'సైజ్ జీరో' ప్రచార జోరు
టాలీవుడ్ స్వీటీ అనుష్క నటించిన 'సైజ్ జీరో' సినిమా ప్రచారానికి పీవీపీ సంస్థ భారీ ఎత్తునే సన్నాహాలు చేసినట్టుంది. కాదేదీ పబ్లిసిటీకి అనర్హం అన్నట్టుగా రైలు బోగీలను తమ ప్రచారానికి వాడుకుంటున్న వైనం ఇప్పుడు పలువురిని ఆకట్టుకుంటోంది. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్‌లోని రైళ్లలో 'సైజ్ జీరో' ప్రచారానికి పీవీపీ సంస్థ రెడీ అయింది. దక్షిణ మధ్య రైల్వేకు చెందిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సహా పలు నగరాలకు వెళ్ళే రైళ్ళ లో ప్రచారానికి శ్రీకారం చుట్టింది. రైళ్ల వెలుపల, బయట.. సైజ్ జీరో సినిమాకు సంబంధించిన పోస్టర్స్, డిజైన్స్ ఉండేలా వినూత్నంగా ప్రచారం చేస్తోంది.
దీనికి సంబంధించి పీవీపీ సంస్థ ...ఓ క్రియేటివ్ ఏజెన్సీతో కలిసి ఈ ట్రయిన్ పబ్లిసిటీని ప్లాన్ చేసిందట. అందులో భాగంగానే రైలు బోగీలపై ఈ సైజ్ జీరో పోస్టర్లు సందడి చేస్తున్నాయి. రోజుకు లక్షలాది మంది ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేరవేస్తున్న రైల్వేస్ను ప్రచారానికి ఎన్నుకోవడం మంచి ఎత్తుగడే అని చెప్పుకోవాలి. టాలీవుడ్తో పాటు అన్నిభాషల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'సైజ్ జీరో' సినిమా తెలుగు, తమిళ భాషల్లో నవంబర్ 27న విడుదల చేయనున్నారు. ఓపెనింగ్ లోనే భారీ వసూళ్లను రాబట్టాలని చిత్ర యూనిట్ యోచిస్తోంది.
ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు తనయుడు ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రకాశ్ భార్య కణిక ఈ చిత్రానికి స్క్రిప్ట్ అందించారు. తెలుగు, తమిళ భాషల్లో పీవీపీ పతాకంపై ప్రసాద్ వి. పొట్లూరి ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటించేందుకు అనుష్క ఏకంగా 20 కేజీల బరువు పెరిగిన విషయం తెలిసిందే. ఆర్య, సోనాల్ చౌహాన్ ముఖ్య పాత్రధారులు. ఈ చిత్రంలో నాగార్జున తళుక్కున మెరవనున్నారని సమాచారం.