ఇంకా వండర్స్ చేస్తాను!
►గుణశేఖర్ మొండివాడు... అంతకుమించి కార్యసాధకుడు. ఎప్పటికప్పుడు పెద్ద పెద్ద కలలు కంటూ ఉంటాడు...
► ఆ కలల్ని నిజం చేసుకోవడం కోసం అహోరాత్రులు శ్రమిస్తాడు... ప్రాణం పెట్టేస్తాడు. సినిమాపై ఉండే
► ఆ వ్యామోహమే అతన్ని ఇంత హైట్స్‌లో కూర్చోబెట్టింది. గుణశేఖర్ కొన్నేళ్ల నాటి కల ‘రుద్రమదేవి’...
► సెల్యులాయిడ్‌పై ఈ నెల 9న ఆవిష్కృతం కానుంది. ఈ సందర్భంగా గుణశేఖరుని వ్యూస్...
My రుద్రమదేవి
ఇక్కడ ‘మై’ అని ఎందుకంటున్నానంటే, రుద్రమదేవి జీవితం... ఆమె సాహసం... వ్యక్తిత్వం నన్నంతగా ప్రభావితం చేశాయి. రుద్రమదేవి కథ చదివినవాళ్లు కూడా అలాగే ఫీలవుతారు. ఎప్పుడో ఎనిమిదో తరగతిలో ఉపవాచకంగా చదివిన ‘రుద్రమదేవి’ ఆ క్షణం నుంచి నన్ను వెంటాడుతూనే ఉంది. ‘బ్రేవ్ హార్ట్’ అనే హాలీవుడ్ మూవీ చూసినప్పుడు మాత్రం ఇలా గ్రాండియర్‌గా ‘రుద్రమదేవి’ తీస్తే బావుంటుందనిపించింది. ‘ఒక్కడు’ తర్వాత నుంచే ఇందుకు సంబంధించి నా ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే హీరోయిన్ ఓరియెంటెడ్‌గా 25-30 కోట్ల రూపాయల బడ్జెట్ అంటే అందరూ భయపడ్డారు. గోన గన్నారెడ్డి వ్యూలో తీయమని చాలామంది సలహా ఇచ్చారు. నాకలా చేయడం ఇష్టం లేదు.
అప్పటి నుంచీ ‘రుద్రమదేవి’ చేయాలని అనుకుంటున్నా, కాలం కలిసిరాలేదు. చివరకు నేనే రంగంలోకి దిగా. ఈ విషయంలో నా కుటుంబం మొత్తం నాకు అండగా నిలబడ్డారు. అలాగే అనుష్క, బన్నీ, రానా, ప్రకాశ్‌రాజ్, నిత్యామీనన్, ఇళయరాజా... ఇలా ఈ టీమ్ మొత్తం నన్ను నమ్మారు. ఈ కథను నమ్మారు. అందుకే ఎన్ని కష్టాలు ఎదురైనా ఈ 9న మీ ముందుకు సినిమా తీసుకురాగలుగుతున్నా. ఇండియాలోనే ఫస్ట్ హిస్టారికల్ మూవీ ఇది. రుద్రమదేవి పుట్టుక నుంచి ఈ సినిమా మొదలవుతుంది. ఆమె విక్టరీస్‌లోని ప్రధాన ఘట్టం వరకూ ఈ సినిమా ఉంటుంది. 2 గంటల 38 నిమిషాల నిడివిలో ఆమె చరిత్ర అంతా చూపడం అసాధ్యం. అందుకే భవిష్యత్తులో ‘ప్రతాపరుద్రుడు’ కథతోనూ సినిమా చేస్తాను.
‘రుద్రమదేవి’ పాత్రకు అనుష్క ఎంపిక అనేది పబ్లిక్ ఛాయిస్. ‘అరుంధతి’తో పోలిక వస్తుందేమోనని నేను తటపటాయిస్తుంటే, అందరూ అనుష్కను మించిన ఆప్షన్ లేదని చెప్పారు. ‘రుద్రమదేవి’ చరిత్ర యథాతథంగా ఎక్కడాలేదు. ఒక టీమ్‌ను పెట్టి ఎంతో పరిశోధన చేసి ఈ స్క్రిప్ట్ రెడీ చేశా. అందరూ ఈ చిత్రాన్ని ‘బాహుబలి’తో కంపేర్ చేస్తున్నారు. అది జానపదం. ఇది చారిత్రకం. నా దగ్గర డబ్బులున్నా యని వేయి స్తంభాల గుడి బదులు, పదివేల స్తంభాల గుడి కట్టలేను కదా. ఏది ఏమైనా ఇదొక మహాయజ్ఞం. రేపు తెరపై చూస్తే మీరే అంగీకరిస్తారు.
My Motive
నమ్మిన లక్ష్యం కోసం
త్రికరణ శుద్ధిగా
పని చేసుకుంటూ వెళ్తే
విజయం
దానంతట అదే వరిస్తుంది.
My Dreams
ఈ రోజు కలలు
రేపు ఉండవు.
రేపటి కలలు
ఎల్లుండికి ఉండవు.
కానీ కొన్ని కలలు మాత్రం
పర్మినెంట్‌గా మనతోనే ట్రావెల్ చేస్తుంటాయి.
వాటిని నెరవేర్చుకోవడమే నా లక్ష్యం, లక్షణం.
‘రుద్రమదేవి’ లాంటి వండర్స్ ఇంకా చేస్తాను.
My Strength
ఇమాజినేషన్...
ఊహించగలగడం...
కలలు కనడం...
ఇవే నన్ను దర్శకునిగా ఇన్నేళ్లూ నిలబెట్టాయి.
ఇంకా నిలబెడతాయి కూడా.
ఇక పర్సనల్‌గా నా స్ట్రెంగ్త్ ఏంటంటే...
నా డెడికేషన్.
ఏదైనా అనుకుంటే
వేరే యావగేషన్స్ లేకుండా
అనుకున్నది సాధించగలను.
My Family
సక్సెస్ వస్తే... నేను మారను.
ఫెయిల్యూర్ వస్తే...
వాళ్లలో మార్పు ఉండదు.
దట్స్ మై ఫ్యామిలీ స్ట్రెంగ్త్.
My Favorite Movies
1. గాన్ విత్ ద విండ్
2. కాగజ్ కే పూల్
3. షోలే
4. శంకరాభరణం
5. ముత్యాల ముగ్గు
6. శివ.
My Top 5 Movies
1. రామాయణం: పిల్లలతో చిన్న డాన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడమే చాలా కష్టం. అలాంటిది - అంతా చిన్న పిల్లలతో సినిమా చేయడం అసాధ్యాలకే అసాధ్యం. మేం సాధించాం. నా లైఫ్‌లో ఓ మైల్ స్టోన్ అది.
2. ఒక్కడు: ఒక ఆఫ్ బీట్ స్టోరీని కమర్షియల్‌గా మెప్పించడమంటే రిస్కే. ఎంతటి బ్లాక్ బస్టరైనా కొన్ని వర్గాలకే పరిమితమవుతుంది. ఈ సినిమాతో అవన్నీ చెరిపేయగలిగాం.
3. సొగసు చూడతరమా: మన పక్కింట్లో జరిగే కథను కిటికీలోంచి చూస్తున్నంత సహజాతి సహజంగా తీశామీ సినిమా.
4. చూడాలని ఉంది: చిరంజీవితో రెగ్యులర్ ప్యాట్రన్‌లో వెళ్లకుండా తీసిన సినిమా. రైల్వేస్టేషన్‌లో చిరంజీవి-అంజలా జవేరీపై తీసిన 10 నిమిషాల లవ్‌ట్రాక్ ఒక్కటి చాలు... మేమెంత భిన్నంగా వెళ్లామో చెప్పడానికి.
5. అర్జున్: అక్కా తమ్ముళ్ల కథను ఇంతవరకూ ఈ యాంగిల్‌లో ఎవరూ ప్రెజెంట్ చేయలేదు.