పాత్ర కోసం వంద కిలోల బరువు?
పాత్ర కోసం శరీరాన్ని హింసించుకోవడం, కావాలని బరువు పెరగడం, ఊహించని స్థాయిలో బరువు తగ్గడం... ఇలాంటి ఫీట్లన్నీ ఎక్కువగా హీరోలే చేస్తుంటారు. హీరోయిన్లు చేసేది తక్కువ. ఆ మధ్య బాలీవుడ్‌లో ‘మేరీ కోమ్’ సినిమా కోసం ప్రియాంక చోప్రా కండలు పెంచి, సహజంగా స్త్రీలకుండే సున్నితత్వాన్ని సైతం ఆ పాత్ర కోసం కోల్పోయారు. మళ్లీ మునుపటి సోయగం కోసం ప్రస్తుతం ఆమె ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం దేనికంటే... అందాల అనుష్క కూడా త్వరలో అలాంటి సాహసమే చేయబోతున్నారట. పాత్ర కోసం తన బరువుని ఏకంగా వంద కిలోలకు పెంచనున్నారట. ఇప్పటికే... రుద్రమదేవి, బాహుబలి చిత్రాల కోసం గుర్రపు స్వారీనీ, యుద్ధ విద్యలను అభ్యసించి ఆ పాత్రల కోసం అనుష్క అహర్నిశలూ శ్రమిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలు నిర్మాణంలో ఉండగానే, మరో ప్రయోగాత్మక పాత్రకు ఈ అందాలభామ పచ్చజెండా ఊపారనేది తాజా సమాచారం.
కె.రాఘవేంద్రరావు తనయుడు కోవెలమూడి ప్రకాశ్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో అనుష్క ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలిసింది. అందులోని ఓ పాత్ర... అధిక బరువుతో అపర కాళికలా కనిపించాల్సి వస్తుందట. ఆ విషయం తెలిసి కూడా ఆ చిత్రంలో నటించడానికి అంగీకారం తెలిపారట అనుష్క. తోటి హీరోయిన్లందరూ గ్లామర్ పాత్రల కోసం వెంపర్లాడుతుంటే.. అనుష్క మాత్రం వారికి భిన్నంగా ఇలా ప్రయోగాత్మక పాత్రలు చేయడానికి మొగ్గు చూపడం నిజంగా అభినందనీయం.