Prakash kovelamudi
-
రెండు విడాకులు.. ఒక రూమర్!
ఉబుసుకోక ఊహాలకు పనిచెప్పే గాసిప్‌రాయుళ్లు కొందరుంటారు. తలా-తోకాలేని ఊహాలతో కథనాలల్లి.. మీడియాలో పుకార్లకు షికార్లు తొడుగుతారు. తాజాగా ఓ రెండు జంటలు తాము వేరవుతున్నట్టు ప్రకటించాయి. వైవాహిక బంధం నుంచి తప్పుకొని.. పరస్పర సామరస్యంతో విడాకులు తీసుకుంటున్నట్టు వెల్లడించాయి. అంతే, రాసిప్రాయుళ్లు తమ చెత్తబుర్రలకు పదును పెట్టారు. ఈ జంటల విడాకులకు మధ్య ఇంటర్‌లింక్‌ను సృష్టించి.. ఎఫైర్ కారణంగానే వాళ్లు విడిపోయారంటూ కథనాలు అల్లారు. దీనిపై ఆ జంటలు స్పందించి.. ఆ పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టాయి. ఇటీవల విడాకులు తీసుకున్న సినీ జంటలు దియా మీర్జా-సాహిల్ సంఘా, ప్రకాశ్ కోవెలముడి-కనికా దిల్హాన్ విషయంలో ఇది జరిగింది. బాలీవుడ్ నటి దియా మీర్జా తన భర్త సాహిల్ సంఘా నుంచి వేరవుతున్నట్టు ప్రకటించగా.. అదే సమయంలో దర్శకుడు ప్రకాశ్ కోవెలమూడి భార్య, స్క్రీన్‌రైటర్ కనికా దిల్హాన్ తాము విడాకులు తీసుకున్నట్టు వెల్లడించారు. దీంతో దియా-సాహిల్ విడాకులకు కారణం కనికా దిల్హాన్ అని వదంతులకు తెరతీశారు. సాహిల్‌తో కనికకు ఉన్న ఎఫైర్ కారణంగా ఈ రెండు జంటలు వేరయ్యాయి అంటూ కథనాలు సృష్టించారు. దీనిపై దియా మీర్జా స్పందిస్తూ.. ఈ వదంతులకు అసలు అర్థమే లేదని కొట్టిపారేశారు. తాము విడిపోవడం వెనుక మూడో వ్యక్తి ప్రమేయమే లేదని ఆమె ట్విటర్లో స్పష్టం చేశారు. కనిక కూడా ట్విటర్లో ఈ కథనాలపై స్పందించారు. దియా, సాహిల్‌లను తన జీవితంలో ఏనాడూ కలుసుకోలేదని స్పష్టం చేశారు. ఇది అత్యంత దారుణమైన, జుగుప్సకరమైన వదంతులని, టాబ్లాయిడ్లు కొంచెం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మండిపడ్డారు. ఏకకాలంలో జరిగిన రెండు ఘటనల మధ్య ఇంటర్‌లింక్‌ను సృష్టించడం సరికాదని, తాను ఫిక్షన్ రైటర్‌నని, తనను మించిపోయారని గాసిప్రాయుళ్లను ఎద్దేవా చేశారు. సాహిల్ సంఘా కూడా ఈ వదంతులను తీవ్రంగా ఖండించారు. -
విడాకులు తీసుకున్న దర్శకేంద్రుడి కుమారుడు!?
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కుమారుడు ప్రకాశ్ కోవెలమూడి విడాకులు తీసుకున్నారనే వార్తలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రకాశ్ - కనికా ధిల్లాన్ విడిపోయారంటూ ఆంగ్ల వెబ్సైట్లు వార్తలు ప్రచురించాయి. వీరిద్దరు కలిసి పని చేసిన తాజా చిత్రం ‘జడ్జిమెంటల్ హై క్యా’ షూటింగ్ ప్రారంభానికి ముందే ఈ జంట విడిపోయినట్లు సమాచారం. విడిపోయి రెండేళ్లు అవుతున్నా.. సినిమా కోసం కలిసి పని చేశారంటూ ప్రచారం జరుగుతుంది. ‘‘జడ్జిమెంటల్ హై క్యా’ చిత్రం షూటింగ్ కంటే ముందే.. అంటే 2017లోనే మేం విడిపోయాం’ అంటూ ఇద్దరు ఓ ఉమ్మడి ప్రకటన విడుదల చేసినట్లు ఇండియాటుడే ఓ వార్త ప్రచురించింది. ఈ విషయం గురించి ప్రకాశ్ కోవెలమూడి మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం నేను హైదరాబాద్‌లోనే సెటిల్ అయ్యాను. కనికా మాత్రం రెండేళ్ల క్రితమే ముంబై షిప్ట్ అయ్యింది’ అని పేర్కొన్నట్లు సమాచారం. ఈ విషయంపై కనికా ఎక్కువగా స్పందించలేదని తెలుస్తోంది. ‘విడిపోయారు కదా.. కలిసి పని చేస్తారా’ అని విలేకరులు ఆమెను ప్రశ్నించగా.. ‘తప్పకుండా. జడ్జిమెంటల్ హై క్యా సినిమా కోసం కలిసి పని చేశాం.. విజయం కూడా సాధించాం కదా. తప్పకుండా మరో ప్రాజెక్ట్ కోసం కలిసి పని చేస్తామని’ కనికా పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఈ విషయంలో వీరిద్దరి నుంచి ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా కంగనా రనౌత్, రాజ్‌కుమార్ రావు జంటగా నటించిన ‘జడ్జిమెంటల్ హై క్యా’ చిత్రానికి ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వం వహించగా.. కనికా కథా సహకారం అందించారు. వీరిద్దరూ 2014లో వివాహ బంధంతో ఒక్కటయిన సంగతి తెలిసిందే. -
‘దొంగతనం చేస్తారా..సిగ్గుపడండి’
బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్, రాజ్కుమార్ల్ ప్రధాన పాత్రల్లో రూపొందిన జడ్జిమెంటల్ హై క్యా పోస్టర్‌పై వివాదం చెలరేగింది. తన అనుమతి లేకుండానే తన ఆర్ట్‌ను ఉపయోగించుకున్నారంటూ హంగేరీకి చెందిన ఓ మహిళా ఫొటోగ్రాఫర్ ఆ మూవీ టీంపై విమర్శలు గుప్పించారు.ఎవరి జీవితాన్ని వాళ్లు సెలబ్రేట్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా పోస్టర్లను కాస్త భిన్నంగా డిజైన్ చేశారు. ఇందులో హీరోహీరోయిన్ల ఫొటోలతో కూడుకున్న ఓ పోస్టర్లో కంగనా, రాజ్‌కుమార్‌ల ఒక కన్ను స్థానంలో పిల్లి, ఎలుకలు దర్శనమిచ్చాయి. ఈ క్రమంలో ఈ పోస్టర్‌పై స్పందించిన హంగేరియన్ ఫొటోగ్రాఫర్ ఫ్లోరా బోర్సీ కంగనా, తన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ....‘ ఏమైనా పోలికలు ఉన్నాయా? ఇదొక ప్రఖ్యాత బాలీవుడ్ సినిమా జడ్జిమెంటల్ హై క్యా పోస్టర్. వాళ్లు కనీసం నా అనుమతి కోరలేదు. అలాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా నా లాంటి ఫ్రీలాన్స్ ఆర్టిస్టుల స్మజనాత్మకతను దొంగిలించడం సిగ్గుచేటు’ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ నేపథ్యంలో నెటిజన్లు ఆమెకు అండగా నిలిచారు. ఈ చిత్ర నిర్మాత ఏక్తాకపూర్, కంగనా టీమ్‌పై మండిపడుతున్నారు. ‘ పర్మిషన్ లేకుండా ఒకరి క్రియేటివిటీని దొంగిలించి మీరు బాగానే సొమ్ము చేసుకుంటున్నారు. ఇందుకు ఏమాత్రం సిగ్గు అనిపించడం లేదా’ అంటూ పరుష పదజాలంతో విరుచుకుపడుతున్నారు. ‘సినిమా మొత్తం కాపీనే అయి ఉంటుంది.. మా బాలీవుడ్ వాళ్లకు ఇదొక అలవాటు అయిపోయింది. మేము సిగ్గుపడుతున్నాం మేడం’ అంటూ భారత అభిమానులు బోర్సీకి మద్దతు పలుకుతున్నారు. ఈ క్రమంలో ఎవరో ఒకరు చేసిన పనికి మొత్తం ఇండస్ట్రీని, జన్మభూమిని కించపరిచే విధంగా మాట్లాడటం వల్ల ఉపయోగం ఉండదు అంటూ ఆమె హితవు పలికారు. ఇక ఈ విషయంపై జడ్జిమెంటల్ హై క్యా టీం ఏవిధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. కాగా కంగనా రనౌత్, రాజ్‌కుమార్ రావ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రకాశ్ కోవెలముడి దర్శకత్వం వహించాడు. జూలై 26న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. oh yeah, this image somehow reminds me of.. oh wait. looks like totally my work! 😕😕😕😕 https://t.co/6XhiK317Re — Flora Borsi (@FloraBorsi) July 29, 2019 -
కాంబినేషన్ కుదిరేనా?
‘‘హైదరాబాద్ బాయ్స్ ఇక్కడ ఉన్నారు...’ అంటూ శ్రుతీహాసన్ నటుడు రానా, దర్శకుడు ప్రకాశ్ కోవెలమూడితో కలసి దిగిన ఓ ఫొటోను బయటపెట్టారు. అంతే.. ఈ ఫొటో ఆధారంగా కథలు మొదలయ్యాయి. ఇంతకీ ఇక్కడ అని శ్రుతీహాసన్ అన్నది ముంబై గురించే. ప్రస్తుతం ఆమె ముంబైలో ఉన్నారు. అక్కడే ఈ ముగ్గురూ మీట్ అయి, సెల్ఫీలు దిగి సందడి చేశారు. దాంతో రానా, శ్రుతి కాంబినేషన్లో ప్రకాశ్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడని వార్తలు మొదలయ్యాయి. ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో వచ్చిన ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాతో శ్రుతీహాసన్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. అప్పటినుంచే ఇద్దరి మధ్య మంచి స్నేహం కొనసాగుతోంది. అయితే రానా, శ్రుతీ కలసి యాక్ట్ చేయలేదు. మరి.. ఈ కాంబినేషన్ ప్రకాశ్ సినిమాతో కుదురుతుందా? అంటే వేచి చూడాలి. ‘కాటమరాయుడు’(2017) సినిమా తర్వాత తెలుగులో మరో సినిమాకు సైన్ చేయలేదు శ్రుతీహాసన్. ప్రస్తుతం ‘లాభం’ అనే తమిళ సినిమా, విద్యుత్‌జమాల్ హీరోగా తెరకెక్కుతున్న ఓ హిందీ సినిమా చేస్తున్నారు. అలాగే అమెరికన్ వెబ్ సిరీస్ ఒప్పుకున్నారు. ఎప్పటిలాగే మరోవైపు తన మ్యూజిక్ జర్నీని కూడా కొనసాగిస్తున్నారు. -
‘ఈ మాఫియాను చూసి భయపడుతున్నారు’
బాలీవుడ్లో ఉన్న నెపోటిజం (బంధుప్రీతి) మాఫియా కారణంగా దక్షిణాది యువ దర్శకులు కూడా భయపడుతున్నారని అంటున్నారు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సోదరి రంగోలి చందేల్. ప్రస్తుతం కంగన ‘మెంటల్ హై క్యా’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే సినిమాలోని కొన్ని సన్నివేశాలతో కంగన సంతృప్తి చెందలేదని, అందుకే దర్శకత్వ బాధ్యతలను తాను కూడా చూసుకోవాలనుకుంటున్నారని ప్రకాశ్ మీడియా ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనిపై ఓ ఆంగ్ల మీడియా సంస్థ ‘మరోసారి కంగన దర్శకత్వ బాధ్యతలను చేజిక్కించుకుంది’ అనే వార్తను ప్రచురించింది. ఈ వార్తపై కంగనా సోదరి రంగోలి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బాలీవుడ్లో ఉన్న నెపోటిజం మాఫియా కంగన కెరీర్‌ను నాశనం చేయడానికి ప్రయత్నిస్తోంది. అందుకే ఇలాంటి వార్తల ప్రచురణకు పాల్పడుతోంది. అసలు విషయం ఏంటంటే.. కొందరు దర్శకులు ఏమీ తెలియని స్టార్ కిడ్స్‌కి అన్నీ దగ్గరుండి నేర్పించాలని అనుకోరు. తమ వెంటే ఉండి అన్ని విషయాల్లో సాయం చేసే నటులు కూడా ఉంటే బాగుంటుందని అనుకునే దర్శకులు కూడా ఉంటారు. కంగన కొత్తగా వస్తున్న దర్శకులకు అవకాశాల తలుపులు తెరిచింది. ఆనంద్ ఎల్ రాయ్(తను వెడ్స్ మను), వికాస్ బెహల్(క్వీన్) లాంటి దర్శకులకు ఆమె అవకాశం ఇచ్చింద’ని రంగోలి తెలిపారు. అంతేకాక ‘యువ దర్శకులు బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాలంటే భయపడుతున్నారు. అలా భయపడే దర్శకులకు ఇలాంటి వార్తలు పనికొస్తాయి’ అంటూ రంగోలి వరుస ట్వీట్లు చేశారు. అంతేకాక కంగనాను ఆలియా, దీపికా పదుకోనే వంటి హీరోయిన్లతో పోల్చవద్దని కోరారు. కంగనా ఏ స్టార్ హీరో, దర్శకుడి సాయం లేకుండా స్వయం కృషితో ఎదిగిందని రంగోలి స్పష్టం చేశారు. -
