గూగుల్ దేవి! | Google Devi! | Sakshi
Sakshi News home page

గూగుల్ దేవి!

Published Thu, Aug 20 2015 12:01 AM | Last Updated on Sun, Sep 3 2017 7:44 AM

గూగుల్ దేవి!

గూగుల్ దేవి!

రుద్రమదేవి లాంటి వీరవనితను ఈ ప్రపంచం ఎంతగా మర్చిపోయిందో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. గూగుల్ సెర్చ్‌లో రుద్రమదేవి బొమ్మల కోసం వెతికితే రుద్రమదేవి గెటప్‌లో ఉన్న అనుష్క బొమ్మలు రావడం ఆశ్చర్యకరం. మనమే కాదు... అనుష్క కూడా ఆశ్చర్యపోయారు. అయితే, ఆ పాత్ర పోషించడమే తన అదృష్టంగా కెరీర్‌లో బోల్డ్ స్టెప్ వేశారామె. మన తెలుగువారి చరిత్ర, మన సంస్కృతి పిల్లలకు తెలియాలనే ఆకాంక్షతో రెండేళ్లు ‘రుద్రమదేవి’ చిత్రంలో భాగమై, సినిమా పట్ల తనకున్న ప్యాషన్‌నీ, సమాజం పట్ల బాధ్యతనూ నిరూపించు కున్నారు అనుష్క. ‘సాక్షి’ మీడియాకి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో అనుష్క పంచుకున్న కబుర్లు...
 
 **     ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’, ‘సైజ్ జీరో’... అంటూ బిజీ బిజీగా సినిమాలు చేస్తూ, ఈ మధ్య మీరు ఎవరికీ అందుబాటులో ఉండడం లేదు..?
 అవునండి. నాక్కూడా ఆ ఫీలింగ్ ఉంది. కానీ, ఇవన్నీ సామాన్యమైన సినిమాలు కాదు. హిస్టారికల్ మూవీ (‘రుద్రమదేవి’), ఫోక్‌లోర్ ఫ్యాంటసీ (‘బాహుబలి’), లైటర్‌వీన్‌గా సాగే మెసేజ్ ఓరియంటెడ్ ఎంటర్‌టైనర్ (‘సైజ్ జీరో).. ఇలా వైవిధ్యమైన సినిమాలు చేయడం థ్రిల్‌గా ఉంది.
 **      ‘రుద్రమదేవి’ కథ విన్నప్పుడు ఏమనిపించింది?
 నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే... దర్శకుడు కథ చెబుతున్నప్పుడే నేను దాన్ని విజువలైజ్ చేసి, చూసుకుంటాను. ‘రుద్రమదేవి’ కథ వింటున్నప్పుడు ‘అరుంధతి’లా ఉంటుందేమో అనుకున్నాను. కానీ, మొత్తం ‘రుద్రమదేవి’ లైఫ్ విన్న తర్వాత ఆశ్చర్యపోయాను. ఇప్పుడంటే సమాజం ఎదిగింది. అన్యాయాలను ఎదిరించడానికి ఆడవాళ్లు తిరగబడుతున్నారు. కానీ, ఆ కాలంలో రుద్రమదేవి తనవాళ్ల కోసం, తన సామాజ్య్రం కోసం చేసిన పోరాటం చాలా గొప్పది. ఆ గొప్పతనం గురించి అందరికీ తెలియాలి. గుణశేఖర్‌గారి అమ్మాయి యుక్త స్కూల్ బుక్‌లో ఇప్పుడు రుద్రమదేవి చరిత్ర ఉందట. యుక్త ఆ విషయం చెప్పింది. ఒకవేళ నా స్కూల్ డేస్‌లో కనుక నేనీ పాఠం చదివి ఉంటే, ఇప్పుడీ సినిమా చేసినందుకు ఇంకా థ్రిల్లింగ్‌గా ఉండేది.
 **     కర్నాటక, మహారాష్ర్ట... ఇలా అన్ని బోర్డర్లను కాకతీయ సామ్రాజ్యం టచ్ చేస్తుంది కాబట్టి, ఇది ఒక ప్రాంతానికి చెందిన సినిమా అనలేం కదా?
 అవును. సౌత్ మొత్తం కాకతీయ సామ్రాజ్యం స్ప్రెడ్ అయ్యింది. అందుకే, ఇది ఒక ప్రాంతానికి చెందిన సినిమా అనలేం. తెలుగులో తీసినా, భాషకు అతీతంగా అందరూ చూసే సినిమా. మంచి ఎమోషనల్ స్టోరీ. ఈ కథను గుణశేఖర్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు.
 **      ‘రుద్రమదేవి’గా మీరు పూర్తిగా మౌల్డ్ కాగలిగారా?
 యాక్చువల్‌గా దర్శకుడు ఓ పాత్ర గురించి చెప్పగానే, ఆయన చెప్పినట్లుగా కాకుండా నాదైన శైలిలో చేయాలను కోను. దర్శకుడి ఊహల్లో ఉన్న పాత్రలా మారిపోవడానికి వంద శాతం కృషి చేస్తాను. ఎందుకంటే, తాను అనుకున్న కథను మా ద్వారా చూపిస్తున్నారు. అందుకే, ‘ఆర్ యు శాటిస్‌ఫైడ్’ అని డెరైక్టర్‌ని అడుగు తుంటాను. ‘ఎస్’ అంటే, నాకు చాలా సంతృప్తిగా ఉంటుంది. దర్శకుడు ఏం చెబితే దాన్నలా ‘కాపీ అండ్ పేస్ట్’ చేసినట్లు చేసేస్తాను (నవ్వుతూ...).
 **     రుద్రమదేవి ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు మాత్రం రుద్రమదేవి అంటే మీరే అన్నట్లుంది.
 తమాషా ఏంటంటే, ‘రుద్రమ దేవి’ సినిమా అనౌన్స్ చేసిన తర్వాత, ఆమె గురించి చాలా విషయాలు తెలుసుకోవాలని గూగుల్‌లో సెర్చ్ చేస్తే, నా ఫొటోలే వచ్చాయి. దాంతో నాకు భయం వేసింది.
 **     భయమా... ఎందుకు?
 చరిత్రలో నిలిచిపోయిన ఓ వీర వనిత ఫొటో స్థానంలో నా ఫొటో వస్తోందంటే భయం వేయకుండా ఉంటుందా? నన్ను నమ్మి 70, 80 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి గుణశేఖర్ ఈ సినిమా తీశారు. నా రియల్ లైఫ్ రుద్రమదేవి ఎవరంటే గుణశేఖర్‌గారి భార్య రాగిణి పేరు చెబుతా. ఈ ప్రాజెక్ట్‌కి ఆమె సహకారం చాలా ఉంది.
 **     రుద్రమదేవి పాత్ర నుంచి మీరేం నేర్చుకున్నారు?
 ఒక నార్మల్ ఉమన్‌కి ఏమేం ఎమోషన్స్ ఉంటాయో అవన్నీ ఉన్న మహిళ రుద్రమదేవి. ఆమె గురించి చదివిన తర్వాత, ఆ పాత్ర చేసిన తర్వాత నాకు తెలిసింది ఒకటే. ప్రతి మహిళకూ ఇన్నర్ స్ట్రెంగ్త్ ఉంటుంది. భర్త, పిల్లలకు ఎవరైనా హాని చేయాలనుకుంటున్నారనిపించినప్పుడు ఆ బలం బయటికొస్తుంది. కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఆ మహిళ వీర వనితలా మారిపోతుంది. పరిస్థితులు హద్దులు దాటుతున్నప్పుడు ఎదురీదాలి అనే విషయాన్ని నేర్చుకున్నాను.
 **     మరి.... మీరు రుద్రమదేవి అంత స్ట్రాంగా?
 శారీరకంగా, మానసికంగా ఎలా పోల్చినా నాకంత బలం లేదు. పైగా, రుద్రమదేవి అంత త్యాగశీలినీ కాదు. జీవితంపట్ల కొన్ని ఆశలు, ఆశయాలు ఉన్నాయి. వాటిని త్యాగం చేయలేను.
