లావూసన్నం | Fixation | Sakshi
Sakshi News home page

లావూసన్నం

Published Mon, Apr 6 2015 11:40 PM | Last Updated on Sat, Sep 2 2017 11:56 PM

లావూసన్నం

లావూసన్నం

ఫిక్సేషన్
మాధవ్ శింగరాజు
 
మనుషులు ఎలా ఉంటే అందంగా ఉంటారు? ఏమిటీ వాక్యం! ఇందులో పౌష్టికాహార లోపమేదో ఉన్నట్లు అనిపించడం లేదూ?! నిజమే. అనిపిస్తోంది. వాక్యంలో ఉండాల్సినంత వెయిట్ లేదు. అయితే కొంచెం మార్చి చూద్దాం.. బరువు పెరుగుతుందేమో! ‘మనుషులు’ అని ఉన్నచోట ‘మహిళలు’ అని చేరిస్తే అప్పుడీ వాక్యం ఇలా ఉంటుంది: ‘మహిళలు ఎలా ఉంటే అందంగా ఉంటారు?’. వచ్చేసింది! వాక్యం బరువు పెరిగి, వాక్యానికి అందం వచ్చేసింది. అదీ ఫిమేల్ పవర్! స్త్రీ.. పక్కన ఉంటే చాలు ఎవరికైనా ఇట్టే వెయిట్ పెరిగిపోతుంది.. అది వాక్యమే అయినా, వానరమే అయినా.

స్త్రీల వల్ల పెరిగే వెయిట్ సరే,  స్త్రీల వెయిట్‌ను పెంచేదేమిటి? గ్లామర్ ఇండస్ట్రీలో ఉండేవారిని మాత్రం ఈ ప్రశ్న అడక్కండి. వారు జీరో సైజ్ గురించి మాట్లాడతారు. ‘వెయిట్ తగ్గడమే వెయిట్ పెరగడం’ అని వారి డెఫినిషన్. సౌందర్యభారం తప్ప ఒంటికి మరే భారమూ తగిలించుకోని వారే తీరైన అందగత్తెలని వారొక ఫీలింగ్‌ని గాల్లోకి వదిలిపెట్టారు. తిండి మానేసి, మన పిల్లలు ఆ ఫీలింగ్‌తో పొట్ట నింపేసుకుంటున్నారు. ఇష్టమైన కూరతో ఒక్క ముద్ద ఎక్కువ తిన్నా సరే, ఆ పూటకి... దే  ఫీల్ ఫ్యాటీ! బరువంటే అంత భయం పెట్టేశారు ఈ ఫ్యాషన్ డిజైనర్లు, పూరి జగన్నాథ్‌లు.

‘ఫీలింగ్ ఫ్యాట్’ అనే మాటకు నిన్నమొన్నటి వరకు ఫేస్‌బుక్‌లో ఒక ఎమోటికాన్ ఉండేది. ఇప్పుడది లేదు. రౌండ్ సర్కిల్. లోపల రెండు కళ్లు. చెంపలపై అటూఇటు కందినట్లు బ్లషింగ్. నవ్వీనవ్వనట్లుండే నోరు. దాని కింద డబుల్  చిన్ గీత. ఇదీ ఆ ఎమోటికాన్. అయితే ‘‘ఫ్యాట్ అనేది ఫీలింగ్ ఎలా అవుతుంది?’’ అని కేథరీన్ వైగాఫెన్ అనే నాటక రచయిత్రి పెద్ద ఉద్యమం తేవడంతో ఫేస్‌బుక్ దానిని తీసేసింది.
 ‘‘పూరీ, ఆలుగడ్డ చేయడం పాపమా ఏంటి?’’ అని ఓ కమర్షియల్ యాడ్‌లోని పెద్దావిడ అడిగినవిధంగా, ‘‘ఫ్యాటీగా ఉండడం పాపమా ఏంటి?’’ అని ప్రపంచం ఇప్పుడు అడుగుతోంది. మంచి పరిణామమే. బక్కపలుచని ముఖచిత్రాలకు పేరుమోసిన ‘స్పోర్ట్స్ ఇలస్ట్రేటెడ్’... బొద్దుగా ఉన్న మోడల్స్‌ని మాత్రమే ఈ ఏడాది తన కవర్ పేజీలకు ఎంపిక చేసుకుంది! అతి నాజూకైన ‘పెరిల్లి’ కొత్త క్యాలెండర్ కూడా కాస్త బరువు తూగే అమ్మాయిలతోనే పరిపుష్టం అయింది! ఇక ఫ్రాన్స్ అయితే ఎండుటాకులా ఎగిరిపోయేలా ఉన్న (అల్ట్రా థిన్) మోడల్స్.. ర్యాంప్‌పై నడుస్తూ కనబడితే, వాళ్లను అలా నడిపించినవాళ్లకు డెబ్బై ఐదు వేల యూరోల ఫైన్ విధించి, ఆర్నెల్లు జైల్లో పెట్టే చట్టం ఒకటి తెచ్చింది. అంటే ఏమిటి? లావులోనే అందం ఉందనా? మరీ చిక్కితే అందం అనారోగ్యం అవుతుందనా? రెండూ కాదు. సన్నదనం మీద అంత వ్యామోహం పనికిరాదని.

ఇంతకీ మహిళలు ఎలా ఉంటే అందంగా ఉంటారు? లావుగానా? సన్నగానా? లావూసన్నం కాకుండానా?

‘‘ఎలా ఉంటే వారికి సంతోషంగా అనిపిస్తుందో అదే అందం’’ అంటారు సప్న భావ్‌నాని. సప్న ప్రముఖ హెయిర్ స్టెయిలిస్ట్. ‘‘మీ లావూసన్నం గురించి ఎవరేం కామెంట్ చేసినా పట్టించుకోవద్దు. మీరూ ఎవరి గురించీ కామెంట్ చేయొద్దు. ఫిట్‌నెన్ మీకు సంతోషాన్నిచ్చే పనైతే ఫిట్‌గా ఉండండి. సన్నగా ఉండడం మీకు సంతోషమైతే సన్నగానే ఉండండి. లావుగా ఉన్నందువల్ల సంతోషంగా ఉంటామనుకుంటే లావుగానే ఉండండి’’ అని సప్న సూచన. ఇందులో ఆమె మగాళ్లకు మృదువుగా వేసిన మొటిక్కాయ కూడా ఉంది! ఆడవాళ్ల అందం గురించి అదే పనిగా ఆలోచించడం మాని, పనికొచ్చే పనేదైనా ఉంటే చూసుకొమ్మని!

ఇన్ని మాట్లాడుతున్నాం కానీ ఎంతైనా ‘సన్నం... సన్నం’ అని మనసు పీకుతూనే ఉంటుంది. మన మైండ్‌లు అలా ఫిక్స్ అయిపోయాయి. అయితే ఈ సాంస్కృతిక కోమలత్వపు కలవరింత (కల్చరల్ ఫిక్సేషన్) ఆడవాళ్ల అందం గురించి కాదనీ, వారి అణకువపై మగవాళ్లకుండే పరితపన (అబ్సెషన్) మాత్రమేనని ‘ది బ్యూటీ మిత్’ రచయిత్రి నవోమీ ఉల్ఫ్ చెబుతున్నారు. బ్యూటీ మీదే కాదు, ఆడవాళ్ల ‘డూస్ అండ్ డోంట్స్’ మీద కూడా ఏళ్లుగా మనక్కొన్ని మిత్‌లు ఉండిపోయాయి. ఆ కల్పితాలను ఎగరగొట్టేందుకు ఆ మధ్య ‘ఏక్ బూరీ లడికీ’ (బ్యాడ్ గర్ల్) అని ఒక పోస్టర్ సెటైర్ నెట్‌లోకి వచ్చింది. చెడ్డమ్మాయిల గుణగణాలను ఆ పోస్టర్‌లో ఒక పట్టికలా ఇచ్చారు. బ్యాడ్ గర్ల్స్ మితి మీరి తింటారట. లేదా అసలే తిండి మానేస్తారట. రోటీలు గుండ్రంగా తయారు చేయలేరట. వెంట్రుకల్ని విరబోసుకుని వీధుల్లోకి వచ్చేస్తారట. ఇలాంటి ఓ పన్నెండు వరకు ఉన్నాయి. వాటన్నింటినీ ఒంటికి పట్టించుకోకపోతే మనక్కొంచెం ఫ్యాట్ తగ్గుతుంది. ఆడవాళ్ల అందంలోని ఫ్యాట్ కన్నా, మగవాళ్ల ఆలోచనల్లోని ఫ్యాట్ ఎక్కువ హానికరం.
 
బాలీవుడ్ నటి సోనాక్షీ సిన్హా :  ట్విట్టర్‌లో తన బరువుపై వచ్చిన జోకులకు ఆమధ్య సోనాక్షీ  ఎంతో బాధపడ్డారు. ‘‘అస్థిపంజరం అందంగా ఉంటుందని అనుకునే మీలాంటి వారికి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు’’ అని ఆమె సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేశారు. సోనాక్షికైనా, మనకైనా సప్న భావ్‌నాని ఇస్తున్న సలహా ఏమిటంటే.. ఇలాంటి కామెంట్‌లను అస్సలు పట్టించుకోవద్దని. మీరు మీలా ఉండండని!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement