తెరపై తెలుగువారి చరిత్ర
దాదాపు మూడేళ్ళుగా దర్శకుడు గుణశేఖర్ చేస్తున్న సినీ యజ్ఞం ఇప్పుడు పతాక ఘట్టానికి చేరుకుంది. దేశంలోనే ‘మొట్టమొదటి చారిత్రక స్టీరియోస్కోపిక్ 3డి చిత్రం’గా ఆయన రూపొందిస్తున్న ‘రుద్రమదేవి’ విడుదల తేదీ ఎట్టకేలకు ఖరారైంది. ‘‘రానున్న సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో భారీయెత్తున ‘రుద్రమదేవి’ని విడుదల చేస్తున్నాం’’ అని గుణశేఖర్ ప్రకటించారు. శుక్రవారం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన పత్రికా సమావేశంలో ‘రుద్రమదేవి’ పాత్రధారిణి అనుష్క, చిత్ర నిర్మాత - గుణశేఖర్ శ్రీమతి అయిన రాగిణీ గుణ కలసి విడుదల తేదీ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సహ నిర్మాతలైన గుణశేఖర్ కుమార్తెలు నీలిమ, యుక్తాముఖి సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పంచుకొన్న విశేషాలు... వారి మాటల్లోనే...
ఇది కల్పన కాదు... చరిత్ర!
- దర్శకుడు గుణశేఖర్
‘రుద్రమదేవి’ కల్పన, జానపదం కాదు. 850 ఏళ్ళ క్రితం తెలుగుగడ్డపై జరి గిన మన తెలుగువాళ్ళ కథ. ఎనిమిదో తరగతిలో నాన్‌డీటైల్డ్‌గా చదివిన పాఠం దీనికి స్ఫూర్తి. రచయితలు ముదిగొండ శివప్రసాద్, పరుచూరి బ్రదర్స్, తోట ప్రసాద్ తదితరులతో కలసి తొమ్మిదేళ్ళ పరిశోధన చేసి, కథ తయారుచేశాం. చరిత్రనెక్కడా వక్రీకరించలేదు. రేపు ఈ సినిమా ద్వారా మన దేశంలోని మిగతా భాషలవాళ్ళకీ తెలుగువారి చరిత్రను చూసి, తెలుసుకొనే అవకాశమొచ్చింది.
సెట్స్, గ్రాఫిక్స్ కోసం తీసిన సినిమా కాదు!
‘సెట్స్ కోసం, భారీ గ్రాఫిక్స్ కోసం గుణశేఖర్ సినిమాలు తీస్తాడు’ అంటూ అపోహ ఉంది. ‘రుద్రమదేవి’లో భారీ సెట్లు, గ్రాఫిక్సున్నాయి కానీ, వాటి కోసం తీసిన సినిమా కాదిది. హాలీవుడ్‌లో రకరకాల కోవల (జానర్ల) సినిమాలొస్తు న్నట్లే... తెలుగులో ‘గ్లాడియేటర్’, ‘బ్రేవ్‌హార్ట్’ లాంటివెందుకు చేయకూడదనిపిం చింది. కథను నమ్ముకొని ఈ సాహసం చేశా. కథ కోసమే సెట్లు, గ్రాఫిక్స్ వాడా.
జనం నుంచి వచ్చిన పేరు అనుష్క!
నటి అనుష్క లేకపోతే ఈ ‘రుద్రమదేవి’ లేదు. గుర్రపుస్వారీలు, కత్తి యుద్ధాలు నేర్చుకొని, ఎంతో శ్రమకోర్చి, ఆమె ఆ పాత్రకు ప్రాణం పోశారు. ఆ పాత్రలో వేరేవాళ్ళను నేనే కాదు, ప్రేక్షకులు కూడా ఊహించలేరు. ఈ ప్రాజెక్ట్ గురించి ప్రకటించినప్పుడు, టైటిల్ రోల్ ఎవరన్నది నేను చెప్పలేదు. అనుష్క పేరు ప్రకటించక ముందే, జనం నుంచి నాకు వచ్చిన సూచన - అనుష్క పేరే!
అల్లు అర్జున్ గంటసేపుంటాడు!
రాబిన్‌హుడ్ తరహాలోని బందిపోటు గోన గన్నారెడ్డి పాత్ర కథకు కీలకం. అతనెందుకు బందిపోటయ్యాడు, ఏమిటన్నది తెరపై చూస్తారు. ‘వరుడు’ చేస్తు న్నప్పుడే ‘రుద్రమదేవి’ కథ విని, స్ఫూర్తి పొందిన బన్నీ, ఎప్పుడు తీస్తారంటూ అడుగుతుండే వాడు. బన్నీ పని చేసింది 30 డేసే. ముందు మరో 30 రోజులు సన్నద్ధమయ్యాడు. సినిమాలో గంటసేపుంటాడు. రానా రొమాంటిగ్గా ఉంటాడు.
త్రీడీలో... సాహసం! లండన్‌లో భారీ రీరికార్డింగ్!!
మొత్తం 3డిలోనే, 3డి కెమేరాలతోనే తీశాం. హాలీవుడ్ నిపుణుల సాయం తీసుకున్నాం. త్రీడీ వల్ల బడ్జెట్ పెరిగింది. త్రీడీలో గ్రాఫిక్స్ సంక్లిష్టం కాబట్టి టైమ్ చాలా అయింది. హాలీవుడ్ ఫిల్మ్స్ చూసి నేను, పిల్లలు త్రీడీలోనే మన చరిత్ర చెప్పాలని ఉత్సాహపడ్డందుకు, సరదా తీరిపోయింది. నా ప్రతి సినిమా విజువల్ ఎఫెక్ట్స్ బేస్ ఉన్నదే. 2003లో ‘ఒక్కడు’కే చార్మినార్ సెట్ కొంత వేసి, మిగతాది గ్రాఫిక్స్ అని తెలియనట్లుగా చూపాం. ఈ సినిమాలో మంచి విజువల్సున్నాయి.
అంతా కీబోర్డ్‌లోనే ఇచ్చేస్తున్న ఈ రోజుల్లో ఇళయరాజా గారు లండన్‌లోని ఆర్కెస్ట్రాలో 125 మంది లైవ్ ఆర్కెస్ట్రాతో భారీగా రీరికార్డింగ్ చేశారు. తెలుగు సినిమా చరిత్రలో ఇలా ఎవరూ చేయలేదు. ఇలాంటివెన్నో విశేషాలున్నాయి.
స్వయంగా వచ్చి కలుసుకుంటా!
- హీరోయిన్ అనుష్క
ఈ సినిమా చేస్తుంటే, గుణశేఖర్ గారి పిల్లలిద్దరూ లొకేషన్‌లోనే ఉండి, ప్రాజెక్ట్‌కు అదనపు సపోర్ట్‌గా నిలిచారు. 13వ శతాబ్దం నాటి రిఫరెన్స్‌లు తక్కువ అయినప్పటికీ, పాత్ర లుక్‌ను డిస్ట్రబ్ చేయ కుండా, నీతా లుల్లా కాస్ట్యూమ్స్, అలంకరణ చేశారు. నిజానికి, ఈ సినిమా షూటింగ్ డేస్ తక్కువే. ప్రీ, పోస్ట్ ప్రొడక్షన్లకే ఎక్కువ టైమ్ పట్టింది. క్లిష్టమైన త్రీడీ చిత్రీకరణ కోసం గుణ గారు ప్రత్యేకంగా జర్మనీ వెళ్ళి నేర్చుకొని వచ్చారు. ఆయన అనుభవం, నైపుణ్యం వల్లే అతి తక్కువ టైమ్‌లోనే ఎక్కువ షూట్ చేశాం.
ఈ సినిమాకు వెన్నె ముక - ఇళయరాజా సంగీతం. రాజా గారికి నేను పెద్ద ఫ్యాన్‌ని. తొలిసారి ఈ చిత్రం కోసం పనిచేస్తున్న ప్పుడే ఆయన గొప్పదనం మరింత తెలిసింది. ఒక హిస్టారికల్ ఫిల్మ్‌కు సంగీతం ఇస్తున్నాననే వెలుగు ఆయన ముఖంలో చూశా. మూడేళ్ళుగా మేమందరం కలసి చేస్తున్న శ్రమ ఇప్పుడు ఫలించ నుంది. మా శ్రమ తాలూకు ఫలితం సెప్టెంబర్ 4న తెరపై ఆకట్టుకో నుంది. ప్రతిష్ఠాత్మకంగా చేసిన ఈ కృషికి తగిన ఫలాలను ప్రేక్షకులు మాకు అందిస్తారని నమ్ముతున్నా. ఎంతో వ్యయప్రయాసలతో మేము చేస్తున్న ఈ ప్రయత్నం కోసం సహనంతో నిరీక్షించి, మాకు మొదటి నుంచీ ప్రోత్సాహం అందిస్తున్నవారందరికీ కృతజ్ఞతలు. వివిధ భాషల్లో విడుదలవుతున్న ఈ చిత్రం కోసం పలు ప్రాంతా లకు స్వయంగా వచ్చి, అందరినీ కలుసుకోనున్నా.
పిల్లలకు చూపించాల్సిన మన కథ!
- చిత్ర నిర్మాత రాగిణీ గుణ
మన చరిత్రను మనమే మర్చిపోతున్నాం. ఈ పరిస్థితుల్లో మళ్ళీ మన చరిత్రనూ, గొప్పదనాన్నీ గుర్తు చేసే చిత్రం - ‘రుద్రమ దేవి’. ఏడో తరగతి చదువుతున్న మా చిన్నమ్మాయి టెక్స్ట్‌బుక్‌లో కూడా సరిగ్గా ఈ ఏడాది నుంచే ‘రుద్రమదేవి’ లెసన్ కూడా పెట్టారు. అందుకే, పిల్లల్ని తీసుకొని, కుటుంబమంతా కలసి వెళ్ళాల్సిన సినిమా.
రిలీజైన ‘రుద్రమదేవి’ యాప్
ఇది ఇలా ఉండగా, ‘రుద్రమదేవి’ వివరాలు, విశేషాలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పంచుకొనేందుకు వీలుగా ఆండ్రాయిడ్ యాప్‌ను కథానాయిక అనుష్క ఆవిష్కరించారు. త్వరలోనే ఐ.ఓ.ఎస్. ఎడిషన్ యాప్‌ను కూడా అందుబాటులోకి తేనున్నట్లు గుణశేఖర్ పెద్ద కుమార్తె - చిత్ర సహ నిర్మాతల్లో ఒకరూ అయిన నీలిమా గుణ తెలిపారు. ‘రుద్రమదేవి’ హిందీ వెర్షన్ మాత్రం తెలుగు వెర్షన్ తరువాత రిలీజ్ కానుంది.