
అతి పెద్ద హీరో అనుష్క!
- రానా
‘‘ ‘సైజ్ జీరో’ కథ గురించి ‘బాహుబలి’ సెట్‌లో అనుష్క చెప్పారు. ఆ సమయంలో తనలో ఉద్వేగాన్ని గమనించాను. ఇన్నేళ్ల పరిచయంలో ఏ సినిమా గురించి ఆమె ఇలా చెప్పలేదు’’ అని దర్శకుడు రాజమౌళి అన్నారు. ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో పీవీపీ సినిమా పతాకంపై అనుష్క, ఆర్య, సోనాల్ చౌహాన్ ముఖ్యపాత్రల్లో పరమ్.వి.పొట్లూరి, కెవిన్ అన్నే సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘సైజ్ జీరో’. ఎమ్.ఎమ్. కీరవాణి స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఆడియో సీడీని దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఆవిష్కరించారు.
ప్రకాశ్ కోవెలమూడి మాట్లాడుతూ -‘‘నా భార్య కణికకు నేను థ్యాంక్స్ చెప్పాలి. చాలా మంచి కథ ఇచ్చింది. ఆమె కథ చెప్పగానే వెంటనే సినిమా చేయాలనిపించింది. ప్రసాద్‌గారికి నేను చిన్న సినిమా చేస్తానని చెప్పాను. కానీ ఆయన పెద్ద సినిమాగా చేద్దాం, మంచి యాక్టర్స్ వస్తారని ముందే ఊహించారు. కీరవాణిగారు ‘బాహుబలి’ బిజీలో ఉన్నా, ఈ సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చారు. మేం ఈ సినిమా చేద్దామనగానే మాకు మొదట ఆర్య, అనుష్కలే గుర్తుకువచ్చారు. ఆర్య అయితే కథ వినకుండానే చేస్తానని ముందుకు వచ్చారు’’ అని అన్నారు.
‘‘అందం అనేది చూసే కళ్లను బట్టి ఉంటుంది కానీ శరీరాకృతి బట్టి ఉండదు. దాన్నే స్ఫూర్తిగా తీసుకుని ఈ కథ రాశాను’’ అని రచయిత్రి కణికా డి. కోవెలమూడి అన్నారు. అనుష్క మాట్లాడుతూ- ‘‘ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు స్వీటీ పాత్రకు బాగా కనెక్ట్ అయ్యాను. ఈ సినిమాలో ఓ మెసేజ్ ఉంటుంది. ఏ అమ్మాయీ తన సైజ్‌ను చూసుకుని ఇన్‌సెక్యూర్డ్‌గా ఫీల్ అవకూడదు. అదే తెరపై చూపించనున్నాం. కీరవాణిగారు తప్ప ఈ సినిమాకు ఎవరూ న్యాయం చేయలేరు’’ అని చెప్పారు. ఈ వేడుకలో నిర్మాతలు శ్యాంప్రసాద్‌రెడ్డి, ప్రసాద్ వి. పొట్లూరి, హీరో రానా, దర్శకులు, బి.గోపాల్, వంశీ పైడిపల్లి, గోపీచంద్ మలినేని, అలీ, సందీప్ గుణ్ణం తదితరులు పాల్గొన్నారు.