 **     రుద్రమదేవికి గెటప్‌కి సంబంధించిన మేకప్‌కి ఎక్కువ టైమ్ పట్టేదట. కష్టం అనిపించిందా?
 నా లుక్ ఎలా ఉండాలి? అనే విషయంపై చాలా రిసెర్చ్ చేశారు. అప్పట్లో ఎలాంటి బట్టలు వాడేవాళ్లు? ఎలాంటి మెటీరియల్ వాడేవాళ్లో తెలియదు. మరీ.. పాత లుక్‌లో చూపిస్తే, ఇది డాక్యుమెంటరీ మూవీ అయిపోతుంది. సినిమా అంటే కొంచెం రిచ్‌నెస్ కోరుకుంటారు కదా. అందుకే, కాస్ట్యూమ్స్ కొంచెం బ్రైట్‌గానే డిజైన్ చేశారు. ఆ కాస్ట్యూమ్స్, హెయిర్ స్టయిల్‌కి కావల్సినవి, నగలు.. ఇవన్నీ జాగ్రత్తగా పెట్టి, రోజూ లొకేషన్‌కి తెచ్చే నా హెయిర్ డ్రెస్సర్, మేకప్ నిపుణులకే ఎక్కువ క్రెడిట్ దక్కుతుంది. నా కష్టం కన్నా వాళ్లదే ఎక్కువ.
 **     మరి.. గుర్రపు స్వారీ సంగతేంటి?
 గుర్రాలు, ఏనుగులంటే నాకు భయం. ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ కోసమే గుర్రపు స్వారీ నేర్చుకున్నాను. ‘రుద్రమదేవి’లో ఏనుగు కూడా ఉంది. ఏనుగు వెళ్లినంతవరకూ బాగానే వెళుతుంది. కంట్రోల్ తప్పిందనుకోండి... మనం కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. కానీ, నేను వాడిన ఏనుగు నిజంగా దేవత. అది బాగా కో-ఆపరేట్ చేసింది.
 **     మీరు టైటిల్ రోల్ చేసిన ‘రుద్రమదేవి’లో అల్లు అర్జున్, రానా లాంటి హీరోలు నటించడం ఎలా ఉంది?
 ఇది మన చరిత్ర కాబట్టి, ఈ చిత్రంలో నటించాను. అంతే తప్ప నేను మెయిన్ అని చేయలేదు. రానా, బన్నీ (అల్లు అర్జున్) నేనిలాంటి సినిమాలో చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఇద్దరూ చాలా బిజీగా ఉన్నారు. ‘ఈవిడ టైటిల్ రోల్ చేస్తున్న సినిమాలో మనమెందుకు చేయాలి?’ అని వాళ్లు అనుకుంటే ఈ సినిమాలో నటించాల్సిన అవసరం లేదు. కానీ, నటించారు. మంచి పాత్రలు కావడం, మంచి సినిమాను ప్రోత్సహించాలనే సంకల్పం ఉండటం వల్లే చేశారు.
 **     రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు మిస్సవుతున్నట్లనిపించడం లేదా?
 చాలా మిస్సవుతున్నా. చెట్ల చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం నాకిష్టమే. అవి కూడా మంచి పాత్రలేగా. కాకపోతే, ‘రుద్రమదేవి’, ‘బాహు బలి’, ‘సైజ్ జీరో’ లాంటివి అరుదుగా వస్తాయి. వచ్చినప్పుడు చేసేయాలి.
 **     ‘రుద్రమదేవి’లో పాత కాలం భాష ఉంటుందా? లెంగ్తీ డైలాగులు ఉన్నాయా?
 మరీ పాతకాలంలానూ ఉండవు. మోడ్రన్‌గానూ ఉండవు. మధ్యస్థంగా ఉంటాయి. లెంగ్తీ డైలాగ్స్ చాలానే ఉన్నాయి. నా లక్ ఏంటంటే... నాకు మంచి మెమరీ పవర్ ఉంది. అందుకని ఈజీగా చెప్పేస్తాను. కాకపోతే, ఏ డైలాగ్ చెప్పినా దాని మీనింగ్ తెలుసుకునే చెబుతాను.
 **     ఇది మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ కాబట్టి, హీరోయిన్ ఓరియంటెడ్ రోల్స్ చేసినప్పుడు ఒకింత గర్వంగా ఉంటుందా?
 గర్వం ఏమీ లేదు. హీరోయిన్ ఓరియంటెడ్ రోల్స్ చేయడం మొదలు పెట్టాక హీరోల మీద గౌరవం పెరిగింది. వాళ్లు ఎంత కష్టపడుతున్నారో అర్థమైంది. డ్యాన్సులు బాగా చేయాలి... ఫైట్స్ బ్రహ్మాండంగా చేయాలి.. హీరోలు చాలా కష్టపడుతున్నారండీ. అందుకే వాళ్లకు హ్యాట్సాఫ్.
 **     గుణశేఖర్, రాజమౌళి... ఒకేసారి ఈ గ్రేట్ డెరైక్టర్స్ ఇద్దరితో సినిమాలు చేయడం గురించి?
 రాజమౌళిగారికి నా ప్లస్సులు, నా మైనస్సులు తెలుసు. ఆయనతో ఆల్రెడీ ‘విక్రమార్కుడు’ చేశాను. గుణశేఖర్‌గారితో ఇది మొదటి సినిమా. ఇద్దరికీ మధ్య ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే ‘ప్యాషన్’. చాలా ఎఫర్ట్ పెడతారు. మేకింగ్ విషయంలో అస్సలు రాజీ పడరు.
 **     ఈ మూడేళ్లుగా నటిగా చాలా చాలా కష్టపడుతున్నారు కదా. సినిమాలు మానేయాలని ఎప్పుడైనా అనిపించిందా?
 పగలంతా షూటింగ్ చేసి, సాయంత్రం ఇంటికొచ్చి రిలాక్స్ అయిపోతే కూల్ అయిపోతాను. కానీ, ఒక్కోసారి ఎక్కువ గంటలు పని చేస్తుంటాం. నైట్ షూట్స్ కూడా జరుగుతాయి. అప్పుడు మాత్రం ఇంటికి వచ్చాక, ‘ఇంకెందుకు? మానేద్దాం’ అని ప్రిపేర్ అయ్యి, నిద్రపోతాను. మర్నాడు నిద్ర లేవగానే, రాత్రి తీసుకున్న నిర్ణయం గుర్తు కూడా ఉండదు. హ్యాపీగా రెడీ అయిపోయి షూటింగ్‌కి వెళ్లిపోతా.
 **     ఖాళీ దొరికితే ఏం చేస్తారు?
 నేను హోమ్ బర్డ్‌ని. తక్కువ రోజులు ఖాళీ దొరికితే హైదరాబాద్‌లోనే ఉంటాను. నాకు కథలు వినడం ఇష్టం. రోజంతా వినమన్నా వింటాను. ఫ్రీ టైమ్‌లో ఎవరైనా దర్శకులు, రచయితలు కథ చెప్పడానికి వస్తామంటే, రమ్మంటాను. లేకపోతే బెంగళూరు వెళ్లిపోతా. నాకు ‘యోగా ఫ్రెండ్స్’ ఎక్కువమంది ఉన్నారు. వీలైతే వాళ్లల్లో కొంతమందినైనా కలుస్తాను.
 **     ఎలాంటి కథలు ఇష్టం?
 సిండరెల్లా పాత్ర అంటే చాలా ఇష్టం. ఆ క్యారెక్టర్‌తో మన భాషలో సినిమా చేస్తే బాగుంటుందనిపిస్తుంటుంది. ఈ ప్రపంచంలో రకరకాల క్యారెక్టర్లు ఉన్నాయి. అవన్నీ చేసేయాలనేంత పేరాశ నాకుంది. ఫ్రెంచ్, ఇరానియన్, కొరియన్ సినిమాలు చాలా బాగుంటాయి. అలాంటివి చేయాలని ఉంది. అవకాశం వస్తే, ఆ భాషల్లో సినిమాలు చేస్తా.
 **     దాదాపు పదేళ్లుగా సినిమాలు చేస్తున్నారు కదా... నటన గురించి పూర్తిగా తెలుసుకున్నట్లేనా?
 ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నానండీ. నేను నిత్య విద్యార్థినిని. యాక్టింగ్ గురించి చాలా తెలుసుకోవాల్సి ఉంది. ఏదైనా క్లాస్ లాంటిది ఏర్పాటు చేసి, ‘యాక్టింగ్ గురించి మాట్లాడండి’ అంటే, టెక్నికల్‌గా మాట్లాడలేను.
 **     ఈ మధ్యకాలంలో ఇతర కథానాయికలు చేసిన పాత్రల్లో మీకు బాగా నచ్చినవి.. మీరు వదులుకున్నవి ఏమైనా ఉన్నాయా?
 వదులుకున్నవి చాలా ఉన్నాయి. వాటిలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఒకటి. అందులో సీత పాత్రకు అడిగారు. నాక్కూడా నచ్చింది. కానీ, డేట్స్ ఖాళీ లేక చేయలేకపోయా. అప్పుడు చాలా బాధ అనిపించింది.
 **     హిందీలో కంగనా రనౌత్ చేసిన ‘క్వీన్’ లాంటి సినిమాలు చేస్తారా?
 ఈ మధ్య దీపికా పదుకొనె, కంగనా రనౌత్‌లు మంచి మంచి పాత్రలు చేస్తున్నారు. ‘క్వీన్’ విషయానికొస్తే.. అది సౌత్‌కి సూట్ కాదని నా ఫీలింగ్. చాలామంది ‘మీ డ్రీమ్ రోల్స్ ఏంటి?’ అని అడుగుతుంటారు. ‘అరుంధతి, వేదం, బాహుబలి, రుద్రమదేవి, సైజ్ జీరో’... ఇలాంటివన్నీ డ్రీమ్ రోల్సే.
 **     ఫైనల్‌గా... అసలు జీవితాన్ని ఎలా జీవించాలనుకుంటారు?
 జీవితం అద్భుతమైనది. నా లైఫ్ నాకెంతో ఇచ్చింది. దాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయాలనుకుంటాను. నాకు సినిమాలంటే చాలా ఇష్టం. షూటింగ్ అంటే పండగ. కో-స్టార్స్‌తో సరదాగా మాట్లాడుతూ, షూటింగ్ చేస్తుంటే చాలా ఎంజాయబుల్‌గా ఉంటుంది.
 
 **     ఇంతకీ కత్తి యుద్ధం చేసినప్పుడు ఎలా అనిపించింది? మీ ముంజేతికి గాయం కూడా అయ్యిందట?
 కత్తి తిప్పేటప్పుడు ముంజేయి బెణికినట్లు అయ్యింది. యాక్చ్యువల్‌గా ఆడవాళ్లకు అప్పర్ బాడీ బలహీనంగా ఉంటుంది. లోయర్ బాడీ బలంగా ఉంటుంది. అందుకని, అప్పర్ బాడీని ఓవర్‌గా స్ట్రెయిన్ చేయకూడదు. కత్తి తిప్పేటప్పుడు ఆ విషయం తెలిసింది. కానీ, ఆ సరికే ముంజేతికి ఏదో జరిగింది. బ్యాండేజ్ కట్టుకునేదాన్ని. అయినప్పటికీ చెయ్యి తిప్పుతున్నప్పుడు కలుక్... కలుక్‌మనేది.  మ్యానేజ్ చేసేశానుకోండి.
 **     యోగా చేస్తుంటారు కాబట్టి మీ బాడీ ఫ్లెక్సిబుల్‌గానే ఉండి ఉంటుంది. శారీరకంగా శ్రమపెట్టే కత్తి సాము, జంపింగ్ ఇలాంటివన్నీ సునాయాసంగా చేసేయలేరా?
 బాడీ ఫ్లెక్సిబుల్‌గానే ఉంటుంది. అది కాదనలేను. కానీ, అప్పటివరకూ అలవాటు లేనివి చేయాలంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. పైగా కత్తి పట్టుకునే ఒడుపు తెలియాలి. ముందు తెలియక ఎలా పడితే అలా తిప్పేదాన్ని. అలా తిప్పినప్పుడే ముంజేతికి ప్రాబ్లమ్ అయ్యింది.
 **     యోగా వల్ల శారీరకంగానే కాకుండా మీలో మానసికపరంగా వచ్చిన మార్పుల గురించి?
 జనరల్‌గా మనకు జరగకూడనిది ఏదైనా జరిగితే మనం వెంటనే ఎదుటివాళ్లను నిందిస్తాం. చిన్న విషయానికే టెన్షన్ పడిపోతుంటాం. కానీ, యోగా చేయడం వల్ల మనలో మంచి మార్పొస్తుంది. ప్రశాంతంగా ఉండడం అలవాటవుతుంది. ‘ఇన్నర్ స్ట్రెంగ్త్’ బెటర్ అవుతుంది. ‘సెల్ఫ్ ఎవేర్‌నెస్’ వస్తుంది. ఓవరాల్‌గా యోగా ఒక మంచి ‘ప్యాకేజ్’లాంటిది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement