
బరువు పెరుగుతున్న బొమ్మాళి!
సవాల్ మీద సవాల్. ఇలా గత రెండేళ్లుగా అనుష్క సవాళ్లను సునాయాసంగా స్వీకరిస్తున్నారు. ‘బాహుబలి', ‘రుద్రమదేవి' చిత్రాల కోసం గుర్రపుస్వారీ, విలువిద్య, కత్తిసాము వంటివన్నీ నేర్చుకున్న బొమ్మాళి శారీరక భాషనూ మార్చుకున్నారు. ఇప్పుడు ఈ రెండు పాత్రలను తలదన్నే విధంగా మరో ‘బరువైన పాత్ర’ను ‘సైజ్ జీరో’ చిత్రంలో చేస్తున్నారు. ఇది ఎంత బరువైన పాత్ర అంటే.. దీని కోసం అనుష్క 20 కిలోల బరువు పెరుగుతున్నారు.
అందరు కథానాయికలూ తమ బరువు తగ్గించు కుని జీరో సైజ్‌కు వెళ్తుంటే, అనుష్క మాత్రం దీనికి విరుద్ధంగా పాత్ర కోసం బరువు పెంచుకోవడం సాహసమే. లావుగా ఉన్న అమ్మాయి ఓ యువకుడితో ప్రేమలో పడే కథ ఇది. బాహ్య సౌందర్యం కంటే, అంతఃసౌందర్యం ముఖ్యమనేది ఈ చిత్ర కథాంశం. వినోదంతో పాటు మంచి సందేశం ఉన్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో కోవెలమూడి ప్రకాశ్ దర్శకత్వంలో పొట్లూరి వి. ప్రసాద్ నిర్మిస్తున్నారు.