి వీల్లేకుండా ఉంది అమ్మాయి. మొదటి చూపులోనే శ్రీకర్ సహా ఇంటిల్లిపాదికీ నచ్చింది. పెళ్లికి ఓకే చెప్పేశారు.

 
మూడు నెలల్లోనే...
పెళ్లాయ్యాక మూడు నెలల వరకు అంతా సవ్యంగానే సాగింది. శ్రీకర్ త్రీ బెడ్‌రూమ్ ఫ్లాట్ కొన్నాడు. వాళ్ల అమ్మానాన్నల కోసం పూజ గది, వాళ్ల గది ప్రత్యేకంగా డిజైన్ చేయించాడు. అక్కడ మొదలైంది అరుణ గొడవ.  అత్తామామలతో కలిసి ఉండడం ఆమెకు సుతరామూ ఇష్టం లేదు. ‘తర్వాత ఎలాగూ వాళ్లను చూసుకోక తప్పదు. ఇప్పటి నుంచే మనతో ఎందుకు వాళ్లు?’ అన్నది. ‘ఎందుకు ఏంటి? వాళ్లు నా తల్లిదండ్రులు.. ఇప్పుడైనా ఎప్పుడైనా నాతో కాక ఎవరితో ఉంటారు?’ అన్నాడు కాజువల్‌గానే. ‘కొత్తగా పెళ్లయిన వాళ్లం కదా.. కొన్నాళ్లు మనిద్దరమే ఉందాం...’ గోముగా అడిగింది. ‘మనిద్దరికీ వాళ్లేం అడ్డుకాదు. వాళ్లకూ తెలుసు... మనం న్యూలీ మ్యారీడ్ కపుల్’ అని.. అంతే గారంగా ఆన్సర్  చేశాడు శ్రీకర్. సహనం నశించింది అరుణలో. ‘మీ నాన్న మంచి హోదాలో రిటైర్డ్ అయ్యారు. పెద్దమొత్తంలోనే పెన్షన్ తీసుకుంటున్నాడు. అంతగా కావాలనుకుంటే మీరూ నెలనెలా ఇంత డబ్బివ్వండి.. అంతేకాని వాళ్లు మాత్రం మనతో ఉండొద్దు కొత్తింట్లో ’ అసహనం, చిరాకుతో స్పష్టం చేసింది. అవాక్కయ్యాడు శ్రీకర్. అన్నం మాని అలిగింది. ఆ అలకను, కోపాన్ని అత్తమామలూ గ్రహించేలా చేసింది. పెద్దవాళ్లు అర్థం చేసుకున్నారు కొడుకు ఇబ్బందిని.

 
ఒకరోజు...
‘ఒరేయ్.. మేం మా పాతింటికే వెళ్లిపోతాంరా.. ఇక్కడంతా కొత్తకొత్తగా... బెరుకు బెరుకుగా ఉంది. అక్కడయితే ఏళ్ల తరబడి ఉన్నవాళ్లం కదా.. కాలక్షేపం బాగా అవుతుంది. వద్దనొద్దు నాన్నా.. ’ అని కొడుకు ముందరి కాళ్లకు బంధం వేసి పాతింటికి వెళ్లిపోయారు శ్రీకర్ తల్లిదండ్రులు. వారానికి ఒక్కరోజు తల్లిదండ్రులను కలవడానికి వెళ్లేవాడు. ఆ ఒక్కసారి వెళ్లడమూ అరుణకు ఇష్టం ఉండేది కాదు. అప్పుడప్పుడు డబ్బు సర్దుతున్నా నచ్చేది కాదు. అరుణ అలకలు, అరుపులు, కోపానికి భయపడి  పండుగలు, పబ్బాలు, నోములు, వ్రతాలు దేనికీ వెళ్లవాడు కాదు తల్లిదండ్రుల దగ్గరకు. చివరకు వాళ్లు ఎంతో పెద్ద కష్టం వస్తేకాని కొడుకుకు చెప్పేవారు కాదు. చివరకు తమకు కొడుకు పుట్టినా ఆ శుభవార్తను చెప్పనివ్వలేదు అరుణ! దూరపు బంధువుల ద్వారా తెలుసుకున్నారు వాళ్లు. కొడుకు ఫస్ట్ బర్త్‌డేకి భార్యకు తెలియకుండా అమ్మానాన్నను పిలిచాడు. ఆ ఫంక్షన్‌లోనే పెద్ద గొడవ చేసి వాళ్లను అవమానించి పంపించేసింది. భార్య, తల్లిదండ్రుల బంధాన్ని బ్యాలెన్స్ చేయలేక మనశ్శాంతిని కోల్పోయి బతకలేక అరుణకు తలవంచాడు శ్రీకర్. తల్లిదండ్రులకు మొత్తానికే దూరమయ్యాడు.

 
తర్వాత కొన్నాళ్లకు...
శ్రీకర్ వాళ్ల నాన్నగారు బీపీ, షుగర్ ఎక్కువై ఆసుపత్రి పాలైతే భయపడి వాళ్లమ్మ ఫోన్ చేసింది. అదే ప్రస్తుతం శ్రీకర్‌కు, అరుణకు మధ్య చిచ్చు రగిలించింది. నిజంగానే తన తండ్రికి ఏమన్నా అయివుంటే? ఊళ్లోనే చెట్టంత కొడుకు ఉండీ తండ్రిని కాపాడుకోలేని అసమర్థుడిగా మిగిలిపోయేవాడు. తనను ఈ స్థాయికి తేవడానికి అమ్మానాన్న ఎంత కష్టపడ్డారో కళ్లముందు కదిలింది. కళ్లలో నీళ్లను తెప్పించింది. తన క్షేమం, సుఖం కోసం వాళ్ల జీవితాన్నే అర్పించిన తల్లిదండ్రులను భార్య కోసం.. వదులుకున్నాడు. క్షమించరాని నేరం. ఇక అమ్మానాన్నలను అలా ఒంటరిగా వదిలేయకూడదు. ఆరునూరైనా.. అరుణ తనను వదిలేసినా సరే అమ్మానాన్నతోనే కలిసిఉండాలి అని నిశ్చయానికి వచ్చాడు శ్రీకర్.

 
తిరిగి రాకపోతే అక్కర్లేదు...
‘రేపు అమ్మానాన్న ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడే మనతోనే ఉంటారు ఎప్పటికీ’ అన్నాడు స్థిరమైన స్వరంతో శ్రీకర్.  ‘అయితే నేనుండను. బాబును తీసుకొని మా అమ్మావాళ్లింటికి వెళ్లిపోతాను’ అంతే స్థిరంగా బదులు ఇచ్చింది అరుణ.  ‘బాబును తీసుకొనా? ఆ హక్కు నీకు లేదు’ అన్నాడు. ఆ మాటతో పెద్ద యుద్ధమే అయింది. నిజంగానే అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది అరుణ. బతిమాలి భార్యను ఇంటికి తెచ్చుకోవాలనుకోలేదు శ్రీకర్. తనే గ్రహించి రావాలి అని ఆశించాడు. నాలుగు నెలలయినా జరగలేదు. లాయర్ సలహా తీసుకున్నాడు శ్రీకర్. రెస్టిట్యూషన్ ఆఫ్ కన్ జుగల్ రైట్స్‌కి వేసుకున్నాడు. తనను అత్తామామా చాలా హింసిస్తున్నారని ఆ ఇంట్లో వాళ్లుంటే కాపురానికి వెళ్లనని చెప్పింది తెగేసింది అరుణ. కాని అత్తామామ ఆమెను ఇబ్బంది పెడ్తున్నట్టుగా సాక్ష్యాధారాలు లేకపోగా అరుణ వల్లే వాళ్లు ఇబ్బంది పడ్తున్నట్టుగా రుజువైంది. ఆ వయసులో ఆ పెద్దవాళ్లు అనాథల్లా ఎలా బతుకుతారు? వాళ్లకు కొడుకు అండ కావాలని, కొడుకు భార్యగా కోడలు వాళ్ల బాధ్యతను తీసుకోవాలని అరుణకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా ససేమీరా అంది అరుణ. భార్య ప్రవర్తనతో విసిగిపోయిన శ్రీకర్ విడాకులు కోరాడు. ఇంకో మాట లేకుండా కోర్ట్ విడాకులు మంజూరు చేసింది.     

 

తాజాగా సుప్రీంకోర్టు తీర్పు!
ఉమ్మడి కుటుంబ వ్యవస్థను ప్రోత్సహించేందుకు ఇటీవల సుప్రీం కోర్టు ఓ తీర్పునిచ్చింది. 1955 హిందూ వివాహ చట్టం, సెక్షన్ 13 .. విడాకుల కోసం చెప్తున్న అనేక కారణాలలో మానసిక హింస ఒకటి. జంటలో ఎవరైనా ఒకరు మిగిలిన వారిని మానసిక వేధింపులకు గురిచేస్తే విడాకులు తీసుకోవచ్చు. అందులో భాగంగానే అత్తామామల నుంచి భర్తను వేరుచేయాలని చూసినా, ఆ కారణంతో భర్తను హింసిస్తున్నా .. ఆ భర్త ఆ భార్యకు విడాకులు ఇవ్వచ్చొని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ‘తల్లిదండ్రులను చూసుకోవడం కొడుకు బాధ్యత. అందుకు భార్య అడ్డుపడుతుంటే ఆమెకు విడాకులు ఇవ్వచ్చు. విడికాపురం పెట్టాలని భర్తను వేధింపులకు గురిచేయడం మన సంస్కృతికి విరుద్ధం’అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

 

ఇ. పార్వతి, అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్
parvathiadvocate2015@gmail.com

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement