rudrama Devi
-
ధైర్యసాహసాలు అనగానే మరో ఆలోచనే.. చమేలీ.. ఓ ధీశాలి!
ధైర్యసాహసాలు అనగానే ఇంకో ఆలోచన లేకుండా రాణీ రుద్రమ పేరే గుర్తొస్తుంది! అలాంటి ధీశాలి బస్తర్ ప్రాంత చరిత్రలోనూ కనిపిస్తుంది! ఆమె పేరే చమేలీదేవి! ఛత్తీస్‌గఢ్ సర్కారు ఇటీవలే ఆమె విగ్రహాన్ని చిత్రకూట్ జలపాతం దగ్గర ప్రతిష్ఠించింది. ఆ కథతో కాకతీయులకు, కాకతీయులతో మనకు చారిత్రక సంబంధం ఉంది కాబట్టి ఒకసారి బస్తర్ దాకా వెళ్లొద్దాం..తెలుగు నేలను పాలించిన రాజవంశాల్లో కాకతీయులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా రాణి రుద్రమ పురుషాధిక్యతను ఎదుర్కొంటూ మంచి ఏలికగా పేరు తెచ్చుకుంది. ఆమె తర్వాత పాలనా పగ్గాలు ప్రతాపరుద్రుడి చేతికి వచ్చాయి. అదే సమయంలో ఢిల్లీ సుల్తానులు, మహారాష్ట్ర దేవగిరి రాజుల దాడులు పెరిగాయి. ముందు జాగ్రత్తగా ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన పనిని తన తమ్ముడైన అన్నమదేవుడికి అప్పగించాడు ప్రతాపరుద్రుడు. ఆ బాధ్యతలో భాగంగా గోదావరి నది దాటి దండకారణ్యంలో కొత్త రాజ్యస్థాపనకు బయల్దేరాడు అన్నమదేవుడు. ఒక్కో రాజ్యాన్ని జయిస్తూ క్రీ.శ. 1323 కల్లా ఇంద్రావతి నదీ సమీపంలోని బర్సూర్ ప్రాంతానికి చేరుకున్నాడు.పరిచయం..ఆ ఇంద్రావతి నదీ తీర ప్రాంతాన్ని నాగవంశీయుడైన హరి చంద్రదేవ్ పాలిస్తున్నాడు. అతనికి చమేలీదేవి అనే కూతురు ఉంది. గొప్ప అందగత్తె. కళలతో పాటు రాజకీయ, రణతంత్రాలలో శిక్షణ పొందింది. తండ్రికి పాలనా వ్యవహరాల్లో సాయమందించేది. ఇంద్రావతి నదీ తీరాన్ని గెలవాలని నిర్ణయించుకున్న అన్నమదేవుడు దండకారణ్యాన్ని ఏలుతున్న హరి చంద్రదేవ్‌కు రాయబారం పంపాడు. యువరాణి చమేలీదేవిని తనకిచ్చి వివాహం జరిపించాలని, ఆ ఒప్పందానికి సమ్మతం తెలిపితే హరి చంద్రదేవ్‌ను రాజుగా కొనసాగిస్తామంటూ సందేశం పంపాడు.ఆత్మగౌరవం..కనీసం తన ఇష్టాయిష్టాలను తెలుసుకోకుండా ఏకపక్షంగా పెళ్లి ప్రతిపాదన తేవడాన్ని చమేలీదేవి వ్యతిరేకించింది. పెళ్లికి యుద్ధానికి లంకె పెట్టడాన్ని తప్పుపట్టింది. అన్నమదేవుడి ప్రతిపాదనను అంగీకరిస్తే నాగవంశీయుల ప్రతిష్ఠకు భంగమంటూ తేల్చి చెప్పింది. పెళ్లితో వచ్చే రాజ్యం, మర్యాదల కంటే యుద్ధంతో తేలే ఏ ఫలితమైనా మేలంటూ తండ్రిని ఒప్పించింది. యుద్ధరంగంలోనే అమీతుమీ తేల్చుకుందామంటూ అన్నమదేవుడికి ఘాటైన సమాధానం పంపింది.ఆత్మార్పణం..లోహండిగూడ వద్ద నాగవంశీయులు, కాకతీయల సైన్యానికి మధ్య హోరాహోరీ పోరు మొదలైంది. మహారాజు హరి చంద్రదేవ్‌కు తోడుగా యువరాణి చమేలీదేవి యుద్ధ క్షేత్రానికి చేరుకుంది. యుద్ధం మూడోరోజున తీవ్రంగా గాయపడిన హరి చంద్రదేవ్ మరణించాడు. ఆ మరుసటి రోజు కోటలో రాజు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తుండగా వారిని వెంటాడుతూ వచ్చిన కాకతీయ సైన్యాలు కోటను చుట్టుముట్టాయి. తీవ్ర నిర్భంధం మధ్య తండ్రి అంత్యక్రియలను కొనసాగించిన చమేలీదేవీ చివరకు ఆత్మాహుతికి పాల్పడినట్టుగా చెబుతారు. చమేలీదేవి ప్రాణత్యాగంపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ అన్నమదేవుడికి ఎదురు నిలిచిన వైనం, ఆత్మాభిమానం, «ధైర్యసాహసాలు, రాజకీయ చతురతలపై మాత్రం ఏకాభిప్రాయం ఉంది. అందుకు బస్తర్ దసరా వేడుకల్లో నేటికీ కొనసాగుతున్న సంప్రదాయలే నిదర్శనం.ఆరాధనం..బస్తర్‌లో ఏటా దసరా వేడుకలను 75 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. బస్తర్ మహారాజు.. దంతేశ్వరి మాత దర్శనానికి వెళ్లే రథాన్ని మల్లెపూలతో అలంకరిస్తారు. ఈ పువ్వులను చమేలీదేవి ప్రతిరూపంగా కొలుస్తారు. రథం ఆలయానికి చేరిన తర్వాత స్థానికులు ఆ పువ్వులను తమ తలపాగాల్లో ధరిస్తారు గౌరవ సూచకంగా. అనంతరం వాటిని చిత్రకూట్ జలపాతానికి ఎగువ భాగంలో నిమజ్జనం చేస్తారు. అంతేకాదు ఇక్కడున్న అనేక గిరిజన తెగలు చమేలీదేవి ధైర్యసాహసాలు, ప్రాణత్యాగానికి గుర్తుగా కలశాల్లో దీపారాధన చేస్తారు. చమేలీదేవి మరణానికి కారణమైనందుకు ప్రాయశ్చిత్తంగా అన్నమదేవుడే ఈ సంప్రదాయాలకు చోటు కల్పించినట్టుగా చెబుతారు. ఏడువందల ఏళ్లకు పైగా ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. ఇటీవలే.. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఇండియా నయాగరాగా పేరొందిన చిత్రకూట్ (ఇంద్రావతి నది) జలపాతం దగ్గర యువరాణి చమేలీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆమెను గౌరవించింది. – తాండ్ర కృష్ణ గోవింద్, సాక్షి, కొత్తగూడెం -
చిన్నప్పటి నుంచి అవే ఊహలే
తమిళసినిమా: అనుష్క అంటే ఒకప్పుడు అందాల నటి మాత్రమే. ఇప్పుడు అందం, అభినయం కలబోసిన జాణ. అలాంటి తార నేను ఊహల్లో జీవించానంటోంది. తన చిన్నతనంలోనే బాహుబలిలో యువరాణిగా ఊహల్లో జీవించేశానని చెప్పుకొచ్చింది. అనుష్క కెరీర్లో అరుంధతి, బాహుబలి, రుద్రమదేవి, భాగమతి వంటి చిత్రాలు మైలురాళ్లుగా నిలిచిపోతాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అనుష్కను ఇప్పుడు సాదా సీదా కథా పాత్రల్లో ప్రేక్షకులు జీర్ణించుకోలేరు. ఈ విషయాన్ని గ్రహించిన స్వీటీ ప్రస్తుతం పాత్రల ఎంపిక విషయంలో చాలా శ్రద్ధ చూపిస్తున్నారు. అందులో భాగంగానే కొత్త చిత్రాలు అంగీకరించలేదంటున్న అనుష్క తాజాగా ఒక భారీ చిత్రంలో నటించడానికి రెడీ అవుతోందట. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కనుందని సమాచారం. తన సినీ అనుభవం గురించి ఈ బ్యూటీ తెలుపుతూ హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించి రాణించగలనని నిరూపించుకున్నానంది. తన విజయాల వెనుకున్నది దర్శకులేనని, మంచి కథాపాత్రల్లో వాళ్లు నటింపజేయడం వల్లే పేరు అని పేర్కొంది. చిన్నవయసులోనే తాను పురాణ, చరిత్ర పుస్తకాలను ఆసక్తిగా చదివేదాన్ననీ, అదే విధంగా కల్పిత కథలను ఎక్కువగా చదివేదానినని చెప్పింది. అలాంటి కథలోని ఒక పాత్రలో తనను ఊహించుకుని జీవించేదానిననీ అంది. అలాంటి ఊహల్లోంచి బయటకు రావడానికి కూడా ఇష్టపడేదాన్ని కాదనీ, అదో తీయని అనుభవంగా ఉండేదని పేర్కొంది. రాజ్యాలు, కోటలు కూడా తన ఊహల్లో మెదిలేవనీ, అలా తాను మహారాణి ఊహించుకుని జీవించేదాన్నని చెప్పింది. ఆ ఊహలే బాహుబలి లాంటి చిత్రాల్లో నటించడానికి ధైర్యాన్నిచ్చాయని భావిస్తానంది. ఇంకా చెప్పాలంటే బాహుబలి చిత్రం తాను చిన్నవయసులో ఊహించిన విధంగానే అమరిందని చెప్పింది. విజయాల గురించి ఎదురు చూడననీ, బాధ్యతను నిర్వహించు ఫలితాన్ని ఎదురు చూడకు అన్నది తన ఫాలసీ అని పేర్కొంది. -
మరి ‘రుద్రమదేవి’ మాటేంటి?
వియ్యంకుడు, బావమరిది అయిన బాలకృష్ణ నటించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’కి ఏపీ సీయం చంద్రబాబు వినోదపు పన్ను రాయితీ ప్రకటించడాన్ని దర్శకుడు గుణశేఖర్ స్వాగతించారు. అయితే, గతంలో తాను తీసిన ‘రుద్రమ దేవి’ చిత్రానికి తెలంగాణ సీయం కేసీఆర్ వినోదపు పన్ను రాయితీ ఇవ్వగా, ఏపీ ప్రభుత్వం మాత్రం ఓ కమిటీ వేసి ఫైలుని మూసేసిన సంగతిని ప్రస్తావించారు. ‘శాతకర్ణి’కి పన్ను రాయితీ ఇచ్చినవేళ, మరోసారి తమ దరఖాస్తుని పరిశీలిం చాలని చంద్రబాబుని కోరారు. ‘‘రుద్రమ దేవి వట్టి తెలంగాణ యోధురాలు కాదు. దక్షిణాది నంతటినీ పాలించిన రాణి. ఆమె పట్టాభి షేకం సందర్భంగా అమరావతి వద్ద వేయించిన ‘మార్కాపురం శాసనా’న్ని ఇటీ వల మీరో సభలో ఉదాహరించారు. ఈ నేపథ్యంలో ఏపీలో ‘రుద్రమదేవి’కి వసూలు చేసిన వినోదపు పన్ను మొత్తానికి సమానమైన ‘ప్రోత్సాహక నగదు’ అందజేసి మీ ప్రభుత్వం నిష్పక్షపాతంగా పనిచేస్తుందని మరోమారు రుజువు చేయండి’’ అని గుణశేఖర్ కోరారు. -
ఇంకా వండర్స్ చేస్తాను!
►గుణశేఖర్ మొండివాడు... అంతకుమించి కార్యసాధకుడు. ఎప్పటికప్పుడు పెద్ద పెద్ద కలలు కంటూ ఉంటాడు... ► ఆ కలల్ని నిజం చేసుకోవడం కోసం అహోరాత్రులు శ్రమిస్తాడు... ప్రాణం పెట్టేస్తాడు. సినిమాపై ఉండే ► ఆ వ్యామోహమే అతన్ని ఇంత హైట్స్‌లో కూర్చోబెట్టింది. గుణశేఖర్ కొన్నేళ్ల నాటి కల ‘రుద్రమదేవి’... ► సెల్యులాయిడ్‌పై ఈ నెల 9న ఆవిష్కృతం కానుంది. ఈ సందర్భంగా గుణశేఖరుని వ్యూస్... My రుద్రమదేవి ఇక్కడ ‘మై’ అని ఎందుకంటున్నానంటే, రుద్రమదేవి జీవితం... ఆమె సాహసం... వ్యక్తిత్వం నన్నంతగా ప్రభావితం చేశాయి. రుద్రమదేవి కథ చదివినవాళ్లు కూడా అలాగే ఫీలవుతారు. ఎప్పుడో ఎనిమిదో తరగతిలో ఉపవాచకంగా చదివిన ‘రుద్రమదేవి’ ఆ క్షణం నుంచి నన్ను వెంటాడుతూనే ఉంది. ‘బ్రేవ్ హార్ట్’ అనే హాలీవుడ్ మూవీ చూసినప్పుడు మాత్రం ఇలా గ్రాండియర్‌గా ‘రుద్రమదేవి’ తీస్తే బావుంటుందనిపించింది. ‘ఒక్కడు’ తర్వాత నుంచే ఇందుకు సంబంధించి నా ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే హీరోయిన్ ఓరియెంటెడ్‌గా 25-30 కోట్ల రూపాయల బడ్జెట్ అంటే అందరూ భయపడ్డారు. గోన గన్నారెడ్డి వ్యూలో తీయమని చాలామంది సలహా ఇచ్చారు. నాకలా చేయడం ఇష్టం లేదు. అప్పటి నుంచీ ‘రుద్రమదేవి’ చేయాలని అనుకుంటున్నా, కాలం కలిసిరాలేదు. చివరకు నేనే రంగంలోకి దిగా. ఈ విషయంలో నా కుటుంబం మొత్తం నాకు అండగా నిలబడ్డారు. అలాగే అనుష్క, బన్నీ, రానా, ప్రకాశ్‌రాజ్, నిత్యామీనన్, ఇళయరాజా... ఇలా ఈ టీమ్ మొత్తం నన్ను నమ్మారు. ఈ కథను నమ్మారు. అందుకే ఎన్ని కష్టాలు ఎదురైనా ఈ 9న మీ ముందుకు సినిమా తీసుకురాగలుగుతున్నా. ఇండియాలోనే ఫస్ట్ హిస్టారికల్ మూవీ ఇది. రుద్రమదేవి పుట్టుక నుంచి ఈ సినిమా మొదలవుతుంది. ఆమె విక్టరీస్లోని ప్రధాన ఘట్టం వరకూ ఈ సినిమా ఉంటుంది. 2 గంటల 38 నిమిషాల నిడివిలో ఆమె చరిత్ర అంతా చూపడం అసాధ్యం. అందుకే భవిష్యత్తులో ‘ప్రతాపరుద్రుడు’ కథతోనూ సినిమా చేస్తాను. ‘రుద్రమదేవి’ పాత్రకు అనుష్క ఎంపిక అనేది పబ్లిక్ ఛాయిస్. ‘అరుంధతి’తో పోలిక వస్తుందేమోనని నేను తటపటాయిస్తుంటే, అందరూ అనుష్కను మించిన ఆప్షన్ లేదని చెప్పారు. ‘రుద్రమదేవి’ చరిత్ర యథాతథంగా ఎక్కడాలేదు. ఒక టీమ్‌ను పెట్టి ఎంతో పరిశోధన చేసి ఈ స్క్రిప్ట్ రెడీ చేశా. అందరూ ఈ చిత్రాన్ని ‘బాహుబలి’తో కంపేర్ చేస్తున్నారు. అది జానపదం. ఇది చారిత్రకం. నా దగ్గర డబ్బులున్నా యని వేయి స్తంభాల గుడి బదులు, పదివేల స్తంభాల గుడి కట్టలేను కదా. ఏది ఏమైనా ఇదొక మహాయజ్ఞం. రేపు తెరపై చూస్తే మీరే అంగీకరిస్తారు. My Motive నమ్మిన లక్ష్యం కోసం త్రికరణ శుద్ధిగా పని చేసుకుంటూ వెళ్తే విజయం దానంతట అదే వరిస్తుంది. My Dreams ఈ రోజు కలలు రేపు ఉండవు. రేపటి కలలు ఎల్లుండికి ఉండవు. కానీ కొన్ని కలలు మాత్రం పర్మినెంట్‌గా మనతోనే ట్రావెల్ చేస్తుంటాయి. వాటిని నెరవేర్చుకోవడమే నా లక్ష్యం, లక్షణం. ‘రుద్రమదేవి’ లాంటి వండర్స్ ఇంకా చేస్తాను. My Strength ఇమాజినేషన్... ఊహించగలగడం... కలలు కనడం... ఇవే నన్ను దర్శకునిగా ఇన్నేళ్లూ నిలబెట్టాయి. ఇంకా నిలబెడతాయి కూడా. ఇక పర్సనల్‌గా నా స్ట్రెంగ్త్ ఏంటంటే... నా డెడికేషన్. ఏదైనా అనుకుంటే వేరే యావగేషన్స్ లేకుండా అనుకున్నది సాధించగలను. My Family సక్సెస్ వస్తే... నేను మారను. ఫెయిల్యూర్ వస్తే... వాళ్లలో మార్పు ఉండదు. దట్స్ మై ఫ్యామిలీ స్ట్రెంగ్త్. My Favorite Movies 1. గాన్ విత్ ద విండ్ 2. కాగజ్ కే పూల్ 3. షోలే 4. శంకరాభరణం 5. ముత్యాల ముగ్గు 6. శివ. My Top 5 Movies 1. రామాయణం: పిల్లలతో చిన్న డాన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడమే చాలా కష్టం. అలాంటిది - అంతా చిన్న పిల్లలతో సినిమా చేయడం అసాధ్యాలకే అసాధ్యం. మేం సాధించాం. నా లైఫ్‌లో ఓ మైల్ స్టోన్ అది. 2. ఒక్కడు: ఒక ఆఫ్ బీట్ స్టోరీని కమర్షియల్‌గా మెప్పించడమంటే రిస్కే. ఎంతటి బ్లాక్ బస్టరైనా కొన్ని వర్గాలకే పరిమితమవుతుంది. ఈ సినిమాతో అవన్నీ చెరిపేయగలిగాం. 3. సొగసు చూడతరమా: మన పక్కింట్లో జరిగే కథను కిటికీలోంచి చూస్తున్నంత సహజాతి సహజంగా తీశామీ సినిమా. 4. చూడాలని ఉంది: చిరంజీవితో రెగ్యులర్ ప్యాట్రన్‌లో వెళ్లకుండా తీసిన సినిమా. రైల్వేస్టేషన్లో చిరంజీవి-అంజలా జవేరీపై తీసిన 10 నిమిషాల లవ్‌ట్రాక్ ఒక్కటి చాలు... మేమెంత భిన్నంగా వెళ్లామో చెప్పడానికి. 5. అర్జున్: అక్కా తమ్ముళ్ల కథను ఇంతవరకూ ఈ యాంగిల్లో ఎవరూ ప్రెజెంట్ చేయలేదు. -
రుద్రమదేవి.. వచ్చేస్తోంది!
గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన భారీ పౌరాణిక చిత్రం రుద్రమదేవి విడుదలకు ముహూర్తం దగ్గర పడింది. ఈ విషయాన్ని ఈ సినిమాలో చాళుక్య వీరభద్రుడి పాత్ర పోషించిన రానా దగ్గుబాటి మంగళవారం రాత్రి ట్వీట్ చేశాడు. టైటిల్ రోల్లో అనుష్క, గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్, గణపతి దేవుడి పాత్రలో రెబల్ స్టార్ కృష్ణంరాజు తదితరులు నటించిన ఈ భారీ చిత్రం విడుదల ముహూర్తం ఎప్పుడన్నది మాత్రం ఇంతవరకు తెలియలేదు. అయితే, బాహుబలి తెలుగు సినిమా రికార్డులన్నింటినీ తిరగరాసిన తర్వాత.. దాదాపు అదే సమయంలో షూటింగ్ జరుపుకొన్న రుద్రమదేవి సినిమా ఎలా ఉంటుందన్న విషయంపై కూడా అంతా ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. సినిమా త్వరలోనే విడుదల అవుతుందంటూ రానా చేసిన ట్వీట్.. అందరికీ ఆశలు కల్పిస్తోంది. Coming soon!! pic.twitter.com/PgwMyxVbCE — Rana Daggubati (@RanaDaggubati) September 15, 2015 -
గూగుల్ దేవి!
రుద్రమదేవి లాంటి వీరవనితను ఈ ప్రపంచం ఎంతగా మర్చిపోయిందో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. గూగుల్ సెర్చ్‌లో రుద్రమదేవి బొమ్మల కోసం వెతికితే రుద్రమదేవి గెటప్‌లో ఉన్న అనుష్క బొమ్మలు రావడం ఆశ్చర్యకరం. మనమే కాదు... అనుష్క కూడా ఆశ్చర్యపోయారు. అయితే, ఆ పాత్ర పోషించడమే తన అదృష్టంగా కెరీర్లో బోల్డ్ స్టెప్ వేశారామె. మన తెలుగువారి చరిత్ర, మన సంస్కృతి పిల్లలకు తెలియాలనే ఆకాంక్షతో రెండేళ్లు ‘రుద్రమదేవి’ చిత్రంలో భాగమై, సినిమా పట్ల తనకున్న ప్యాషన్‌నీ, సమాజం పట్ల బాధ్యతనూ నిరూపించు కున్నారు అనుష్క. ‘సాక్షి’ మీడియాకి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో అనుష్క పంచుకున్న కబుర్లు... ** ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’, ‘సైజ్ జీరో’... అంటూ బిజీ బిజీగా సినిమాలు చేస్తూ, ఈ మధ్య మీరు ఎవరికీ అందుబాటులో ఉండడం లేదు..? అవునండి. నాక్కూడా ఆ ఫీలింగ్ ఉంది. కానీ, ఇవన్నీ సామాన్యమైన సినిమాలు కాదు. హిస్టారికల్ మూవీ (‘రుద్రమదేవి’), ఫోక్లోర్ ఫ్యాంటసీ (‘బాహుబలి’), లైటర్‌వీన్‌గా సాగే మెసేజ్ ఓరియంటెడ్ ఎంటర్టైనర్ (‘సైజ్ జీరో).. ఇలా వైవిధ్యమైన సినిమాలు చేయడం థ్రిల్‌గా ఉంది. ** ‘రుద్రమదేవి’ కథ విన్నప్పుడు ఏమనిపించింది? నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే... దర్శకుడు కథ చెబుతున్నప్పుడే నేను దాన్ని విజువలైజ్ చేసి, చూసుకుంటాను. ‘రుద్రమదేవి’ కథ వింటున్నప్పుడు ‘అరుంధతి’లా ఉంటుందేమో అనుకున్నాను. కానీ, మొత్తం ‘రుద్రమదేవి’ లైఫ్ విన్న తర్వాత ఆశ్చర్యపోయాను. ఇప్పుడంటే సమాజం ఎదిగింది. అన్యాయాలను ఎదిరించడానికి ఆడవాళ్లు తిరగబడుతున్నారు. కానీ, ఆ కాలంలో రుద్రమదేవి తనవాళ్ల కోసం, తన సామాజ్య్రం కోసం చేసిన పోరాటం చాలా గొప్పది. ఆ గొప్పతనం గురించి అందరికీ తెలియాలి. గుణశేఖర్‌గారి అమ్మాయి యుక్త స్కూల్ బుక్‌లో ఇప్పుడు రుద్రమదేవి చరిత్ర ఉందట. యుక్త ఆ విషయం చెప్పింది. ఒకవేళ నా స్కూల్ డేస్‌లో కనుక నేనీ పాఠం చదివి ఉంటే, ఇప్పుడీ సినిమా చేసినందుకు ఇంకా థ్రిల్లింగ్‌గా ఉండేది. ** కర్నాటక, మహారాష్ర్ట... ఇలా అన్ని బోర్డర్లను కాకతీయ సామ్రాజ్యం టచ్ చేస్తుంది కాబట్టి, ఇది ఒక ప్రాంతానికి చెందిన సినిమా అనలేం కదా? అవును. సౌత్ మొత్తం కాకతీయ సామ్రాజ్యం స్ప్రెడ్ అయ్యింది. అందుకే, ఇది ఒక ప్రాంతానికి చెందిన సినిమా అనలేం. తెలుగులో తీసినా, భాషకు అతీతంగా అందరూ చూసే సినిమా. మంచి ఎమోషనల్ స్టోరీ. ఈ కథను గుణశేఖర్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ** ‘రుద్రమదేవి’గా మీరు పూర్తిగా మౌల్డ్ కాగలిగారా? యాక్చువల్‌గా దర్శకుడు ఓ పాత్ర గురించి చెప్పగానే, ఆయన చెప్పినట్లుగా కాకుండా నాదైన శైలిలో చేయాలను కోను. దర్శకుడి ఊహల్లో ఉన్న పాత్రలా మారిపోవడానికి వంద శాతం కృషి చేస్తాను. ఎందుకంటే, తాను అనుకున్న కథను మా ద్వారా చూపిస్తున్నారు. అందుకే, ‘ఆర్ యు శాటిస్ఫైడ్’ అని డెరైక్టర్ని అడుగు తుంటాను. ‘ఎస్’ అంటే, నాకు చాలా సంతృప్తిగా ఉంటుంది. దర్శకుడు ఏం చెబితే దాన్నలా ‘కాపీ అండ్ పేస్ట్’ చేసినట్లు చేసేస్తాను (నవ్వుతూ...). ** రుద్రమదేవి ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు మాత్రం రుద్రమదేవి అంటే మీరే అన్నట్లుంది. తమాషా ఏంటంటే, ‘రుద్రమ దేవి’ సినిమా అనౌన్స్ చేసిన తర్వాత, ఆమె గురించి చాలా విషయాలు తెలుసుకోవాలని గూగుల్‌లో సెర్చ్ చేస్తే, నా ఫొటోలే వచ్చాయి. దాంతో నాకు భయం వేసింది. ** భయమా... ఎందుకు? చరిత్రలో నిలిచిపోయిన ఓ వీర వనిత ఫొటో స్థానంలో నా ఫొటో వస్తోందంటే భయం వేయకుండా ఉంటుందా? నన్ను నమ్మి 70, 80 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి గుణశేఖర్ ఈ సినిమా తీశారు. నా రియల్ లైఫ్ రుద్రమదేవి ఎవరంటే గుణశేఖర్‌గారి భార్య రాగిణి పేరు చెబుతా. ఈ ప్రాజెక్ట్‌కి ఆమె సహకారం చాలా ఉంది. ** రుద్రమదేవి పాత్ర నుంచి మీరేం నేర్చుకున్నారు? ఒక నార్మల్ ఉమన్‌కి ఏమేం ఎమోషన్స్ ఉంటాయో అవన్నీ ఉన్న మహిళ రుద్రమదేవి. ఆమె గురించి చదివిన తర్వాత, ఆ పాత్ర చేసిన తర్వాత నాకు తెలిసింది ఒకటే. ప్రతి మహిళకూ ఇన్నర్ స్ట్రెంగ్త్ ఉంటుంది. భర్త, పిల్లలకు ఎవరైనా హాని చేయాలనుకుంటున్నారనిపించినప్పుడు ఆ బలం బయటికొస్తుంది. కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఆ మహిళ వీర వనితలా మారిపోతుంది. పరిస్థితులు హద్దులు దాటుతున్నప్పుడు ఎదురీదాలి అనే విషయాన్ని నేర్చుకున్నాను. ** మరి.... మీరు రుద్రమదేవి అంత స్ట్రాంగా? శారీరకంగా, మానసికంగా ఎలా పోల్చినా నాకంత బలం లేదు. పైగా, రుద్రమదేవి అంత త్యాగశీలినీ కాదు. జీవితంపట్ల కొన్ని ఆశలు, ఆశయాలు ఉన్నాయి. వాటిని త్యాగం చేయలేను. ** రుద్రమదేవికి గెటప్‌కి సంబంధించిన మేకప్‌కి ఎక్కువ టైమ్ పట్టేదట. కష్టం అనిపించిందా? నా లుక్ ఎలా ఉండాలి? అనే విషయంపై చాలా రిసెర్చ్ చేశారు. అప్పట్లో ఎలాంటి బట్టలు వాడేవాళ్లు? ఎలాంటి మెటీరియల్ వాడేవాళ్లో తెలియదు. మరీ.. పాత లుక్‌లో చూపిస్తే, ఇది డాక్యుమెంటరీ మూవీ అయిపోతుంది. సినిమా అంటే కొంచెం రిచ్‌నెస్ కోరుకుంటారు కదా. అందుకే, కాస్ట్యూమ్స్ కొంచెం బ్రైట్‌గానే డిజైన్ చేశారు. ఆ కాస్ట్యూమ్స్, హెయిర్ స్టయిల్‌కి కావల్సినవి, నగలు.. ఇవన్నీ జాగ్రత్తగా పెట్టి, రోజూ లొకేషన్‌కి తెచ్చే నా హెయిర్ డ్రెస్సర్, మేకప్ నిపుణులకే ఎక్కువ క్రెడిట్ దక్కుతుంది. నా కష్టం కన్నా వాళ్లదే ఎక్కువ. ** మరి.. గుర్రపు స్వారీ సంగతేంటి? గుర్రాలు, ఏనుగులంటే నాకు భయం. ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ కోసమే గుర్రపు స్వారీ నేర్చుకున్నాను. ‘రుద్రమదేవి’లో ఏనుగు కూడా ఉంది. ఏనుగు వెళ్లినంతవరకూ బాగానే వెళుతుంది. కంట్రోల్ తప్పిందనుకోండి... మనం కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. కానీ, నేను వాడిన ఏనుగు నిజంగా దేవత. అది బాగా కో-ఆపరేట్ చేసింది. ** మీరు టైటిల్ రోల్ చేసిన ‘రుద్రమదేవి’లో అల్లు అర్జున్, రానా లాంటి హీరోలు నటించడం ఎలా ఉంది? ఇది మన చరిత్ర కాబట్టి, ఈ చిత్రంలో నటించాను. అంతే తప్ప నేను మెయిన్ అని చేయలేదు. రానా, బన్నీ (అల్లు అర్జున్) నేనిలాంటి సినిమాలో చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఇద్దరూ చాలా బిజీగా ఉన్నారు. ‘ఈవిడ టైటిల్ రోల్ చేస్తున్న సినిమాలో మనమెందుకు చేయాలి?’ అని వాళ్లు అనుకుంటే ఈ సినిమాలో నటించాల్సిన అవసరం లేదు. కానీ, నటించారు. మంచి పాత్రలు కావడం, మంచి సినిమాను ప్రోత్సహించాలనే సంకల్పం ఉండటం వల్లే చేశారు. ** రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు మిస్సవుతున్నట్లనిపించడం లేదా? చాలా మిస్సవుతున్నా. చెట్ల చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం నాకిష్టమే. అవి కూడా మంచి పాత్రలేగా. కాకపోతే, ‘రుద్రమదేవి’, ‘బాహు బలి’, ‘సైజ్ జీరో’ లాంటివి అరుదుగా వస్తాయి. వచ్చినప్పుడు చేసేయాలి. ** ‘రుద్రమదేవి’లో పాత కాలం భాష ఉంటుందా? లెంగ్తీ డైలాగులు ఉన్నాయా? మరీ పాతకాలంలానూ ఉండవు. మోడ్రన్‌గానూ ఉండవు. మధ్యస్థంగా ఉంటాయి. లెంగ్తీ డైలాగ్స్ చాలానే ఉన్నాయి. నా లక్ ఏంటంటే... నాకు మంచి మెమరీ పవర్ ఉంది. అందుకని ఈజీగా చెప్పేస్తాను. కాకపోతే, ఏ డైలాగ్ చెప్పినా దాని మీనింగ్ తెలుసుకునే చెబుతాను. ** ఇది మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ కాబట్టి, హీరోయిన్ ఓరియంటెడ్ రోల్స్ చేసినప్పుడు ఒకింత గర్వంగా ఉంటుందా? గర్వం ఏమీ లేదు. హీరోయిన్ ఓరియంటెడ్ రోల్స్ చేయడం మొదలు పెట్టాక హీరోల మీద గౌరవం పెరిగింది. వాళ్లు ఎంత కష్టపడుతున్నారో అర్థమైంది. డ్యాన్సులు బాగా చేయాలి... ఫైట్స్ బ్రహ్మాండంగా చేయాలి.. హీరోలు చాలా కష్టపడుతున్నారండీ. అందుకే వాళ్లకు హ్యాట్సాఫ్. ** గుణశేఖర్, రాజమౌళి... ఒకేసారి ఈ గ్రేట్ డెరైక్టర్స్ ఇద్దరితో సినిమాలు చేయడం గురించి? రాజమౌళిగారికి నా ప్లస్సులు, నా మైనస్సులు తెలుసు. ఆయనతో ఆల్రెడీ ‘విక్రమార్కుడు’ చేశాను. గుణశేఖర్‌గారితో ఇది మొదటి సినిమా. ఇద్దరికీ మధ్య ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే ‘ప్యాషన్’. చాలా ఎఫర్ట్ పెడతారు. మేకింగ్ విషయంలో అస్సలు రాజీ పడరు. ** ఈ మూడేళ్లుగా నటిగా చాలా చాలా కష్టపడుతున్నారు కదా. సినిమాలు మానేయాలని ఎప్పుడైనా అనిపించిందా? పగలంతా షూటింగ్ చేసి, సాయంత్రం ఇంటికొచ్చి రిలాక్స్ అయిపోతే కూల్ అయిపోతాను. కానీ, ఒక్కోసారి ఎక్కువ గంటలు పని చేస్తుంటాం. నైట్ షూట్స్ కూడా జరుగుతాయి. అప్పుడు మాత్రం ఇంటికి వచ్చాక, ‘ఇంకెందుకు? మానేద్దాం’ అని ప్రిపేర్ అయ్యి, నిద్రపోతాను. మర్నాడు నిద్ర లేవగానే, రాత్రి తీసుకున్న నిర్ణయం గుర్తు కూడా ఉండదు. హ్యాపీగా రెడీ అయిపోయి షూటింగ్‌కి వెళ్లిపోతా. ** ఖాళీ దొరికితే ఏం చేస్తారు? నేను హోమ్ బర్డ్ని. తక్కువ రోజులు ఖాళీ దొరికితే హైదరాబాద్‌లోనే ఉంటాను. నాకు కథలు వినడం ఇష్టం. రోజంతా వినమన్నా వింటాను. ఫ్రీ టైమ్‌లో ఎవరైనా దర్శకులు, రచయితలు కథ చెప్పడానికి వస్తామంటే, రమ్మంటాను. లేకపోతే బెంగళూరు వెళ్లిపోతా. నాకు ‘యోగా ఫ్రెండ్స్’ ఎక్కువమంది ఉన్నారు. వీలైతే వాళ్లల్లో కొంతమందినైనా కలుస్తాను. ** ఎలాంటి కథలు ఇష్టం? సిండరెల్లా పాత్ర అంటే చాలా ఇష్టం. ఆ క్యారెక్టర్‌తో మన భాషలో సినిమా చేస్తే బాగుంటుందనిపిస్తుంటుంది. ఈ ప్రపంచంలో రకరకాల క్యారెక్టర్లు ఉన్నాయి. అవన్నీ చేసేయాలనేంత పేరాశ నాకుంది. ఫ్రెంచ్, ఇరానియన్, కొరియన్ సినిమాలు చాలా బాగుంటాయి. అలాంటివి చేయాలని ఉంది. అవకాశం వస్తే, ఆ భాషల్లో సినిమాలు చేస్తా. ** దాదాపు పదేళ్లుగా సినిమాలు చేస్తున్నారు కదా... నటన గురించి పూర్తిగా తెలుసుకున్నట్లేనా? ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నానండీ. నేను నిత్య విద్యార్థినిని. యాక్టింగ్ గురించి చాలా తెలుసుకోవాల్సి ఉంది. ఏదైనా క్లాస్ లాంటిది ఏర్పాటు చేసి, ‘యాక్టింగ్ గురించి మాట్లాడండి’ అంటే, టెక్నికల్‌గా మాట్లాడలేను. ** ఈ మధ్యకాలంలో ఇతర కథానాయికలు చేసిన పాత్రల్లో మీకు బాగా నచ్చినవి.. మీరు వదులుకున్నవి ఏమైనా ఉన్నాయా? వదులుకున్నవి చాలా ఉన్నాయి. వాటిలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఒకటి. అందులో సీత పాత్రకు అడిగారు. నాక్కూడా నచ్చింది. కానీ, డేట్స్ ఖాళీ లేక చేయలేకపోయా. అప్పుడు చాలా బాధ అనిపించింది. ** హిందీలో కంగనా రనౌత్ చేసిన ‘క్వీన్’ లాంటి సినిమాలు చేస్తారా? ఈ మధ్య దీపికా పదుకొనె, కంగనా రనౌత్‌లు మంచి మంచి పాత్రలు చేస్తున్నారు. ‘క్వీన్’ విషయానికొస్తే.. అది సౌత్‌కి సూట్ కాదని నా ఫీలింగ్. చాలామంది ‘మీ డ్రీమ్ రోల్స్ ఏంటి?’ అని అడుగుతుంటారు. ‘అరుంధతి, వేదం, బాహుబలి, రుద్రమదేవి, సైజ్ జీరో’... ఇలాంటివన్నీ డ్రీమ్ రోల్సే. ** ఫైనల్‌గా... అసలు జీవితాన్ని ఎలా జీవించాలనుకుంటారు? జీవితం అద్భుతమైనది. నా లైఫ్ నాకెంతో ఇచ్చింది. దాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయాలనుకుంటాను. నాకు సినిమాలంటే చాలా ఇష్టం. షూటింగ్ అంటే పండగ. కో-స్టార్స్‌తో సరదాగా మాట్లాడుతూ, షూటింగ్ చేస్తుంటే చాలా ఎంజాయబుల్‌గా ఉంటుంది. ** ఇంతకీ కత్తి యుద్ధం చేసినప్పుడు ఎలా అనిపించింది? మీ ముంజేతికి గాయం కూడా అయ్యిందట? కత్తి తిప్పేటప్పుడు ముంజేయి బెణికినట్లు అయ్యింది. యాక్చ్యువల్‌గా ఆడవాళ్లకు అప్పర్ బాడీ బలహీనంగా ఉంటుంది. లోయర్ బాడీ బలంగా ఉంటుంది. అందుకని, అప్పర్ బాడీని ఓవర్‌గా స్ట్రెయిన్ చేయకూడదు. కత్తి తిప్పేటప్పుడు ఆ విషయం తెలిసింది. కానీ, ఆ సరికే ముంజేతికి ఏదో జరిగింది. బ్యాండేజ్ కట్టుకునేదాన్ని. అయినప్పటికీ చెయ్యి తిప్పుతున్నప్పుడు కలుక్... కలుక్మనేది. మ్యానేజ్ చేసేశానుకోండి. ** యోగా చేస్తుంటారు కాబట్టి మీ బాడీ ఫ్లెక్సిబుల్‌గానే ఉండి ఉంటుంది. శారీరకంగా శ్రమపెట్టే కత్తి సాము, జంపింగ్ ఇలాంటివన్నీ సునాయాసంగా చేసేయలేరా? బాడీ ఫ్లెక్సిబుల్‌గానే ఉంటుంది. అది కాదనలేను. కానీ, అప్పటివరకూ అలవాటు లేనివి చేయాలంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. పైగా కత్తి పట్టుకునే ఒడుపు తెలియాలి. ముందు తెలియక ఎలా పడితే అలా తిప్పేదాన్ని. అలా తిప్పినప్పుడే ముంజేతికి ప్రాబ్లమ్ అయ్యింది. ** యోగా వల్ల శారీరకంగానే కాకుండా మీలో మానసికపరంగా వచ్చిన మార్పుల గురించి? జనరల్‌గా మనకు జరగకూడనిది ఏదైనా జరిగితే మనం వెంటనే ఎదుటివాళ్లను నిందిస్తాం. చిన్న విషయానికే టెన్షన్ పడిపోతుంటాం. కానీ, యోగా చేయడం వల్ల మనలో మంచి మార్పొస్తుంది. ప్రశాంతంగా ఉండడం అలవాటవుతుంది. ‘ఇన్నర్ స్ట్రెంగ్త్’ బెటర్ అవుతుంది. ‘సెల్ఫ్ ఎవేర్నెస్’ వస్తుంది. ఓవరాల్‌గా యోగా ఒక మంచి ‘ప్యాకేజ్’లాంటిది. -
తెరపై తెలుగువారి చరిత్ర
దాదాపు మూడేళ్ళుగా దర్శకుడు గుణశేఖర్ చేస్తున్న సినీ యజ్ఞం ఇప్పుడు పతాక ఘట్టానికి చేరుకుంది. దేశంలోనే ‘మొట్టమొదటి చారిత్రక స్టీరియోస్కోపిక్ 3డి చిత్రం’గా ఆయన రూపొందిస్తున్న ‘రుద్రమదేవి’ విడుదల తేదీ ఎట్టకేలకు ఖరారైంది. ‘‘రానున్న సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో భారీయెత్తున ‘రుద్రమదేవి’ని విడుదల చేస్తున్నాం’’ అని గుణశేఖర్ ప్రకటించారు. శుక్రవారం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన పత్రికా సమావేశంలో ‘రుద్రమదేవి’ పాత్రధారిణి అనుష్క, చిత్ర నిర్మాత - గుణశేఖర్ శ్రీమతి అయిన రాగిణీ గుణ కలసి విడుదల తేదీ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సహ నిర్మాతలైన గుణశేఖర్ కుమార్తెలు నీలిమ, యుక్తాముఖి సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పంచుకొన్న విశేషాలు... వారి మాటల్లోనే... ఇది కల్పన కాదు... చరిత్ర! - దర్శకుడు గుణశేఖర్ ‘రుద్రమదేవి’ కల్పన, జానపదం కాదు. 850 ఏళ్ళ క్రితం తెలుగుగడ్డపై జరి గిన మన తెలుగువాళ్ళ కథ. ఎనిమిదో తరగతిలో నాన్డీటైల్డ్గా చదివిన పాఠం దీనికి స్ఫూర్తి. రచయితలు ముదిగొండ శివప్రసాద్, పరుచూరి బ్రదర్స్, తోట ప్రసాద్ తదితరులతో కలసి తొమ్మిదేళ్ళ పరిశోధన చేసి, కథ తయారుచేశాం. చరిత్రనెక్కడా వక్రీకరించలేదు. రేపు ఈ సినిమా ద్వారా మన దేశంలోని మిగతా భాషలవాళ్ళకీ తెలుగువారి చరిత్రను చూసి, తెలుసుకొనే అవకాశమొచ్చింది. సెట్స్, గ్రాఫిక్స్ కోసం తీసిన సినిమా కాదు! ‘సెట్స్ కోసం, భారీ గ్రాఫిక్స్ కోసం గుణశేఖర్ సినిమాలు తీస్తాడు’ అంటూ అపోహ ఉంది. ‘రుద్రమదేవి’లో భారీ సెట్లు, గ్రాఫిక్సున్నాయి కానీ, వాటి కోసం తీసిన సినిమా కాదిది. హాలీవుడ్లో రకరకాల కోవల (జానర్ల) సినిమాలొస్తు న్నట్లే... తెలుగులో ‘గ్లాడియేటర్’, ‘బ్రేవ్‌హార్ట్’ లాంటివెందుకు చేయకూడదనిపిం చింది. కథను నమ్ముకొని ఈ సాహసం చేశా. కథ కోసమే సెట్లు, గ్రాఫిక్స్ వాడా. జనం నుంచి వచ్చిన పేరు అనుష్క! నటి అనుష్క లేకపోతే ఈ ‘రుద్రమదేవి’ లేదు. గుర్రపుస్వారీలు, కత్తి యుద్ధాలు నేర్చుకొని, ఎంతో శ్రమకోర్చి, ఆమె ఆ పాత్రకు ప్రాణం పోశారు. ఆ పాత్రలో వేరేవాళ్ళను నేనే కాదు, ప్రేక్షకులు కూడా ఊహించలేరు. ఈ ప్రాజెక్ట్ గురించి ప్రకటించినప్పుడు, టైటిల్ రోల్ ఎవరన్నది నేను చెప్పలేదు. అనుష్క పేరు ప్రకటించక ముందే, జనం నుంచి నాకు వచ్చిన సూచన - అనుష్క పేరే! అల్లు అర్జున్ గంటసేపుంటాడు! రాబిన్‌హుడ్ తరహాలోని బందిపోటు గోన గన్నారెడ్డి పాత్ర కథకు కీలకం. అతనెందుకు బందిపోటయ్యాడు, ఏమిటన్నది తెరపై చూస్తారు. ‘వరుడు’ చేస్తు న్నప్పుడే ‘రుద్రమదేవి’ కథ విని, స్ఫూర్తి పొందిన బన్నీ, ఎప్పుడు తీస్తారంటూ అడుగుతుండే వాడు. బన్నీ పని చేసింది 30 డేసే. ముందు మరో 30 రోజులు సన్నద్ధమయ్యాడు. సినిమాలో గంటసేపుంటాడు. రానా రొమాంటిగ్గా ఉంటాడు. త్రీడీలో... సాహసం! లండన్‌లో భారీ రీరికార్డింగ్!! మొత్తం 3డిలోనే, 3డి కెమేరాలతోనే తీశాం. హాలీవుడ్ నిపుణుల సాయం తీసుకున్నాం. త్రీడీ వల్ల బడ్జెట్ పెరిగింది. త్రీడీలో గ్రాఫిక్స్ సంక్లిష్టం కాబట్టి టైమ్ చాలా అయింది. హాలీవుడ్ ఫిల్మ్స్ చూసి నేను, పిల్లలు త్రీడీలోనే మన చరిత్ర చెప్పాలని ఉత్సాహపడ్డందుకు, సరదా తీరిపోయింది. నా ప్రతి సినిమా విజువల్ ఎఫెక్ట్స్ బేస్ ఉన్నదే. 2003లో ‘ఒక్కడు’కే చార్మినార్ సెట్ కొంత వేసి, మిగతాది గ్రాఫిక్స్ అని తెలియనట్లుగా చూపాం. ఈ సినిమాలో మంచి విజువల్సున్నాయి. అంతా కీబోర్డ్‌లోనే ఇచ్చేస్తున్న ఈ రోజుల్లో ఇళయరాజా గారు లండన్‌లోని ఆర్కెస్ట్రాలో 125 మంది లైవ్ ఆర్కెస్ట్రాతో భారీగా రీరికార్డింగ్ చేశారు. తెలుగు సినిమా చరిత్రలో ఇలా ఎవరూ చేయలేదు. ఇలాంటివెన్నో విశేషాలున్నాయి. స్వయంగా వచ్చి కలుసుకుంటా! - హీరోయిన్ అనుష్క ఈ సినిమా చేస్తుంటే, గుణశేఖర్ గారి పిల్లలిద్దరూ లొకేషన్లోనే ఉండి, ప్రాజెక్ట్‌కు అదనపు సపోర్ట్‌గా నిలిచారు. 13వ శతాబ్దం నాటి రిఫరెన్స్‌లు తక్కువ అయినప్పటికీ, పాత్ర లుక్‌ను డిస్ట్రబ్ చేయ కుండా, నీతా లుల్లా కాస్ట్యూమ్స్, అలంకరణ చేశారు. నిజానికి, ఈ సినిమా షూటింగ్ డేస్ తక్కువే. ప్రీ, పోస్ట్ ప్రొడక్షన్లకే ఎక్కువ టైమ్ పట్టింది. క్లిష్టమైన త్రీడీ చిత్రీకరణ కోసం గుణ గారు ప్రత్యేకంగా జర్మనీ వెళ్ళి నేర్చుకొని వచ్చారు. ఆయన అనుభవం, నైపుణ్యం వల్లే అతి తక్కువ టైమ్‌లోనే ఎక్కువ షూట్ చేశాం. ఈ సినిమాకు వెన్నె ముక - ఇళయరాజా సంగీతం. రాజా గారికి నేను పెద్ద ఫ్యాన్‌ని. తొలిసారి ఈ చిత్రం కోసం పనిచేస్తున్న ప్పుడే ఆయన గొప్పదనం మరింత తెలిసింది. ఒక హిస్టారికల్ ఫిల్మ్‌కు సంగీతం ఇస్తున్నాననే వెలుగు ఆయన ముఖంలో చూశా. మూడేళ్ళుగా మేమందరం కలసి చేస్తున్న శ్రమ ఇప్పుడు ఫలించ నుంది. మా శ్రమ తాలూకు ఫలితం సెప్టెంబర్ 4న తెరపై ఆకట్టుకో నుంది. ప్రతిష్ఠాత్మకంగా చేసిన ఈ కృషికి తగిన ఫలాలను ప్రేక్షకులు మాకు అందిస్తారని నమ్ముతున్నా. ఎంతో వ్యయప్రయాసలతో మేము చేస్తున్న ఈ ప్రయత్నం కోసం సహనంతో నిరీక్షించి, మాకు మొదటి నుంచీ ప్రోత్సాహం అందిస్తున్నవారందరికీ కృతజ్ఞతలు. వివిధ భాషల్లో విడుదలవుతున్న ఈ చిత్రం కోసం పలు ప్రాంతా లకు స్వయంగా వచ్చి, అందరినీ కలుసుకోనున్నా. పిల్లలకు చూపించాల్సిన మన కథ! - చిత్ర నిర్మాత రాగిణీ గుణ మన చరిత్రను మనమే మర్చిపోతున్నాం. ఈ పరిస్థితుల్లో మళ్ళీ మన చరిత్రనూ, గొప్పదనాన్నీ గుర్తు చేసే చిత్రం - ‘రుద్రమ దేవి’. ఏడో తరగతి చదువుతున్న మా చిన్నమ్మాయి టెక్స్ట్‌బుక్‌లో కూడా సరిగ్గా ఈ ఏడాది నుంచే ‘రుద్రమదేవి’ లెసన్ కూడా పెట్టారు. అందుకే, పిల్లల్ని తీసుకొని, కుటుంబమంతా కలసి వెళ్ళాల్సిన సినిమా. రిలీజైన ‘రుద్రమదేవి’ యాప్ ఇది ఇలా ఉండగా, ‘రుద్రమదేవి’ వివరాలు, విశేషాలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పంచుకొనేందుకు వీలుగా ఆండ్రాయిడ్ యాప్‌ను కథానాయిక అనుష్క ఆవిష్కరించారు. త్వరలోనే ఐ.ఓ.ఎస్. ఎడిషన్ యాప్‌ను కూడా అందుబాటులోకి తేనున్నట్లు గుణశేఖర్ పెద్ద కుమార్తె - చిత్ర సహ నిర్మాతల్లో ఒకరూ అయిన నీలిమా గుణ తెలిపారు. ‘రుద్రమదేవి’ హిందీ వెర్షన్ మాత్రం తెలుగు వెర్షన్ తరువాత రిలీజ్ కానుంది. -
రుద్రమదేవి విడుదల తేదీ ఖరారు
అనుష్క టైటిల్ రోల్లో నటించిన 'రుద్రమదేవి' సినిమా ఈ నెల 26న విడుదల కానుంది. ఈ విషయాన్ని సినిమా దర్శక నిర్మాత గుణశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం సినిమా ఫైనల్ మిక్సింగ్ జరుగుతోందని, ఇటీవలే రీరికార్డింగ్ పూర్తయిందని చెప్పారు. ఇళయరాజా నేతృత్వంలో సింఫనీ ఆర్కెస్ట్రాతో 25 రోజుల పాటు లండన్‌లో రీరికార్డింగ్ జరిగిందన్నారు. తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో జూన్ 26వ తేదీనే సినిమాను విడుదల చేస్తున్నట్లు ఆయన చెప్పారు. రుద్రమదేవిగా అనుష్క, గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్, ఇంకా ప్రధాన పాత్రల్లో రానా, కృష్ణంరాజు, సుమన్, ప్రకాష్ రాజ్, నిత్యామీనన్, కేథరిన్ తదితరులు నటించారు. -
కన్ఫ్యూజన్ వద్దు... రొమాన్స్ కూడా ఉంటుంది..
చెన్నై: మోస్ట్ ఎవైటెడ్ మూవీ రుద్రమదేవి సినిమాకు సంబంధించి దర్శకుడు, నిర్మాత గుణశేఖర్ మరో ఆసక్తికర విషయం వెల్లడించారు. రుద్రమదేవి పోరాట గాథ మాత్రమే కాదని...ఇదొక ప్రేమ కథా చిత్రం అని కూడా ఆయన వెల్లడించారు. తెలుగు జాతి గర్వించేలా, కాకతీయుల వైభవాన్ని కళ్లకు కట్టేలా, అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని గుణశేఖర్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. రుద్రమదేవి సినిమా గురించి కన్ఫ్యూజన్ అవసరం లేదని ఆయన అన్నారు. రుద్రమదేవి పూర్తిగా పోరాట చిత్రం కాదని... అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తగినంత రొమాన్స్ కూడా ఉంటుందని గుణశేఖర్ చెప్పారు. ఏ విషయంలోనూ రాజీపడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో విజువల్ వండర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. దాదాపు 70 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు గుణశేఖర్ తెలిపారు. రీ రికార్డింగ్ పనుల్లో ఇళయరాజా లండన్‌లో బిజీగా ఉన్నారని , రెండు వారాల్లో పూర్తి కావచ్చన్నారు. సినిమా విడుదల తేదీని నిర్ణయించలేదని..మేలో ప్రేక్షకుల ముందుకు రావచ్చని చెప్పారు. గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న రుద్రమదేవి చిత్రంలో ప్రధాన పాత్రలో అనుష్క, మరో ముఖ్య పాత్రలో రానా , గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ అలరించనున్నారు. ప్రకాష్‌రాజ్, కృష్టంరాజు,సుమన్, నిత్యమీనన్, కేథరీన్ తదితర భారీ తారాగణం నటించిన ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే సంచలనం సృష్టించింది. వేసవిలో రానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. -
నా విజయ రహస్యం అదే!
కృష్ణంరాజు గురించి పరిచయ వాక్యాలు అవసరం లేదు. శక్తిమంతమైన పాత్రలకు చెరగని చిరునామా ఆయన. ఇటీవలి కాలంలో ఆయన చాలా ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఆయన నటించిన ‘ఎవడే సుబ్రమణ్యం’లోని రామయ్య పాత్ర ఆ సినిమాకుకీలకంగా నిలిచి, ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో కృష్ణంరాజు ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ మధ్యకాలంలో పాత్రల ఎంపికలో చాలా సెలక్టివ్‌గా ఉంటున్నారు. ‘ఎవడే సుబ్రమణ్యం’లో రామయ్య పాత్ర చేయడానికి కారణం? ఒక సినిమా టైటిల్ కార్డ్‌లో నా పేరు ఉందంటే.. సహజంగానే ఆ పాత్రపై ప్రేక్షకులకు అంచనాలుంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా లేకపోతే ‘ఎందుకీ పాత్ర చేయాల్సి వచ్చింది’ అనుకుంటారు. మొహమాటంతో స్నేహం కొద్దీ ఆ మధ్య చేసిన రెండు, మూడు పాత్రలు మామూలుగా ఉన్నాయి. దాంతో, అభిమానులు అసంతృప్తికి గురయ్యారు. అందుకే, కారెక్టర్లో ‘దమ్ము’ ఉంటేనే అంగీకరిస్తున్నా. దాదాపు రెండు వందల సినిమాలు చేసిన నా దగ్గరకొచ్చి ఓ పాత్రకు అడిగారంటే, ఆ పాత్ర ఎంతో గొప్పగా ఉండాలి. నేను చేయడం ద్వారా ఆ సినిమాకి హెల్ప్ అవ్వాలి. అశ్వనీదత్ నాకు మంచి స్నేహితుడు కావడం కూడా ఈ సినిమా చేయడానికి ఒక కారణం. అతను నన్ను ‘మావా’ అని పిలుస్తాడు. అశ్వనీదత్ కూతుళ్లు స్వప్నాదత్, ప్రియాంకా దత్ ినా దగ్గరికొచ్చి. ‘ఓ వైవిధ్యమైన కథాంశంతో సినిమా చేస్తున్నాం. ఇందులో కీలక పాత్రను మీరు చేస్తే బాగుంటుంది’ అన్నారు. తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్ కథ చెప్పినప్పుడు, అతనికి మంచి భవిష్యత్తు ఉంటుందనిపించింది. నా పాత్ర కూడా బాగా నచ్చింది. మరి, ఈ పాత్ర ఎలాంటి తృప్తినిచ్చింది? రామయ్య పాత్ర సినిమాకు కీలకం. హీరోలో మంచి మార్పు రావడానికి కారణంగా నిలిచే పాత్ర. మామూలుగా ఓ సినిమాలో పూర్తి స్థాయి పాత్ర చేస్తే ఎన్ని అభినందనలు వస్తాయో, ఈ పాత్రకు అన్ని వచ్చాయి. బోల్డన్ని ఫోన్ కాల్స్, లెటర్స్ వచ్చాయి. కొంతమందైతే ‘సార్.. మీ వల్లే సినిమా ఆడుతోంది’ అన్నారు. అది అభిమానంతో అనే మాట. ఈ సినిమా విజయానికి నేనో కారణం మాత్రమే. ఓవరాల్‌గా సినిమా చాలా బాగుంటుంది. రామయ్య పాత్ర గెటప్ చాలా బాగుంటుంది. చిన్ని చిన్ని సంభాషణలతో, ఎదుటి వ్యక్తిని ప్రభావితం చేసే హావభావాలతో సాగే ఆ పాత్రకు మంచి నటన కనబరచడానికి కుదిరింది. దాంతో నటుడిగా సంతృప్తినిచ్చింది. ఒక పాత్ర అంగీకరించిన తర్వాత మీరు చేసే కసరత్తులు ఎలా ఉంటాయి? నేనే పాత్ర చేసినా నేను కనిపించకుండా ఆ పాత్రే కనిపించాలనుకుంటాను. ఈ విషయంలో నాకు ఎస్వీ రంగారావుగారు ఆదర్శం. నా తొలి చిత్రం ‘చిలకా గోరింక’లో ఆయన కాంబినేషన్లో చేశాను. మొదటి సినిమాకే అంతటి నటుడితో చేయడం, అది కూడా ఆయనకు దీటైన పాత్ర కావడంతో చాలా పట్టుదలగా చేశాను. ఎస్వీ రంగారావుగారు చాలా మెచ్చుకున్నారు. ఆ సమయంలో ఆయనో సలహా కూడా ఇచ్చారు. అదేంటంటే, ‘‘నువ్వు ఒక పాత్ర ఒప్పుకున్న తర్వాత, షూటింగ్లో క్లోజ్ షాట్ పెట్టి ‘అక్కడ చూడండి’ అని దర్శకుడంటే ‘ఎందుకు చూడాలి?’ అనడగాలి. అదే భయపడే సీన్ అయితే ‘దేనికి భయపడాలి. పులిని చూసినప్పుడు కలిగే భయం ఒకలా ఉంటుంది. మనిషిని చూస్తే ఒకలా ఉంటుంది? నా భయం ఎలా ఉండాలి’ అని అడగాలి. అలా ఓ పది ప్రశ్నలేసి డెరైక్టర్‌ను విసిగిస్తే, అతను తనకేం కావాలో బాగా వివరిస్తాడు. అప్పుడు మనం కూడా సహజమైన నటన కనబర్చగలుగుతాం. పాత్రకు ఎలాంటి హావభావాలు కనబరచాలో తెలుసుకోగలుగుతాం’ అన్నారు. ఆ మాటలు నా మీద బాగా పని చేశాయి. అప్పటి నుంచీ దర్శకుడు తాను అనుకున్నది వివరంగా చెప్పేవరకూ ప్రశ్నించడం నేర్చుకున్నా. నా విజయ రహస్యం కూడా అదే. తెలుగు నటీనటులు, ఇతర భాషల నటీనటులను పోలిస్తే... ‘సహజమైన నటన’ ప్రదర్శించే తారల సంఖ్య ఎక్కడ ఎక్కువగా ఉంది? నిస్సంకోచంగా తెలుగు పరిశ్రమకు చెందిన నటీనటులే అంటాను. అప్పట్లో తమిళ పరిశ్రమలో అగ్రహీరోలుగా రాణించినవారిలో చాలామంది ఎక్కువ డ్రామా పండించేవారు. ఉదాహరణకు శివాజీ గణేశన్ భారీ డైలాగ్‌లతో, అంతకు మించిన నటనతో ప్రేక్షకులు చప్పట్లు కొట్టేలా చేసేవారు. ఎస్వీ రంగారావుగారు కూడా భారీ డైలాగులు చెప్పారు. కానీ, నటనలో డ్రమటైజేషన్ ఉండదు. ఒక సినిమాలో కేవలం కంటి చూపుతో ఆయన పలికించిన హావభావాలకు ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. ఎస్వీ రంగారావుగారు, కన్నాంబగారు... ఇలా కొంతమంది నటీనటులు నటించినట్లుగా ఉండదు. జీవించినట్లుగా ఉంటుంది. తమిళ, హిందీ రంగాల్లో కన్నా మన తెలుగు పరిశ్రమలోనే సహజత్వానికి దగ్గరగా నటించే తారలు ఎక్కువ ఉన్నారు. గుణశేఖర్ ప్రతిష్ఠాత్మకంగా తీస్తున్న ‘రుద్రమదేవి’లో మీ పాత్ర గురించి? ఇందులో నాది గణపతిదేవుడి పాత్ర. చారిత్రక పాత్ర కాబట్టి, సంభాషణలు శక్తిమంతంగా ఉంటాయి. అయితే అవి ఉపన్యాసం తరహాలో ఉండవు. చిత్రానికి కీలకమే కాక, నటనకు అవకాశం ఉన్న పాత్ర. గెటప్ కూడా బాగుంటుంది. కొంతమంది ఈ చిత్రం రషెస్ చూశారు. చాలా బాగుందన్నారు. నాక్కూడా సంతృప్తికరంగా అనిపించింది. ఎప్పట్నుంచో మీ దర్శకత్వంలో ‘ఒక్క అడుగు’ సినిమా చేయాలనుకుంటున్నారు కదా! దాని గురించి? అవును. అప్పటి ఎన్నికల నేపథ్యంలో కథ తయారు చేశాం. కానీ, ఎన్నికలు పూర్తి కావడంతో వాయిదా వేశాం. ఇప్పుడా కథను మార్చేశాం. తప్పకుండా ఈ చిత్రం ఉంటుంది. -
ధీర వనిత రుద్రమదేవి!
-
రుద్రమదేవి థియేటర్ ట్రైలర్ విడుదల
దర్శకుడు గుణశేఖర్ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న రుద్రమదేవి సినిమా థియేటర్ ట్రయలర్‌ను సోమవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ ట్రయలర్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటీవలే రుద్రమదేవి పోస్టర్లను విడుదల చేయగా, అవి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయ్యాయి. దాంతో సినిమా మీద అంచనాలు కూడా బాగా పెరిగాయి. ఈ సినిమాలో రుద్రమదేవి పాత్రలో అనుష్క నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు సినిమాల్లో మొట్టమొదటి 3డి పౌరాణిక సినిమా ఇదే అవుతుంది. ఈ సినిమాలో ఇంకా రాణా, అల్లు అర్జున్, నిత్యామీనన్, కేథరిన్ తదితరులు నటిస్తున్నారు. రుద్రమదేవి సినిమా థియేట్రికల్ ట్రయలర్‌ను 2డిలో విడుదల చేసినట్లు సినిమా నిర్మాతలు తమ అఫీషియల్ ఫేస్బుక్ పేజీలో పేర్కొన్నారు. -
''రుద్రమదేవిలో నటిస్తున్నందుకు గర్వంగా ఉంది''
-
తెలుగు సినిమా పరిశ్రమకు మరో షాక్!
హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమకు మరో షాక్ తగిలింది. రాజమౌళి 'బాహుబలి' సినిమా దృశ్యాలు బయటకు వచ్చిన ఘటన మరవకముందే మరో లీకేజీ కలకలం రేపింది. దర్శకుడు గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'రుద్రమదేవి' సినిమా ఆడియో లీకైనట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఆడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఆడియో బయటకు ఎలా లీకయిందో తెలుసుకునేందుకు సినిమా యూనిట్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుష్క టైటిల్ పాత్ర పోషించింది. అల్లు అర్జున్, దగ్గుబాటి రానా, కృష్ణంరాజు, ప్రకాశ్ రాజ్, నిత్యా మీనన్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. 'బాహుబలి'కి సంబంధించిన 13 నిమిషాల నిడివిగల ఎడిట్ చేసిన సినిమా లీకైన విషయం తెలిసిందే. ఈ కేసులో మకుట విజ్వల్ సంస్థలో విజువల్స్ ఎఫెక్ట్ మేనేజర్‌గా పనిచేసిన వర్మ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు 'అత్తారింటికి దారేటి' సినిమా విడుదలకు ముందే లీకవడంతో సంచలనం రేగింది. పెద్ద సినిమాలు విడుదలకు ముందే బయటకు లీకవుతుండడం పట్ల నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. -
గుణశేఖర్‌పై నటుడు సుమన్ ఫిర్యాదు
-
గుణశేఖర్‌పై నటుడు సుమన్ ఫిర్యాదు
హైదరాబాద్ : సినీ దర్శకుడు, నిర్మాత గుణశేఖర్‌పై చెక్ బౌన్సు కేసు నమోదు అయింది. గుణశేఖర్ ఇచ్చిన అయిదు లక్షల రూపాయిల చెక్ బౌన్స్ అయిందంటూ సీనియర్ నటుడు సుమన్ పోలీసులను ఆశ్రయించారు. 'రుద్రమదేవి' సినిమాలో నటించిన సందర్భంగా సుమన్ కు ...దర్శకుడు గుణశేఖర్ రూ. 5లక్షల చెక్ ఇచ్చారు. అయితే చెక్ బౌన్స్ కావటంతో గుణశేఖర్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవటంతో పోలీసుల్ని ఆశ్రయించినట్లు సుమన్ తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అలనాటి నాయకురాలు
ఆమెది ఒక సామాన్యమైన రైతుకుటుంబం. నా అన్న వారందరినీ కోల్పోయినా, కొండంత నిబ్బరం నిండిన ధీరురాలామె. రాజకీయాల వాసనలు, రాచరికపు పోకడలు లేశమంతైనా లేని మామూలు మహిళ. అయితేనేం, అసమానమైన ప్రతిభా సంపత్తితో మహామంత్రిగా ఎదిగిందామె. పురుషాహంకారాన్ని కాలదన్ని, ప్రజారంజకమైన పాలనతో చరిత్రకారుల ప్రశంసలు పొందింది. దాయాదుల మధ్య చిచ్చుపెట్టి, కుతంత్రాలకు పాల్పడి, పల్నాటి యుద్ధానికి కారకురాలయిందన్నది ఆమెను మరోకోణంలో చూసేవారి మాట. నిజానిజాలు ఎలా ఉన్నా, ఒక స్త్రీ... అందులోనూ ఒక సాధారణ రైతు కుటుంబీకురాలు... రుద్రమ దేవి, ఝాన్సీ లక్ష్మీ బాయిల కన్న ఎంతో ముందుగానే ఖడ్గం చేబూని, యుద్ధ విద్యలన్నీ నేర్చుకున్న యోధురాలు. సంస్కృతం, కన్నడం, తమిళం, మళయాళం, తెలుగు భాషలను అనర్గళంగా మాట్లాగలిగిన మేధావి. అపారమైన ధైర్యసాహసాలతో వీర, ధీర వనితగా పేరు తెచ్చుకోవడం మాత్రమే కాదు, పల్నాటి ప్రాభవం అంతరించినా, పల్నాటి యుద్ధం జరిగి ఇంతకాలమైనా తన పేరును శాశ్వతంగా నిలుపుకున్న ప్రజల మనిషి ఆమె. ఆ ప్రాంత ప్రజలు ఆమెను తమ గుండెల్లో నిలుపుకోవడమే కాదు, నాయకురాలు నాగమ్మగా ఆరాధిస్తున్నారు. ఆమెకు ఒక గుడి కట్టి పూజిస్తున్నారు. కారంపూడి పల్నాడుకి రణక్షేత్రమైతే, గురజాల రాజధాని. పల్నాటి యుద్ధవీరులను తలచుకుంటూ ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలలో సిడిమాను ఊరేగింపు ప్రధానమైనది. ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ ఏకాదశి నుంచి మొదలై, కోరల పూర్ణిమ మరునాటి వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. పాతపాటమ్మ ఆలయంలో అమ్మవారికి పదహారు రోజులపాటు సంబరాలు జరుగుతాయి. ఈ నవంబరు ఆరు నుంచి, సిడిమోనోత్సవాలు జరగనున్నాయి. దేశంలో ఎక్కడెక్కడో ఉన్న ఊరి వాళ్లంతా ఈ ఉత్సవాలలో పాల్గొనేందుకు స్వగ్రామానికి రావడం విశేషం. - వై.హెచ్.కె. మోహనరావు -
పాత్ర కోసం వంద కిలోల బరువు?
పాత్ర కోసం శరీరాన్ని హింసించుకోవడం, కావాలని బరువు పెరగడం, ఊహించని స్థాయిలో బరువు తగ్గడం... ఇలాంటి ఫీట్లన్నీ ఎక్కువగా హీరోలే చేస్తుంటారు. హీరోయిన్లు చేసేది తక్కువ. ఆ మధ్య బాలీవుడ్లో ‘మేరీ కోమ్’ సినిమా కోసం ప్రియాంక చోప్రా కండలు పెంచి, సహజంగా స్త్రీలకుండే సున్నితత్వాన్ని సైతం ఆ పాత్ర కోసం కోల్పోయారు. మళ్లీ మునుపటి సోయగం కోసం ప్రస్తుతం ఆమె ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం దేనికంటే... అందాల అనుష్క కూడా త్వరలో అలాంటి సాహసమే చేయబోతున్నారట. పాత్ర కోసం తన బరువుని ఏకంగా వంద కిలోలకు పెంచనున్నారట. ఇప్పటికే... రుద్రమదేవి, బాహుబలి చిత్రాల కోసం గుర్రపు స్వారీనీ, యుద్ధ విద్యలను అభ్యసించి ఆ పాత్రల కోసం అనుష్క అహర్నిశలూ శ్రమిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలు నిర్మాణంలో ఉండగానే, మరో ప్రయోగాత్మక పాత్రకు ఈ అందాలభామ పచ్చజెండా ఊపారనేది తాజా సమాచారం. కె.రాఘవేంద్రరావు తనయుడు కోవెలమూడి ప్రకాశ్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో అనుష్క ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలిసింది. అందులోని ఓ పాత్ర... అధిక బరువుతో అపర కాళికలా కనిపించాల్సి వస్తుందట. ఆ విషయం తెలిసి కూడా ఆ చిత్రంలో నటించడానికి అంగీకారం తెలిపారట అనుష్క. తోటి హీరోయిన్లందరూ గ్లామర్ పాత్రల కోసం వెంపర్లాడుతుంటే.. అనుష్క మాత్రం వారికి భిన్నంగా ఇలా ప్రయోగాత్మక పాత్రలు చేయడానికి మొగ్గు చూపడం నిజంగా అభినందనీయం. -
సిటీ.. షో స్పెషల్
చిట్‌చాట్ బాలీవుడ్లో ఫ్యాషన్ డిజైనర్‌గా రెండు దశాబ్దాలుగా రాణిస్తున్న నీతా లుల్లా, ‘బ్లెండర్స్ప్రైడ్ ఫ్యాషన్ టూర్-2014’ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చారు. ‘రుద్రమదేవి’ చిత్రానికి డిజైనర్‌గా పనిచేసిన ఆమె పుట్టింది ముంబైలోనే అయినా, పెరిగింది హైదరాబాద్‌లోనే. ఇక్కడే చదువు సంధ్యలు సాగించిన నీతా లుల్లా తెలుగులో గలగలా మాట్లాడుతూ, నగరంతో అనుబంధాన్ని ‘సిటీప్లస్’తో పంచుకున్నారు. అది ఆమె మాటల్లోనే.. హైదరాబాద్‌లోనే నా చదువు సంధ్యలన్నీ సాగాయి. మొదట్లో ఒక కొరియోగ్రాఫర్ దగ్గర కొద్దికాలం పనిచేశాను. చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ ప్రయోగాలపై ఆసక్తి ఉండటంతో ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలోకి మళ్లాను. రెండు దశాబ్దాలుగా బాలీవుడ్లో కొనసాగుతున్నాను. ఇప్పటికి 400కి పైగా సినిమాలకు డిజైనింగ్ చేశాను. ఫలక్‌నుమా ప్యాలెస్, సాలార్జంగ్ మ్యూజియం.. చదువుకునే రోజుల్లో నాకిష్టమైన ఈ రెండుచోట్లకు తరచూ వెళ్లేదాన్ని. వీటినే స్ఫూర్తిగా తీసుకుని చాలా డిజైన్లు రూపొందించాను. ఫలక్‌నుమా ప్యాలెస్‌లోకి అడుగుపెట్టగానే నేనే ఒక ప్రిన్సెస్ అనే ఫీలింగ్ వస్తుంది. ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న ఫ్యాషన్ షో కోసం 1950ల నాటి ఫ్యాషన్స్ స్ఫూర్తితో డిజైనింగ్ చేశాను. ఢిల్లీ, ముంబై, చెన్నై తరహాలోనే హైదరాబాద్‌లోనూ ఫ్యాషన్ రంగం శరవేగంగా విస్తరించే అవకాశాలున్నాయి. ఇక్కడి డిజైనర్లు ఎక్కడైనా రాణించగలరనేందుకు నేనే ఉదాహరణ. మనిషి రూపురేఖల్ని బట్టి నేను డ్రెస్ డిజైన్ చేస్తాను. నేను డిజైన్ చేసిన డ్రెస్‌లో వాళ్ల అంతస్సౌందర్యాన్ని ఇనుమడింపజేయడమే నా లక్ష్యం. ఇక్కడి నవాబీ ఫుడ్ చాలా ఇష్టం హైదరాబాద్ ఫ్లేవర్ ఉన్న నవాబీ ఫుడ్ అంటే నాకు తగని ఇష్టం. ఇక్కడ చదువుకునే రోజుల్లోనే తెలుగు బాగా నేర్చుకున్నాను. ఇక్కడి హామ్స్టెక్ ఫ్యాషన్ కాలేజీ విద్యార్థులకు డిజైనింగ్ పాఠాలు బోధిస్తున్నా. నలుగురు హ్యామ్స్టెక్ స్టూడెంట్స్‌ను రుద్రమదేవి సినిమా కోసం అసిస్టెంట్స్‌గా పెట్టుకున్నాను. ఫ్యాషన్ అభిమానులందరికీ నేను డిజైన్ చేసిన దుస్తులు చేరాలనేదే నా ఆశయం. ఎన్నిచోట్ల ఫ్యాషన్ షోస్‌లో పాల్గొన్నా, నాకు హైదరాబాద్‌లో షో చేయడమంటే చాలా స్పెషల్. ఇక్కడ రిసీవ్ చేసుకునే విధానం, ఇక్కడి ప్రజల ఆదరణ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. నా డిజైన్లను ప్రదర్శించడానికి కూడా లక్ష్మి మంచు, శ్రీదేవి నెక్కెంటి, కవితారెడ్డి తదితర హైదరాబాదీ మహిళలనే ఎన్నుకున్నాను. ..:: సిరి -
బాహుబలి, రుద్రమదేవి పోస్టర్ల విడుదల
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తూ ప్రతిష్ఠాత్మకంగా తీస్తున్న బాహుబలి, గుణశేఖర్ దర్శకత్వంలో భారీస్థాయిలో రూపొందుతున్న రుద్రమదేవి.. రెండు సినిమాల పోస్టర్లు విడుదలయ్యాయి. గోన గన్నారెడ్డిగా తెలుగుజాతి పౌరుషాన్ని తన ఖడ్గంతో చూపిస్తున్న అల్లు అర్జున్.. ఆ వెనకాల జలపాతాలతో రుద్రమదేవి పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక ఆర్కామీడియా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న బాహుబలి పోస్టర్లో ప్రభాస్ ఒకచేత్తో గండ్రగొడ్డలి, మరోచేత్తో కత్తి పట్టుకుని యుద్ధం బ్యాక్‌డ్రాప్‌లో కనిపించేలా బాహుబలి పోస్టర్ ఉంది. ఈ పోస్టర్ మీద ఆర్కా మీడియా లోగో, బాహుబలి టైటిల్, 2015 అన్న పదాల తప్ప మరేమీ లేవు. రుద్రమదేవి పోస్టర్ మీద మాత్రం, సినిమాకు సంబంధించిన అందరి పేర్లు వేశారు. చారిత్రక నేపథ్యాలతో రూపొందిస్తున్న ఈ రెండు సినిమాల పోస్టర్లు ఒకే సమయంలో విడుదల కావడం యాదృచ్ఛికం. -
రుద్రమదేవి నగలు చెన్నైకి?
రుద్రమదేవి చిత్రంలో ఆ పాత్ర పోషించిన అనుష్క ధరించిన కోట్లాది రూపాయల బంగారు నగలు చెన్నైకి చేరాయా? ఇలాంటి సందేహం రావడంతో పోలీసులు ఈ కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. వివరాల్లో కెళితే...నటి అనుష్క నటిస్తున్న భారీ చరిత్రాత్మక కథా చిత్రం రుద్రమదేవి. తెలుగు, తమిళం భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనుష్క కాకతీయ రాజ్యపు పట్టపురాణిగా శక్తివంతమైన పాత్రను పోషిస్తున్నారు. గుణశేఖర్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో అనుష్క ఐదుకోట్ల విలువైన బంగారు నగలను ధరించి నటిస్తున్నారు. ఈ నగలను చిత్ర యూనిట్ చెన్నైలోని ప్రముఖ నగల దుకాణంలో కొనుగోలు చేశారు. ఈ ఖరీదైన బంగారు నగలు అనూహ్యంగా దొంగతనానికి గురైన సంగతి తెలిసిందే. దీంతో చిత్ర దర్శక నిర్మాత హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు తీవ్రం చేశారు. పోయిన నగలను చెన్నైలో కొనుగోలు చేసి విమానం ద్వారా హైదరాబాదుకు తీసుకెళ్లారు. కాబట్టి పోలీసులు హైదరాబాదు విమానాశ్రయంలో సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. చెన్నై నుంచి హైదరాబాదుకు నగలను తీసుకొస్తుండగా వెనుక సందేహించదగ్గ వారెవరైనా ఉన్నారా? అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. శనివారం హైదరాబాదు పోలీసులు చెన్నైకి వచ్చారు. చెన్నై విమానాశ్రయంలో గల కేంద్ర పోలీసు భద్రతాదళం సాయంతో నగలు తీసుకెళ్లిన రోజు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. అనుమానించదగ్గ సన్నివేశాలను సీడీలలో లోడ్ చేసుకుని వెళ్లారు. దీంతో రుద్రమదేవి నగలు చెన్నైకి చేరాయా? అన్న సందేహం కలుగుతోంది. -
క్రియేటివ్ మైండ్స్
రుద్రమదేవి... గుణశేఖర్ దర్శకత్వంలోని మోస్ట్ అవెయింటింగ్ మూవీ. రుద్రమదేవిగా అనుష్క, చాళుక్య వీరభద్రుడిగా రానా ఫస్ట్ లుక్‌లోనే అభిమానుల మనసు దోచేసుకున్నారు. అందాల యువరాణిగా అనుష్కకు అంతటి దర్పాన్ని, అచ్చమైన రాజకుమారుడిగా రానాకి రాజఠీవిని తెచ్చిపెట్టింది ఏమిటి? కాస్ట్యూమ్స్. ఎస్... అదంతా ప్రముఖ డిజైనర్ నీతాలుల్లా క్రియేటివ్ మహిమ. ‘జోధా అక్బర్’లాంటి చరిత్రాత్మక చిత్రాలకు పనిచేసిన ఆమెతోపాటు మన హైదరాబాదీ విద్యార్థులూ తమ సృజనాత్మకతను పంచుకున్నారు. ఈ ప్రత్యేక దుస్తుల తయారీలో ఆమెకు సాయపడ్డ హ్యామ్స్టెక్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ అపర్ణ, రవి వానమ్, రచనల ఎక్స్‌పీరియెన్స్ వారి మాటల్లోనే... - సిరి ఇది మాకు మొదటి చిత్రం. ఫస్ట్ మూవీలోనే లీడ్ యాక్టర్స్ కాస్ట్యూమ్స్‌కి అసిస్టెంట్‌గా పనిచేయడం సంతోషాన్నిస్తోంది. క్లాసులో నేర్చుకున్నది, ప్రాక్టికల్స్‌లో చేసినదానికంటే... ఆన్‌సెట్స్ ఎక్స్పీరిఎన్స్ కొత్తగా ఉంది. బాలీవుడ్లో స్థిరపడాలన్నది నా కోరిక. - అపర్ణ గతంలో రానా, ప్రకాష్‌రాజ్, కృష్ణంరాజు దగ్గర అసిస్టెంట్‌గా చేశాను. కానీ రుద్రమదేవి స్పెషల్. రానా బాడీకి, సినిమాలో ఆయన బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టుగా డిజైన్ చేశాం. రానా గెటప్ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక అనుష్క ధరిస్తున్న ఒరిజినల్ బంగారు ఆభరణాలకు తగ్గట్టుగా డ్రెస్ కలర్స్ ఉండేవిధంగా శ్రద్ధ తీసుకున్నాం. కొత్త టె క్నిక్స్ ఉపయోగించాం. గ్రేట్ ఆపర్చునిటీ! - రవి వానమ్ నీతా లుల్లా మమ్మల్ని ఎంచుకోవడం మా అదృష్టం. రాజరికపు లోకాల్లోకి మనలను తీసుకెళ్లే సినిమా ఇది. అందుకు తగ్గట్టుగానే ప్రతి సెట్టింగ్, కాస్ట్యూమ్స్ ఉంటాయి. డెరైక్టర్ సూచనల మేరకు అనుష్క చేతులకు టాటూస్ వేశాను. నేను చాలా ఎగ్జైట్ అయిన మూమెంట్ అది. - రచన -
‘రుద్రమ దేవి’ నగలపై కదులుతున్న డొంక
ఎగ్జిక్యూటివ్ రవి తీరుపైనే అనుమానం విచారిస్తున్న పోలీసులు గచ్చిబౌలి: రుద్రమదేవి సినిమా షూటింగ్లో మాయమైన నగల కేసులో ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్ తీరుపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 19న షూ టింగ్‌కు ముందు రెండు డబ్బాల నగలు మాయమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘నాదేళ్ల ఆంజనేయులు శెట్టి నగల కంపెనీ’కి చెందిన ఎగ్జిక్యూటివ్ రవి సుబ్రహ్మణ్యంను గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయాన్ని తెలుసుకున్న రవి భార్య మరుసటి రోజే ‘నాదేళ్ల ఆంజనేయులు శెట్టి కంపెనీ’ ప్రతినిధులకు తమ ఇంట్లో నగలున్నట్టుగా సమాచారం అందించారు. కంపెనీ ప్రతినిధులు గచ్చిబౌలి పోలీసులకు సమాచా రం ఇవ్వగా చెన్నై పోలీసుల సహకారం తీసుకున్నారు. చెన్నైలోని రవి ఇంట్లో దాదాపు పది కేజీల గిల్డ్ నగలను చెన్నై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్పటివరకు షూటింగ్ వద్దకు నగలు తీసుకొచ్చానని చెప్పిన రవి మాట మార్చారు. కొన్ని ఇంట్లోనే ఉన్నాయని తమ కంపెనీ యాజమన్యానికి తెలియదని చెప్పారు. యాజ మాన్యానికి తెలియకుండా నగలు ఇంట్లో పెట్టుకోవడంతో రవి తీరుపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రవి మాత్రం ఎన్ని నగలు తీసుకొచ్చావనే దానిపై పోలీసులకు రోజుకో తీరుగా చెబుతున్నట్టు సమాచారం. ఇదిలావుంటే రాణి రుద్రమ దేవి విగ్రహలపై ఉన్న నగలను ఫొటోల ఆధారంగా ప్రముఖ డిజైనర్ నీతా లుల్లా నగలను ప్రత్యేకంగా డిజైన్ చేసినట్టు తెలిసింది. రుద్రమదేవి సంప్రదాయ నగలను ప్రత్యేకంగా డిజైన్ చేసి ఇస్తామని ఆంజనేయులు శెట్టి కంపెనీ అంగీకరించింది. కళాకారులు, యంత్రాల ద్వారా గిల్డ్, బంగారు నగలు తయారు చేశారు. ఈ క్రమంలో భారీగా ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. రవి సుబ్రహ్మణ్యం ద్వారా గిల్డ్ నగలతోపాటు ఏడు బంగారు నగలు షూటింగ్ కోసం పంపించినట్టు పోలీసులతో కంపెనీ ప్రతినిధులు తెలిపినట్లు సమాచారం. -
రుద్రమదేవి నగల మాయంపై వీడని మిస్టరీ ?
రుద్రమదేవి చిత్రం షూటింగ్లో నగలు మాయంపై లభించని క్లూ? దొంగ ఎవరు? అసలు బంగారం ఎంత..? పోలీసులకు సవాల్‌గా మారిన దర్యాప్తు సాక్షి, సిటీబ్యూరో: రుద్రమదేవి సినిమా షూటింగ్లో నగలు మాయంపై మిస్టరీ వీడలేదు. కిలోన్నర బంగారు ఆభరణాలు పోయాయని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రామ్‌గోపాల్ పోలీసులకు ఫిర్యాదు చేసి రెండు రోజులవుతున్నా క్లూ లభించలేదు. పోయిన నగల్లో అసలు బంగారం ఎంత? రోల్డ్‌గోల్డ్ ఎంత అన్న విషయం సరఫరా చేసిన వారికే తెలియదనడం కొత్త అనుమానాలకు తెరలేపింది. అంత విలువైన నగలకు సెక్యూరిటీ లేకుండా ఎలా ఉంచారు? వ్యానులో ఉన్న నగలు ఎలా మాయమయ్యాయనే కోణంలో పోలీ సులు దర్యాప్తు చేస్తున్నారు. పోయిన నగల్లో అత్యంత విలువైన రాళ్లు పొదిగినవి ఉన్నట్టు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క హీరోయిన్గా రుద్రమదేవి సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రంలో పాత్రకు తగ్గట్టుగా అనుష్క ధరించే నగలను చెన్నైలోని ఆంజనేయ శెట్టి అండ్ సన్స్ వారు స్పాన్సర్ చేస్తున్నారు. షూటింగ్ జరిగే రోజు సంస్థ సిబ్బంది చెన్నై నుంచి నగలను తీసుకు వస్తున్నారు. షూటింగ్ ముగిసిన వెంటనే వాటిని తిరిగి తీసుకువెళ్లిపోతున్నారు. ఇలా ఆరు షెడ్యూల్స్‌లో జరిగింది. ఈ నెల 19వ తేదీన గోపన్‌పల్లెలోని రామానాయుడుకు చెందిన స్థలంలో చిత్రం ఏడవ షెడ్యూల్ ప్రారంభం కావాల్సి ఉంది. అదే రోజు ఉదయం 8 గంటలకు చెన్నై నుంచి విమానంలో రెండు ప్లాస్టింగ్ బాక్స్‌లున్న బ్యాగ్‌లో నగలను ఆ కంపెనీకి చెందిన ఉద్యోగి ఎస్. రవిసుబ్రమణ్యం షూటింగ్ స్పాట్‌కు తీసుకువచ్చాడు. ఈ బ్యాగ్‌ను ఏసీ మేకప్‌వ్యాన్ డ్రైవర్ సీటు వెనకాల పెట్టి సమీపంలో విశ్రాంతి తీసుకున్నాడు. భోజన విరామం తరువాత అనుష్కకు నగలు ధరింపజేసేందుకు బ్యాగ్ తెరిచారు. అందులో ఉన్న నగలు ఉన్న రెండు ప్లాస్టిక్ బాక్స్‌లు కనిపించలేదు. దీంతో సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రామ్‌గోపాల్ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు కిలోన్నర బంగారు ఆభరణాలు మాయమయ్యాయని, వాటిలో వడ్డాణం, చెవి కమ్మలు (రెండు జతలు), గాజులు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. తేలని బంగారం లెక్క.. పోయిన నగల్లో అసలు బంగారం ఎంత ఉంది. రోల్డ్‌గోల్డ్ ఎంత అనేది తెలియరాలేదు. నగలు పంపిన సంస్థకు చెందిన మార్కెటింగ్ అధికారి సుజిత్‌ను పోలీసులు సోమవారం విచారించారు. ఆయన కూడా సరిగ్గా సమాధానం చెప్పలేక పోయారు. దీంతో ముంబయి నుంచి జ్యువెలరీ ఎగ్జిబిషన్లో ఉన్న బద్రీని పోలీసులు పిలిపిస్తున్నారు. నగలు వాడుతున్న వారికి, పంపిన వారికి వివరాలు తెలియదనడం గమనార్హం. ఈ కేసు దర్యాప్తు పోలీసులకు సవాల్‌గా మారింది. దొంగ ఎవరు... నగలు ఎవరు దొంగలించారనేది ప్రశ్నార్థకంగా మారింది. నగల బ్యాగ్‌ను వ్యాన్‌లో పెట్టిన రవి కాపలా ఉండకుండా ఎక్కడికి వెళ్లాడనేది అనుమానాలకు తావిస్తోంది. దీనిపై పోలీసులు దృష్టి సారించారు. న గలు మాయమైన రోజు రవితో పాటు చెన్నై నుంచి ఎవరైనా వచ్చారా? అన్న విషయాన్ని నిర్ధారించుకుంనేందుకు శంషాబాద్ విమానాశ్రయంలో పుటేజ్‌లను పరిశీలించనున్నారు. అసలు ఆ బ్యాగ్‌లో నగలు ఉన్న విషయం రవికి మాత్రమే తెలుసు. ఆ నగలను ఇంకా షూటింగ్ నిర్వాహకులకు అందించలేదు. అప్పటికే అవి మాయం కావడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. షూటింగ్లో అసలు బంగారం వాడరని పోలీసులు అంటుండగా తమ కంపెనీ పబ్లిసిటీ కోసం వాటిని నిజమైన బంగారంతో నగలను డిజైన్ చేశామని నగల కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ప్రతిసారి షూటింగ్ ఉన్న సమయంలో విమనాంలో తేవడం తిరిగి విమానంలో తీసుకెళ్లడం జరిగిందంటే అవి నిజమైనే బంగారు నగలేననే అనుమానాలు కలుగుతున్నాయి. నగల్లో విలువైన రాళ్లు ఉన్నాయని సమాచారం. -
యాక్షన్‌లోకి గోన గన్నారెడ్డి
కాకతీయ సామ్రాజ్ఞి రాణీ రుద్రమ జీవిత కథ ఆధారంగా అత్యున్నత సాంకేతిక విలువలతో దర్శకుడు గుణశేఖర్ ‘రుద్రమదేవి’ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రుద్రమగా అనుష్క టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో ఇప్పటికే రానా, సుమన్, కృష్ణంరాజు, నిత్యామీనన్, కేథరిన్ తదితర స్టార్లు కీలక భూమికలు పోషిస్తున్నారు. వీరితో పాటు ఇప్పుడు క్రేజీ స్టార్ అల్లు అర్జున్ కూడా తోడవ్వడం విశేషం. కథలో కీలకమైన గోన గన్నారెడ్డి పాత్రను ఇందులో బన్నీ పోషించనున్నారు. ఈ పాత్ర కోసం ఇప్పటికే ఆయన ఎంతో పరిశోధన జరిపి, పాత్రకు తగ్గట్టు పలు యుద్ధ విధ్యలను అభ్యసించిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు శుక్రవారం గోన గన్నారెడ్డిగా ‘రుద్రమదేవి' సెట్లోకి అడుగుపెట్టేశారు అల్లు అర్జున్. ఆ గెటప్‌లో బన్నీ లుక్ అద్భుతమని యూనిట్ సభ్యుల సమాచారం. 40 రోజుల పాటు బన్నీపై చిత్రీకరించే సన్నివేశాలతో ‘రుద్రమదేవి’ షూటింగ్ పూర్తవుతుందని గుణశేఖర్ తెలిపారు. ఇంకా ఆయన చెబుతూ- ‘‘పద్మశ్రీ తోట తరణి వేసిన ఏడు కోట గోడల అద్భుతమైన సెట్లో గోన గన్నారెడ్డి సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. బన్నీ నట విశ్వరూపాన్ని ఇందులో చూస్తారు. ఈ షెడ్యూల్లో అల్లు అర్జున్‌తో పాటు అనుష్క, రానా, ప్రకాశ్‌రాజ్, కృష్ణంరాజు, హంసానందిని తదితరులు కూడా పాల్గొంటారు. గోన గన్నారెడ్డి పాత్ర ఈ సినిమాకే ఓ మణిమకుటం లాంటిది. అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసి డిసెంబర్లో సినిమాను విడుదల చేస్తాం’’ అని గుణశేఖర్ చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్, సంగీతం: ఇళయరాజా, కెమెరా: అజయ్ విన్సెంట్, కూర్పు: శ్రీకరప్రసాద్, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కె.రామ్‌గోపాల్, సమర్పణ: రాగిణి గుణ. -
గొనె గన్నారెడ్డి గెటప్‌లో ఎన్టీఆర్....?
-
దక్షిణాది ఫోకస్... ఈ ఫోర్ మూవీస్ పైనే!
కొన్ని సినిమాలు అనౌన్స్మెంట్ దశ నుంచే ఆసక్తి రేకెత్తిస్తాయి. ఇక మేకింగ్ మొదలైన దగ్గర్నుంచీ ఆ సినిమాకు సంబంధించిన ప్రతి వార్తా సంచలనమే. అలాంటి క్రేజీయెస్ట్ సెన్సేషనల్ ప్రాజెక్టులు అరుదుగానే తయారవుతుంటాయి. ప్రస్తుతం దక్షిణాదిలో అలాంటి నాలుగు ఆసక్తికరమైన ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. కంటెంట్... కాన్సెప్ట్... కాంబినేషన్స్... మేకింగ్... టేకింగ్... బడ్జెట్... స్టార్ ఇమేజ్... జానర్... వర్కింగ్ స్టయిల్... టెక్నాలజీ... వీటన్నిటి పరంగా ఈ నాలుగు చిత్రాలు ‘టాక్ ఆఫ్ ది సౌత్’ అనిపించుకుంటున్నాయి. సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా, అనురక్తిగా వేయి కళ్లతో ఎదురు చూస్తోన్న ఆ నాలుగు సినిమాల విశేషాల సమాహారమిది. బాహుబలి తారాగణం : ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా తదితరులు దర్శకత్వం : ఎస్.ఎస్.రాజమౌళి నిర్మాతలు : శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఛాయాగ్రహణం : సెంథిల్ కుమార్ సంగీతం : ఎం.ఎం.కీరవాణి జానర్ : జానపదం షూటింగ్ ప్రారంభం: 2013 జూలై 6న కర్నూలులో నిర్మాణ వ్యయం : సుమారు రూ. 100 కోట్లు విడుదల : 2015 ప్రత్యేకత : రెండు భాగాలుగా విడుదల ప్రభాస్ ‘మిర్చి’ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ రాజమౌళితో సినిమా చేయాలని వేరే కమిట్మెంట్స్ పెట్టుకోలేదు. ఇందులో పాత్రకు తగ్గట్టుగా తన శరీరాకృతిని మార్చుకున్నారు. అనుష్క కూడా అంతే. తన పాత్ర కోసం గుర్రపు స్వారీ, కత్తి సాములో శిక్షణ పొందారు. ఇందులో ప్రభాస్ది ద్విపాత్రాభినయం. ఒక పాత్ర పేరు బాహుబలి కాగా, మరో పాత్ర పేరు శివుడు. బాహుబలి సరసన అనుష్క, శివునికి జోడీగా తమన్నా చేస్తున్నారు. రానా, రమ్యకృష్ణ లాంటి ప్రముఖ తారలు కూడా ఇందులో నటిస్తున్నారు. ఇండస్ట్రీలో ఉన్న మేకప్మేన్లు, కాస్ట్యూమర్లు దాదాపుగా ఈ సినిమాకు పని చేస్తున్నారు. కర్నూలు, కేరళ, కర్ణాటకల్లో ఇప్పటి వరకూ షూటింగ్ చేశారు. ప్రస్తుతం ఆర్ఎఫ్సీలో భారీ షెడ్యూల్ చేస్తున్నారు. డిసెంబర్ 23న మొదలైన ఈ షెడ్యూల్ మార్చి 5 వరకూ జరుగనుంది. ప్రస్తుతం యుద్ధ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఏ విషయమూ బయటకు పొక్కకుండా రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభాస్, అనుష్క, తమన్నా బర్త్‌డేలకు మాత్రం ఫస్ట్‌లుక్, కొంత సమాచారం రిలీజ్ చేశారు. ఈ ఏడాది అంతా ఈ సినిమా వర్క్ నడుస్తుందని సమాచారం. 2015లో రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని విడుదల చేసే యోచనలో ఉన్నారట రాజమౌళి. తెలుగు, తమిళ భాషల్లో రూపొదుతోన్న ఈ చిత్రాన్ని మలయాళం, హిందీతో పాటు విదేశీ భాషల్లో కూడా అనువదిస్తారు. రుద్రమదేవి తారాగణం : అనుష్క, రానా, నిత్యామీనన్, కృష్ణం రాజు తదితరులు నిర్మాత, దర్శకుడు : గుణశేఖర్ ఛాయాగ్రహణం : అజయ్ విన్సెంట్ సంగీతం : ఇళయరాజా జానర్ : చారిత్రకం షూటింగ్ ప్రారంభం : 2013 ఏప్రిల్ వరంగల్‌లో నిర్మాణ వ్యయం : సుమారు రూ. 40-50 కోట్లు విడుదల : 2014 వేసవిలో ప్రత్యేకత : తొలి భారతీయ చారిత్రక త్రీడీ చిత్రం భారతదేశ చరిత్రలో 40 ఏళ్ల పాటు ఒక సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఏకైక మహిళ... రాణీ రుద్రమదేవి. ఆమె చరిత్రని చాలా ఇన్‌స్పయిరింగ్‌గా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు గుణశేఖర్. 13వ శతాబ్దం తాలూకు కథ కాబట్టి, అప్పటి వాతావరణాన్ని, పరిస్థితుల్ని యధాతథంగా ప్రెజెంట్ చేయడానికి ఎన్నో కసరత్తులు చేస్తున్నారు. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీతాలుల్లా ఈ టీమ్‌కి మెయిన్ ఎస్సెట్. కళాదర్శకుడు తోట తరణి ఈ సినిమాకు మూలస్తంభం. అద్భుతమైన సెట్లు వేస్తున్నారాయన. అన్నపూర్ణ ఏడెకరాల స్టూడియోలో వేయిస్తంభాల గుడిని అచ్చు గుద్దినట్టుగా దింపేశారు. అలాగే మొగిలిచెర్ల ఏకవీరాదేవి గుడి, ఏడు కోట గోడలు, అప్పటి పల్లెటూళ్లు, రాజమందిరాలు, దర్బార్లు... వీటన్నిటినీ ఎంతో శ్రద్ధతో సెట్లు వేస్తున్నారు. ఈ సినిమా కోసం సుమారు 60 అడుగుల ఎత్తున్న సెట్ వేశారు. ఆ సెట్లోకి వెళ్లడం కోసం ఏకంగా లిఫ్ట్ ఏర్పాటు చేశారు. అలాగే చిన్న సెటప్‌కి కూడా పేరున్న తారలనే ఎంచుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతం దగ్గర ఇటీవలే అనుష్క, రానాపై ఒక పాట, కొన్ని సీన్లు తీశారు. ఈ లొకేషన్లో సినిమా షూటింగ్ జరగడం ఇదే తొలిసారట. ఝ గ్రాఫిక్స్‌కి అధిక ప్రాధాన్యం ఉంది. అసలే త్రీడీ మూవీ కాబట్టి మైన్యూట్ డీటైల్స్ని కూడా వర్కవుట్ చేస్తున్నారు. ఈ సినిమాలో దాదాపుగా ప్రతి సన్నివేశంలోనూ 400, 500 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉండడం విశేషం. ఇప్పటికి 65 శాతం సినిమా పూర్తయింది. కోచ్చడయ్యాన్ తారాగణం : రజనీకాంత్, దీపికా పదుకొనే, శరత్‌కుమార్, శోభన తదితరులు దర్శకత్వం : సౌందర్య, ఆర్.అశ్విన్ నిర్మాతలు : సునందమురళీమనోహర్, సునీల్ లుల్లా ఛాయాగ్రహణం : రాజీవ్ మీనన్ సంగీతం : ఎ.ఆర్. రెహమాన్ జానర్ : జానపదం షూటింగ్ ప్రారంభం: 2012 మార్చి నిర్మాణ వ్యయం : సుమారు రూ. 125 కోట్లు విడుదల : 2014 ఏప్రిల్ 10న ప్రత్యేకత : తొలి భారతీయ త్రీడీ మోషన్ కాప్చర్ కంప్యూటర్ యానిమేటెడ్ చిత్రం ‘రోబో’ తర్వాత కేయస్ రవికుమార్ దర్శకత్వంలో ‘రాణా’ సినిమా చేయాలనుకున్నారు రజనీకాంత్. ప్రారంభ వేడుక కూడా జరిగింది. అయితే రజనీ ఆ తర్వాత అనారోగ్యం పాలవ్వడంతో ‘రాణా’ ప్రాజెక్ట్‌ని పక్కన పెట్టేశారు. ఆ తర్వాత రజనీ పెద్ద కూతురు సౌందర్య ‘కోచ్చడయాన్’ సినిమా అనౌన్స్ చేశారు. ‘రాణా’ కథకి ప్రీక్వెల్ ఇదని ఆమె ప్రకటించారు కూడా. జేమ్స్ కేమరూన్ సృష్టించిన ‘అవతార్’ హాలీవుడ్ చిత్రం తరహాలో త్రీడీ మోషన్ కాప్చర్ కంప్యూటర్ యానిమేషన్ పరిజ్ఞానంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇండియాలో ఈ పరిజ్ఞానంతో తీసిన తొలి సినిమా ఇదే. రజనీకాంత్ ఫేస్‌ని స్కాన్ చేయగా వచ్చిన రూపంతో త్రీడీలో ఓ మోడల్ తయారు చేశారు. ఆ మోడల్ స్కిన్‌ని టైట్ చేస్తే ‘ముత్తు’లో రజనీలాంటి రూపం వచ్చింది. రజనీ ఇందులో మూడు యానిమేటెడ్ పాత్రల్లో కనిపిస్తారు. మూడు జాతీయ అవార్డులు గెలుచుకున్న నీతాలుల్లా కాస్టూమ్స్ డిజైన్ చేశారు. ఇందుకోసం 8 నెలలు కసరత్తులు చేశారు. రజనీ యుద్ధ వీరుడి గెటప్ కోసమైతే దాదాపు 30 స్కెచ్‌లు వేశారామె. ఝ తమిళనాడుకి చెందిన పాండ్యవంశ రాజు ‘కోచ్చడయ్యాన్ రణబీరన్’ జీవిత చరిత్రకు కొంత కాల్పనికతను జోడించి ఈ కథ తయారు చేశారు. మలయాళం, హిందీ, ఇంగ్లిష్, జపనీస్, ఇటాలియన్, స్పానిష్ భాషల్లో ఈ చిత్రం అనువాదం కానుంది. ఝ 2013 ఫిబ్రవరికే చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్‌కే ఇంత సమయం పట్టింది. లండన్, హాంకాంగ్, లాస్ఏంజిల్స్, చైనాల్లో ఫైనల్ వర్క్ జరుగుతోంది. ఝ తెలుగులో ‘విక్రమ సింహ’ పేరుతో శ్రీ లక్ష్మీగణపతి ఫిలింస్ సంస్థ విడుదల చేయనుంది. ఐ తారాగణం : విక్రమ్, అమీ జాక్సన్ తదితరులు దర్శకత్వం : శంకర్ నిర్మాత : ఆస్కార్ వి.రవిచంద్రన్ ఛాయాగ్రహణం : పి.సి.శ్రీరామ్ సంగీతం : ఎ.ఆర్. రెహమాన్ జానర్ : రొమాంటిక్ థ్రిల్లర్ షూటింగ్ ప్రారంభం : 2012 జూలై 15న నిర్మాణ వ్యయం : సుమారు రూ. 145 కోట్లు విడుదల : 2014 ఏప్రిల్ 11న ప్రత్యేకత : 17 భాషల్లో అనువాదం ‘అపరిచితుడు’ తర్వాత శంకర్, విక్రమ్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రమిది. హిందీ ‘త్రీ ఇడియట్స్’ని తమిళంలో ‘నన్బన్’గా రీమేక్ చేసి పరాజయం పొందిన శంకర్ ఓ కసితో ఈ సినిమా చేస్తున్నారు. ఝ వరుస పరాజయాలు, ప్రయోగాలతో వెనుకబడిపోయిన విక్రమ్ ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వేరే అవకాశాలు కూడా వదిలేసుకుని అహరహం శ్రమిస్తున్నారు. పలురకాల శరీరాకృతుల్లో కనిపించడం కోసం ఎంతో కష్టపడుతున్నారు. తొలుత సమంతను నాయికగా అనుకున్నారు. అనారోగ్యం కారణంగా ఆమె ఈ అవకాశం వదులుకోవడంతో, అమీజాక్సన్‌ని ఎంచుకున్నారు. లార్డ్ ఆఫ్ ది రింగ్స్, అవతార్‌లాంటి హాలీవుడ్ చిత్రాలకు స్పెషల్ మేకప్ చేసిన వీటా వర్క్ షాప్ సంస్థ వాళ్లు విక్రమ్‌కి మేకప్ చేశారు. వరల్డ్‌లోనే ఎక్స్లెంట్ మేకప్ టీమ్ ఇదని శంకర్ స్వయంగా పేర్కొన్నారు. హాలీవుడ్ ‘మెన్ ఇన్ బ్లాక్’ చిత్రాల సిరీస్‌కి కాస్ట్యూమ్స్ డిజైన్ చేసిన మేరీ ఓగ్ దీనికి పనిచేశారు. మన ఇండియన్ అనల్ అరసుతో పాటు చైనాకు చెందిన పీటర్ మింగ్ కొరియోగ్రఫీ చేశారు. ‘హ్యారీపోటర్’ సిరీస్‌కి పనిచేసిన ఆస్ట్రేలియన్ రైజింగ్‌సన్ పిక్చర్స్ వాళ్లు గ్రాఫిక్స్ సమకూరుస్తున్నారు. ‘ఐ’ అంటే తమిళంలో అందం, రాజు, గురువు, సున్నితం అని అర్థాలున్నాయి. తెలుగులో ‘మనోహరుడు’ పేరుతో విడుదల కానుంది. -
పెళ్లి ఎప్పుడైనా చేసుకోవచ్చు
పెళ్లనేది ఎప్పుడైనా చేసుకోవచ్చని, మంచి చిత్రాల అవకాశాలు మళ్లీ రావని నటి అనుష్క పేర్కొంది. అందుకే పెళ్లి ఆలోచనను వాయిదా వేసుకున్నానని తెలిపింది. తెలుగు, తమిళం భాషల్లో ప్రముఖ హీరోయిన్ గా ప్రకాశిస్తున్న అనుష్కకు మూడు పదుల వయసు దాటింది. ఆ మధ్య అవకాశాలు కాస్త తగ్గుముఖం పట్టడం తో పెళ్లికి సిద్ధం అవుతున్నట్లు, వరుడి వేటలో ఉన్నట్లు ప్రకటించి ఆమె అభిమానులకు షాక్ ఇచ్చింది. ఇటీవల మళ్లీ అవకాశాలు తలుపు తట్టడంతో పెళ్లి ఆలోచనను వాయిదా వేసుకుంది. ప్రస్తు తం ఈ బ్యూటీ తెలుగులో రుద్రమదేవి, బాహుబలి వంటి భారీ చరిత్రాత్మక చిత్రాల్లో నటిస్తోంది. అందువల్లే పెళ్లిని వాయిదా వేసుకుందట. దీని గురించి ఈ యోగా సుందరి స్పందిస్తూ తన నటనా ప్రతిభకు నిదర్శనంగా నిలిచిన చిత్రం అరుంధతి అంది. ఆ చిత్రం తర్వాత మళ్లీ అంత గొప్ప పాత్ర లు పోషించే అవకాశం రుద్రమదేవి, బాహుబలి చిత్రాల్లో లభించిందని పేర్కొంది. ఇలాంటి అవకాశాలు చాలా అరుదుగా వస్తాయని పేర్కొంది. పెళ్లనేది ఎప్పుడైనా చేసుకోవచ్చునని, మంచి చిత్రాల అవకాశాలు మళ్లీ మళ్లీ వస్తాయని చెప్పలేమని తెలిపింది. అందుకే పెళ్లి ఆలోచనను వాయిదా వేసుకున్నట్లు అనుష్క వివరించింది. -
నంబర్‌గేమ్స్ మీద నమ్మకం లేదు! : అనుష్క
తారాస్వరం నేను అన్నిటినీ పాజిటివ్‌గా తీసుకునే వ్యక్తిని. కష్టపడి పని చేస్తాను. ఓర్పుగా ఉంటాను. అన్నిటికంటే ముఖ్యంగా నన్ను నేను నమ్ముతాను! నా లైఫ్‌లో ముఖ్యమైన మలుపులు చాలా ఉన్నాయి. సినిమాల్లోకి రావడం పెద్ద మలుపే. అయితే అసలు యోగా టీచర్ కావడమన్నది అంతకంటే పెద్ద మలుపు. ఇంటినిండా డాక్టర్లు, ఇంజినీర్లే ఉంటే... నేను యోగా టీచరవుతానంటే ఎలా ఉంటుంది! అయినా ఒప్పించాను. అది ఇప్పటికీ ఓ మెమరబుల్ మూమెంట్! ఒక సినిమా హిట్ అవ్వగానే ఆ హీరోహీరోయిన్లది హిట్ కాంబినేషన్ అనేస్తారు. పొరపాటున ఫెయిలయ్యిందో... వాళ్ల కెమిస్ట్రీ వర్కవుట్ కాలేదని పెదవి విరుస్తారు. హిట్ సినిమాలో తప్పులున్నా ఎవరూ పట్టించుకోరు గానీ, ఫ్లాప్ సినిమాలో ప్రతి చిన్నదానిలోనూ తప్పులే కనబడుతుంటాయి అందరికీ! ‘రుద్రమదేవి’లో చేయడానికి ఒప్పుకున్న తరువాత ఇంటర్నెట్లో కాకతీయుల చరిత్ర చదువుదామని ప్రయత్నించాను. కానీ ఒక్కో వెబ్సైట్లో ఒక్కోలా రాసి ఉంది. దాంతో కన్ఫ్యూజై వదిలేశాను. గుణశేఖర్ ఎలా చెబితే అలా ఫాలో అవుతున్నాను. నా లైఫ్‌లో ఇదో బెస్ట్ పాత్ర అవుతుందని నా నమ్మకం! కలలో కూడా ఊహించని పాత్ర ‘బాహుబలి’ ద్వారా వెతుక్కుంటూ వచ్చింది. ప్రభాస్‌తో మూడోసారి చేస్తున్నాను. రాజమౌళిగారితో రెండోసారి పని చేస్తున్నాను. ‘ఆయన హీరోయిన్స్‌ని రిపీట్ చేయరు’ అంటుంటారు. బహుశా ఆ అదృష్టం నాకే దక్కినట్టుంది! నచ్చే పని చేసేటప్పుడు ఎంత కష్టమైనా భరించే శక్తి వస్తుంది. అందుకే కత్తియుద్ధాలు, గుర్రపుస్వారీలు చేయడం వంటి వాటిని చేయగలిగాను. వర్ణకోసం జోర్డాన్‌లో తొంభై రోజులు షూటింగ్ చేశాం. కనీస సౌకర్యాలు కూడా లేవు. బాత్రూమ్స్ కూడా సరిగ్గా లేవు. వేణ్నీళ్లు ఉండేవి కాదు. అయినా అవన్నీ తట్టుకుని షూటింగ్ చేశాం. నాకు నంబర్ గేమ్స్ మీద నమ్మకం లేదు. అందరూ అనడమే తప్ప నేనెప్పుడూ నంబర్‌వన్ పొజిషన్ గురించి ఆలోచించలేదు. మంచి పాత్రలు ఎంచుకుంటాను. డెరైక్టర్ చెప్పింది చేసుకుంటూ పోతాను. అంతకుమించి మరేమీ ఆలోచించను. డబ్బుల విషయంలో కూడా అంతే. రెమ్యునరేషన్ కోసం ఎప్పుడూ ఏ నిర్మాతనీ ఇబ్బంది పెట్టలేదు. నిర్మాతలు కూడా నన్ను చూసి డబ్బు పెట్టడం లేదు. అందరం కథకు లోబడి పని చేయాల్సిందే! హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు బాగానే వస్తున్నాయిప్పుడు. దీనికి శ్యామ్ప్రసాద్రెడ్డిగారికి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన హీరోయిన్ల మీద భారీగా ఖర్చుపెట్టి సినిమాలు తీసి, హిట్ చేసి చూపించారు. అందుకే మిగతా నిర్మాతలు కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు తీయడానికి ముందుకొస్తున్నారు. గుణశేఖర్ ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు! జీవితంలో గెలుపోటములు రెండూ ఉంటాయి, ఉండాలి కూడా. ఓడిపోయినప్పుడు కాస్త బాధ అనిపిస్తుంది. కానీ ఎక్కడ తప్పు చేశామా అని పరిశోధించి, వాటిని సరి చేసుకోవడం వల్ల పర్ఫెక్షన్ వస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... గెలిచినప్పుడు సంతోషపడటమే కాదు, ఓడిపోయినప్పుడు మనలోని లోపాన్ని కూడా ఒప్పుకోవాలి! అందం కోసం పనిగట్టుకుని వర్కవుట్లు చేయడం ఇష్టం ఉండదు నాకు. ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తాను. క్రమం తప్పకుండా యోగా చేస్తాను కాబట్టి వేరే ఏదీ చేయాల్సిన అవసరం లేదు! పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నారంతా. ఇప్పుడప్పుడే కాదు గానీ త్వరలోనే చేసుకుంటాను. పెళ్లి అనేది ప్లాన్ చేసి చేసుకునేది కాదు అని నా అభిప్రాయం. ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలా జరుగుతుంది. అయినా... రుద్రమదేవి, బాహుబలి లాంటి రెండు పెద్ద ప్రాజెక్టులు చేస్తున్నప్పుడు పెళ్లి గురించి ఆలోచించేంత సమయం ఎక్కడ దొరుకుతుంది! కత్తియుద్ధాలు, భారీ పాత్రలు చేసి చేసీ కాస్త బోరు కొట్టింది. కాకపోతే అలాంటి కథలు అరుదుగా వస్తాయి కాబట్టి చేస్తున్నాను. కానీ వరుసగా అలాంటివే చేయడం కాస్త ఇబ్బందే. అందుకే కొన్నాళ్ల వరకూ మళ్లీ అలాంటి పాత్రలు చేయకూడదని అనుకుంటున్నాను. లైట్‌గా, సింపుల్‌గా ఉండే రెగ్యులర్ పాత్రలే చేస్తానిక! పుట్టినరోజు: నవంబర్ 7 జన్మస్థలం: మంగుళూరు మాతృభాష: తుళు చదువు: బీసీఏ నచ్చే రంగులు: నలుపు, తెలుపు నచ్చే దుస్తులు: చీరలు నచ్చే ప్రదేశం: లండన్ నచ్చే కారు: స్విఫ్ట్ నచ్చిన పుస్తకాలు: ద అల్కెమిస్ట్, ట్యూజ్‌డేస్ విత్ మోరీ నచ్చే హీరోలు: హృతిక్ రోషన్, మహేశ్‌బాబు నచ్చే హీరోయిన్లు: కాజోల్, సౌందర్య -
మూడు కోట్లిచ్చినా నో.. నో...
హీరోలే కాదు... హీరోయిన్లు కూడా పారితోషికాల విషయంలో నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న రోజులివి. స్టార్ హీరోయిన్ అంటే... పారితోషికం కోటి రూపాయలకు పై మాటే. కథ, పాత్ర... ఈ రెండు అంశాల కంటే పారితోషికానికే ప్రస్తుతం కథానాయికలు పెద్ద పీట వేస్తున్నారు. ఎవరు ఎక్కువ పారితోషికం ఇస్తే వారి సినిమాలోనే నటించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అలాంటి ట్రెండ్‌లో కూడా ఓ భారీ ఆఫర్‌ని తృణప్రాయంగా వదిలేశారు అనుష్క. ఫిలింనగర్లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఇదే. ఓ భారీ సంస్థ నిర్మించనున్న ద్విభాషా చిత్రంలో అనుష్కను నటింపజేయాలని సదరు నిర్మాత అనుకున్నారు. ఈ సినిమాలో నటించినందుకు గాను అనుష్కకు మూడు కోట్ల రూపాయలు పారితోషికం ఇవ్వడానికి కూడా ఆయన వెనుకాడలేదనేది విశ్వసనీయ సమాచారం. కానీ అంతటి ఆఫర్‌నీ అనుష్క కాదనేశారట. అనుష్క నటించిన ‘వర్ణ’ చిత్రం ఇటీవలే విడుదలై ఘోర పరాజయాన్ని చవిచూసింది. అంతటి ఫ్లాప్ తర్వాత కూడా అనుష్కకు ఇసుమంతైనా క్రేజ్ తగ్గలేదని దీన్ని బట్టి అర్థమవుతోంది. ఒక వేళ ఈ ఆఫర్‌ని అనుష్క ఒప్పుకున్నట్లయితే... దక్షిణాదిన మూడు కోట్లు తీసుకున్న తొలి కథానాయికగా అవతరించేది అనుష్క. ప్రస్తుతం ఆమె రుద్రమదేవి, బాహుబలి చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. -
ఇకపై కత్తి పట్టను: అనుష్క
‘‘భవిష్యత్తులో కూడా చాలా గర్వంగా చెప్పుకునే సినిమా ‘వర్ణ. చాలా మంచి ప్రేమ కథ ఇది. వర్ణ, బాహుబలి, రుద్రమదేవి చిత్రాలు పూర్తయ్యాక హీరోలతో డ్యాన్సులు చేసే సినిమాలు చేయాలనుంది. ఇకపై కత్తిపట్టను’’ అని అనుష్క చెప్పారు. ఆర్య, అనుష్క జంటగా శ్రీ రాఘవ దర్శకత్వంలో పి.వి.పి. పతాకంపై ప్రసాద్ వి.పొట్లూరి నిర్మిస్తున్న ‘వర్ణ’ చిత్రం ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. రఘురామరాజు పాటల సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని శ్రీ రాఘవకు ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రసాద్ వి.పొట్లూరి మాట్లాడుతూ -‘‘రాబోయే రోజుల్లో హాలివుడ్ స్థాయి సినిమాలూ మనమూ తీయగలం. అందుకు ‘వర్ణ’ ఓ ప్రారంభం మాత్రమే. ఆర్య, అనుష్క, శ్రీ రాఘవ లేకపోతే ‘వర్ణ’ అనే రంగుల ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపించలేకపోయేవాళ్లం. రెండేళ్లు కష్టపడి దేశ విదేశాలు తిరిగి ఈ సినిమా చేశాం’’ అని తెలిపారు. శ్రీ రాఘవ మాట్లాడుతూ -‘‘‘అవతార్’ గొప్ప సినిమా అని మనం ప్రతిసారి మాట్లాడుకోనవసరం లేదు. ఇక్కడ కూడా రాజమౌళిలాంటి దర్శకులు ఎందరో ఉన్నారు. రాబోయే 10, 15 ఏళ్లలో ‘అవతార్’లాంటి సినిమాలు మనమూ తీయగలం’’ అని చెప్పారు. ‘కొలవరి డి’ ఫేమ్ అనిరుథ్ నేతృత్వంలో హాలీవుడ్లో ఫేమస్ రికార్డింగ్ స్టూడియో బుడాపెస్ట్‌లో రీరికార్డింగ్ జరుగుతోందని సంగీత దర్శకుడు హారిస్ జైరాజ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్య, భోగవల్లి ప్రసాద్, దానయ్య, సి.కల్యాణ్, ‘దిల్’రాజు, శరత్ మరార్, బండ్ల గణేష్, దశరథ్, వంశీ పైడిపల్లి, మారుతి, శ్రీకాంత్ అడ్డాల, గుణ్ణం గంగరాజు, చంద్రబోస్, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడారు. -
‘రుద్రమదేవి’లో గోన గన్నారెడ్డి గా?
గుణశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘రుద్రమదేవి’. మన దేశంలోనే తొలి హిస్టారికల్ స్టీరియో ఫోనిక్ త్రీడీ చిత్రంగా‘రుద్రమదేవి’ రూపొందుతోంది. టైటిల్ రోల్‌ని అనుష్క పోషిస్తున్నారు. ఇందులో కీలకపాత్రల్లో చాలా మంది హేమాహేమీలు నటిస్తున్నారు. తాజాగా ఫిలిమ్నగర్లో చక్కర్లు కొడుతున్న వార్త ఏంటంటే... ‘రుద్రమదేవి’లో మహేశ్‌బాబు గెస్ట్‌రోల్ చేయబోతున్నారట. ‘గోన గన్నారెడ్డి’గా ఆయన ఆ సినిమాలో నటించబోతున్నారట. కాకతీయ సామ్రాజ్య చరిత్రలో రుద్రమదేవికి ఎంత విశిష్ట స్థానం ఉందో, అంత ప్రత్యేకస్థానం గోనగన్నారెడ్డికి ఉంది. గోన గన్నారెడ్డి లేని కాకతీయ చరిత్రను ఊహించజాలం. ఒక రాబిన్‌హుడ్‌లాంటి యాక్షన్ ఓరియెంటెడ్ పాత్ర అది. ఈ పాత్రను ఎట్టి పరిస్థితుల్లోనూ మహేశ్‌తోనే చేయించాలని గుణశేఖర్ సంకల్పించారు. ఈ పాత్రపై మహేశ్‌క్కూడా అవగాహన ఉంది. ‘అర్జున్’ షూటింగ్ మధురమీనాక్షి సెట్లో జరుగుతున్నప్పుడు గుణశేఖర్ ఈ పాత్ర గురించి మహేశ్‌కి చెబితే ఉద్వేగానికి గురయ్యారట. ‘గోన గన్నారెడ్డి’గా మహేశ్ కోసం గుణశేఖర్ స్పెషల్ కాస్టూమ్స్ డిజైన్ చేయిస్తున్నారట. పూర్తి అధికారిక సమాచారం త్వరలోనే తెలుస్తుంది. ఇటీవలే అన్నపూర్ణ ఏడెకరాల్లో వేసిన భారీ సెట్లో ‘రుద్రమదేవి’కి సంబంధించి ఒక షెడ్యూలు పూర్తి చేశారు. అక్టోబర్ 1 నుంచి మరో షెడ్యూలు మొదలుకానుంది. -
రుద్రమగా బిజీ బిజీ...
కాకతీయ ప్రాభవాన్ని జగతికి చాటిన వీరనారి రాణీ రుద్రమదేవి చరిత్ర ఆధారంగా గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘రుద్రమదేవి’. టైటిల్ రోల్ అనుష్క పోషిస్తున్న విషయం తెలిసిందే. దేశంలోనే తొలి హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ త్రీడిగా రూపొందుతోన్న ఈ చిత్రం 40 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం మూడో షెడ్యూల్ జరుపుకుంటోన్న ఈ చిత్రం గురించి గుణశేఖర్ చెబుతూ -‘‘నాటి కాకతీయ చరిత్రకు దర్పణంలా ఈ చిత్రం ఉంటుంది. అలనాటి వైభవాన్ని కళ్లకు కట్టేలా తోట తరణి అద్భుతమైన సెట్లు నిర్మిస్తున్నారు. కాకతీయ సామ్రాజ్యం ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా ప్రాంతాల్లో విస్తరించి ఉండేది. అందుకే 13వ శతాబ్దం నాటి ఆయా ప్రాంతాల వాతావరణాన్ని ప్రతిబింబించేలా అన్నపూర్ణ ఏడెకరాల్లో తోట తరణి సెట్స్ వేస్తున్నారు. ఓ వైపు సెట్స్ నిర్మాణం జరుగుతుంటే, మరో వైపు ఈ నెల 2 నుంచి షూటింగ్‌ని కూడా కానిచ్చేస్తున్నాం. ఈ భారీ సెట్లో భాగ మైన కాకతీయ సామ్రాజ్యంలోని పాకనాడు(ఇప్పటి ప్రకాశం జిల్లా) సెట్లో రుద్రమదేవి అనుష్క, నిడవర్ధ్యప్రోలు (ఇప్పటి నిడదవోలు) యువరాజు చాళుక్య వీరభద్రుడు రానాలపై కీలక సన్నివేశాలు తీస్తాం. వీటితో పాటు అజయ్, రవిప్రకాష్, శివాజీరాజా, కాదంబరి కిరణ్, పాకనాడు గ్రామ ప్రజలుగా నటిస్తున్న వేలాది మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా సన్నివేశాలను చిత్రీకరిస్తాం. అలాగే... ఓరుగల్లు కోట నుంచి వెయ్యి స్థంభాల గుడి వరకూ అప్పట్లో ఓ సొరంగం ఉండేది. ఆ సెట్‌ని అబ్బురపరిచేలా వేశారు తోట తరణి. ఆ సెట్లో అనుష్క, నాగదేవుడిగా నటిస్తున్న బాబా సెహగల్‌పై కొన్ని సన్నివేశాలు తీస్తాం. ఈ భారీ సెట్లో మరో భాగం దివిసీమ ప్రాంతం సెట్. ఈ సెట్లో చిన్నారి రుద్రమగా నటిస్తున్న హీరో శ్రీకాంత్ కుమార్తె మేధ, శివదేవయ్యగా నటిస్తున్న ప్రకాష్‌రాజ్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తాం. ఈ నెల 17 దాకా ఈ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. మళ్లీ వచ్చే 1 నుంచి నాలుగవ షెడ్యూల్ మొదలవుతుంది. ఇప్పటివరకూ తీసిన పాటలు, సన్నివేశాలు అద్భుతం అనిపించేలా వచ్చాయి. భారత చలనచిత్ర చరిత్రలో ‘రుద్రమదేవి’ చిరస్థాయిగా నిలిచిపోయే సినిమా అవుతుంది’’అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్, సంగీతం: ఇళయరాజా, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, కెమెరా: అజయ్ విన్సెంట్, ఎడిటింగ్: శ్రీకరప్రసాద్, కాస్ట్యూమ్స్ డిజైనర్: నీతా లుల్లా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కె.రామ్‌గోపాల్.