తెలుగు దర్శకుడితో షారూఖ్!
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్‌కు కొద్ది రోజులుగా కాలం కలిసి రావటం లేదు. షారూఖ్ ఓ సాలిడ్ హిట్ సాధించి చాలా కాలం అయ్యింది. ఎన్నో ఆశలతో స్వయంగా నటించి నిర్మించిన జీరో కూడా బోల్తా పడటంతో కింగ్ ఖాన్ ఆలోచనలో పడ్డాడు. ఇప్పటికే అంగీకరించిన రాకేష్ శర్మ బయోపిక్ సారే జహాసే అచ్చాను కూడా పక్కనపెట్టేశాడు. ఈ పరిస్థితిల్లో షారూఖ్ ఓ తెలుగు దర్శకుడితో కలిసి పనిచేసేందుకు ఓకె చెప్పాడట. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ తెలుగులో అనగనగా ఓ ధీరుడు, సైజ్ జీరో లాంటి సినిమాలను రూపొందించాడు. సక్సెస్ సాధించలేకపోయినా దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ప్రకాష్ బాలీవుడ్లో కంగనా, రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రల్లో మెంటల్ హై క్యా సినిమాను రూపొందిస్తున్నాడు. మానసిక వికలాంగుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో షారూఖ్ అతిథి పాత్రలో నటించనున్నాడట. కథకు కీలకం కావటంతో పాటు పవర్ఫుల్ రోల్ కావటంతో షారూఖ్ కూడా ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. మెంటల్ హై క్యా టైటిల్‌పై పెద్ద ఎత్తున వివాదం జరుగుతోంది. టైటిల్ మానసిక విగలాంగులను అవమానించినట్టుగా ఉందన్న వాదన వినిపిస్తోంది. మరి అసలే సక్సెస్ లేని పరిస్థితుల్లో ఇలాంటి వివాదాస్పద చిత్రంలో షారూఖ్ నటిస్తాడా.? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. -
బాలీవుడ్లో తెలుగు దర్శకుల వార్
సౌత్‌లో సక్సెస్ అయిన కథలు, సినిమాలు మాత్రమే కాదు మన దర్శకులు కూడా బాలీవుడ్లో సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం ఇద్దరు తెలుగు దర్శకులు బాలీవుడ్ తెర మీద యుద్ధానికి సిద్ధమవుతున్నారు. టాలీవుడ్ సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఒరిజినల్‌కు దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. షాహిద్ కపూర్ హీరోగా కబీర్ సింగ్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ అవుతుంది. జూన్ 21న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. అదే రోజు రిలీజ్ కు రెడీ అవుతున్న మరో బాలీవుడ్ మూవీ మెంటల్ హై క్యా. కంగనా రనౌత్, రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా దర్శకుడు కూడా తెలుగు వాడే. అనగనగా ఓ ధీరుడు, సైజ్ జీరో లాంటి సినిమాలను డైరెక్ట్ చేసిన ప్రకాష్ కోవెలమూడి ఈ సినిమాకు దర్శకుడు. ఇలా ఇద్దరు తెలుగు దర్శకులు బాలీవుడ్ సినిమాలతో పోటి పడుతుండటంపై టాలీవుడ్‌లోనూ ఆసక్తికర చర్చ సాగుతోంది. -
‘సైజ్ జీరో’ దర్శకుడి ‘మెంటల్ హై క్యా’
తెలుగులో అనగనగా ఒక ధీరుడు, సైజ్ జీరో సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రకాష్ కోవెలమూడి. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వారసుడిగా వెండితెరకు పరిచయం అయిన ప్రకాష్ కమర్షియల్ సక్సెస్ లు సాధించలేకపోయినా.. విభిన్న చిత్రాలతో తన మార్క్ చూపిస్తున్నాడు. గతంలో మార్నింగ్‌రాగా అనే జాతీయ స్థాయి చిత్రంతో ఆకట్టుకున్న ప్రకాష్ ప్రస్తుతం ఓ బాలీవుడ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. విలక్షణ నటుడు రాజ్ కుమార్ రావ్, స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ కీలక పాత్రల్లో మెంటల్ హై క్యా.? అనే సినిమాను రూపొందిస్తున్నాడు. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమాను బాలాజీ మోషన్ పిక్చర్స్, కర్మ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్రయూనిట్ విడుదల చేశారు. ఆసక్తికరంగా ఉన్న ఈ పోస్టర్స్ ఇప్పుడు సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. -
'సైజ్ జీరో' ప్రచార జోరు
టాలీవుడ్ స్వీటీ అనుష్క నటించిన 'సైజ్ జీరో' సినిమా ప్రచారానికి పీవీపీ సంస్థ భారీ ఎత్తునే సన్నాహాలు చేసినట్టుంది. కాదేదీ పబ్లిసిటీకి అనర్హం అన్నట్టుగా రైలు బోగీలను తమ ప్రచారానికి వాడుకుంటున్న వైనం ఇప్పుడు పలువురిని ఆకట్టుకుంటోంది. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్‌లోని రైళ్లలో 'సైజ్ జీరో' ప్రచారానికి పీవీపీ సంస్థ రెడీ అయింది. దక్షిణ మధ్య రైల్వేకు చెందిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సహా పలు నగరాలకు వెళ్ళే రైళ్ళ లో ప్రచారానికి శ్రీకారం చుట్టింది. రైళ్ల వెలుపల, బయట.. సైజ్ జీరో సినిమాకు సంబంధించిన పోస్టర్స్, డిజైన్స్ ఉండేలా వినూత్నంగా ప్రచారం చేస్తోంది. దీనికి సంబంధించి పీవీపీ సంస్థ ...ఓ క్రియేటివ్ ఏజెన్సీతో కలిసి ఈ ట్రయిన్ పబ్లిసిటీని ప్లాన్ చేసిందట. అందులో భాగంగానే రైలు బోగీలపై ఈ సైజ్ జీరో పోస్టర్లు సందడి చేస్తున్నాయి. రోజుకు లక్షలాది మంది ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేరవేస్తున్న రైల్వేస్‌ను ప్రచారానికి ఎన్నుకోవడం మంచి ఎత్తుగడే అని చెప్పుకోవాలి. టాలీవుడ్‌తో పాటు అన్నిభాషల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'సైజ్ జీరో' సినిమా తెలుగు, తమిళ భాషల్లో నవంబర్ 27న విడుదల చేయనున్నారు. ఓపెనింగ్ లోనే భారీ వసూళ్లను రాబట్టాలని చిత్ర యూనిట్ యోచిస్తోంది. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు తనయుడు ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రకాశ్ భార్య కణిక ఈ చిత్రానికి స్క్రిప్ట్ అందించారు. తెలుగు, తమిళ భాషల్లో పీవీపీ పతాకంపై ప్రసాద్ వి. పొట్లూరి ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటించేందుకు అనుష్క ఏకంగా 20 కేజీల బరువు పెరిగిన విషయం తెలిసిందే. ఆర్య, సోనాల్ చౌహాన్ ముఖ్య పాత్రధారులు. ఈ చిత్రంలో నాగార్జున తళుక్కున మెరవనున్నారని సమాచారం. -
ఈ హీరోయిన్ను గుర్తుపట్టారా?
ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ను గుర్తుపట్టారా?...చెప్పుకోండి చూద్దాం... ఆమెను ఎక్కడో చూసినట్లు ఉంది కదూ... ఎవరో కాదండి బాబూ...అందాల తార అనుష్క. బాహుబలి చిత్రంలో దేవసేనగా కనిపించిన ఆమె ఇప్పుడు 'సైజ్ జీరో' చిత్రంలో న్యూ లుక్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వం వహిస్తున్న సైజ్ జీరో (సన్నజాజి నడుము- ట్యాగ్ లైన్) సినిమా ఫస్ట్ లుక్ శుక్రవారం రిలీజ్ చేశారు. యోగాతో చెక్కిన శిల్పంలా ఉండే అనుష్క ఈ చిత్రంలో తన పాత్ర కోసం దాదాపు ఇరవై కేజీల బరువు పెరిగింది. బొద్దుగా, మొహానికి కళ్లజోడుతో అనుష్క డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తోంది. పీవీపీ సంస్థ నుంచి వస్తున్న ఈ చిత్రంలో ప్రధాన తారగణంగా అనుష్క, తమిళ నటులు ఆర్యా, భరత్, ఊర్వశి నటిస్తుండగా మరో ముఖ్య అతిథి పాత్రలో శృతిహాసన్ మెరవనుంది. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా 1500 థియేటర్స్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు. 'అనగనగా ఓ ధీరుడు' తర్వాత గ్యాప్ తీసుకున్న ప్రకాశ్ రొమాంటిక్ కామెడీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మరో విశేషం ఏంటంటే... ప్రకాశ్ సతీమణి కనికా థిల్లాన్ ఈ సినిమాకు కథ అందించడం. తెలుగు, తమిళర భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీతం ఎంఎం కీరవాణి అందిస్తున్నారు. -
పాత్ర కోసం వంద కిలోల బరువు?
పాత్ర కోసం శరీరాన్ని హింసించుకోవడం, కావాలని బరువు పెరగడం, ఊహించని స్థాయిలో బరువు తగ్గడం... ఇలాంటి ఫీట్లన్నీ ఎక్కువగా హీరోలే చేస్తుంటారు. హీరోయిన్లు చేసేది తక్కువ. ఆ మధ్య బాలీవుడ్లో ‘మేరీ కోమ్’ సినిమా కోసం ప్రియాంక చోప్రా కండలు పెంచి, సహజంగా స్త్రీలకుండే సున్నితత్వాన్ని సైతం ఆ పాత్ర కోసం కోల్పోయారు. మళ్లీ మునుపటి సోయగం కోసం ప్రస్తుతం ఆమె ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం దేనికంటే... అందాల అనుష్క కూడా త్వరలో అలాంటి సాహసమే చేయబోతున్నారట. పాత్ర కోసం తన బరువుని ఏకంగా వంద కిలోలకు పెంచనున్నారట. ఇప్పటికే... రుద్రమదేవి, బాహుబలి చిత్రాల కోసం గుర్రపు స్వారీనీ, యుద్ధ విద్యలను అభ్యసించి ఆ పాత్రల కోసం అనుష్క అహర్నిశలూ శ్రమిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలు నిర్మాణంలో ఉండగానే, మరో ప్రయోగాత్మక పాత్రకు ఈ అందాలభామ పచ్చజెండా ఊపారనేది తాజా సమాచారం. కె.రాఘవేంద్రరావు తనయుడు కోవెలమూడి ప్రకాశ్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో అనుష్క ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలిసింది. అందులోని ఓ పాత్ర... అధిక బరువుతో అపర కాళికలా కనిపించాల్సి వస్తుందట. ఆ విషయం తెలిసి కూడా ఆ చిత్రంలో నటించడానికి అంగీకారం తెలిపారట అనుష్క. తోటి హీరోయిన్లందరూ గ్లామర్ పాత్రల కోసం వెంపర్లాడుతుంటే.. అనుష్క మాత్రం వారికి భిన్నంగా ఇలా ప్రయోగాత్మక పాత్రలు చేయడానికి మొగ్గు చూపడం నిజంగా అభినందనీయం.